Friday, August 29, 2008

అష్ట విధ బ్లాగికలు!

మన ప్రాచీన కావ్యములలోనూ, శాస్త్రీయ నృత్య రీతుల యందునూ నాయికలను అష్ట విధములుగా విభజించిన సంగతి రసఙ్ఞులయిన బ్లాగరులకు విదితమే.

1. ప్రోషిత భర్తృక 2. స్వాధీన పతిక 3. వాసవ సజ్జిక 4. ఖండిత 5. కలహాంతరిత 6. విరహోత్కంఠిత 7. విప్ర లబ్ధ 8. అభిసారిక

ఆ విధములుగా వారిని ఎన్ననగును.

****************************

మన బ్లాగ్లోకమున మహిళా మణుల ప్రాభవము ఎన్నదగినది అనిన, అయ్యది ఏ మాత్రమూ అత్యుక్తి కానేరదు. బ్లాగ్లోకమున నాయికలను ఈ విధములుగా వర్గీకరింపవచ్చును.

1. పోషిత బ్లాగిక 2. స్వాధీన 'గడి 'క 3. మూసవ సజ్జిక 4. కామెంటిత 5. గణకాంతరిత 6. తెవికోత్కంఠిత 7.నెనరు లబ్ధ 8. అభి 'చాటి ' క

ఆయా నాయికల వివరణములు ఈ క్రిందనొసంగ బడినవి.

1. పోషిత బ్లాగిక : బ్లాగ్లోకమున కొత్తగా బ్లాగులు వ్రాయగోరు వారిని ఈ నాయిక ప్రోత్సహించును. కొత్త బ్లాగరులకు అమూల్యమయిన సలహాలనందించుట, తెలుగు (యూనీ కోడు) నందు వ్రాయుటకు వలసిన వివిధ సాంకేతిక సహాయ సౌలభ్యములను సూచించుట ఈ నాయిక సంచారీ భావములు.

2. స్వాధీన 'గడి ' క : తన ఆసక్తిని అత్యుత్తమమైన టపాలను వెలువరించుటయే కాక, పొద్దు అను జాలపత్రిక యందు వచ్చు 'గడి ' ని కూర్చుట ఈ నాయిక ప్రముఖ వ్యాసంగము. గడి ని పూరించుటయే కాక, భావ సారూప్యము కలిగిన గడి ఔత్సాహికులకు తగిన సూచనలు, సలహాలనందించుట మున్నగునవి ఈ నాయిక విజయ వంతముగా నిర్వహించును.

3. మూసవ సజ్జిక : కేవలము టపాలను వ్రాయుటయందే ఆసక్తిని నిలుపుకొనక, కాలముతో వచ్చు మార్పులకు అనుగుణముగా, బ్లాగును వివిధ రకములయిన మూస లనుపయోగించి, దృశ్య రంజితముగా ఈ నాయిక తీర్చిదిద్దును. అంతర్జాలమున, బ్లాగులకు సంబంధించి జరిగెడి , అభివృద్ధిని ఈ నాయిక అత్యంత జాగరూకత తో పరిశీలించును.

4. కామెంటిత : ఈ నాయిక టపాలు వ్రాయుటయందే మాత్రమూ ఆసక్తి కనబర్చక, తోటి బ్లాగరులు వ్రాసిన వ్రాతలను చదివి, వారి టపాలపై, కామెంటును.

5. గణకాంతరిత : తను నిర్వహించు బ్లాగుయందు, సందర్శకుల సంఖ్యని లెక్కించుటకై, గణక యంత్రములను నిక్షిప్తము గావించి, బ్లాగుకు గల ప్రాచుర్యమును తులనాత్మకముగా పరిశీలించును. బ్లాగరులు వ్రాయు వివిధ రచనా వ్యాసంగములకు వచ్చు, వ్యాఖ్యలను గణించి, బ్లాగరు యొక్క రచనా పటిమను అంచనా వేయుట ఈ నాయిక అదనపు లక్షణము.

6. తెవికోత్కంఠిత : తెలుగు వికీపీడియా అనబడు తెలుగు విఙ్ఞాన భాండాగారమునకు తన వంతు సహాయ సహకారములనందించుట ఈ నాయిక లక్షణము. తెవికీ లో తన వూరి వివరములు జోడించుట, వివిధ వ్యాసములను ఆంధ్రీకరించుట, ఇతరులు వ్రాసిన వ్యాసములను సరిదిద్దుట ఈ నాయిక సంచారీ గుణములు.

7. నెనరు లబ్ధ : బ్లాగ్లోకమున వివిధ రకములయిన నూత్న కార్యక్రములను చేబట్టి, బ్లాగరుల చేత నెనరులు గడించుట ఈ నాయిక లక్షణము.

8. అభి 'చాటి ' క : కూడలి యందు బ్లాగరులకి ఒసంగబడిన ఉపకరణము, కూడలి చాట్ ను ఉపయోగించుకుని, రక రకములయిన చర్చా కార్యక్రములకు బ్లాగరులను ఆహ్వానించుటయందు ఈ నాయిక ఆసక్తి కనబర్చును. వారాంతమున తీరిక లేకుండుట సంచారీ గుణము.

***********************

పై విభజన, మరియూ ఆయా లక్షణములు, బ్లాగ్లోకమునకు సంబంధించి, కేవలము మహిళా బ్లాగరులకే గాక, పురుష బ్లాగరులకూ వర్తింపజేయవచ్చును.

ఈ టపా వెనుక, హాస్య స్ఫోరకత మినహా, ఒకరిని అవహేళన చేయుట, నొప్పించవలెనను ప్రయత్నము ఏ మాత్రమూ లేవని బ్లాగ్లోకము గమనించ వలె యని నా ప్రార్థన.

***********************

(70 వ దశకం చివర్లో వార పత్రికలు, మాస పత్రికలను చదివే మహిళా పాఠకులపై శ్రీ రమణ ఓ పేరడీ రాసారు. ఆయన విభజనలు ఇలా ఉన్నాయి.

1. పోషిత పత్రిక 2. స్వాధీన పఠిత 3. పుస్తక సజ్జిక 4. రీడిత 5. నవలాంతరిత 6. కథనోత్కంఠిత 7. చిత్ర లబ్ధ 8. అభిమానిక

ఈ టపాకు శ్రీ రమణ గారి పేరడీ స్ఫూర్తి, ఆధారం)

*************************

16 comments:

 1. Examples kooda isthey baavundedemo ravi garu !!! :P

  ReplyDelete
 2. చంపేసారు పొండి! నేను అర్జెంట్ గా
  నెంబరు 2 తగిలించుకోవాలా అయితే?

  ReplyDelete
 3. బావున్నాయి రవి.. కాని కొద్దిమందే ఉన్న మహిళా బ్లాగర్లలొ ఎవరెవరు ఏ కోవకు చెందుతారో రాసేయకూడదు. లేదా చదువరులను తమ బుర్రకు పదును పెట్టమని అడిగుంటే బాగుండేది.

  మరి నేను ఏ విధమైన నాయికనబ్బా???

  ReplyDelete
 4. మీ తెలుగు భాషా పరిజ్ఞానం తో మమ్మల్ని చంపేస్తున్నారు. చాలా బాగున్నాదండి...

  ReplyDelete
 5. అద్బుతంగ ఉంది. నవ్వు నవ్వుగా వ్రాశావు. (9) అబ్రక దబ్రిక మేజిక్ లాగా ఉంది.

  ReplyDelete
 6. fantastic!
  I suggest you change the spelling on "గణికాంతరిత" to "గణకాంతరిత".
  గణక యంత్రము కరక్టు. "గణిక" అంటే వేశ్య అని అర్ధము.

  ReplyDelete
 7. నేను ఏ వర్గంలోకి వస్తాను చెప్మా...?!

  ReplyDelete
 8. Nice classification and rendering.Giving examples for each category would have added much more fun.

  ReplyDelete
 9. వహ్వా! ఏమి పాండిత్యము :-)

  ReplyDelete
 10. బ్లాగా రాసారండీ..మిమ్మల్ని హీరోగా పెట్టి "మహా కవి బ్లాగయ్య" అని మూవీ తీద్దామనుకుంటున్నా త్వరలోనే.

  ReplyDelete
 11. అద్భుతంగా ఉంది.
  ఇంతకూ నేనెందులో ఉన్నానబ్బా?
  బొల్లోజు బాబా

  ReplyDelete
 12. బాబాగారు, ఈ వర్గీకరణలు నాయికలకండీ, అదే బ్లాగికలకి... బ్లాగకులకోసం నేనొక టపా రాస్తానుండండి :)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.