Saturday, March 28, 2009

షాడో ఇన్ రిసెషన్ (షాడో ఉగాది థ్రిల్లర్)

(ఇందులో పాత్రలు, ప్రదేశాలు, సంఘటనలు కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కావు)

ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో బిందుతో కలిసి షాపింగ్ చేస్తున్నట్టు, బిందు తన క్రెడిట్ కార్డ్ తూట్లు పడేలా బట్టలు, ఎలెక్ట్రానిక్ సామాన్లు, అదీ, ఇదీ సర్వం పర్చేస్ చేస్తున్నట్టు దారుణమైన కలగన్నాడు షాడో. నాలుక పిడచగట్టుకుని పోతుండగా మెలకువ వచ్చేసింది. తను పనిచేస్తున్న కంపనీలో రిసెషన్ అవడంతో, పని ఉండట్లేదీ మధ్య. సరే అని మధ్యాహ్నం ఓ కునుకు తీశాడు తను. తనకు కులకర్ణి గారి మేనకోడలు బిందుతో ఈ మధ్యనే పెళ్ళయింది. దాంతో, అప్పటి వరకు తనతోడు ఉన్న అదృష్టదేవత ముఖం చాటు చేసింది.

విపరీతమైన ఆలోచనలతో కందిరీగల తుట్టెలా తయారయింది మెదడు. ఇక లాభం లేదు, కాఫీ తాగాలి అని లేచి, ఈ మధ్యనే ఆఫీసు గాళ్ళు కాఫీ మిషన్ని కూడా లే ఆఫ్ (లేపివేయుట) చేశారని గుర్తొచ్చి ఆగిపోయాడు. ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది షాడో నాసిక నుండీ. అప్రయత్నంగా ఆలోచనలు రెండు రోజుల వెనక్కి పరుగులు తీశాయ్.ఆ రోజు ఉగాది...

"బారెడు పొద్దెక్కినా దున్నలా పడుకోవడం తప్ప, ఏనాడైనా ఓ పండుగ పబ్బం జరుపుకున్న మొఖమేనా ఇది?" అంటూ ముఖంపై బకెట్ తో బిందు చల్లబోతున్న నీళ్ళను, ఆఖరు క్షణంలో దిండు అడ్డు పెట్టుకుని నేర్పుగా కాచుకున్నాడు షాడో. జారిపోతున్న లుంగీని సవరించుకుంటూ టాయిలెట్ వైపుగా పరుగులు తీశాడు. నలిగిపోయిన సిగరెట్ వంక అసహ్యంగా చూస్తూ, ఓ కొత్త సిగరెట్ వెలిగించుకుని, కాల కృత్యాలు తీర్చుకుని, స్నానం ముగించాడు.

బ్రేక్ ఫాస్ట్ టేబుల్ ముందు తగుదునమ్మా అని పొద్దునే తయారయారు కులకర్ణి గారు. కనుబొమల మధ్య నుంచీ గుర్రుగా చూస్తున్న ఆయన చూపులను పట్టించుకోనట్టే నటిస్తూ, సిగరెట్ వెలిగించుకున్నాడు షాడో. గప్పు గప్పున ఇడ్లీలను ఒక్కొక్కటే లాగించేస్తున్నారు కులకర్ణి గారు.

ఇంతలో బిందు ఉగాది పచ్చడి తీసుకుని వచ్చింది. వస్తూనే, "ఫ్రిజ్ పాడయిపోయింది, కొత్తది కొనాలి. అలానే టీవీ కూడా. వాటితో బాటు బట్టలు. వీటన్నిటి కోసం సాయంత్రం షాపింగ్ మాల్ కు వెళుతున్నాం" కామ్ గా అనౌన్స్ చేసింది. గుండెలపై పదిటన్నుల బండరాయి పడ్డట్టు ఉక్కిరిబిక్కిరయాడు షాడో. అసలే రెసెషను. ఉంటుందా, ఊడుతుందా అన్నట్టున్న ఉద్యోగం. పైగా తనపాలిటి శనిలా ఈ కులకర్ణి గారు. ఈ పరిస్థితులలో ఇలా షాపింగు కార్యక్రమాలు. వద్దని చెబితే వినే రకమేనా ఇది? పొద్దున లేచి తను ఎవరి మొఖం చూశాడో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.

గుర్తుకు రాకపోవడంతో విసుగ్గా తల విదిల్చి టీవీ ముందు సెటిలయాడు.

టీవీలో ఓ ధృఢకాయుడు కూర్చుని పంచాంగ శ్రవణం చెబుతున్నాడు.

మేష రాశి ఫలితాలు చెబుతున్నారు. బిందుది కూడా మేష రాశి అవడంతో, చెవులు రిక్కించాడు షాడో. ఆదాయం 2, వ్యయం 8 అని చెప్పడం తో ఒక రకమైన అనీజీనెస్ అలుముకుంది తనను. అయితే, ఈ రాశి వారికి ఎక్కువ భాగం మంచి ఫలితాలు అని అనౌన్స్ కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అతని ఆలోచనలకు అడ్డుపడుతూ, "తోటల కొనుగోలుకు ప్రయత్నం చేస్తారు." అని వినిపించింది టీవీలో. దేరీజ్ సమ్ థింగ్ ఫిషీ అనుకున్నాడు మనసులో.

టీవీలో ఉన్నట్టుండి, ధనూ రాశి ఫలితాలు మొదలయాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14 అని చెప్పడంతో తన అనీజీనెస్ తారాస్థాయికి చేరుకుంది. "కుటుంబ సమస్యలు, బంధుమిత్ర సమస్యలు చీకాకు పరుస్తాయి. బంధు వర్గానికి పదే పదే ఆర్థిక సహాయం చేయవల్సి వస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఈ రాశి వారు గురు, కుజ గ్రహాలకు శాంతి చేయించి దానాలు చేయాలి" ప్రాంప్ట్గ్ గా అనౌన్స్ చేశాడా టీవీ ధృఢకాయుడు. దాంతో ఉగాది పచ్చడిలో బండెడు వేప్పూత కలిసినట్టు నోరంతా చేదుగా తయారయింది.


"ఎంతసేపలా కలలు కంటూ కూర్చుంటావుబే! డివిజన్ హెడ్డు మీటింగ్ ఉంది, లెగు లెగు"..రఫ్ గా భుజాన్ని చరుస్తూ హెచ్చరించాడు తన ప్రాజెక్ట్ లీడర్. వాడిని లాగిపెట్టి ఒకటి కొడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఒకటి షాడో మనసులో ఎంటరయింది. తన ఆలోచనలను అదుముకుని, కరచరణాలను రుద్దుకుంటూ కాన్ఫరెన్స్ హాలు వైపు నడిచాడు.

దాదాపు ఓ ముప్పై నలభై మంది ఉన్నారక్కడ. ఓ చివర సీటు చూసుకుని సెటిల్ అయాడు.


"Dear all, all of you know that our organisation has gone through tough endeavours and retained it's customer base, and consistently posted good profits during the times. But owing to the current global scenario, and market dynamics, our organisation also have to undergo the metamorphasis. So to sustain our business growth, we have decided to cut the few jobs in order to keep our business interests alive."

హెడ్డు మాట వినిపించుకునీ వినిపించుకోనట్టుగా నటిస్తూ, అటు చివరన కూర్చున్న ఓ అందమైన అమ్మాయి ముఖం చూస్తూ, బిందు ఇప్పుడు తనను చూస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు షాడో. ఇంతలో చలిజ్వరం వచ్చినట్టు సన్నగా జలదరించింది షాడో శరీరం. అనుక్షణం డెడ్ లైన్ల మధ్య పని చేస్తూ, దిన దిన గండం నూరేళ్ళాయుష్షుగా బతుకుతుంటాడు తను. దాంతో ఓ రకమైన సిక్స్త్ సెన్స్ అలవడింది తనకు. ప్రమాద సమయాలలో అప్పుడప్పుడూ హెచ్చరిస్తూంటుంది అది. దాని మాట పెడచెవిని పెడితే ఏం జరుగుతుందో బాగా తెలుసు తనకు. హెడ్డు మాటలు విని సంతోషంతో ఉప్పొంగి పోతున్నట్టుగా, ముఖమంతా నవ్వులమయం చేసుకుంటూ, శ్రద్దాసక్తులు కనబరుస్తూ మొదటి సీటు వైపుకు వెళ్ళాడు షాడో.

టీ సమయం. గుంపులు గుంపులుగా చేరి ముచ్చటించుకుంటున్నారు జనం. ఎవరికి ఏ గతి పట్టనుందో అని. కొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడం జరిగిందని పుకార్లు వ్యాపించాయి.

ఆ రోజు సాయంత్రం. తన మేనేజరు కేబిన్ కు పిలిచాడు తనను. గుండెలు చిక్కబట్టుకుంటూ తన కేబిన్ కు వెళ్ళాడు షాడో.

"డియర్ రాజూ, చాలా ఏళ్ళుగా మీరు కంపనీకి సేవలు అందిస్తున్నారు. ఈ కంపనీకి మీరు ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు మీకు ముఖ్యమైన విషయం గురించి చర్చించాలని ఇక్కడకు పిలిపించడం జరిగింది...."

ఊపిరి బిగబట్టాడు షాడో.

"ఇది వరకు మనం కేవలం సిస్టం సైడు ప్రాజెక్ట్ లను చేపట్టాం. ఇకపై మన పరిధిని విస్తరించుకునే ప్రయత్నంలో, ఎంటర్ప్రయిజ్ టెక్నాలజీ లో మొదటి సారిగా అడుగుపెట్టబోతున్నాం. మనకొక జపాను అసైన్మెంటు వచ్చింది. మీకున్న అనుభవం, ఇదివరకు ఒకానొక క్లయింటు ఇచ్చిన ఫీడ్ బాక్ దృష్ట్యా, మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పజెబుతున్నాం. మీకు అంగీకారమేనా? " అనౌన్స్ చేశాడు, మేనేజరు.

హఠాత్తుగా గుర్తుకు వచ్చింది షాడోకి. ఇది వరకు జపాను కు సంబంధించిన ఓ అసైన్ మెంట్ లో భాగంగా జపాను వెళ్ళాడు తను. అక్కడ ఫ్యుజీశాన్ అనే క్లయింటు తగిలాడు తనకు. అప్పుడు, తన ద్వారా తీరిక సమయాల్లో జావా, ఎంటర్ ప్రయిజ్ టెక్నాలజీ లు నేర్చుకుని తనకు ప్రియ శిష్యుడయ్యాడు తను. తన ప్రాజెక్ట్ ను డెడ్ లైన్ కు ముందే డెలివరీ చేయటం మాత్రమే కాక, ఫ్యుజీశాన్ అభిమానం కూడా చూరగొన్నాడు తను.

చిరునవ్వులు చిందిస్తూ తల ఊపాడు షాడో. ప్రాంప్ట్ గా మేనేజరుకు థాంక్స్ చెప్పి బయటకు వచ్చేశాడు. ఫ్యుజీ శాన్ కు మనసులోనే ధన్యవాదాలు చెబుతూ సిస్టం షట్ డవున్ చేసి, బిందు మొహం లో కనబడబోయే ఆశ్చర్యాన్ని ఊహించుకుంటూ ఇంటి దారి పట్టాడు.


************************************************

(రచయిత మధుబాబు కు క్షమాపణలతో. కేవలం నవ్వుకోవటానికి మాత్రమే)

Wednesday, March 25, 2009

"ఉంగా"దికి స్వాగతం


ఉయ్యాలలో పడుకున్న మా పాపకు ఎల్లుండి తొలి "ఉంగా"ది. ఈ ఉగాది- మా పాప ముఖంలో కనిపించే ప్రశాంతత, ఓ చిన్ని చిఱునవ్వు అందరికీ సమకూరాలని మనసారా అభిలషిస్తూ -

ఉగాదికి స్వాగతం. (పద్యాలకు ప్రోత్సాహం, సరస్వతీ పుత్రులు చింతా రామకృష్ణారావు మాస్టారు)

ఆరు రుచుల తోడ ఆమని నీకును
నయముగనిల తోరణములు గట్టి
ఊయల నిదురించు "ఉంగా"ది పాపతో
స్వాగతింతుమమ్మ సస్య లక్ష్మి!

ఇక్కడ మరో రెండు.

Monday, March 9, 2009

ఫల శ్రుతి

చిన్నప్పుడు మా ఇంటి ఎదురు గా రామాలయం ఉండేది. ఆ ఆవరణలో ఓ చెట్టు. ఆ చెట్టు పేరు బంకీరుకాయల చెట్టు. బంకీరుకాయ అంటే - రేగు పండు ఆకారంలో, రేగు పండు లాగే లోపల బీజం ఉన్న ఓ పండు. గుజ్జు కాస్త జిగురుగా ఉన్నా, బాగా తియ్యని రుచి. ఈ పళ్ళు తినడం మొదట అలవాటు పడ్డం కష్టం కానీ, ఒక్కసారి వీటి రుచి మరిగితే విడిచిపెట్టటం కష్టం. రోహిణీ కార్తెలో ఎండలు మండిపోతున్నప్పుడు, ఆ ఉష్ణానికి నోటి పూత వస్తే, దానికి చక్కటి ఔషధం ఈ పండు (లేదా ఈ చెట్టు ఆకులు).

వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపు అవడంతో, ఆ చెట్టు కాయలు పక్వానికి వచ్చే సమయానికి, కోతులు, కోతులకు ధీటుగా మా కుర్రమూక ఆ చెట్టు దగ్గర సిద్ధం. మమ్మల్ని, కోతులను తరమడానికి, దేవాలయానికి కాపలా పనికీ నరసమ్మ అనే ఒకావిడ. ఆవిడ మమ్మల్నందరినీ తరిమేసి, ఆ కాయలు పోగు చేసుకుని, బయట అమ్ముకునేది. (బీదరాలు ఆవిడ.) అప్పట్లో మా పాలిట విలను ఆమె. దాదాపు 15, 20 యేళ్ళు ఆ చెట్టుతో నా అనుబంధం కొనసాగింది.

ఆ బంకీరు కాయల్లాగే నాకు కొన్ని unconventional fruits బాగా జ్ఞాపకం. వాటిలో కొన్ని.

కలే పండ్లు అని. నల్లగా మిరియపు గింజల లాగా ఉండేవి. స్కూళ్ళ దగ్గర గంపల్లో తెచ్చి అమ్ముకునే వాళ్ళు. కొన్ని కొన్ని సార్లు పురుగులు పడ్డా, చాలా రుచిగా ఉండేవి. గుజ్జు కాస్త ముదురు ఎరుపు రంగులో ఉండేది.

ఈత పళ్ళు : ఇవి మా ఇళ్ళలో నిషేధం. ఎందుకంటే, ఈత చెట్టు నుండీ కల్లు వస్తుంది కదా. ఈత కాయలూ వాటి తాలూకు ఫ్యామిలీయే కదా, అందుకని. అయితే, ఇంట్లో తెలీకుండా మా స్నేహితుడి తోటనుండీ తెప్పించుకుని ఎగబడే వాళ్ళం.

ఇంకా రేగు, గంగ రేగు, నేరేడు, మేడి, సీమ చింతకాయలు.....

ఇవన్నీ ఇప్పుడు దాదాపు కనబడ్డం మానేశాయి.

అయితే కొత్త కొత్త ఫలాలు చాలా చూశాను, ఈ మధ్య 4,5 యేళ్ళలో. ఆన్ సైటుకు ఇండోనేషియా వెళ్ళినప్పుడు, కివి అని, డ్రాగన్ ఫ్రూట్ అని, పసుపు వర్ణం గుజ్జు ఉన్న పుచ్చకాయ, బీహార్ నుండి అప్పుడప్పుడు మా స్నేహితుడు తెచ్చి పంచే లిచి, ఇంకా పేరు తెలీని అనేక రకాల పళ్ళు...

సరే, మర్చిపోయిన ఫలాల విషయానికి మళ్ళీ వస్తాను. ఈ మధ్య ధూర్జటి కవి గారి కాళహస్తీశ్వర శతకం తాలూకు ఓ పద్యంలో ఆ మర్చిపోయిన పళ్ళలో కొన్నిటిని చూశాను. ఆ పద్యం........

నేరేడు పండులు నెలయుట్టి పండులుఁ
గొండ మామిడి పండ్లు దొండపండ్లుఁ
బాల పండులు నెమ్మి పండులు బరివంక
పండులుఁ జిటిముటి పండ్లుఁ గలివి
పండులుఁ దొడివెంద పండ్లుఁ దుమ్మికి పండ్లు
జానపండులు గంగ రేఁగుఁబండ్లు
వెలగ పండులు పుల్ల వెలగ పండులు మోవి
పండ్లు నంకెన పండ్లు బలుసు పండ్లు

బీరపండ్లును బిచ్చుక బీర పండ్లుఁ
గొమ్మిపండ్లీతపండ్లును గొంజి పండ్లు
మేడి పండ్లును మోదలుగాఁ గుడిమాడి
చెంచెతలు దెత్తురిత్తు విచ్చేయుమయ్య (3-69)

ఇవన్నీ అడవిఫలాలు.

౧.నేరెడు
౨. కొండమామిడి
౩. దొండ
౪. పాల (సపోటాతో అంటు కడతారుట)
౫. బరివంక : బంకీరు కాయలివే
౬. కలివి : కలే పండ్లు ఇవే.
౭. తుమ్మికి / తుమికి /తునికి : కిందుకం అంటారుట సంస్కృతంలో
౮. వెలగ :
౯. పుల్ల వెలగ:
౧౦. గంగరేగు : ఇది తెలిసే ఉండాలి. రేగు పండు పెద్దన్న.
౧౧ మోవి
౧౨. బలుసు
౧౩. బీర : (కూరకు వాడే బీర కాదు)
౧౪. పిచ్చుక బీర : బాపన బూరెలంటారుట
౧౫. ఈత :
౧౬. గొంజి : గొల్వి, గొలుగు, గొనుగు, గుడఫలము
౧౭. మేడి (ఉదుంబర అని సంస్కృతంలో)
౧౮. కొమ్మి
౧౯, నెమ్మి : (సంస్కృతంలో చిత్రకుశ)
౨౦. నెలయుట్టి / నెల్లుట్టి
౨౧. చిటిముటి ; మంచి బిక్కి అంటారుట దీన్ని
౨౨. జాన/పూతిక : పుల్ల జామపండ్లట
౨౩. సంకెన :
౨౪. తొడివెంద

ఇలా ౨౪ జాతుల ఫలాలను పేర్కొన్నాడా కవివరేణ్యుడు. ఈ కాఱడవిలో ఉన్న శివయ్యకు, మా వూరు (ఉడుమూరు) కు వస్తే, చెంచెతల చేత తెప్పించి పెడతానని తిన్నడు ఆశ చూపెట్టాడుట.

చిన్నప్పుడు చూసిన రుచులు (మళ్ళీ ఆ రుచులు కనిపిస్తాయన్న ఆశలేదు) ఇలా ఈ పద్యంలో కాస్త కనిపించాయి.

అన్నట్టు తెనాలి రామకృష్ణ సినిమాలో ఈ పద్యం కూడా ఆ ఆశ్వాసంలోదే. (3-71)

చుఱుఁకుఁ జూపునఁ గాలిన కొఱతనుఱుకు
నుఱుకుఁ జూపులఁ బుట్టించు నెఱుకువారి
ఇఱుకు వలిగుబ్బ పాలిండ్ల ఇగురుఁ బోండ్ల
సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్యా......!

Sunday, March 1, 2009

దాన వీర మూర్ఖ కేసీ ఆర్ (ఏక పాత్రాభినయము)ముందుగా ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దానవీర శూరకర్ణ అభినయము చవిచూసి రండు.

ఇందలి
పాత్రలు పాత్రధారులు.
సుయోధనుడు
: చంద్రబాబు నాయుడు
కర్ణుడు
: కేసీఆర్
ద్రోణుడు
: సగటు ఓటరు మహాశయుడు
భీష్ముడు
: ప్రజాస్వామ్య వాది, గాంధేయ వాది అయిన ఒక అనుభవజ్ఞుడైన ఓటరు
ఇంకా
దుశ్శాసన (సీపీఐ), శకుని (బాలకృష్ణ) మున్నగు వారు పాల్గొన్నారు.

నేపథ్యము
: ప్రజాస్వామ్యమున ముఖ్య ఘట్టమైన ఎన్నికలు దగ్గర పడినవి. ఎన్నికలన - ఇవి ప్రజాస్వామ్యమునకు, అప్రజాస్వామిక పోకడలకు మధ్య జరిగెడు పరీక్షలేయని చెప్పవచ్చును. ఎన్నికలలో పొత్తులు (పార్టీల యొక్క భావస్వారూప్యమున చేసుకొనెడి ఎంపికలు) సర్వసాధారణము.ఓటరు మహాశయుడు ఎంపిక చేసుకున్నపార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేయును.

నేపథ్యమున - వేర్పాటు వాద బీజములతో అంకురించిన తెలంగాణా ప్రముఖునకు, తెలుగు వారి ఉమ్మడి గౌరవభావములను నిలబెట్టుటకవతరించిన తెలుగుదేశ పక్ష అధినేతకు మధ్య పొత్తు నిలువదని ఓటరు మహాశయుడు ఆక్షేపించుచూ -

ద్రోణ
(ఓటరు) : వేర్పాటు వాద భావ సంజాతుడు, జాతి గౌరవమను అంశమున స్థాపించిన, తెలుగు దేశ పక్షమునతో పొత్తు కలుప అనర్హుడు.

(
కేసీఆర్ నిరాశగా వెనుకకు మళ్ళుచుండగా)

సుయోధనుడు
(చంద్రబాబు) : ఆగాగు.
ఓటరు
దేవా! ఏమంటివి ఏమంటివి.
ఓటు
నెపమున టీఆరెస్ సుతునకిందు నిలువ అర్హత లేదందువా? ఎంతమాట? ఎంతమాట?
ఇది
ప్రభుత్వ ఏర్పాటే కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కాదే! కాదూ, కాకూడదు, ఎంపిక అక్రమమని యందువా?
అయినచో
, అతి జుగుప్సాకరమైన నీ ఎంపిక (selection) ఎట్టిది?
తొట్టి కాంగ్రెస్ నకు పట్టముగట్టితివి కదా, నీది ఎన్నిక?
ఇంత
యేల? అస్మద్ శ్వసురుడు, నందమూరి కుల వృద్ధుడు అయిన రామారావు, లాలూ, ములయంలతో ప్రత్మామ్నాయ ఫ్రంట్ కు నాంది పలుకలేదా? ఆయనదే రకమైన పొత్తు?
నాతో
జెప్పింతువేమయ్యా? మన ప్రజాస్వామ్యమునకు మూలస్థంభమైన కాంగ్రెస్, తీవ్రవాద పుత్రిక ముస్లిం లీగ్ తో సంధి కలుపలేదా? ముస్లిం లీగ్ ఛండాలముగా తెల్లదొరలతో పొత్తును, పొత్తు పర్యవసానముగా పాకిస్తానము ను, పాకిస్తాను, తిరిగి బంగ్లా దేశమును, పిమ్మట కాశ్మీరమును మన దేశమునుండీ వేర్పరిచ లేదా? రకముగా సందర్భావసరములను బట్టి, క్షేత్ర, బీజ ప్రాధాన్యములతో సంకరమైన ప్రజాస్వామ్యము ఏనాడో కలుషితమైనది. అయిననూ, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యము అని వ్యర్థ వాదమెందులకు?

భీష్మ
(గాంధేయ, ప్రజాస్వామ్య వాది) : నాయనా, చంద్రబాబు! నువ్వన్నట్టు ఇది ముమ్మాటికీ ప్రభుత్వపు ఎన్నికయే. చిహ్నమున్నవారందరూ పార్టీ నాయకులే. అందులో భావసారూప్యమున్న వారే పొత్తునకు అర్హులు.

సుయోధనుడు
(చంద్రబాబు) : ఓహో! భావ సారూప్యమా, అర్హతను నిర్ణయించునది?
అయినచో
తెలుగు దేశమున, సస్యశ్యామలమై, సంపద్విరామమై వెలుగొందు తెలంగాణమునకు నేడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించెద.
కమ్యూనిష్టు
సోదరా, అనర్ఘ నవరత్నశ్శక్త కిరీటమును వేగముగ దెమ్ము.
బావా
, నటరత్న బాలకృష్ణా, సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును దెప్పింపుడు.
పరిజనులారా
, పుణ్యమూసీనదీ తోయాధికములనందుకొనుడు.
కల్యాణ
భక్తులారా, మంగళ తూర్యారావములు అపస్వరంబుగ మ్రోగనిండు.
వంధిమాగధులారా
, కేసీఆర్ కు కైవారములు గావింపకుడు.
పుణ్యాంగనలారా
, వీరాలాకృత కృపాల ఫాల భాగమున, కస్తూరీ తిలకము తీర్చి దిద్ది, బహుజన సుకృత పరీపాక, సంలబ్ధ సహజ వేర్పాటు వాదికి వాంఛలు చెలరేగ, వీరగంధము దిద్ది తోడుకుని రండు.
నేడీ
శాసనసభా మధ్యమున, సకల రాజకీయ నాయకుల సమక్షమున, శతథా, సర్వథా, బహుధా, సహస్రథా, ప్రజాస్వామ్య విలువలను శాశ్వతముగా ప్రక్షాళన కావించెదను.

శతపరివార
సహిత, సహజ ప్రాజాస్వామ్య వ్యతిరేక మానస, మంజీరా తటనివాస, కేయూర కిరీట హార మణీవలయా, దుర్జన మిత్ర, సముజ్జృంభణ ఝర్జాఝర్జరిత సముపాద్య సమగ్ర అశౌర్యధరా, మిత్రీకృత చంద్రబాబు నాయుడా, మూర్ఖా పరావతరా, తెలంగాణారాజ్య రమా మనోవల్లభా, విజయీభవా, దిగ్విజయీ భవా!

చంద్రబాబు
: సొబగు సొబగు.

కేసీఆర్
: దాతా! నా రక్తము రంగరించి, నీ అరుణారుణ శుభ పాద పద్మ యుగళమునకు సంలేపనము గావించిననూ, నీ ఋణమీగు వాడను గాను. ఎచ్చటా నీతిని పాటించని తెలంగాణీయుడు తమ సర్వ అసమతా దృష్టికి దాసానుదాసుడు. నా తుది రక్తపు బిందువు కూడా, మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము, అహర్నిశము, అవిశ్వాసబద్ధుడనై, అహితుడనై ప్రవర్తింతునని, సర్వ సామంత మహీపాల మండలాధిపతులు, సమస్త ప్రజానీకము విచ్చేసిన, సభామధ్యమున శపథము గావించుచున్నాను.

చంద్రబాబు
: హితుడా! అప్రతిహత ’మూర్ఖవరేణ్యుడగు నీకు, తెలంగాణా రాజ్యమే కాదు, నా హోం శాఖనిచ్చి గౌరవించుచున్నాను.

************************************************************************

ఇది
కేవలం నవ్వుకోవటానికి మాత్రమే. అసంబద్ధాలు, ఇతర పొరబాట్లు పట్టించుకోవద్దని మనవి.