Monday, September 16, 2013

మృచ్ఛకటికం - కొన్ని ఆలోచనలు


రచయితకు గొప్ప ఉదాత్తత (sensibility) అన్నది ఉన్నప్పుడు, ఆ ఉదాత్తతను ప్రతిబింబిస్తూ ఒక పాత్ర వెలువడినప్పుడూ, రచయిత యొక్క sensibilities కు తగిన పాఠకుడు ఆ రచనను చదవడం తటస్థించినప్పుడు ఆ రచయితకూ ఆ పాఠకుడికి మధ్య జరిగే ఏకాంతమైన అవగాహన సద్యఃపరనిర్వృతి అని నా అభిప్రాయం. దీన్నే రసనిష్పందం అనవచ్చునేమో. రాళ్ళపల్లి వారు ఒకచోట అన్నట్టు రసం అంటే తొమ్మిది భేదాలతో మాత్రమే నిర్వచింపదగిన emotion మాత్రమే కాదు. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఏదో అనుకూలం కోసం రసాలను నవవిధాలుగా వింగడించుకున్నప్పటికీ రసనిష్పందం యొక్క ఖచ్చితత్వం ఆ వింగడింపులో మాత్రమే లేదు.

సద్యః పరనిర్వృతి కలిగించే రచయితను కవి అని, ఆ పాఠకుడిని సహృదయుడని అనవచ్చునేమో.

వ్యక్తి వ్యక్తికీ సున్నితత్వపు తేడాలు సహజం. అదే స్థాయిలోనూ పాఠకుల సహృదయత కూడా మారుతుంది. అభిమాన రచయిత కూడా మారుతాడు. శాశ్వతంగా అందరికీ నచ్చే రచయిత కానీ, నచ్చే రచన కానీ ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఫలానా రచన నా అభిమాన రచన, ఫలానా రచయిత నా అభిమాన రచయిత అన్నది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. అభిప్రాయాలకంటే రచన తాలూకు sensibilities గురించి మాట్లాడుకోవడం మంచిది.

వర్షాకాలం గురించి అనుకోగానే నాకు శూద్రక మహాకవి, మృచ్ఛకటికకావ్యం, అందులో వర్షర్తు వర్ణనా గుర్తొస్తాయి. అలాంటి వర్ణన అంతకన్నా గొప్పగా ఇతర కావ్యాలలో ఉండవచ్చు గాక. అయితే మృచ్ఛకటికం తాలూకు ఉదాత్తత కేవలం వర్ణనలో లేదు. అది దృశ్యకావ్యమవడం మూలాననూ, అక్కడ కవి కల్పించిన సన్నివేశం వల్లనూ, వసంతసేన పాత్ర యొక్క ఉదాత్త స్వరూపం నేపథ్యంగానూ ఆ వర్ణన యొక్క సౌందర్యం వ్యక్తమవుతుంది.

వసంతసేన ఒక గణిక, క్షత్రియ. ఈమె దరిద్రుడూ, అప్పటికే భార్య, పుత్రుడు ఉన్న ఒక సార్థవాహుణ్ణి (బ్రాహ్మణుడు/వైశ్యుడు) ప్రేమించింది. ఒకానొక రాత్రి తన ప్రియుని ఇంటికి బయలుదేరింది. ప్రియుణ్ణి మొదటి సారి చూడబోతున్న తరుణం. ఆమె చిత్తం లోపల ఉద్వేగమూ, ఆనందమూ పెనవేసుకుని ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్రశ్న. గణిక - అంటే ఒక వేశ్యకు - అంటే పురుషసంగమం అలవాటైన ఒక యువతికి - ఒక మొగవాని పట్ల అలాంటి భావాలు ఉండటం ఎలా సంభవం? సరిగ్గా ఇక్కడే పాత్ర ఉదాత్తత - సహృదయునికి తెలుస్తుంది. శీలం వేరు, స్వచ్ఛత వేరు. శీలం సామాజికం అయితే స్వచ్ఛత మానసికం. రెండూ పరస్పర వ్యతిరేకాలు కావు, దోహదకారులూ కానవసరం లేదు. సందర్భమో కాదో తెలియదు కానీ ఈ మధ్య మరోసారి చదివిన యండమూరి నవల అష్టావక్ర గుర్తొస్తుంది. అందులో ప్రతిమా అగర్వాల్ పాత్ర ఇదే పాయింట్ మీద నడుస్తుంది. అలాగే హంపి నుండి హరప్పా దాక లో బసివి నాగమ్మ గురించి రామచంద్రగారు వివరిస్తారు. ఆ పాత్ర గురించి చదివిన తర్వాత పాఠకుడికి సానుభూతే తప్ప ఏ విధమైన వికారమూ కలుగదు. వసంతసేన కూడా అలాంటి ఒక ఉదాత్తమైన పాత్ర.

వసంతసేన ఉద్వేగానందాలను ప్రతిబింబిస్తూ బయట వాతావరణం. కుండపోతగా వర్షం. ఆ వాతావరణంలో వసంతసేనకు తోడుగా గొడుగు పట్టి వెంట వస్తున్న విటునికి, వసంతసేనకూ మధ్య వర్షం గురించిన సంభాషణ.

ఇందులో ఓ రెండు పద్యాలు.

గర్జంతి శైలశిఖరేషు విలంబిబింబా మేఘా వియుక్తవనితా హృదయానుకారాః |
యేషాం రవేణ సహసోప్తతితైః మయూరైః ఖం వీజ్యతే మణిమయైరివ తాళశృంగైః ||

వసంతసేనా! చూడు!చూడు! శైలశిఖరాల మీద గర్జిస్తున్న ఆ మేఘాలు విరహిణుల హృదయాల లాగా ఎలా భారంగా ఉన్నాయో! వాటి చప్పుడుకు ఒక్క ఉదుటున పైకెగిరిన నెమళ్ళ పింఛాలతో ఆకాశం మణిమయమైన వింజామరలచేత వీయబడుతున్నట్టుగా లేదూ!

మూఢే ! నిరంతర పయోధరవా మయైవ కాంతః సహాభిరమతే యది కిం తవాత్ర!
మాం గర్జితైరితి ముహుర్వినివారయంతీ మార్గం రుణద్ధి కుపితేవ నిశా పత్నీ ||

‘ఓసి మూర్ఖురాలా! వసంతసేనా! దట్టమైన మబ్బులున్న (ఇఱుకు పయోధరాలు) ఉన్న నేను నా కాంతుడితో రమిస్తూంటే, మధ్యలో నీకేంటి?’ అని ఉరుములతో మాటిమాటికీ నివారిస్తూ (నాపై ఉరుముతూ) ఈ నిశ, సవతి లా మారి, నా దారిని అడ్డగిస్తూంది కదా!
(సవతి ఎందుకంటే, తనను తన ప్రియుడి వద్దకు చేఱుకోనీకుండా అడ్డుపడుతున్నది కాబట్టి) అని వాపోతుంది. పయః అన్న సంస్కృతపదానికి నీరు, పాలు అని రెండు అర్థాలు. నిరంతర పయోధరములు అన్నది శ్లేష. దట్టమైన మబ్బులు అని ఒక అర్థం, (నిర్ + అంతర) ఇఱుకు పయోధరాలని మరొక అర్థం.

********************************************
ఇక్కడ మరో సారి అనంతకృష్ణశర్మ గారిని గుర్తు తెచ్చుకుంటాను. యే ఉదాత్త రచన అయినా రచయిత యొక్క శాంతస్వభావం మూలం కావాలి. ధిషణాహంకారాలూ, పాండిత్యప్రగల్భా వాచ్యార్థాల ప్రాభవం పెంపు చేయవచ్చును, కానీ ఉదాత్తమైన భావం కవి అంతః కుహరాల్లోనుంచి రావాలి. అందుకు శాంతమే ఆలంబన. నిజమైన శృంగార వర్ణన - అది నిజంగా సున్నితత్వాన్ని నింపుకొన్నదైతే ఉద్రేకాన్నీ, ఆవేశాన్నీ కలిగించరాదు. అది చిత్త ఆహ్లాదకారకం కావాలి. అంతమాత్రమే కాదు, రంజింపజేయాలి. కవి తాలూకు దార్శనికత సహృదయుడైన పాఠకుడికి దారి చూపాలి.

మృచ్ఛకటికం కావ్యంలోని ఈ ఘట్టం నిజంగానే వర్షంలో తడుస్తున్న అనుభూతి కలిగిస్తుంది. అనుభవైకవేద్యం. సన్నివేశం, పాత్రలూ, వాటి ఉదాత్తతా నేపథ్యంగా ఔచిత్యశోభితంగా ప్రావృట్వర్ణన అనే వస్తువును వర్ణించిన అపూర్వమైన ఘట్టం. వ్యక్తిగతంగా నాకు నచ్చిన గొప్ప వర్ణన.

Sunday, August 25, 2013

The conjuring అను పిశాచప్రకరణము


భయము అనగానేమి? భయమనగా ఉద్వేగకారకచిత్తవికల్పము. కొందరికి నల్లి యన్న భయము. మరికొందరికి బల్లియన్న భయము. ఇంకొందరికి బొద్దింకను జూచిన యొడలు గంపించును. మా ఊరియందు నొకఁడు గలడు. వానికి నీరనిన భయము. మానవుల చిత్తములు బలు విధములు. ఒక కవి "బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను" అని నుడివెను.(ఈ రోజే బహుళపంచమి) వెన్నెలకు భయపడువాడు కవి యేనా? కావచ్చును, కాకపోవచ్చును. అదియొక చమత్కారము.

భయములు సాధారణములు, విపరీతములు అని రెండు తెరఁగులు. దయ్యములన్న సాధారణముగ నందరికీ భయము. మన కావ్యములలో భయానక రసమున్నది. ఈ భయానక రసమును తెరపై జూపించుచూ అనేకులు చలన చిత్రములు నిర్మించిరి. ఈ మధ్యకాలమున అట్టి యొకానొక చలనచిత్రము "The Conjuring" అనునది.

ఈ చలనచిత్రమున దెయ్యములు గలవు. కొందరు దయ్యములు లేవందురు. దైవమున్నదని నమ్మిన దయ్యమున్నదని యేల నమ్మరాదు? ఇది మానవుని స్వభావదోషము. ఈ చిత్రమునందు దయ్యముల స్వభావములనూ జక్కగా జూపించిరి. మొదట భయపెట్టును. పిమ్మట లోబర్చుకొనును, అటపై ఆవేశించును. ఇట్లు దయ్యము మూడు వంతులుగా మానవుని స్వాధీనపరచుకొనును. దీనినే ఈ చలన చిత్రమున ఎడ్ అనువాడు జెప్పెను. ఈ చలన చిత్ర ఇతివృత్తమిట్లున్నది.

అమెరికాలో ఫ్లోరిడా అను నొకచోట నొకఁడు నొకానొక బెద్ద భవంతిని కొనును. అచ్చటికి సంసారమును తరలించును. మన సాంప్రదాయమున యిల్లు జేరునపుడు శాంతి హోమము నెరపుట యాచారము. మ్లేచ్ఛులకట్టి యాచారములు లేవు.  ఆచారములన్నియునూ వ్యర్థములని కొందరందురు. అదియే మ్లేచ్ఛనాగరకత. అన్నియునూ తెలియవలనన్న దురాశ ఈ భావమునకు మూలము. కొన్ని విషయములుండును. వాని సారములెరుగవలసిన బని అందరకునూ లేదు. సమాజమున నందరి బుద్ధి స్థాయీభావములొక్క తెరగున నుండదు. అది సృష్టి. కర్మగత భావసారము ఆచరణతో ముడివడియున్నది. ఆచరించుచూ పోయిన యెడల ఒకనాటికి ఆతని సంస్కారశుద్ధిజనితబుద్ధ్యధికృతమై ఆ సాధనాఫలముగా యాచారముల యాంతర్యమవగతము గావచ్చును.

(సొల్లుతో శాఖాచంక్రమణము గావించితిని, ఇక మిమ్ములను బాధపెట్టక కథకు పోవుదును.)

యాతనికి భార్య, ఐదుగురు ఆడపిల్లలు. ఆ భవనమున అంతకు పూర్వము పెక్కు దుర్ఘటనలు జరిగి యుండును. ఆ దుర్ఘటనలలో గతించిన వారలందరు దయ్యములై తిరుగుచుందురు. ఆ భవనమున జేరిన నాట నుండి ఆ కుటుంబమునకు ఈతి బాధలు మొదలగును.

అంతియగాక ఆ భవనమునందు కరవునందు యధికమాసమన్నట్టు అనేకగదులకు తోడుగా  అనేక నేలమాళిగలుండును. దయ్యములా నేలమాళిగలందు నివసించుచూ రాత్రులయందు తలుపులను తాడించుచు యుండును. మరియొకటున్నది. ఆ ఇంట గడియారములన్నియునూ 3:07 గంటలకు నిలిచిపోవుచుండును. అందులో మర్మమేమి? మూడు అనగా నది తండ్రి, యేసువు, పవిత్రభూతము (holy ghost)నకు సంకేతములు. మన సాంప్రదాయమున త్రిమూర్తులు గలరు. ముజ్జగములున్నవి. మరి మ్లేచ్ఛులకు పొంతనలేని మూడిఁటి విషయసంగమమున్నది. యదియే సత్సాంప్రదాయమునకూ, మ్లేచ్ఛ సాంప్రదాయమునకూ భేదము. అది యట్లుండె. 07 సంగతి దర్శకుడు జెప్పలేదు. మరచెనేమో?

ఈ దయ్యపుకొంపలో ఆ దంపతులన్యోన్యముగా కష్టసుఖములనే గాక భయమునూ "సమానము"గా పంచుకుని గాపురము సాగించుచుండిరి. (సమానత్వము?!? ......వద్దు. ఈ విషయముపై ప్రస్తుతము మౌనము వహించెద)

క్రమముగా ఆ ఇల్లాలికి దేహముపై గాయములు కలుగును. పిల్లలకు యెడనెడ భయోత్పన్నమైన దృశ్యములగుపించుచుండును. దరిద్రమునకు యాకలి తోడన్నట్టుగా వారు క్రైస్తవులైననూ మతాచారములను బాటింపరు. చర్చికి వెళ్ళుట వారి యింటి సాంప్రదాయము గాదు. ఇంకేమున్నది. పిశాచరాజములకు కళ్ళెములు విడచినట్లైనది. అవి విశృంఖలముగా తమ కార్యకలాపములు సాగించును. ఈ కార్యకలాపములు ముందు జెప్పినట్టు మూడు తెరగులు.

అన్ని దెయ్యపు సినిమాల వలెనే ఈ సినిమాయందు దెయ్యములను పారద్రోలు వారలున్నారు. వారలు కూడా దంపతులే. ఆ దంపతులలో నిల్లాలికి దయ్యములను జూచు, తత్సంబంధిత శబ్దములను గ్రహింపగల, తదధికృత దుర్గంధములను మూర్కొనగల అతీంద్రియశక్తులుండును. ఆ దంపతులొకమారు దయ్యముల గురించి ప్రసంగించుచుండగా, మన దయ్యపు కుటుంబపు యిల్లాలు వారిని గలసి తమ యింటికి యాహ్వానించును. వారలందులకంగీకరించి ఈ ఇంటియందడుగు పెట్టుదురు.

వారికినీ దెయ్యములకునూ జరిగిన యాధిపత్యపు బోరున నెవరు గెల్చిరి అనునది వెండి తెరపై జూడవచ్చును.

ఈ చలనచిత్రమునందు భయానకరసము అంగి. గుణీభూతముగా గొంత హాస్యమున్నది. దెయ్యములకు యాటలపై ఆసక్తి యుండును. "వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?" అను కళ్ళకు గంతలు కట్టుకొను యాట మనకు అనూచానముగా గలదు. ఆంగ్లేయులకు "hide and claps" అను యాట గలదు. ఆశ్చర్యమేమి? భారతీయమైన సాంప్రదాయములు జగద్విస్తృతములు గదా! అప్పుడప్పుడూ దెయ్యములూ ఆ యాట యాడును.

తెలుగు చలన చిత్రములలో చివరి దృశ్యమున పోలీసులు యరుదెంచుట గలదు. ఈ చిత్రముననూ, చివరన వాటికన్ అధికారులు ఆ యింటిని దెయ్యముల బారినుండి వదలించుటకు అనుమతి నొసగుట గలదు. ఆంగ్లేయుల హాస్యరసపోషణములట్లుండును.

దెయ్యములన్న భయమున్న వారికి, అనగా భయానకరసార్ద్రైకచిత్తులకు, పిశాచవిషయసంగ్రహపరివిష్టులకూ ఈ చలనచిత్రమునందు గావలసినయంత సరుకున్నది. మ్లేచ్ఛ దెయ్యములగురించిన సాంకేతిక సమాచారమిందు సరిపడినంత యున్నది. ఈ చిత్రకథ నిజముగా జరిగినదట.

యేది యేమైననూ, ప్రస్తుతము తెలుగునాట వచ్చు పేలవమైన చిత్రములను బోల్చినచో, ఈ చిత్రమున దెయ్యములే మేలనిపించును. తొడలు చరిచెడు నాయకులకన్న తలుపులు బాదు దెయ్యములెంతియో మేలు. తక్కిన సాంకేతికవిషయములన్నియునూ అద్భుతముగ సమకూరినవి. ఈ చలనచిత్రరాజమును యభిరుచిగల ప్రేక్షకులు జూచి యానందిం....క్షమించుము, మిక్కుటముగ భయమందుదురు గాక.

Monday, July 15, 2013

నీడపై దాడి - 2

తత్పూర్వదినంబునఁ రాతిరి కతికిన రెండెండు రొట్టెలు దక్క మరేమియునూ యుదరంబున నుండుట లేమి జేసి యాతని దైన్యము నివ్వటిల్లి మానసము మిక్కిలి వెక్కసమందెను. ఈ దినంబుననైనఁ జీకటవుటకు ముందుగ నేమైననూ ప్రాపించవలె, కానియెడ కాళ్ళు కడుపునందు జొనపవలసి వచ్చును.

ఓటికుండయందు పటుతరంబైన రాలు వ్రేసి మ్రోగించునట్టు వికృతస్వనంబుతో ఒక లాండ్ రోవర్ వాహనము తన ముందుఁ జని దూరంబుననున్న పానశాల యెదుట నాగుచో విట్టోరియో చిత్తవికల్పమములత్తమిల జొచ్చెను.

అల్జీర్స్ పట్టణసరిహద్దులలో గల నదీపర్వతశిఖరాద్యశేషవిశేషంబులవలోకించి చేతనావశేషంబులై యాతనాపూర్ణశరీరంబులతో యేతెంచిన యాత్రికులు వారలు. ఇంచుక దాహంబు దించుకొనుటకై పానశాలకు గుంపు గుంపులుగాఁ జనుచున్నారు. 

దుస్తులమరుగున నున్న హస్తవస్త్రపేలిక (హేండ్కర్చీఫ్) తోడ తైలసాదృశ్యమైన వదనంబునగల  స్వేదంబును తుడుచుకుని, కుంతలములనొకింత కూర్పుగ జేసి అటువెడలెను విట్టోరియో.

దళసరిగానగుపించు అంగీ జేబులను క్రీగంటంగమనించుచూ మద్యపానవాటికను సమీపించునెడ యాతని మనము విరళితమై ఎన్నిక పూర్తయ్యెను. నీలిరంగు యున్ని వస్త్రమును ధరించి, తానంతకు మునుపు నూరిబయట వీక్షించిన కుహరమును గూర్చి అక్షములకు గట్టునట్టు ప్రసంగించుచున్నాడట తుందిలుడైన మందభాగ్యుండొకడు. వాని జేబున నేత్రపర్వముగ నున్న ధనసంచీ పైనీక్షణంబుల ప్రసరించి యల్లనల్లన విట్టోరియో యాతని సమీపంబునకునంబోయెను.

కనులకుంగానని వేగంబునం కదలి ఆ తుందిలుని జేబుకడకేగి క్షణంబున దశాంశపర్యంతకాలంబున యాతని వామహస్తమెందులకో స్థంభించెను.

కనకకజ్జలవర్ణసంచితవస్త్రధారియై ఉంగరముల ముంగురులను వామహస్తమున కుస్తరించుచున్న మహాకాయుని పార్శ్వమున నిలుచున్న యువకుండొక్కరుండు గలడు. యాతని చూపులు తూపులవలె విట్టోరియో హృత్తునకు హత్తుకొనెను. అల్లన విద్యుల్లతాతాడనమందిన భంగి విట్టోరియో వామహస్తము వెనుకకు మరలెను. కాయము తీవ్రజ్వరప్రకోపితమైనయట్టు ప్రకంపింపఁదొడగెను.

విట్టోరియో మది "పారిపొమ్ము ... ఓయీ మూర్ఖాధమా, పారిపొమ్మిక, తదుపరినొక్క క్షణంబిచ్చట నిలచితివేని నీ ఖర్మ కాలును. పారిపొమ్ము" యని ఖంగున రొదవెట్టుచూ తీవ్రముగ హెచ్చరింపసాగెను. విట్టోరియో అన్యాలోచనము సేయలేదు.

అడుగునడుగున వెనుకకు జరుగుచూ పానశాల వెనుకకునేతెంచి విమానసదృశవేగంబున పేరమెత్తెను. మునుపు పరిహాసమాడిన స్నేహితుండా వీధి మధ్యంబున నగుపించి, "ఏమాయెను మిత్రమా? ఆత్రముగా అరుగుదెంచితివి? పర్వతశిఖరదర్శితామోదభరితులైన పానశాలావిలాసులు నీ దేహశుద్ధి చేయబోయిరా?" యని ఇచ్చకములాడెను.

దంతంబులు పటపటలాడించి పౌరుషంబణచుకుని ముందుకు పర్వెత్తి, వీధిమలుపున నొక ధృఢకాయునకు చటాలున గుద్దుకొనెను విట్టోరియో.


***********************************

(తర్వాతి భాగం ఎప్పుడొస్తుందో, వస్తుందో రాదో నాకే తెలియదు. కాబట్టి మన్నించగలరు)

Thursday, June 27, 2013

నీడ పై దాడి - 1

వదనంబునకంటిన స్వేదంబును వసనంబునకనుగుణమౌ కౌనునకు నాదేశంబు గావించుచు నలుదెసలం బరికించెను విట్టోరియో.

అల్జీర్స్ పట్టణంబునందున్న అనామికా బజారు అతనిటఁ దిరుఁగు కూటమితోడనూ, రహదారుల పార్శ్వంబందున బెరగిన దుకాణ సముచ్చయంబులన్ గుమిగూడిన యాత్రికుల తోడనూ, జనబంధురమై, గహనదురంధరమై భాసించుచున్నది.

ఆతఁడు కరిదంతంబుల నెరపిన వస్తుసముచ్చయంబుల విక్రయంబు జేయునొక విక్రయశాలను వినిమితము గావించి, నాలుగు యడుగులనద్దిశ వైపుగాఁ గదిలించి, ఐదవ యడుగు మోపునెడ - కలకలమను నొక్క కోలాహలమచ్చోటఁ బెచ్చరిల్లెను.

"ఓరి భగవంతుఁడా! నా ధనము...నా ధనంబునెవరో యపహరించిరి ...రక్షకభటులను రావింపుడీ" యను ఎలుగు ఱాపడునట్టు స్వరంబు వికస్వరంబుగా వినిపించుచుండనొక స్త్రీ దుకాణాంగనమున పఱుగున నఱుదెంచెను.

మ్రోయు యడుగునుపసంహరించి వెడవెడ నడక సాగించుచు అచ్చోటి నుండి దవ్వునకరిగెను విట్టోరియో.

యాత్రికురాలి రావంబులకు జాగరూకమైన బజారునకొకింత దవ్వున మూలగానొక్క తేనీటి యంగడి యందు ఉల్లాసంబుగ సల్లాపంబుల మఱగిన రక్షకభట చయము యల్లన రంగంబునన్ డిగ్గి మాయమైపోయిన ధనంబును శోధింపబూనుకొనిరి.

ఆ గడబిడ గడవకయే తానా యెడ నడుగిడిన ముడుసులు వెడలునని ఎఱిఁగి విట్టోరియో చేజారిన యమూల్యావకాశంబును తలఁచి శంకించుచు, ఖిన్నుడై నొక మూలనున్న తిన్నెను జేరి విశ్రమించెను.

ఆ సందర్భమున "ఏమోయీ! ప్రియమిత్రుఁడా విట్టోరియో!" యనుచు వచ్చిన మిత్రుడొకడాతనిని పలుకరించి, "త్వదీయాననమవనతమైన కారణంబెయ్యది సోదరా? ఇంతవరకునూ యారంభమవలేదొకొ??" యని అపహాస్యపూరితభాషణంబొనర్చి వెన్నుపై చరచి నిచ్చంబోయెను.

ఆతని వెనుక నెడనే బోయి ముఖనాసికాద్వయమునేకమొనర్చవలెనను కౌతుకమునడగించుకొని తానున్న యెడనే విశ్రమించెను విట్టోరియో.

ఆ మిత్రుని యుత్ప్రాసంబున నొక్క ప్రల్లదమును లేదు. వేకువ తొడరిన కడ నుండీ శక్తికి వెరవక ప్రయత్నము సాగించుచున్ననూ, విధివిలాసంబున నాటంకములు సంభవించుచున్నవి. తన వదనంబవనతంబు గాక మరేమగు?



**************************************

ఎసాల్ట్ ఆన్ షాడో - అను మధుబాబు నవలకు గ్రాంథికీకరణము. మధుబాబు గారికి, పరవస్తు చిన్నయసూరి గారికీ క్షమాపణలతో..

Sunday, June 23, 2013

సంకేతపదనిర్మాణతరుణోపాయన(స)ము

అనగనగా ఒక రోజు - నాలుగు సార్లు ఫ్రెండ్స్ తో బాటు కేంటీన్ కు వెళ్ళి కాఫీ తాగి సీటు దగ్గరకు వచ్చి, ఫేసుబుక్కూ, ప్లస్సూ, కూడలి, యూట్యూబూ, మరో నాలుగు కిటికీలు తెరిచి ఆఫీసులో చాలా బిజీగా పనిచేసుకుంటూ ఉన్నాను.

తెర మీదకు ఒక మిస్సైల్లా  ఒక డబ్బా వచ్చింది. దాని మీద ఉన్న సారాంశం ఇది.

"మీ యంత్రం తాలూకు సంకేతపదం ఆరునెలలుగా పాచిపోయి కంపు కొడుతూ ఉంది. దానిని మార్చండి."

ఓస్ అంతే కదా అనుకుని "సరే" అన్న పోకముడిని ...ఛ ఛ .. బొత్తామును నొక్కాను. ఒక భయంకరమైన విషవలయంలో అడుగుపెట్టబోతున్నానని నాకా క్షణం తెలీదు.

అదివరకు ఇలాంటి బెదిరింపులను చూసి ఉన్నాను. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు గ్రామసింహం ..ఛ ఛ ..సీమసింహం బెదరదు అని సంకేతపదం ఇలా టంకించాను. -

"వెధవ123"

ఇక్కడో మినీ ఫ్లాష్బాకు. ఇలా సంకేతపదాలు మార్చమని మూడు నెలలకో మారు మాకు విన్నపం వస్తుంది. "వెధవ123", "చవట123" - ఈ రెండు సంకేతపదాలనే నేను మార్చి మార్చి వాడటం అలవాటు. మా మిత్రులు ఇలాంటివే ఏవో పద్ధతుల్లో తమ సంకేతపదాలను గుర్తుంచుకోవడానికి వీలుగా తీర్చిదిద్దుకోవడం నాకు తెలుసు.

తెరపైకి ఒక డబ్బా, దాంట్లో తిట్టు లాంటిది కనిపించింది - "మూర్ఖుడా, నీ సంకేతపదం లో వరుసగా మూడు నంబర్లను పెట్టావు. మార్చు." బేక్ గ్రవుండ్ లో చిన్న సైజు వికటాట్టహాసం.

ఈ తతంగాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేయడం తక్షణ కర్తవ్యం అని, కేన్సిల్ నాడా ...అదే బొత్తామును నొక్కాను. మరో డబ్బా. "కేన్సిల్ నొక్కి ఫేస్బుక్ కు వెళ్ళిపోదామనుకుంటున్నావా? కుదరదోయ్. సంకేతపదం మార్చేదాకా వదలను. వదల బొమ్మాళా వదల, రీస్టార్ట్ చేసినా వదల"

నా మనసు కాస్త కీడు శంకించింది. ఇలాంటిది ఇదివరకెప్పుడూ రాలేదు

సరే అని కాస్త ఆలోచించి ఇలా మార్చాను. "వెధవ321". ఫలితం ఇది.

"ఒరే కోడి బుర్ర వెధవా, వరుసగా అన్నాను. అది వెనుకనుండైనా కావచ్చు"

"వెధవ007"

"హమ్మా? ఆశ దోశ అప్పడం వడ! ఒకటే నంబర్ రెండు సార్లు రాకూడదోయ్".

తల వేడెక్కింది. కాస్త ఆలోచించాను. నేను మొట్టమొదటిసారి యాహూ అకవుంటు తెరిచినప్పుడు నా ప్రియతమ నాయిక సోనాలీ బేంద్రే స్మృత్యర్థమై ..అదే ఆమె గుర్తుండడానికి సోనాలి1 లాంటిది వాడినట్టు గుర్తు. ఇప్పుడు ఆమె, నా యాహూ ఖాతా రెండూ పదవీవిరమణ చేశాయ్. ఇప్పుడు దాన్ని వాడితే ఎలా ఉంటుంది? ఆచరణలో పెట్టాను.

"ఒరే! సంకేతపదంలో ప్రత్యేక చిహ్నం లేకుంటే ఒప్పుకోను" సందేశం, బేక్ గ్రవుండ్ లో తొడకొట్టిన సవుండూ వినిపించాయ్.

అప్పుడు సన్నగా వెన్నెముక క్రింది భాగాన చల్లటి అనుభూతి. చిన్న వణుకు.

తొడకొట్టిన సౌండు విన్నప్పుడల్లా నా హృదయం బలహీనమవుతుంది. ఎందుకంటే అదేదో సినిమాలో హీరో తొడకొట్టగానే కుర్చీ తనంతట తాను జరుక్కుంటూ హీరో దగ్గరకు వెళ్ళిపోతుంది.

అలా కుర్చీలు జరగటం గతితార్కిక భౌతికవాదులు, హేతువాదులూ నమ్మరు. నేను కేవలం అవకాశవాదిని కాబట్టి దేన్నైనా నమ్ముతాను. ఇప్పుడు నా కుర్చీ కూడా జరుగుకుంటూ నాతో సహా ఐటీ డిపార్ట్ మెంటు కు వెళ్ళిపోతే?. అలా వెళితే ఆ "ట్రావెల్" ను ఎంజాయ్ చేయడానికి ఇబ్బందేమీ లేదు కానీ ఐటీ వాళ్ళది రెండో అంతస్తు., నేనున్నది ఐదవది. ఐటీ మేనేజర్ మంత్రశక్తిని కుర్చీ అపార్థం చేసుకుంటే మెట్లపైనుండి నేను క్రిందపడతాను.అంత రిస్కు చేయలేను.

అందుకని మరింత దీక్షగా ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరింది F1 గంటును ..సారీ... బొత్తామును నొక్కాను. అక్కడ సంకేతపదం మార్చడానికి నియమాలు వ్రాసి ఉన్నాయి.

1. సంకేతపదం లో కనీసం ఎనిమిది అక్షరాలు ఉండాలి.
2. కనీసం ఒక పెద్ద అక్షరం, ఒక చిన్న అక్షరం, ఒక అంకె, ఒక చిహ్నం ఉండాలి.
3. వరుసగా అంకెలు రాకూడదు.
4. వరుసగా అక్షరాలు రాకూడదు.
5. ఒకే అక్షరం లేదా అంకె తిరిగి తిరిగి రాకూడదు.
6. మీ సంకేతం మీ జీవితం లో ఎప్పుడూ ఉపయోగించనిదై ఉండాలి. ఒకవేళ పాతది కనుక్కోలేరు అనుకుని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది.
7. టంకించే ముందు కాళ్ళు కడుక్కుని వచ్చి ఉండాలి.
...
...
ఇలా అనేక సూచనలు పొందుపర్చబడి ఉన్నాయ్.

ఒక పదిహేను ఇరవై విఫల ప్రయత్నాల తర్వాత ఒక భయంకరమైన పాస్ వర్డ్ నిర్ణయించాను. అది ఎలానూ గుర్తుండి ఛావదు కాబట్టి దాన్ని మొబైల్ ఫోను లోనూ, పర్సులో ఉన్న ఒక పుస్తకం లోనూ రాసి పెట్టుకున్నాను.

అయితే అది అంతం కాదు ఆరంభం మాత్రమే. మరుసటి రోజు మా సంస్థ అంతఃజాలం (intranet) సంకేతపదం కూర్చటానికి మరో యజ్ఞం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత మరొకదానికి. ఇలా సమస్య తీవ్రతరమయ్యేటప్పటికి ఒక బ్రహ్మాండమైన మీటింగు పెట్టి సమస్యను చర్చించారు అందరూ.

చివరికి కనుక్కున పరిష్కారం ఇది.
- ప్రతి ఉద్యోగికి రెండు యంత్రాలుంటాయి. మొదటి దానిలో సురక్షిత వ్యవస్థ ఉంటుంది. మరొకటి సాధారణమైనది. రోజు సాదా యంత్రంలో పని చేసి రోజు చివరన, వ్యవస్థీకృతమైన యంత్రంలోకి డేటాను తర్జుమా చేస్తారు.

ఇలా కనుక్కున్న పరిష్కారంతో సమస్య కొలిక్కి వచ్చింది.

Wednesday, June 5, 2013

నిత్యసౌందర్యం

అనగనగా సరస్వతీదేవికి ఒక కొడుకు పుట్టాడుట. అతని పేరు కావ్యపురుషుడు. ఓ మారు సరస్వతి ఏదో దేవతల సమావేశానికి వెళుతుంటే కొడుకు - ’అమ్మా, నేను వస్తా’నని వెంటబడ్డాడుట. అప్పుడా అమ్మ ’బాబు నీవు అక్కడికి రారాదు. నేనిప్పుడే వచ్చేస్తా, నీవిక్కడే ఉండు’ అని వెళ్ళిపోయిందట. ఈ బాబుకు కోపం వచ్చి తామున్న హిమాలయాల దిగువన ఉన్న జంబూ ద్వీపానికి బయలు దేరాడట. అతణ్ణి చూసి, స్నేహితుడైన కుమారస్వామి కూడా కెవ్వున ఏడుస్తూ నేనూ వెళతానని వాళ్ళ అమ్మ పార్వతి దగ్గర గొడవ చేశాడట.

అప్పుడు పార్వతి ఒక అమ్మాయిని సృష్టించి - అమ్మాయీ ఇదుగో ఆ వెళుతున్నతనే నీ భర్త. అతణ్ణి అనుసరించి వెనక్కి తీసుకురా అన్నదిట. ఆ అమ్మాయి సాహిత్యవిద్యావధువు. కావ్యపురుషుడు మొదట తూర్పు (గౌడ) దేశానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే సాహిత్యవధువు అక్కడి వాతావరణానికి అనుగుణంగా తన ఆహార్యం మార్చుకుందిట.

ఆమెను చూసిన కావ్యపురుషుడికి కోపం తగ్గక చురచురలాడాడుట.  ఆ పద్ధతి గౌడీ రీతి అని స్థిరపడింది. గౌడీరీతి అంటే - సమాసభరితంగా క్లిష్టంగా ఉంటుంది.

ఆ తర్వాత కావ్యపురుషుడు పాంచాల రాజ్యం, ఆ చుట్టు పక్కలకెళ్ళాడు. అమ్మాయి అక్కడి వాతావరణానికనుగుణంగా ఆహార్యం స్వీకరించింది. ఈ సారి అబ్బాయి మెత్తబడ్డాడు కాస్త. అమ్మాయి వంక చూస్తున్నాడు, నవ్వకపోయినా. అప్పుడతని భావాలు, మాటలు పాంచాలీ రీతిగా పేరు పొందినయ్.

ఆ తర్వాత అతను మరింత క్రిందకు వచ్చి విదర్భకు వచ్చాడు. ఈ సారి కావ్యపురుషుడు బాగా ఐసయి పోయాడు. ఇప్పుడు అతని మాటల శైలి చాలా అందంగా, సుకుమారంగా ఉంది. అతని శైలి వైదర్భి. ఇంకా ఆయన దక్షిణ సముద్రంపైన ఉన్న వేయి యోజనాలు తిరిగాడు. అలా తిరుగుతూ కేరళకూ వచ్చినాడు. అక్కడ అమ్మాయి తన ఆహార్యం, వస్త్రమూ ఇలా చేసుకుందిట.

ఆమూలతో వలితకున్తలచారుచూడః
చూర్ణాలకప్రచయలాంఛితఫాలభాగః ||
కక్షానివేశనిబిడీకృతనీవిరేషః
వేషశ్చిరం జయతి కేరళకామినీనామ్ ||

మొదళ్ళకంటా తిప్పి కట్టిన కుంతలాలతో అందమైన ముఖం కలది, అక్కడక్కడా ముంగురులతో అలంకృతమైన ఫాలభాగం ఉన్నది, భుజం క్రింద కోకముడి బిగించి కట్టినది, అయిన కేరళ ముద్దుగుమ్మల వేషం భేషుగ్గా ఉంది!

ఇలా...
ఆమె అందంతో సాటి రాకపోయినా ఓ కందం.

కం ||

పురిసల్పి మొదల గట్టిన
నెరుల నొయారంపు మోము, నెన్నుదుట బడం
కురులు, ఎరక దిగి కోకను
నెరఁ గట్టిన కేరళ నెరి నిత్యము ముదమౌన్

నెరులు = కుంతలములు
ఎరక = భుజము

ఉహూ...మరొక ఉత్పలమాల కూడా..

ఉ||
సొమ్మగు ముంగురుల్ నొసట సోలిన మోమెలదేటి దాటులన్
బమ్మెరవోవఁ దోలు దెగబారెడు వేనలి, మూపు క్రిందుగన్
క్రొమ్ముడి, కొప్పు నందెసగు కూటపు ముత్తెములున్, సుధౌష్టము
న్నమ్మకచెల్ల ! కేరళ సునందిని నిత్యము చెన్నువొందగన్.

అందమైన ముంగురులు నుదుటన పడుతూ ఉన్న మోము,
ఎలదేటి దాటులు అంటే తుమ్మెదలు - అవి నివ్వెరపడేట్టుగా ఉన్న నిడుపాటి జడ (వేనలి = జడ), 
భుజానికి కాస్త కిందుగా కట్టిన కొత్త (రకం) కోకముడి, 
కొప్పుపైన వెలుగుతున్న ముత్యాలరాశులూ, 
అమృతం లాంటి పెదవి, 
అమ్మకచెల్ల! కేరళ అమ్మాయి నిత్యమూ అందంగా ఉండాలి (ఉంటుంది).. :) 

(ఈ పద్యం కూడా కొట్టుకొచ్చిన ఓ పెద్ద పేరడీయే ;)

ఇంతకూ కథ ఏమయిందండి అంటారా? అంత అందమైన డ్రెస్సుతో అమ్మాయి కనిపిస్తే ఐసవకుండా ఉంటాడా అబ్బాయి? సరస్వతి కొడుకూ, పార్వతి కూతురూ పెళ్ళి చేసికొని హిమాలయాల్లో కాపురం పెట్టారు. అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సూ, ఆమె హొయలూ ఈనాటికీ కేరళలో వ్యాపించి ఉన్నాయి.

అదండి కేరళ నిత్యసౌందర్య కథ.

Sunday, April 14, 2013

మాదీ హైదరాబాద్

సిటీ బస్సు మామూలుగా అన్ని ఊళ్ళల్లోలాగా కాకుండా స్టాపుకంటే కొంతదూరం ముందుకు వెళ్ళి ఆగింది. స్టాపులో ఉన్న జనం పోలో మంటూ బస్సు దగ్గరకు ఉరికారు. ఆ జనాల్లో ఒక చిన్నసైజు మహిళామండలి కూడా చీరలు కట్టుకుని రేసులో పాల్గొంటున్న పీటీ ఉష, అశ్వినీ నాచప్ప ల్లాగా పరుగెట్టారు. మా నాన్నా, నేనూ పరిగెత్తాము మందతోబాటు. మా నాన్నెలానో బస్సు ఎక్కేశాడు. నేను కాస్త వెనుకబడ్డాను. బస్సు బయలుదేరేసింది. నేను పరుగు కంటిన్యూ చేశా.

బస్సు అలా బయల్దేరి కాస్త దూరం వెళ్ళగానే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. పరిగెత్తుతున్న నేను కడ్డీ పట్టుకుని బస్సులో జొరబడ్డా. పట్టు తప్పబోయి పడిపోబోతున్న నా రెండవ చేతిని బస్సులో ఒకతను పట్టుకుని పైకి లాగేశాడు.

"కాయ్ కు రే! ఛడ్ నా నహీ ఆతా?" - ఇలాంటిదేదో వినబడింది. పక్కన తెల్లటి షేర్వాణీ, గంతల టోపీ, తాంబూల చర్వణం, సెంటు వాసన - ఇత్యాది భూషణాలతో ఇద్దరు సాహెబులు నవ్వుతున్నారు. నేనూ మొహమాటంగా నవ్వాను.

పదిహేడేళ్ళ వయసులో హైదరాబాదుతో నా తొలి అనుబంధం అది. నాయన వెంట ఎమ్సెట్ కౌన్సిలింగు కోసం నగరానికి వచ్చిన రోజులు. ’బస్సులో పరిగెత్తుకుని ఎక్కని హైదరాబాదీ తాబేలై పుట్టున్’ - అని హైదరాబాదు వాళ్ళ నినాదం. వాళ్ళలా చేస్తారనే డ్రయివర్లకు కూడా స్టాపులో బస్సునాపటం ఇష్టం ఉండదు.

అంతకు ముందు చాలా సార్లు బెంగళూరికి వెళ్ళి ఉన్నాను. అయితే బెంగళూరు కు వెళ్ళినప్పుడల్లా, ఒక ఆటవికుడు మొట్టమొదటి సారి నగరానికి వెళ్ళినట్టు ఉండేది. పైపెచ్చు మనది తెలుగు మీడియం కాబట్టి, అక్కడ మా బంధువుల పిల్లకాయలందరూ ఇంగిలీసు కాబట్టి భయంకరమైన పరిస్థితి. నా వేషభాషలు చూసి అందరూ నవ్వేవాళ్ళు. వాళ్ళదీ తప్పులేదు.

"What is your name?" అంటే "I am name Ravi" అంటే నవ్వరా వాళ్ళు?

అలాంటి పరిస్థితిలో ఉన్న నాకు హైదరాబాదు ’కొత్త’గా అనిపించింది. బెంగళూర్లో అపరిచితుడు మనతో ఆంగ్ల భాషలో మాట్లాడతాడు. ఇక్కడో? ’కాయ్ కు రే?’ - హెంత తేడా అసలు? బస్సును పరిగెత్తుకుని ఎక్కుట - ఎంత థ్రిల్లూ? హైదరాబాదుకు ఎట్లైనా సరే మళ్ళీ రావాలి - ఆలోచన పీకేసింది. ఆ ఛాన్సు పది రోజుల్లోనే వచ్చింది. స్టడీ సర్టిఫికెట్ మర్చిపోవడంతోటి, కవున్సిలింగు వాళ్ళు పది రోజుల్లో తెచ్చివ్వమన్నారు. అది తెచ్చివ్వడం కోసం మా నాన్నకు నచ్చజెప్పి నేనొక్కణ్ణీ హైదరాబాదుకు వచ్చాను.  ఈ సారి హైదరాబాదు మరింత అందంగా కనిపించింది. ఉస్మానియా పరిసరాలు భలే ఉన్నాయి! సికిందరాబాదు దగ్గర ఇరానీ చాయ్, నాంపల్లి పుల్లారెడ్డి స్వీట్లూ, కరాచీ బేకరీ బిస్కట్లూ ........హ్మ్... హైదరాబాదు లో ఏదో ఉంది!

ఫ్లాష్ ఫ్రంట్: తదనంతరకాలంలో బస్సులో పరిగెత్తుకుని ఎక్కే ఆర్ట్ ను నేను మాస్టర్ చేసేశాను. ఈ మధ్య తిరిగి హైదరాబాదులో అడుగు పెట్టినప్పుడు ఆ విద్య ప్రదర్శించి, వేగంగా వెళుతున్న బస్సులో విజయవంతంగా ఎక్కి, అందరూ నన్ను ఆరాధనాపూర్వకంగా చూస్తుంటే వాళ్ళవంక ఇలా ఒక లుక్కు ఇచ్చాను.

అయితే మరుసటి క్షణంలో నా మొఖం ఇలా మొఖంలా మారిపోయింది.

నా జేబులో కొత్తగా కొనుక్కున్న HTC మొబయిల్ ఫోను ఎవరో లేపేశారు. నేను బస్సుతో బాటు సమాంతరంగా పరిగెత్తి, సరిగ్గా బస్సు ఎక్కుతున్నప్పుడు ఒకడు న్యూస్ పేపర్ ను అడ్డుపెట్టి దాని కిందుగా చేయిపోనిచ్చి నా పై జేబులో ఉన్న ఫోను ఎత్తేశాడు. బస్సు ఎక్కుతూనే ఇది మెహ్దీ పట్నం బస్సు కాదా? అని అడుగుతూ దిగిపోయాడు....

****************************************************************************

మళ్ళీ భాగ్యనగర దర్శనం ఉద్యోగరీత్యా కలిగింది. ఈ సారి దర్శనం తో బాటు జీవనం కూడా. గుండు బొచ్చు లో....అదేనండి అలాంటిదేదో ఉంది కదా...హ్మ్....గచ్చీబౌలి అని అదన్నమాట. గుండు బొచ్చు ....అదే గచ్చిబౌలి అప్పట్లో చాలా పీస్ ఫుల్ ఏరియా. వినాయక నగర్ లక్ష్మి అనెక్స్ అపార్ట్మెంట్ లో రూమ్మేట్లతో కలిసి సావాసం.

ఓ రోజు...

శ్రీదేవి థియేటర్ లో రాత్రి సెకండ్ షో "జోష్" హిందీ సినిమా టికట్లు పట్టుకొచ్చాడు నా ఫ్రెండు. సినిమా కెళితే మొదలు పెట్టటానికి బాగా లేటయ్యింది. ఇంటికి వచ్చే సరికి రాత్రి ఒకటిన్నర గంటలవుతోంది. గచ్చిబౌలి పక్కన క్వార్టర్స్ లో మా వాడి ఇల్లు. వాడి ఇంటిదగ్గర దిగిపోతే నేను నడుచుకుంటూ వస్తున్నాను. పోలీసు జీపు పక్కన వచ్చి ఆగింది.

"ఏయ్ యాడకెళ్తున్నావ్?" - ఒక అధికార స్వరం
"ఇంటికి సార్"
"యాడకెల్లి వస్తున్నవ్?"
"సినిమాకి"
"టికెట్ చూయించు"
చూపించాను. టికెట్ నూ నన్నూ తేరిపార చూశాడతను. అతని యూనిఫారమ్ మీద ఖాన్ అని రాసుంది.
"హైదరాబాదుకు కొత్తా?" - నా అవతారం చూడగానే పోల్చుకున్నాడతను.
"అవును సార్"
చూడు, నీకింకా తెలుస్త లేదు, హైదరాబాదంటే. రాత్రి పూట తిరగాకు. - కుసో..అని బండ్లో కూర్చోబెట్టుకుని కాస్త దూరంలో ఉన్న ఇంటిదగ్గర దింపాడతను. చిన్న సంఘటన. ఎందుకో అతని మొఖం, ఆ రోజూ అలా నిల్చిపోయినై.

****************************************************************************

మా రూమ్మేట్లు అమెరికాకు పారిపోవడంతోటి గచ్చి బౌలి నుండి సికిందరాబాదుకు షిఫ్ట్ అయాను. కవాడిగూడా లో అపార్ట్ మెంటు. ఆరవ అంతస్తు. ఐదుమంది జనాభా. అందరిదీ మా ఊరే. ఇద్దరు ఉద్యోగులం, ఒకడు నిరుద్యోగి, ఇంకో ఇద్దరు చదువు.

ఆ ఇంటికి వాకబుల్ డిస్టన్స్ లో అబ్బాయ్ మెస్సు.
రన్నబుల్ డిస్టన్స్ లో క్రాస్ రోడ్స్. ఒక కుప్ప సినిమా థియేటర్లు.
జాగబుల్ డిస్టన్స్ లో టాంకు బండ్.

అందరూ సినిమా పిచ్చోళ్ళే. ఇంకేం? ప్రతి శుక్ర, శనివారాలు పండగే పండగ.

అక్కడా ఓ రోజు ... (ఆగస్ట్ 21. 2000 అనుకుంటా)

రాత్రి ఆఫీస్ నుండి వస్తూ వస్తూ రోడ్డు దాటి ఒక కిలో పెరుగు కొనుక్కొచ్చాం (శతమర్కటాలు x 5 = ఐదు వందల కోతులకు సరిపోవాలి కదా). అప్పుడు వర్షం మొదలయ్యింది. అప్పుడు మొదలైన వర్షం రాత్రంతా ఒక్క ఊపు ఊపేసింది. పొద్దున్నే ఆరవ అంతస్తు పక్కన డాబాపైకెళ్ళగానే దూరంగా హుస్సేన్ సాగర్ పరవళ్ళు తొక్కుతా కనిపించింది. నేను ముందు రోజు దాటిన రోడ్డు ప్లేసులో ఆరడుగుల యెత్తులో నీళ్ళు పారుతున్నాయి. ఆ పెట్టె అంగడి లేనే లేదు. భీభత్సం. వరద.

ఆ నీళ్ళల్లో దాటుకుంటూ ఆఫీసుకు బయలు దేరితే బేగంపేట దగ్గర బ్రిడ్జుకు పైన నీళ్ళు!

సీమ నుండి బయటకు అడుగుపెట్టి మొట్టమొదటి సారి నా జీవితంలో వరద అనుభవం.

ఆ రూమూ కొన్ని రోజులకు వదిలి ఒక్కణ్ణే మరోచోటికి షిఫ్టయ్యాను.

****************************************************************************

తాజ్ బంజారాలో అదేదో కంపెనీ లో నడకలోపల ముఖాముఖులు (Walkin interviews) జరుగుతుంటే వెళ్ళాను. ఇట్లాంటి వాటికి ఇస్టార్ హోటల్ లోపలికెళ్ళడం కోసమే అటెండ్ అవడం నాకు హాబీ. అట్లాంటి హై ఫై పరిసరాలను చూస్తేనూ, కోట్లూ గట్రా వేసుకుని సూటుకేసులు పట్టుకొని హడావుడిగా తిరిగే జనాలను చూస్తేనూ నేనొక ఆటవికుణ్ణి అన్న ఫీలింగు నాకు అప్పట్లో. అది పోగొట్టుకోవాలన్న తపనతో అలాంటి రోజుల్లో అట్టాంటి హోటళ్ళ దగ్గర తచ్చాడుతా ఉండేవాణ్ణి.

లిఫ్టు ఎక్కకుండా మెట్లెక్కి పైకెళుతున్నా. (లిఫ్ట్ ఎక్కి మూడవ ఫ్లోర్ కెళటానికి రెండు నొక్కాలా, మూడు నొక్కాలా అని తెలిసి ఛస్తే కదా). అక్కడ లాబీలో ఒక యువకుడు నీలిరంగు గళ్ళ చొక్కా, జన్యువుల (జీన్స్) పంట్లామూ తొడుక్కుని కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నాడు. అతను పేపర్ నుండి ముఖం తిప్పి నా వంక చూశాడు. ఎంత హేండ్సమ్ గా ఉన్నాడు! బాగా తెలిసిన ముఖమే. ఛప్పున గుర్తుకు రాలే. ఎక్కడ చూశాను? మెట్లెక్కి పై ఫ్లోర్ కెళ్ళిన తర్వాత బల్బు వెలిగింది.

అతను -

అప్పటికతను కొన్ని సినిమాలు తీశాడు రాజకుమారుడు, వగైరా కానీ అంత పెద్ద హిట్లు కావు. భాగ్యనగరంలో ఇలా సైన్మా హీరో మరో చిత్రమైన సందర్భంలో ఒకచోట పుణుకులు తింటూ ఉంటే అగపడ్డాడు. అది మరీ శీను వైట్ల సినిమా సీనులా ఉంటుంది కాబట్టి రాయను.

****************************************************************************

హైదరాబాదులో ఎండాకాలంలో ఒక రోజు.

ఒక లారీలో మామిడి పళ్ళు అమ్ముతున్నారు. అవి నూజివీడు రసాలట. మా వైపు అవి దొరకవు. సరే ఒక కిలో (16 పళ్ళు) తీసుకున్నా. ఇంటికెళ్ళి మింగడం మొదలెడితే పదహారు దగ్గర ఆగింది. అప్పుడే అయిపోయాయా? ఛ. మళ్ళీ దండయాత్ర జరిపి కక్కుర్తిగా మరో మూడు కిలోలు తీసుకొచ్చాను. ఆ మూడు కిలోలు వరుసబెట్టి లాగించేశాను. ఆ రోజు బానే ఉంది. మరుసటి రోజు నుంచీ శరీరం ఇస్త్రీపెట్టెలా మారింది. మా ఫ్రెండ్స్ ఎలానో కనుక్కుని వచ్చి నా బాడీని మోసుకొని పోయి వాళ్ళ రూములో పారేశారు. అక్కడే వారం తిష్ట.

****************************************************************************

అమ్చీ హైదరాబాదులో ఉండగానే మా సంస్థ వాళ్ళు డబ్బులు కట్టి నన్ను జపాను భాష వెలగబెట్టమని శ్రీనగర్ కాలనీ లో ఒక ఇన్స్టిట్యూట్ కు పంపారు. పని చెయ్యమంటే బద్ధకం కానీ, ఇలా ఉద్ధరి బేరాలు తగిలితే విజృంభించమా యేంది? జపనీసు మూడు చెర్రీ బ్లోసమ్ పూవులు, ఆరు చెర్రీ కాయలూ లాగా సాగింది. రేవంతో సాన్ తో కొన్ని అడ్వెంచర్లూ, డిబెంచర్లూ చేయటానికి అవకాశం వచ్చింది. 

ఇంకా హైదరాబాదుతో అనుభవాలు బోల్డు, మినర్వా కాఫీబార్ లో కారప్పొడి ఇడ్లీలు, జయభేరి దగ్గరున్న సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, విశాలాంధ్ర పుస్తకాలూ, సికందరాబాద్ సంతోష్ సినిమా లో ఇంగ్లీషు సినేమాలు, పాతనగరం లస్సీ, ఫెలూదా, హర్ష, వెంకటరమణా, అబ్బాయి మెస్సుల్లో మీల్సూ, అభిరుచి లో జున్నూ, శ్రీనగర్ లో నెల్లూరు వాళ్ళ కారం దోసె (ఇప్పుడు లేదు).....ఇంకా మా రూమ్మేట్లు సూర్య, చక్రి గాడి సినిమా కబుర్లూ, భాగ్యనగరంలో వర్షం.....

భాగ్యనగరం - మొదటిసారి ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు - నాకు సమయమూ, డబ్బూ రెండూ అవసరమైన రోజులు. అప్పుడు మా అమ్మగారి చివరి రోజులు, ఇంట్లో కొన్ని అప్పులు. మా నాన్న తర్వాత నా హయాం మొదలైన రోజులు. ’భాగ్య’నగరం - పేరు నిలుపుకుంది. ఋణపడేలా చేసుకుంది. చాలా అవసరాలలో భాగ్యనగరం నన్ను ఆదుకొనింది. భాగ్యనగరం తో వ్యక్తిగతంగా నాకు ఏదో అనుబంధం ఉంది. డవుట్ లేదు.

Wednesday, March 20, 2013

వ్యక్తివివేకం

భ్రమ ధార్మిక! విస్రబ్ధః స శునకోऽద్య మారితస్తేన |
గోదానదీకుచ్ఛకుడంగవాసినా దృప్తసింహేన ||

------------------------------

గాథాసప్తశతి లో ఉన్నట్లు చెప్పబడుతున్న శ్లోకం అది. (ఆ శ్లోకం అందులో ప్రక్షిప్తమని కొందరు) ఆ శ్లోకం గురించి నిదానంగా చెప్పుకుందాం. అది ’ధ్వని’ కి ఒకానొక ఉదాహరణ.

ఒక మాటను సూటిగా - అంటే వాచ్యంగా కాక వ్యంగ్యంగా చెప్పటం ధ్వని అని ఒక సిద్ధాంతం. ఇలా చెప్పడమే ’గొప్ప’ అని, ఉపమా, ఉత్ప్రేక్ష్య ఇత్యాది అలంకారాలు కావ్యానికి శరీరం అయితే ’ధ్వని’ అనేది కావ్యం తాలూకు ఆత్మ అని, రామాయణాది కావ్యాలలో ఉన్నది ధ్వని యేనని, అందుకే అవి ఉత్తమ కావ్యాల కోవకు చెందుతాయని ఆ సిద్ధాంతం చెబుతుంది. దీని కర్త ఆనందవర్ధనుడు. ఈయనది 9 వ శతాబ్దం. అంతకు ముందు కావ్యం తాలూకు ఆత్మ రీతి అని, అలంకారాదులని, అదని ఇదని తెగ కొట్టేసుకుని, ఈ ’ధ్వని’ కాన్సెప్టు వచ్చిన తర్వాత అందరూ సైలెంటయిపోయేరు.

ఈ ధ్వని కాన్సెప్టుకు మన మనుచరిత్రలో వరూధిని మంచి ఉదాహరణ.

పాటున కింతులోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకె!

- ’ఇచ్చోట’ భవన్నఖాంకురము సోకె - అని ఆమె చెప్పటం ఒక ధ్వని. (ఈ పద్యం మొత్తం సారాంశం తీసుకుంటే ధ్వని కాదనుకోండి. అందుకే ఇక్కడే ఆపాం.)

’ఒరే, నన్ను ఇలా తోసేశావే, నీవు తోసేప్పుడు నీ గోరు ఇదుగో ఇక్కడ, ఇక్కడ గుచ్చుకుంది చూడు’ అని వరూధిని ప్రవరాఖ్యునికి చూపిస్తుందన్నమాట. (ఎక్కడ అని అడిగిన వాళ్ళు బెంచీ మీద నిలబడండి.) - అంటే పైకి చెప్పే అర్థం - (విధేయార్థం అంటారు దీన్ని) ఒకటి. చెప్పదల్చుకున్న ఒరిజినల్ అర్థం (ప్రతీయమానార్థం అని దీని పేరు) మరొకటి.

సాఫ్టు వేరు వాళ్ళకు అప్రైసల్ టైం లో వాళ్ళ మానేజరు ఈ ధ్వని పద్ధతిలోనే మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళకు వీజీగా అర్థం అవచ్చు. ఇంకా నిత్యజీవితంలో ఎన్నో చోట్ల ధ్వని కనిపిస్తుంది. ఇది వరకటి రోజుల్లో భార్యలు కూడా భర్తలతో ముఖ్యంగా జీతాలొచ్చే సమయంలో ’ధ్వని’ పద్ధతిలో మాట్లాడేవాళ్ళట. ఆ ’ధ్వని’ కి భర్త స్పందించకపోతే ధ్వని పద్ధతిని వదిలేసి ఏకంగా ధ్వనితోనే మాట్లాడేవాళ్ళట. ఇది నిన్నటి తరం భార్యల సంగతి. నేటి భార్యల సంగతి -  ప్రస్తుతానికి - అప్రస్తుతం. :)

ఇలా ఈ ధ్వని సిద్ధాంతం - కావ్యంలో కవి భావనలను ఎలా చెప్పాలో చెప్పి తిరుగులేని బావుటా ఎగరేసింది. కావ్యం అంటే మరేమీ లేదా? ఇలా చెప్పదల్చిన దాన్ని చెప్పకుండా చెప్పటమేనా అని కొన్ని ’ముక్కుసూటిగా’ ఆలోచించే హృదయాలు గాయపడి బాధపడినయ్. ఆ గాయపడిన లిస్టులో ఒకానొక తిరుగుబాటుదారుడు - మహిమభట్టు.

ఈ మహిమభట్టు ధ్వని సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఒక పుస్తకం వ్రాసినాడు. ’ఖండిస్తూ’ అని కాస్త సభ్యభాషలో చెబుతున్నాను కానీ, నిజంగా వ్యవహారం వేరేలా ఉంటది. అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డిని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళే రేంజులో ఈయన ధ్వని సిద్ధాంతాన్ని కుళ్ళబొడుస్తూ వెళతాడు.

ధ్వని సిద్ధాంతాన్ని నిర్వచిస్తూ ఆనందవర్ధనుడు చెప్పే శ్లోకం ఇది.

యత్రార్థః శబ్దో వా తమర్థమ్ ఉపసర్జనీకృతస్వార్థౌ |
వ్యఙ్క్తః కావ్యవిశేషః సః ధ్వనిరితి సూరిభిః కథితః ||

తాత్పర్యము: ఎక్కడ (ఏ కావ్యంలోనైతే) అర్థం కానీ, శబ్దం కానీ తనను అప్రధానంగా చేసుకుని ప్రతీయమానార్థాన్ని వ్యక్తీకరిస్తుందో అది విశేషమైన కావ్యం అని పండితులచేత చెప్పబడింది.

ఈ Definition శ్లోకంలోనే మహిమభట్టు పది తప్పులు చూపెట్టాడు. ఆ తర్వాత ఇక వీరంగమే. అదంతా గొప్ప శాస్త్ర చర్చ.

మహిమభట్టు పుస్తకం పేరు వ్యక్తివివేకం. ఇక్కడ వ్యక్తి - ’అభివ్యక్తి’, ’వ్యక్తీకరణ’ - వీటిల్లో ఉన్న వ్యక్తి. Expression అన్నట్లు. ఈ ’వ్యక్తి’ తాలూకు పూర్వాపర జ్ఞానాన్ని చెప్పటమే ఈ ఈ పుస్తకం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. ఈయన ప్రధానంగా చెప్పేదేమంటే - పొగ లేకుండా నిప్పు లేదు. ధూమవత్ అగ్నిః. ఎంతటి అవివేకి కూడా వాచ్యార్థాన్ని మాత్రమే పట్టించుకోడు. అనుమానప్రమాణంతోటి ఎదుటివాడు ఏం చెబుతున్నాడోనని కనీసం ఆలోచిస్తాడు. ఇందాక వరూధిని ’ఇచ్చోట’ అనగానే ఓహో అలాగనా అని అమాయకంగా అడిగేవాడు అవివేకి. వివేకి అయితే వరూధిని ఏమి చెబుతున్నదని గ్రహిస్తాడు. ఎలా గ్రహిస్తాడు? అనుమానప్రమాణం తోటి. అంటే ధ్వని అని ఏదయితే అంటున్నారో అది అనుమానంలో అంతర్భాగమే తప్ప ’ధ్వని’ అని కొత్తగా ఏదీ లేదన్నమాటే కదా?

ఇది ఈయన లాజిక్.

ఈ మహిమభట్టుది, ఆ పెద్దాయన ఆనందవర్ధనునిది ఇద్దరిదీ కాశ్మీరదేశమే. ఇద్దరూ కాశ్మీరశైవులే. అయితే మహిమభట్టు నైయాయికుడు. (న్యాయ దర్శనాన్ని అనుసరించే వారిని నైయాయికులు అంటారు. వీళ్ళు ఒక టైపు నాస్తికులు. అంటే దేవుడు అనే quadratic expression ను - నమ్మకంతో కాక - అనుమానంతో సాధిస్తారన్నమాట). దానికి తోడు ఈ మహిమభట్టు కాస్త బౌద్ధాన్ని వంటబట్టించుకున్నట్టున్నాడు.

ఒక వస్తువును - ఇది ’ఫలానా’ అని బౌద్ధులు నిర్వచించరు. ఎందుకంటే ఫ - లా - నా అని పలికేలోపు ఆ వస్తువులో ఎంత సూక్ష్మపరిధిలోనైనా సరే మార్పు వచ్చేసుంటుంది. వీడు ’రాముడు’ - అనే లోపలే సదరు రా-ము-డు గారికి మూడు క్షణాల ఆయుష్షు పెరిగింది. అతని తలలో వెంట్రుక ఒక మైక్రాను పరిమాణంలో నెరిసి ఉంటుంది. అంటే ఇందాకటి, మూడు క్షణాల క్రిందటి రాముడు, ఇప్పటి రాముడు వేరు. ఇవతల చూసేవాడిలోనూ మార్పొచ్చీసింది. బయట ప్రపంచంలోనూ మార్పొచ్చేసింది. ఒక క్షణంలో గోదావరిలో కొన్ని గేలన్ల నీరు సముద్రం చేరేసింది. రాముడు లేడు. రాముడిలో 'మార్పు' మాత్రమే ఉన్నాది. అంటే ’మార్పు’ మాత్రమే real. మరేదీ కాదు. మరి - ఇందాకటి రాముణ్ణి రాముడు ++ లాంటిదేదో అనాలికానీ రాముణ్ణి - రాముడు అనే అనడం తప్పు కదూ? - ఇది బౌద్ధుల - దిమ్మ తిరిగింపజేసే లాజిక్.

మహిమభట్టు లో ఆ ఛాయలు గోచరిస్తాయి. శబ్దానికి అభిధ, లక్షణ, వ్యంజన అని మూడు రకాల స్వరూపాల అర్థాలున్నయని మనవాళ్ళు పాపం ఏదో కాస్త సమాధానపడ్దారు. ఈ మహిమభట్టు ప్రకారం శబ్దానికి ’అభిధ’ మాత్రమే ఉంటుంది. అని అడ్డం తిరుక్కుని వాదిస్తాడు. ఇదీ చాలా గొప్ప వాదన.

ఇలా ఈయన ధ్వని సిద్ధాంతాన్ని మూలమట్టంగా విమర్శిస్తూ పోతాడు. ఇదంతా చాలా గొప్పగా ఉంటుంది, చాలావరకూ అర్థం కాదు కూడా. పన్లోపనిగా ఈయన కుంతకుడనే మరొక అలంకారికుణ్ణి (అతని సిద్ధాంతం వక్రోక్తి - అంటే చమత్కారంగా చెప్పుట) తన్ని తగలేస్తాడు.

------------------------------

ఈ బేక్ గ్రవుండ్ తోటి మొదట స్టార్టింగులో చెప్పిన శ్లోకం, దాని అర్థం, దాని కథాకమామీషు చెప్పుకుందాం. ఇది మహిమభట్టు లాజిక్ లా ఉండదు, భయపడకండి. నిజానికి లడ్డూ లాంటి శ్లోకం ఇది.

భ్రమ ధార్మిక! విస్రబ్ధః స శునకోऽద్య మారితస్తేన |
గోదానదీకుచ్ఛకుడంగవాసినా దృప్తసింహేన ||

ఈ శ్లోకానికి ఒక బేక్ గ్రవుండు ఉంది. ఇదీ -

మాంచి పరువంలో ఉన్న నాయిక తన ప్రియునితోటి గోదారి గట్టుకాడ ఒక తోటలో అంతకు ముందే అనుకున్న సంకేతస్థలంలో కలుసుకుందామనుకుంది. అక్కడకెళ్ళి చూస్తే ఒక బాపనాయన (ధార్మికుడు) ’పూజలు చేయా పూలు కోస్తాను’ అని పాడుకుంటూ పూలు తెంపుకోడానికి వచ్చినాడు. వేళకాని వేళలో అతనలా దాపురించడానికి ఒక కారణం ఉంది. అతనికి కుక్కలంటే అలర్జీ. ఆ చుట్టుపక్కల ఓ కుక్క ఉన్నది. ఆ కుక్క ఇప్పుడు ఇతను వచ్చిన టైములో డ్యూటీకెళ్ళింది కాబట్టి రాదు. అది కనిపెట్టి మనవాడు పూలు తెంపుకోడానికి వచ్చాడు. ఈమె అతణ్ణి చూసింది. "అబ్బా! శనిగాడు!" అనుకుంది. అతనితో ఈ శ్లోకం చెప్పింది.

ఓ ధార్మికుడా! ఇక నువ్వు స్వేచ్ఛగా (ఈ ప్రాంతాలలో) తిరుగాడు! ఆ పాడు కుక్క ఉందే, దాన్ని ఈ దగ్గర్లో నదిపక్కన పొదల్లో నివాసముండే సింహం చంపేసిందిలే. ఆ కుక్కకు భయపడే పని లేదింక!

ఇదీ ఆమె పైకి చెప్పిన అర్థం.

దీనికి ’ధ్వని’ కారుడు చెప్పిన ప్రతీయమానార్థం ఇది - ’ఓ ధార్మికుడా! ఇక్కడకు రాబాకు. ఇక్కడ సింహం ఉన్నాది. అది కుక్కను చంపేసింది, నిన్నూ చంపేస్తూంది. వెళ్ళిపో’ (నీవు దయ చేస్తే నేనూ నా ప్రియుడూ కలిసి ఏదో తృతీయపురుషార్థసాధన చేసుకుంటాము)

------------------------------

దీనికి మహిమభట్టు అబ్జెక్షన్లు చాలా లేవదీశాడు. అన్నిటికన్నా పక్కాగా ఉన్నది, నాకు బాగా నచ్చినదీ అయిన అబ్జెక్షన్ ఇది.

- సింహం కుక్కను చంపేసింది, ఇక నువ్వు కుక్కకు భయపడకుండా ’తిరుగు’ అనగానే ఆ బ్రాహ్మణుడు తెలివైన వాడైతే ఇలా ఆలోచిస్తాడు.

- తిరుగు అని అంటా ఉంది. అదీ వినమ్రతతో అంటా ఉంది. కానీ సింహం ఉంది అని భయపెడతా ఉంది. సింహం కుక్కకంటే బలమైనది. సింహమే వచ్చి ఉంటే సింహం వస్తుంది పారిపో అని చెప్పకుండా - అలా అలవోకగా, సావకాశంగా, ఆమె కూడా సింహమొస్తుందన్న టెన్షన్ పడకుండా - నన్ను పారిపొమ్మని చెప్పకుండా - ఇక్కడ నీకు వచ్చిన అడ్డంకీ యేమీ లేదులే, హాయిగా పూలు కోసుకో అని అసంబద్ధంగా ఎందుకు చెబుతా ఉంది?

అంటే ఈమె చెబుతున్నది నిజం కాదు.

ఇలా బ్రాహ్మణుడు సహజంగానే ఆలోచిస్తాడు. ఎందుకంటే అతను వివేకి కాబట్టి, లేదా కనీసం ఆ అమ్మాయికున్న తెలివితేటలు అతనికి ఉంటాయి కనుక.

అలా బ్రాహ్మణుడు ఆలోచిస్తాడన్న సెన్సు ఆమెకు ఉంటే అలా చెప్పదు. అంటే - ఈ పద్యం అనౌచిత్యమూ, ధ్వని సిద్ధాంతానికి విపరీతంగానూ ఉన్నది. అంచేత ధ్వని సిద్ధాంతం తప్పు.

ఇంకా ఆలోచిస్తే ఎంత సింహమైనా తన స్టేటస్ కు తగిన జంతువులను చంపి తింటుంది కానీ, కుక్క వెంటబడి చంపదు. అది లోకవ్యవహారానికి భిన్నంగా ఉంది. ఇది అనౌచిత్యం. మరి ఆ ధ్వని కారుడు మేనర్సు లేకుండా తప్పుడర్థాలెందుకు చెబుతా ఉన్నాడు?

------------------------------

ఏతావతా ధ్వని అనేదే లేదు.

ఇలా ధ్వనికారుడు చెప్పే ఒక్కో ఉదాహరణనూ ఈ మహిమభట్టు తాట వలిచేస్తూ, వెళతాడు. ఈతని వాదనలన్నీ చాలా గొప్ప లాజిక్ తోటి ఉంటాయి. ఇందాక అన్నట్లు అర్థం కావు కానీ, ధ్వన్యాలోకాన్ని, ఈ వ్యక్తివివేకాన్నీ పక్కపక్కన పెట్టి చదువుకుంటూ పోతే అర్థమయినంత మేరా భలే ఎంటర్ టయిన్ మెంటు. అలాగని ఈ మహిమభట్టుగారు ఏదో కోపంతోనో, ఈసడిస్తున్నట్టో, ఆనందవర్ధనుణ్ణి తిడుతున్నట్టో ఉండదు. గ్రంథం మొదట్లో ఆనందవర్ధనుణ్ణి మనసారా అభినందించి, గొప్పవాళ్ళను విమర్శించడం కూడా యశస్సుకు దోహదమని చెప్పుకుంటాడు.

వాదనలు రాజవాదమని, పండితవాదమని రెండురకాలట. రాజవాదమంటే - వాదించే వ్యక్తి పూర్తీగా తనంతట తానే అన్ని విషయాలనూ కూలంకషంగా తను నమ్మిన/ఆచరించే/ఆదర్శంగా పెట్టుకున్న సిద్ధాంతాలకనుగుణంగా విమర్శ చేయటం. పండితవాదమంటే - ఇద్దరూ కలిసి విషయాన్ని అటూ ఇటూ పొర్లించి చూడటం. పండితవాదానికి మిళిందపన్హ అనే బౌద్ధగ్రంథం గొప్ప ఉదాహరణ అయితే, రాజవాదానికి వ్యక్తివివేకం గొప్ప ఉదాహరణ

Thursday, February 7, 2013

పాండిత్యం = జ్ఞానాభాస


ఆధ్యాత్మికప్రపంచంలో - ఎంచేతనో తెలియదు కానీ కొన్ని శబ్దాలను నిర్వచించి, వాటి గురించి నిర్దుష్టమైన అర్థంలో ఉపయోగించి మనవాళ్ళు తప్పు చేశారా అనిపిస్తుందొక్కొక్కసారి. అటువంటివాటిలో రెండు శబ్దాలు - జ్ఞానం, ఆత్మ.

జ్ఞానం - అని దేన్నయితో ఆధ్యాత్మికవాదులు అంటున్నారో అది నిజానికి తెలియదగింది కాదు. అంటే బుద్ధితో , మెదడు అనే పరికరంతో అంచనా వేయవలసినది కాదు. బుద్ధి చేత తెలియదగింది సమాచారం. ద్వంద్వాలకు లోబడినది మాత్రమే సమాచారం వల్ల తెలియదగింది. భావనాత్మక ప్రపంచం సంగతి వేరు. ఉదాహరణకు దుఃఖం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం - ఒక సమాచారం వల్ల తెలిసేది కాదు. ఒకవేళ అది సమాచారమే అయితే ఆ సమాచారాన్ని , అది ఎంత పెద్దదయినా సరే తెలుసుకుని దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. అలా జరగడం లేదే. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని తీసిస్ లు చదివినా మనిషికి దుఃఖం అన్నది పోవట్లేదు. ఏదో కొద్దో గొప్పో కొంతకాలం పోతుంది, మళ్ళీ వచ్చి తగులుకుంటూ ఉంది. ఆ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం కావాలంటే - కనుక్కోగలిగే  జవాబు ప్రశ్నకు బాహ్యమైనది అవకూడదు. అంటే ఆ ప్రశ్నకు సమాధానం - దుఃఖం అంటే ఎమిటి? ఆ ప్రశ్న అంతరించడంలోనే ఉంది తప్ప మరొక విధమైన ప్రక్రియలో లేదు.

ప్రశ్న అంతరించడమంటే ఏమిటి? బుద్ధి లేదా మెదడు జవాబు కోసం వెంపర్లాడకండా మూలమట్టంగా తనలో తానే annihilate కావడం. అంటే మెదడు తను నిర్వర్తించే వ్యాపారాలను తనే ఏ విధమైన choice లేకుండా గమనించే ఒక స్థితి. ఆ స్థితిలో దుఃఖం అన్నది ఉండకపోవచ్చు.

ఈ స్థితి ఒక మనిషిలో స్వతఃసిద్ధంగా ఏర్పడగలిగితే అది నిర్వాణం అని బుద్ధుడి నిర్వచనం. ఆ స్థితిలో మనిషికి , ప్రపంచానికి భేదభావం కనిపించదట. చూచేవాడు, చూడబడేది, చూచుట అన్నీ నశించి, జగత్తు అణువణువునా తనూ, తనలో జగత్తూ స్పష్టంగా కనిపిస్తూ, ఏ విధమైన ద్వంద్వమూ ఏర్పడని దశ. ఆ వాక్యంలో - స్వతఃసిద్ధంగా - అన్నది ఎందుకంటే - ప్రయత్నపూర్వకంగా మెదడు వ్యాపారాలను గమనించడం అసంబద్ధం. ఎందుకంటే - ఆ ప్రయత్నం అన్నది బుద్ధిలో అంతర్భాగం కాబట్టి.  కానీ ధ్యానం మొదలు పెట్టాలంటే ఎక్కడో ప్రయత్నం తప్పనిసరి. అదే ఆ ప్రయత్నమే ఆ తర్వాత ప్రయత్నరహితమైన ’అలవాటు’ గా మారవచ్చు. బుద్ధిని ఏ మాత్రం వికల్పాలకు తావివ్వనీయకుండా అలా శాంతంగా కూర్చుని దాని తాలూకు వ్యవహారాలను గమనించడం చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పని పేరు విపశ్యన. (విశేషంగా చూచుట). ఇలా గమనిస్తూ ఉంటే కొంతకాలానికి ఆలోచనలు స్థంభించి, ఆ పని తనంతట తానే జరగడం మొదలు అవుతుంది. దాన్నే ధ్యానం అన్నారు. ఈ ఆలోచనలు స్థంభించి, ఆలోచనల మధ్య ఖాళీలు ఏర్పడే దశను ’సతోరి’ అని జెన్ బౌద్ధులు అన్నారు. అ సతోరి ముదిరితే సమాధి అవుతుందని వాళ్ళంటారు.

ఈ వ్యవహారాన్ని అట్నుంచి నరుక్కొస్తే - దుఃఖం ఎందుకు వస్తుంది? అంటే కోరిక వల్ల అని బుద్ధుడు. (అష్టావక్రుడు కూడా) కోరిక తీరితే - ఓస్ ఇంతేనా అని దుఃఖం, తీరకపోతే తీరి ఛావలేదని దుఃఖం. కోరిక అన్నది ఎలా కలుగుతూంది? ఎంపిక (choice) వల్ల. నాకు సంతోషమే కావాలి. సుఖమే కావాలి, సెక్యూరిటీయే కావాలి, బాధలొద్దు, తనకలాట వద్దు అన్న బుద్ధి తాలూకు ప్రేరణ వల్ల. అలాగని కోరికలను చంపేసుకునో, వైరాగ్యపు పాటలు వినో వైరాగ్యం కొని తెచ్చుకుంటే - అది భారం అవుతుందే తప్ప అందువల్ల root cause సమిసిపోదు. ఈ choice - బుద్ధి వల్ల కలుగుతా ఉంది. బుద్ధికి ఇలా జీవితంలో ప్రతీక్షణం ఒక choice కోసం వెంపర్లాడే ప్రవృత్తి ఎలా వచ్చింది అంటే దాని లక్షణమే అంత. దాని స్వభావమే అలాంటిది. ఆ స్వభావాన్ని దాటి ఆవల ఏముందో తెలుసుకోవాలంటే - choice-less awareness కావాలి. అదే ఇందాకటి విపశ్యన. ఆ విపశ్యనకు అంతిమప్రస్థానమే బుద్ధాదులు పొందిన సమాధి. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి అన్న ఆధునిక బుద్ధుడు Mutation of brain cells అన్నాడు.

సరే మనం మామూలు మనుషులం. అలాంటి స్థితి పొందలేం. ఊరికే మాట్లాడుకుని అలాటిదొకటుందని ఫిక్స్ అవచ్చు. అయితే ఇక్కడ చర్చ ఆ స్థితి ఎలా కొనితెచ్చుకోవడం అని కాదు. ’జ్ఞానం’ అనే ఒక పదం గురించి.

ఇందాకటి స్థితి - అనుభవానికి మాత్రమే లోబడగలిగినది. అది సమాచారం కాదు - అంటే సమాచారం ద్వారా తెలిసే వాస్తవం కాదు. That is not a knowable entity. అంటే - Unknowable cannot be known. It will be only realized as - unknowable, after mind annihilates itself by getting out from the realms of known and unknown. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి ’సత్యం’ గా ప్రవచించాడు. ఇందాక అన్నట్లు ఇది స్పష్టంగా ఇతమిత్థమని చెప్పలేనిది, కానీ సూచించగలిగేది మాత్రమే. అది ఒక ఆలోచనలకు ’అభావ’ మైన స్థితి. అంటే శూన్యస్థితి.

పరిస్థితి ఇలా ఉంటే జ్ఞానం అన్నదాన్ని - సమాచారం అన్న అర్థంలో చెప్పడం వల్ల - పండితులు జ్ఞానులై కూర్చునే ఒక పరిస్థితి ఏర్పడింది. జ్ఞానం అంటే తెలియదగింది అని నిర్వచనం చెప్పారు కాబట్టి తెలియదగిందంటే ఏదో ఒకటుండాలి కాబట్టి భగవంతుడు అన్న object వచ్చి చేరింది. భగవంతుడంటే? - ఇల్లా తెల్లబట్టలు చుట్టుకుంటాడు, ఇలా నడుస్తాడు, అలా ఆలోచిస్తాడు. ఎక్కడో ఉంటాడు, వాడికి కోపం వస్తుంది. వాడు పిల్లవాడిలా ప్రవర్తిస్తాడు. వాడికి లడ్డూ ఇష్టం వగైరా వగైరా వగైరా. ఇందువల్ల జ్ఞానం అనేది ఎందుకు కావాలో అన్న ప్రశ్న నశించింది. మొత్తం వ్యవహారం పక్కదారి పట్టింది. పండితులు బయలు దేరారు. వారికి అనుసరణీయులు తయారయ్యారు.

ఈ జ్ఞానం మెల్లగా చాప కింద నీరులా ’మతం’ క్రిందికి చేరింది. ఏదో చాలా నిగూఢమైనది, కష్టపడి అర్థం చేసుకోగలిగినది, ’సంస్కృత’ భాషలో ఉన్నది అయిన ’సమాచారం’ మన మహర్షులు మనకు ఇచ్చి పోయారు. అది తెలుసుకుంటే మనం జ్ఞానులు అవుతాం. అది తెలియని వాడు అజ్ఞాని. అది ఒక ముక్క తెలిసి, అంతా తెలిసినట్టు మాట్లాడే వాడు కూడా జ్ఞానమార్గంలో ఉన్నాడు కాబట్టి ఏ మాత్రం తక్కువ తినలేదు. వాడి గురించి మాట్లాడ్డమా? అమ్మో? - తప్పు కదూ? ఈ భావాలు మనలో రక్తంలో, అణువణువునా ఇంకి పోయాయి.

ఇక్కడ ఒక విషయం. ఈ మాట్లాడుతున్నదంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో అని గుర్తు చేస్తున్నాను. లౌకికం వేరు, ఆధ్యాత్మికం వేరు. లౌకికంగా ఆలోచిస్తే - వైద్య విద్య (లేదా జ్యోతిషం/నిరుక్తం, వ్యాకరణం ఏదైనా) అని ఒకటుందనుకుందాం. లౌకికంగా ఆ విద్యను ఎవరో అందించిపోయారు కనుక వారి మార్గాన ప్రయాణించడం అవసరం. ఆ విద్యకు రూపకర్తలను గుర్తించడం ఒక విధి. ఆ విద్య బుద్ధి పరిధికి చెందినది కాబట్టి బుద్ధితో సమగ్రంగా తెలియదగింది కాబట్టి అక్కడ విద్యను, కర్తలను ఆరాధించడం మానసిక అవసరం. అలాగే దైవభక్తి. దేవుడున్నాడా అన్న శంక ఒకపక్క పీడిస్తున్నా, దైవభక్తి మాత్రం - మనిషికి మానసిక అవసరం. దేవుణ్ణి నమ్మడం మనిషికి బలహీన క్షణాలలో మానసిక బలాన్ని, సాంత్వననూ, చిత్తశాంతిని ప్రసాదిస్తుంది. పైగా ఈ విశ్వాసమే బలమయిన ఉపకరణంగా లౌకికంగా, ఆధ్యాత్మికంగానూ ఉపకరించగలదు. ఆధ్యాత్మికమంటే - నాస్తికత్వం కానవసరం లేదు.ఆధ్యాత్మికమంటే బౌద్ధిక దృష్టికి అందని నమ్మకానికి చెందినదనీ పొఱబాటు పడనక్కర లేదు. ఇది రెంటికీ మధ్యసంగతి. పూర్తిగా వ్యక్తిగతమైనది, వ్యవస్థాగతానికి భిన్నమైనదీనూ.

కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో, existential dilemmas ఎందుకొస్తున్నాయి అన్న విషయానికి సంబంధించి ఒక ఆలంబన - ’crutch’ ఎందుకు కావాలి? ఆసియా నుండి యూరోపుకు వెళ్ళడానికి భౌతికంగా విమానం కావాలి. దుఃఖం అన్నది తెలియడానికి ఎక్కడికి వెళ్ళాలి? దుఃఖాన్ని noun గా కాక, verb గా realize అవగలగాలి. అంతే. అంటే గతం, భవిష్యత్తు నశించి, శుద్ధమైన వర్తమానంలో జీవించడం తెలియాలి. అదే అసలైన జ్ఞానం. ఇది సమాచారం కాదు, ఎఱుక మాత్రమే అని మళ్ళీ మరోమారు జిడ్డుకృష్ణమూర్తి ఉవాచ. (మనకు ఆ దృశ్యం లేదు. ఇలా సొల్లు మాట్లాడుకుంటే ఒక ఊరట)

ఇప్పుడు మన కర్తవ్యం ఏమంటే - జ్ఞానం అన్నవెంటనే అది పండితుల గుత్తసొమ్ము అన్న మాటను అంగీకరించకపోవడం. ఒకడెవడైనా జ్ఞానాగ్నిదగ్ధకర్ముణ్ణి, బ్రాహ్మీమయమూర్తిని అంటే అతడికి అనుభవజ్ఞానం ఉందని పొఱబాటు పడనవసరం లేదు. అతనికి గౌరవం ఇయ్యవచ్చు, తప్పులేదు. అయితే అతడు ఆధ్యాత్మికమార్గంలో అనుసరణీయుడు కానవసరం లేదు. అతడు చెప్పేదంతా ’జ్ఞానం’ అని సర్దిపుచ్చుకుని ’మహత్త్వం’ ఆపాదించెయ్యడం పొఱబాటని గుర్తెరగాలి. ఇది ఒక అవసరం.

మనం జ్ఞానం ఏదో తెలుసుకోకపోయినా పర్వాలేదు. ఏది జ్ఞానం కాదో దానిని తెలుసుకుంటే అదే ఏదో ఒక రోజు మనకు మార్గం చూపించవచ్చు. అంతే కాక, ఒక పొరబాటు విషయానికి మహత్వం ఆపాదిస్తే ఆ మహత్వం చేసే కీడు బయటికి కనిపించనిది. పండితులను ఆరాధించడం కూడా అటువంటిదే.

అదీ సంగతి.

మరొకటి ’ఆత్మ’. దీన్ని కూడా మనవాళ్ళు పాజిటివ్ టెర్మ్స్ లో నిర్వచించి కష్టపెడుతున్నారు. సాంఖ్యయోగంలో గీతాకారుడంటాడు - ఆత్మ నాశనము లేనిది, ఆత్మ అన్నదానికి ఉత్పత్తి, వ్యయము, ,వృద్ధి, విపరిణామం, క్షయం ఇలాంటివి లేవు. దీన్ని అగ్ని కాల్చదు, నీరు తాకదు, దీన్నెవరు చీల్చలేరు, అసలు దీన్ని గురించి బుద్ధితో కూడా తెలుసుకోలేరు, దీనికి పుట్టుక లేదు, మరణం లేదు......ఈ తీరుగా కొండవీటి చేంతాడంత లిస్టు లక్షణాలు వెతికి పట్టుకొచ్చి వాటిల్లో ఒక్క లక్షణమూ ఆత్మకు లేదు అని ’ఆత్మ’ కు అనిర్వచనీయమైన నిర్వచనం చెప్పేశారు మనవాళ్ళు. ’ఫలానాది ఏదీ లేదు’ - ఈ వాక్యం ఎంత అసమంజసంగా ఉందో, అలానే ఏదీ లేని, అసలు ’తెలుసు’కోలేని ఆత్మ గురించి ’తెలియ’ జేసే ప్రయత్నం ఎందుకు? (అర్జునుడు మహాభక్తుడు కాబట్టి అనుకోవచ్చా?).

మరొకటి - ’అచ్చేద్యోయమచింత్యోయమవ్యక్తోయం’ అయినది ఆత్మ. అది శరీరం బట్టలు విప్పి కొత్త బట్టలు కట్టుకున్నట్టుగా దేహాన్ని విడిచి మరో దేహాన్ని పొందుతూ ఉంటుంది అన్నారు. అంటే ఒక్కో మనిషికి ఒక్కో ఆత్మ representative గా ఉంటుందా? లేక మానవులందరికీ కలిపి ఒకే ఆత్మ నా? ఆ శ్లోకం ప్రకారం అయితే ఒక్కోమనిషికి ఒక్కో ఆత్మ అనుకోవలసి వస్తున్నది. అంటే ఆత్మల జనాభా - ప్రపంచజనాభాతో సరిసాటి. ఇంకా జంతువులకూ ఆత్మలు ఉంటే వాటి ఆత్మలూ పరిగణనలోకి వస్తాయి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో జీవరాశులు. (ఇన్ని ఆత్మలను maintain చేసి మరణానంతరం appraisals చేయడం సామాన్యమైన పని గాదు.)

లేదు ఒకటే ఆత్మ అంటే - ఆ ఆత్మకు లక్షణాలు లేవు కాబట్టి అదొక pure witness కు ప్రతీక అనుకోవచ్చు.

ఈ వికృత వాఖ్యానం ఎవరినో బాధపెట్టడానికి చేయటం లేదు. క్షమించాలి. అమంగళం ప్రతిహతమగుగాక. ఆధ్యాత్మిక విషయాలలో ’బుద్ధి’ అన్న దాని గురించిన పరిధిని గురించి ప్రతీకాత్మకంగా ఊహించడానికి ఈ తపన. భగవంతుడయినా సరే, అల్పులయిన మన బోటి మానవులకు విషయాలు చెప్పాలంటే - దానిని ఏదో భాషలో చెప్పవలసిందే. భాష - అనగానే దానికున్న పరిధి దానిది. అది జ్ఞానాన్ని పూర్తిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేదు. అందుకనే కొందరు గొప్ప జ్ఞానులు, కవులు కూడా అయిన వారు - భగవంతుడి భాష మౌనం అన్నారు.

సరే మళ్ళీ మొదటికి వస్తే - మహాత్ముడు బుద్ధుడు ఆ witnessing ను అలానే ఉంచేశాడు. ఆయన ’ఆత్మ’ అనే ఒక entity ఉనికిని చెప్పలేదు. ’అనాత్మ’ అంటాడాయన. మరి శాశ్వతంగా ఏదీ ఉండదా? మరి శాశ్వతంగా ఏదీ లేకపోతే ఇక ఆనందాన్ని అనుభవించేది యేది?

ఆనందాన్ని అనుభవించేది, ఆనందానుభవం, ఆనందమూ ఇవేవీ లేదు. నిర్వాణం అంటే - Total annihilation. అదే వ్యక్తమూ, అవ్యక్తమూ అయిన జగత్తు తాలూకు యథాతథ స్థితి. భౌతికంగా అన్ని వస్తువులూ నాశనం కావలసిందే. ఆధ్యాత్మికంగా కూడా ఏదీ మిగలదు. ఆ స్థితిని ’తథాథ’ అని ఆయన సూచించాడు. అష్టావక్రగీత దాదాపుగా బుద్ధబోధ లాగానే ఉంటుంది.

ఇంతకూ నా బాధ యేమంటే - ’ఆత్మ’ ఫలానా అని చెప్పడం వల్ల - మళ్ళీ పండితులు బయలు దేరారు. వివరణలు మొదలయ్యాయి. కొన్ని లౌకిక వ్యవహారాలకు - ఆధ్యాత్మిక రంగంలో ఆలోచించవలసిన ’ఆత్మ’ ను వాడుకున్నారు. ఆ ’ఆత్మ’ను - వర్ణవ్యవస్థ తాలూకు వ్యాఖ్యానాలకు ఉపయోగించి కలుషితం చేశారు. పాండిత్యంతో మభ్యపెట్టారు. పాండిత్యాన్ని ’జ్ఞానం’ గా వ్యాపింపజేశారు. నిజానికి ’ఆత్మ’ - అచింత్యం అన్నా కూడా దానిని ’చింత్యం’ గా మార్చారు.

కనుక మన కర్తవ్యం ఏమిటంటే - తెలియని విషయాల గురించి మనకు తెలియదని ఒప్పుకోవడంతో బాటు - ఎవరైనా తెలియజెప్పబోతే వారి ఉద్దేశ్యం ఏమిటో జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు తెలియనిది తెలియనిది గానే ఉండడంలో తప్పేమీ లేదని గుర్తెరగాలి. ఏ విషయమూ తొందరపడి జ్ఞానంగా ఎంచడం తప్పని మనకు అర్థమవాలి. జ్ఞానం - సమాచారం కాదు. వంద పుస్తకాలు రాశాడనో, అనేక సంగతులు తెలుసుననో ఒక ’పండితుణ్ణి’ - జ్ఞానిగా చెయ్యటం మహాప్రమాదం. పండితుడంటే వందల కొలదీ విషయాలు తెలిసిన వాడు కాదు. అది కెపాసిటీకి చెందిన విషయం. అన్ని విషయాలకు మూలకందమైన దాని స్ఫూర్తిని ఎఱిగినవాడు పండితుడు.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శునిచైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః ||

పండితుడంటే - వినయసంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి, శునకమాంసం తినే వాడిని సమంగా చూడగలిగినవాడు. ఈ స్ఫూర్తి లేకుండా ’జ్ఞానం’ ’గురించి’ పేజీల కొద్దీ వివరణలు చేసిన వాణ్ణి పండితుడుగా గుర్తించటం చాలా పెద్ద పొఱబాటు.

కాబట్టి పండితుడికి, టన్నుల కొద్దీ సమాచారం సేకరించిన లేదా మాట్లాడగలిగిన మేధావికీ పొంతన లేదు.

అదీ సంగతి.

(ఈ టపా నా సొల్లు మాత్రమే. దీనికి ఎవరైనా బాధపడితే - నా పూచీకత్తు లేదు.)

Monday, January 7, 2013

జంతు ప్రపంచం


ఆర్నెల్ల క్రితం హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయింది నాకు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు ఒక వినూత్నమైన, అద్భుతమైన సత్యం నాకు తెలిసింది. బెంగళూర్ లో లాగా వీధికి కనీసం పదికుక్కల చొప్పున లేవు. బహుశా నాగార్జున వాళ్ళావిడ అమల ఆ మధ్య శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ లో తలమునకలై కుక్కల బాధ్యతను విస్మరించినట్టుంది.

బెంగళూరులో వీధిలో ఒక రాయి విసిరితే, అది - అయితే సాఫ్టు వేర్ వాడికి లేదా కుక్కకు తగులుద్ది అని ఒక సూక్తి. అదొక భయంకరమైన నిజం.

బెంగళూరు లో మొరుగేశ్ పాళ్యలో, ఉన్న భయానకమైన రోజులు మర్చిపోలేను. చీకటి వేళల్లో పిల్లిలాగా, శబ్దం చేయకుండా నడవడం ప్రాక్టీసు చేసి అందులో నిష్ణాతుణ్ణయినా, గుండెలు పీచుమనేవి. మా ఇంటి గేటు దగ్గర ఆఖరు గండం ఉండేది. ఆ చివరి మజిలీ దాటి, ప్రపంచాన్ని జయించినట్లు ఫీలయిన సందర్భాలెన్నో. ఆ బాధలు అలా పడీ ఓ రోజు దేవుడిని ప్రార్థించాను.

దేవుడా,
ఎక్కడ వీధికి పదికుక్కలు లేవో
ఎక్కడ రాత్రుళ్ళు ప్రశాంతంగా గడుస్తుందో
ఆ ఊరికి నన్ను తరిమేసెయ్

ఆ ప్రార్థన ఫలించినట్టుంది. భాగ్యనగరంలో నేను ఆద్దెకున్న వీధిలో మూడు కుక్కలే ఉన్నాయి. అవి కూడా మొరగటం లేదు.

ఇలా ఆనందదాయకమైన ప్రపంచంలో ఉంటూ - ఓ సాయంత్రం సూపర్ బజార్ నుండి సరుకులు తెస్తుండగా - ఒక కుక్క ’భవాన్ భిక్షాం దేహి’ అని వెనుక పడింది. యే మాత్రం మొరగకుండా అహింసాపద్ధతిలో భిక్ష అడిగిన ఆ సాత్విక శునకాన్ని చూసి నా హృదయం స్పందించింది. (నా చొక్కా పై జేబులో సెల్ ఫోను ఉంటుంది). ఒక బిస్కట్ ముక్క విసిరాను.

అదే నేను చేసిన తప్పు.

ఆ శునకం కేవలం క్రీమ్ బిస్కట్లనే తింటుందని, ఆ నియమం ఉంది కనుకనే తుచ్ఛమైన ఇతర బిస్కట్ల జోలికి పోదని నాకు అప్పుడు తెలియలేదు. మరుసటి రోజు యథావిధిగా మరోసారి సూపర్ బజార్ నుండి వస్తుంటే - ఆ శునకం దగ్గరకొచ్చింది. ఈ సారి నేను కాస్త బెట్టు చేశాను. ఆ కుక్క నన్ను చూసి స్వల్పంగా ’గుర్’ మన్న హలోట్యూను చేసి చుట్టూ చూసింది.

అర్థమయ్యింది నాకు. అదొక పెద్ద ఇంటలెక్చువల్ కుక్క. దాని సంకేతానికి అర్థం - క్రీమ్ బిస్కట్ ఇస్తావా లేక దూరంగా కుతూహలంగా చూస్తున్న శునకరాజాలను పిలవమంటావా? అని. ఆ బలహీనమైన క్షణంలో నేను ఆ శునకానికి లొంగిపోయాను.

అదే నేను చేసిన రెండవ తప్పు.

అలా ఆ ఇంటలెక్చువల్ కుక్క నన్ను మానసికంగా లోబర్చుకుంది. ప్రతిదినం సాయంత్రం ఇంటికి వచ్చే ముందు క్రీమ్ బిస్కట్ల కోసం షాపింగుకు వెళ్ళటం ఆనవాయితీ అయింది నాకు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే - ఇల్లు మారాలి. తప్పదు.

అలా ఇల్లు మారేను.

ఇప్పుడు ఉన్నది కొత్త ఇల్లు. ఇక్కడ కుక్కలు లేవు కానీ కొన్ని రోజులకు ముందు - పొద్దునే ఆఫీసుకు తగలడుతుంటే ఇంటి బయట ఒక నల్లని జీవి కనబడింది. ఆ జీవిని మార్జాలంగా నా మెదడు గుర్తించింది. పిల్లుల గురించి నాకొక ఫ్లాష్ బ్యాక్ ఉంది.

*********************************

ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో - నేను ఒక చిన్న సైజు అభ్యుదయవాదిని.

మా ఇంటిలో ఎలుకల బాధ అధికం. ప్రతిరోజూ బోనులో కనీసం ఎనిమిది ఎలుకలైనా పడేవి. ఆ ఎలుకలను చూసి పొద్దునే మా ఇంటిదగ్గర పిల్లులు క్యూ కట్టేవి. వాటి ముఖం చూస్తే దరిద్రమని మా అమ్మా నాన్న విసుక్కునే వారు. వారిని నా అభ్యుదయవాద దృక్పథం సైలెంటుగా ఖండించేది. (సౌండుతో ఖండిస్తే పాకెట్ మనీ రాదు. అందుకే సైలెంట్ ఖండన). అది ఎంతవరకు వెళ్ళిందంటే కావాలని పనిగట్టుకుని ఫ్రెండ్ సహాయంతో పిల్లిని నా దారికి అడ్డం పరిగెత్తించి ఇంటర్మీడియట్ ఆంగ్ల పరీక్షకు అటెండ్ అయాను. ఆ పరీక్షలో పాస్ అయి మా నాన్నకు అభ్యుదయ వాదం పవర్ చెప్పి వివరించాను. (ఇంటర్మీడియట్ లో నాకు అన్నిటికన్నా తక్కువ మార్కులు ఇంగ్లీషులో వచ్చాయి. ఆ మాట అప్రస్తుతం కాబట్టి చెప్పట్లేదు)

*********************************

ఇంత తీవ్రమైన అభ్యుదయవాదిని నన్ను పిల్లులేమి చేయగలవు అని ఆ రోజు ఆఫీసుకు ధైర్యంగా తగలడ్డాను. మా ఆఫీసు - ఎల్లవేళలా రక్తచరిత్ర సినిమాకు భాష్యంలాగా ఉంటుంది. ప్రాజెక్టుకు ముందే డెడ్లైన్లు, విపరీతమైన నస, బూతులు సర్వసాధారణం. కొన్ని రోజులుగా అలా లేదు. అయితే పిల్లి కనబడ్డ మొదటి రోజు సాయంత్రం ఉన్నట్టుండి భయంకరమైన పని మొదలయ్యింది. రక్తం మరిగించే టెన్షన్.

తర్వాత రెండు రోజుల తర్వాత ఆ నల్లని పిల్లి - నన్ను చూసి స్మయిలిచ్చింది. ఆ రోజు ఆఫీసులో రుధిరం చిమ్మింది. నరాలు చిట్లిపోయే టెన్షన్. ఇండియా - పాకిస్తాను వరల్డ్ కప్ మాచ్ లోనూ అంత టెన్షన్ ఉండదు.

ఇలా ఆ పిల్లి కనబడ్డం, ఆఫీసులో రక్తం చిమ్మటం వరుసగా జరిగేసరికి నా అభ్యుదయ వాదం బీటలు వారింది. ఇప్పుడు నేను ఆ పిల్లికి కనబడకుండా వీరప్పన్ లా తప్పించుకుని తిరుగుతున్నాను. ఈ ఏరియాకు ’మియాపూర్’ అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడిప్పుడే తెలుస్తూంది.

పిల్లులు, కుక్కలు, దోమలు లేని కొత్త చోటికి ఇల్లు మారాలి. మ్యాజిక్ బ్రిక్స్ అన్న వెబ్ సైట్ లో ఇలా పిల్లులు, కుక్కలు లేని చోట ఇల్లు అద్దెకు కావాలని ప్రకటిద్దామంటే - ఆ సదుపాయం లేదట.

నా ప్రస్తుతసమస్య ఎలా గట్టెక్కుతుందో దీర్ఘంగా ఆలోచిస్తున్నాను.