Saturday, April 28, 2012

అమృతత్వం నుంచీ అమృతత్వం లోకి...


కృష్ణ పారుతోంది.. గునగున నడిచే చిన్ని పాపాయి గజ్జెల సవ్వడిలా బుడిబుడి ధ్వానాలతో..
కృష్ణ పారుతోంది..శ్రీకృష్ణుని మురళీనాదంలా ప్రకృతిని మైమరపిస్తూ ..
కృష్ణ పారుతోంది..తనలోని ప్రాణశక్తిని ఘనీభవింపజేసి సస్యరాశులకందిస్తూ.,
కృష్ణ పారుతోంది..తనలోని స్వచ్ఛమైన ప్రేమను రంగరించి పచ్చని పంటచేల చీరను భూమితల్లికి చుట్టబెడుతూ..
కృష్ణ పారుతోంది.. జలబిందువుల ఇంద్రనీలాలరాశులను దొరలిస్తూ.. తుళ్ళుతూ..తనలోంచి తనలోకి..చల్లగా.. మెల్లగా .. అమ్మలా .. కమ్మగా.. నవ్వుతూ..

ఆ పక్కనున్న బ్రిడ్జి కావతల ఎవరో రాజు తన శత్రువుల నుండి తప్పుకుందుకు కాబోలు నది మధ్యలో గుట్టమీద ఇల్లు అనబడే కోట కట్టుకున్నాడు. ఆయన ఖాళీ చేసివెళ్ళిపోయినా, కృష్ణ తాలూకు నల్లని నలుపును గోడలమీద ప్రతిఫలింపజేస్తూ, ’టులెట్’ బోర్డు పెట్టినా ఎవరూ ముట్టుకోని దశలో ఆయన ఇల్లు అలాగే ఉంది.

బ్రిడ్జికి ఇటువైపు విశాలమైన స్నానఘట్టాలు, అందులో స్నానాదికాలు చేస్తున్న మనుషులు, దూరంగా చిన్నపిల్లల గుంపు నీళ్ళల్లో ఈదులాడుతూ తుళ్ళుతూ కేరింతలు.. ఒడ్డున విగ్రహాలు, చిన్న చిన్న అంగళ్ళూ, తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ, తనలోకి అడుగుపెట్టిన వారి మాలిన్యాన్ని కడిగేస్తూ, మనసును తేటపరుస్తూ గలగలలాడుతోంది.

నది - 

ధ్యానానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో! అందుచేతనే హెర్మన్ హెస్సే సిద్ధార్థుడు జీవిత చరమాంకంలో నదిలో పడవ నడుపుతూ, నదితో ఊసులాడుతూ, బౌద్ధిక జ్ఞానానికతీతమైన పూర్ణ(శూన్య)త్వాన్ని ఆవిష్కరించుకుంటాడు.

You cannot step in to the same river twice - అని హెరాక్లిటస్.
అవును.
నది బయటకు కనిపించే ఒక నిశ్చలత్వం.
అంతర్గతంగా ఒక అనిశ్చల ప్రవాహం.
మొత్తంగా నిశ్చలమూ, అనిశ్చలమూ రెంటికీ అతీతం.
అంటే నిశ్చలమూ, అనిశ్చలమూ రెండూ కానిది కూడానూ.

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే । తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||

నది ఒక పూర్ణత్వమూ, నది ఒక శూన్యత్వమూ కూడానూ.

ఆ పూర్ణత్వాన్నేనేమో వేద ఋషి ఇలా ఘోషిస్తాడు.

ఆపోవా ఇదగుం సర్వమ్ ,విశ్వాభూతాని ఆపః, ప్రాణావాపః, పశవ ఆపః, అన్నమాపః, అమృతమాపః, సమ్రాడాపః, విరాడాపః, ఛందాగుంసి ఆపః, భూర్భువస్సువరాప ఓమ్...

జగత్తులో సర్వమూ జలమే. ప్రాణము నీరే, పశువులు నీరే, అన్నమూ నీరే, అముతమూ నీరే, సార్వభౌముడు నీరే, బ్రహ్మస్వరూపమూ నీరే, ముల్లోకాల్లో సర్వమూ నీరే....

నది ఒక సౌందర్యం.

నది ప్రాణం, బీజమూ, మరణమూ, అమృతమూ, అమృతత్వమూనూ.

ఎవరో తమ అయినవాళ్ళ చితాభస్మాన్ని నిమజ్జనం చేస్తున్నారు. ఆ పక్కనే ఒడ్డున వారగా తామర పూల మొక్కలు, నీటిలో తేలుతూ ఉన్నై. ఆ మరణం తాలూకు చిహ్నమైన చితాభస్మం కృష్ణ ప్రవాహం ద్వారా చైతన్యం పుంజుకుని ఒక తామరపూవుకు జన్మనిస్తుందేమో!

అలాంటి ఒక అమ్మ ప్రాణం అనే జీవచైతన్యపు ప్రవాహం పంచభూతాలలో ఒకటైన నీటిలో (కృష్ణలో) నిమజ్జనమై ఆ తర్వాత కొన్నేళ్ళకు మరొక తమ్మిపూవంటి ’అమ్మలు’గా మా ఇంట్లో జన్మించింది!

సృష్టి అనంతం - కృష్ణ ప్రవాహం లాగే.

ఈ ప్రవాహం -

అమృతత్వం నుంచి అమృతత్వం లోకి...

Friday, April 20, 2012

షాడో ... షాడో ... షాడో...

- గుండెల మీద పదిటన్నుల బండరాయి పడ్డట్టు ఉక్కిరిబిక్కిరయ్యాడు
- విపరీతమైన ఆలోచనలతో కందిరీగల తుట్టెలా తయారయ్యింది షాడో అంతరంగం
- అంతటితో షాడో వెన్నంటి వచ్చిన అదృష్టదేవత ముఖం చాటు చేసింది.
- తాషామర్బా లాంటి కంఠం తో అరుస్తూ...
- ’గెట్ బేక్ ఎవ్రీబడీ’ - ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నలు వెయ్యలేదెవ్వరు..
- అప్రయత్నంగా చలిగాలి వీచినట్లు జలదరించింది.
- అత్యంతప్రమాదకరమైన సైడ్ కిక్ డెలివరీ చేశాడు.
- అబే దొంగనాయాళ్ళలారా, ఈ గంగారాం నే అడ్డుకుంటార్రా?
- ’తీర్చుకుంటాను ఫ్రెండ్. నిన్ను ఈ గతికి గురిచేసిన వాణ్ణి ఇంతకన్నా దారుణమైన మరణానికి గురిచేసి గాని విశ్రమించను’.
- నల్లటి పరదాలు కళ్ళముందు ప్రత్యక్షమవుతుండగా నేలపైకి జారిపోయాడు.
- బుగ్గల మీదకు కారింది వెచ్చటి కన్నీరు
- ముఖమంతా నవ్వులమయం చేసుకుంటూ..
- అసహ్యంగా చూస్తూ సిగరెట్టు వెలిగించాడు
- రాగయుక్తంగా అంటూ...

ఈ వాక్యాలు మీకు అర్థమయితే మీ మదిలో ఓ చిన్న చిరునవ్వు కదులుతూ ఉండాలి.

బాగా అలసిపోయి మీరు ఇంటికి వచ్చారు. కాస్త రిలాక్స్ అవుదామనుకుంటున్నారు. అప్పుడు యే తత్త్వవేత్త పుస్తకమో, మహాకావ్యమో, ఉత్తమ నవలో, హృదయాలు పిండేసే కథో మీ ముందు పెడితే ఆ పుస్తకమక్కడ పెట్టిన వాడిని ’ఫెడీ’ మని తందామనిపిస్తుంది. అలాంటి సమయంలో మాంఛి కాఫీ లాంటి పుస్తకమొకటి చేతిలో పడిందా, మీ తల్నొప్పి, గిల్నొప్పి చేత్తో తీసేసినట్టు మటుమాయం. అదుగో - అలాంటివే ఈ షాడో పుస్తకాలు.

1980 దశకం చివరా, 90 ప్రథమార్థం లో కాలేజీ చదువులు చదివిన వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఈ క్రింది సంఘటనలు ఏదో ఒకసారి, ఎలాగోలా అసలు రంగుతోనో, రంగుమార్చుకునో ఎదురయి ఉండకపోవు.

అమ్మా నాన్నా, షాడో బుక్కులు చదవనివ్వడం లేదు. ఈ బుక్కులు చదివితే చెడిపోతారనో, లేకపోతే అలవాటు పడి పరీక్షలకు చదివి ఛావరనో వాళ్ళ ’ఇది’. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అట్టాంటి ఒకానొక ఉపాయం పేరు కంబైన్డ్ స్టడీ. ఫ్రెండింట్లో మేడపైన మకాం. బాడుగ పుస్తకాల వాడి దగ్గర ఓ నాలుగైదు పుస్తకాలు అప్పటికే సహృదయుడొక్కడు తీసి ఉంచాడు. ఇక ఆ పూటంతా పండగే పండగ. కంబైన్డ్ స్టడీయే స్టడీ!!

మనకో థిక్కెస్టు ఫ్రెండు. అయితే వాడు మీ దగ్గర బాడుగ పుస్తకం తీసుకుని పోగొట్టాడు. అడిగితే దబాయిస్తున్నాడు. ఇవతల బాడుగ షాపు వాడు అరెస్టు వారంటు ఇష్యూ చేసి తిరుగుతూ ఉన్నాడు. చివరికి టెక్స్ట్ పుస్తకం పాత పుస్తకాల షాపులో అమ్మితే ఆ పీడ వదిలింది. అంతా అయిన తర్వాత ’ఫ్రెండు’ జాతీయం చేసిన పుస్తకాన్ని ఓపన్ గా తెచ్చి కళ్ళముందే చదువుతూ ఉన్నాడు!!!

ఇంగిలీసు పరీక్ష మరుసట్రోజే. అయితే మన టెన్షన్ అందుక్కాదు. సగం చదివిన షాడో పుస్తకం ఆ రోజు ఎలాగైనా పూర్తి చెయ్యాలి. ఎట్టకేలకు మన పని పూర్తి చేశాం. మరుసట్రోజు ఇంగిలీసు కోసం ’బూన్ టు ఇంటర్ ఇంగిలీసు’ లో తెలుగులో రాసిన ఎస్సేలు చదువుకెళ్ళాం. మనకొచ్చిన అతి భయంకరమైన ఇంగిలీసును పరీక్షలో ప్రదర్శించాం. ఆ ఉత్తమ ప్రదర్శనకు తగిన ఫలితమూ వస్తుందని తెలుసు. మనకు బాధే (సిగ్గే) లేదు. షాడో పుస్తకం చదివిన సంతోషం ముందు ఏదీ నిలవదు.

అమ్మ - షాడో పుస్తకం చదవనివ్వట్లేదు. ఒక చిన్న ఎత్తు వేశాం. రెండు భాగాలున్న మాంఛి నవలొకటి తీసుకొచ్చి బాడుగ షాపు వాడి దగ్గర నుండి తెచ్చి ఇంట్లో పెట్టాం. అమ్మ ఆ పుస్తకం తీరికున్నప్పుడు చదివి పూర్తి చేసింది. ఆ పుస్తకం తిరిగిచ్చేసి రెండో భాగం పట్టుకు రమ్మంది. ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది కాబట్టి ’అమా, నేనూ ఒక బుక్కు తెచ్చుకుంటా’  అనేసి ఆ పుస్తకం తో బాటు అఫిషియల్ గా మనక్కావలసిన పుస్తకం తెచ్చుకున్నాం.

’నువ్వు ఇలాంటి పుస్తకాలు కూడా చదువుతావా?’ - ఇంటికి వచ్చిన నాన్న గారి హైక్లాసు హైటెక్కు బంధువులెవరో అడిగారు. వాళ్ళ ఇళ్ళలో ఉత్తమాభిరుచి పేరు ’ఇంగ్లీషు అమర్ చిత్రకథ’. కసి రేగింది. మన ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ తెచ్చాం. హాశ్చర్యం! వాళ్ళ ఇళ్ళలోనూ ఇలాంటి సీన్లేనట. అసలు షాడో పుస్తకాలు చదివితే ఎన్ని దేశాల రాజధానుల పేర్లు తెలుస్తాయ్? అసలు సీ ఐ బీ (ఇది సీబీఐ కాదు. కాదని కుంచెం తెలిసినా వొప్పుకోకూడదని, రెండూ ఒకటే అని ఎప్పుడో డిసైడు అయిపోయినాం) ఎలా పని చేస్తోందో ఇంతకంటే బాగ ఎవరు చెప్తారు? అమర్ చిత్రకథల్లో చెప్పే రామాయణాలు, భారతాలు అప్పటికే ఎన్ని హరికథల్లో, పురాణ కాలక్షేపాల్లో విన్లేదు? ’చిచ్చీ ఈ పెద్దాళ్ళున్నారే’ అనే డయలాగ్ అప్పట్లో లేదు కానీ ఉంటే అదే అనుకొని ఉండేటోల్లం. ఎవరు అడ్డొచ్చినా షాడోని నీడలాగ అనుసరిస్తామని ఫ్రెండ్సు ప్రతిజ్ఞ చేసుకున్నాం!!!

ఇలా రకరకాల కథలు.

చదవడం లో మొదట చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, ఆ తర్వాత కొంచెం తక్కువ స్టాండర్డువైన బాలభారతి, బాలమిత్ర, బుజ్జాయి, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి లేదా ప్రభలో అక్కడక్కడా కొన్ని ఫీచర్సు (సినబ్బ కతలు, మిట్టురోడి కతలు, నండూరి విశ్వదర్శనం, టీ కప్పులో తుఫాను, కథాకళి, ఫిడేలు రాగాలు వగైరా), ఆ తర్వాత సీరియల్సు, ఆ తర్వాత యండమూరి, మల్లాది, చందు సోంబాబు, యర్రంశెట్టి సాయి వగైరా వగైరా....

ఈ తర్వాత లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చినాయన షాడో గారు. మిరపకాయల పొట్లం తాలూకు పేపర్లోనూ ఏదైనా ఇంటరెస్టింగా ఉందేమో అని చదివే రోజులు. అమ్మా నాన్నా యేమో ’హిందూ’ పేపర్ చదవరా, మంగళవారం నాపొద్దు అదేదో ’నో యువర్ ఇంగిలీసు’ అని వస్తుందంట, అని టార్చర్ పెడుతూంటే, హిందూ చదివితే ఇంగిలీసొస్తుంది కానీ న్యూసు తెలీదని, న్యూసు పేపర్ న్యూసు కోసముండాల గానీ, ఇంగిలీసు కోసం గాదని తిరుగుబాటు ప్రకటించేసిన రోజులు. అప్పుడు పరిచయమైన షాడో....

షాడో స్పై అడ్వెంచర్ అని షాడో స్పై థ్రిల్లర్ అని రెండు కేటగిరీలు. ఇందులో మొదటిదే చాలామందికి ఇష్టమని నా గెస్సింగు. మొదటి దాంట్లో గంగారాం, రెండవ కేటగిరీలో ముకేషు, శ్రీకరూ, బిందూ, కులకర్ణి గారు ముఖ్యమైన వాళ్ళు. మొదటి రకం పుస్తకాల్లో షాడో ఊర్లోకి ఎంటరవుతూనే సేట్ మంఘారాం ఇంట్లో దొంగతనం చేసి, దస్తావేజులు గాల్లోకి విరజిమ్ముతాడు. ఇదంతా చెప్పడు. కేరక్టర్ల ద్వారా చెప్పిస్తాడు. ఒక పోలీసాయన షాడో కోసం తిరుగుతా ఉంటాడు. ఒక దీనమైన పాత్ర షాడో కోసం ఎదురుచూస్తూ ఉంటది. ఇట్లా కథ సాగిపోతుంది.

రెండవరకంలోనైతే షాడో ఏదో దేశంలో అడుగుపెడతాడు. దిగగానే ఫైటు. అతణ్ణి కలుసుకోవాలనుకున్న సీక్రెట్ ఏజెంట్ చచ్చిపోతాడు. ఆ మధ్యలో అక్కడికెందుకొచ్చాడో చెప్పే మినీ ఫ్లాష్ బాకు. ఆ తర్వాత చివరి వరకూ ఉత్కంఠ! ఈ షాడో ఎక్కడికిపోయినా ఒకటే భాష ఎట్లా మాట్లాడుతాడని, అతనికి వయసు మీదపడదా అని, అతను చచ్చిపోడా అని డవుట్లు వస్తే వాడికి షాడో మార్కు వంద సైడ్ కిక్ లు ఫ్రీ.

షాడో ని చూసి ’బుల్లెట్’ అని ఒక రచయిత మొదలెట్టాడు. సేం కాన్సెప్టు. అయితే అంత క్లిక్ అయినట్లు లేదు.

అప్పట్లో ఈ షాడో పుస్తకాలు ఎందరికో జీవన భృతిగా మారాయ్. ఎంతో మంది విద్యార్థులకు పరీక్షలంటే ఏదో ప్రాణసమస్య అనే ఫీలింగు కలుగనీకుండా కాపాడినయ్. ఎందరో భర్తారావులకు భార్యలతో పోట్లాడే ఛాన్స్ యీకుండా టైమ్ సేవ్ చేసి రక్షించాయ్. నాలాంటి వాళ్ళకు ఎందరికో ’చదవడం’ ఏమిటో నేర్పించినయ్. నిజంగా షాడో వచ్చినా అలాంటి పనులు చెయ్యలేడేమో గానీ ఆ ’మధుబాబు’ అనే ఆయన చేశాడు.

చాలా రోజులు మధుబాబు గారంటే షాడో లాగా ఎదురైన విలన్లను సింహనాదం చేసి, రెండుకాళ్ళతో ఎదుటి వాని గుండెపై ’ఫెడీ’ మని తన్నగలిగే శక్తిమంతుడిలాగా, నూనూగు మీసాల యువకునిలా, కుంగ్ ఫూ లో నిష్ణాతునిలా, కంటికి కనిపించనంత వేగంగా కదిలే వ్యక్తిలా ఊహించుకున్నాం. ఆయన కనీసం ’కులకర్ణి’ లా కూడా ఉండరని స్వాతి వారపత్రికలో అప్పుడెప్పుడో ఫుటో వచ్చినప్పుడు తెలిసింది. కళ్ళద్దాలు పెట్టుకుని సాదాసీదాగా ఉన్నారాయన.

కావ్యాలని, విమర్శలని, ఉత్తమ కథలని, సాహిత్యమని,చర్చలని మరోటని, మనలో చిన్నపిల్లవానికి రంగులు కొట్టి భేషజంతో పులివేషకాలాడుతున్న రోజుల్లోకి వచ్చి పడినాం. ఇప్పుడు షాడో అంటే నవ్వులాట. ఈ నవ్వులాట వెనుక ఎంత స్వచ్ఛమైన నవ్వులుండేవో! ఆ నాటి మా ఊహల పూలతోటల తోటమాలి మధుబాబు గారికి కుంగ్ ఫూ స్టైల్లో ఒక నమస్కారం.

* షాడో పుస్తకాలు కినిగె లో లభ్యం.

Monday, April 2, 2012

సింగనమల - శ్రీరంగరాయలు

అనంతపురంజిల్లా కేంద్రమయిన అనంతపురం పట్టణం నుండి తాడిపత్రి పట్టణం వైపు వెల్లే త్రోవలో సింగనమల గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కన ఒక కొండ. అసలా కొండవల్లనే ఆ ఊరికా పేరు. అది "శృంగుని మల" - అంటే ఋష్యశృంగుడు తపస్సు చేసిన కొండ అట. ఇప్పుడది సింగనమల. ఆ ఊరిలో ఒక అందమైన చెఱువు కూడా ఉంది. ఆ చెఱువు పేరు - శ్రీరంగరాయల చెఱువు. ఆ శ్రీరంగరాయల గురించి తెలియాలంటే - ’చనిననాళుల తెలుగుకత్తులు సానబెట్టిన బండ మా పెనుగొండ కొండ’ గురించి, ఆరవీటి రామరాజు తర్వాత విజయనగర సామ్రాజ్యం గురించి తెలియాలి.

కృష్ణరాయల తర్వాత అచ్యుతరాయలు, ఆ తర్వాత సదాశివరాయలు, అతణ్ణి నామమాత్రంగా చేసి ఆర్వీటి రామరాజు (అళియ రామరాజు) వచ్చారని ఇదివరకు చెప్పుకున్నాము.

అళియరామరాజు రాజ్యానికి ఎలా వచ్చినప్పటికీ సమర్థుడు. ఆయనకే రామరాజభూషణుడనే కవి ’వసుచరిత్ర’ ను అంకితమిచ్చాడు. ఆ రాజు చేసిన ఏకైక తప్పిదం అదిల్షాను నమ్మి, ఆదరించడం. ఆ పొఱబాటు రాక్షస తంగడి అనే ఘోరయుద్ధానికి దారి తీసింది. ఆ యుద్ధంలో అటువైపు నిజాం షా (అహ్మదు నగరం), అతని అల్లుళ్ళు అదిల్షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా అయితే ఇటువైపు రామరాజు, అతని తమ్ముళ్ళు తిరుమల రాయలు, వెంకటపతి రాయలు. యుద్ధంలో తిరుమల రాయలు, వెంకటపతిరాయలు ముందంజలోనే ఉన్నారు. కానీ వృద్ధుడైన రామరాజు యేనుగు నుండి క్రిందపడి శత్రువులకు చిక్కి శత్రువుల కత్తికెర కావడంతో ఇటువైపు సైన్యాలు పారిపోజొచ్చినాయి. ఎలాగైతేనేం - చివరికి విజయం తురుష్కుల వైపుకు మొగ్గింది.

***********************************************************************************************************

రాక్షస తంగడి యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యప్రాభవం నశించిందని పాశ్చాత్యులు వ్రాశారు. ఇందులో అర్థం లేదని కొన్ని శాసనాల వల్ల, మరికొన్ని కావ్యాల వల్లా, ఇతర ఋజువుల వల్లా తెలుస్తుంది. (మల్లంపల్లి సోమశేఖరశర్మ గారూ ఈ మాట ధృవపరుస్తున్నారు) యుద్ధంలో ఓడిన తర్వాత రామరాజు తమ్ముడు తిరుమల రాయలు విజయనగర రాజుల చలువరాజధాని - ఘనగిరి అనబడే పెనుగొండకు వచ్చాడు. పాడుబడిన కోటలను, అగడ్తలను, బురుజులను దండనాయకుడు సవరము చెన్నప్పనాయకుడి సహాయంతో సరిచేసుకున్నాడు. అలా రాజ్యాన్ని తిరిగి స్థాపించినాడు. (తిరుమల రాయలు తిరుపతికి పారిపోయాడని హెరాసు వ్రాశాడుట. అది చరిత్ర వక్రీకరణ)

కం ||
ఆరామ శౌరి పిమ్మట
ధీరామరశాఖవీర తిరుమల రాయం
డారాసేతు హిమవ
త్మారామారమణుడై జగంబు భరించెన్ (౧-౫౪) - వసుచరిత్ర

ఇటువైపు విద్యానగరాన్ని ఆరునెలలు ఓవర్ డ్యూటీ చేసి కొల్లగొట్టిన నవాబులు తిరుమల రాయలను ఉపేక్షించలేదు. అతడు రాజ్యం తీసుకున్న కొన్ని రోజులకే క్షయనామసంవత్సరం (క్రీ.శ. 1566) పుష్యమాసంలో కేసర్ ఖాన్ అనే వాడిచేత దండయాత్ర జరిపించారు. ఆ యుద్ధంలో కేసర్ ఖాన్ ఓడిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. తర్వాత నూరు ఖాన్ అనే సైన్యాధికారి విభవ నామ సంవత్సరంలో తిరిగి దండయాత్ర చేశాడు. అతనికీ అదే గతి పట్టింది. ఆ తర్వాత అదిల్షా తనే స్వయంగా వచ్చాడు. అతడూ ఓడిపోయాడు. ఈ మూడు యుద్ధాల వెనుక తిరుమల రాయలకు అండగా నిలిచిన యోధుడు సవరము చెన్నప్పనాయకుడు. (ఈ విషయాలు పెనుగొండ ఉత్తరద్వారం దగ్గర ఆంజనేయస్వామి దేవళం దక్షిణ గోడపై చెక్కి ఉండేవట. నేడు శిథిలమైనట్టు కనబడుతూంది)

తిరుమల రాయడు రాక్షసతంగడి యుద్ధంలో ఒకకన్ను పోగొట్టుకున్నాడని ఒక చాటువు (అన్నాతి గూడిహరుడయి...) ద్వారా తెలుస్తూంది.

తురుష్కుల చతురంగబలాలు నిర్మూలించబడి, పెనుగొండ కొండలు ఎలా కనిపిస్తున్నాయని, నాటి భట్టుమూర్తి, నేటి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్ముల వారూ ఇలా చెబుతున్నారు.

భట్టు మూర్తి వారు:
తిరుమలరాయశేఖరుని ధీరచమూభటరాజి యాజి భీ
కర యవనేశ్వరప్రహిత ఖాన బలంబులఁ జక్కు సేయ ని
ద్ధరఁ బెనుగొండ కొండలు మదద్విపచర్మ కపాలమాలికా
పరికరభూషితంబులయి బల్విడిగాంచె గిరీశభావమున్.

(తిరుమల రాయని సైన్యాలు తురుష్కుల చతురంగబలాలను తుక్కు చేస్తే, శత్రుసైనికుల తాలూకు మదించిన యేనుగుల చర్మాలు, కపాలమాలికలతో పరివృతమయ్యి గుట్టలు గుట్టలుగా పేరుకొని పెనుగొండ కొండలయాయిట.)

అనంతకృష్ణ శర్మ గారు:

చనిననాళుల తెలుగుకత్తులు
సానబెట్టిన బండ మా పెనుగొండ కొండ.

రంధ్రముల ప్రహరించు శత్రుల
రక్తధారలు త్రావిత్రేచిన
ఆంధ్రకన్నడ రాజ్యలక్ష్ముల
కరతి నీలపుదండ మా పెనుగొండ కొండ.

వెఱపులెఱుగని బిరుదు నడకల
విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరడుగట్టిన
పచ్చినెత్తురుకండ మా పెనుగొండ కొండ.

తిరుమలేంద్రుని కీర్తి తేనెలు
బెరసిదించిన కాపుకవనపు
నిరడద్రాక్షారసంబులు
నిండి తొలికెడు కుండ మా పెనుగొండ కొండ.

చివర్లో తిరుమలేంద్రుని కీర్తి తేనెలు అంటే తిరుమల రాయలవి కావచ్చునని నా ఊహ. ఈ పాటను రాళ్ళపల్లి వారి స్వహస్తాలతో చూడాలనుకుంటే ఇక్కడ నొక్కండి.

***********************************************************************************************************

తిరుమల రాయలు ఎంతోకాలం రాజ్యం చేయలేదు. అతని తర్వాత అతని రెండవకొడుకు శ్రీరంగరాయలను పట్టాభిషిక్తుని చేసినాడు. మొదటి కొడుకు రఘునాథరాయలు యోగ్యుడు. అయితే అతని మీద సదాశివరాయలను చంపాడనే ఒక అభియోగం ఉంది. (సదాశివరాయలు ఎవరో క్రితం వ్యాసం నుండి తెలుసుకోవచ్చు). అందుచేత శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చాడు.

హరిపద భక్తశీలుడగు నా రఘునాథ నృపాలు కూర్మి సో
దరుడు సిరంగరాయవసుధావరు డాత్మగుణప్రమోదవ
త్తిరుమల రాయశేఖరవితీర్ణ మహాయువరాజపట్ట బం
ధురుడయి సర్వభూభవన ధూర్వహశక్తివహించునెంతయున్.

ఈ రంగరాయలు తండ్రికంటే శౌర్యం చూపించినాడు. ఈయన కాలంలో గోలకొండ నవాబులు రెండు సార్లు దండయాత్ర చేస్తే రెండు సార్లూ తిప్పికొట్టటమే కాక, కుతుబ్షా యేలుబడిలో ఉన్న కొండవీడు వినుకొండ దుర్గాలను సాధించినాడు.

"....శ్రీరంగరాయ శ్శ్రితభాగధేయః
ఉద్ధగిరౌస్థితః పరివిచిత్య చ దుర్జయాన్
దుర్గమకొండ వీడు వినుకొండ పురప్రముఖాన్
భూవలయకరత్న పెనుగొండపురే నివసన్
రాజతియః సమకరాది లాంఛనత" (ఎపిగ్రాఫికా కర్ణాటికా)

ఇదంతా గతించిన చరిత్ర కావచ్చు.  ఆ గోల్కొండ నవాబులను తిరుమల రాయలు, రంగరాయలు తిప్పికొట్టకపోయి ఉంటే? వాళ్ళ ప్రాభవం పెరిగి  ఆంధ్రదేశం, దక్షిణదేశమంతా తురుష్కుల యేలుబడిలోకి వచ్చి ఉంటే? వారి ప్రాభవం అప్పటితో మొదలై, నిజాముతో బలపడి ఉంటే? ఈ ప్రశ్నలకు సమాధానం చరిత్ర చెబుతుంది.

ఈ శ్రీరంగరాయలు శృంగునిమల దగ్గర పెనుగొండకోటకు ప్రత్యామ్నాయంగా మరో దుర్గాన్ని నిర్మించుకొన్నాడు. ఆతని దుర్గం ఉన్న కొండ ’మహల్ కొండ’ - నేటి మాలకొండ. కొంతదూరంలో తటాకము త్రవ్వించుకున్నాడు. అదే శ్రీరంగరాయల చెఱువు. ఈయన అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి విడిది చేసేవాడట. ఈయన ఇక్కడ విడిది చేసినప్పుడూ తురుష్కులు దాడి చేస్తే వారిని అప్పుడూ పారద్రోలాడట.

నాడు శ్రీరంగరాయలు తవ్వించిన చెఱువు నేడూ జనాల దాహార్తిని తీరుస్తోంది. పంటలకూ నీరందిస్తూ ఉంది. ఒకప్పటి ఆ ’జీర్ణకర్ణాట పునర్జీవసుండగు రమ్యగుణశాలి శ్రీరంగరాయ మౌళి’ - నేడు రంగరాయల చెఱువు తూముదగ్గర విరిగి, అరిగి, కరిగి పోయిన జీర్ణ శిథిలాలలో దాగి ఉన్నాడు. ఆయన అందించిన స్ఫూర్తి మాత్రం ఈ తెలుగునాటిసీమ కోలుపోదు.