Thursday, July 31, 2008

ఉద్యోగ భారతం - పూనా పర్వం

(గత టపా తరువాయి)

ఓ రోజు ఉదయం, పూనాలో చేతిలో లగేజీతో, పూనా, విమాన్ నగర్ లోని నా మిత్రుడి, అన్న గారి మిత్రుడి
రూములో దిగేను.పూనా విమాన నగర్,"నా మిత్రుడి అన్న గారి మిత్రుడి" రూము, నా లాంటి
అథితి,అభ్యాగతులతో (దండగమారి కేసులతో) కిటకిటలాడేది. నేను వెళ్ళిన సమయానికి అక్కడ మా వాడు
లేడు.వాళ్ళకు నన్ను నేను సైగలతో పరిచయం చేసుకున్నా (వాళ్ళకు హిందీ, ఇంగ్లీషు తప్ప వేరే భాషలు రావు, నాకు తెలుగు తప్ప వేరే యోగ్యత లేదు)


పూనాలో అడుగు పెట్టిన వేళా విశేషమో, లేదూ, పూనా లో మాకు ఆశ్రయమిచ్చిన వాళ్ళ ప్రార్థనలు ఫలించాయో
యేమో, సరిగ్గా 4 రోజులకో చిన్న ఉద్యోగం సంపాదించేము, నేనూ, నా మిత్రుడు ఇద్దరం ఓ ఫాక్టరీలో.పూనాకు
25 మైళ్ళ దూరంలో ఉన్న ఆళందీ అనబడే ఓ గ్రామంలో ఆ ఫాక్టరీ.నా మొదటి జీతం 955 రుపాయలు. 45
రుపాయలు, టీ కి కటింగు పోగా.


అంత వీజీగా ఉద్యోగమా అని డవుట్ వచ్చిందా? దానికి ఓ చిన్న మతలబు. మహారాష్ట్రలో, B.Tech అంటే,
ఆ అబ్బాయి IIT లో చదివాడు అని. మిగిలిన కాలేజుల్లో అంతా B.E డిగ్రీలు.నాది JNTU, B.Tech
డిగ్రీ. నా డిగ్రీ B.Tech అనగానే అక్కడ ఆ ఫాక్టరీ యజమాని ఆనందంతో మూర్చపోయి ఉద్యోగం ఇచ్చాడు. (ఆ కంపనీ తర్వాత మూతపడింది అని విన్నాను!)


ఆళంది గ్రామం గురించి కొన్ని విశేషాలు. ఇంద్రాణీ నది ఒడ్డున ఉన్నఈ గ్రామం గురించి దాదాపు మరాఠీ వారికి
అందరికీ తెలిసి ఉంటుంది. 13 వ శతాబ్దంలో మహారాష్ట్రలో ఙ్ఞానదేవుడనే గొప్ప మహానుభావుడు జన్మించాడట.
ఆయన చిన్న వయసులోనే ఙ్ఞానేశ్వరీ అని భగవద్గీత కు వ్యాఖ్యానం రాసేడు. ఈయన సమాధి, ఈ వూళ్ళో
ఉంది. ఈ ఊరి నిండా ధర్మ శాలలు.చిన్నప్పుడే, ఈ వూరికి వచ్చి మధుకరం (మధుకరం - తుమ్మెదలు
పువ్వు పువ్వునా వాలి తేనె సేకరించినట్టుగా అన్న అర్థం) చేసుకుంటూ అభంగాలు, ఙ్ఞానేశ్వరీ వల్లించే
విద్యార్థులు!


ఇంకా ఓ ఓపన్ ఎయిర్ థియేటర్/టెంట్ (స్వదేశ్ సినిమాలో లా)...ఇంద్రాణీ నదిపైని అందమైన
సాయంత్రాలు...ఊరి పక్కన పంట పొలాలు...ఆ పొలాల మధ్య, పిందెలతో విరగకాసి, తనలో తానే ముసి
ముసి నవ్వులు నవ్వుకుంటున్న పెద్ద మామిడి చెట్టూ...


నాకు వచ్చే 1000 రుపాయలలో, 175 గది కిరాయికీ, 350 మెస్సు ఖర్చులకూ, మిగిలిన 200
అదనపు ఖర్చులకూ పోగా, దాదాపు 200 రుపాయలు నెలకు మిగిలేవి. (20 శాతం!)
(ఇప్పుడు 10 యేళ్ళ తర్వాత, జీతం అప్పటి జీతానికి ఎన్నోరెట్లయినా పొదుపు మాత్రం శూన్యం! నిజం,
సోడెక్సో మీదొట్టు!)


సరే..ఈ ఊళ్ళో నాలుగు నెలలున్నాను.మధ్యలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాను. ఆ కంపనీ రెసెప్షనిస్ట్ ను
చూడగానే కళ్ళు చెదిరిపొయాయి. పైగా, ఆమె నవ్వుతూ పలకరించింది! ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడంతో
ఆ ఉద్యోగానికి మారేను. ఆ రెసెప్షనిస్ట్ ను మనసారా ప్రేమించసాగాను. ఆమె కూడా ఆమె
ఉద్యోగాన్ని మనసారా ప్రేమిస్తూ, వచ్చిన అందరితోనూ, నవ్వుతూ పలకరించడం చూసి, నా మనసు విరిగి
పోయింది. "ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది. అది త్యాగాన్ని కోరుతుంది" అని, నా మనసును సమాధాన
పర్చుకుని, ఆమెకు బదులుగా, నా అభిమాన నటి మమతా కులకర్ణి ని ప్రేమించసాగాను.

నా మిత్రుడు అంతకు ముందే, పూనాలో ఉన్నవాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళి ఇంకో ఉద్యోగంలో మారేడు.

పూనా అంటే, నా నిఘంటువులో అర్థం ’అందమైన అమ్మాయిలు’ అని.పూనాలో ఓ పది మంది అమ్మాయిలు
కనిపిస్తే, అందులో, కనీసం 8 మందిని తిరిగి మళ్ళీ చూడాలనిపిస్తుంది.సాయంత్రం ఉద్యోగాలనుండీ, కాలేజుల
నుండీ తిరిగి వస్తున్న వేళల్లో కూడా, యే మాత్రం అలసట కనిపించకుండా, కడిగిన ముత్యాల్లా కనిపించడం,
ఇక్కడి అమ్మాయిల ప్రత్యేకత.


నా రూం మేటు అక్కడ ఓ ప్రముఖ అమ్మాయిల కాలేజీలో లైబ్రేరియను. నాకు తీరిక ఉన్నప్పుడల్లా, వాడు
కాలేజీ లో ఉన్నప్పుడు నాకు వాడితో రూమ్ కీ ఇప్పించుకోవడం లాంటి ’అవసరం’ పడేది, వాళ్ళ కాలేజీకి వెళ్ళి
తనని కలిసే వాణ్ణి. (అక్కడ మగ వాళ్ళను లోపలకు అనుమతించరు, నా లా 'జెనుయిన్' కేసులకు ఎక్సెప్షన్!)


నా మిత్రుడి మావయ్య, Pune Film and Telivision institute of India లో మేకప్
విభాగానికి అధిపతి. ఆయన పూనా లోని ఓ మంచి సెంటర్ లో ఓ బ్యూటీ పార్లర్ తెరిచేడు. అంకుల్ బిజినెస్స్
ఒకటీ, మా బిజినెస్స్ ఒకటీనా? ఈ బ్యూటీ పార్లర్ ను కనిపెట్టుకుని ఉన్డే బాధ్యత మాది! (ఆ బ్యూటీ పార్లరు
మూతపడిందని వేరే చెప్పాలా? 6 నెలల్లో ఆ పని జరిగింది. అలానే, నా మిత్రుడూ వాళ్ళ మావయ్య ఇంటి
నుండీ వచ్చేసేడు.గెంటేశారా, లేదు లేదు తోశేసారు.అయితే, ఆయన తిరిగి మళ్ళీ ఆ బిజినెస్సు పునరుద్ధరించి, ఇప్పుడు పూనాలో చాలా ఫేమస్ అయాడు(ట) లెండి.
)

పూనా సిటీ బస్సుల్లో ఇంకో ఫెసిలిటీ. ఇక్కడ లాగా, అమ్మయిలకు ప్రత్యేకమైన సీట్లు ఉండవు. పక్కన ఉన్న
అమ్మాయి గురించి మేము తెలుగులో మాట్లాడుకుంటున్నా, వారికి అర్థమయేది కాదు!


నా ఉద్యోగం అలా సాగిపోతోంది. 3 నెలల తర్వాత మరో ఉద్యోగం మారేను.ఇది ఓ ప్రముఖ స్టీలు సంస్థ. ఆ
అనుభవం జీవితంలో బాగా ఉపకరించింది.


నేను పని చేసేది ఫాక్టరీలో. ఓ రోజు ఏదో పని మీద కంపనీ ఆఫీసుకు వెళ్ళాను. కొరెగావ్ పార్క్, అక్షర్ ధామ్
అన్నచోట. మంచి పాష్ లొకాలిటీ అది. అక్కడ చాలా మంది ఫారీనర్స్, ముదురు రంగు దుస్తుల్లో
తిరుగుతున్నారు. కొంచెం విచిత్రమైన వాతావరణం.ఆ అక్షర ధామ్ పక్కన రజనీష్ ధామ్ అని ఓషో ఆశ్రమం.
అప్పట్లో, ఓషో గురించి పెద్దగా తెలియదు నాకు. (ఇప్పుడు నేను తనకు పంఖాని)


అలా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో ’సాఫ్ట్ వేర్’ అన్న అవిశ్వాస తీర్మానం
ప్రవేశించింది!

(సశేషం)

Tuesday, July 29, 2008

ఉద్యోగ భారతం - కాలేజీ పర్వం

నేను కాలేజీ చదివే రోజుల్లో దుష్ట చతుష్టయం లాగా ’లెగ్గు చతుష్టయం ’ ఉండేది. అందులో ప్రముఖ లెగ్గు నాదే.
2 వ ప్రముఖుడు నా మిత్రుడు. ఇన్కా మిగిలిన ఇద్దరిదీ అంత భీభత్సమైన లెగ్గు కాకపోయినా, అప్పుడప్పుడూ
ప్రభావం కనిపించేది. నన్ను క్యాస్ట్ ఐరన్ లెగ్గు అని అనేవాళ్ళు మా సహాధ్యాయులు.


మాలో (ప్రముఖంగా నాలో) కనిపించని ఇంకొక ఏంగిల్ ఉండేది. అదేమంటే, నాతో పాటూ, ఎవరైనా కలిసి
చదివితే (కో-స్టడీ) ఆ చదివిన వాడు జెండా ఎత్తే వాడు, మా (నా) విషయం మాత్రం ఎలాగోలా గట్టెక్కేది.
3 వ సంవత్సరం 2 వ సెమిస్టరు చదువుతున్నప్పుడు జరిగిందిది.


మామూలుగా పరీక్షలు రాగానే, మా సహాధ్యాయులు అంతా మా మిత్ర వర్గాన్ని చుట్టుముట్టే వాళ్ళు, " మీరు
ఏయే చాప్టర్లు చదువుకున్నారు " అని అడగటానికి. ఎందుకంటే, మేము (లెగ్గు చతుష్టయం)
చదువుకున్నచాప్టర్లు వదిలేసి, మిగిలిన చాప్టర్లు చదువుకుంటారు(ట) వాళ్ళు. మా (లెగ్గు)మీద అంత
నమ్మకం మా సహాధ్యాయులకు. ఈ లెగ్గు విషయం ఏదో తేల్చుకోవాల్సిందే అని, నేనూ, నా మిత్రుడూ, ఓ కుట్ర
పన్నాము.3 వ సంవత్సరం ఇంజినీరింగు లో కామర్స్, ఎకనామిక్స్ కి సంబంధించి, ఆది శంకరుల వారి
మాయా వాదం లాంటి జటిలమైన ఓ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లో సరిగ్గా సగం నేను, మిగతా సగం నా
మిత్రుడూ పంచుకుని ఎక్సామ్స్ ప్రిపేర్ అయ్యాము.


అంటే, ఆ కామర్సు సబ్జెక్టు పరీక్షలో, వస్తే, నేను చదివిన చాప్టర్లలో ప్రశ్నలు రావాలి, లేదూ, మా వాడు
చదివిన చాప్టర్లలో చదివిన ప్రశ్నలు రావాలి. మేము చదవని చాప్టర్లలో ప్రశ్నలు పరీక్షలో రావడానికి అవకాశం
లేదు.ఈ రకంగా మా మీద పడ్డ ’లెగ్గు ’ మచ్చ ను తుడిపేసుకోవాలి అని మా ఊహ. మా సహాధ్యాయులకు
తెలియనే తెలిసింది, ఈ విషయం. ఏం జరుగుతుందో, ఏమోనని ఉత్కంఠ అందరిలోనూ.


ఆ పరీక్ష రానే వచ్చింది. మా సహాధ్యాయుల ముఖాల్లో ప్రేతకళ!

ఆ పరీక్ష ప్రశ్నాపత్రంలో, మొత్తం ప్రశ్నలన్నీ ’అవుట్ ఆఫ్ సిలబస్’! ఇంజినీరింగు సబ్జెక్ట్ అయితే, వికెట్లు
లేచిపోయి ఉండేవి. ఇది కామర్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ కదా, అందరు, వాళ్ళకు తోచిన సమాధానాలు
రాశారు. క్లాసు మొత్తం మీదకు బెస్ట్ మార్క్ 22/50. దాదాపు క్లాసులో అందరికీ స్టాంపులు ముద్రించారు
(18/50 - సరిగ్గా పాస్ మార్కు). ఆ బెస్ట్ మార్క్ నాకే.


ఆ దెబ్బకు నా పాదం మీద నాకు నమ్మకం బాగా బలపడింది. ఆ నమ్మకం నన్ను చాలా కాలం వేధించింది
కూడా.


ఇక కాలేజీ చదివేప్పుడు, మాకు ఫోర్ ట్రాన్ అనబడే కంప్యూటర్ భాష ఓ సబ్జెక్ట్. కాలేజీలో కంప్యూటర్ ల్యాబు లో
మాత్రం జనాలు ’సీ ’, ’బేసిక్ ’ లాంటి వాటి మీద బడి కుమ్మేసే వారు. అప్పుడప్పుడూ, నేనూ వెళ్ళే వాణ్ణి
అక్కడకు (నా బ్రాంచ్, మెకానికల్ అయినా కొన్ని ప్రత్యేక సమయాల్లో మాకు అనుమతి వుండేది ఆ లాబ్ లో
ప్రవేశించడానికి).


మొదట ఓ మిత్రుడు ఏదో చేస్తుంటే, చూడ్డం, వాడు పక్కకెళ్ళిన తర్వాత, భయపడుతూ, కీ బోర్డు కి దెబ్బ
తగులుతుందేమోనని అని భయపడుతూ నొక్కడం, ఇలా సాగింది. కొన్ని రోజుల తర్వాత ఓ మేధావి, బేసిక్ అనే
కమ్ప్యూటర్ భాషలో, యేదో ప్రోగ్రామ్ రాశాడు. ’ జనగణమణ ’ పాట వస్తుంది, ఆ ప్రోగ్రాం ఎక్సిక్యూట్ చేస్తే.,
అదీ కాస్త (కారక్టర్) గ్రాఫిక్స్ తో..ఆ ప్రోగ్రాం నాకు ప్రేరణ. ఆ అబ్బాయి పక్క కూర్చుని, తన పాస్ వర్డ్
సంగ్రహించి, తన ప్రోగ్రామ్ ను కాపీ చేసుకున్నాను. (మరి మామూలుగా చెప్పమంటే చెప్పడుగా!) ఆ ప్రేరణతో,
నేనూ, ఓ ప్రోగ్రామ్ రాసేను.


" క్రికెట్ పిచ్, ఇరువైపులా స్టంప్స్, బ్యాటు, బంతి ఇవతల పక్కనుందీ విసరబడ్డం, బ్యాటు కాస్త అటూ ఇటూ గా
ఆ బాల్ ను తాకడానికి ప్రయత్నిస్తుంది. ఒక వేళ బంతి, బ్యాటు ను తాకితే, బంతి వచ్చిన దారిన
పరిగెత్తుతుంది". ఇదీ నా మొదటి ప్రోగ్రామ్. బేసిక్ లో ఇది రాయడానికి దాదాపు రెండున్నర నెలలపైగా పట్టింది.
గ్రాఫిక్స్ లో ఇష్టం అలా అంతర్గతంగా ఉండిందేమో మరి, గ్రాఫిక్స్ లో ఓ రెండేళ్ళు పని చేయడానికి అవకాశం
దొరికింది.


ఇలా నా ఇంజినీరింగు చదువు ముగిసింది.

సరే, ఉద్యోగం పురుష లక్షణం కదా, యేదైనా ఉద్యోగం వెతుక్కోవాలి, లేదూ, ఇంకొక ఆప్షను, ఓ రెండేళ్ళు
ఉన్నత విద్య (M Tech) కి వెళితే, కాస్త ఆలోచించుకొనే అవకాశమూ దొరుకుతుంది, కాస్త స్టయిఫండ్ తో
పనీ నడుస్తుంది కదా అని ఆలోచించేను.


GATE పరీక్ష రాయడమూ, అందులో ఓ మోస్తరు స్కోర్ రావడమూ వెంట వెంటనే జరిగాయ్. అలాగే ఓ
REC లో సీట్ కూడా వచ్చేసింది. చేరేశాను.


ఇంత వీజీ గా ఎలా జరిగింది అంటారా? నాతో పాటు ఒక మిత్రుడు కో స్టడీ చేసి, తన ఙ్ఞానాన్ని నాకు పంచి,
తను మాత్రం అస్తమిస్తున్న సూర్యుడి దిశగా అలా సాగిపోయాడు.(ఇందాకే చెప్పాగా, నాతో కో స్టడీ చేస్తే
యేమవుతుందో?) అలా సాగి, రవి అస్తమించని సామ్రాజ్యం లో తేలాడు లెండి, ఓ రెండేళ్ళ తర్వాత.


చేరిన తర్వాత తెలిసింది, స్టయిఫండ్ రావడానికి కనీసం ఓ యేడాది పడుతుంది, పైగా నాకు దొరికిన
స్పెషలైజేషన్ లో కేవలం రీసెర్చ్ అవకాశాలు మాత్రమే వుంటాయి అని. యేడాది వరకు ఇంటి నుండీ డబ్బు
తెప్పించుకోవడం మా ఇంటి పరిస్థితుల కారణంగా కుదరని పని. అదే కారణం చేతే, ఇంజినీరింగు లో REC
సీట్ వచ్చినా చేరక, మా వూళ్ళోని ఇంజినీరింగు కాలేజీలో చదవడం జరిగింది.


ఆ కారణం చేత, ఆ MTech చదువుకు తిలోదకాలు ఇచ్చేను.

ఇంటి వద్ద మా నాన్న ఒకటే పోరు, మా బంధువుల వద్దకు వెళ్ళమని, నాకు ఉద్యోగం వాళ్ళే వేయిస్తారని.

అలా వెళితే, నా ’సీమ పౌరుషం ’ దెబ్బ తినదూ?

ఇంతలో కాలేజీలో నా లెగ్గు మిత్రుడు పూనాలో వాళ్ళన్నయ్య మిత్రుడి దగ్గరకు వెళ్ళి, ఉద్యోగం వెతుక్కునే
ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసింది.సరే, ఓ శుభ ముహూర్తం, నేనూ, పూనా కి మకాం మార్చేను, జేబు లో ఓ
2 వేల రూపాయలతో.


(సశేషం)

Monday, July 21, 2008

రాయల వారి కాలంలోనే రెకమెండేషన్లు!

అష్ట దిగ్గజాలు ఎవరు అన్న ప్రశ్నకు, ఓ తెలుగోడు, 7 గజాల పేర్లు గుర్తు తెచ్చుకుని, 8 వ గజం పేరు తెలియక 'ఆచార్య ఆత్రేయ ' అని చెప్పి, తన మాస్టారు చేతిలో దెబ్బలు తిన్నాట్ట.

అది చదవగానే నాకూ ఆ 8 గజాలు ఎవరు అని డవుటు వచ్చింది.

1. అల్లసాని పెద్దన
2. నంది తిమ్మన
3. భట్టు మూర్తి (రామరాజ భూషణుడు)
4. ధూర్జటి
5. తెనాలి రామకృష్ణుడు
6. మాదయ గారి మల్లన
7. అయ్యల రాజు రామభద్రుడు
8. పింగళి సూరన

(పర్లేదే, అన్నీ ఙ్ఞాపకం వచ్చాయి!)

అయితే వీళ్ళు కాక ఇంకో గజం ఉండేవాడట. ఆ గజం పేరు, "కందుకూరి రుద్ర కవి". ఈయన గురించి ఓ చిన్న కథ చదివాను ఈ మధ్య.

అప్పట్లో భువన విజయంలో ప్రవేశించాలంటే, తాతాచార్యుల వంటి మత గురువులో, తిమ్మరుసు వంటి మంత్రి సత్తములో సిఫారసుచేయందే రాయల వారి ప్రాపకం దొరకడం దుర్లభమట.

తెనాలి రామకృష్ణ సినిమాలో ఈ విషయాలను వెండి తెరపై అందంగా మలిచారు. తెనాలి రామకృష్ణుడు మొదట తాతాచార్యుల వారు, రాధా సాని అనే ఓ నాట్యకత్తె తో ఏకాంత సేవ లో ఉన్నప్పుడు, అయనను దర్శించుకోవాలనుకోవడం, సభా ప్రవేశం దొరక్కపోవడంతో, మద్దెల వాద్యకారుడుగా ప్రవేశించడం, రాధాసాని అభినయంలో తప్పు దొర్లడం, ఆమె మద్దెల వాయిద్య కారుని కసరడం, వెంటనే, తెనాలి రామ కృష్ణుడు, "ఆడలేని సాని కి మద్దెల ఓడేలే 'అంటూ తిప్పికొట్టటం, తాతాచార్యుల వరు అగ్రహోదగ్రులై తెనాలి రామకృష్ణుని బయటకు పంపడం.....ఇలా జరుగుతుంది.

ఇంకో కథ సినిమాలో చెప్పనిది ఏమంటే, ఈయన అసలు పేరు గార్లపాటి తెనాలిరామలింగడు, తర్వాత కాలంలో భట్టరు చిక్కాచార్యులు అనే గురువు వద్ద వైష్ణవ మత దీక్ష ను స్వీకరించి, తెనాలి రామకృష్ణుడు అయాడట. అయినా కూడా తాతాచార్యుల వారికి ఈయన మీద వైమనస్యమేనట. ఎందుకంటే, తిరిగి వైష్ణవంలో వడగలై, తెంగలై అని 2 శాఖలు. అందులో తెనాలి రామకృష్ణుడు 'వడగలై ' శాఖ అయితే, తాతాచార్యుల వారిది 'తెంగలై ' శాఖ అట.

సరే అసలు కథకు వద్దాం. కందుకూరి రుద్ర కవికి ఎన్నో ప్రయత్నాల తర్వాత, రాయల వారి ఆస్థాన క్షురకుడు 'కొండోజీ ' సిఫారసు మీద రాజదర్శనం అభించిందట.


దాని మీద ఓ చాటు పద్యం 'కందుకూరి రుద్ర ' కవి చెప్పినట్టుగా చెప్పబడుతున్నది.

ఎంగిలి ముచ్చు గులాములు
సంగతిగా గులము జరుప జనుదెంచిరయా
ఇంగిత మెరిగిన ఘనుడీ
మంగలి కొండోజీ మేలు మంత్రులకన్నన్

'బ్రాహ్మణులై పుట్టి కూడా ఈ మంత్రులు కులనాశనం చేయడానికిపూనుకున్నట్లున్నారు. వాళ్ళకంటే ఇంగిత ఙ్ఞానం కలిగిన కొండోజీ ఎంతో నయం' అన్న భావంతో వాపోయడట ఆయన.

ఈ కవి గొప్పదనం, రచనలు, వీటి సంగతి తెలియదు.

Tuesday, July 15, 2008

యెమెన్ (మినీ) ట్రావెలాగుడు!

అనగనగా పర్షియా దేశానికి సాబూర్ అనే చక్రవర్తి. ఆయనకు ఓ కొడుకూ, ఓ కూతురూనూ. ఆయన ప్రతి యేడూ జరిపే రాజ్యోత్సవాల్లో, ఓ యేడు వివిధ దేశాలకు చెందిన ముగ్గురు దేశస్తులు మూడు వింత వస్తువులను బహూకరించారు. అందులో ఒక వస్తువు కీలుగుర్రం. ఆ కీలుగుర్రం తలుచుకున్న చోటికి ఆకాశ మార్గాన ప్రయాణం చేయగలదు. ఆ కీలుగుర్రం ఇచ్చినందుకు సాబూర్ రాజు ఎంతో ఆనందించి ఆ వృద్దుణ్ణి ఏమైనా కోరుకొమ్మంటాడు. అదే తడవుగా ఆ వృద్దుడు యువరాణినీచ్చి వివాహం చేయమంటాడు. సరే నంటాడు చక్రవర్తి. యువరాణిఈ ముసలి వాడితో నా పెళ్ళా అని దిగులు చెందుతుంది. యువరాజు అక్మార్ ఈ వృద్దుని ఆట నేను కట్టిస్తానంటాడు.

యువరాజు అక్మార్ ఆ కీలు గుర్రాన్ని పరీక్షించే నెపంతో, దాన్ని ఎక్కి, ప్రయాణిస్తూ, ఓ దేశం వస్తాడు. ఆ దేశంలో ఇళ్ళన్నీ బొమ్మరిళ్ళ మాదిరి అందంగా ఉన్నాయి ఇలా.
ఆ దేశపు యువరాణి పేరు షంస్-అల్ -నహార్ తో అక్మార్ యువరాజు ప్రేమలో పడతాడు. ఆ యువరాణి ని ఎక్కించుకుని తనదేశానికి కీలుగుర్రంపై తీసుకు వస్తాడు యువరాజు.

ఇక్కడ సాబూర్ చక్రవర్తి తన కొడుకు కనబడక పోవడంతో ఆ వృద్దునిపై అగ్రహించి, వెళ్ళగొడతాడు. నగరం బయట ఆ వృద్దుడు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తుంటాడు.

తిరిగి వచ్చిన యువరాజు నగరం బయట ఓ స్థలంలో కీలుగుర్రాన్ని దాచి, ఆ పక్కనే ఓ ఉద్యాన వనంలో తన ప్రియురాలిని విశ్రాంతి కమ్మని చెప్పి నగరంలోకి వెళతాడు. తన తండ్రి తో సంగతులన్నీ చెప్పి, తన ప్రియురాలిని కోటకు తెసుకు వద్దాం అని తన ఆలోచన. చక్రవర్తి పరమానందభరితుడవుతాడు. సరే, తోటలోకి తిరిగి వచ్చి చూస్తే తన ప్రియురాలు మాయం!

టక్కరి వృద్దుడు ఆమెను, కీలు గుర్రాన్ని అపహరించి తీసుకెళ్ళిపోతాడు.తిరిగి యువరాజు అక్మార్ కీలుగుర్రాన్ని వెదికి, తన ప్రియురాలిని ఎలా కలుసుకుంటాడు? ఈ విశెషాలు 1958 చందమామ (జూన్ నుండీ అక్టోబర్ వరకు) లో వచ్చిన కీలు గుర్రం ధారావాహిక లో చదవండి.

అక్మార్ యువరాజు చూసిన ఆ దేశం యెమెన్. ఆ నగరపు రాజధాని సనా. ప్రపంచపు అతి ప్రాచీనమైన నగరాల్లో ఒకటి.

**************************************************
ఇది అరేబియన్ గల్ఫ్ లో ఉండడం వల్లా, ఈ దేశపు సాగర తీర నగరాలు భారతానికి దగ్గరవడం వల్లా, ఇక్కడి సంస్కృతి లో కాస్త మనదేశపు ఛాయలు కనబడతాయి. ముఖ్యంగా వీళ్ళ తిండిలో మన చపాతీలు, తందూరీ రోటీలు ఓ ముఖ్య భాగం.

ఈ దేశం మిగిలిన గల్ఫ్ దేశాల్లా కాక కాస్త సస్య శ్యామలమైనది. మొక్కాసినో అనబడే కాఫీ ఈ దేశంలోనే పుట్టిందట. ప్రపంచపు అత్యంత శ్రేష్టమైన కాఫీ గింజలు ఇక్కడే పండుతాయట. బ్రెజిల్ లో కాఫీ ఉత్పత్తి అధికం, అయితే నాణ్యత పరంగా యెమెన్ కాఫీ ఉత్తమమైనదని ఇక్కడి ప్రజలు చెబుతారు. అలానే మామిడి పళ్ళూ, సుగంధ ద్రవ్యాలు కూడా ఎక్కువే.

అలానే ఇక్కడ ఖరీదయిన కార్లు కూడా ఎక్కువే. పెట్రోలు ధర మన రూపాయల్లో అనువదించుకుంటే 12/- లీటరుకు. ఓ లీటరు నీటి ధర కూడా అంతే.

ఈ దేశంలో అడుగు పెట్టగానే మనకు అనుభవమవేవి 2 అంశాలు.

ఒకటి, ఇక్కడి ప్రజలు రోజస్తమానం నములుతూ ఉండే 'గాట్ ' అనబడే ఓ రకమైన ఆకు. ఈ ఆకు తేలిక రకం మాదక ద్రవ్యం అని అమెరికా వారు దీన్ని నిషేధించారు. ఇది యెమెన్ దేశపు సంస్కృతిలో వేల యేళ్ళుగా మమేకమైంది. అక్కడ రహదారుల్లో, ఇళ్ళల్లో, చివరకు ఆఫీసుల్లోనూ, వాళ్ళు ఈ ఆకు ను నములుతూ ఉంటారు.

రెండవది, ఇక్కడి ప్రజల అలసత్వం. మామూలుగా భారతీయుల అలసత్వం గురించి అందరూ దెప్పుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఓ పని జరగాలంటే వారం ముందు నుండీ చుట్టూ తిరుగుతూ ఉండాలి. పక్కన పిడుగు పడినా పట్టించుకోని మనస్తత్వం వీరిది.

భారతీయ మృదులాంత్రపు సంస్థలు (సత్యం, విప్రో, టీసీఎస్ వంటివి) ఈ మధ్య ఇక్కడి వ్యాపార అవకాశాలపై దృష్టి సారిస్తున్నాయి.

**********************************
ఇక్కడి భాష అరబిక్. ఉర్దూ కి ఇది మాతృక అని నా ఊహ. అరబిక్ సరళ సుందరమైన భాష. ఇందులో పదాలు మన హిందీ కి కాస్త దగ్గరగా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది.
ఉదా :-
శుక్రాన్ (అరబిక్) - శుక్రియా (హిందీ) - ధన్యవాదాలు
ముశ్కిలా - ముశ్కిల్ - కష్టం
కుల్లు - కుల్ - మొత్తంగా వగైరా..

ఐతే ఇక్కడి అరబ్బీ కి ఆఫ్రికన్ (సూడాన్) అరబ్బీకి కాస్త వాచికంలో తేడా కనిపిస్తుంది.

ఇది చాలా ప్రాచీనమైన భాష. యెడమ నుండీ కుడికి రాస్తారు ఈ లిపి. మాకు అక్కడ అధికారులు మా పాస్పోర్ట్ నంబరు అలా వ్రాసి లేని పోని ఇబ్బందులు ఎదుర్కున్నాము.

అరబిక్ భాషలో నీటిని 'మ్యే 'లేదా 'మోయా ' అంటారు. ప్రాచీనులు చిత్రలిపి లో నదిని తెలుపడం కోసం ప్రవాహం (తరంగాలు) గీసేవారట. అదే చివరకు M అనే ఆంగ్ల అక్షరం గా ఆరిందని తిరుమల రామచంద్ర గారంటున్నారు.
***************************************
యెమెన్ దేశానికి ముఖ్యపట్టణం 'సనా'. ఇక్కడ మన హైదరాబాదు లాగే పాత నగరం ఉన్నది. ఇది నిజంగా 'పాత ' నగరమే. ఇక్కడి దారుల్లో వెళుతుంటే యే 15 వ శతాబ్దంలోనో ఉన్నట్టు అనుభూతి చెందుతాము. రహదారులూ, చుట్టుపక్క ఇళ్ళూ, కోటగోడలు వగైరా 2000 యేళ్ళుగా రక్షించుకుంటున్నారట వీళ్ళు. ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం మరెక్కడా లేదనటంలో ఆశ్చర్యం లేదు.

ముఖ్యంగా చూడవలసినది, బాబ్ - అల్ - యెమెన్ అనబడే ఓ కోట వాకిలి. (బాబ్ అంటే అరబ్బీ లో ద్వారం అట). ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తించ బడ్డది.
***************************************

ఇలాంటి దేశాలకు ఆన్సైటు దొరికినప్పుడు కాస్త బాధగా ఉంటుంది, మన తోటి మృదులాంత్రపు నిపుణులు అమెరికాలూ, జర్మనీలు తిరుగుతున్నారు కదా అని. (అసూయ మగ వాళ్ళకూ శత్రువే :-)) ఐతే, ఇలా అయినా కాసిన్ని సంస్కృతులు, కొత్త విషయాలూ తెలుసుకునే అవకాశం కలుగుతున్నది కదా అని ఆనందం కూడా ఓ పక్క.

ఇవండీ నా మినీ ట్రవెలాగుడు విశేషాలు.

Monday, July 14, 2008

మిథ్యా వాస్తవం (Virtual Reality) అంటే యేమిటి?

ప్రవీణ్ గారి మొబయిల్ ఫోన్ ల మీద టపా చూడగానే ఓ టెకీ టపా రాయాలని దురాశ కలిగింది.అదే ఈ టపా కు శ్రీకారం.

మనం జురాస్సిక్ పార్క్ సినిమా చూసాం ఎన్నో యేళ్ళ ముందు. నేను ఈ సినిమా, అప్పట్లో ఆంధ్రలో బెస్ట్ థియేటర్ అనబడే, విశాఖ ’జగదాంబ’ లో చూసాను. (ఆ క్షణాలు ఇప్పటికీ మెదులుతున్నాయి, నా మదిలో). అందులో ఆ రాక్షస బల్లుల రూపకల్పన ఎలా జరిగి ఉండవచ్చు? అనుకునే వాణ్ణి. దానికి సమాధానం virtual reality modelling language.

దీనికి ముందుగా గ్రాఫిక్స్ (సినిమా లలో చూపిన్చే గ్రాఫిక్స్ కాదు) గురించిన ఓ మౌలిక విషయం.

గ్రాఫిక్స్ ను మౌలికంగా 2 రకాలుగా విభజింపవచ్చు. ౧. రాస్టర్ గ్రాఫిక్స్ ౨. వెక్టార్ గ్రాఫిక్స్.

మామూలుగా జెపీజీ, బీ ఎమ్ పీ వంటి ఫార్మాట్లు చిత్రాలను బిందువుల రూపంలో వ్యక్తీకరిస్తాయి. అంటే బీ ఎమ్ పీ బొమ్మ, అనేక బిందువుల సమాహారం. బిందువు లక్షణాలు రంగు, బిందువు పొజిశన్. అంతే కాక బిందువు రంగు వ్యక్తీకరించడానికి కావలసిన స్పష్టత. దీనిని బిట్ డెప్త్ అంటారు.

జీ పీ జీ అన్నఫార్మాట్లో ఈ వ్యక్తీకరణ ఎన్కోడ్ చేయబడి ఉంటుంది.

మీరు ఆ బొమ్మలో ఓ భాగాన్ని ఝూమ్ చేసారనుకుందాం. అప్పుడు ఆ ఝూం చేసిన మేరకు బొమ్మలో స్పష్టత లోపిస్తుంది.ఎందుకంటే, ఝూమ్ చేసినంత మేరా బిందువులను తిరిగి సర్దాల్సి వస్తుంది కాబట్టి.

అలాంటి ఇబ్బందులను వెక్టార్ గ్రాఫిక్స్ ద్వారా అధిగమించ వచ్చు. మనకు కనబడే ప్రతీ ఆకారం మౌలికంగా బిందువు, సరళ రేఖ, చాపం, వృత్తం, ఇలా 7 మౌలిక ఆకారాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ రకమైన మౌలిక అంశాలతో ఓ ఆకారాన్ని నిర్మిస్తే, ఆ ఆకారాన్ని గానీ, అందులో ఓ భాగాన్ని కానీ ఝూమ్ చేసినప్పుడు ఆ ఆకారపు మౌలికాంశాలను ఆ మేరా పెంచుకుంటే చాలు. ఎస్ వీ జీ అనబడే ఓ ఫార్మాట్ దీనికి ఉదాహరణ. ఈ మధ్య మొబైల్ ఫోన్లలో దీన్ని విరివిగా వాడుతున్నారు.

ఇక 3డీ గ్రాఫిక్స్ లో ఈ వెక్టార్ గ్రాఫిక్స్ కు ఉదాహరణ ఈ virtual reality modelling language.

3డీ లోనూ, 2డీలాగానే ప్రతీ ఆకారం గోళం, సిలిండర్, పిరమిడ్, క్యూబ్ వంటి మౌలిక ఆకారాలతో నిర్మించబడి వుంటుంది. మిథ్యా వాస్తవం లో HTML లో Tags లాగా ప్రతీ అంశాన్ని node తో పేర్కొంటారు. ఇవి మొత్తం 55. ఈ 55 nodes 3డీ మౌలికాంశాలకు ప్రతిరూపాలు. వీటితో, ఎలాంటి 3డీ ఆకారాన్ని అయినా రూపొందించవచ్చు. ఈ ఫైలు .wrl లేదా .vrml అన్న ఎక్స్ట్ టెన్షన్ కలిగి ఉంటుంది.

మీ విహరిణి లో ఈ wrl ఫైలును చూపడానికి ఓ ప్లగ్ ఇన్ అవసరమవుతుంది. ఇక్కడ దింపుకోండి దాన్ని. ఇప్పడు మీరు మీ విహరిణి ద్వారానే బెంగళూరు లోని MG రోడ్డు కి వెళ్ళి అలా చుట్టి రావచ్చు.

ఈ VRML కేవలం Entertainment విభాగంలో మాత్రమే కాకుండా, భారీ వాహనాలు, యుద్ధ విమానాలు, నావలు వంటి భారీ ఇన్జినీరింగు విభాగాల్లోనూ ఉపయుక్తమవుతుంది. మామూలుగా ట్రక్కులు, బస్సులు వంటి వాహనాలు రూపొందించేప్పుడు మొదట ఆకారం (chasis) రూపొందించి, తర్వాత ఫ్యూయలు, బ్రేకింగు, సస్పెన్షన్ వంటి వ్యవస్థలను రూపొందిస్తారు. అయితే, యుద్ధ విమానాలకు వచ్చేసరికి, మొదట బాహ్య రూపం (outer body) తో ఆరంభించి, తర్వాత రకరకాల వ్యవస్థలను అందులో ప్రక్శిప్తం చేస్తారు. NMG - Numerical model graphics అంటారు దాన్ని. దీన్ని రూపొందించడానికి CATIA వంటి ఖరీదైన మృదులాంత్రమ్ ఉపకరణాలు అవసరమవుతాయి. ఈ CATIA అన్న సాఫ్ట్ వేర్ మునుపు కేవలం కొన్ని యునిక్స్ సిస్తమ్స్ లో మాత్రం లభించేది. ఇప్పుడు సాధారణ పీసీ లోనూ లభిస్తుంది.

అలాగే విమానం కాక్పిట్ లో (పైలట్ కూర్చునే ప్రదేశం) విమానం నడపేటప్పుడు కొన్ని సూచికలు అవసరమవుతాయి. కమ్పాస్, AOA (Angle of attack), ground run horizon వంటివి. వీటిలో GRH అనబడే సూచి, విమానం భూమి మీద ఎంత ఎత్తులో ఎగురుతున్నది అన్న విషయం తెలుపడానికి ఉపకరిస్తుంది. ఆ ఉపకరణాన్ని సాఫ్ట్ వేర్ పద్దతుల ద్వారా మిథ్యా వాస్తవం ఉపయోగించి రూపొందిస్తారు.

ఇక మొబైల్ ఫోనుకు వస్తే, 3డీ అవతార్ అనబడే మొబైల్ అంశం దీనికి సంబంధించినదే. అంటే, మీ మిత్రుడెవరైనా మీకు కాల్ చేసినప్పుడు, ఫోటొకు బదులుగా ఓ 3డీ బొమ్మ ఎగురుతూనో, డాన్స్ చేస్తూనో కనిపిస్తుంది. ఆ బొమ్మకు కావలసిన డ్రెస్స్, అద్దాలు, ఆహార్యం వగైరా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా మన దేశంలో పాపులర్ అవలేదు.

ఇంకా కొన్నేళ్ళ ముందు వచ్చిన 3డీ సినిమాలు కూడా ఈ VRML ఉపయోగాలలో ఒకటి. స్టీరియో బఫ్ఫరింగ్ అంటారు ఈ విధానాన్ని. కొన్ని ప్రత్యేక పద్దతుల ద్వారా చూసే దృశ్యాన్నిఫిల్టర్ చేస్తారు. అలా ఫిల్టర్ చేయడానికి ఓ రకమైన గాగుల్స్ అవసరమవుతాయి. ఈ విధానంతోనే, యుద్ధ విమానాలకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగించే సిమ్యులేటర్లను రూపొందిస్తారు.

ఇలాంటి ఓ సిమ్యులేటర్ ను బెంగళూరు లోని HAL convention సెంటర్ లో చూడవచ్చు. దీన్ని చూడడానికి సాధారణ ప్రజలకూ అనుమతి ఉంది.

ఈ VRML ఫైల్ రూపొందించుకొనడానికి 3DSMax, maaya వంటి అన్ని టూల్స్ ద్వారానూ సదుపాయం ఉంది.

Saturday, July 12, 2008

మగ కవిత్వం! బొమ్మరిల్లు చమత్కార శ్లోక కథ!


ఈ కథ ఏప్రియల్ 1978 బొమ్మరిల్లు పత్రికలో ప్రచురింపబడింది. ఇదివరకు ఈ కథ కొన్ని చోట్ల ఉటంకించబడ్డం వల్ల, నా దగ్గర ఉన్న ఈ కథ ను స్కాన్ చేసి పెడుతున్నాను. ఔత్సాహికులు చదివి ఆనందించండి.

Thursday, July 3, 2008

సోడా గోళీ

మిట్ట మజ్జాన్నం. ఎండ సంపుతా ఉండె. ఇల్లొదిలి తార్రోడ్డు మీదకొస్తే, కాళ్ళు అంటకబోతాన్నాయ్. ఒంటిపూట బడి మొదలై ఒక ఐదార్రోజులయ్యుంటదేమో. సుంకేశనం మాను కింద ఆయాలికే గేర్లో పిలకాయలు జేరుకున్నారు, బద్దే గుండ్లాడే దాని కోసరం. మొన్న దాంక చిల్లాకట్టె సీజను. ఎండాకాలం మొదలైతానే గోళీ గుండ్ల సీజనొచ్చె.

బడి ఒదిలి ఇంటికొస్సానే మనసంతా గోళీలాట మీదున్నాది. నాయన పన్లోండొచ్చి అలిసిపాయి పడుకున్నాడు. నులక మంచం పైన అమ్మ కునుకు దీస్తా ఉండె. అవ్వ ఆతలికే అన్నం దిని వక్కలు గొట్టుకుంటాన్నాది.

"కాళ్ళు కడక్క రాపో, అన్నం దినేకి" అనె మాయవ్వ.

అన్నం పెట్టుకుంటానే, మజ్జిగేసేసుకున్న్యా. నంజుకునేకి రోంత చింతొక్కు యేసుకుని అన్నం గానిస్తి. రోన్ని గోళీలు నిక్కరు జేబులో పెట్టుకుని సుంకేసనం చెట్టు కాడికి ఉరికెత్తితి.

యెనకాల అవ్వ అరుస్తా ఉండె, " యేందిరా ఈ తినడం, అంతా ఆత్రమే ఈ నా బట్టకు" అనుకుంటా.

-------------

ఆతలికే ఆడ, సాకలోళ్ళ సుబ్బయ్య, టైలరు ఓబిలేసు, గొల్లోళ్ళ శివ బొద్దీ తోగి పదీ ఇరవయ్యి ఆట ఆడతాన్న్యారు. చెట్టు కింద ఒగ మూల గొల్లోళ్ళ కర్రావు సగం కండ్లు మూస్కుని ఎందో సప్పరిస్సా ఉన్న్యాది. రోంత అవపక్క అది యేశిన ప్యాడ.

మామూలుగా, ఎప్పుడూ, నాకూ గొల్లోళ్ళ శివకే పడేది.ఓబిలేశూ, సుబ్బయ్య అంతంత మాత్రం ఆడేవోల్లు. అయినా వాళ్ళకి ఒగో సారి అదురుష్టం పడుతా ఉంటాది. ఈ రోజు ఆ అదురుష్టం తోటే వాళ్ళిద్దరూ మొదటే నెగ్గేసిరి. గొల్లోళ్ళ శివ కీ నాకి పడింది, కడాకు.

శివ కాడ ఒక సోడా గోళీ ఉన్నాది. నల్లగా నిగనిగలాడతా. అది చూసినప్పుడల్లా నాకు బాధ.ఆ గోళీ ని ఒడ్డమన్నా చాలా తూర్లు. ఒక వేళ వాడు ఆ గోళీ గనక ఒడ్డితే, యేమైనా చేసి, గెల్చుకుంటా దాన్ని. నాకాడ గినా అట్లా గోళీ ఉన్నిందా, ' నా సామి రంగా' ఒగ ఆట ఆడించే వోణ్ణి. అది లేకపాయేసరికి ఇంకో ఎర్ర గోళీ తోటి ఆడతా ఉన్నా. చిటికినేలు, ఉంగరమేలు మజ్జెలో ఓ తెల్ల గుండు పెట్టుకుని, మధ్య వేలు వెనక్కి మడిచి జోరు కొద్దీ ఇడస్తా ఉన్నా, ఆడి గుండుకేసి. ఆడు అంతే, నా గుండు ని కొట్టాల అని. నేను శక్తి కొద్దీ యెనక్కి లాగి వాని సోడా గుండుకేసి వదిల్తి.

'తగిలె '. అబ్బ నేను గెలిస్తిలే అనుకునేంతలోపల నా ఎర్ర గుండు జారతా పోయి బొద్దీలో పడె. తగిలిన తర్వాత బొద్దీ లో పడితే, 'చిట్ పట్ ', అంటే అవతలోడు గెలిచినట్ల.

అప్పుడు నా కసంతా వాని సోడా గుండు మీద పాయె. అది నున్నగున్నందుకే నా గోళీ జారుకుంటా పోయి బొద్దీలో పడింది. నా కాడ అట్లా గోళీ, కనీసం జింజరు గోళీ ఉన్నిన్నా, పరిస్తితి ఇట్లా ఉంటా ఉన్నిండ్లే. యెట్లోగట్ల ఒక సోడా గోళీ సంపాదించల్ల. ఆ రోజు నా దగ్గిర గుండ్లన్నీ ఓడిపోతి.

--------------

అనుకున్నా గానీ సోడా గోళీ యాడ నుండీ సంపాయించేది? అదేమన్న మామూలు గోళీనా అంగిట్లో కొనుక్కునేకి?

రోజూ రాత్రి మా ఇంటికాడికి రాముడన్న సోడా బండీ వస్సాది. చెక్క బండీ లోపల సోడాలన్నీ వర్స్గాగ బేర్సింటాయి. మధ్యలో గెడ్డి.పైన తడి గోనె పట్ట. బండి కిందట ఒగ చిన్న బకెటు. సోడా ఇచ్చే ముందర కడిగే దానికి. సోడా సీసాలోపల మెరుస్తా సోడా గుండు. ఆ సోడా సీసా మూతి కాడ ఒక రబ్బరు రింగు మూతికి బిగుతుగా అతుక్కుని. ఆ రింగు ఎట్లోగట్ల తీసెస్సే సోడా బయటకి లాగొచ్చు అని అనిపిస్తాంటాది.ఒక సారిట్లే రాముడన్న దగ్గర సోడా దీస్కుని, సోడా సీసా మూతి దగ్గిర యేలు బెట్టి తడముతా ఉంటే, రాముడన్నకి యెందో అనుమానం వచ్చె. సోడా అయిపోతానే గుంజుకుని, గుర్రుగ జూస్తా, ’ఫో ’ మని కసురుకునె. సోడా గోళీ బయటకు పోతే ’శనంట ’ వాళ్ళకి. యాపారం నష్టమైతాదంట.

ఇంగ రాముడి కాడ గాకుండ యాడ దొరుకుతాది మరి? రాముడేమో గుర్రుగ జూస్సాండె. సరే యేమైతే అదైతాది ఈ రోజు మాయమ్మనడుగుదామని తీర్మానం జేసిన. ఆ రోజు రాత్రి మాయమ్మ పనైపాయి తీరుబడిగా కూర్చుని మాయవ్వతో ముచ్చట్లాడతాన్నాది. అప్పుడు అమ్మ దగ్గరకి పోయినా. గుండెలు పీచు పీచు మంటన్నాయి. ఎట్లోగట్ల దైర్నం జేసి మెల్లగడిగితి, ’అమ్మా, నాకు ఒక సోడా గోలీ కావల్ల ’ అని. యా కళనున్న్యాదో ఎమో, తిట్టగోకుండా అనె ’ సర్లేరా కొనక్కొచ్చుకో!’.

కొనక్కొచ్చుకునేకయితే కొనక్కొచ్చుకోనా ఏంది?

’లేదే, సోడా బండీ రాముడన్న కాడ నువ్వే ఇప్పీయాల ’ అన్నా.

’వాళ్ళెక్కదిస్సార్రా, సరే రేపు ఇప్పిస్సాలే’ అనె మాయమ్మ.

మరసట్రోజు నుండీ నాకు నిద్దర్లేదనుకో.

మాయమ్మేమో రాముడన్న దగ్గిర అడిగె, మరసట్రోజు, ’రాముడు, నీకాడ ఒగ సోడా గోలీ ఉంటే తీస్కరారాదా? ప్రాణం తీస్తా ఉండాడు, మా వాడు. రూపాయిస్తాలే’

’సర్లేమ్మయ్యా’ రేపు తీస్కొస్సాలే అనె రాముడు.

ఇంత సులబంగయిపోతది పని అనుకోలే నేను. ఐతే మన జనమకి యా పనయినా అంత తొందరగ అయితాదా?

నా ఖర్మ కి ఆ తర్వాత వారమ్ రోజులు రామన్న మా ఈది మొగమ్ జూళ్ళే. వారమ్ తర్వాత మళ్ళీ వచ్చె.
మాయమ్మ ’ ఏం రాముడూ, యాడ బోయినావ్? ’ అని పలకరించె.


’లేదమ్మయ్యా, జొరమొచ్చిన్నాది.’ అందుకే రాల్యా. అనె.

మజ్జెలో నా సోడా గోళీ కథ యాడో కొట్టకపాయె. మళ్ళీ మాయమ్మకి జెప్పి, మాయమ్మ రామునికి జెప్పి, కడాకేమయితేనేమిడిది, గోలీ పట్టుకొచ్చిచ్చె. ఒగ్గోలీ కాదు, ఒక సోడా గోలీ, రెండు జింజరు గుండ్లు.

---------------

మజ్జన్నం బడి అయిపాయి, పరీక్షలొచ్చె.పరీక్షలన్నీ అయిపానిచ్చి, తర్వాత రోజు మజ్జాన్నం గోళీలాడేదానికి పొవాలనుకున్నా. నా గుండ్లన్నీ, మాయమ్మ బీరువా పైన ఒక ’పాండ్స్’ డబ్బీలోకేసి పెట్టిన్న్యాది. మా నాయన రూములో నిద్ర పోతన్నాడు. నేను భోంచేసి, బీరువా ఎక్కనీకి స్టూలేస్కుని, గోళీ డబ్బా అందుకునే దానికోసమ్ రోంతట్ల లాగితి.

అంతే.

అది కింద పడి మొత్తం గోళీలు పొర్లుతా ఉండె. మా నాయన కు మెలకువొచ్చి, భలే కోపమొచ్చె. ’ నువ్వు, నీ బొద్దే గుండ్లు. యేరే పనీ పాటా లేదు నీకి’ అని పాండ్స్ దబ్బీ మొత్తం గుంజుకునె.

’ సెలవులే గద నాయనా’, అంటి గొంతు పూడకపోతా ఉంటే.

’ఐతే, పనికిమాలినోల్లతో గల్సి గోళీలాడే పనేనా, ఉండు, నీ గోళీలన్నీ దిబ్బలేకి గొడతానుండు’ అని కోపంగ అరస్తా యెల్లి, జానకమ్మోళ్ళ, నీళ్ళు లేని బాయి లో పారేసె.

నేను గెల్చుకున్న గోళీలన్నీ పాయె. అయినా బాధలేదు నాకి. సోడా గుండ్లు మళ్ళీ యాడనుండీ సమ్పాయిన్చేది?

ఆ తర్వాత అప్పుడప్పుడూ, జానకమ్మోల్ల బావిలో చూస్సా వచ్చిన, ఆ గోళీ యాడైనా కానొస్సాదేమో, మల్లీ ఎవరైనా బావిలో దిగి యేరుకొనిచ్చి తెచ్చిస్సారేమో అని.

ఈ రోజు దాంక అది జరగలే.

---------------

(రానారె స్పూర్తిగా, కృతఙ్ఞతలతో ! నా చిన్నప్పటి ఓ సంఘటన కి కథనం)