Friday, September 14, 2012

వీణ వేణువైన మధురిమ!


ఆయన పాటలో ఆయన వేషం లానే పటాటోపాలు ఉండవు. పెద్ద పెద్ద సమాసాలు, బిగువైన పదబంధాలు, ఊపిరి తిప్పుకోలేని అద్భుతాలు లేవు. అలా రాయలేక కాదు. అవసరం లేక అలా రాయడాయన. చిన్న చిన్న తెనుగు పదాలతో మనసులను మైమరపించగలిగిన కలం ఆయనది. ఆయన పెన్నులో ఇంకు వాడతారో లేక తేనె వాడతారో తెలీదు కానీ రాసిన పాటలో మాత్రం మాధుర్యం కారిపోతూ ఉంటుంది.

ఒకపక్క బాలు, జానకి, మరోపక్క తెరపై నటించడానికి ముచ్చటైన జంట రంగనాథ్, ప్రభ. ఇంకేముంది? బాలు కు తోడు జానకి గారు, నటించడానికి చక్కనైన జంట ఉంది కాబట్టి "పూలు గుసగుసలాడేనని" పాటలోలాగా, గాయకుడు, నటుడు కలిసి రచయిత ను, సంగీత దర్శకుడిని తుక్కు రేగ్గొట్టాలి. కానీ అలా జరగలేదు. బాలు గొంతులో మాధుర్యం, జానకి గొంతులో నయగారాలు ఆ అపురూపమైన సాహిత్యానికి పక్క వాయిద్యాలుగా చేరిపోయాయి. మనోహరమైన సంగీతానికి పల్లకీలు మోసినాయి. వేటూరి, రాజన్ నాగేంద్ర గారలు చిరస్మరణీయులు అయ్యారు. వేటూరి గారి కలం వేణువు, రాజన్ నాగేంద్ర గారల సంగీతం వేణునాదమూ అయినాయి.

*************************************************************************

ఈ పాట ఇంటింటి రామాయణం సినిమా లోనిది. అనగనగా ఒక డాక్టరు. ప్రవృత్తి రీత్యా కవి. చిన్న చిన్న కవితలల్లుతుంటాడు. గొప్పింటి బిడ్డ. ఆయనకు నచ్చిన అమ్మాయితో వివాహమైంది. మనసైన వాడు. అమ్మాయి అణకువ, అందమూ కలబోసిన చక్కని చుక్క. వారి దాంపత్యం, ప్రేమ పాటగా జాలువారింది.

ప్రేమ పాట కాబట్టి ప్రేమ, మనసు, అనురాగం, దాంపత్యం, హృదయం, మమత, ప్రాణం ఇలాంటి శబ్దాల్లో ఒక్కటైనా వినబడాలి మరి.

చిత్రం! అవేవీ ఈ పాటలో లేవు. మరో చిత్రం - ఆ సినిమాలో నాయకుని ప్రవృత్తి కవిత. ఆ ’కవిత’ ను ఒదల్లేదాయన. అక్కడా చాలా అర్థం ఇరికించాడు. వేటూరి కలం ఎలా మెలికలు తిరిగిందో చూడండి.

పల్లవి:

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...


అబ్బాయి మనసు వేణువు, అమ్మాయి మనసు వీణ. మనసు కు బదులుగా అనురాగాన్ని కానీ, ఆరాధనను కానీ దేన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. ఎంత క్లాసుగా ఊహించవచ్చో, అంత మాస్ గా కూడా ఊహించుకోవచ్చు. అది వేటూరి స్పెషాలిటీ!

వేటూరి కలం చిలికించిన ’ప్రాస’ లీలను ఇక్కడ చదువుకోండి. ఈ పాట గురించి వివరించి స్వారస్యం చెడగొట్టటం వద్దు.

’కదిలే అందం కవిత....అది కౌగిలి కొస్తే యువత’ - అబ్బాయీ నీవు రాసే కవితలు కాదు, నీ ఎదుట కదిలే అందాన్ని చూడలేదా? ఆ అందాన్ని కౌగిట్లో చేరిస్తేనే నీ యౌవ్వనానికి సార్థకం....కాదంటావా?....

పాఠకవర్యా! ఎన్ని అర్థాలు ఊహించుకుంటారో ఊహించుకోండి. ఇది మీకు విందుభోజనం....ఇదే వేటూరి ఆహ్వానం.


సరే. పాట చదువుకున్నారు కదా. ఇప్పుడు సంగీతానికి వద్దాం. ఇప్పుడు పాటను పల్లవి ఆరంభం ముందు వరకూ వినండి. పాట ఆరంభంలో వీణ! ఆ వీణ అలా మెలమెల్లగా వచ్చి మురళీనాదంతో లీనమవడం - అంటే వీణ వేణువైన సరిగమ, తీగె రాగమైన మధురిమ ను గమనించారా?  ట్యూను తో సంగీతదర్శకుడు భావాన్ని చెబితే, ఆ భావాన్ని మనసుతో పట్టుకుని అందుకు అనుగుణంగా పాట వ్రాయడం వేటూరికి చెల్లింది.
సరిగ్గా అర్థం కాకపోతే మరోసారి పాటను చూస్తూ వినండి.


మొదటి చరణం జానకితో మొదలెడితే, రెండవ చరణం బాలు తో మొదలు. రెండు చరణాల మధ్యలో హమ్మింగ్. వేటూరి కలం ప్రాస! ఆహా! ఎంత అందమైన symmetry?

ఈ పాటలో జానకి "తహ తహ" లాడాల అన్నప్పుడు పరవశమూ, బాలూ "అహాహా లలలా" అని రాగం తీసినప్పుడు ఉన్న అలవోక, అద్భుతంగా ఉన్నా, "పూల గుసగుస లోలా" డామినేట్ చేయలేదు. వాళ్ళ పప్పులు వేటూరి ముందు ఉడకలేదు. అలాగే - ’కదిలే అందం కవిత’ అన్నప్పుడు నాయిక అందంగా సిగ్గు పడటం, ’చెలి ఊగాల ఉయ్యాల లీవేళలో’ - అన్నప్పుడు నాయిక, నాయకుల మధ్య అందమైన బిట్ వంటివి - సంగీత మాధుర్యాన్ని పెంచాయే గానీ సంగీతాన్ని మర్చిపోయే విధంగా కళ్ళకు పని చెప్పలేకపోయాయి. 


రాజన్ నాగేంద్ర గారల దమ్ము అది! ఇంకా రాజన్ నాగేంద్ర ల గురించి తెలియాలంటే ఈ పాట మాతృక , కన్నడ సినిమా పాటను చూడండి. కన్నడ పాట విరహ గీతం. తెనుగు పాట ఆహ్వాన గీతం. రెంటికీ దాదాపుగా ఒకే ట్యూను? ఎలా సాధ్యం? అది రాజన్ నాగేంద్ర గారి ఇంద్రజాలం. ఈయన పాటల్లో నాకు తెలిసి వినలేనివంటూ ఒక్కటీ లేవు. అంత మధురమైన సంగీతం ఆయనది.ఈ పాట సాహిత్యానికి, సంగీతానికి సంబంధించి నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంటింటి రామాయణం సినిమాకు ’హొంబిసిలు’ అనే నవల ఆధారితమైన కన్నడ సినిమా మూలం.

Thursday, September 13, 2012

పూల గుసగుసలు మరొకసారి..


వామ్మో! అసలు బాలు మనిషేనా? పాటలెవరైనా పాడతారు కానీ ఇదేంటిది? ’వయసు సవ్వడి చేసేనని’ - ఆ ముక్క పాడేప్పుడు వయసు సవ్వడి ’చేసే’ - లో అదుగో ఆ చేసే అనే చోట బాలు గొంతు వినితీరాలి బాబులూ!

ఎక్కడ నుండి మొదలెట్టాలి? చరణం నుండి మొదలెడదామా? వద్దు. ముందు ఈ వీడియోలు చూసెయ్యండి. చెప్తా. రెండు వీడియోలెందుకంటే రెండు ట్యూన్లలో కాస్త తేడాలున్నయ్ వినండి తెలుస్తుంది. మొదటి వీడియోలో కృష్ణ ఏక్షన్ ను కూడా వదలద్దు.


 

చూశారా? ఇప్పుడు చరణం గుర్తుకు తెచ్చుకోండి.

మబ్బు కన్నెలు ’పిలిచే’నని - మేఘాల కన్నెలు పిలుస్తున్నట్టే లేదూ?
మనసు రివ్వున ’ఎగిరే’నని - ’ఎగిరే’నని అనే కాడ రోంత మనసు పెట్టి యినండి. మనసు ఎగురుతున్నట్టు లేదూ?
వయసు సవ్వడి ’చేసే’నని - ఇదివరకే చెప్పా గదా! ’చేసే’ అనేచోట గొంతును అలా మార్చడం ఈ భూప్రపంచంలో బాలుకు మాత్రమే సాధ్యం. మా
భాస్కర్ భాయ్ కూడా అదే అంటున్నాడు.

సరే, బాలు కు సిగ్గు లేదు కాబట్టి ఇలా పాడి పెట్టాడు. మా ’బెండు’ అప్పారావు - కృష్ణకు ఏమొచ్చింది మాయరోగం? ఆ వీడియో చూశారు గందా, మొదట్లో ఈల వేసుకుంటూ వస్తాడు కదా, అక్కడ అసలు మొగ్గ లాగానే నడుస్తున్నాడు చూడండి. ఆ తర్వాత పూలు గుస గుస అని పల్లవి ఎత్తుకునేప్పుడు మాత్రం పువ్వులా వికసించిపోయాడు.అసలు మా వాడు కృష్ణయే పువ్వు లాగున్నాడు. అతణ్ణి చూసి పువ్వులే సిగ్గుపడాలి. ఇక కోటు తొడగటం ’ఊర మాస్’ లో క్లాసు కు పరాకాష్ట! ఈ పాటకు కోటు వేసుకోకుండా మామూలు అంగీ తొడిగి ఉంటే ఎంత దరిద్రంగా ఉండేదో ఊహించండి! అసలు ఎవడు సామీ ఆ సైన్మ దర్శకుడు? ఎవడసలు నృత్యదర్శకుడు? అందరూ ఇట్లా రెచ్చిపోతే ఎలాగ ?

కళా దర్శకుడు తక్కువ తిన్నాడా? ఆ లొకేషనేంటి? ఫోటోగ్రాఫరో? కృష్ణ మొదటి చరణం పాడేసి రిలాక్సెడ్ గా ఉన్నప్పుడు గాంధీ విగ్రహం చూపిస్తున్నాడు. ఆ తర్వాత "ఆ, ఓహ్" అనే అమ్మాయి గొంతు గమకాల మధ్య వాణిశ్రీ! వామ్మో! ఏం మాసు? ఏం క్లాసు??పూలు గుసగుస అనే దాన్ని మూడు టోన్ లలో పాడినప్పుడు నాకు మొదటి సారి బాలు గొంతులో మల్లెపువ్వు, రెండో సారి బంతి పువ్వు, మూడో సారి వంద రేకులతో తామరపువ్వూ విరిసినట్టు (వి)కనిపిస్తా ఉంది. ఏం, పోలిక బాలేదా? అయినా సరే అదంతే.

పల్లవి అయిన తర్వాత మ్యూజిక్ వచ్చేప్పుడు (లల లలా, లాలా) పూలమీద నుండి పక్కకు మళ్ళుతుంది కెమెరా. ఒక్క కెమెరాయే కాదండి. మ్యూజిక్కూ మళ్ళుతుంది. చరణం మొదలవుతుంది.

చరణం తర్వాత ఒకసారి వినండి. ’రురురు రూరూరురు ,,, ఆ...ఓహ్’ లో ఆ ’ఆహ్..ఓహ్..’ ల కాడ ఆ ట్యూను ఉందే అది రికార్డు చేసేప్పుడు బాత్ రూమ్ లో దూరి రికార్డు చేసి ఉంటాడు ఖచ్చితంగా. బాలు మనిషి కాదు కాబట్టి చెప్పలేం కానీ మనలాంటి మనుషులకు మాత్రం కృష్ణ గొంతులో వినిపించే ఆ ’ఆహ్, ఓహ్’ లు బాత్ రూములో మాత్రమే సాధ్యమైతయ్.

రెండో చరణం -

అలలు చేతులు సాచేనని - అలలు అన్నప్పుడు అలలు వస్తున్నట్టు ’చే’తులు లో ’చే’ దగ్గర అల విరిగింది. సాచే లో చే దగ్గర మరోసారి అల విరిగింది.

నురుగు నవ్వులు పూచేనని - పూచే లో పూలు పూయడం విన్నారా?
నింగి నేలను తాకేనని ... నేడే తెల్సింది రురు .. రురు.. రురురూ ..ఆహ్ .. ఓహ్

నింగి నేలను ’తాకే’ నని - ’తాకే’ దగ్గర గొంతులో ఆ తమకం! బాలూ నీవు కడుపుకేం తింటున్నావురా బాబు? ఆ పరవశం నుండి కోలుకోకుండానే మళ్ళీ ఆ ’ఆహ్..ఓహ్’ లు!

ఈ పాటకు రెండు రకాల ట్యూన్లు. ఒకటి సినిమాలో, మరొకటి బయట. రెండూ రెండే! ఈ పాట వినడానికి కళ్ళూ, చూడడానికి చెవులూ కావాలి. ఎందుకంటారా? పాట వినేప్పుడు పూవు విచ్చుకోవడం కనిపిస్తుంది. కృష్ణ వీడియో లో ఆడియో మూసి పెట్టి చూడండి. పూల గుసగుసలు, మబ్బు కన్నెలు పిలవడం, వయసు సవ్వడి చేయడమూ వినిపించట్లే?

నిజానికి నాకయితే విన్న ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా వినిపిస్తుంది. వందసార్లు విన్న తర్వాత కూడా కొత్తగానే ఉంటది. కొన్ని నెల్ల క్రితం నా ఫోనులో రింగుటోను పెట్టాను. ఆఫీసులో కొరియావాడు మొదట ఈలతో వచ్చే మ్యూజిక్ విని డంగై పోయాడు! ఆ ఈల సహజంగా ఉంది, ఎవరో వేస్తున్నట్టు! ఆ పాట నాతో అడిగి ఎక్కించుకున్నాడు కూడా!

తెలుగు సైన్మా పాటల్లో ఇది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది రాసింది నారాయణరెడ్డి అట. సంగీతం జీకే వెంకటేష్. అయితే వాళ్ళిద్దరి కంటే బాలు, కృష్ణలే ఈ పాటకు నిజమైన కర్త, కర్మ క్రియ అన్నీ! ఇంత చేసి ఈ పాట హిందీ సినిమా పాటకు కాపీ. అయితే ఆ హిందీపాట జితేంద్ర మొఖంలా ఉంది. దాని గురించి మాట్లాడ్డం వేస్ట్.ఈ పాటను మళ్ళీ ఈ మధ్యన ఒక సైన్మా లో పెట్టుకున్నారు. అది లెజెండ్రీ స్థాయినుండి సెలెబ్రిటీకి పడిపోయినట్టు నికృష్టంగా ఉంది.

మరొక పాట ’వీణ వేణువైన సరిగమ విన్నావా?’ దాని గురించి మరెప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు.