Friday, November 28, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౨

సూడాను విమానం దాదాపు ఖాళీ గా ఉంది. ఉన్న కొద్ది మంది భారతీయులు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళవటం వల్ల, కీసర బాసర గా గోల చేస్తున్నారు. వాళ్ళు మలయాళీలని వేరే చెప్పాలా?

సూడాను విమానాశ్రయం కు వచ్చి పడ్డాము. సాయంత్రం 4:30 గంటలు దాదాపు.అక్కడ ఇమ్మిగ్రేషన్ కవుంటరు దగ్గర నిలబడి ఉన్నాము. ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఎవరు లేరక్కడ. ఓ అరగంట టెన్షన్ గా గడిచింది. ఆ తర్వాత నల్లగా పొడుగ్గా ఉన్న ఒకతను మా వద్దకు వచ్చి, మా పాస్ పోర్ట్లను దాదాపు గుంజుకున్నంత పని చేశాడు. గంగిరెద్దు మెడ లో గలగంటలా, అతని మెడ నుండీ వేల్లాడుతున్న ఐ డీ కార్డును ఎవరూ చూడలేదు, నేను తప్ప. అతణ్ణి మేము ఎవరని విచారించే లోపల, ఇప్పుడే వస్తానంటూ ఎటో మాయమయాడు!

మా వాళ్ళు టెన్షన్ తో సినిమాల్లో గుండె పోటు వచ్చే ముందు గుమ్మడిలా తయారయ్యారు. షమీరు అయితే, పోలీసు కంప్లయింట్ ఇద్దామని మొదలెట్టాడు. నేను తన మెడలో మా కంపనీ కార్డు చూట్టం వల్ల నాకు కాసేపు అర్థం అవలేదు, జనాలెందుకు టెన్షన్ గా ఉన్నారో.

సరే, ఎలాగయితేనేం, ఆ నల్లనయ్య తిరిగి వచ్చేడు. అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ వాళ్ళతో ఏదో చెప్పి, బయటకు తీస్కెళ్ళాడు. అక్కడ స్కానింగ్ మిషను నడపడానికి ఎవరు లేరు. ఆ మిషను తనే ఆన్ చేసుకుని, ఆ పని అయిందనిపించాడు. సూడాన్ లో అడుగుపెట్టాం.

ఆ వచ్చిన వాడు అజ్ గర్. (అజగరం అంటే పాము అని అర్థం ట). తను అక్కడ మాకు సంబంధించిన కంపనీ లో ఫెసిలిటీస్ మేనేజరు. సూడాన్ లో బయట సంస్థలు స్వయంగా వచ్చి వ్యాపారం చేయడానికి వీల్లేదు. అక్కడ కంపనీ తో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి.

ఇంకో విషయం. ప్రపంచం లో అత్యంత లంచగొండి దేశాల చిట్టాలో మొదటి పదిలో సూడాను ఒకటి (ఎప్పుడో చదివినది). అందులో మన దేశం లేకపోవడానికి, మన వాళ్ళు ఆ చిట్టా తయారు చేసిన సంస్థకు ఎంతో కొంత కట్టబెట్టి ఉంటారని నా ఊహ.

విమానాశ్రయం బయట మా కోసం "బోక్సు" ఎదురు చూస్తోంది. బోక్సు అంటే, కారు కు ఎక్కువ, మెటడోర్ కి తక్కువ. ఓ చిన్న కారుకు, లారీకు వెనుక సైడు లగేజ్ వేయడానికి ఉంచినట్టు, ఓపన్ గా తెరిచి ఉంచారు. కారులో ముగ్గురు మాత్రమే కూర్చోగలరు. మిగిలిన ఇద్దరు కారు వెనుక ట్రాలీలో బయట ప్రకృతి సౌందర్యాన్ని అస్వాదిస్తూ ఊరేగాలి. నేనూ, నితినూ ఆ ఇద్దరం. నాకు చాలా సంతోషమనిపించింది.ఎందుకంటే, ఎప్పుడో కాలేజీ రోజుల్లో వూరి బయట ఉన్న మా కాలేజీ నుండీ వూరికి రావడానికి ఒకట్రెండు సార్లు, బస్సు టాపు పైకి ఎక్కి వచ్చిన రోజులున్నాయి.ఇప్పుడు ఎంతో కాలం తర్వాత అలాంటి అవకాశం !

అన్నట్టు సూడాన్ లో బోక్సు అన్నది ఓ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు. మన ఆటో లాగా.

అజ్ గర్ మమ్మల్ని ఓ అపార్ట్ మెంట్ వద్దకు తీసుకెళ్ళి దింపి, పొద్దున వస్తానని వెళ్ళేడు.

మా ఫ్లాటు లో 2 పడక గదులు, ఓ హాలు, ఓ టాయిలెట్ కం బాత్ రూమ్. అంటే 5 మందికి కలిపి ఒక్కటి! బాత్ రూం లో కాస్త ఫ్రెష్ అవడానికి వెళుతూ, మా కొలీగు నాబ్ ను క్లాక్ వైస్ గా బలంగా తిప్పేడు. అంతే! అది విరిగి చేతికొచ్చింది. అక్కడ మొత్తం మీటలన్ని వ్యతిరేక దిశలో పని చేస్తాయి!! ఉన్న ఒక్క రెస్ట్ రూము, దాని మీట మొదటి రోజు విరగడం. శుభం!!!

మరుసటి రోజు ఉదయం ఆఫీసుకెళ్ళాం. మా పనిలో భాగంగా మేము మా సంస్థ తాలూకు ప్రాడక్టు ను నగరం లో కొన్ని నిర్ణీత ప్రదేశాల్లోనూ, కారులో తిరుగుతూ ఉన్నప్పుడూనూ (రోమింగ్) రకరకాల టెస్ట్ లు జరపాలి. కాబట్టి పొద్దున 10 గంటలకు కారులో బయటపడ్డాం. బయట ఇలా ఉంది.తుఫాను, గాలి వాన అనుకుంటున్నారా? తుఫానే, కానీ గాలివాన కాదు. అది ఇసుక (దుమ్ము) తుఫాను. ఆ ఫోటో లో కనిపిస్తున్నది దుమ్ము, ధూళి. ఎంత ధూళి అంటే, కూత వేటు దూరంలో ఉన్నవి మనకు కనిపించవు. (ఆ ఫోటోలో ఉన్నది మా కొలీగు). దాన్ని "హబూబ్" అంటారు ఇక్కడ.

(సశేషం)Tuesday, November 25, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౧

శ్రీయుతులు గొల్లపూడి మారుతీ రావు గారు కౌముది జాల పత్రికలో జనవరి నుండీ జూలై వరకు ఓ ట్రావెలాగు (టాంజానియా) రాసారు. అత్యద్భుతమైన ట్రావెలాగు అది. అందులో ఆయన టాంజానియా కు ట్రావెలాగు ఏమిటి ఏ అమెరికాకో వెళ్ళక? అన్న అనుమానానికి, ఓ చక్కటి సమాధానం చెబుతారు.

"సంపద ఎక్కడ చూసినా ఒక్కలాగే ఉంటుంది. ఎక్కువ సార్లు చూస్తే బోరుకొడుతుంది....నేలబారు జీవితం ఆకర్షిస్తుంది. ఆలోచింపచేసేట్లు చేస్తుంది.A master piece is monotonus,while life is not...."

బహుశా అందుకేనేమో అభివృద్ధి చెందిన దేశాలకు వెళితే (కొంతకాలం పాటు), మొదట కొన్ని రోజులు ఆ ఆకర్షణ లో మునిగినా, మనకు మన ఇల్లు, మన వూరు, మన జీవితాలు తిరిగి గుర్తుకొస్తాయి. మేధ గారు కొన్ని నెలల క్రితం కొరియా మీద వరుస టపాలు రాశారు. ప్రతి టపా చివర "జై భారత్" తప్పనిసరి.ఆమెది ఆ రకమైన నొస్టాల్జియానే నేమో?

అయితే, ఉన్నన్ని రోజులు (రెండు నెలలు దాదాపు) కాస్తో కూస్తో మన లాంటి మనుషులు, మన జీవిత విధానానికి దగ్గరగా ఉన్న జీవితంతో, Feel at home అన్నట్టు నాకు అనిపించిన (నేను చూసిన) దేశంసూడాను.

************************************

వెంకటేష్ సినిమా "నువ్వు నాకు నచ్చావు" లో చంద్రమోహన్, "మా వాడికి, అదేదో సాఫ్ట్ వేర్ నేర్పించి, అమెరికాకు కాకపోయినా, కనీసం పాకిస్తాన్ అయినా పంపించరా" అంటాడు, ప్రకాష్ రాజ్ తో.

ఒకప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం కూడా అదే. అయితే బుద్ధి propose చేస్తే, లెగ్గు Dispose చేసిందన్నట్టు, నా భీకరమైన లెగ్గు వల్ల వచ్చిన అవకాశాలు అన్ని ఏవో కారణాల వల్ల తప్పిపొయాయి. రోజులలా గడుస్తుండగా ఓ రోజు నేను పనిచేస్తున్న కంపనీకి ఓ సూడాను ప్రాజెక్ట్ వచ్చింది. ఆన్ సయిట్ కి 5 మంది వెళ్ళాలి. సూడాను కాబట్టి ఎవరు ఆసక్తి చూపకపోవడంతో, 12th మాన్ లా పడి ఉన్న నాకు అవకాశం వచ్చింది. సూడాను అయితేనేం, నా జీవితంలో మొట్టమొదటి విదేశయాత్ర!

అయితే, అనుకున్నంత వీజీగా గడవలేదు. ప్రయాణానికి అడుగడుక్కూ ఆటంకాలే. నన్ను తప్పించి, ఇంకో అమ్మాయికి ఆన్ సయిట్ చాన్స్ కట్టబెట్టాలని బాసురుడి ఊహ (ఎందుకో ఊహించుకోండి). అయితే, ఆ అమ్మాయి అదివరకే ఒకట్రెండు అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి ఉండటం వల్లా, పైగా నాకా అమ్మాయి మంచి మిత్రురాలవటం వల్ల, అవకాశం తిరస్కరించింది ఆవిడ.

ఆఫీసులో ఇలా ఉంటే, ఇంటి దగ్గర మా నాన్న నా జీవితం పైన కుట్ర పన్ని నాకు పెళ్ళి చేయాలని తీవ్ర ప్రయత్నాలు ఆరంభించాడు. (నాకు పెళ్ళి సుతరాము ఇష్టం లేదు. ఫిలాసఫీ తల నిండా దట్టించుకున్న వాణ్ణి కాబట్టి). ఓ బలహీనమైన క్షణంలో మా నాన్న మాటకు సరే అన్నాను. ఇక అమ్మాయిని చూసారు. (మాకు తెలిసిన అమ్మాయే). పెళ్ళి చూపులు (బలవంతపు బ్రాహ్మణార్థం) ఎపిసోడ్ అయిపోయింది. అప్పుడు సరిగ్గా ఈ ట్రావెలు.

ఒడిదుడుకులన్నీ అయిన తర్వాత, ఓ సాదా ముహూర్తంలో (శుభ ముహూర్తం అనడం లేదు. ఆఫ్రికాకు వెళ్ళటానికి ఏ తొక్కలో ముహూర్తమైతేనేం?) బెంగళూరు నుండీ కింగ్ ఫిషర్ విమానంలో ముంబై కి బయలుదేరాం. అక్కడ నుండీ ఖతర్ ఎయిర్ లైన్స్ (ఈ పేరు విన్నప్పుడు ఎందుకో ఎడమ కన్ను అదిరింది నాకు) లో మా ప్రయాణం, సూడాను రాజధాని ఖార్తూమ్ కు. మధ్యలో దోహాలో (ఖతర్ రాజధాని) విమానం మార్పు.

*************************************

కింగ్ ఫిషర్ విమానంలో చాలామంది క్వీన్ లు. మొట్టమొదట ఏరోప్లేన్ ఎక్కగానే, అదీ కింగ్ ఫిషర్ విమానం, ఓ కొత్త బంగారు లోకం లోకి వచ్చి పడ్డట్టు అనిపించింది. మా జట్టులో మొత్తం 5 మంది. ఆ ఐదుగురిలో నేనూ, మా ఆన్ సయిటు టీం లీడరు నితినూ మట్టి ముఖాలం., పల్లెటూరి సరుకు. నితిన్ నాకంటే ఓ ఆకు ఎక్కువ నమిలాడు. బీహారీ. మిగిలిన ముగ్గురు సివిలైజ్డ్.

విమానం ఎక్కగానే మమ్మల్ని ఆహ్వానిస్తూ ఓ అమ్మాయి, చిరునవ్వుతో విష్ చేసింది. "ప్లీజ్ వెల్ కం" అంటూ. మా వాడు బదులుగా, ముఖమంతా నవ్వులు పులుముకుంటూ, "గుడ్ మార్ణింగ్" అన్నాడు. అప్పుడు సమయం సరిగ్గా, రాత్రి 9:30 గంటలు.

అలాంటి మరికొన్ని సంఘటనల మధ్య ప్రయాణం ప్రారంభమై, బొంబాయి విమానాశ్రయం వచ్చి పడ్డాం.

అక్కడ నాకు ఓ హర్డిల్ ఎదురయింది. సూడాన్ వెళ్ళటానికి మాకు సూడానులో మా కంపనీ తరపు ఆఫీసు నుండీ, అక్కడ ఎంబసీ ఆమోద ముద్ర పొందిన ఓ ఆహ్వాన పత్రం మాత్రమే ఉన్నది. వీసా (స్టాంపు) లేదు మా దగ్గర. నేను నిలబడ్డ క్యూలో ఉన్న వీసా ఆఫీసరు నన్ను ఎగాదిగా చూసాడు. నా పాస్ పోర్ట్ పెళ్ళి శుభలేఖలా కొత్తగా నవనవలాడుతూ ఉంది. నేను వెళ్ళబోయేది సూడాను. వాడికి అనుమానం వచ్చి, ఓ పెద్ద ఇంటర్వ్యూ మొదలెట్టాడు. యెల్లో ఫీవర్ షాట్ చూపించమన్నాడు (ఆఫ్రికా దేశాలకు వెళ్ళాలంటే, యెల్లో ఫీవరు ఇంజక్షను తీసుకోవడం తప్పనిసరి, తీసుకున్నట్టు ఋజువు కూడా చూపించాలి.), ఇంకా కంపనీ పేరు, అక్కడ సూడానులో మా ఆఫీసెక్కడ, ఇలా... నాకు టెన్షను పెరిగిపోసాగింది. మా వాళ్ళందరు ఇమ్మిగ్రేషన్ దాటి నా కోసం చూస్తున్నారు. ఆ ఇమ్మిగ్రేషను వాడు పక్కకెళ్ళి ఇంకో ఆవిడను పిలుచుకొచ్చాడు. ఆవిడ, వాడు మరాఠీలో మాట్లాడుకున్నారు కాసేపు. ఎట్టకేలకు నన్ను ఆమోదించి, పంపించారు అవతలకు.

ఆన్ సయిట్ కు బలిపశువుల్లా మా ప్రయాణం మొదలయింది. అన్నట్టు ఖతర్ ఎయిర్ లైన్స్ లోగో - మేక.

*************************************

ఎట్టకేలకు విమానం బయలుదేరి, ఖతార్ రాజధాని దోహా లో వచ్చి ఆగింది. దోహా విమానాశ్రయం శుభ్రంగా, విశాలంగా ఉంది. విమానాశ్రయం లో కార్మికులు చాలామంది భారతీయులే. విమానాశ్రయంలో ఓ చోట ప్రపంచ పటం, ఎక్కడెక్కడి నుండీ విమానాలు నడుస్తున్నాయి తదితర వివరాలు సూచించబడ్డాయి.

అందులో భారద్దేశం కూడా ఉంది. అయితే భారద్దేశం లో కాశ్మీరులో కొంత భాగాన్ని మాత్రం (ఆ భాగాన్ని ఆ - ఆక్రమిత పేరుతో పిలవడం అంటే మనస్సు చివుక్కుమంటుంది) పాకిస్తానులో కలిపి చూపించారు!

అక్కడ విమానం మారి సూడాను రాజధానికి వెళ్ళే విమానం ఎక్కాము. మా ఆన్ సయిట్ యాత్ర మొదలయింది.

(యేడాది క్రితం బ్లాగ్లోకంలో నా మొట్టమొదటి టపా కూడా ఇదే మకుటంతో రాసాను. దానికి కొనసాగింపు ఇది.)

(సశేషం)

Monday, November 17, 2008

Appraisal - ఈ డిసెంబరు చలిగా ఉంటుంది.

కార్పోరేట్ కీకారణ్యంలో జనాభాకు యేటా జరిగే తద్దినం తంతు దగ్గర పడింది. బాసుర నక్కలు ఈ పాటికే వ్యూహాలు మొదలెట్టాయ్. ఎవరి నోటి దగ్గర కూడు లాక్కోవాలి? ఎవరికి ఏ సైజు లో పిండం పెట్టాలి. "అమెరికాలో ఎవడికో గజ్జి, దురద., కాబట్టి మన ఎకానమీ కృంగి పోయింది" అని ఏ కారణాలు చెప్పాలి? ఇలా...

ఇక్కడ బెంగళూరు లో దాదాపు ప్రతీ కంపనీలోనూ బాసుర వర్గం ఎక్కువగా తమిళ తంబీలే. ప్రతీ సంవత్సరం ఈ టైమ్ లో వాళ్ళు వాళ్ళ బుద్ధికి పదునుపెట్టి, అస్మదీయులకు ఏదో రకంగా పిండంలో ఎక్కువభాగం ఇచ్చేస్తుంటారు. ఆ అస్మదీయ కాకులూ ఏ మాత్రం సిగ్గు లేకుండా (పడకుండా) ఆ కూడును మింగేస్తుంటాయి. ఈ generalization తప్పే అయినా, నేను చూసిన, విన్న అనేక అనుభవాలు ఇవి. ఈ విషయంలో నాకు మన తెలుగు వాళ్ళే నచ్చుతారు. నాకు తెలుగు బాసు ఎప్పుడూ తగల్లేదనుకోండి, ఇన్నేళ్ళ నా సర్వీసులో.

క్రితం యేడాది నుంచి మా వీరముష్టి (కొరియను) కంపనీలో కొత్త దరిద్రం తీస్కొచ్చి పెట్టేరు. స్కూల్లో పిల్లలకు ఇచ్చినట్టు టీములో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేడు/రాంకు ఇస్తారంట. దీనిని forced evaluation system అని హెచ్ ఆర్ వారు నిర్వచించి, ఇది ఈ మధ్య ప్రతీ కంపనీ వాడు పాటిస్తున్న సరికొత్త పద్ధతి అని, క్రికెట్ లో Duckworth - lewis లాగ ఎవడో తెల్ల వాడు ఈ పద్ధతికి రూపకల్పన చేశాడనిన్నీ, ఈ రూలు మా కంపనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ సంస్థల్లోను (subsideries) పాటిస్తారనిన్నీ నమ్మబలికారు.

ఇది వాళ్ళు ప్రకటించిన కొన్ని రోజులకు నాకు మా CEO తో మాట్లాడే అవకాశం వచ్చింది.

మా కంపనీ CEO చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో "ప్రజల వద్దకు పాలన" టైపులో "Lunch with CEO" అనే వినూత్న పథకానికి రూపు దిద్దాడు. అయితే రెండేళ్ళ క్రితం, ఇలాంటిదేదయినా మొదలెడితే ఐదు చుక్కల పూటకూళ్ళ ఇంట్లో తేలే వాళ్ళం. ఖర్చులో కోత కారణంగా, ఇప్పుడు మాత్రం కంపనీలో ఉన్న ఓ మీటింగ్ రూమ్ లో కొన్ని పిజ్జాలు, బిరియానీ, పెరుగన్నం, ఓ హిమ క్రిమి తో ముగించారు. ఉన్న దరిద్రానికి తోడు, ఆ కార్యక్రమంలో నేను భాగం పంచుకునే రోజు సరిగ్గా ఆ lunch లో బిరియానీ పెడితే, అందులో బొద్దింక వచ్చింది. CEO ఆగ్రహోదగ్రులయారు. (వాడికి బొద్దింక వచ్చినా, పామొచ్చినా పెద్ద తేడా లేదు, కొరియా వాడు కాబట్టి. అయితే డ్రామాలాడి సీను రక్తి కట్టించాడు, మా మీద తెగ concern ఉన్నట్టు).

ఆ అవేశం నుండీ వాడు తేరుకోక ముందే, నేను వాణ్ణి అడిగాను, " ఇట్లా ఉద్యోగులకు, రాంకులు ఇవ్వడం కొరియాలో చెల్లుతుందేమో కానీ, ఇండియా లో చెల్లుబాటు కాదేమో" అని.

అదే నేను చేసిన తప్పు.

కొరియా గాళ్ళకు ఓ భయంకరమైన weakness. వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ కల్చరును విమర్శిస్తే ఏ మాత్రం తట్టుకోలేరు. (కేవలం సిద్ధాంతాల కోసం విడిపోయి, కొట్టుకు చస్తున్న దేశాలు, ఉత్తర, దక్షిణ కొరియాలు. ఇందులో ఉత్తర కొరియా ప్రపంచంలోనే అతి ప్రామాదకరమైన దేశం - నేషనల్ జియోగ్రఫీ వారి ఓ అంచనా ప్రకారం).

ఇక CEO గాడు, మౌలిక విలువలని, కన్ ఫ్యూషియస్ అని తెగ తిన్నాడు నాకు. (కన్ ఫ్యూషియస్ గురించి ఓశో ప్రవచనాల ద్వారా నాకు తెలుసు కొంతవరకు. నాకు తనపై పెద్ద అభిప్రాయం లేదు). చివరికి ఇదో అత్యుత్తమ పద్ధతి అంటూ తేల్చేడు.

నేను నచ్చజెప్పబొయేను, దీని వల్ల బాసురులకు వాళ్ళ అస్మదీయులను పైకి తెచ్చే ఓ అస్త్రం దొరుకుతుందని. వినలేదు వాడు.

గత యేడాది సరిగ్గా అలానే జరిగింది. మా టీములో తమిళ్ మాట్లాడే జనాభా మొత్తం పండుగ చేసుకున్నారు. (నాకు అరవం వచ్చినా,నాలో సీమ రక్తం ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆ కుట్రలో పాలు పంచుకోలేదు).

పాలిసీ పెట్టిన ప్రతి యేడాది హెచ్ ఆర్ వాళ్ళు చెప్పే కథ ఏమంటే, "ప్రతీ పాలసీ లోనూ లోపాలుంటాయ్. ఓ మంచి పాలిసీ ని దీక్షగా పాటించడమే దీనికి సమాధానం" అని.

ప్రతి పాలిసీ లో లోపాలుంటే, కంపనీ మొత్తం లేదా టీము మొత్తం ఉన్న డబ్బును సమాన నిష్పత్తిలో పంచుకుంటే చాలు కదా. ఇంత భాగోతం ఎందుకు? దీనికి సమాధానం కూడా హెచ్ ఆర్ వారు ఓ నవ్వుతో దాటేశారు. (ఆ నవ్వులో మూసుకుని కూర్చోవోయ్, నువ్వో పెద్ద పిస్తా గాడివి బయలుదేరావ్ అన్న సందేశం ఉండాలి).

గత యేడాది జీతం సరిగ్గా పెంచనందుకు వాళ్ళు చెప్పిన కథ, "డాలరు విలువ పడిపోయింది. ఓ డాలరు కు 38 రుపాయలు. మన వ్యాపారం దెబ్బ తింది అని."

ఈ సారి ఓ డాలరుకు 48 రుపాయలు, పైగా మా కంపనీ వ్యాపారంలో యేడాది మొదటి అర్థం గత యేడాదికన్నా 10 శాతం ఎక్కువ లాభాలు ఆర్జించింది. (అనేక కంపనీలు, ఆ మాటకొస్తే). అయితే, వాళ్ళు చెప్పెబోయే కట్టుకథ మాత్రం, "అమెరికా లో ఆర్థిక సంక్షోభం!" అని.

కాబట్టి మానసికంగా ప్రిపేర్ అవడం మంచిది.

అన్నట్టు appraisal ను తెలుగు లో ఏమంటారబ్బా??

Friday, November 14, 2008

సిద్ధాంతం - నమ్మకం

బ్లాగ్లోకంలో సున్నితమైన విషయాల గురించి చర్చలు రకరకాల రీతుల్లో కొనసాగుతున్నాయి. ఇంతకు మునుపు చివుకుల కృష్ణమోహన్ గారి బ్లాగులో మొదలయిన రామాయణ చర్చ అనేక రీతుల్లో సాగి, అంతకు మునుపు ఇదే విషయంపై సాగిన చర్చను వెలికి తీసింది, ఇంకా విభిన్న కోణాలను ఆవిష్కరించింది. అయితే, లోగడ ఓ సారి భైరవభట్ల గారు సూచించినట్లు, ఇలాంటి చర్చల వల్ల అపోహలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.ఆ అపోహలకు కారణం ఆయా వ్యక్తులకు ఆయ విషయాలపై మీద ఉన్న తీవ్రమైన నమ్మకం ఓ కారణం కాగా, రచయిత చెప్పిన విషయాలను, ఉద్దేశ్యాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం కన్నా ముందుగానే అభిప్రాయాలకు వచ్చేయడం ఇంకో కారణం అవుతోంది.

ఓ నమ్మకాన్ని తీవ్రంగా విశ్వసించడం వల్ల మన దృక్కోణం పాక్షికమవుతుంది. సరిగ్గా అక్కడే నమ్మకం సిద్ధాంతంగా మారడం జరుగుతుంది.

తిరిగి అడుసు తొక్కుతున్నానని అనుమానం ఉన్నా, ఇప్పుడు రాముడిపైనో, మత విశ్వాసాల మీదో బురద చల్లడం నా ఉద్దేశ్యం కాదు కాబట్టి, రాముడి సంగతి ప్రస్తావిస్తున్నాను ధైర్యం చేసి.

"రాముడు ఏకపత్నీ వ్రతుడు. శూర్పణఖ వలచినా లొంగలేదు...తన కు భార్య లేకుంటే యాగానికి అనర్హుడనైనప్పుడు బంగారు బొమ్మను పెట్టుకున్న ఆతండ్రి ఏకపత్నీ వ్రతమెక్కడ? ..."

ఓ వ్యక్తి ఔన్నత్యమో, గొప్పతనమో మనం ఊహించేప్పుడు, తన చర్యలను, వాటి వెనుక ఉద్దేశ్యాలను, ఆ తర్వాత ఉద్దేశ్యాల వెనుక సిద్ధాంతాలను మనం పరిగణిస్తాం అసంకల్పితంగానైనా.

"కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ద్వారా కర్తవ్య బోధ చేశాడు"

కృష్ణుడి చర్య - గీత బోధ (ఇక్కడితో ఆగితే మనకు కృష్ణుడి గొప్పతనం తెలియదు)
ఉద్దేశ్యం - కర్తవ్య విమూఢుడిగా ఉన్న అర్జునుడికి దిశానిర్దేశం చేయడం. (ఇక్కడ మనకు ఆయన గొప్పతనం తెలుస్తుంది).

ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం.

"రాముడు ఏకపత్నీ వ్రతుడు. శూర్పణఖ వలచినా...."

చర్య - ఏకపత్నీవ్రతం
ఉద్దేశ్యం - జాగ్రత్తగా ఆలోచిస్తే,

ఏకపత్నీవ్రతం - ఓ గొప్ప వ్రతం.
ఏకపత్నీ వ్రతం - తనకు జీవితానికి అనుకూలం

మొదటి విషయానికి వస్తే, ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతమా? అలా అయితే, స్వయంగా రాముడి తండ్రి దశరథుడు ఏకపత్నీ వ్రతుడెందుకు కాలేదు? ఇంకా కాస్త ముందుకెళితే, సుగ్రీవుడు ఏకపత్నీ వ్రతుడు కాడు. సీతను చెరపట్టక ముందు వరకు రావణుడు - గొప్ప శివభక్తుడు, ఆత్మ లింగాన్ని సాధించిన వాడు, గొప్ప వ్యాకరణవేత్త, జ్యోతిశ్శాస్త్ర పండితుడు, రాజనీతిఙ్ఞుడు. లంకా రాజ్యం సకల సౌభాగ్యాలతో తులతూగేది, కాస్తో కూస్తో అయోధ్యకంటే కూడా. ఆ రావణుడు బహుపత్నీకుడే. అంటే, అప్పటి సమాజ పరిస్థితుల దృష్ట్యా చూచినా బహుపత్నీ వ్రతం పెద్ద దోషం కాదు.ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతమూ కాదు. (ఇక్కడ ఓ చిన్న విషయం. ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతం కాదు అని నేను ఊహించినది దశరథుడు మొదలైన వారు పాటించలేదు కాబట్టి అన్న అంచనాతో వచ్చింది తప్ప, రామాయణ గ్రంథం ఆసాంతం చదివి కాదు. ఒకవేళ వాల్మీకి తగిన కారణాలు చెప్పి ఉంటే తప్పు నాదే.). ద్వాపర యుగానికి వస్తే, కృష్ణ పరమాత్ముడు బహుపత్నీకుడు.

పై కారణాల దృష్ట్యా చూస్తే, ఏకపత్నీ వ్రతం అన్నది, తనకోసం తన అనుకూలత కోసం తను విధించుకున్న నియమం అన్నది మాత్రమే కనిపిస్తుంది.అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే, ఏకపత్నీ వ్రతం అన్నది ఓ సిద్ధాంతం (ideal) తప్ప అంతర్గతంగా విలువను ఆపాదించుకున్న ఓ సత్యం అన్న చెప్పలేము. ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతం అయితే కృష్ణుడి గొప్పతనాన్ని శంకించాలి. రాముడి ఏకపత్నీవ్ర్తతం ఎంత గొప్ప నియమమో, కృష్ణ పరమాత్ముని ప్రేమతత్వం కూడా అంటే గొప్పది. అంటే - (ఓ మనిషి చర్యలో) గొప్ప తనం సిద్ధాంతంలో లేదు!

ఇక్కడ నా ఉద్దేశ్యం, రాముడనే పౌరాణిక పురుషుడిపై బురద చల్లటమో, లేదూ, తప్పుల తడక అభిప్రాయాలను అందరిపై రుద్ధటమో కాదు. కేవలం, ఓ సిద్ధాంతం ఎంత గొప్పగా కనపడినా అందులోని పాక్షికత ను ఉదహరించటమే. అలాగని ఏకపత్నీ వ్రతులందరూ చెడ్డ వారని చెప్పటం లేదు.

రాముడు, లేదా ఓ మహనీయుడి గురించి తెలుసుకోవాలంటే, వారి చర్యలు, వాటి వెనుక అంతర్యం లోని మౌలిక విలువల గురించి సూక్ష్మ పరిశీలన గావించి తెలుసుకోవాలి. లేదంటే, వారి వ్యక్తిత్వాలు మన దైనందిన జీవితాలకు ఉపయోగపడతాయో వాటిని గ్రహించాలి.

సందర్భం వచ్చింది కాబట్టి, నేను చేసిన వ్యాఖ్యలు, గురించి ప్రస్తావిస్తాను.

"కృష్ణుడు ఆత్మ నిర్దేశం ప్రకారం నడుచుకున్న వాడు కాబట్టి అవతార పురుషుడు" - ఈ నమ్మకం నాలో బలంగా నాటుకుపోవటం వల్ల, ఓ సారి నా వ్యాఖను నేను పునశ్చరించుకున్నప్పుడు ఇదో ideal - ప్రతిపాదన లాగానే కనిపించింది తప్ప, ఇందులో నేను కనుక్కున్నది, నిజం అన్నది ఏమీ లేదు. అలానే కృష్ణుడి ఇంకొకరు చెప్పిన statement లో కూడా ప్రతిపాదన కనిపించవచ్చు తప్ప, ఓ మౌలికత, అంతర్గత విలువ అన్నవి లేవు.

ఈ విషయం మనం సంయమనంతో, ఆత్మ పరిశీలనలో మనం తెలుసుకోగలిగితే, వివాదాలు వచ్చే అవకాశం తక్కువ. అప్పుడు ఓ గొప్ప విలువ, లేదా ఓ మహనీయుడి వ్యక్తిత్వం అన్నది మౌలికంగా మన నిత్యజీవితాలకు ఉపయోగపడుతుంది అన్న దృక్పథంలో ఆలోచిస్తామేమో!

Wednesday, November 12, 2008

సైటోపాఖ్యానం

"ఉష్ ష్..మాట్లాడకు"

"మెల్లగా వెనక్కి తిరిగి చూడు"

"ఇప్పుడు కూరగాయలు కొంటున్నట్టు నటిస్తూ, నాకు సైటు కొడతాడు చూడు"

ఏ సినిమా నో తెలిసుండాలి?

గీతాంజలి.

అప్పట్లో "యూత్" కేకలు పెట్టారు, సైట్ కొట్టటం, లేచిపోదాం ...ఇలాంటి డవిలాగులను విని. ఇంకా బాగా వెనక్కి వెళితే, మన నలుపు తెలుపు కళాఖండాల్లో, "ఇల్లరికం" లో నాగేశ్వర్రావు "నిలువవే వాలు కనుల దానా" అంటూ జమున వెనుక పడటం, అప్పట్లో యూత్ ను ఉర్రూతలూగించి ఉంటుంది. ఇంకా "అయ్యయ్యో బ్రహ్మయ్య",అంటూ ఏయెన్నారు, "గుంతలకిడి గుమ్మ" అంటూ స్టిఫ్ గా చేతులు పెట్టుకుని డాన్స్ చేస్తూ కృష్ణ గారు, 80 వ దశకంలో బెల్ బాటం తో శ్రీదేవి ని ఆటపట్టిస్తూ (పీడిస్తూ) ఎన్టీ వోడు, "బెక బెక బావురు కప్పా....కోకోనట్" అంటూ బాపు బొమ్మ వెంటపడ్డ, మెగా స్టారుడు (మంత్రి గారి వియ్యంకుడు), "కోక దాగుడు కోటమ్మో" అంటూ సినిమాల్లో ఆరంగేట్రం చేసిన మొదట్లోనే విజయ శాంతి వెనుకపడ్డ బాలయ్య, "చికుబుకు చికుబుకు రైలే" అంటూ వూగిపోయిన ప్రభుదేవా,మొన్నామధ్య దేశముదురు లో "నిన్నే నిన్నే" అంటూ గ్లామరు సన్యాసి పిల్ల వెంట పడ్డ ఓ దేహముదురు....లిస్టు పెద్దదే!

అమ్మాయిలకు సైట్ కొట్టటం, లైనెయ్యడం అన్నది చాలా చాలా పాత ఫార్ములా అయినా హిట్ ఫార్ములా. నిజానికి ఇది ఫార్ములా కాదు, అన్నం లో ఆవకాయలా సినిమాల్లోనూ, ఇంకా మన జీవితాల్లోనూ ఉన్న ఓ స్పయిసే. మనలో చాలా మంది కూడా కాలేజీ జీవితంలోనో, ఆ తర్వాతో ఎవరికో ఒకరికి, ఏదో రకంగా లైను వేసి ఉంటాం..అమ్మాయిలు వెంటపడే అబ్బాయిలను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొని ఉండటం కూడా మామూలే.

నా వరకూ వస్తే తెగ లైన్లు వేసి, వేసి బాగా స్కిల్స్ సాధించి, లైన్మెన్ స్టేటస్ నుండీ బయటపడే లోపు పెళ్ళయిపోయింది!

సరే, ఇంతకూ సంగతేంటో చెబుతాను. నేను సంస్కృతం చదువుకునే రోజుల్లో, రఘువంశం 6 వ సర్గ ఉండేది మాకు. సర్గ మొత్తం పూర్తిగా. ఆ సర్గ లో సన్నివేశం ఇది.

హీరో స్వయవరానికి వచ్చి ఉంటాడు. స్వయంవరం చేసుకోబోతున్నది, ఇందుమతి అన్న హీరోవిను. పైగా సంచారిణీ దీపశిఖ.ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వరించడానికి ఆశపడని రాజు ఉంటాడా? అయితే అది స్వయంవరమాయె. ప్రతి రాజు దగ్గరా ఆమె కాసేపు ఆగి, ఆ రాజు గుణగణాలు తన చెలికత్తె సునంద విశదీకరించిన తర్వాత, నిర్ణయం తీసుకుంటుంది. ఆ సమయం చాలా తక్కువ.ఆ కొద్ది సమయంలో ఆమెను ఎలాగైనా మెప్పించాలి. అందుకని కొంతమంది రాజులు, ఆమె తమవద్దకు రాగానే ఆమెకు సైటు కొట్టటం ప్రారంభించారు.

అందులో మొదటాయన.

కశ్చిత్కరాభ్యాముపగూఢనాళం
ఆలోల పత్రాభిహతద్విరేఫం
రజోభిరంతః పరివేశబంధి
లీలారవిందం భ్రమయాంచకార

తామర పూవు కాడ (నాళం)ను రెండు అరచేతుల మధ్య ఉంచుకుని (ఇరికించుకుని), రేకులు ఎగిరిపడుతుంటే, ఆ పువ్వు పై వాలిన తుమ్మెదలు చెదరి పడేట్టు, తామర తూడు చుట్టుకుని పోయేట్టుగా, రెండు చేతుల మధ్య విలాసంగా తిప్పుతున్నాట్ట.

ఇక రెండవ కాండిడేటు.

విస్రస్తమంసాదపరో విలాసీ
రత్నానువిద్ధాంగదకోటిలగ్నం
ప్రాలంబముత్కృశ్య యథాప్రదేశం
నినాయ సాచీకృతచారువక్త్రః

కాస్త ఫేసు టర్నింగ్ ఇచ్చుకుని, వదులుగా ఉన్న తన రత్నఖచితమైన భుజకీర్తులను భుజానికి అదుముకుంటూ, వక్షస్తలాన్ని సవరించుకుంటూ ఉన్నాడు (ట).

మూడవ పార్టీ.

ఆకుంచితాగ్రాంగుళినా తతోన్యః
కించిత్సమావర్జిత నేత్రశోభః
తిర్యగ్విసంసర్పినఖప్రభేణ
పాదేన హైమం విలిలేఖ పీఠం

కాస్త తలవంచుకుని, కాలి బొటన వేలిని కాస్త మడిచి, కాంతులీనుతున్న గోరుతో (నఖంతో)హేమ పీఠాన్ని రాస్తున్నాడట.

......
......
............

ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆమెను ఆకర్షించాలని ప్రయత్నించేరు. ఆమె ఆఖరుకు అజ మహారాజు (దశరథుడి తండ్రి) ను వరించింది.

ఈ శ్లోకాలు 10 వ తరగతి లో (తెలియని వయసులో) చదువుకోవడం వల్ల, పెద్దగా అర్థాలు కనబడలేదు.చాలా రోజుల తర్వాత ఈ పుస్తకం దొరికితే, అందులో చూసి, కాస్త గుర్తుకొచ్చింది బ్లాగడం జరిగింది.

ఇంకో విషయం. కాళిదాస కృతులకు భాష్యం రాసినాయన పేరు కోలాచలం మల్లినాథ సూరి. ఈయన పదహారు అణాల తెలుగు వాడు. ప్రతీ శ్లోకంలోని నిగూఢ భావాలకు ఈయన భాష్యం చెప్పాడు(ట). ఉదాహరణకు, పైన మూడవ పార్టీ విషయం తీసుకుంటే, బొటన వేలితో పీఠాన్ని గీరడం దరిద్రానికి చిహ్నమట. అందుకనే ఇందుమతీదేవి ఆ రాజును వరించలేదట!

ఈ విషయాలు ఎవరైనా సంస్కృతం బాగా తెలిసిన వాళ్ళు విడమర్చి బ్లాగితే చాలా బావుంటుంది.

(ఇది ఈ సర్గ పరిచయం మాత్రమే, పైగా నాకు సంస్కృతంలో మంచి అభినివేశం లేదు.కాబట్టి తప్పులు ఉంటే, సవరించగలరు)

***************************