Friday, March 30, 2012

కహానీ - స్క్రిప్టు యండమూరి (టూకీగా) రాస్తే?***********************************************************
గమనిక: ఈ పోస్టు ముఖ్య ఉద్దేశ్యం వీరేంద్రనాథ్ కు పేరడీ. ఇది కహానీ సినిమా రివ్యూ కాదు.
***********************************************************

ప్రోలోగ్


"మిసెస్ విద్యా బాగ్చీ?" - సన్నగా, స్ఫుటంగా వినిపించింది పక్కనున్న చీకటి సందునుండి.

విద్యాబాగ్చీ అనబడే ఇరవై ఎనిమిదేళ్ళ అమ్మాయి పక్కకు తిరిగి చూసింది.

"మీ ఆయన అర్ణబ్ బాగ్చీ మీకు కావాలా?" పక్కన చీకటి సందునుండి వెలుగులోకి వస్తూ అన్నాడతను. సన్నగా, బలంగా ఉన్నాడతను. ఫుల్ స్లీవ్ షర్టు, కాస్తంత పైకి మడిచి ఉంది. జీన్సు పేంటు.కాస్తంత గడ్డం. అది కాదు ఆమె చూస్తున్నది. అతని కళ్ళు. వేటాడే చిరుతపులి కళ్ళలా ఉన్నాయవి.

"ఎవరు నువ్వు?"

సముద్రపు గాలి చల్లగా వీస్తోంది. దూరంగా దుర్గా దేవి నిమజ్జనం తాలూకు సందోహం వినబడుతోంది.

"తెలుసుకుని ఏం చేస్తారు?" - చిరుతపులి లానే సన్నగా నవ్వేడతను.

మి-ల-న్ దా-మ్జీ - విద్యాబాగ్చీ గొంతు నుంచీ సన్నగా కీచుగా వచ్చింది. ఆమె భయం ఆవేశాన్ని కప్పిపుచ్చలేకపోయింది. "తేగలవా? నా భర్తను తెచ్చివ్వగలవా?" హిస్టీరిక్ గా ముందుకు రాబోయింది.

అప్పుడు కొట్టేడతను. సరీగ్గా ఆమె ఊపిరితిత్తులు అంతమయి కడుపు మొదలయే చోట పిడికిలి బిగించి కంటికి కనిపించనంత వేగంతో. ఆ దెబ్బకు ఆ అమ్మాయి మూడడుగులు వెనక్కి వెళ్ళి కూర్చుండి పోయింది. బాధతో అంగలార్చుకుపోతున్నందున ఆమె ముఖంలో భావాలు కనిపించడం లేదు.

అతడు తాపీగా లేచాడు. నింపాదిగా జేబు నుండి పిస్టల్ తీసి గుళ్ళు లోడ్ చేశాడు. లేడి ఎక్కడికీ తప్పించుకుపోలేదని తెలిసిన తర్వాత పులి ఎలా తనని సమీపిస్తుందో అలా నెమ్మదిగా ఆమెను సమీపించేడు. ఆమె నుదుటికి పిస్టల్ సరీగ్గా పది అంగుళాల దూరంలో గురిపెట్టేడు.

అయిపోయింది. అన్నేళ్ళుగా తను పడిన తపన మొత్తం మరో క్షణంలో ముగిసిపోబోతూంది.  ఆమె తలపైకెత్తింది. తన ముఖం భావగర్భితంగా ఉంది. చావును ఆహ్వానిస్తున్నట్టుగా కళ్ళు మూసుకుంది. దూరంగా "దుర్గా మా కీ జై" అని భక్తుల నినాదాలు వినిపిస్తున్నాయి.

...
...

దుర్గాదేవి నిమజ్జనం లాగానే ప్రతీ కథా ఎక్కడో ఒక చోట అంతమవుతుంది.

***********************************************************

ప్రోలోగ్ కి ప్రోలోగ్


మే 25,2008.

కలకత్తా మెట్రో రైలు యథావిధిగా ప్రయాణికులని మోసుకుంటూ హడావిడిగా వెళుతూంది. క్రిక్కిరిసిన కంపార్టు మెంటు అది. స్త్రీలే ఎక్కువశాతం. రైలు వెళ్ళే ఆ రూట్లో కూలినాలి చేసుకునే స్త్రీలే ఎక్కువగా కాబట్టి అందులో ఆశ్చర్యమేం లేదు.

ఒకావిడ తనబిడ్డను సముదాయించలేక అవస్థపడుతూంది. "అలా ఏడిపించకపోతే పాలు  తాపించరాదా?" మందలిస్తున్నట్టుగా అంది పక్కనున్న ముసలావిడ. బిడ్డనెత్తుకున్నావిడ పక్కకు తిరిగి ఏదో చెప్పింది. రైలు శబ్దంలో ఆమె మాటలు ఎవరికీ వినబడలేదు. కాసేపటి తర్వాత ఆమె తన బిడ్డతో దిగిపోతుండగా, వెనుకనున్న ముసలావిడ పిలిచింది. "ఏవమ్మో నీ సంచీ" - సంచీలో పాలసీసా, అందులో పాలు. ఆ యువతి హడావుడిగా దిగిపోయింది. రైలు బయలు దేరుతుండగా ముసలావిడ పాలపీక తెరిచింది.

అదే ఆమె చేసిన తప్పు.

ఏం జరిగిందో తెలీదు. కొన్ని క్షణాల తర్వాత ఆ కంపార్టుమెంటులో అందరూ నిర్జీవంగా పడి ఉన్నారు. ఇదంతా తెలియని రైలు పట్టాలమీద ప్రయాణిస్తూ ఉంది.

రైలునుండీ ఆమె దిగుతున్నప్పుడు ఆమె పక్కన ఒకతను దిగేడు.

అతని కళ్ళు - అచ్చంగా చిరుతపులి కళ్ళల్లా ఉన్నాయి.

***********************************************************

ఆరంభం


ప్రతీ కథా ఎక్కడో ఒకచోట మొదలవాలి. కాల్పనిక కథను నిజమైన కేరక్టర్ తో మొదలు పెట్టడం మంచిది. ఈ కథకు సంబంధించి ఆ కేరక్టర్ పేరు సాత్యకి.

సాత్యకి - చిన్నవయసులోనే డిపార్టుమెంటులోకి అడుగుపెట్టాడు కాబట్టి అధికార దర్పం కానీ, హోదా కానీ అలవడలేదు. చురుకైన కళ్ళు, ఎప్పుడు చిరునవ్వుతూ ఉండే సన్నని పెదాలు, వాటిని కప్పి వేస్తూ సన్నగా, వత్తుగా అందమైన మీసాలు.

అతడు భాషాపరశేషభోగి కాడు కానీ మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి. ఇక మిగిలిన విశేషణాలు కథకు సంబంధించి అనవసరం. వరూధినికి మీసాల పట్టింపు లేకపోతే ప్రవరుడికి బదులు ఇతడికే ప్రాంచద్భూషణబాహుమూల రుచి చూపించి ఉండేది. వసుచరిత్రకారుడు ఈతణ్ణి చూసి ఉంటే అనవసరంగా ముక్కు గురించి అంత అందమైన పద్యం అనవసరంగా ఎందుకు వ్రాశానా అనుకుని ఉండేవాడు.

ప్రస్తుతం పోలీసు సాత్యకి ఆ కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నాడు. కాళీఘాట్ పోలీస్ స్టేషన్ దేశంలోని అన్ని పోలీసు స్టేషన్ల లానే అస్తవ్యస్తంగా ఉంది.

"ఎక్స్ క్యూజ్ మీ"

యస్ మేడం - ఎనిమిది నెల గర్భవతి పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టడం ఎన్నడూ చూడని ఎస్సై కాస్త కంగారుగా ఆమెను కూర్చోమన్నట్టు సైగ చేస్తూ అన్నాడు.

"మీరు?"

"నా పేరు విద్యా బాగ్చీ. నేను లండన్ నుండి వస్తున్నాను. మా ఆయన అర్ణబ్ బాగ్చీ రెండేళ్ళుగా కనిపించడం లేదు."

లండన్ - అనగానే ఎస్సై ముఖంలో తెచ్చిపెట్టుకున్న వినమ్రత కనిపించింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలినా వాళ్ళ దేశంపట్లా, వాళ్ళ నగరం పట్లా వినమ్రతను ఇంకా తీసికెళ్ళినట్టు లేదు.

"చాయ్ తాగుతారా?"

"వద్దు" - మొహమాటంతో అందావిడ.

ఇప్పుడు చెప్పండి - "మీ పేరు", "మీ ఆయన పేరు", "ఆయన వివరాలు" - ఎస్సై తనే స్వయంగా రాసుకోసాగాడు. పక్కనున్న సాత్యకి కంప్యూటర్లో చూపిస్తున్న సిస్టమ్ ఎర్రర్ ను - ఓస్ ఇదెంత అన్నట్టు చూస్తున్నాడు.  తాము ఒక భయంకరమైన వలయంలో ఇరుక్కుపోతామని ఆ క్షణాన వాళ్ళిద్దరికీ తెలియదు.

వివరాలు ముగించి లేచింది విద్య. పక్కనున్న సిస్టమ్ ను చూసి, "నేను సహాయం చేయనా" అని అడిగింది. చొరవగా వెళ్ళి ఒక్క క్షణంలో సరిచేసింది. "చిన్న మెమరీ ప్రాబ్లెం అంతే" - అని సాత్యకిని చూసి నవ్వింది.

ఆమె బయటకు రాగానే ఎస్సై ఆమెను జీపులో దింపిరమ్మని సాత్యకికి చెప్పాడు.

కథ మొదలయింది.

***********************************************************

"పెళ్ళయి కొంతకాలం కాపురం చేసి పెళ్ళానికి కడుపు రాగానే ఎలా వదిలించుకున్నాడో చూశావా? నేను ముప్ఫై యేళ్ళ నుండి ప్రయత్నిస్తూన్నాను. కుదరడమే లేదు" - పక్కనున్న పోలీసతనితో చెబుతున్నాడు ఎస్సై. ఉద్యోగం తాలూకు ఫ్రస్ట్రేషన్ ను సంసారంపై చూపించే సగటు సుబ్బారావు మనస్తత్వానికి ప్రతీక ఆ ఎస్సై. ప్రస్తుతం విద్యాబాగ్చీ అనబడే ఆ లండన్ అమ్మాయిని వదిలించుకుందామన్నా వదిలించుకోలేకపోవడం వల్ల వచ్చిన చికాకును తన తోటి పోలీసుతో పంచుకుంటునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ పోలీసులు చేయలేని పని విద్యాబాగ్చీ తనంతట తను చేసుకు పోతూంది. అప్పటికే ఆమె తన భర్త బస చేసిన హోటల్లో రూము తీసుకుంది. అతను పని చేసిన అసైన్ మెంట్ కు సంబంధించిన సంస్థ కార్యాలయానికి వెళ్ళి ఆ కంపెనీ తాలూకు మానవవనరుల అధికారిణి తో మాట్లాడి వచ్చింది. తన భర్త ఆనవాళ్ళు దొరకలేదు కానీ అతణ్ణి పోలిన మిలన్ దామ్జీ అనే ఒకతను అదే సంస్థలో పని చేస్తున్నట్టు, అతని ఆనవాళ్ళు పాత ఆఫీసు ఫైళ్ళల్లో దొరకవచ్చన్న సమాచారం సేకరించింది.


విద్యాబాగ్చీ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆమెకు సహాయపడుతున్నది సాత్యకి.

***********************************************************
ఒక సాధారణ ఎల్ ఐసీ ఏజెంటు అతను. వలయాలు గా ఉన్న కళ్ళజోడు, కాస్తంత పొట్ట, మెడపై సంచీ, ఒక చిన్న సెల్ ఫోను, ముడతలు పడ్డ ముఖం, బీదనవ్వు అతని ఆభరణాలు. రోజూ లాగే అతని ఆఫీసరు తిడుతున్నాడు. ఆఫీసరు తిట్లను తప్పించుకుందుకు ఫోనులో మాట్లాడుతున్నట్టు ఎవరితోనో ఫోనులో మాట్లాడుతున్నాడు అతను. మరి కాసేపటికి తన స్కూటర్ లో క్లయింటు దగ్గరికి బయలుదేరేడు.

లిఫ్టు లో ఒక నడివయసు స్త్రీ పైకెళుతూంది. ఆమెయే ఈతని క్లయింటు. లిఫ్టు ఆగగానే తలుపులు తెరుచుకున్నాయి. ఏం జరుగుతూంది తెలిసేలోపల ఆమె నుదుటిన కాల్చేడు. మరో బుల్లెట్టు ఛాతీలోకి దూసుకు వెళ్ళింది. తాపీగా బయటకు వచ్చేసేడు.

ఒక క్లయింటు పని అయిపోయింది. మరో ఇద్దరు అంతే. ఆ ఇద్దరు - ఒక డాక్టరు, మరో అమ్మాయి. ఆ అమ్మాయి ఫోటో సెల్ ఫోను లో అమాయకంగా నవ్వుతూంది. ఆ అమ్మాయి పేరు వి-ద్యా-బా-గ్చీ.

జాగ్రత్తగా గమనిస్తే అతని బీదనవ్వు వెనుక నిర్లిప్తతతో కూడిన క్రూరత్వం కనబడుతూంది.

***********************************************************

సీబీఐ ఆఫీసు, న్యూఢిల్లీ.

సీనియర్ ఆఫీసర్ ఖాన్ చూడ్డానికి సాధారణంగా ఉంటాడు. అతనికి ఎథిక్స్ తెలియవని, మాట్లాడ్డం రాదని, ఈ ఉద్యోగానికి అతను పనికి రాడని ఆఫీసు వర్గాల్లో కొందరు చెప్పుకుంటూ ఉంటారు. చాలా కొద్ది మందికి మాత్రమే అతడి గురించి తెలుసు.

ఖాన్ సిగరెట్టు వెలిగించాడు. అలానే మీటింగు జరుగుతున్న డైరెక్టర్ గదిలోకి సూటిగా వెళ్ళేడు. మిలన్ దామ్జీ కోసం లండన్ నుంచి వచ్చిన ఒకావిడ వెతుకుతూందన్న వార్త చెప్పదం కోసం. సీబీఐ డైరెక్టర్ ముఖంలో తొట్రుపాటు స్పష్టంగా కనిపించింది. ఆ తొట్రుపాటుకు కారణం ఆ వార్తో, లేక ఖానో సరిగ్గా తెలీదు. ఆ తర్వాత రోజు సరీగ్గా పొద్దున పది గంటలకు ఖాన్ కాళీఘాట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.

***********************************************************

"నాకు ఈ పోలీస్ స్టేషన్ మరో రెండు నిముషాల్లో ఖాళీగా కావాలి"

ఆ కంఠంలో కనిపిస్తున్న అధికారానికి ఎస్సై బిత్తరపోయేడు. ఈ మధ్య పోలీసు స్టేషన్ లో ఇటువంటి వాళ్ళ తాకిడి ఎక్కువవుతూంది. "ఎవడుబే నువ్వు?" - తెచ్చిపెట్టుకున్న పోలీసు దర్పంతో అడగబోయేడు.

"అబే, ఖాన్" - ఒక బూతు మాటకు తన హోదాను జోడించి చెప్పేడు ఖాన్. మరో రెండు నిముషాల తర్వాత పోలీస్ స్టేషన్ ఖాళీ అయింది.

అక్కడికి అదే సమయంలో విద్యాబాగ్చీ వచ్చింది. ఆమెకు ఖాన్ ఎదురయ్యేడు. సిగరెట్టు పొగ ఆమెపై వదులుతూ కటువుగా చెప్పేడు. "మిలన్ దామ్జీ లేడు. సెమెక్ ఆఫీసులో రెండు వేల మంది ఉద్యోగులున్నారు. వాళ్ళల్లో మిలన్ దామ్జీ అనేవాడు లేడు. మీరు మీ అన్వేషణ మానేసి లండన్ కు తిరిగి వెళ్ళడం మంచిది"

సరీగ్గా ఇక్కడే ఖాన్ ఆ అమ్మాయిని తక్కువగా అంచనా వేసేడు.

***********************************************************

విద్యాబాగ్చీ సాత్యకి సాయంతో పాత ఆఫీసులో చొరబడి మిలన్ వివరాలు సేకరించింది. దాని సాయంతో అతని అడ్రసు, అతని బ్లడ్ గ్రూపు తదితర వివరాలు అనేకం సేకరించింది. ఈ తీగ సాయంతో సెమెక్ సంస్థలో కుట్రకు మూలకారణమైన వ్యక్తిని కూడా పసిగట్టగలిగింది. ఇటుపక్క సాత్యకి పోలీసు ఇన్ఫార్మర్ సాయంతో మరిన్ని వివరాలు సేకరించేడు.


మధ్యలో ఆమెపై మూడు హత్యాప్రయత్నాలు జరిగేయి. మొదటిది కేవలం భయపెట్టటానికయితే మిగిలిన రెండూ నిజమైనవి. ఆ రెండు హత్యాప్రయత్నాల్లో ఆ హత్యకు ప్రయత్నించిన వాళ్ళే చనిపోయేరు. అందులో రెండవవాడు కేసుకు కీలకమైన రుజువు.

***********************************************************

తన ముఖ్యమైన రుజువు హతుడయ్యాడని విని సీబీఐ ఆఫీసర్ ఖాన్ కట్రాట అయ్యేడు. కోలగా, క్రూరంగా ఉన్న అతని ముఖంపై కుడివైపు దవడకండరం బిగుసుకుని ఉంది.

చివరిగా మిగిలింది మరొక్కరు అంతే. అతను ఈ కేసుకు మూల సూత్రధారి. అతణ్ణెలా కనుక్కోవాలి. ఖాన్ కు దిగిరాక తప్పలేదు. తన జీవితంలో మొట్టమొదటి సారి విద్యా బాగ్చీ ని అర్థించేడు.

ఖాన్ అంచనా తప్పు కాలేదు. కేసు కొలిక్కి వచ్చేసింది. అయితే చివర్న క్రిమినల్ ను పట్టుకో బోయే ముందు ఒక చిన్న రివెంజ్ తీసుకోదల్చుకున్నాడు. ఆ రివెంజ్ తాలూకు విలువ విద్యా బాగ్చీ ప్రాణం. అందుకు ఏమీ చేయనవసరం లేదు. ఆమెను తన మానాన తనను వదిలేస్తే చాలు. సాత్యకిని మాత్రం దూరంగా పెట్టాలి.

***********************************************************
సాత్యకి -

ఒక వ్యక్తిలో తనకు నచ్చిన గుణం కనబడితే అది ఆరాధనకు దారి తీస్తుంది. సాత్యకికి ఆమె పట్ల ఉన్నది తనకు ఉన్న ఫీలింగు ప్రేమ కాదని తెలుసు. అయితే ఆ ఇది ఏదో అర్థం కావడం లేదని కూడా తెలుసు. కొన్ని కొన్ని ఫీలింగ్స్ కి లాజిక్ అవసరం లేదు. అతని భావం విద్యకు కూడా తెలుసు. అయితే ఈ కథ ముగింపు గురించి విద్యాబాగ్చీ కి తెలిసినంత స్ఫుటంగా సాత్యకికి తెలియదు. సాత్యకికి విద్య పట్ల స్నేహభావమే మిగిలింది. అతడు ప్రవరుడిలానే స్వచ్ఛంగా మిగిలేడు. ఆమె ప్రాణాలను కాపాడగలిగేడు. అలా ఆమెకు సహాయపడిన తృప్తి అతని మీసాల వెనుక చిరునవ్వులో గర్వంగా ఒదిగింది.


అతడి వైపు నుంచీ చెప్పడానికి ఇక ఏమీ లేదు.

***********************************************************
ఎపిలాగ్

"ఎవరు నువ్వు?"

సముద్రపు గాలి చల్లగా వీస్తోంది. దూరంగా దుర్గా దేవి నిమజ్జనం తాలూకు సందోహం వినబడుతోంది.

"తెలుసుకుని ఏం చేస్తారు?"

"తేగలవా? నా భర్తను తెచ్చివ్వగలవా?"

అప్పుడు కొట్టేడతను. సరీగ్గా ఆమె ఊపిరితిత్తులు అంతమయి కడుపు మొదలయే చోట పిడికిలి బిగించి కంటికి కనిపించనంత వేగంతో.

అతడు తాపీగా లేచాడు. నింపాదిగా జేబు నుండి పిస్టల్ తీసి గుళ్ళు లోడ్ చేశాడు. లేడి ఎక్కడికీ తప్పించుకుపోలేదని తెలిసిన తర్వాత పులి ఎలా తనని సమీపిస్తుందో అలా నెమ్మదిగా ఆమెను సమీపించేడు. ఆమె నుదుటికి పిస్టల్ సరీగ్గా పది అంగుళాల దూరంలో గురిపెట్టేడు.

అయిపోయింది. అన్నేళ్ళుగా తను పడిన తపన మొత్తం మరో క్షణంలో ముగిసిపోబోతూంది.  అతని వేళ్ళు తుపాకీ ట్రిగ్గర్ దగ్గరగా వచ్చేయి.

సరీగ్గా అప్పుడు అతను ఊహించని సంఘటన ఎదురయ్యింది. అతడెంతగా విస్మయానికి గురయ్యాడంటే  దాదాపు పాతికక్షణాలు అతడికి ఏమీ అర్థం కాలేదు. ఆ సమయం చాలు....
...
...
దుర్గాదేవి నిమజ్జనం దుష్టసంహారానికి, కాల్పనిక కథకు, దాని ముగింపుకూ, ఆ కథవెనుక స్ఫూర్తికీ  కూడా చిహ్నమే.

***********************************************************

Tuesday, March 27, 2012

భోజనప్రలాపం

...అనే తిండిగోలను చాలకాలం తర్వాత నా బ్లాగులో చెప్పుకోవాలనిపించి రాస్తున్నాను.

దీనికి శ్రీకారం చుట్టించినాయన శ్రీనాథుడు. అవును. ఈ మధ్య శ్రీనాథ కవిసార్వభౌమ అనే ఎన్టీవోడి సినిమా డీవీడీ లో చూశాను. సినిమా గురించి నా అభిప్రాయం చెప్పను కానీ, అందులో శ్రీనాథుడు తిండిపై కూసిన పద్యాలు విన్న తర్వాత నా చెవులలో చిమ్మిరేగింది.

నేటి సారస్వతవిమర్శకులు కవిహృదయం ఎఱుగకుండా సాహిత్యం మీద విమర్శించిన రీతిలో - ఎంతసేపూ జొన్నన్నం మీద నోరు చేసుకునేకే సరిపోయింది కానీ అసలు జొన్నలలో స్వారస్యం కనుక్కుందామనే ఆలోచన ఆయనకు లేకుండా పోయింది.

శ్రీ కృష్ణుడా, పూతన చన్నులచేదు తాగినాను, దవాగ్ని మింగినాను అని చెప్పబాకు, ఉడుకు చింతాకు బచ్చలి కూర జొన్నకూటితో ఒక ముద్ద తినిచూడు నీ పస కనిపిస్తుంది - అట.

బహుశా ఆయనకు జొన్నన్నమో, జొన్నరొట్టో చేసిపెట్టినావిడ మెత్తగా చేసి ఉండదు. అంతే తప్ప జొన్నరొట్టె, చింతచివురు పప్పు ఒకసారి మా సీమకొచ్చి తిని చూడు అని స్వర్గానికి వినిపించేలా చెప్పాలనిపించింది.

చెల్లవు, సార్వభౌమ! కడు చెన్నగు భోజన సౌఖ్యమందినా
డల్ల సుభాగ్యముల్ గొనితి టంచును నిక్కెదవేమొ! తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు పప్పును మెత్తని జొన్నరొట్టెతో
మెల్లగ యొక్క ముక్క దిగ మ్రింగుమ! మోక్షము కానవచ్చెడిన్.

(చిన్న మాట. జొన్నరొట్టె పై పద్యంలాగా ఏడ్సినట్టు ఉండదు. శ్రీనాథుని పద్యం లానే ఉంటుందని మనవి)

ఒక్క చింతాకు పప్పేమిటీ, గుత్తివంకాయ కూర, పెరుగు, కారప్పొడి కాదేదీ జొన్నరొట్టెతో నంజుడుకనర్హం. శ్రీనాథుల వారు ఇంతటితో ఎలానో ఆగారు రాగి ముద్దపైనా, లేదా గోంగూర డ్రగ్ మీదా ఏమీ అనలేదు. శుభం. (గోంగూర ’డ్రగ్’ ఎందుకంటే నాకు ఓ మారు సరైన గోంగూర పచ్చడి తగిలి రుచి చూడ్డం జరిగితే ఆ తర్వాత భోజనానికి అది లేకపోతే ప్రాణం పోయినట్టు ఉంటుంది.)

శ్రీనాథుని మీద పై పద్యం ద్వారా చేయి చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న డవుటొచ్చింది. శ్రీనాథుడు తిన్నది జొన్నన్నము కదా, జొన్నరొట్టె గురించి అప్పటికి తెలియదేమోనని. కానీ ’రొట్టె’ శ్రీనాథుని కాలం నాటికి ఉన్నది. సాక్ష్యం -

ఉలుమిడి చెక్కయున్, మిగుల నొక్కయుఁ జప్పని రొట్టెముక్కయున్
మలినపు గుడ్డలున్, నులుక మంచపుఁ గుక్కియుఁ, జీరటిల్లునుం
దలఁచిన రోఁత వచ్చు, నొకనాఁటి సుఖం బొకయేఁటి దుఃఖమీ
పలివెల వారకాంతల యుపస్థలకున్ బదివేల దండముల్.

హిందీ రోటీ - తెలుగులో రొట్టె అయిందని నా ఊహ. కానీ శ్రీనాథుని కాలానికి రొట్టె తెలిసిందంటే యేమో!

భోజన విషయంలో ఈయనకు స్వ-పర భేదాలు లేవన్నట్టు తెలుస్తూంది. మరో పద్యంలో తమిళులవంటను ఆడిపోసుకున్నాడు. మొట్టమొదటనే మిర్యపుచారు చెవులలో పొగరేగేటట్టు వడ్డిస్తారట. ఇలా మొదలెట్టి అరవ వారి విందెల్ల యాగడంబు అంటాడీయన.

నిజానికి తమిళుల ఇళ్ళల్లో చప్పని పప్పు, నేయి వడ్డించడం కొన్ని చోట్ల నేను గమనించాను. అలాగే మరికొంతమంది ఇళ్ళల్లో పప్పుతో బాటు పెరుగుపచ్చడి కలిపి భోంచెయ్యడం ఒక ఆనవాయితీ. శ్రీనాథుడు చెప్పే సాంబారు కూడా అంత అన్యాయమేమీ కాదు. ముఖ్యంగా ములక్కాడల సాంబారు. ఇదంతా చూస్తూంటే శ్రీనాథుడు బెంగాలీ వాళ్ళలాగా పొద్దున లేచి స్వీట్లు, కాఫీలో వెన్న తగలెట్టుకుని తాగే రకమా అని ఒక అనుమానం వస్తుంది. మరీ కొంచెం కూడా ఘాటు తింటున్నట్టు ఎక్కడా లేదు, బాపు సినిమాలో మాత్రం "ఆవ ఠేవ" ఏదీ? అని ఆయనతో అనిపిస్తాడు దర్శకుడు. నిజానికి ఆవకాయ ఆయన కాలానికి లేదు. ఊరుగాయ - అంటే ఉప్పునీటిలో ఊరవేసిన కొన్ని కాయలు అనే కాన్సెప్టు 15 వ శతాబ్దానికి కానీ రాలేదు. ఆ తర్వాత 18 వ శతాబ్దానికి కానీ మిరపకాయ భారద్దేశానికి రాలేదు. అది శ్రీనాథుని సినిమాలో బాపు చేసిన చందోభంగం.

ఇందాక సాంబారు అంటే గుర్తొచ్చింది. మా ఊళ్ళో ఓ మారు నాగఫణిశర్మ గారి అవధానం జరిగింది. అందులో దత్తపదిలో భాగంగా సాంబారు, పూరీ, వడ, దోస లతో శివుణ్ణి వర్ణించమన్నారు. నాకు పద్యం గుర్తు లేదు కానీ, సాంబా! రుద్రా! అని చివరిపాదంలో రావడం గుర్తుండిపోయింది.

తమిళులు అన్నారు కాబట్టి ఇంకొంచెం దూరం వెళ్ళి మలయాళీలనూ పలకరించి వద్దాం. మలయాళీల సాంబారు/పులుసు/గ్రేవీ కూర పేరు ’అవియల్’. దీని వెనుక టెక్నాలజీ నాకు తెలీదు కానీ, ఇందులో ముక్కలను నిలువునా కోసి తగలెడతారు (అదేనండి పొయ్యిమీద పెడతారు). అంటే కేరట్ ముక్కలు రౌండు రౌండుగా కాక కాస్త పొడుగు పొడుగు ముక్కలుగా అన్నట్టు. అరటి, కేరట్టు, కంద, గుమ్మడి ఇత్యాది కూరగాయల కలగలుపుగా ఈ వంటకం తయారు చేస్తారు. ఇక మలయాళీల పేటెంట్ కొబ్బరినూనె తప్పనిసరి. ఈ వంటకం చేసేప్పుడు వంటగది వైపుకు వెళ్ళటం రిస్కు. కొబ్బరి నూనె ఉడికేప్పుడు వచ్చే వాసన భరించవలసి వస్తుంది. అయితే సరిగ్గా చేస్తే దీని రుచి - "న్యాన్ ఎంద పరయుమ్!" - అంతే. ఈ అవియల్ మలయాళీల పండుగ ఓణం కు చేసే వంటకాల లిస్టులో ఒకటి. ఆ విందును ’సద్య’ అని అందురు. దాని గురించి మరెప్పుడైనా.

ఈ మధ్య నా వెరైటీ తిండిగోలతోటి నా శీర్షం మీదికి తెచ్చుకున్నాను. బెంగళూరు బ్రిగేడు రోడ్డులో నీలగిరి దుకాణాని కెళ్ళానో మారు. అక్కడ ఎండబెట్టిన తామరతూళ్ళను చూశాను. (తామరకళంగు వరువల్) వాటిని ఫ్రై చేసుకుని తినాలట. వాటిని ఇంటికి తెచ్చి మా ఆవిడకు ఆర్డరిచ్చాను. మా పాప తమ్మి (సంహిత) మొదటి ముక్క బానే తిన్నది. ఆ తర్వాతి ముక్కకు దానికి ఖోపం వచ్చేసింది. మా ఆవిడ డవుటు పడి దారుణాయుధాలు ప్రయోగించకముందే మిగిలిన వాటినన్నిటినీ బలవంతంగా తినవలసివచ్చింది.

ఇక్కడ దుర్భాగ్యనగరం హైటెక్ సిటీ నుండి లోపలకు వచ్చే దారిలో అవియల్ పేరుతో ఒక రెస్టారెంటు ఉంది. అక్కడ అవియల్ చేస్తారో లేదో తెలియదు.

ఈ అవియల్ ను తమిళులు (ముఖ్యంగా తమిళబ్రాహ్మలు), మలయాళీలు భోజనంలోనే కాక ములగాకు అట్టుతో కలిపి తింటారు.

శ్రీనాథుడు ఇవన్నీ తిని డెఫినిట్ గా ఉండడు. మనకా అవకాశం ఉంది. ఉపయోగించుకుందాం. తిని ఉండబట్టలేక ఇలా వాగుదాం.

Wednesday, March 21, 2012

ఒక శాసనం - వెనుక కథ

బహువృత్తాన్తాని రాజకులాని నామ - ప్రతిమా నాటకంలో భాసమహాకవి సీతమ్మ నోట చెప్పించిన మాట. రాజవంశాలలో జరిగే చిత్రాలు పలువిధాలు అన్న మాట ఆయన ఏ ముహూర్తంలో వ్రాసినాడో ఏమో ఇది భారతదేశ రాజవంశాలవిషయంలో అక్షరసత్యమయింది. ఆ ’చిత్రాలు’ తదనంతర కాలంలో శిథిలదేవాలయాలకూ, విరిగిపోయిన శిలలకూ, వైభవం కోలుపోయిన సంస్కృతీ నిలయాలకూ కారణమై, గతించిన చరిత్రకు మూగ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఎట్టి కఱకు రాతి గుండెవానినయినా కరిగించి, విలపింపజేయగలిగిన కరుణాతరంగితమలయవీచికలు ఇవి. అలాంటి ఒకానొక కథను గుర్తు చేసే శిలాఫలకం, గతించిన దాని వైభవం, దానిని చెక్కించిన ఒకానొక పసి బాలుని దయనీయమైన కథనమే ఈ వ్యాసం.

(ఈ వ్యాసం ఉద్దేశ్యం చరిత్ర కాదు, చరిత్ర మీద, మన సంస్కృతి మీద సానుభూతి కలిగించడం. ఈ వ్యాసాన్ని ఏ విధమైన ప్రమాణంగా స్వీకరించవద్దని మనవి)

***********************************************************


(శాసనపాఠం - తప్పులుండవచ్చు. సరిదిద్దితే సంతోషం)
శుభమస్తు స్వస్తి శ్రీ జయాభ్యుద
య శాలివాహన శకవర్షంగ
ళు ౧౪౭౮ శయన సంవత్సరద
ఆషాఢ శు ౧౨ (మం)పుణ్యకాలదెయ శ్రీ
మద్రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ
వీరప్రతాపశ్రీ సదాసివరాయ మహ
రాయరూ ప్రౌఢిరాజ్యం గెవుతిరలు విరూ
పణనాయకరు శంఖదూర మల్లికా
ర్జున దేవర సమ్మాన సిలాశాసనద
క్రమవంతెందరె ప్రాకుదినగళలూ పారు
పత్యగారరూ మాన్యగ్రాసక్కొంబ గర్భ
రహౌసతం మ తందె రంతుప్రే నాయకరిగె
పుణ్యవాగి బెశోయంకుధారె
రద్దు కోట ధర్మశాసన యీ ధర్మ.

***********************************************************

భౌగోళికంగా రాయలసీమలో నేటి అనంతపురం జిల్లాకు ఒక వైచిత్రి ఉంది. అనంతపురం జిల్లాలోనికి కర్ణాటక తాలూకు ఒక పాయ చొచ్చుకుని వచ్చి ఉంటుంది. ఇటుప్రక్క, అటుప్రక్కనా తెలుగు, మధ్యలో కన్నడ. నేటి ఈ పరిణామం గత వందల యేళ్ళుగా కొనసాగుతున్న సాంస్కృతీ మైత్రికి చిహ్నం. రెండు భాషలు, రెండు సంస్కృతులు వందల యేళ్ళుగా కలిసి మమేకమై జీవిస్తున్న అపురూపమైన చోటు ఇది. లిపి కూడా తెలుగు కన్నడాలకు దాదాపు ఒక్కటిగానే ఉంది.

ఈ కర్ణాటక పాయకు ఇటువైపున కల్యాణదుర్గం, కంబదూరు, అటువైపు హేమావతి, అమరాపురం, మధ్యలో కన్నడనాడు ముఖ్యపట్టణం పావగడ. ఈ పేర్కొన్న పట్టణాలన్నీ గతించిన వైభవానికి చిహ్నాలే. అన్ని ప్రాంతాల్లోనూ విజయనగర సామ్రాజ్యపు ఆనవాళ్ళు కొద్దో, గొప్పో కనిపించడం కద్దు.

పైన పేర్కొన్న ఆ శాసనం కంబదూరు లోని శంఖదూరమల్లేశ్వరస్వామి దేవాలయం తాలూకుది. ఆ శాసనం తాలూకు భాష కన్నడ. శాసనంపైన శివలింగం చెక్కారు. కృష్ణరాయలు వైష్ణవుడు. ఈ శివలింగచిహ్నం ఆర్వీటి రామరాజు ప్రాభవానికి చిహ్నం కావచ్చును. ప్రతి వాక్యానికి ముందూ ’౦’ చెక్కారు. అందులో ప్రముఖంగా కనిపిస్తున్న పేరు - శ్రీ వీరప్రతాపసదాశివమహరాయలు. ఇంకా విరూపణ్ణ, పారుపత్తెదారుడు అన్న పదాలు కూడా ఉన్నై. ఆ శాసనంలో చెక్కిన సంవత్సరం - శాలివాహన శకం 1478 అంటే క్రీ.శ: 1556. ఆ యేడు ఆషాఢమాసంలో - శ్రీ మల్లేశునికి విరూపణ ద్వారా చెందవలసిన మాన్యాలను నిలుపుదల చేయిస్తున్నట్టు శ్రీ సదాశివరాయలి పారుపత్తెదారుడు వేయించిన శాసనం. పారుపత్తెదారుడు అంటే గ్రామాధికారి. బహుశా విరూపణ అనే అతను ఈ ప్రాంతానికి పారుపత్తెం వహిస్తూ ఉండేవాడు కావచ్చును. (ఈ అర్థాలు నాకు తోచినవి మాత్రమే)

మనకు తీగ దొరికింది: 1558 - అంటే తుళువ (సంపెట) శ్రీకృష్ణదేవరాయలవారు గతించిన తర్వాతి కాలం. ఆయన మరణించినది 1530 వ వత్సరంలో. అప్పటికి శ్రీవారి పుత్రసంతానం కూడా గతించింది. ఆ కుట్రకు తిమ్మరుసయ్య కారణమని ఆయన్ను పెనుగొండ జైల్లో పెట్టటమూ జరిగిపోయింది. ఆ దయనీయమైన పరిస్థితిలో ఆంధ్రవిద్యాభోజుడు, కవివరహృత్కమలబాలమిత్రుడు, ఆంధ్రాభారతీలాలసమానసాబ్జుడు, హిందూరాజ్యరమారమణుడు, మూరురాయరగండడు శ్రీ కృష్ణసార్వభౌముడు తన భౌతికకాయాన్ని విడచి యశఃకాయుడైనాడు.

సీ ||
కవిబుధనికరంబు కల్పతరూయని
వాక్రుచ్చి వాక్రుచ్చి వగచుచుండ
రాణులార్తధ్వనిఁ బ్రాణేశ్వరాయని
యుర్విపైఁబడి మూర్ఛనొందుచుండ
హా తండ్రి మమునిట్టులనదలఁ జేసితే
యని ప్రజాతతులంగలార్చుచుండ
వైరిరాజులుఁగూడ వీరాగ్రణీయని
విలపించి యశ్రులు విడచుచుండ
గీ||
గాఢమైనట్టి శోకాంధకారమందు
లోకమంతయు మునుఁగ నాలోకబాంధ
వుండు, శ్రీకృష్ణసార్వభౌముండు సుప్ర
శస్తవిక్రమసంపన్నుఁ డస్తమించె 

- (శ్రీకృష్ణదేవరాయచరిత్ర)

కృష్ణరాయల వారి తదనంతరం ఆయన సవతి తల్లి కుమారుడు (నరసరాజుకు కోబాంబిక వల్ల కలిగిన పుత్త్రుడు) అచ్యుతరాయలు - శాలివాహన శకం ౧౪౫౨ (క్రీ.శ 1530) విరోధినామ సంవత్సర కార్తీకబహుళపంచమి నాడు రాజ్యం తీసుకొన్నాడు. ఈయన రాజ్యం దక్షిణాన తిరునల్వేలి వరకు వ్యాపించినదని కంచిలో ఒక శిలాశాసనం ఉంది. అచ్యుతరాయలు ఎటువంటివాడయినా కానీ, తన దండాధిపతి, స్వయానా అచ్యుతరాయలికి బావమఱిది అయిన సలకము తిమ్మయ మాత్రం వెనకటి తిమ్మరుసయ్య లాగే కడుసమర్థుడు. ఈ తిమ్మయ్య తమ రాజ్యంలో తిరుగుబాటు ప్రకటించిన కేరళరాజును పాండ్యరాజును అణచివేసినాడు. అట్లాగే కృష్ణరాయలు ఇక లేడన్న ఔద్ధత్యంతో దాడి జరిపిన బిజాపురసులతానును పారద్రోలినాడు.

ఇలా సలకము తిమ్మయ అచ్యుతరాయని కంటికి రెప్పలా కాపాడుతూ రాజ్యాన్ని చూసుకుని వహిస్తున్నాడు. అయితే ఎంత సమర్థుడైనా తిమ్మయ కేవలం దండనాథుడు మాత్రమే. అచ్యుతరాయలు భోగలాలసుడు. సలకము తిమ్మయ చేత దెబ్బతిన్న రాజులందరినీ ఒకచోట చేర్చి కృష్ణరాయల అల్లుడు ఆరవీటి రామరాజు మెలమెల్లగా సామ్రాజ్యం మీద తిరుగుబాటు సలుపజొచ్చినాడు. అచ్యుతరాయలు ఆతని బాధ తప్పించుకోవడానికి ఇటుపక్క, యోగ్యులైన సామంతులనేకమంది నచ్చచెబుతున్నా  వినక విజాపుర సులతాను ఇబ్రహీం ఆదిల్షాతో చెలిమి చేయడమే కాక, అతనికి ఇరువది లక్షల వరహాల కప్పం చెల్లించుకున్నాడు. ఇదే అంతటి మహారాజ్యపతనానికి తొలి మెట్టుగా పరిణమించింది. మితిమించిన భోగలాలసతో అచ్యుతరాయలు అనతి కాలంలోనే కాలం చేసినాడు.

అచ్యుతరాయల తర్వాత -

సలకము తిమ్మయ తన మేనల్లుడు వేంకట దేవరాయని సింహాసనంపై కూర్చుండబెట్టి, రాజ్యవ్యవహారాలు తనే స్వయంగా చూడసాగినాడు. విధి వైపరీత్యం - వేంకటదేవరాయడు సింహాసనం ఎక్కిన కొంతకాలానికి మరణించినాడు.

"క్షితి ప్రతిష్టాపిత కీర్తిదేహే ప్రాప్తే పదం వైష్ణవమచ్యుతేంద్రే
అధ్యాస్య భద్రాసనమస్య సూనుర్వీరో బభౌ వేంకటదేవరాయః
ప్రశాస్య రాజ్యం ప్రసవాస్త్రరూపే విద్వన్నధౌ వేంకటరాయభూపే
అభాగదేయదచిరాత్ ప్రజానాం అఖండలావాసమదాధిరూఢే"

(ఎపిగ్రాఫికా ఇండికా)

సలకము తిమ్మయ్యే దేవరాయని చంపించాడని కొంతమంది చరిత్రకారులన్నారు. అయితే చరిత్రను మానవీయదృక్పథంతో, నిజాయితీతో, ప్రాంతీయనేపథ్యంతో పరిశీలించలేని అసమర్థ పాశ్చాత్య చరిత్రకారుల నిరాధారపు రాతలవి. ఆ తర్వాత తిమ్మయే రాజ్యానికి వచ్చినాడు. ఈ లోపల ఆరవీటి రామరాజు రాజ్యంలో ఒక్కొక్కరినీ తనవైపుకు తిప్పుకుని తిరుగుబాటు ప్రకటించినాడు. సలకము తిమ్మయ చేసేది లేక ఆదిల్షా సహాయం అర్థించినాడు. ఆదిల్షా విజయనగరానికి వచ్చి, కొన్ని రోజులు అతిథిలా ఉండి, కొంత కప్పం స్వీకరించి మరలినాడు. ఆదిల్షా మరలిన వెంటనే రామరాజు తిరిగి దండెత్తినాడు.

విధిలేని పరిస్థితులలో పరమరాజభక్తుడు, దేశప్రేమికుడు సలకము తిమ్మయ ఆత్మహత్య చేసికొన్నాడు. ఆత్మహత్య చేసుకొన్నది కూడా చేవలేక కాదు - బ్రతికి ఉంటే ఆర్వీటిరామరాజు తనచేత ఇంకే అఘాయిత్యాలు చేయిస్తాడోనన్న బాధతో మాత్రమే.

ఆర్వీటి రామారాజునే అళియరామరాజంటారు. అళియ శబ్దానికి కన్నడ భాషలో అల్లుడని అర్థం.

ఆర్వీటి రామరాజు రాజ్యం కోసం ఎన్ని కుటిలప్రయత్నాలు చేసినా శౌర్యంలోనూ, రాజసంలోనూ తగ్గనివాడు. చంద్రవంశ సుక్షత్రియుడు. ఈతడు తను నేరుగా సింహాసనంపై కూర్చొనకుండా వేంకటదేవరాయని సవతి తమ్ముని - సదాసివరాయని సింహాసనాలంకృతుణ్ణి చేసినాడు. ఆ యేడు క్రీ.శ 1543. ఈ సదాశివరాయలు పాపం చిన్నవాడు. అభం శుభం ఎఱుగని పసివాడు. రాజ్యం పేరుకు ఈతనిది కానీ అధికారం అంతా రామరాజుది.

ఆ పటుకీర్తి రామవసు | ధాధిపచంద్రుఁడు కృష్ణరాయ ధా
త్రీపతిసార్వభౌమ దుహి | తృప్రియుఁడై వితతప్రతాప సం
తాపిత ప్రియుఁడై, యల స | దాశివరాయ నిరంతరాయ వి
ద్యాపుర రాజ్యలక్ష్మికి ని | దానము తానయి మించెనెంతయున్


(రామాభ్యుదయము)

సదాశివరాయలు యేడాదికొక్కమారు మాత్రమే ప్రజలకు కనబడే వాడుట. మిగిలిన సమయమంతా నిర్బంధమే. తర్వాత్తర్వాత అదీ నల్లపూసయింది. కొంతకాలానికి ఆ సదాశివరాయలు ఉన్నాడో లేడొ ప్రజలకు తెలియకుండా పోయింది. రామరాజే మొదటినుండి ఆతని పేరు వాడుకుని తద్వారా కృష్ణరాయల వారి విశ్వాసపాత్రులయిన దండనాథులను తనవైపుకు తిప్పుకొన్నాడని, రాజ్యం చేతికి రాగానే సదాశివరాయలిని నిర్బంధించి చంపించాడని హెరాసు అనే ఆయన ఆర్వీటి చరిత్రలో వ్రాశాడు.

రామరాజు అంతటి దుర్మార్గుడు కాదని, రాజ్యసంరక్షణ భారం సమర్థంగా నిర్వహించాలన్న తలంపుతో తనే ఎక్కువగా కలుగజేసుకొన్నాడని ఇంకో కథనం. ఏదేమైనా సదాశివరాయలు అతి దురదృష్టవంతుడు నిర్భాగ్యుడు. తదనంతరం ఆర్వీటి రామరాజు కడు సమర్థంగా కొంతకాలం రాజ్యం చేసినప్పటికీ, గొల్కొండ నవాబు మల్కిభరామునితో అనవసరంగా మైత్రి చేసి చివరికి దుర్మార్గంతా తురుష్కరాజులంతా దండెత్తితే ’రాక్షసతంగడి’ అనే భయంకరమైన పోరు సలిపి వీరస్వర్గం పొందినాడు.

ఒకమహాసమ్రాజ్యం తదనంతరం ఆరునెలలు తురుష్కుల ధాటికి చిన్నాభిన్నమైంది. ఒకప్పటి విజయనగరప్రభువుల రాజధాని విద్యానగరం (హంపి కమలాపురం, ఆనేగొంది పరివర్తిత ప్రాంతం) నేటి లండను నగరమంత వైశాల్యం కలిగి ఉండినదట. ఏడు ప్రాకారాలు. తుంగభద్రమ్మ చల్లని చూపులతో, అంగళ్ళరతనాలతో అలరారి దిక్కూ మొక్కూ లేక నాశనమయింది.

ఈ సామ్రాజ్యపు విషాదాన్తానికి కారణం -
మొత్తం దక్షిణదేశాన్ని చిటికినవేలుపై ఆడించిన తిమ్మరుసయ్య,
పసివాడు సదాశివరాయలు,
రాజభక్తి పరుడైన సలకము తిమ్మయ
వీళ్ళ శాపఫలితమేనేమో!

పై ముగ్గురిలో సదాశివరాయలి తాలూకు శాసనం ఈ మల్లేశ్వరస్వామి దేవళపు శాసనం. ఆతడు నాడు అనుభవించిన దుస్థితికి ప్రతిరూపంగానే దిక్కూ మొక్కూ లేకుండా ఉంది. అపురూపమైన శిల్పాలు ఉన్నై ఈ గుడిలో. గుడికి కాస్త దూరంగా పొలాల మధ్య ఒక నాలుక్కాళ్ళ మంటపం, చిన్న దేవళం శిథిలావస్థలో ఉంది. గుళ్ళో విగ్రహాలు ఇప్పటికే కొన్ని మాయమయినాయి. ఇదొక్కటే కాక, మరి కొన్ని ప్రాచీన శాసనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వాటిపై ఎవరో బట్టలారవేసుకునే దౌర్భాగ్యస్థితి నేడు ఉన్నది.

(గమనిక: ఈ రచనలోని చారిత్రకాంశాలలో సాధికారతను దయచేసి ఆశించవద్దు. ఇవి రచయితకు తెలిసినంతమేరలోని నిజాలు మాత్రమే.)

Saturday, March 17, 2012

విహారి - ఓ మినీ లోకల్ ట్రావెలాగుడు (ఫుటోలతో)

క్రితం వారం మా ఆవిడ పనిచేసే పల్లె (నీళ్ళు లేని)తిమ్మాపురంలో ఉండినాను. ఊరికే ఉండేదెందుకని ఉబుసుపోకుండా చుట్టు పక్కన ఒక మూడు పల్లెలు తిరిగొచ్చినాను. జీవితానికి మరొక రెండు అందమైన రోజులు జతపడినాయి. నా డైరీలో ఆ రోజునాటి పేజీలు..

నీళ్ళు లేని తిమ్మాపురం ఎందుకంటే - ఎక్కడో నీళ్ళుండే తిమ్మాపురం ఇంకోటుందంట. ఆ ఊరికి ఈ ఊరికి తేడా కనుక్కునేకి జనాలు ఇట్లా పెట్టుకున్నారు.

౧. రాధాస్వామి ఆశ్రమం - గుద్దెళ్ళ

అనంతపురంలో కల్యాణదుర్గం నుండి కర్ణాటక లో పావగడకు వెళ్ళేదారి బాగుంటుంది. ఆ దార్లో దాసంపల్లి తర్వాత ములకనూరు అనే పల్లెటూరు వస్తుంది. ఈ ఊరి శివార్లలో ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు - నెమళ్ళకొండ. అవును. ఆ కొండపైన సాయంత్రం పూట నెమళ్లను చూడవచ్చు మనం. ఒక్కొక్కసారి నెమళ్ళు కనిపించవు కానీ, చాలా దగ్గర నుండి మనకు నెమళ్ళ క్రేంకారవాలు వినిపిస్తాయి. ఆ ఊరిముచ్చట్లు మరెప్పుడైనా., ప్రస్తుతమనుసరామః...

ములకనూరు నుండి కాస్త ముందుకు వచ్చి కుడివైపు మట్టిదోవ పడితే రెండు కిలోమీటర్ల దూరంలో రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ ఇరవై ముప్ఫై ఎకరాల స్థలంలో ఆశ్రమం, తోట, ఆశ్రమం వారి నిర్వహణలో ఓల్డ్ ఏజ్ హోము ఉన్నాయి. అక్కడ వారందరు వారి అన్నం వాళ్ళే పండించుకోవాలి. అది నియమం. తోటలో సపోటా, మామిడి, జామ, అరటి, కూరగాయలు, తమలపాకులు, వక్క, ఆముదం విరగ కాసి ఉన్నాయి. దాపుల్నే చేనూ ఉందట. వేరుశనగ నూర్పిళ్ళు జరుగుతున్నాయి. బెంగుళూరు మామిడి కాయలు నవనవలాడిపోతున్నాయి. ఇవి కాస్త తీపిగా ఉండి ఊరగాయకు పనికి రావు కానీ,ముక్కలు కోసుకుని కారప్పొడి, తాలింపు వేసి పెట్టుకుని పెరుగన్నంలో నంజుకుంటే స్వర్గం కనిపిస్తుంది.


ఆశ్రమానికి వచ్చిన అతిథులకు కులజాతిమతభేదం చూపకుండా ఆశ్రమవాసులు స్వాగతించి భోజనం పెడతారు. ఒకరోజు ఉండదలుచుకుంటే ఆవాసం కల్పిస్తారు. ఆశ్రమానికి దాపున ఒక కొండ వుంది. రాత్రిపూట అక్కడనుండి ఎలుగుబంట్లు దుంపలకోసం వస్తాయి. అందుకని ఆశ్రమంలో జాతికుక్కలను సాకుతున్నారు.

ఆ ఊరికి నేను, మా ఆవిడా, తన తోడి టీచరమ్మలు, అయ్యలు కొంతమంది ఆటోలో వెళ్ళాము. వెళుతూ ఉంటే దార్లో ఒక అద్భుతం జరిగింది. కొండమలుపు దగ్గర దాదాపు పది పదిహేను జింకల గుంపు. అప్పుడు సాయంత్రం ఐదున్నర.

జింకలు మట్టి రంగుకు, సూర్యుని రంగుకు మధ్య రంగులో మెరిసిపోతున్నాయి. ఆటో శబ్దం వినగానే జింకలు గెంతుతూ పరుగు పెట్టినై.  కాళిదాసు శ్లోకం గుర్తొచ్చింది.

గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యన్దనే దత్తదృష్టిః
పశ్చార్ధేన ప్రవిష్టః శరపతనభియా భూయసా పూర్వకాయమ్ |
దర్భైరర్ధావలీఢైః శ్రమవివృతముఖభ్రంశిభిః కీర్ణవర్త్మా
పశ్యోదగ్రప్లుతత్వాద్వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి ||

సూతా అదుగో చూడు! మెడను కాస్త వంచి క్రీగంట మన రథం మీద దృష్టిపెట్టి తిరిగి చూస్తూ, బాణం పడుతుందేమోనని ముడుచుకుంటూ, శ్రమవల్ల వచ్చిన ఆయాసంతో నోరు తెరిచి, గడ్డిపోచలు జారవిడుస్తూ, భూమిపైన కంటే, గాల్లోనే ఎక్కువభాగం ఉండేట్లుగా వేగంగా పరిగెత్తుతూంది.

(గ్రీవమంటే మెడ. గ్రీవాభంగమంటే మెడను తిప్పడం, గ్రీవాభంగ అభిరామం అంటే అందంగా మెడను తిప్పడం. స్యన్దనమంటే రథం)

కళ్ళకు కట్టినట్టుంది కదూ ఈ వర్ణన. ఈ సంస్కృతపద్యం అద్భుతరసానికి ఉదాహరణగా అలంకారికులు పేర్కొంటారు.
(జింక చచ్చేట్టు ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉంటే ఇందులో రసం, చారు కాచుకోవడమేం ఔచిత్యమని నాకొక అనుమానం ఉంది. మళ్ళెప్పుడైనా తీరిగ్గా ఆలోచించాలి.)

సరే మళ్ళీ బాటకు. జింకలు కెమెరా కన్నుకు దొరికినట్టు లేవు, ఒక్కటి దక్క.

తోటలో సపోటాలు, జామ కాయలు విరగకాసి ఉన్నాయి. మా ఆవిడ, తన సహచరులు ఆ తోటలో తమ షాపింగు చేసి రెండు సంచులు నింపుకున్నారు. ఆ రోజు గడిచింది.

౨. రాళ్ళపల్లి

మరుసటి రోజు పొద్దున - బండి తీసుకుని బయలుదేరాన్నేను సంహితతో కలిసి. తిమ్మాపురం నుండి కంబదూరుకు వెళ్ళేదారిలో ఒక కూడలి వస్తుంది. అక్కడి నుండి పక్కకు తిరిగితే - బొమ్మలో ఎఱుపు రంగు లైనుకు క్రిందుగా రోడ్డు కనిపిస్తూంది కదా ఆ దారిలో ఏడెనిమిది కిలోమీటర్లు వెళితే మేలుకుంట, రాళ్ళపల్లి గ్రామాలు వస్తాయి.


ఆ కొండ పైన ఒక చిన్న నీటి కొలను, దానిపక్కన ఒక చిన్న గుహ, అందులో ఎవరు ఎప్పుడు పెట్టారో తెలీని రాముల విగ్రహమూనూ. అక్కడికెళ్ళాలంటే కాస్త శ్రమపడి కొండ ఎక్కి దిగాలి. ఇది నిర్మానుష్యమైన ప్రదేశం. ఈ కొండపైన నీటికొలను, గుహలో రాముడి గురించి స్థానికులలో కూడా చాలా తక్కువమందికే తెలుసు. (ఈ ట్రెక్కింగు బ్లూస్ ఇప్పటివి కావు, పాత అనుభవాలు)


సరే మన దారికొచ్చాం.రాళ్ళపల్లి ఊరి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక నిద్రాణమైన పల్లెటూరు. ఆ పల్లెలో ఏదో ఆంజనేయస్వామి దేవళం ఉందని విన్నా కానీ, అదీ అగుపడలేదు. వెళ్ళేదారి మాత్రం చాలా అందమైనది. అరటి తోటలు, దూరంగా కనిపించే పల్లె, మేలుకుంటలో చెఱువు...

రాళ్ళపల్లి - నిజానికి ఈ పేరు చెబితే ఇప్పటికే ఒక మహానుభావుని పేరు గుర్తు రావాలి. గుర్తు రాకపోతే మాత్రం అది తెలుగువాడి దౌర్భాగ్యం.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ - ఈయన 1893 నందన నామ సంవత్సరంలో రాళ్ళపల్లిలో పుట్టారు. (ఆయన తొమ్మిదవ యేట మైసూరుకు వెళ్ళి, ఆపై అక్కడే స్థిరపడ్డారు.) ఈయన గురించి చెప్పడం కొండను గాజుముక్కలో చూపడమే.
- రేడియోకి ఆకాశవాణి పేరు పెట్టినదీయనే.
- తొమ్మిది యేళ్ళ వయసులో అమ్మ, అయ్య చెప్పించిన చదువుతో తెలుగులో మీరా అనే ఖండకావ్యం వ్రాసిన ప్రతిభాశాలి. ఆ వయసులోనే సంస్కృత శ్లోకాలు చెప్పగలిగే వారట ఆయన. ఏక సంథాగ్రాహి, బహుభాషాకోవిదుడు కూడాను.
- మనం నేడు వింటున్న అన్నమయ్య పాటల్లో వందలాది పాటలకు స్వరాలు కూర్చిన సంగీతనిధి. (ఇప్పుడిటు కలగంటి, తందనానా ఆది, అదివో అల్లదివో..ఇట్లాంటి పాటలకు ఈయనే స్వరకర్త)
- అత్యుత్తమశ్రేణి విమర్శకుడు. ఈయన విమర్శ ఎంత నిశితమంటే, ఆయన తెనిగించిన రఘువంశకావ్యాన్ని (పదిహేడు సర్గలు), ఆయనే విమర్శించుకుని చించి వేశారు.
- వందలాది పీఠికలు వ్రాశారు. జాయపసేనాని వ్రాసిన నృత్తరత్నావళి సంస్కృత కావ్య అనువాదకర్త.
- అనేక గ్రంథాల పరిష్కర్త.

రాళ్ళపల్లి కాస్త నిరాశ కలిగించింది. అంతటి మహానుభావుడు పుట్టిన ఊరన్నట్టు లేకపోగా, ఆయనకు ప్రేరణ కలిగించినదేదైనా కనిపిస్తుందనుకుంటే అదీ లేదు.

తిరిగి వచ్చేప్పుడు, సంహిత,నేను సంహిత వాళ్ళమ్మకు చెప్పకుండా కొన్ని పనులు చేశాం. చింతచెట్ల చేతికి కొమ్మలు అందేట్లుగా కనిపిస్తే వాటిని పట్టి ఊపుకుని కాయలు రాల్చుకుని తిని, పక్కన పొలం గట్లలో పైపులో నీళ్ళు కడుపునిండా తాగేసొచ్చాం.