Friday, February 12, 2010

భోళాతనపు ధవళవర్ణమూర్తి, మాయలమారి శ్యామసుందరుడూ!


ముందుగా కొన్నాళ్ళక్రితం గొడవ , వ్యాఖ్యలతో చదివి రండి.

మహాశివరాత్రి సందర్భంగా ఏదైనా చక్కటి పద్యమో, శ్లోకమో గుర్తు తెచ్చుకుని బ్లాగులో రాసుకుందామనుకుంటే, ఒక్క పద్యమైనా, కనీసం హలోట్యూనయినా గుర్తొస్తేనా? అదే ఆయన కాంపిటీటరు, ఆయన తాలూకు పోలీమార్ఫిక్ అవతారాల మీదయితే బోల్డన్ని పద్యాలు, ఉపమానాలూ, ఈ అమాయకపు దేముడి మీద అనవసర అభాండాలూ, దీర్ఘాలున్నూ.

అసలేమైనా అంటే అన్నామంటారు గానీ, ఈయనకు నిలువ నీడ ఉందా? ఏదో అత్తవారిచ్చిన కాస్తంత ఎడం లో ఫ్యామిలీ, ప్రమధగణాలు అందరూ సర్దుకుని ఉంటున్నారు. కట్టుకోడానికి ఓ నాలుగు జతలు బట్టలున్నాయా పోనీ ? పుట్టినరోజు పండక్కన్నా కొత్తబట్టలు పెట్టేవాళ్ళున్నారా? రెండు పూట్లా ప్లేటు మీల్స్ అయినా తింటున్నాడా? అసలు కూగూగు అన్న బేసిక్ అవసరాలే తీరకున్నా పెళ్ళాం బిడ్డల్ని ఏదోలా పోషించుకుంటూ గమ్మునుండాడే.ఈయన మీదనాండి మీ అభాండాలు?

ఓ రకంగా దేవతల్లో సమైక్య వాది గా శివయ్యనే చెప్పుకోవాలి. ఎందుకంటే చెడ్డోళ్ళూ, మంచోళ్ళని చూడకుండా, ఎగేసుకుంటూ వెళ్ళి వరాలిచ్చేదీయనే కదా. వెనకటికి రావణుడనే ఆయన అంత లావున తపస్సు చేసి, కొంపకెసరు పెట్టి, చివరికి పేగులవీ తెంపుకుని వీణ వాయించి మరీ వరాలు తెచ్చుకుంటే, నల్లటాయనేమో ఓ అవతారమెత్తి, అంతోటి వాణ్ణీ మర్డర్ చేశాడు. అదీ దేనికిట, తన పెళ్ళాన్ని ఆ పదితలకాయల రావణుడు కిడ్నాప్ చేశాడు కాబట్టి. తన పర్సనల్ ప్రాబ్లెం సాల్వ్ చేసుకోటం కోసం ఆ రావణుడంతోణ్ణి చంపి, ఆ ఘనకార్యంతోటి తన అవతారానికి అంత మార్కెటింగు తెచ్చుకున్నాడే. ఆ జాణతనాన్నేమనాలి? ఇంతా చేసి ఏమయ్యా అంటే, ఆయనకు పెళ్ళాం వెతికి పెట్టడానికి ఈయన హనుమంతుడి అవతారమెత్తవలసి వచ్చింది. తెరవెనుక సాంకేతిక సహాయం మాదీనూ, తెరవెనుక హీరో రోలూ మీదీనూ.

భృగువు అని మునులందరికీ ఓ కన్వీనర్. ఈయనా ముక్కంటే. కాబోతే ఈయన మూడో కన్ను అరికాల్లో ఉంది. (మనలో కొందరికి తలలు మోకాళ్ళలో ఉన్నట్టుగా కాబోలు) ఈ పార్టీ దేవుళ్ళలో టాప్ సీడ్ ఎవరు అని ఎంట్రన్స్ ఎక్జాం కండక్ట్ చేశాడుట ఓసారి. నాలాగ ముక్కంటే కదా అని కన్సెషన్ కూడా ఇవ్వలేదీయన శివయ్యకు. సరే వదిలేద్దాం. ఈ భృగు ఆ నల్లటాయన దగ్గరకెళ్ళి కాలితో తాపు తంతే, ఆయన చాలా తెలివిగా "మీ కాళ్ళు నా వక్షస్థలం మీద తగిలి మీకేమైనా అయింటుంది" అంటూ ఓవరాక్షన్ చేసి, ఆయన కాలుమధ్య కంటిని వత్తేశాడు. అది మామూలు కుట్రగాదండి. ఫ్యూచర్ లో భృగువు "నేను ముక్కంటే, నీవు ముక్కంటే" అని పాట పాడేసుకుంటూ వెళ్ళి ఎక్కడ శివయ్యకు మిస్టర్ యూనివర్స్ టైటిల్ ఇస్తాడేమో అన్జెప్పి, దానినడ్డుకోడానికి జరిగిన చేసిన పన్నాగం.

కథ అంతటితో పూర్తవలేదండి. ఆ కోన్ కిస్కా (క్షమించాలి) నేనున్న ప్లేసును తంతాడా అని అమ్మవారు అలిగి ఇండియాకు ఆన్సైటు కొచ్చింది. దానికా జగన్నాటక సూత్రధారి (పెళ్ళాం ఊరిళితే మొగుళ్ళు ఎలా ఫీలవుతారన్నది జగమెరిగిన సత్యం) ఫీలయినట్లు నటించి, దిగొచ్చేసి, ఆ వంకతో కాస్ట్లీయెస్ట్ దేవుడిగా స్థిరపడిపోయాడు! ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు! (ఒకే దెబ్బకు ఏడు తాడిచెట్లను కొట్టినాయనకిదేం లెక్క లెండి)

వద్దులెండి, ఆ పురాణ కథలొద్దు. నేలపైకొద్దాం. ఓ నెల ముందు ధనుర్మాసం లో గుళ్ళో పూజ చేయిస్తే, కమ్మటి చక్రపొంగలి, పులిహోరా పెట్టారు అయ్యవారు. శివరాత్రికో? శివరాత్రి పేరు మీద అంటూ ఓ కమ్మటి వంటకం అయినా ఉందా? అసలు కర్ణాటకలో కన్నడ రాజ్యోత్సవ లాగా కంపల్సరీ హాలిడే అయినా ఉందా ఈ పండక్కు?

వెనకటికి అతనెవరో దొంగట. దొంగతనాలవీ చేసి, పట్టుకోడానికి జనాలెంటబడితే, మారేడు చెట్టెక్కి, తెల్లార్లూ మేల్కొని, పొద్దు గడవడం కోసం ఆకులవీ తెంపుతూ, నమిలి కిందనున్న లింగం మీద ఊస్తూ గడిపాడుట. బర్త్ డే రోజు ఈ ట్రీట్ మెంట్ దొరికినా ఏమనుకోకుండా, ఆ భక్తుడిని అనుగ్రహించాడంటే ఎంత పిచ్చి మాలోకమనుకోవాలీయన్ని? తిన్నడనే అనే ఇంకొకాయన మాంసమదీ పెట్టి, ఎంగిలి నీళ్ళతో అభిషేకం చేసి, కాళ్ళతో లింగాన్ని ముడితే, ఆతణ్ణీ ఈయన నెత్తిన పెట్టుకున్నాడు కదా. హవ్వ, హవ్వ, హవ్వ!

ఈశ్వరుడి మీద వర్ణన అంటే కాళిదాసు శ్లోకం

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ"

అంతోటి శ్లోకం ఉంది కదా అంటారు కొంతమంది. జాగ్రత్తగా గమనించండి. రఘువంశం అనే ౨౩ సర్గల ప్రో-విష్ణుమూర్తి కావ్యం రచిస్తూ, మొదట ఒకేఒక శ్లోకం శివుడికి కేటాయించాడా పెద్దమనిషి. ఆ శ్లోకంలోనూ దణ్ణం పెట్టాడు కానీ, "చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ" అనే రేంజులో పొగడ్డం లేదు. ఇంకా మాట్లాడితే శ్లోకంలో మళ్ళీ అర్ధం క్రెడిట్ పార్వతికి వెళుతుంది.(ఎంతైనా "కాళి"దాసు కదా). అదే వరుసలో రెండో శ్లోకంకెళ్ళండి, "క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్ప విషయామతిః" (రఘువంశమెక్కడ? అల్పబుద్ధి నేనెక్కడ) అంటూ ఓ పొగడ్త!

అంతచేసి, కుమారసంభవంలో ఈయన్ని వర్ణించకుండా, "అస్త్యుత్తరస్యాం దిశి " అంటూ హిమాలయాలతో మొదలెడతాడు కావ్యాన్ని.ఏమనుకోవాలి? శివుణ్ణి టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అనుకోడం గాదా?

తెలుగుకొద్దాం. ఆయనెవరో శ్రీనాథుడట. నాపేరు పెట్టుకుని, హరవిలాసం అంటూ ఇంకొకళ్ళ కావ్యం రాస్తావా అని ఆయన్ని బొడ్డుపల్లి మాన్యాలు (శంకరగిరి లో శంకరుడున్నాడు కాబట్టి, ఆ ఊరి మాన్యాలు ఒగ్గేశాడు) పట్టించాడుగా నల్లాయన.

అలాగెలాగ? "తిరిపెమునకిద్దరాండ్రా! పరమేశా గంగ విడుము పార్వతి చాలున్" అన్నందుకు శివయ్యే
ఆయనకు శిక్ష వేశాడు అంటారా? అప్పుడయినా మన పార్టీ వాడని ఏమాత్రం పక్షపాతం లేకండా శిక్షించినందుకు శివయ్యే గ్రేటు.

తను స్మార్టు కాకపోయినా తనలను కొలిచే వాళ్ళు స్మార్తులుగా అనుగ్రహించిన ఆ భోళా శంకరుడిని ఓ చిన్న శ్లోకం ద్వారా గుర్తు చేసుకుంటున్నాను.

పాతువో నీలకంఠస్య కంఠః శ్యామాంబుదోపమః
గౌరీభుజలతా యత్ర విద్యుల్లేఖేవ రాజతే !

యత్ర - ఏ చోట
గౌరీ భుజలతా - పార్వతీదేవి యొక్క లతవంటి బాహువు
విద్యుల్లేఖా ఇవ - మెరుపు తీగ వలె
రాజతే - విరాజిల్లుతోందో
(అట్టి)నీలకంఠస్య - నీలకంఠుని యొక్క
శ్యామ+అంబుద+ఉపమః - నీలిమేఘము వంటి
కంఠః - గళసీమ
వః - మమ్ములను
పాతు - రక్షించుగాక!

చిన్న శ్లోకం అయినా కొన్ని చక్కటి చమత్కారాలున్నాయిట. శివుడు ధవళవర్ణుడు. ఆయన కంఠం మాత్రం ముదురు నీలి రంగులో ఉంది. ఆ కంఠం చుట్టూ గౌరీ (గౌరవర్ణం - పసుపు ముద్ద రంగు)దేవి తాలూకు భుజలత పెనవేసుకుంది. (కౌగిలించి ఉంది).

తెల్లటి దేహమూ, నీలిరంగు గళమూ, దాన్ని చుట్టిన పసుపు రంగు తీవెలాంటి బాహువు!

నీలకంఠుని కంఠం నీలిమేఘంలా ఉంటే, అమ్మవారి బాహులత గౌరవర్ణం లా ఉందట.

నీలకంఠుని కంఠము - శ్యామాంబుదోపమ
గౌరీభుజలత - విద్యుల్లత

ఒక ఉపమాలంకారానికి, మరో ఉపమాలంకారం - ఉపమ అవుతోంది. అదీ రెండు సార్లు.

(నెనర్లు - మృచ్ఛకటికం - బేతవోలు రామబ్రహ్మం గారు)

Tuesday, February 9, 2010

మా ఊరి మాటలు

"మీనుంచీ మీ సీమోళ్ళ భాష వినబడుతుందేమోనని ఆశపడ్డా, డిసప్పాయింట్ చేశార"ని ఈ మధ్య ఒక యువ బ్లాగ్మిత్రుడన్నాడు. అంత రాక్సాలిడ్ మాట వింటే బాధ కలగాలి, కానీ కొంచెం ఆనందమేసింది. నా ఆనందానికొక చిన్న కనురెప్పపాటువెనుక (ఫ్లాష్ బ్యాక్) ఉంది.

నేను మా ఊరు విడిచి బయటపడకుండా, అక్కడే కూపస్థమండూకంలా, డిగ్రీ వెలగబెడుతున్న రోజుల్లోనే కొంత మంది ఇతర జిల్లా బాహ్యస్థ మండూకాలు సహాధ్యాయులుగా దొరికారు. వాళ్ళలో ఒకడు శ్రీకాకుళం వాడు, కొంతమంది నెల్లూరు వాళ్ళు, ఇశాపట్నమోళ్ళు, కరీంనగర్ వాళ్ళు ఇలా రకరకాలు. తెలుగులో అన్ని రకాలుంటాయని, ఒక్కో తెలుగు ఒక్కో రకంలా ఉండుద్దనీ, అప్పుడే ఎరికయ్యింది. ఆ తర్వాత వూర్ల మీద పడి తిరుగుతున్న రోజుల్లో ఎక్కువగా విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళూ రూమ్మేట్లు గావడంతో నా భాష మారిపోయింది. అదీ జరిగిన సంగతి.

ఫ్లాష్ ఫ్రంటుకొస్తే - మా సీమ భాష అట్లా మర్చిపోయినా, అప్పుడప్పుడూ అలా గుర్తొస్తా ఉంటుంది, రానారె మాటలు విన్నప్పుడూ, నామిని కతలు చదూతున్నప్పుడు వగైరా వగైరా. కానీ ఎక్కడో చిన్న అనుమానం. మా తెలుగు మంచి ప్రామాణికమైన తెలుగేనా అని. ఇది నా కాంప్లెక్సే గానీ, వ్యర్థమైన డౌటు రాజం అని చాలా సార్లు నాకునేను సర్దిచెప్పుకున్నా, అప్పుడప్పుడూ అది తొలుస్తా ఉంటుంది నాకు.

అలానే తెలంగాణా మాండలికంలో వాడబడే "ఉన్నిండ్రు", "ఉంటుండ్రు" వంటి పదాలు అప్పటమైన తెలుగు పదాలని తిరుమల రామచంద్రగారు చెబుతారొకచోట. ఆయన చెప్పిన మరో ప్రయోగం "సేపు". మామూలుగా సేపు అన్న పదం విశేషణాలతో కలిసి "కొంచెం సేపు", "చాలా సేపు" అని వాడబడుతుంది. కానీ కర్ణాటక సరిహద్దు సీమ ప్రాంతాల్లో "సేపెంతయ్యింది" అన్న వాడుక ఉంది.

సరే, కథ కొస్తే, ఈ మధ్య సీమ మాండలికంలో పదాలు ఓ రెండు ప్రబంధాల్లో కనబడ్డాయి. వాటి కథకమామీషు ఇది.

౧. కూపెట్టుట - చాలా ఏళ్ళక్రిందట, మా పక్కింట్లో దంపతులు బాడుగకు దిగారు. వారిది మా జిల్లానే అయినా, దూరప్రాంతం కర్ణాటక సరిహద్దు (మడకశిర) నుంచీ వచ్చారట. వాళ్ళ అమ్మాయి తమ్ముణ్ణిలా పిల్చింది, "రేయ్, అమ్మ కూపెడతా ఉంది. గొజ్జు చేసిందంట, రాల్లంట". అప్పుడు అక్కడ నేనూ, నాతో బాటూ మా అన్నయ్యా, ఇంకొంతమందికీ నవ్వొచ్చింది. కూపెట్టటమేంటి? అని. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి సిగ్గుపడ్డారు మా నవ్వులు చూసి. (గొజ్జు అంటే - పులిహోర గొజ్జు)


అదుగో ఆ కూత ఇన్నాళ్ళకు మళ్ళీ ఇక్కడ.

ఏ పట్టున విసువక ర
క్షా పరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్నుల్
గూపెట్టిన విని తీర్పుము,
కాపురుషుల మీదనిడకు కార్యభరంబుల్

ప్రజల మీద విసుక్కోకు, ఆపన్నులు మొరపెట్టుకుంటే, శ్రద్ధగా ఆలకించు, చెడ్డవాళ్ళ మీద కార్యభారాలు వేయకు అని రాజనీతి సూత్రాలు చెబుతాడు ఒకాయన. ఆ పద్యం మా సీమకు పేరెట్టిన సీమ రాయడి కావ్యంలోనిది. కూపెట్టటమంటే పిలువడమూ, మొరపెట్టుకోవటమూనట.

౨. ఉడ్డ

మెత్తగ నూఱిన చుట్టుం
గత్తిన్ మధుకైటభోరు కంఠము లలనా
డొత్తిన హత్తిన చేదుం
దిత్తుల క్రియ దొడల నుడ్డ తిత్తులు వ్రేలన్.

ముందుగా ఒక ససందర్భ ప్రేలాపన. నామిని మిట్టూరోడి కతల్లో "అలిమేలు మంగమ్మకొక దండం" అన్న కతొకటుంది. ఆ కతలో ఓ వాక్యమిది.

"మడికాడికి ఆవును తోలకబోతా ఉండిన కర్రెక్కా, బోరింగు కాడ బోకులు తోముకుంటుండిన కడుపక్కా, మొగుడికి చద్ది పోస్తాపోస్తా ఉండిన నీలావొతీ అందురూ, చేపలగంప చుట్టూతా వుడ్డజేరిపొయినారు."

ఉడ్డజేరడం అంటే, గుంపు జేరటం అనే అర్థంలో మా ఊళ్ళోనూ నేను చిన్నప్పుడు విన్నాను., ఆ మాట వాడి ఉంటాను కూడాన అయితే ఈ మాట ఎక్కడా కనపడలేదు ఇన్నాళ్ళూ. మళ్ళీ ఆ పైన పద్యం లో "ఉడ్డ" ప్రస్తావన కనబడగానే కొంచెం ఛాతీ సైజు పెరిగింది నాకు.

ఆ పద్యం వివరణ ఇది.

ఆ పద్యం తాలూకు హీరో స్పష్టంగానే తెలుస్తూంది, పాండురంగడని. ఆ అయ్య ఆవులు కాస్తూ, కాస్తూ మధ్యలో సమయం దొరికినప్పుడు మిగిలిన గోపాలకులతో కలిసి గోళీలాడతాడట. అందుకోసం ఆయనకు నాలుగు గోళీకాయ (గచ్చకాయ) సంచులు మొలకు చుట్టుకుంటాడుట. వాటి వర్ణన ఆ పద్యం.

మెత్తగ నూరిన - బాగా పదునెట్టిన
చుట్టుం గత్తిన్ - చక్రం తోటి
మధుకైటభోరు కంఠములలనాడొత్తిన - మధుకైటభుల కంఠాలను తరిగిన (ఒత్తిన అంటే శబ్దం రాకుండా తరిగెయ్యటమట)
చేదుం దిత్తుల - చేదటానికి (గాలి తోడుకోవటానికి) పనికొచ్చే తిత్తులు అంటే ఊపిరితిత్తులట. మధుకైటభులు ఇద్దరివీ చెరో రెండ్రెండు, వెరసి నాలుగు సంచులు.
హత్తిన - లభించిన
క్రియన్ - యట్లుగా
తొడలన్ - తొడలకటూ ఇటూ
ఉడ్డ తిత్తులు వ్రేలన్ - నాలుగు సంచులు వ్రేలాడుతున్నవి.

ఇక్కడ బేతవోలు రామబ్రహ్మం గారి వివరణ -

"ఉడ్డ" అనేది నాలుగు అనే అర్థంలో ఆచ్ఛికపదం. ఉడ్డాముగ్గురు అనేది రాయలసీమ వాడుక. ఏడుగురు అని.

ఉడ్డ అంటే నలుగురు అని విశేషమైన అర్థం తీసుకున్నాడు కవి. అయితే సామాన్యంగా వాడుకమాటల్లో గుంపు అని అర్థమనుకుంటాను.

ఈ పద్యమూ ప్రబంధ కవివరులదే. మొదటి పద్యకర్త పేరులో ఉన్న కృష్ణయ్యే ఈ కవి పేరులోనూ ఉన్నాడు!

(నెనర్లు - పద్యకవితా పరిచయం - బేతవోలు రామబ్రహ్మం గారు - అజోవిభో కందాళం వారి ప్రచురణ)