Monday, November 29, 2010

అట్లాస్ సైకిలు షేక్షావలి

"తొందరగా మమ్ము తినేసెయ్యవే. బుడబుడకలాయప్ప వత్తాడు. సంచీలో పిల్లల్నేసుకుని తీసకపోతాడంట."
పాపతో తిండి తినిపించడానికి నానాపాట్లూ పడుతోంది వాళ్ళమ్మ అనబడు మా శ్రీమతి.కానీ అది (పాప) ముదురుది. వినేరకమా?
"ఎల్లిపోయినాడు కదా. మల్లీ రాడు." డిక్లేర్ చేసింది.
"ఫోను చేస్తానుండు. హలో..ఆ..రాప్పా. ఇక్కడ పాప మమ్ము తినకోకుండ సతాయిస్తా ఉంది." ఈ ఎఫెక్టు కాస్త పనిచేసింది. మమ్ము తినమన్న అభ్యర్థనను ఈ సారికి కన్సిడర్ చేసింది పాప.సెల్లుఫోను ఎఫెక్టు!

లైఫులో మంచివాడు, చెడ్డవాడు అని బోర్డుపెట్టుకుని ఎవరూ ఉండరు. ఇది పెద్ద రాకెట్ సైన్సు గాదు. ఏడవతరగతి పిలాసఫీ, అందరికీ తెలిసిందే. మన లైఫులో ఊహ తెలిసీ తెలియని తరుణంలో మొట్టమొదట తగిలే నెగటివ్ లుకింగు పాజిటివ్ కారక్టరు "బూచి". ఈ బూచి అనబడు విలన్, పైకి విలన్ గా కనబడుతూ కొన్ని కొన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంటాడు. పిల్లలు మారాం చేస్తే బెదిరించి దారికి తేవడం, అన్నం తినిపించడం, బుద్దిగా చెప్పినమాట వినేట్టు చేయడం ..ఇలాగన్నమాట. బుడబుడకల వాడు, వీధిచివర పెద్దపెద్ద అంగలేసుకుంటూ వెళ్ళే బుర్రమీసాల పోలీసెంకటసామి, వెనకింటి సూర్యకాంతమ్మత్తా, వేపమండలతో ఇంటి ముంగట వచ్చే నాంచారమ్మా వగైరా వగైరా ఈ కోవలోకి చెందినవాళ్ళు.

నాకూ ఊహ అన్నది మొగ్గతొడుగుతూ బుద్ధి వికసిస్తున్న రోజుల్లో నా పాలిట ఓ బూచి ఉండేవాడు. ఆ బూచి పేరు - షేక్షావలి.

********************************************************************************

"హుర్ర్." కాళ్ళతో నేలను చరిచి నన్ను చూస్తూ ఒక్కసారిగా గదిమేడు గడ్డమూ, మీసాలతో ఉన్న ఆసామీ.
"అమ్మా" అక్కడి నుండి పరిగెత్తాను ఐదారేళ్ళ నేను.
మా అమ్మా, నాన్నతో బాటూ పక్కన నిలబడ్డ మా నాన్న మిత్రులు - తెలుగు మాస్టారు (స్వర్గీయ శ్రీమాన్ పుట్లూరు శ్రీనివాసాచార్యులు గారు) ఫక్కున నవ్వేశారు.
మరుసటి రోజు పట్టుదలగా నేను అతణ్ణి ఎదుర్కున్నాను.
"హుర్ర్.." బయపడలేదు.
"హెక్.." ఊహూ..
చేతులు రెండూ మడిచాడు షేక్షావలి. బెల్టు మీదకు చేయిపోనిచ్చాడు.
"హుప్" అంటూ నా వద్దకు పరిగెత్తి వస్తున్నట్టు ఓ అడుగు ముందుకేశాడు.
"అమ్మో!"...

మా నాన్న మిత్రుడు షేక్షావలి ఓ అట్లాసు సైకిల్ లో మా ఇంటికెప్పుడైనా వచ్చేవాడు. ఆ సైకిలుకు ప్రత్యేకత ఏమిటంటే, వెనుక క్యారేజి, క్యారేజిలో కూర్చుంటే కాళ్ళు పెట్టుకోవడానికి ఇరువైపులా రెండు ఫుట్ బోర్డులు. అవి సరిగ్గా చిన్నపిల్లలకు కాళ్ళకు అందేలా అమరి ఉండేవి. సైకిలుకు ముందున్న బారు మీద ఓ చిన్నసైజు సీటు ఉండేది. గడ్డం, చైనా మీసాలు, చేతుల దగ్గర రెండుమడతలు పైకి మడిచిన ఫుల్ షర్టూ, ఇన్ చేసి బెల్టు బిగించిన నేరో పాంటూ, నోట్లో సిగరెట్టూ, అప్పుడప్పుడూ పెద్దనల్లకళ్ళజోడు, మరెప్పుడైనా తెల్లగా గళ్ళుగళ్ళుగా ఉన్న ముసల్మాను టోపీ, చక్కగా నూనెపట్టించి దువ్విన జుట్టూ, నన్ను చూస్తే ఆటపట్టించాలన్నట్టుగా చూసే నవ్వు.

ఆ రోజుల్లో సినిమా వస్తే ఓ ఎద్దుల బండికి లేదా రిక్షాకు సినిమా వాల్పోస్టరు తగిలించి మైకులో పాటలు పెడుతూ, మధ్యమధ్యలో అనౌన్సు చేస్తూ తిరిగే వాళ్ళు. ఆ బండి దగ్గరకు వెళితే ఓ పాంప్లేటో, పాటలపుస్తకమో ఏదో ఇచ్చేవాళ్ళు. అది కూడా పెద్దలకే. పిల్లవాళ్ళు ఆ పేపరు సంపాదించాలంటే చిన్నసైజులో సామదానభేద దండోపాయాలు ఉపయోగించాలి. ఓ మారు నేను ఆ బండి వెనకాతలే పాటలు వినుకుంటూ, ఆ పాంప్లేట్ సంపాదించి, రసానుభూతి చెందుతూ వెళ్ళిపోతుంటే, షేక్షావళి ఆ రసానుభూతికి అడ్డుపడి, నన్ను సైకిల్లో ఇంటికి తీసుకొచ్చి దింపేడట. దింపడమే కాకుండా మా ఇంట్లోవాళ్ళకు నా గురించి హెచ్చరించాడుట, మీ వాడికి సినిమా బండ్ల వెనుకలే నడుచుకుంటూ థియేటర్ వరకూ వెళ్ళిపోయే సిండ్రోమ్ ఉంది, జర భద్రం అని. (ఈ కథంతా నాకు గుర్తు లేదు. మా పెద్దలు నా చిన్ననాటి సంగతులు నెమరు వేసుకుంటుంటే తెలిసింది).

ఆతని సైకిలు ఎక్కాలని నా ఆశ. ఓ రోజు స్టాండు వేసి ఉన్న సైకిలు ఎక్కి కూర్చుంటే మా అమ్మ తిట్టినట్టు లీలగా గుర్తు. అయితే అమ్మకు నచ్చజెప్పి అతనే ఎక్కించుకుని రెండు రౌండ్లు తిప్పి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటిదగ్గర టీ కలిపి ఇచ్చారు నాకు. నాకు అప్పటికి బయట ఎవరి ఇంటికి వెళ్ళిన అనుభవం లేదు. వాళ్ళింట్లో టీ తాగాలా వద్దా తెలియదు. ఆ మాట చెబితే ఈయనేమంటాడో తెలియదు. సరే టీ తాగేశాను. ఇంట్లో తాతయ్య దగ్గర - షేక్షావలి ఇంట్లో టీ తాగానని చెబితే, ఆయన నవ్వేశాడు. "ఏమైనా తిన్నావా, లేదు కదా. ఏమీ కాదులే" అన్నాడు. ఆయన భయం కేవలం నేను నాన్ వెజ్జు తెలియకుండా తినేస్తానేమోనని.

ఇంటికి వెళ్ళాను కదాని అతను గుర్రుపెట్టటం, భయపెట్టటం మానలే. అన్నయ్య అన్నయ్యే, పేకాట పేకాటే!

షేక్షావలికి మా తాతయ్య అంటే గురి అనుకుంటాను. మహమ్మదీయుడైనా తనకు కొడుకు పుడితే మా తాత వద్దకు భార్యను, బిడ్డను తీసుకువచ్చి ఆశీర్వదించమని అడిగాడన్నట్టు లీలగా నాకు జ్ఞాపకం.

తను బహుశా రైల్వేలో పనిచేసేవాడనుకుంటాను.షేక్షావలికి ఆ తరువాత ఎక్కడికో ట్రాన్స్ ఫర్ అయింది. చాలా యేళ్ళయ్యాయి.

కాలేజిలో చదువుకుంటున్న రోజుల్లో, ఓ రోజు.. ఏదో షాపుముందు నిలబడి ఉన్నాను. పక్కన లూనా దగ్గర ఓ అసామీ సిగరెట్ తాగుతున్నాడు. అతణ్ణే చూస్తున్నాను నేను. అతను నన్ను రెండు మూడు సార్లు గమనించాడు. ఆ తర్వాత నెమ్మదిగా నవ్వుముఖంతో నన్ను సమీపించాడు. మనిషి ఏ మాత్రం మారలేదు. చెవుల దగ్గర జుత్తు కాస్త తెల్లబడిందంతే."హు.." అన్నాడు, నవ్వుతూ. నవ్వేశాను నేను. ఆ తర్వాత పలుకరింపులు, కుశలప్రశ్నలూ అయాయి. మా తాత గురించి ప్రత్యేకంగా అడిగేడు షేక్షావలి. ఆయన స్వర్గస్తులై మూడు, నాలుగేళ్ళయిందని చెప్పాను. "బాబూ! హమ్ ముసల్మాన్ హై, ఫిర్ భీ హమ్ ఆప్ కా దాదాజీకో బహుత్ మాన్ తేహై. ఆప్ బోల్ తే హైనా, సన్యాసి, సన్త్..ఐసాహీ వో. .." ఇలా చెప్పుకొచ్చాడు.

మతం అన్న బూచి ఎదుటివ్యక్తిని ఇబ్బందిపెట్టి జీవితాలకి అడ్డురానంతవరకూ ఏ మతమైతేనేం? సమ్మతమేగా! ఆత్మీయతలు, అనుబంధాలు వీటి ప్రస్తావన వచ్చినప్పుడు మతం దారి మతంది, మనిషి దారి మనిషిది.అన్నయ్య అన్నయ్యే, పేకాట పేకాటే!

మనిషులు మనకు రకరకాల స్టేజుల్లో తగులుతుంటారు, విడిపోతుంటారు. అందరినీ గుర్తుపెట్టుకోవడం మనిషి బుద్ధికి సాధ్యపడదు. అయినా పర్లేదు. జీవితం నాటకరంగం. పాత్రధారులు ఆయా పాత్రలను పోషించింతర్వాత స్టేజు దిగి పోతుండాలి. అప్పుడే నాటకానికి అందము.చందమూ!

Thursday, November 25, 2010

రామాశాస్త్రి గారి భార్య

సత్యం దానమథాద్రోహ అనృశంస్యం త్రపా ఘృణా
తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతీరితః - (మహాభారతం శాంతిపర్వం)

ఎవనిలో సత్యము, దానము, ఇతరులకు అపకారం చెయ్యకపోవడం, మృదుత్వం, సిగ్గు (ఎవరేమనుకుంటారో అన్న జంకు), జాలి, తపస్సు ఉంటాయో అతను బ్రాహ్మణుడు.

**********************************************************************************

"రాజమ్మా రెండు ఇడ్లీలు" - రామాశాస్త్రి మా ఇల్లు/హోటలు గుమ్మం దగ్గర వచ్చి అడిగేరు.
"ఇదిగోండి స్వామీ" ఓ పేపరు, ఆ పైన అరటి ఆకు అందులో వేడి వేడి ఇడ్లీలు, పల్చటి చట్నీ  మా అమ్మ ఆయనకు అందించింది. పొద్దున 8:30 గంటలవుతోంది. నేను అప్పుడే బడికి వెళ్ళడానికి ఆయత్తమవుతున్నాను. శాస్త్రి గారు, నన్ను చూసి పలకరింపుగా నవ్వారు.

పొద్దున బ్రాహ్మీముహూర్తంలో లేవగానే, మడితో భార్య అందించిన నీటి కడవను దేవళంలోనికి తీసుకువెళ్ళి, అభిషేకం చేసి, రుద్రమూ అదీ చదివి, రోజూవారి పూజలు నిర్వహించిన తరువాత దేవస్థానం పురోహితులు శాస్త్రి గారు మా చిన్న హోటలుకు వచ్చి అప్పుడప్పుడు టిఫిన్ తీసుకుంటుంటారు. శాస్త్రి గారి భార్యగారు (పేరు గుర్తు లేదు) కూడా తర్వాత నిదానంగా మా అమ్మ చేసే ఇడ్లీల కోసం రావడం కద్దు.  ఏదైనా పండగ పబ్బం ఉన్న రోజుల్లోనైతే - పూజ అయిపోయి భక్తులకు ప్రసాద వితరణ జరిగింతర్వాత మా ఇంటికి ప్రసాదం పట్టుకొచ్చి ఇచ్చేవారు శాస్త్రిగారు. ఆయన మర్చిపోతే ఆయన భార్య.

శాస్త్రి గారు సన్నగా ఉన్నా, చుఱుకుగా ఉండేవారు. కోలగా మానవల్లి రామకృష్ణకవి గారిలా ముఖవర్ఛస్సు. ఎప్పుడూ అడ్డపంచె, ఉత్తరీయం. షర్టు, పేంటులలో నేనాయన్ను చూసింది లేదు. శాస్త్రి గారి భార్య స్థూలకాయురాలు. కాస్త కష్టంగా నడిచేది. గుండ్రంగా, దయగా ఉన్న ముఖం, నవ్వుతున్న కళ్ళు. నిజానికి మా అమ్మలానే ఉండేది.

మా ఇంట్లో నాకూ, మా అన్నకూ కొబ్బరిపూర్ణం అంటే తెగ ఇది (ఇది = ఇష్టం + ఇంకాస్త). వినాయక చవితి రోజు - మా అమ్మ ఇంట్లో తమిళుల ఇళ్ళలో లాగా కొబ్బరిపూర్ణం బియ్యప్పిండి మధ్యలో పెట్టి ఆవిరి కుడుములు చేసేది. వీటికి తమిళభాషలో "కొఝకట్టై" అని పేరు.(మా అమ్మకు అన్ని దక్షిణభారతదేశ వంటలూ వచ్చు). ఇవి కజ్జికాయలు కావు. తెల్లగా చిన్న చిన్న ముద్దల లాగా అగుపిస్తాయి. (బొమ్మ చూడండి) అలాగే కారం కుడుములు కూడాను.సదరు కొబ్బరి పూర్ణం కుడుములు చేయడానికి కొబ్బెర - శాస్త్రిగారి ఆవిడే స్పాన్సరు మా అమ్మకు. మా అమ్మ కుడుములు చేసిన తర్వాత శాస్త్రిగారికి పంచడమూ ఒప్పందంలో భాగమే.

శాస్త్రి దంపతులకు పిల్లలు లేరు. అంచేత వాళ్ళ ఇంటికి ఏ పిల్లవాడు వెళ్ళినా, ఏదో ఒకటి దొరకబుచ్చుకోవడం రివాజు. కనీసం కొబ్బరి ముక్కయినా సరే. ఇక మా అమ్మకు, ఆవిడకు పులుసులు, కూరలు, పప్పుల మధ్య అండర్ స్టాండింగు కావలసినంత. ఏదైనా బావుందని అనిపిస్తే, ఆవిడ మా ఇంటికి ఓ గిన్నెలో తన వంట పంపడం, మా అమ్మ వాళ్ళింటికి పంపడం తెర వెనుక జరిగే ఆనవాయితీనే. పొరుగింటి కమ్మనైన కూర కాబట్టి నేనూ, మా అన్నా కూడా వాటికి ఎగబడ్డం మామూలే.

అలాగే మా ఇంట్లో ఏ వ్రతమో, అబ్ధీకమో వచ్చినా శాస్త్రి గారు రావలసిందే, పూజ జరిపించవలసిందే. మా అమ్మ వంట ఆయన రుచి చూడవలసిందే.

ఆ రోజుల్లో టీవీలు, అవీ లేవు కాబట్టి సాయంత్రం పూట తీరుబడిగా ఉంటే మా అమ్మా, ఆవిడా అలా మాట్లాడుకుంటూ ఉండడం, మా అమ్మ వాళ్ళింటి గుమ్మం దగ్గర ఉందన్న కారణంతో మేమక్కడకి వెళ్ళి, ఆ మిష మీద శాస్త్రి గారి ఇంట్లో ఏ కలకండో, కొబ్బరి ముక్కలో, పంచామృతమో కాజెయ్యడం అలవాటైన పని. శాస్త్రి గారు గుంభనంగా పిల్లలను చూసి నవ్వుకోవడమూ, ఆయనను చూసి ఆ ఇల్లాలు మురిసిపోవడమూ ఇవన్నీ - ఈ రోజు నీలి ఆకసంలో తేలియాడుతూ వెళ్ళే చిన్న చిన్న మేఘపు తునకల్లా గుర్తుకువచ్చే మధురమైన జ్ఞాపకాలు.

నాకు ఎనిమిదో ఏటననుకుంటాను. వడుగు చేయాలని నిశ్చయించారు మా తాతయ్య. ఓ శంకర జయంతి రోజు సార్వజనిక ఉపనయనాలు జరుగుతుంటే అందులో భాగంగా మాకు ఉపనయనం చేశారు. ఆ తంతు ముగిసిన తర్వాత వటువు నలుగురి వద్దా భిక్ష స్వీకరించాలి. ఆ రకంగా నాకు మొదటి భిక్ష శాస్త్రి గారి భార్య పెట్టారు.

జీవితంలో అన్నీ సౌమ్యంగా, ఆహ్లాదంగా జరిగితే అది జీవితమెలా అవుతుంది? శాస్త్రి గారి జీవితంలో అతిపెద్ద విషాదం అనుకోకుండా జరిగింది. ఏదో పండుగకోసం దేవళాన్ని శుభ్రం చేస్తూ, సున్నం అదీ తనే స్వయంగా కొడుతున్నారు. వాళ్ళావిడ ఆయనకు ఏదో సహాయం చేస్తున్నారు. ఇంతలో ఆమె కుర్చీలోంచి జారిపడ్డదట. పెద్దగా దెబ్బలవీ తగల్లేదు కానీ, ఎంచేతో ఏమో - "రేపట్నుంచి నేను మీకు ఏమీ చేయలేను" అని అన్నారట ఆవిడ శాస్త్రి గారితో. ఆ మాట పొల్లుపోకుండా జరిగింది.

మరుసటి రోజు ఉదయం ఆవిడ స్నానం చేయడానికి మా ఊరి కెనాలు (కాలువ) వద్దకెళ్ళింది. కాస్తంత ప్రశాంతంగా స్నానం చేద్దామని జనం తక్కువగా ఉన్నచోటికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో, ఏమో ఎవరూ చూడలేదు. కాసేపటి తర్వాత ఆమె రాకపోతే ఖంగారుపడి శాస్త్రిగారు చూద్దురు కదా, గట్టు మీద ఆమె ఉంచిన పొడిచీర మాత్రం కనిపించింది. ఇంతలో జనం వచ్చారు. అందులో ఒకరిద్దరు నీళ్ళలో వెతికారు. దొరక్కపోతే కాస్త బాగా ఈత వచ్చిన సంజీవులు వచ్చాడు. ఆమె శవం దాదాపు మూడు కిలోమూటర్ల దూరంలో నీళ్ళలో దొరికింది.

మరణానికి సరిగ్గా ఒక్క రోజు ముందు చాలామందికి తమ మరణం రేపేనని తెలుస్తుందట. ఇది ఆమె విషయంలో ఋజువయ్యింది. (మా తాతయ్య, అమ్మగార్ల విషయంలోనూ ఇది జరిగింది).

ఆ తర్వాత శాస్త్రి గారు గుడి పౌరోహిత్యం మానివేశారు. మరోచోట ఉంటూ కాలం వెళ్ళదీశారు. అప్పుడప్పుడూ మమ్మల్ని చూసినప్పుడు మొహమాటం, పలకరింపు కలిగిన నవ్వు ఒకటి విరిసేది.

కొన్నేళ్ళ క్రితం మా ఇంట్లో ఆయన గురించి అడిగితే, ఆయన పోయాడని, అనాయాసంగా అరగంటలో ప్రాణం విడిచారని విన్నాను. ఒకరి మీద మరొకరికి అంత గొప్ప అనురాగం, అప్యాయతా ఉన్న దంపతులను, దాంపత్యాన్ని, తను నడివయసులో ఉన్నప్పటికీ భార్య పోయిన తర్వాత విరాగి అయి, అత్యంత సాధారణమైన జీవితం గడిపిన భర్తనూ నేను మరెక్కడా చూడలేదు, ఈ రోజు వరకూ.

ఇప్పుడూ ఏదో తెలియని లోకంలో - శాస్త్రిగారి భార్యా, మా అమ్మా ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. శాస్త్రి గారు వడివడిగా తనదైన నడకతో అక్కడికొస్తారు. మా అమ్మ లేవబోతే, "కూర్చో రాజమ్మా" అని ఇంట్లో ఏ కర్పూరమూ తీసుకొని అక్కడినుండి నిష్క్రమిస్తారు! ఆ ఇల్లాలు నవ్వుముఖంతో లోపలికెళ్ళి ఏ కొబ్బరి ముక్కో, కలకండో, ఎండిన ఖర్జూరం ముక్కో తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెడుతుంది! ఆ కలకండ తాలూకు తీపి, ఇలా మధురమైన జ్ఞాపకంగా నన్ను పలుకరిస్తుంది!

Friday, November 19, 2010

పుష్పక విమానం

.. ఆ సినిమా గుర్తుందా? సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ ల కాంబినేషన్లో మాటలు లేని సినిమా. ఇప్పుడు వచ్చే మాటల సినిమాలకన్నా వేయిరెట్లు అర్థవంతమైన సినిమా కదూ! ఆ సినిమాలో పీ.ఎల్.నారాయణ ఓ బిచ్చగాడు. కమల్ ఓ రోజు అతని ఎదురుగా నిలబడి రుపాయ కాయిన్ అలా అలవోకగా తిప్పుతుంటాడు. నా దగ్గర డబ్బుంది చూడు అన్నట్టు. అప్పుడు బిచ్చగాడు తన చొక్కామడతల్లోంచి, చిరిగిన జేబులోంచి, నడుము దగ్గర పేంటు మడతలోంచి ఒక్కోనోటు చూపిస్తూ, చిరిగిన తన బొంత మరుగున నోట్ల కట్టలు చూపిస్తాడు. విస్తుపోవడం కమల్ వంతు. నిజమైన బిచ్చగాడు తనేగా అనుకుంటాడు.

ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి తన రోజు కాకపోయినా, తన క్షణాలైనా వస్తాయని చెబుతున్నట్టు ఉంటుంది. ఈ రోజు డీవీడీ చూస్తూంటే నాకు మర్చిపోయిన మిత్రుడు కణ్ణన్ గుర్తొచ్చాడు. నిరుద్యోగిగా నా జ్ఞాపకాలూ గుర్తొచ్చాయ్.

పదేళ్ళ ముందుమాట. ఆ రోజుల్లో నేను సాఫ్టువేరు నేర్చిన నిరుద్యోగిని. నా రూమ్మేట్ కణ్ణన్ - ఓ చిరుద్యోగి. అతడి ఉద్యోగం - హోటల్ పుష్పక్ - అదేనండి బెంగళూరు విండ్సర్ మేనర్ (ఆ సినిమాలో కనబడే హోటలదే) అనబడే ఐదుచుక్కల పూటకూళ్ళ ఇంట్లో రూమ్ బాయ్ గా.

************************************************************

బెంగళూరు యశ్వంతపురా లో ఒకానొక నిరుద్యోగుల భవనంలో నేనూ కణ్ణనూ రూం మేట్లు. మాకు తోడుగా, నల్లులు, హాస్టలు వాడు సప్లై చేసిన బెడ్డూ, దానిపైన అసహ్యమైన బెడ్ షీటూ తోడు. అలాగే అనేకమైన కబుర్లూ, స్వాతి వారపత్రికలో డబ్బా న్యూసు (అదేనండి బాక్స్ ఐటమ్) లాంటి మసాలా కబుర్లూ, వెకిలి నవ్వులూ రాత్రి పదకొండు వరకూ హస్కూ - ఇలా జీవితాన్ని అనుభవిస్తున్న రోజులు.

అప్పుడు నేను నిక్షేపం లాంటి ఇంజినీరు ఉద్యోగం మానుకొని, సాఫ్టు వేరు నేర్చుకుని మృదులాంత్ర ఉద్యోగవేటలో ఉన్నాను. నాతో భావసారూప్యం కలిగిన వాళ్ళు - తాతబ్బాయ్, శ్రీధరు, చంద్రమోహన్ (CM), కిశోర్ ఇలా ఓ గేంగు. అందరిదీ ఒకే ఆశయం. సాఫ్టువేరు ఉద్యోగం సంపాదించాలి. యే అమెరికాకో వెళ్ళిపోయి, ’అనుభవించు రాజా...’ అని పాటేసుకోవాలి. ఆ సదాశయప్రాప్తికి మేమంతా తపిస్తూ ఒకచోట చేరగా - నాకు రూమ్మేటుగా కణ్ణన్ వచ్చాడు.

కణ్ణన్ కన్యాకుమారి నుండి వచ్చాడు. పొట్టచీలిస్తే ఇంగ్లీషు అక్షరం ముక్క లేదు. తమిళం మాత్రమే వచ్చు. అట్లాగే డబ్బులూ లేవు. నాన్న డ్రైవర్ అట. డ్రైవర్ పనికి పోతానంటే వద్దని బెంగళూరికి తరిమాడట. పల్లెటూరి వాడు కాబట్టి - విజయకాంత్ లా నల్లగా నిగనిగలాడే దేహఛాయ, కాయవాటు శరీరం. లా చదువుతాడట. సాయంకాలం కాలేజీలో. బెంగళూరికి వస్తూనే ఎవరిని పట్టాడో, ఎలా పట్టాడో తెలీదు, ఓ చిరుద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగం - ఇందాకే చెప్పానుగా.

ఉద్యోగంలో చేరిన మొదటి రోజు పార్టీ ఇచ్చాడు, నాకూ మరో అబ్బాయికి మాత్రమే. పార్టీ ఐటమ్సు ఏవంటే - నేతిలో వేయించిన ముంతపప్పు, వేరుశనగ పలుకులు, ఫ్రూట్సు కొన్ని ఇలా. పార్టీ బావుంది సరే, ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ వాడి టేబుల్ మీద ఫ్రూట్సూ, ఇలాంటి రసభరితమైన ఐటమ్స్ కనబడేవి. ఆ సీక్రెట్ విప్పాడు ఓ రోజు. అవన్నీ అతను పనిచేసే హోటల్ లో రూములో అతిథులు ఓపన్ చేయకుండా వదిలేసిన ఐటమ్స్. వాటిని అలా పట్టుకొచ్చే వాడు.

కణ్ణన్ నాతో ఇంగిలీషు చెప్పించుకునే వాడు. బ్రదర్ అంటే నాగరికంగా ఉంటుందని, అలానే పిలిచేవాడు. అతని దృష్టిలో నేనో చిన్నసైజు మేధావి. నా బతుకేమో, కమల్ హాసన్ బతుకు. ఉన్న కొన్ని డబ్బులు ఎన్ని రోజులొస్తాయో, ఆ తర్వాత ఎలా గడపాలో, బంధువుల్లో ఎవరికి పాగా వెయ్యాలో, ఉద్యోగం ఎప్పుడొస్తుందో, ఇలా ఏదీ తెలియని పరిస్థితి.

కణ్ణన్ - ఆ రోజు ఓ డబ్బా న్యూస్ మోసుకొచ్చాడు. విండ్సర్ మేనర్ లో కమల్ హాసను, ఓ కొత్తమ్మాయి, కలిసి వచ్చార్ట. ఆ కొత్తమ్మాయి ’భలే’ ఉందట. అదృష్టవశాత్తూ కమలూ, ఆ అమ్మాయి ఎక్కిన లిఫ్టులోనే వీడు ఎక్కాడట. ఇంతలో ఎవడో అదే లిఫ్టులో ఎక్కి కమల్ పక్కనున్న కొత్త హీరోవినుతో వేషాలెయ్యబోతే, కమల్ లిఫ్టు ఆపి, ’త్రో హిమ్ అవుడ్’ అని అరుస్తూ, బయటికి గెంటాడట. ఇది అతను బుర్రకథలా నాకూ, మరొకతనికి చెపుతూ ఉంటే, మేము మధ్యలో ఆగా, ఓగో (తమిళంలో అలానే అంటారు) లతో రాత్రి పదిన్నర వరకు పరవశించాము.

ఆ న్యూసును నేను కాకిలా నా ఇంకో వృత్తం (సర్కిలు) మిత్రుల దగ్గరకు మోశాను. ఆ పరమసత్యాన్ని వాళ్ళూ ధృవీకరించారు. ఎందుకంటే, కమల్ నటించిన ’హే రామ్’ సినిమా ఆడియో ఫంక్షను ఉందని వాళ్ళకు అభిజ్ఞవర్గాల భోగట్టా దొరికింది. హేరామ్ సినిమాలో హీరోవిను కొత్తామె. ఆ డీటైల్ కూడా కణ్ణన్ న్యూస్ తో సరిపోతూంది. బిగ్రేడు... కాదు బ్రిగేడు రోడ్డులో అదేదో కాసెట్ల దుకాణంలో ఆ ఫంక్షను.

మరుసటి రోజు - నా దగ్గరున్న రూముతాళం పోగొట్టుకో(బడ)డంతో, విండ్సర్ మేనర్ హోటల్ కు నేనూ, ఇంకొకడూ ముందుగా ఫోను చేసి వెళ్ళాం. కమలూ, కొత్తమ్మాయి కనిపిస్తారేమోనన్న ఆశతో ఓ అరగంట పైగా చూశాం, కణ్ణన్ వెళ్ళిపొమ్మని, తనకు అడ్డవుతుందని బతిమాలుతున్నా వినకుండా. ఊహూ. అన్ సక్సెస్. తర్వాత శనివారం - ఒకానొక వాకిన్ ఇంటర్వ్యూలో హెచ్ ఆర్ వారి ద్వారా ’గెట్ బాక్ టు యు’ అని గెంటించుకుని, బిగ్రేడు రోడ్డుకు దారితీసింది మా మిత్రబృందం. అక్కడ హేరాం ఆడియో రిలీజు. అదుగో అక్కడ వసుంధరాదాస్ అనబడే ఆ అమ్మాయి దర్శనం విజయవంతంగా ముగించాం. అప్పుడావిడ జీన్సుపాంటు వేసుకుంది. సినిమాలో చూస్తే ఆమేనా అనిపించింది.

రోజులిలా గడుస్తుంటే, నా దగ్గర డబ్బులైపోయాయ్. అప్పుడో రోజు కణ్ణన్ ను అడిగేన్నేను - నాకు ఓ చిన్న ఉద్యోగం దొరుకుతుందా అని? ఏ కళనున్నాడో - బ్రదర్ నువ్వు బాగా చదువుకున్నావు. అట్ల చదువుకుంటే ఉద్యోగాలివ్వరు. టెన్త్ వరకు మాత్రమే చదివానని చెప్పు. నేను ప్రయత్నిస్తానన్నాడు. అలా రెండువారాలు గడిచాయ్. కణ్ణనూ ఎవరినో పట్టాలని చూస్తున్నాడు, ఆ వ్యక్తి దొరకలేదు.

సరిగ్గా అప్పుడే - నాకు సాఫ్టువేరు ఉద్యోగం వచ్చింది. హాయిగా విండ్సర్ మేనర్ లో రకరకాల హీరో, హీరోవిన్లను చూసే అదృష్టం పోయింది. సరే, ఉద్యోగంలో చేరాను, కానీ ఆ నెల గడవడానికి డబ్బు లేదుగా. అందుకు కణ్ణన్ దగ్గర ఆరొందలు అప్పుచేశాను. నెల తిరిగిన తర్వాత కణ్ణన్ కు ఆరొందలతో బాటు, వేయించిన వేరుశనగలు, ముంతపప్పు, వాటికి కాంట్రంస్టింగ్ సరుకు, వగైరాలతో ఓ చిన్నసైజు హోటల్లో ఘనమైన పార్టీ కూడా ఇచ్చా. ఆ తర్వాత కొన్ని రోజులకే మకాం మార్చాను. తర్వాత కణ్ణన్ కనిపించలేదు. ఇప్పుడెక్కడున్నాడో?

************************************************************

ఆ తర్వాత నాకూ రెండేళ్ళక్రితం ’ఇంటర్ కాంటినెంటల్ మిడ్ ప్లాజా’ అనబడే ఐదుచుక్కల పూటకూళ్ళ ఇంట్లో, తొమ్మిదవ అంతస్తులో, జకార్తా అనబడే ఓ నగరంలో ఓ నెలరోజులు గడిపే అవకాశం వచ్చింది.

************************************************************

ఈ రోజు పుష్పక్ సినిమా లాప్ టాపులో చూస్తుంటే గుర్తొస్తున్నాడు. ఈ సినిమా షూటింగు విండ్సర్ మేనర్ లో జరిగిందని తెలిస్తే ఎలా ఎక్సైట్ అయేవాడో!

************************************************************