Tuesday, March 27, 2012

భోజనప్రలాపం

...అనే తిండిగోలను చాలకాలం తర్వాత నా బ్లాగులో చెప్పుకోవాలనిపించి రాస్తున్నాను.

దీనికి శ్రీకారం చుట్టించినాయన శ్రీనాథుడు. అవును. ఈ మధ్య శ్రీనాథ కవిసార్వభౌమ అనే ఎన్టీవోడి సినిమా డీవీడీ లో చూశాను. సినిమా గురించి నా అభిప్రాయం చెప్పను కానీ, అందులో శ్రీనాథుడు తిండిపై కూసిన పద్యాలు విన్న తర్వాత నా చెవులలో చిమ్మిరేగింది.

నేటి సారస్వతవిమర్శకులు కవిహృదయం ఎఱుగకుండా సాహిత్యం మీద విమర్శించిన రీతిలో - ఎంతసేపూ జొన్నన్నం మీద నోరు చేసుకునేకే సరిపోయింది కానీ అసలు జొన్నలలో స్వారస్యం కనుక్కుందామనే ఆలోచన ఆయనకు లేకుండా పోయింది.

శ్రీ కృష్ణుడా, పూతన చన్నులచేదు తాగినాను, దవాగ్ని మింగినాను అని చెప్పబాకు, ఉడుకు చింతాకు బచ్చలి కూర జొన్నకూటితో ఒక ముద్ద తినిచూడు నీ పస కనిపిస్తుంది - అట.

బహుశా ఆయనకు జొన్నన్నమో, జొన్నరొట్టో చేసిపెట్టినావిడ మెత్తగా చేసి ఉండదు. అంతే తప్ప జొన్నరొట్టె, చింతచివురు పప్పు ఒకసారి మా సీమకొచ్చి తిని చూడు అని స్వర్గానికి వినిపించేలా చెప్పాలనిపించింది.

చెల్లవు, సార్వభౌమ! కడు చెన్నగు భోజన సౌఖ్యమందినా
డల్ల సుభాగ్యముల్ గొనితి టంచును నిక్కెదవేమొ! తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు పప్పును మెత్తని జొన్నరొట్టెతో
మెల్లగ యొక్క ముక్క దిగ మ్రింగుమ! మోక్షము కానవచ్చెడిన్.

(చిన్న మాట. జొన్నరొట్టె పై పద్యంలాగా ఏడ్సినట్టు ఉండదు. శ్రీనాథుని పద్యం లానే ఉంటుందని మనవి)

ఒక్క చింతాకు పప్పేమిటీ, గుత్తివంకాయ కూర, పెరుగు, కారప్పొడి కాదేదీ జొన్నరొట్టెతో నంజుడుకనర్హం. శ్రీనాథుల వారు ఇంతటితో ఎలానో ఆగారు రాగి ముద్దపైనా, లేదా గోంగూర డ్రగ్ మీదా ఏమీ అనలేదు. శుభం. (గోంగూర ’డ్రగ్’ ఎందుకంటే నాకు ఓ మారు సరైన గోంగూర పచ్చడి తగిలి రుచి చూడ్డం జరిగితే ఆ తర్వాత భోజనానికి అది లేకపోతే ప్రాణం పోయినట్టు ఉంటుంది.)

శ్రీనాథుని మీద పై పద్యం ద్వారా చేయి చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న డవుటొచ్చింది. శ్రీనాథుడు తిన్నది జొన్నన్నము కదా, జొన్నరొట్టె గురించి అప్పటికి తెలియదేమోనని. కానీ ’రొట్టె’ శ్రీనాథుని కాలం నాటికి ఉన్నది. సాక్ష్యం -

ఉలుమిడి చెక్కయున్, మిగుల నొక్కయుఁ జప్పని రొట్టెముక్కయున్
మలినపు గుడ్డలున్, నులుక మంచపుఁ గుక్కియుఁ, జీరటిల్లునుం
దలఁచిన రోఁత వచ్చు, నొకనాఁటి సుఖం బొకయేఁటి దుఃఖమీ
పలివెల వారకాంతల యుపస్థలకున్ బదివేల దండముల్.

హిందీ రోటీ - తెలుగులో రొట్టె అయిందని నా ఊహ. కానీ శ్రీనాథుని కాలానికి రొట్టె తెలిసిందంటే యేమో!

భోజన విషయంలో ఈయనకు స్వ-పర భేదాలు లేవన్నట్టు తెలుస్తూంది. మరో పద్యంలో తమిళులవంటను ఆడిపోసుకున్నాడు. మొట్టమొదటనే మిర్యపుచారు చెవులలో పొగరేగేటట్టు వడ్డిస్తారట. ఇలా మొదలెట్టి అరవ వారి విందెల్ల యాగడంబు అంటాడీయన.

నిజానికి తమిళుల ఇళ్ళల్లో చప్పని పప్పు, నేయి వడ్డించడం కొన్ని చోట్ల నేను గమనించాను. అలాగే మరికొంతమంది ఇళ్ళల్లో పప్పుతో బాటు పెరుగుపచ్చడి కలిపి భోంచెయ్యడం ఒక ఆనవాయితీ. శ్రీనాథుడు చెప్పే సాంబారు కూడా అంత అన్యాయమేమీ కాదు. ముఖ్యంగా ములక్కాడల సాంబారు. ఇదంతా చూస్తూంటే శ్రీనాథుడు బెంగాలీ వాళ్ళలాగా పొద్దున లేచి స్వీట్లు, కాఫీలో వెన్న తగలెట్టుకుని తాగే రకమా అని ఒక అనుమానం వస్తుంది. మరీ కొంచెం కూడా ఘాటు తింటున్నట్టు ఎక్కడా లేదు, బాపు సినిమాలో మాత్రం "ఆవ ఠేవ" ఏదీ? అని ఆయనతో అనిపిస్తాడు దర్శకుడు. నిజానికి ఆవకాయ ఆయన కాలానికి లేదు. ఊరుగాయ - అంటే ఉప్పునీటిలో ఊరవేసిన కొన్ని కాయలు అనే కాన్సెప్టు 15 వ శతాబ్దానికి కానీ రాలేదు. ఆ తర్వాత 18 వ శతాబ్దానికి కానీ మిరపకాయ భారద్దేశానికి రాలేదు. అది శ్రీనాథుని సినిమాలో బాపు చేసిన చందోభంగం.

ఇందాక సాంబారు అంటే గుర్తొచ్చింది. మా ఊళ్ళో ఓ మారు నాగఫణిశర్మ గారి అవధానం జరిగింది. అందులో దత్తపదిలో భాగంగా సాంబారు, పూరీ, వడ, దోస లతో శివుణ్ణి వర్ణించమన్నారు. నాకు పద్యం గుర్తు లేదు కానీ, సాంబా! రుద్రా! అని చివరిపాదంలో రావడం గుర్తుండిపోయింది.

తమిళులు అన్నారు కాబట్టి ఇంకొంచెం దూరం వెళ్ళి మలయాళీలనూ పలకరించి వద్దాం. మలయాళీల సాంబారు/పులుసు/గ్రేవీ కూర పేరు ’అవియల్’. దీని వెనుక టెక్నాలజీ నాకు తెలీదు కానీ, ఇందులో ముక్కలను నిలువునా కోసి తగలెడతారు (అదేనండి పొయ్యిమీద పెడతారు). అంటే కేరట్ ముక్కలు రౌండు రౌండుగా కాక కాస్త పొడుగు పొడుగు ముక్కలుగా అన్నట్టు. అరటి, కేరట్టు, కంద, గుమ్మడి ఇత్యాది కూరగాయల కలగలుపుగా ఈ వంటకం తయారు చేస్తారు. ఇక మలయాళీల పేటెంట్ కొబ్బరినూనె తప్పనిసరి. ఈ వంటకం చేసేప్పుడు వంటగది వైపుకు వెళ్ళటం రిస్కు. కొబ్బరి నూనె ఉడికేప్పుడు వచ్చే వాసన భరించవలసి వస్తుంది. అయితే సరిగ్గా చేస్తే దీని రుచి - "న్యాన్ ఎంద పరయుమ్!" - అంతే. ఈ అవియల్ మలయాళీల పండుగ ఓణం కు చేసే వంటకాల లిస్టులో ఒకటి. ఆ విందును ’సద్య’ అని అందురు. దాని గురించి మరెప్పుడైనా.

ఈ మధ్య నా వెరైటీ తిండిగోలతోటి నా శీర్షం మీదికి తెచ్చుకున్నాను. బెంగళూరు బ్రిగేడు రోడ్డులో నీలగిరి దుకాణాని కెళ్ళానో మారు. అక్కడ ఎండబెట్టిన తామరతూళ్ళను చూశాను. (తామరకళంగు వరువల్) వాటిని ఫ్రై చేసుకుని తినాలట. వాటిని ఇంటికి తెచ్చి మా ఆవిడకు ఆర్డరిచ్చాను. మా పాప తమ్మి (సంహిత) మొదటి ముక్క బానే తిన్నది. ఆ తర్వాతి ముక్కకు దానికి ఖోపం వచ్చేసింది. మా ఆవిడ డవుటు పడి దారుణాయుధాలు ప్రయోగించకముందే మిగిలిన వాటినన్నిటినీ బలవంతంగా తినవలసివచ్చింది.

ఇక్కడ దుర్భాగ్యనగరం హైటెక్ సిటీ నుండి లోపలకు వచ్చే దారిలో అవియల్ పేరుతో ఒక రెస్టారెంటు ఉంది. అక్కడ అవియల్ చేస్తారో లేదో తెలియదు.

ఈ అవియల్ ను తమిళులు (ముఖ్యంగా తమిళబ్రాహ్మలు), మలయాళీలు భోజనంలోనే కాక ములగాకు అట్టుతో కలిపి తింటారు.

శ్రీనాథుడు ఇవన్నీ తిని డెఫినిట్ గా ఉండడు. మనకా అవకాశం ఉంది. ఉపయోగించుకుందాం. తిని ఉండబట్టలేక ఇలా వాగుదాం.

11 comments:

 1. "చెల్లవు, సార్వభౌమ! కడు చెన్నగు భోజన సౌఖ్యమందినా
  డల్ల సుభాగ్యముల్ గొనితి టంచును నిక్కెదవేమొ! తింత్రిణీ
  పల్లవ యుక్తమౌ నుడుకు పప్పును మెత్తని జొన్నరొట్టెతో
  మెల్లగ యొక్క ముక్క దిగ మ్రింగుమ! మోక్షము కానవచ్చెడిన్.'

  ...వహ్వా!వహ్వా! జిహ్వని జివ్వుమనిపించారు!

  ReplyDelete
 2. "పల్లవ యుక్తమౌ నుడుకు పప్పును మెత్తని జొన్నరొట్టెతో
  మెల్లగ యొక్క ముక్క దిగ మ్రింగుమ! మోక్షము కానవచ్చెడిన్."

  హహహ! అయితే ఎప్పుడో మీ యింటికి వచ్చి ఆ మోక్షాన్ని చవిచూడాల్సిందే! :-)

  "శ్రీనాథుడు బెంగాలీ వాళ్ళలాగా పొద్దున లేచి స్వీట్లు, కాఫీలో వెన్న తగలెట్టుకుని తాగే రకమా అని ఒక అనుమానం వస్తుంది. మరీ కొంచెం కూడా ఘాటు తింటున్నట్టు ఎక్కడా లేదు"

  హతవిధీ! ఎంత మాటనేసారు! అతనికి నచ్చనివాటి గురించి తప్ప నచ్చిన వంటకాల గురించి చాటువులెక్కడా పుట్టించినట్టు లేదు. అతని కావ్యాలలో అక్కడక్కడా ఉన్న భోజనప్రసక్తి పరికిస్తే ఏమైనా తెలియవచ్చు.

  "నిజానికి ఆవకాయ ఆయన కాలానికి లేదు. ఊరుగాయ - అంటే ఉప్పునీటిలో ఊరవేసిన కొన్ని కాయలు అనే కాన్సెప్టు 15 వ శతాబ్దానికి కానీ రాలేదు. ఆ తర్వాత 18 వ శతాబ్దానికి కానీ మిరపకాయ భారద్దేశానికి రాలేదు. అది శ్రీనాథుని సినిమాలో బాపు చేసిన చందోభంగం."

  ఇది కచ్చితంగా చెప్పలేం. శ్రీనాథుని కావ్యాలలో ఊరగాయ ప్రసక్తి ఉంది, కాబట్టి ఊరగాయ అప్పటికే ఉండి ఉండాలి. కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో ఆవ పెట్టి చేసిన పచ్చళ్ళ ప్రస్తావన ఉంది. కాబట్టి ఆవపిండిలో ఊరబెట్టిన ఊరగాయలు ఆ కాలానికే ఉండే అవకాశం ఉంది. మిరపకారం బదులు మిరియాలకారం వాడేవారేమో! మనకి మిరపకాయ కొత్తది కాని ఆవ పాతదే కదా.

  ReplyDelete
 3. ఈ పొద్దున్నే కొందామని చూస్తే చిప్పెడు తింత్రిణీ పల్లవములు ఇరువది రూకలు మాత్రమే అందా అమ్మి. :( సీసమంటే శ్రీనాధుడే -- అనడం తప్పన్న వేయిపడగల వాడి మాటపై మీ భావనేమిటి?

  ReplyDelete
 4. >>హహహ! అయితే ఎప్పుడో మీ యింటికి వచ్చి ఆ మోక్షాన్ని >>చవిచూడాల్సిందే! :-)

  అంతకన్నానాండి :)

  >>అతని కావ్యాలలో అక్కడక్కడా ఉన్న భోజనప్రసక్తి పరికిస్తే ఏమైనా తెలియవచ్చు

  కప్పురభోగి వంటకము - లక్కావజ్ఝల మెస్సు ఈయనదేనని ప్రభాకరశాస్త్రి గారి మాటకదండి?అందులోనూ గుప్పెడు పందార అంటాడు! ఇంకా హరవిలాసంలో సిరియాళుని కథలో శివుని భొజనంలో ఈయన టేస్టు ఉంది. ఆ పద్యం ఇప్పుడు గుర్తులేదు.

  ఊరగాయలు - అంటే ఉప్పునీటిలో ఊరవేసినకాయలని, మన పచ్చళ్ళు ఆ కాలానికి లేవన్నట్టు నిడదవోలు వెంకటరావు గారనుకుంటాను ఒక వ్యాసం వ్రాసినట్టు గుర్తు. కృష్ణదేవరాయవైభవం అనే పుస్తకంలో ఈ వ్యాసం ఉంది. ఇదే మాటను కొంతమంది కవులు చెబుతున్నారు. మిరియాల కారం ఉన్నది. తిరుమలరామచంద్ర గారి పుస్తకమూ రెఫర్ చేయాలి.

  ReplyDelete
 5. @drpen గారు: మీరు జొన్నరొట్టెకు పంఖాయేనన్న మాట.
  @ఫణి గారు: అయ్యో! అంతేలెండి మొన్న ఉగాదికి బెంగళూరులో వేప్పూత పదిరూపాయలకు అమ్మారట.
  శ్రీనాథుని సీసం - నాకు అంత అవగాహన లేదండి. అయితే ఆయన మాత్రమే వ్రాయగలిగిన సీసాలు కొన్ని ఉన్నాయి. అది శిల్పం అని చెప్పవచ్చునేమో. వ్యక్తిగతంగా నాకు ప్రాచీన కవులలో పోతన, పెద్దన అభిమానులు.

  ReplyDelete
 6. మీ టపా మంచి విందుభోజనంలాగా ఉంది.

  ఇన్నాళ్ళకి శ్రీనాథ కవిసార్వభౌమ సినిమా చూశారా? ఆ సినిమా రిలీజైన రోజే నేనూ, ఓ ఫ్రెండూ వెళ్ళాము. మా హైస్కూలు తెలుగు మాస్టారు కూడా ఆదరాబాదరాగా మొదటిరోజే సినిమాకొచ్చేశారు, మళ్ళీ ఉండదేమో అని. సినిమా మటుకు చాలా --- అండీ...

  జొన్నరొట్టెలకోసం కామేశ్వర్రావుగారి పక్కన నా(మా)కూ ఓ ఆకు వెయ్యండి! కావాలంటే గోంగూర డ్రగ్స్ ఫ్రీగా ఇప్పిస్తా...

  అవియల్, చాలాకాలం క్రితం మద్రాసులోని బంధువులదగ్గరనుంచి వచ్చి మా ఇంట్లో తిష్ఠ వేసుకుంది. నేనూ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇరగదీసేవాణ్ణి. లండన్లో ఓ ఫ్రెండు బర్త్ డే పార్టీలో చేస్తే జనాలు వహ్వా అన్నారు. పెళ్ళయ్యాక మళ్ళీ గరిటె పట్టుకోలేదనుకోండి.

  కొత్తురొట్టి అని ఓ మళయాళ వంటకం అనుకుంటా, లండన్లో ఓ రెస్టారెంటులో తినేవాళ్ళం. మీకేమైనా తెలుసా?

  ReplyDelete
 7. సరదాగా సాగింది భోజనాల గురించి మీ ప్రసంగం. ఐతే ఒక మనవి. శ్రీనాథుడు ఆయా వంటకాలని తినవలసి వచ్చినప్పుడు తనకు నచ్చవు కనుక ఎలా కసి తీర్చుకున్నాడో అన్న దానికి మీరు సెటైరు వ్రాశారు బావుంది. మరి ఎందుకన్నారో కానీ హైదరాబాదుని భాగ్యనగరం అనకపోయినా పర్లేదు ఎందుకండీ అలా పేరు చెడగొట్టి పిలిచారు? ఇంకో బ్లాగులో ఎక్కడో కూడా చూశాను ముందు "అ" చేర్చి పిలవడం. హైదరాబాదు ఎంతమందికి, ఎన్ని ప్రాంతాల సంస్కృతుల వారికి జీవిక ఇచ్చిందో. అన్ని సంస్కృతుల సత్ప్రభావాలతో ఎంతమంది జీవితాలు ఎంత పరిపూర్ణమయ్యాయో. దేశం నలుమూలల నుంచీ వచ్చి స్థిరపడి మరీ "నాకు నచ్చదు" అనే వారిని చూసి బాధ వేసేది నా చిన్నప్పుడు. ఈ మధ్య బ్లాగుల్లో మనవారే మరీ ఇలా :(

  ReplyDelete
 8. లలితాజీ: నాకు హైదరాబాదు అంటే ఇష్టం లేదని ఎందుకనుకున్నారు? నాకు ఇది ఫేవరెట్ నగరం. అయితే ఇప్పుడిది నా దృష్టిలో దుర్భాగ్యనగరమే, ఖచ్చితంగా. ఇప్పుడు నాకు అనవసరమైన విషయాలతో గొడవపడే ఓపికలేదు కాబట్టి వదిలెయ్యండి.

  అయినా నేనేమీ ప్రవక్తను కానండి. అతి సాధారణమైన వ్యక్తిని. నా అభిప్రాయాలతో లోకం మారిపోదు. నా అభిప్రాయాలు పరమప్రామాణికాలు కావు.:)

  నాగమురళి: నేనూ మొదట్రోజే చూశానండి. కానీ అప్పట్లో మూడు బాక్సుల సినిమా 1,2,3 వరుస మార్చి, 1,3,2 వరుసలో ఆడించారు. ఒకటే కన్ఫ్యూజన్. అందుకని పెద్దగా గుర్తు కూడా లేదు.

  అవశ్యం. ఈ సారి ఎప్పుడైనా వీలుచూసుకుని ఒక ట్రిప్పు వేద్దాం లెండి.:)

  కొత్తురొట్టి పేరు విన్నాను కానీ, అంతగా తెలీదండి. తెలుసుకోవచ్చు.నాకు తెలిసిన కొన్ని - అవియల్, మిళహు కుట్టాన్, మొళగూటల్, కూట్టు, తైర్ పచ్చడి, అడప్రదమమ్,చెక్కై వరట్టి ఇత్యాదిభిః :)

  ReplyDelete
 9. జొన్నలు పిండి చేయుదము, సోకుకిరీటము తీసి వంగ, నా
  నున్నని మేను చీల్చెదము, నొవ్వక నాలుగు ముక్కలొప్పగన్
  సన్నని యుల్లి, దంచిన మసాలలు కూర్చిక; జొన్నరొట్టెలో
  వెన్నను పూసి తిందుమిక; వేడిన వారికి కొంత బెట్టుచున్.

  :)

  ReplyDelete
 10. @లక్ష్మీ దేవి గారు: జొన్నరొట్టె పాఠం పద్యంలో. :)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.