Thursday, December 27, 2007

పోకిరీ ... భవ హారీ ...

మేము మొన్నామధ్యనే ఇల్లు మారాము మా వూళ్ళో. కొత్త ఇల్లు సదుపాయంగానే వుంది. ఇంటి పక్కన ఓ భజన మందిరం కూడాను. అంటే, రాముల వారి ఓ చిన్న గుడి. అంతా బాగుంది అని సంబర పడుతుంటే, ఓ శని వారం వచ్చింది. ఆ శని వారం నిజంగా మాకు 'శని ' వారమే.

ఆ రోజు రాత్రి దాదాపు 7:30 కావస్తొంది. నక్కల వూళలు ఏమి లేవు. ఆ రోజు పౌర్ణమి. ఇంట్లో అంతా యేదో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాము చూస్తున్నాము టీవీ లో. వున్నట్టుండి, భజన మొదలయ్యింది., రాముల వారి గుడి లో.

కర్ణపుటాలు బద్దలయేలా మైకులో గొంతు.
" రామ నామము రామ నామము, రమ్యమైనది రామ నామము.."

పాట పూర్తవగానే ఇంకో పాట.
" గణేశ శరణం, శరణం గణేశ..."

పాట సాగే కొద్దీ, గొంతు లో పిచ్ కూడా అధికం అవసాగింది.

ఆ శబ్దాన్ని నిరోధించడానికి నేను మా ఆఫీసులో క్రైసిస్ మానేజిమెంట్ (ప్రాజెక్ట్ మానేజరు ద్వార అధికముగా వుపయోగించబడు ఓ శబ్దము) తెలివి వుపయోగించా..

ఫాను స్పీడు ఎక్కువ చేసా...మా ఇంట్లో ఫాను తిరిగితే శబ్దం వస్తుంది. గాలి రాదు.

ఈ లోగా, అభిఙ్ఞ వర్గాల ద్వారా, కనుక్కున్న భోగట్టా యేమంటే, భజన రాత్రి అంతా కొనసాగుతుంది !

భజన మందిరం లో కొత్త గొంతు. అలానే పాట కూడా రొటీన్ కి భిన్నంగా వుంది.

" కార్తీక మాసములో..., శివ దేవుని సన్నిధిలో...
కొలిచెదము, నిను తలిచెదము.... "

అరె..ఈ పాట ఎక్కడో విన్నానే అనుకుంటుంటే, గుర్తొచ్చింది. ఈ పాట నేను చిన్నప్పుడు ఆకాశ వాణి కడప కేంద్రం లో యెప్పుడు వస్తుండేది. SP బాలు, P. సుశీల ల పాట (లాంటిది)

"చిరునవ్వుల తొలకరిలో...సిరి మల్లెల వలపులలో...
కలిసెనులే, తొలి హ్రుదయాలే, చిరు వలపుల కలయికలో..."

అయితే కాసేపటి తర్వాత ఓ ఊహించని ట్విస్టు.

"ముక్కంటీ..ముక్కొపీ..ఓ దేవా..మమ్ము బ్రోవా.."
(పాట సరిగా గుర్తుకు లేదు, అయితే రాగం మాత్రం అలాంటిదే)

మీకు గుర్తుకు వచ్చుండాలి. ఇది యే పాటో..అవును మీరు కరెక్టే..
(scroll చేయనవసరం లేదు).

" ముక్కాల ముఖాబ్ లా లైలా.."

ఇలా భజన అంతకంతకూ తీవ్ర స్థాయి దాల్చసాగింది.

నా క్రైసిస్ మానెజిమెంటు టెక్నిక్, మా ఆఫీసు లో లాగానే పని చేయలేదు.

ఇలా కాదనుకుని, మా కంపనీ హెచ్ ఆర్ వారు నుడివిన సుభాషితా రత్నావళి తలుచుకున్నా..ప్రో యాక్టివ్ గా ఆలోచించాలి యెల్ల వేళలా అన్న ఓ సూక్తి గుర్తొచ్చింది.

ఆచరణలో పెట్టా... (నేను అర్థం చేసుకున్న విధానం ఒప్పో కాదో నాకు తెలీదు).

ఓ బ్లాక్ బస్టరు సినిమా పాట ను భక్తి గీతం గా మలిచా ఆ రాత్రంతా కూర్చుని. ఆ ఓరిజినల్ పాట, అదే రాగం లో నేను కష్టపడి రాసిన భజన కింద ఇస్తున్నాను.

ఓరిజినల్ పాట:

డోలె డోలె దిల్ జర జరా
నిను ఓర ఓర గాని నరవరా
జాగు మాని చేయ్ కలపరా
జత చేరి నేడు జతి జరుపరా

జర జల్ది జల్ది పెందలకడనే రారా
వడి ఆంత రంగ సంబరమునకే రారా

రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడ నిశి కేళి వేళ చిత్త చోరా

చలేగ చలేగ యెహ్ హైన్ ఇష్క్ క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కొ దీవాన
చలేగ చలేగ యెహ్ హైన్ ఇష్క్ క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కొ దీవాన

అనువుగా అందిస్తా సొగసుని సందిస్తా
పొదుగుతు కుదురుగ నీలోనా
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
దిల్బర్ దేఖో నా

మిసమిస కన్నే కొసరకు వన్నే వలపుతో వలపన్నీ
నఖశిఖలన్ని నలుగును పన్నే కలబడు సమయాన్నీ

ఒడికి త్వరగా యే..బరిలో కరగా యే..ఒడికి త్వరగా యే..బరిలో కరగా
(Shake it wanna shake it up babe!!)

============================================

నా పాట :

భోలె భోలె ఓ భవ హర
మా మొరలు గనర ఓ సురవరా
జాగు మాని మము బ్రోవరా
గతి నీవె మాకు విశ్వేశ్వరా

మా పూజలన్ని గైకొనగా లేరా
వడి ఆంగ రంగ వైభవముననే రారా

మా మల్లికార్జునుడవు నీవేనురా సారంగపాణి శ్రీ కాళేస్వరా, హే హిమవతనయ చిత్త చోరా

చలేగ చలేగ యెహ్ హై భజన్ క జమాన
మిలెగ మిలెగ యు హి ముక్తి సుహన
చలేగ చలేగ యెహ్ హై భజన్ క జమాన
మిలెగ మిలెగ యు హి ముక్తి సుహన

మనసును అర్పిస్తా స్వాసను బంధిస్తా
బుద్ధిని కుదురుగ నీపైన
ముడుపుతొ మెప్పిస్తా ఒడుపుతొ ఒప్పిస్తా
దిల్బర్ దేఖో నా

మిసమిస వన్నే బుసలను చిమ్మే నాగభరణాన్ని
నఖశిఖలన్ని మసివది పోయి నంది వాహనము తోడి

భువికి త్వరగా యే..
మా మనసు కరుగా యే..
భువికి త్వరగా యే..
మా మనసు కరుగా యే..

(Shake it wanna shake it up babe!!)

==================================

వచ్చే శని వారం భజన అంటూ జరిగితే నేను ఆ భజన లో పాల్గొనడమో ., లేదా, ఆ భజన వీరులలో ఎవరికైన ఈ భజన వినిపించడమో చేయాలి అనుకుంటూ, మరుసటి రోజు పొద్దున 4 గంటలకు నిద్ర పడుతుండగా అనుకున్నా...

(ఎవ్వరి మనసు నొప్పించడం వుద్దేశం కాదు, సరదాగ నవ్వుకోడానికి మాత్రమే. అయితే, ఇందులో కొన్ని మాత్రం నిజాలే. ఇలా పాట రాయడం తప్పేమో మరి, అయితే, ప్రతీకారం తీర్చుకోక పోతె, నా సీమ రక్తం వూరుకునేటట్టు లేదు. పైగా ఇలా రాత్రుళ్ళు దేవుని పేరు మీద జనాల నిద్ర చెడగొట్టడం కూడా విఙ్ఞత అనిపించుకోదు.)

Sunday, September 23, 2007

ఓ భేతాళ కథ

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు పై నుండి శవాన్ని దించి, భుజాన వేసుకుని యెప్పటి లానే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవం లో వున్న భేతాళుడు ఇలా అన్నాడు. " ఓరేయ్ దరిద్రుడా, రోజు సాయంకాలం నన్నెందుకిలా హింసిస్తావు ? చచ్చిన తర్వాత కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదరా. ఓ రాజ్యానికి రాజువై వుండీ నీకిదేం పోయే కాలం ? ఏం సాధించాలని నీ ఆరాటం? సరే, నువ్వెలానూ మారవు కానీ, టైం పాస్ కోసం ఒక చిన్న కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను."

రాంబాబు, రాఘవ్, మురుగన్ చిన్నప్పటి నుండీ ఒకే వీధిలో పెరిగారు. పైగా ఇరుగు పొరుగులు. వీళ్ళు ముగ్గురు మిత్రులే, కానీ చాల మంది ఇరుగు పొరుగుల్లాగే, వీళ్ళ తల్లితండ్రులకు వాళ్ళ తల్లితండ్రులకూ ఒకరంటే ఒకరికి విపరీతమయిన అసూయ, కోపం, వగైరా..అస్సలు పడేది కాదు.

రాంబాబు ఒక రూపాయ (పదహారు అణాలు) ఆంధ్రుడు. పైగా సీమ సిం హం.

రాఘవ్ వురఫ్ రాఘవేంద్ర అలియాస్ బిసిబేళా బాత్ ఓ రూపాయ పావలా కన్నడ కస్తూరి. కస్తూరి అంటే అదేదో టైపు జింక అట. జింకల గురించి పూర్తి వివరాలకు సులేమాన్ ఖాన్ , ఛ, సారీ, సల్మాన్ ఖాన్ ను అడిగి కనుక్కో.

మురుగన్ గన్ను షాట్ గా ఓ రూపాయ న్నర తమిళ పులి.

"అంటే ముగ్గురు జంతువులే అంటావ్" అన్నాడు విక్రమార్కుడు మధ్యలో కల్పించికుని, తన జోకు కి తనే మురిసి పోతూ.

"రేయ్, అష్ట దరిద్రుడా, ప్రశ్నలు వెయవలసింది నేను. అదీ కథ ఆఖరున. కాబట్టి నోరు మూసుకుని విను. " భేతాళుదు కసిరి, మళ్ళీ కంటిన్యూ చేసాడు.

మిత్రులు ముగ్గురు చదువులలో అబవ్ ఆవరేజీ నే అయినా, ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లో మిగతా వారికంటే ఆధిక్యత చూపేవారు.

రాంబాబు గణితం లో కొద్దిగా తెలివితేటలు కనబర్చేవాడు. రాఘవ్ ఇంగ్లీషు లో. మురుగన్ మాత్రం ఎలా, ఏం చేసే వాడో తెలీదు, మిగతా ఇద్దరికంటే యెక్కువ మార్కులు సంపాదించేవాడు., అంటే ఇతని తెలివి, విషయాన్ని ప్రదర్శించడం లో కనబడేది.

ఇలా ఈ ముగ్గురు మిత్రులూ, పెరిగి, కాలేజీ వరకు వచ్చారు. రాంబాబు ఎంసెట్ కొట్టాలని ప్రయత్నించాడు, కానీ ఎంసెట్టే తిరిగి తనను కొట్టడం తో, ఏదో ఓ డిగ్రీ కాలేజీ లో చేరాడు.

రాఘవ్ డొనేషన్ సీట్ లో ఇంజినీరింగు లో చేరాడు.

మురుగన్ వాళ్ళ నాన్నకు తమిళ నాడు ట్రాన్స్ ఫర్ అవడం తో తమిళ నాడు వెళ్ళి అక్కడ ఎదో ప్రొఫెషనల్ కోర్సు లో చేరాడు.

ముగ్గురూ, వాళ్ళ చదువులు ముగించి, వుద్యోగాల వేట లో పడ్డారు. మురుగన్ వాళ్ళ నాన్న ప్రభుత్వం లో వున్నతోద్యొగి కావడం తో, మురుగన్ ను ఎలాగో, ఎదో, సర్వీసు లో ఇరికించేడు.

రాఘవ్, చదువు ముగించి, నగరానికి వెళ్ళి, ఏదో కోర్సు చేసి, అవస్థలు పడి, చివరికి, తన ఆంగ్ల భాష ప్రతిభ తో, ఓ సాఫ్ట్ వేరు కంపనీ లో చేరాడు.

అయితే రాంబాబు అవస్తలు మాత్రం బాగా కొనసాగాయి. ఆంగ్ల భాష ప్రతిభ అంతంత మాత్రం కావడం తో, ఇంటర్ వ్యూ లో, ఎక్కడ అడుగు పెట్టినా హెచ్ ఆర్ వారు, కమ్మ్యూనికేషన్ స్కిల్స్ లేవు అంటూ విదల్చి కోట్టే వారు. గణితంలో తన ప్రతిభ అపారం అయినా, గుర్తించే వారు లెక పోవడం తో, బాగ నిస్పృహ చెందే వాడు.

ఇలా 3, 4 యేండ్లు అవస్థ పడిన తర్వాత, యేదో, చిన్న కంపనీ లో డబ్బులు కట్టి ఎక్స్పీరియన్సు లెటర్సంపాదించేడు. ఆ లెటర్ తోటే, ఎడొ, అమెరికన్ కంపనీ లో, వుద్యోగం సంపాదించి, H1 ప్రాసెస్స్ చేయించుకుని, అమెరికా చెక్కేసాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తన దశ తిరిగింది. తన ప్రతిభ కు గుర్తింపు వచ్చింది. అంచెలంచెలు గా ఎదిగేడు.అమెరికా లోనె సెటిల్ అయ్యడు.

మురుగన్, రాఘవ్, వాళ్ళ వాళ్ళ కంపనీలలోనే కొనసాగుతూ, సీనియర్ పొసిషన్స్ కు చేరుకున్నారు.

చాల కాలం తర్వాత ముగ్గురు మిత్రులూ, కలుసుకున్నారు, అదీ వుద్యోగ సంబధంగా. రాంబాబు కంపనీ, ఓ టెక్నాలజీ లో మోనోపోలీ. రాంబాబు కంపనీ ఇండియా వ్యవహారలు రాఘవ్ కంపనీ వారు చూస్తారు. రాఘవ్ దానికి ఇన్ చార్జి. మురుగన్ పని చేసే, ప్రభుత్వ సర్వీసుకు ఈ టెక్నాలజీ అవసరం. ఇలా ముగ్గురు కలుసుకున్నారు.

రాంబాబు, ఇద్దరినీ అప్యాయంగా పలకరించేడు. రాఘవ్ బాగ సంతోష పడ్డాదు, అయితే ఎదో మూల జెలసీ. మురుగన్ కు మాత్రం రాంబాబు ఎదుగుదల అస్సలు రుచించలేదు.

భేతాళుడు కథ ముగించి, విక్రమార్కుడిని ఇలా అడిగాడు.

"రాజా! ముగ్గురి లోనూ నిజాయితీ పరుడెవ్వడు ? ముగ్గురిలోనూ, మంచి పొసిషన్ ఎవరిది? రాంబాబు ఇలా వక్రమార్గం లో ఎదగడం తప్పు కాదా? రాఘవ్ రాంబాబు ను చూసి ఎందుకు అసూయ చెందాడు? ఈ ప్రశ్నలకు తెలిసీ జవాబు చేప్పక పొయావో, నీ తల వేయి వ్రక్కలవుతుంది"

దానికి విక్రమార్కుడిలా బదులిచ్చాడు.

"నిజాయితీ విషయానికి వస్తే ముగ్గురూ నిజాయితీ పరులు కారు. ఎందుకంటే, మురుగన్ వుద్యోగం తన ప్రతిభ తో సంపాదించింది కాదు. రాఘవ్ ప్రతిభ కు కారణం కూడా, డబ్బు. రాంబాబు సంగతి తెలిసిందే. అయితే ముగ్గురిలోకీ నిజాయితీపరుడు నిస్చయంగా రాంబాబు. ఎందుకంటే, తను వెరే మార్గం లేక ఇలా ఎదిగాడు. యెదిగిన తర్వాత తన మిత్రులను చూసి, అసూయ చెందక పోవడం అతని ఔన్నత్యానికి నిదర్శనం. రాంబాబు ఇలా ఎదగడానికి పరిస్తితులే కారణం, కాబట్టి తప్పు లేదు. ఇక రాఘవ్ అసూయ కు ఒక కారణం, ఒకే రకమయిన పని లో స్థిరపడడం, రాంబాబు లా జీవితం లో భిన్నమైన అనుభవాలను చూడలేకపోవడం, అంతే. ఇక ముగ్గురిలో వుద్యోగ పరంగా అయిటె వున్నతమయిన స్థానం మురుగన్ దె. నిలకడయిన వుద్యోగం, ఇంకా ఎన్నో అదనపు సౌకర్యాలు కూడాను."

రాజు కు ఇలా మౌన భంగం కాగానే, భేతాళుడు, వీడు మళ్ళీ రేపు సాయంకాలం నన్ను పీక్కు తింటాడు కదా అనే విసుగుతో, విక్రమార్కుడిని, అమ్మనా బూతులు తిట్టుకుంటూ, తిరిగి చెట్టెక్కాడు.

(కేవలం నవ్వుకోడానికి మాత్రమే. ఎవ్వరినీ నొప్పించడం వుద్దేశం కాదు.)

Wednesday, September 19, 2007

శునక సం హిత (కొత్త నిబంధన గ్రంథము - బెంగళూరు)

Statutory warning :


కుక్కలంటే భయపడే వారు, ఇష్టపడే వారు ఈ టపా చదవకండి.


అదో కాళ రాత్రి. రాత్రి 12:30 గంటలు. దూరంగా కుక్కల వూళ వినిపిస్తుంది. మా ఇంటికి రోడ్డు నుండి దాదాపు 1/2 కిలో మీటర్ వుంటుంది. రోడ్డు బాగ ఇరుకవడంతో, అక్కడకు కార్లు, వగైరా వచ్చే అవకాశం లేదు. నేను రోడ్డు దగ్గర దిగి నడుచుకుని వస్తున్నాను. ఒక 20 అడుగులు వేయగానే వెన్ను నుండి చిన్నగా చలి మొదలయ్యింది. దాదాపుగా ఒక డజను శునక రాజములు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాయి. అందులో ఒక కుక్క మేలుకుని వుంది.అడుగు ముందుకేసాను.


చిన్న శబ్దం, గ్ ర్ర్, అని, అలానే కొన్ని అడుగులు ముందుకెళ్ళాను. ఈ సారి బుస్స్ అనే శబ్దం. ఝల్లు మంది గుండె. ఇంకొన్ని అడుగులు ముందుకేసాను. లక్కీ గా ఆ రోజు నేను ఏ రకమయిన యూనిఫారం వేసుకోలేదు. (ఈ సారి బాగ గమనించండి. శునకాలు ఎక్కువగా యూనిఫారం వేసుకున్న వాళ్ళను అంతగా ఇష్టపడవు. ఉదాహరణకు పోలీసులు, పోస్ట్ మాన్, బుడబుక్కల వాళ్ళు వగైరా..). పాపం పోనీలే అని దయ తల్చినట్టున్నాయి, వదిలేసాయి.


ఆ రాత్రి ఓ పీడ కల. కలలో పేపర్ హెడ్ లైన్స్ ఇలా కనబడ్డాయి.

" కుక్కల వేటుకు ఠపా కట్టిన టెకీ!"

" సీమ సిం హం పై గ్రామ సిం హాల దాడి"

" బెంగళూరు శునక పర్వం లో మరో నెత్తుటి పేజీ"


ఎలానో ఆ రాత్రి గట్టెక్కింది.


నేనెలానో తప్పించుకున్నాను, కానీ మరుసటి రోజు ఆఫీసు కు వెళ్ళిన తర్వాత తెలిసింది, మా కొలీగు వాళ్ళ వీధి కుక్కల కరాళ నృత్యానికి బలి అయి, హాస్పిటల్ పాలయ్యాడు అని.


ఈ శునక పర్వం బెంగళూరు లో ఇప్పటికే ఎన్నో అధ్యాయాలు దాటింది.


అయితే పెరుగుతున్న శునక జాతి వలన కొన్ని లాభాలు వున్నాయి. అవి


1. కుక్కలను చంపకుండా వాక్సినేషన్ వేయించి వదలాలి కాబట్టి, ఆ వాక్సిన్ తాలూకు కంపనీ లకు మంచి లాభాలు.


2. బెంగళూరు నిశాచరులు ఇల్లు దగ్గర వున్నా కాబ్/టాక్సి లోనే వెళుతున్నారు. ఎందుకంటే 2 వీలర్ లేదా కాలి నడకన వెళితే అంతే గతి.సదరు టాక్సి కంపనీ వాళ్ళకు యమ గిరాకీ.


3. 2 వీలర్, లేదా కాలి నడక గాళ్ళకు దొంగల భయం వుండచ్చు. టాక్సి అయితే ఆ భయం వుండదు. మహా అయితే టాక్సి డ్రైవర్ ద్వారా మాన భంగమో లేదా ప్రాణ హానో జరగచ్చు అంతే.

నగర పాలికా కార్యాలయం వారు ఇంతకు ముందు ఎవేవో ప్రయత్నాలు చేసి, ఈ సమస్యను ఆఖరు కు గాలికి వదిలేసారు.


ఇప్పుడు కరవమంటే శునక బాధితులకు కోపం, విడవమంటే బ్లూ క్రాస్ వారికి కోపం అన్నట్టు తయారయింది, విషయం. మొన్నామధ్య M.G రోడ్డు లో ఓ బోర్డు చూసాను.ఆ బోర్డు లో ఇలా రాసుంది. "పౌరులకు హెచ్చరిక. మీ పిల్లలను వీధి శునకములతో ఆడుకొనుటకు అనుమతించ వలదుడీ".


ఈ దారుణ శునక సమస్య ను యెదురుకోవడానికి నా వరకు నేను నా శునక సం హిత నుండి కొన్ని బిట్స్ ను ఈ బ్లాగు ద్వారా సూచిస్తున్నాను.

1. ఎల్లప్పుడూ మీ దగ్గర ఒక పొడుగైన కర్ర వుంచుకోండి. వీలయితే కర్ర సాము కూడా నేర్చుకోండి.
2. రాత్రి కాగానే మొత్తం శరీరం అంతా కవర్ అయేలా కవచం ధరించండి.
3. ఎమర్జన్సీ ఇంజక్షన్ లు దగ్గర వుంచుకోండి.
4. పరిగెత్తడం ప్రాక్టీసు చేయండి. మీ టార్గెట్ కుక్క కంటే వేగాన్ని అందుకోవడం.

5. మీ వీధి కుక్కలకు బిస్కట్లు వగైరా ఇచ్చి దగ్గర అవండి.

6. ఆదిమ జాతి మానవుల లాగా విషం పూసిన బాణాలు వగైరా వుపయోగించండి.
...
ఇంక 2, 3 యేండ్ల తర్వాత ఈ కింది పరిణామాలు సంభవించినా ఆశ్చర్యం లేదు. అవేమంటే

చిన్న పిల్లలకు పోలియో మందు లాగా నిశాచరులకు అంటి రేబీస్ ఇంజక్షన్లు వేయించడం.
మన రాజకీయ నాయకులు తమ వాగ్దానాలలో, మేము గెలిస్తే, ప్రతి ఒక్కరికీ కవచాలు, లేదా ప్రతి ఇంటికీ కుక్కల ఇంజక్షన్లు ఫ్రీ., లేదా మీ వీధి కుక్కలను మచ్చిక చేసుకోడానికి, ఇంటికి, ఒక రోజుకు ఒకటి చొప్పున ఒక కుక్క బిస్ఖత్ పాకెట్ ఫ్రీ.

ఏతా వాతా, శునక జాతి పెరుగుదల వల్ల ఇంత మందికి ఇన్ని లాభాలు వున్న కారణంగా, ఈ సమస్య ను నా దృష్టి లో పరిష్కరిచక పోవడమే వుత్తమం. మీరేమంటారు?

Saturday, September 15, 2007

నమ్మ (శక్యం కాని) బెంగళూరు - కారు కూత

మీది రాయల సీమా అడిగేడు , కొత్తగా పరిచయమైన ఓ కన్నడ అతను. నా హ్రుదయం లో కోటి వీణలు మోగలేదు కానీ ఎక్కడో టచ్ చేసినట్టు అనిపించింది.

అవును. ఎలా కనుక్కున్నారు ? అడిగాను.

రాయల సీమ వాళ్ళు చాలా ఆవేశం, పౌరుషం వున్న వాళ్ళంట కదా, మీ ముఖం చూస్తే అలా అనిపించింది, చెప్పాడు.

అతను రాత్రి సెకండ్ షో లో ఇంద్ర లేదా సమర సిమ్హా రెడ్డి చూసాడేమో తెలీదు. నా ముఖం అంత పౌరుషం తో వుందా అడిగాను.

హా, ఎదో రగిలిపోతున్నట్టు గా, కొంచెం తీవ్రంగా మండిపోతున్నట్టు వుంది చెప్పాడు, కన్నడ కస్తూరి భాషలో ఇంచు
మించు గా అదే మీనింగ్ లో.

ఎందుకబ్బా అని ఆలోచించాను. గుర్తొచ్చింది. మొన్నా మధ్య నే నేను కారు కొన్నాను.

***************************************************************************

" మంచి తరుణము మించిన దొరకదు, ఆలసించిన ఆశా భంగము, నేడే మేమందించు కారు లోను గైకొనుడి, ఈ మా ప్రయత్నము ను అభినందించుడి" కంపనీ హెచ్ ఆర్ వారు ప్రకటించారు ఇ మైలు ద్వారా.

ఇది నాంది.

***************************************************************************

ఇక కారు వస్తే, కారు పార్కింగు వున్న ఇల్లు కావాలి కదా. అందుకు ఇళ్ళ వేట మొదలయింది. ఎందుకైన మంచిదని నా ఫోను నంబర్ కొంత మందికి చెప్పి వుంచాను, అలానే కొన్ని మాత్రలు దగ్గర వుంచుక్కున్నాను. ఇళ్ళ అద్దె రేటు విని గుండె పోటు వస్తే ముందు జాగ్రత్త గా. ఎలానో చివరికి ఇల్లు దొరికింది.

"చివరికి" అంటే వూరి చివరికి అన్నమాట.

***************************************************************************

కారు వచ్చేసింది. కారు వంక ఆనందం తో చూసాను. కారు డోరు మ్రుదువుగా ఓపన్ చేసాను. కారు లోపల వేలాడదీయడానికి ఒక అందమయిన జపాను బొమ్మ వుంది చేతిలో. మరుసటి రోజు ఉదయం. 8 గంటలకు బయలు దేరాను ఆఫీసుకు. ఒక గంట సేపు ఇంచుమించు గా సరిపోతుంది అనుకుని. కారు ఏర్ పోర్ట్ రోడ్డు లో అడుగు పెట్టింది.

అంతే.

ఏవడో మినిస్టరు వస్తున్నాడట. భయంకరమయిన ట్రాఫిక్ జాము. సరె ఎలాగో బయట పడి ఇంకో గంట తర్వాత ఆఫీసుకు చేరాను. ఆఫీసు లో ఆ సరికే కారు పార్కింగ్ లాట్ నిండి వుంది, లక్కీ గా ఎదో మూల జాగా దొరికింది.

మామూలు గానే రోజంతా మీటింగులతో, ఇ మైలు, కాఫీ, ఫోను లాంటి వాటితో బిజీ గా గడిచింది.

కారు బయటికి తీద్దామని వెళ్ళి చూస్తే, పొద్దున తొందర్లో, సరిగ్గా గమనించలేదు బోయ్ నెట్ కు పక్కగా ఒక స్క్రాచ్. చిన్న నొక్కు. గుండె పగిలింది (శబ్దం రాకుండానే). సరే, ఇంటికి వెళ్ళాను. మా ఆఫీసు నుండి బయట పడి రోడ్డు చేరాలంటే 2 కె ఎం చుట్టు తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే దగ్గర్లో ఎక్కడా టర్న్ తీసుకోడానికి లేదు. ఆ సరికే రోడ్డు నిండి
వుంది. ఒకటే హారన్ల మోత. నేను చీమ స్పీడు తో వెళ్ళి, రోడ్డు చేరుకున్నా. ఇంటికి వెళ్ళే సరికి 10:30 అయింది.

మరుసటి రోజు సెలవు. సర్వీసింగు కోసం కారు తీస్కెళ్ళాను, సర్వీసింగ్ వాడు ఆ స్క్రాచ్ చూసి చెప్పాడు. లాభం లేదు సార్, బోయ్ నెట్ మార్చాలంతే. ఇంత చిన్న స్క్రాచ్ కు మొత్తం బోయ్నెట్ కొత్తది మార్చాలా? ఇదెక్కడి చోద్యం ? ఇలానే పడుండనీ అని, అలా షికారు కోసం ఎం జీ రోడ్డు వైపు వెళ్ళాను.

అదే నేను చేసిన తప్పు.

దాదాపు 3 కిలో మీటర్ల పరిధి లో ఎక్కడా కారు పార్కింగ్ అవకాశం లేదు. సరే, ఎలానో చివరికి పార్క్ చేసి, అలా తిరిగి, (ప్లానెట్ ఎం లో పాటలు, వగైరా) ఆటో లో 10 రుపాయలు ఎక్స్ట్రా ఇచ్చి, కారు వద్దకు చేరి, అక్కడ నుండి ఇంటికి చేరాను.

ఇలానే ఓ రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, వాడి బలవంతం మీద రాత్రి వాడి ఇంట్లొ మకాం వెసి, పొద్దునే బయటకు వస్తె ఇంకో హారర్ సీను. కారు టయరు పైన కేసింగు దగ్గర చిన్న చిన్న నొక్కులు. ఎవరో మేకులు దించినట్టుగా. ఎలా జరిగిందబ్బా అని ఆలోచిస్తే, మా వాడు సెలవిచ్చాడు. ఇది ఆ వీధి లో కుక్కల పని అట. మా వీధిలో కుక్కలు అమయకమైనవి. కేవలం అరుస్తాయి, లెదా కరుస్తాయి. కానీ ఈ వీధి లో కుక్కలు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయని కలలో కూడా అనుకోలేదు.

పర్సు తుప్పు బాగ వదిలిందా రోజు.

మరి కొన్ని రోజుల తర్వాత వర్షా కాలం వచ్చింది. ఆ రోజు బెంగళూరు లో కుండపోత వర్షం. బయట కారు లో ఇంటికి వెళదాం అని రోడ్డు మీదకు వస్తే, మామూలుగానే ట్రాఫిక్. అయితే ఆ రోజు ట్రఫిక్ మరో 4 గంటలకు కానీ తెమల్లేదు.

ఆ వర్షం కురిసిన రాత్రి నేను ఇంటికి చేరే సరికి 1:30.

ఈ మధ్య కారు లో రాత్రి పొద్దు పోయిన తర్వాత రోడ్డు మీదకు వెళ్ళిన వాళ్ళను అటాక్ చెయడం లాంటి వార్తలు విన్న తర్వాత బయట వెళ్ళడం కూడా మానుకున్నాను.

ప్రస్తుతం నాకున్న సమస్య ఈ కారు ఎలా వదిలించుకోవడం అనేదే.

అన్నట్టు ఈ మధ్య ఆ జపాను బొమ్మ ను చూసినప్పుడెల్ల ఎందుకో పట్టరానంత ఆవేశం వస్తుంది.యేదో ఓ రోజు ఆ బొమ్మను నేనేం చేస్తానో నాకే తెలీదు.

Saturday, September 8, 2007

ప్రాజెక్టు,ప్రాజెక్టు మానేజరు,ఓ సాఫ్ట్ వేరు కెరీర్

అతని పేరు చందు. అతను ఓ సాఫ్ట్ వేరు కంపనీ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ప్రస్తుతం తను పని చెసే కంపనీ లొ అడుగు పెట్టేటప్పుడు, హెచ్ ఆర్ ఇంటర్ వ్యూ లో వాళ్ళు అడిగిన రొటీన్ (కుళ్ళు) ప్రశ్నలకు అన్నిటికీ అద్భుతంగా జవాబిచ్చాడు. ఆఖరున వాళ్ళీ ప్రశ్న వేసారు.

5 యేండ్ల తర్వాత యేమవుదాం అనుకుంటున్నావు ?

"ఓ గొప్ప సాఫ్ట్ వేరు ఇంజినీరు గా మారి చరిత్ర CD/DVD ROM లలో నిలిచి పోదాం అనుకుంటున్నా"నన్నాడు.


అనడమే కాదు అనుకున్నాడు కూడా..(అతనిలో యేదో లోపం వుంది అనుకుంటున్నారా, యేమో, వుండవచ్చు)


ఆ క్షణం నుండీ అనుక్షణం తపన తో కౄషి చేసే వాడు కూడా. అతనికో అందమయిన అమ్మాయి పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి పేరు జావా. వాళ్ళ పరిచయం గమ్మత్తు గా జరిగింది. ఓ సందర్భం లో .net అనే అమ్మాయి ని కలవ బోయి, జావా ను కలిసేడు. ఆ అమ్మాయికి చందు అంటే కాసింత భయం కాసింత ఇష్టం.

ఇక చందు కి తన ప్రాజెక్ట్ అంటే ప్రాణం. ఆ ప్రాజెక్ట్ కు గుండె జబ్బు వున్నా అనుక్షణం ప్రాణప్రదం గా చూసుకునే వాడు. ఒక రకంగా చెప్పాలంటే అతణ్ణి విడిచి ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ను విడిచి చందు వుండలేరు.

అలానే చందు కు తన ప్రాజెక్ట్ మానేజరు ఒక తల మాసిన వాడు, బొత్తిగా ప్రాజెక్ట్ మీద శ్రద్ధ లేని వాడు అని ఒక ఫీలింగు. ఎందుకంటే వాడికి ప్రాజెక్ట్ మీదకన్నా తన స్వ విషయాలు , అప్ప్రైసలు, ప్రమోషన్లు వీటి మీదనే ఎక్కువ ధ్యాస.

ఇలా వుండగా ఓ రోజు ప్రాజెక్టు, ఇకపై ప్రాజెక్టు మానేజరు తో కలిసి వుంటానని చందుతో ప్రమాణం చేయించుకుని అసువులు బాసింది.

చందు అంత వరకు తన ప్రాజెక్ట్ మానేజరు ఎ ప్రాజెక్ట్ లో పని చెస్తున్నాడు, అస్సలు వాడు ఎన్ని ప్రాజెక్ట్ లకు మానేజరు లాంటి విషయాలు యెప్పుడూ పట్టించుకోలేదు.

అయితే ఇప్పుడు తనకు కొత్త సంగతి తెలిసింది., ప్రాజెక్ట్ మానేజరు గాడు, వేరే ప్రాజెక్ట్ ను మైన్ టైన్ చేస్తున్నాడు, ఈ

కొత్త ప్రాజెక్ట్ లో తనకొక చిట్టి రోల్ (చెల్లి) కూడాను.

ఈ కొత్త ప్రాజెక్ట్ తో చందుకు సంబంధాలు అంత బావుండేవి కావు., మొదట్ళొ, క్రమ క్రమంగా చందు స్కిల్స్ చూసి ప్రాజెక్ట్ తనకు దగ్గరయింది.

చందు, తన ప్రయత్నం తో, తన కమిట్మెంట్ తో, తన క్రమ క్రమంగా తన ప్రాజెక్ట్ మానేజరు అభిమానం చూరగొన్నాడు, ఆల్ రెడీ ప్రాజెక్ట్ మానేజరు దగ్గర పనిచేసే ప్రాజెక్ట్ లీడరు స్థానం కూడా ఆక్రమించేడు. అలానే చందు, ప్రాజెక్ట్ మానేజరు దగ్గర స్కిల్స్ అప్ డేటు చేసుకుని, తన లక్ష్యం సాధించేడు కూడాను.

అలానే చందు తన కరీర్ కు కూడా దగ్గరై,తనతో జీవితాన్ని కూడా ముడి వెసుకున్నాడు.

కథ సుఖాంతం.

**************************************************************

కథ వెనుక కథ
~~~~~~~~~

మా వాడొకడు ఓ ప్రాజెక్ట్ లో పనిచెసే వాడు. ఆ ప్రాజెక్ట్ మొదట Visual Studio లొ డెవలప్ చేసి, తర్వాత ఇంకో టార్గెట్ మీద పోర్ట్ చెయాలి.

ప్రాజెక్ట్ మానేజరు మొదట ప్రాజెక్ట్ రావడం కోసం క్లయింటు ను వూదర గొట్టి ఎట్టకేలకు ప్రాజెక్ట్ ను తీసుకు వచ్చారు.అదేదో మల్టి మీడియా కు సంబంధించినది. అనుకున్న ప్రకారం ప్రాజెక్ట్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక శుభ ముహూర్తాన PC లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ను రియల్ టార్గెట్ మీద పోర్ట్ చేసారు. అంతే. గాఢాంధకారం. ఇంతకీ తెలిసొచ్చినదేమంటే, ఆ టార్గెట్ వీళ్ళ మల్టి మీడియా కు అచ్చి రాదు అని. తెర వెనుక ఇంకో చిన్న సంగతి. ప్రాజెక్ట్ లీడర్ ఈ సంగతి ప్రాజెక్ట్ మొదలయిన కొద్ది రోజులకే గ్రహించేడు. సైలెంట్ గా వేరే కంపనీ కి చెక్కేసాడు.

ప్రాజెక్ట్ మానేజర్ తన ముష్టి స్కిల్స్ ప్రదర్శించి ఈ విష వలయం నుండీ తప్పుకున్నాడు.

విషయం తిరిగి తిరిగి ఆఖరుకు అందులో పని చేసే ఇంజినీరు (ల) దగ్గరకు వచ్చి పడింది.

ఆఖరు కు కథ సుఖాంతం అనుకోండి.

(పైన చెప్పిన స్టోరీ కొంత వరకూ ఎడిట్ చేయబడింది., కానీ జరిగింది మాత్రం అదే).

దీన్ని ఎలా రాయాలో ఆలోచిస్తుంటే, ఆ టయిం లో టీ వీ లో 'అమ్మ నాన్న ఒక తమిళమ్మాయీ సినిమా వస్తుండింది.

సో...

బోర్ కొట్టుంటే భరించండి ప్లీజ్ ..

Thursday, September 6, 2007

నమ్మ (శక్యం కాని) బెంగళూరు!


బెంగళూరు గురించి బయట జనాలు యేదేదో వూహించేసుకుంటారు సిలికాన్ వ్యాలీ (తొక్కలో వ్యాలీ) అని, చల్లటి ప్రదేశం అనీ, శాంతి కాముకులైన (శాంతి అంటే అమ్మాయి పేరు కాదు) జనాలు గట్రా అని. అయితే ఇక్కడ మరో ప్రపంచం (సినిమా కాదు) మిమ్మల్ను పలకరిస్తుంది. మా (మూగ) బాధలు మీతో చెప్పుకుని కొంచెం సాంత్వన పొందడం కోసం ఇది వ్రాస్తున్నాను.వుపోద్ఘాతంమొన్నామధ్య ఫలాన టీవీ చానెల్లో ఒకతను చీమల్ని నోట్లో కుక్కుకుంటున్నాడు. ఇంకోసారి ఒకాయన తేనెటీగల మధ్య తల దూర్చి పండుగ చేసుకుంటున్నాడు. ఇంకో టీవీ చానెల్లోనేమో ఒక ముస్టి వెధవ మొసళ్ళతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. ఈ క్యాటగిరీ జనాలందరికీ సవాల్. (అయితే తోటరాముడు గారికి మినహాయింపు. ఆయన దూల (దుష్ట) దర్శన్ లొ (అ)శాంతి స్వరూప్ ఇంటర్ వ్యూ చూసారు.అలాగే దూల (దుష్ట) దర్శన్ ప్రేక్షకులకు అందరికీ మినహాయింపు.) యెవరైనా సరే మా బెంగళూరు కు వచ్చి విజయవంతంగా ఆటో లో ఒక చోటి నుండి ఇంకో చోటికి (మీటరు మీద, భద్రంగా మరియు మోసపోకుండా), ప్రయాణం చేసి చూపించండి. మీ తఢాఖా ఒప్పుకుంటాం.


***********************************************************************************


ఆటో, రింగ్ రోడ్ బర్తిరా (వస్తారా)?
70/- ఆగత్తె (అవుతుంది).

యాకేరీ, మీటర్ ఆదరే 35/- అల్వా ఆగువదు (ఎందుకండీ, మీటర్ అయితె 35/- కదా అయేది).

అల్లి రౌండ్ ఒడీబేకు, మీటర్ బరల్లా (అక్కడ చుట్టు తిరిగి వెళ్ళలి, మీటర్ కు రాను).

చెసేది లేక ముందుకు వెళ్ళాను. ఆటో వాడు మిగతా ఆటో వాళ్ళతో చెరి, నా మీద జోకులెస్తూ నవ్వుకుంటున్నాడు. గుడ్ల నీరు కుక్కుకుంటూ అక్కడే నిలబడ్డాను. ఇంకో ఆటో అరగంట తర్వాత వచ్చింది. వాడితొ మళ్ళీ..


(పై సంభాషణ మళ్ళీ చదువుకోవలసింది గా ప్రార్థన).


కానీ నా పరిస్థితి చూసి అతనికి జాలి కలిగింది.


సరే సార్, మీటర్ మీద 20/- ఎక్స్ట్రా కొడ్తిరా (ఇస్తారా)?అడిగాడు.

కంటి నిండా నీళ్ళతో కళ్ళు మసకబారుతుండగా సరే అన్నాను. ఎందుకంటే, ఇక వేరే ఆటొ దొరికే చాన్సు లేదు మరి.
వెళుతుండగా ఆటో అతను అడ్డు వచ్చిన 2 వీలర్, 4 వీలర్ జనాలను ఘాటయిన (కన్నడ కస్తూరి) పదజాలం లో దీవించ సాగాడు. కర్ణాటక ప్రభుత్వం, మిగతా రాస్ట్రాల నుండి వచ్చి నమ్మ (నిమ్మ) బెంగళూరులో బతుకుతున్న జనాలు కూడా ఆ దీవెనలకు నోచుకున్నారు.

ఆఫీసు దగ్గర దిగి ఆటో వాదికి 60/- చేతికిచ్చి, భయం భయం గా నిలబడ్డాను, 5 రూపాయలు (చిల్లర) కనికరించి ఇస్తే తీసుకుందామని. ఒక 2 రూపాయలు చెతిలో పెట్టాడు, ఎంతో దయ చూపిస్తూ.

ఆఫీసు లో పని చేయడానికి వుపక్రమించగానే (అంటే.. ఆఫీసు కు వచ్చి, కాఫీ, ఇ మైల్స్, గుంపు గా చేరి మానేజర్ ను తిట్టుకోవడం, పని ఎలా ప్రారంభించాలి అనేదాని మీద మీటింగ్, టీం మేట్ లను డాక్యుమెంట్ పంపమని అడగటం ఇవన్నిటి తర్వాత) ఎందుకో ఆటో వాడు, వాడి దీవెనలు గుర్తొచ్చాయి. ఇంకో సారి కాఫీ తాగితే తప్ప లాభం లేదనుకుని, క్యాంటీన్ కు వెళ్ళాను.
ఇలా బిజీ , బిజీ గా రోజు గడిచిపోయింది.
సాయంత్రం ఆఫీసు నుండి బయటకు వచ్చి గుండెలు పీచు పీచు మంటుండగా ఆటో స్టాండు దగ్గర నిలబడ్డాను. మొదటి ఆటో వాడిని అడిగాను, ఫలానా చోటికి వస్తారా? అని. సరే ఎక్కండి అన్నాడు. నమ్మలేకపోయాను. ఈ మధ్య దేవుడు, పునర్జన్మలు వీటి మీద నమ్మకం బలపడుతున్నట్టు అనుమానంగా వుంది నాకు.సరే, 'ఫలానా' చోట దిగి ఆటో మీటర్ చూసాను. 70/- చూపించింది. పొద్దున ఇదే చోట నుండి ఎక్స్త్రా ఇస్తే కూడా ఇంతవలేదు కదా, పైగా వెళ్ళే దారి రోజు చూసేదే. మోసం చేసి, సందు గొందు ల్లొ తిప్పడం అనే సీన్ లేదు. మరి ?? ఈ భేతాళ ప్రశ్నకు సమధానం ఆలోచిస్తేనే తల వేయి వ్రక్కలు అయేటట్లుంది. జేబు తడుముకుని చూసి కర్రెక్ట్ గా 70/- ఎంచి విజయ గర్వం తో ఆటో వాడికి ఇచ్చాను. 100 ఇస్తాడేమో ఒక 5 రుపాయలయినా నొక్కుదామని చూసిన ఆటో వాలా నిరాశ గా 70/- జేబు లొ పెట్టుకున్నాడు. అతను నా నవ్వు చూసి దండకం ఆరంభించక ముందే, అక్కడ నుండి బయట పడ్డాను.
ఇలాంటి దురదౄష్ట కరమయిన సంఘటనల మధ్య వీక్ ఎండ్ వచ్చింది. సరే అని సాయంకాలం నేను నా రూం మేటు బయటకు అడుగు పెట్టాము. అలా బలాదూరు గా తిరిగి, మ్యూసిక్ వరల్డ్, ప్లానెట్ ఎం లలో సరికొత్త సినిమా పాటలు ట్రయల్స్ లో విని (క్యాసెట్లు, సీ డీ లు 'కొనడం' మా ఇంటా వంటా లేదు)ఒక మంచి భోజనం చేసి (మంచి భోజనం అనగా, రుచి దరిద్రముగా వున్ననూ, సున్నము/సోడా కలపని అన్నము తో కూడిన భోజనము - గ్రహించగలరు) ఆటో కొసం నిలబడ్డాము. బస్సు లో ప్రయాణం చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే, అంతకంటే, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తేవడం, లేదా (అ)శాంతి స్వారూప్ కవితలు వినడం ఈజీ. ఇక ప్రహసనం మొదలయింది. కనీసం మీటరు మీద ఒకటిన్నర ఇస్తానన్నా ఎవడూ రాడు. టైము 9:30 మాత్రమె. ఇలా 10:15 వరకూ ఒక 20 మంది ఆటో వాళ్ళను బతిమాలిన తర్వాత ఇక లాభం లేదు, ఇక్కద ఈ రోజు కు లాడ్జి తీసుకుని, రేపు పొద్దున బస్సు లో ఇంటికి వెళదాం లే అని డిసైడు అవుతున్నాము. ఆశ చావని మా రూం మేటు ఆటొ కోసం ప్రయత్నించాడు. సక్సెస్స్ ..
ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుక్కున్నప్పుడు కూడా ఇంత ఆనందం పొంది వుండడు. (మనల్ను మనం వున్నతమయిన వ్యక్తులతో పోల్చుకోవాలి అని మా కంపనీ హెచ్ ఆర్ వారు సెలవిచ్చారు, యేదో తొక్కలో ట్రైనింగ్ లో, గుర్తు లేదు, అందుకే ఆయనతో పోలిక)

ఇలా రోజులు గడుస్తుండగా, ఓ రోజు మా వాడు యేదో సందర్భం లో, ఆది లొ జూనియర్ ఎంటీఆర్ లా ఆవేశపడ్డాడు. "ఎన్నాళ్ళిలాగ .. ఎన్నాళ్ళిలాగ .." అంటూ. తీవ్రంగా ఆలోచించిన తర్వాత (రామయ్య ఇంటి కప్పుల కొసం ఆలోచిoచినంత కాకపోయినా, ఇంచు మించు గా) ఇక ఆ రోజే అనుకున్నా, ఎలాగయినా సరే, కారు కొనాలని. అది ఎంత దారుణమయిన నిర్ణయమో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ విషయాలు ఇంకో సారి యెప్పుడైనా ..
(ఈ బెంగళూరు పురాణం మళ్ళీ కంటిన్యూ చేసే వరకూ సశేషం) ..

Sunday, September 2, 2007

సీమ నుండి సూడాన్ వరకు !!

సాఫ్ట్ వేర్ పక్షులు మామూలుగా US కు వెళతారు, కొండొకచొ UK, Germany, France గట్ర..అధమపక్షం Brezil. కంపనీ తరఫున నా మొదటి విదేశ ప్రయణం మాత్రం సూడాన్ (ఆఫ్రికా) కు జరిగింది. సూడాన్, ఆఫ్రికా లో అతి పెద్ద దేశం. మన దేశానికన్న బీదది. భయంకరమైన లంచగొండి దేశం.సివిల్ వార్ ఒక అదనపు ఆకర్షణ.మా వీసా కూడ ఒక విచిత్రం,ఎంట్రీ పర్మిట్ ఇచ్చారు అంతే. ఆ ఎంట్రీ పర్మిట్తో ముంబాయి ఎయిర్ పోర్ట్లొ అడుగు పెట్టాము. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ మా వంక అసహ్యంగ ఒక చూపు చూసి ముందుకు సాగనంపాడు. సూడాన్ లొ దిగ గానె సంచలనం. మమ్మల్ను పిక్ అప్ చెయడానికి వచ్చిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్ దాటుకుని వచ్చి మమ్మల్ను కలిసాడు. తర్వాత మా చెకింగ్ గట్ర లేకుండానె బయటకు తీస్కెల్లాడు. స్కానింగ్ మిషిన్ కూడా అతనె on చెసి, రన్ చెయదం ఇంకొ హై లైట్.


తర్వాత బయటకు అడుగు పెట్టగానే ఇంకో షాక్. కారు బదులుగా ఒక ట్రక్కు లాంటిది వుంది. ఆంటే వెనుక భాగం ఓపెన్. ముందు ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చు. మేము నలుగురము. చేసేది లేక నేను ఇంకో కొలీగ్ వెనుకనె ఎక్కాము. నాకు బాల్యంలొ మేము బస్సుల మీద ఎక్కి కూర్చున్న ఙాపకాలు గుర్తుకొచ్చాయ్. మాకిచ్చిన అపార్ట్మెంట్ లో అన్నీ రివర్స్. తాళం వేయాలంటే యెడమకు తిప్పాలి. తీయాలంటే కుడికి. వగైరా వగైరా.

అయితే ఒక చిన్న రిలీఫ్.మా ఇంటి యెదురుగా ఒక తమిళాయన వుంటున్నాడు. ఆయన యేదొ పబ్లిక్ సర్వెంట్ అట.

అలా మా మొదటి రోజు గడిచింది.


రెండవ రోజు. 9 గంటలకు బయటకు రాగానే బయట ఇసుక తుఫాను. పొద్దున మంచు ఎలా కురుస్తుందో అలా దుమ్ము కురుస్తోంది.ఆ దుమ్ము లొనే ఆఫీసు కు వెళ్ళాము. సాయంత్రం ఇంటికి వచ్చి మా రూం మేటు స్నానం చేయాలని నాబ్ యెడమ (మనకు కుడి) వైపు తిప్పడానికి బదులుగా కుడి (మనకు యెడమ) వైపు బలంగా తిప్పాడు. అంతే. నాబ్ విరిగి నీళ్ళు ప్రవహించడం మొదలెట్టాయ్. ఇక అందరం ఆ నాబ్ ను ఫిట్ చేయడం లో పడ్డాం......

ఇక మూడవ రోజు. సడెన్ గా ఆఫీసు బయట పారా మిలిటరీ దళాలు. కాల్పులు, భాష్ప వాయు ప్రయోగం! ఎందుకో తెలీదు! మేము బాల్కనీ లో నుంచుని చూస్తున్నాము. మా కళ్ళల్లో కూడా నీళ్ళు కారాయ్. లోపలకు వెళ్ళి పోయాము.

ఇంకా కొన్ని ఙ్ఞాపకాలు.

అక్కడ కొంత మంది ఇండియన్స్ పని చెస్తున్నారు. వాళ్ళను కలిసాము. వాళ్ళలో ఒకతను చెప్పిన కథ. మామూలుగా మనం యెండ లొ తిరిగితే నల్లబడతాం. కానీ అక్కడ విపరీతమైన యెండ. ఒక్కో సారి కొంచెం చలి. ఇతను చలి లో తిరిగి యెందుకో యెమో నల్లబడ్డాడట (అలర్జీ కాబోలు). డాక్టరు వద్దకు వెళితే అతను అన్నాట్ట, నేనే నల్లగా వున్నాను (ఆఫ్రికా లో అంతా నల్ల వాళ్ళే). నేనెవరికి చెప్పుకోవాలి అని అడిగాడట.

ఇలా మా ప్రస్థానం 20 రోజులు సాగింది. మాకు కొన్ని మధురమైన ఙ్ఞాపకాలు కూడా వున్నాయి. నైలు నది (ప్రపంచం లో అతి పొడవైన నది) సూడాన్ నుండి ప్రవహిస్తుంది యెక్కువ భాగం. రాజధాని ఖార్తూం లో 2 నదులు (బ్లూ నైలు , వైట్ నైలు) కలిసి ఒకే నది గా ఈజిప్టు వైపు గా సాగుతుంది. సాయంకాలం ఆ నది అందాన్ని చూడ్డం మరపు రాని అనుభూతి.

అలాగే అక్కడ మనుషులు. బయట సివిల్ వార్ అదీ ఇదీ అని చదివి ఏదో వూహించుకుంటాం కానీ మేము కలిసిన వ్యక్తులు మంచివారు, స్నేహపాత్రులూను.

అలాగే ఇంకో సంగతి. పిరమిడ్ లు అనగానే ఈజిప్టు గుర్తొస్తుంది మనలో చాలా మందికి.అయితే ఎక్కువ పిరమిడ్లు, పైగా పురాతన పిరమిడ్ లు సూడాను లో వున్నాయి. ఇది ఆశ్చర్య కరమైన నిజం.

ఇవండీ నా ఙ్ఞాపకాలు. మీకు నచితే తెలియజేయండి.
వుంటాను,మీ రవి.

నీహారిక

నీహారిక అంటే తొలి పొద్దు లో కనిపించే మంచు బిందువు అని ఎక్కడో చదివాను. నా తొలి తెలుగు ప్రయత్నానికి అందుకే ఈ పేరు.లేఖిని కి ధన్యవాదాలు.