Saturday, November 1, 2014

డైరీలో ఒకరోజు...

కాలం....

ఏది సంస్కృతమై, సుపరిష్కృతమై ఉంటుందో అది మాత్రమే కాలానికి లోబడి ఉంటుంది. Only products are definable in the realm of "time". మరొక విధంగా చెబితే - ఏవి ఉత్పన్నములై, నశిస్తాయో వాటికే అతీతం (భూతకాలం), అనాగతం (భవిష్యత్తూ) ఉంటాయి. ఉత్పన్నములు, నశ్యములు కానివాటికి వర్తమానం తప్ప మరొక కాలం లేదు. అవి ప్రత్యుత్పన్నములు. క్షణక్షణానికి రంగులు మార్చే ఆకాశం, కణకణానికి రూపు, రంగూ మార్చే మేఘమాల, మట్టివాసనా, సముద్రపు అల.........భవమూ....

అతీతమూ, అనాగతమూ లేక, భవం లో మాత్రమే మనగలిగిన మహానుభావులను ద్రష్టలు అంటాం. వీరికి ప్రతిక్షణమూ వినూత్నమైనది. ఇది భూతకాలపు తెరలతో, భవిష్యత్కాలంపై భయంతోనో, లాలసతో కూడిన చూపు కాదు. ప్రతి క్షణాన్ని, తనదైన క్షణంగా చూడగలిగిన ఒక విస్పష్టమైన దృష్టి. ఇలాంటి సంబుద్ధత్వం పొందిన మహానుభావులు నూటికో కోటికో ఒక్కరు. ఏ సిద్ధార్థుడో, యే జిడ్డు కృష్ణమూర్తో....

అతి సాధారణమైన మనుషులకూ ఒక్కొక్కసారి అపురూపమైన ’భవం’ ఒక చల్లటి స్పర్శలా తాకి కాలగర్భంలో ఘనీభవించి అనుభవం గా,అనుభూతిగా మిగిలిపోతుంది. అలాంటి ఒక రోజు...

కార్తీక మాసం మూడవరోజు, ఆదివారం...

****************************

తెల్లవారు ఝామున ఆరున్నర. కరెంటు పోయి, ఫేను ఆగిపోతే, నిద్రలో జోగుతూ లేచి తలుపు తీయగానే చల్లటి గాలి,వర్షపు చినుకులూ ఘుప్పుమని తాకాయి. అప్పటికే సంహిత నిద్ర లేచి, మేడనుండి దిగివచ్చింది. అమ్మా నాన్నలిద్దరికీ లేని ’పొద్దున పూట నిద్రలేవడం’ అనే పాడు అలవాటు దానికి జేజి దగ్గర్నుంచో, అమ్మమ్మ దగ్గర్నుంచో వచ్చినట్టుంది! 

ముందు రోజు రాత్రి పడిన వర్షమూ, పొద్దున పూట చలి తాలూకు మంచూ, మట్టివాసనా, దూరంగా వినిపిస్తోన్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి విష్ణుసహస్రనామమూ, నిన్నటి రాత్రి వర్షం జామకాయపై చేసిన కాకి ఎంగిలీ..... 

తులసి కోటను పరామర్శిస్తూన్న గుమ్మడిపాదు... వాతః (గాలి) అంటే వాహకంగా పనిచేసేదిట. చల్లదనాన్ని, చిక్కటి సువాసననూ తీసుకొస్తోంది పెరటి గాలి. మా పెరడు ప్రతి ఉదయంలాగే పారిజాతం పూల సువాసనలతో ఘుమాయిస్తోంది. పూలు ఒక గిన్నెలో ఏరడం మొదలెడితే, ఒక గిన్నె నిండా సమకూరినాయి. వెన్నముద్దను గిన్నెలో పెట్టినట్టు ఉంది ఆ పాత్ర. 

పక్కకొస్తుంటే - వర్షపు చినుకులతో తడిచిన పచ్చటి ఆకుల మధ్య ఎర్రటి పువ్వొకటి కనబడింది. అది జపాకుసుమం......కాదు కాదు, Hibiscus flower.

అది గిన్నెపైన చేరింది. 

****************************

ఓ గంటా, గంటన్నర తర్వాత...

 సన్నగా వర్షం మొదలైంది. పారిజాతపూలతో పూజ చేయాలి. రోజూ వస్తున్నదే అది, అయితే కల్పద్రుమాణాం పారిజాతః - పారిజాతమే ఒక కల్పవృక్షమూ, సాక్షాత్తూ భగవంతుని నివాసమైనప్పుడు, మరెక్కడ పూజ చేయాలి? పారిజాతాలతో పారిజాతం చెట్టుమూలాన్ని సంహిత ఇలా అలంకరించింది.

****************************

అగ్గలమౌ యాకలి కిక
తగ్గని మహగొప్ప మందు తడబడుటేలా?
సిగ్గెందుకు? దంచి కొడుదు 
నుగ్గాణికి సాటి యేది ఉర్విని కంటే!

మీరు ఉగ్గాణి (వీలైతే వేడి మిరపకాయబజ్జీతో బాటు) తినకపోయి ఉంటే, రాయలసీమ కు వెళ్ళడం సంభవిస్తే, ఉగ్గాణి అన్న పదార్థాన్ని మాత్రం రుచి చూడకుండా వెనుదిరక్కండి. తిరపతి లడ్డూ తినకపోవడం కన్నా కొంచెం చిన్న సైజు పాపం రాయలసీమ కు వచ్చి ఉగ్గాని తినకపోవడం. ఈ పాపానికి నిష్కృతి లేదు బాబూ, నిష్కృతి లేదు. (ఈ డైలాగు గుమ్మడి వాయిస్ లో ఊహించుకుని చదువుకోండి) 

పరమపదసోపానపటంలో ఓడిపోతేనేం? ఉగ్గానితో పరమపదం చేరుకున్నాక? 

అన్నట్టు మీకు పులి మేకా ఆట తెలుసా?

****************************

బయట వర్షం ఓ మోస్తరుగా కురుస్తూనే ఉంది. పైన డాబా లో చేరి, తూము నుంచి కిందకు వచ్చిన వర్షం నీళ్ళను మా పెరట్లో చెట్లకు పోస్తూ, వర్షంలో తడిస్తే జ్వరమొస్తుంది అన్న డిఫైన్డ్ ప్రాసెస్ కు కట్టుబడి కోపంతో ఉడికిపోతున్న మా ఆవిడను ఉడికిస్తూ ఓ గంట వర్షంలో బాగా నానిన తర్వాత లోపలికి వచ్చేశాను. 

****************************

ఉన్నట్టుండి ఎండ మొదలైంది. కాసేపటికి చురచురమంటూంది. సరిగ్గా ఇలాంటప్పుడు చెట్టు కిందనిలబడి చెట్టును కుదిపి, ఆ వర్షం చినుకులు మీదపడితే ఎలా ఉంటుందోనని ’మేర్లపాక మురళి’ అనే  శృంగార (సెమీ బూతు) రచయిత శృంగారపురం ఒక కిలోమీటరు అనే ఒక నవల్లో  చెప్పాడు. అది ఒక అందమైన పక్కింటమ్మాయిని ముద్దుపెట్టుకున్నట్టు ఉంటుందిట. నిజమో అబద్ధమో అనుభవజ్ఞులకే తెలుసు.

నిమ్మచెట్టు కిందికెళ్ళి చెట్టును ఊపగానే చినుకుల సంగతేమో కానీ నిమ్మముల్లు వచ్చి చేతికి తగిలి చెయ్యి చురుక్కుమంది. వెధవ ఆలోచనలకు పర్యవసానం ఇలాగే ఉంటుంది.  

ఇంతలో సీతకోకచిలుకల జంట ఒకటి తయారయింది. ఈ మధ్య ఈ జంట తెగ తిరుగుతోంది మా పెరట్లో. ఆ జంటలో ఒక దాన్నైనా పట్టుకోవాలని చాలా సేపు ట్రై చేస్తే ఒక్కటీ దొరకలేదు. కానీ మాంఛి టైమ్ పాస్.  అన్నట్టు సీతాకోకచిలుక రెక్కలను ముట్టుకుంటే వచ్చిన మసి/మరకను బెట్టు పెట్టుకుంటే మంచిగ చదువొస్తుందంట. సంహిత ఫ్రెండు చెబితే నాకు చెప్పింది. 

****************************

సాయంత్రం - మూడు.

1926 లో రాయలసీమలో పప్పూరు రామాచార్యులు అనే మహానుభావుని సంపాదకత్వంలో ఒకానొక పత్రిక మొదలయ్యింది. ఆ పత్రిక పేరు శ్రీ సాధనపత్రిక. ఎలాగైతే భారతి పత్రికను మన ఆంధ్రదేశపు సాంస్కృతిక వారసత్వంగా మన్నిస్తామో, అలాగే శ్రీ సాధన పత్రిక రాయలసీమ తాలూకు సాంస్కృతిక భారతి. చిలుకూరు నారాయణరావు "దత్త మండలాలు" అన్న పేరును నిరసిస్తూ వ్రాసిన పద్యాలు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, గోపాలకృష్ణశర్మ ప్రభృతుల వ్యాసాలు, విద్వాన్ విశ్వం గారి అనేక రచనలూ, ఇంకా నాటి సీమ రచయితల గొప్ప కథలు, కవితలూ, ఇలా ఎన్నిటినో కలబోసుకుని, చాలా యేళ్ళు వెలువడిన పత్రిక ఇది. ఈ పత్రిక కాలగర్భంలో కలిసిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో అనంతపురంలో ప్రెస్ క్లబ్ లో, మరి ఒకరిద్దరి వద్దా, ఈ పత్రిక దాదాపుగా చినిగి పోతున్న దశలోని కాపీలు దొరికాయి. వీటి గురించి ఆరాటపడి స్కాన్ తీసిన వారు హరినాథరెడ్డి గారనే ఒక ఉపాధ్యాయుడు, ప్రెస్ అకడెమీ వారు, నాగరాజారావు గారనే వయోవృద్ధులు.

మా మిత్రులు కోడిహళ్ళి మురళీమోహన్ ప్రేరణతో ఆ రోజు నాగరాజారావు గారిని కలుసుకోవడం మర్చిపోలేని అనుభూతి. ఆయనను అదివరకే ఓ మారు కలిసినా, ఈ సారి చక్కగా మాట్లాడే అవకాశం కలిగింది. ఆయన ఒక్క సమాచార నిధి. 

సాధన పత్రిక కాపీలను మురళీమోహన్ గారు ఒక వెబ్ సైట్ లో పెడుతున్నారు. ఆ వెబ్ సైట్ ఇది.

http://sreesadhanapatrika.blogspot.in/

****************************

తిరిగి ఇంటికి వచ్చే సరికి వాతావరణం సరిగ్గా, ఎండకూ, వర్షానికి చలికి మధ్యలో ఉంది. దానికి తార్కాణమన్నట్టు మూడురంగుల మేఘాలతో ఆకాశం అలంకరించుకుంది. 

మా పాపను తీసుకుని బండిలో అలా ఓ మారు తిరిగి వచ్చేసరికి చీకటిపడింది. ఏ నాటకానికైనా చివర తెర పడాల్సిందేగా! 

రోజు మాత్రమే కరిగిపోయింది. ఆ పరిమళం తాలూకు అనుభూతి మనసు పొరలలో మనోజ్ఞమైన భావంగా అలానే ఉంది.

"భావస్థిరాణి జననాంతరసౌహృదాని".