Sunday, June 29, 2008

మా సీమలో ఓ రోజు (గత నెల)

మా ఆవిడ వాళ్ళ వూరు కర్నూలు జిల్లా లో హంప అనే ఓ పల్లెటూరు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు అనే పట్టణానికి దగ్గర.ఇక్కడకు దగ్గర్లోనే కసాపురం అనే ప్రముఖ ఆంజనేయ దేవస్థానం ఉంది. సరే అంత విశేషమేమిటి? అంటారా? పెద్దగా విశేషాలేం లేవనుకోండి. కొన్ని ముచ్చట్లు.

మనకు విజయ నగర సామ్రాజ్య ముఖ్య పట్టణం, సాహితీ సమరాంగణ చక్రవర్తి, కృష్ణ రాయల గారి రాజధాని హంపి తెలుసు. ఈహంపి విరూపాక్ష స్వామి మొదట హంప లో వెలిసాడట. ఈ హంప నుండీ రాయల వారు విరూపాక్ష స్వామి ని హంప కు తరలించాడని ఓ కథనం. దానికి సాక్ష్యంగా హంప లో విరూపాక్ష స్వామి శిథిల దేవాలయం ఇప్పటికీ ఉంది. హంప నుండి విరూపాక్షుడు వెళ్ళడం వల్లే విరూపాక్షుడు కొలువున్న పట్టణం హంపి అయింది అని ఐతిహ్యం.

మా ఆవిడ తాలూకు వారు ఈ గ్రామానికి శ్రోత్రియందార్లు. వాళ్ళ ఇంటి పేరు అవధానం వారు. వీళ్ళకు ఈ గ్రామం సమీపాన 200 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి ఉండేదట. మాగాణి పండించటానికి 2 చెరువులు కూడాను. గ్రామ కక్షల వల్లో, అధికారుల అలసత్వం వల్లో, మరే కారణాల వల్లో అవన్నీ ఉడిగిపోయి, ఇప్పుడు కేవలం 20 ఎకరాలు, ఎండిన చెఱువులు మిగిలాయి. ఈ గ్రామానికి ఉన్న ఇంకొక ప్రాముఖ్యత వజ్రాలు. (ఎంతైనా ఒకప్పటి రతనాల సీమ కదా) గ్రామంలోని పాడుబడ్డ శిథిలాల మధ్య, పంటపొలాల్లోనూ, కొందరు గ్రామస్తులకు వజ్రాలు దొరికాయి (ట) . ఇప్పటికీ అలాంటి వజ్రాల కోసం అన్వేషించే వారు ఉన్నారు.

ఆ వజ్రాల సంగతి ఏమో తెలియదు కానీ, నాకు మాత్రం ఓ నిధి దొరికిందీ వూళ్ళో. అవి పాత చందమామలు. మా ఆవిడ తాలూకు మామగారొకాయన ధన్యజీవి. ఎన్నో చందమామలు, కాశీమజిలీ కథలు మొదలుకుని, యద్దనపూడి సులోచనారాణి నవలల వరకు అనేకం సేకరించేడీయన. (సహస్ర చంద్ర దర్శనం తర్వాత ఈ మధ్యే ఆయన కాలం చేసారు )1955 మొదలుకుని 60, 70 వ దశకంలోని అనేకమైన చందమామలు, కొన్ని బొమ్మరిల్లు, బాలమిత్రలూ, ఇంకా కొన్ని పాకెట్ సైజులో ఉన్న చిట్టి చిట్టి జానపద నవలలూ ఓ పెద్ద అట్టపెట్టెలో పెట్టి తీసుకు వచ్చేము.

(ఈ మధ్య కొత్త పాళీ గారు ఏదో బ్లాగులో కామెంటు రాస్తూ, పాత బొమ్మరిల్లులోని చమత్కార శ్లోకం కథ, ఆడ కవిత్వం, మగ కవిత్వం గురించి భోజరాజు,కాళి దాసు చెప్పుకున్న ముచ్చట్ల గురించిన కథను ఉదహరించేరు.. ఆ బొమ్మరిల్లు కూడా మొన్నే చదివి సంతోషించాను. అలాగే అప్పటి బొమ్మరిల్లు పుస్తకాలలో చమత్కార శ్లోక కథ తో పాటూ, తెనాలి రామకృష్ణుని కథ, ఖరభ శరభుల కథ, ఇంకా కథా సరిత్సాగరం, ప్రముఖ రచయిత మల్లాది గారి చిన్న చిన్న కథలూ (ఓ పేజి కథలు) కనిపిస్తాయి.)

ఇంకా అక్కడ నులక మంచం పై నిద్ర, వాళ్ళ పాత ఇల్లు, పొగచూరు, కట్టెలపొయ్యి, వర్షం వస్తే మిద్దె పైకెక్కి మూయాల్సి వచ్చే గవాక్షాలు...ఓహ్! వాళ్ళ కాడెద్దు కి పృష్టానికి కాస్త ఎడంగా స్వస్తిక్ గుర్తు ముద్రించారు. అచ్చోసిన ఆంబోతు అంటే అదేనేమో? (నాకు పల్లె జీవితం గురించి పెద్దగా తెలియదు).

ప్రతీ సంవత్సరం ఆనవాయితీ గా హనుమజ్జయంతి జరుపడం ఓ ఆచారం వారికి. ఈ సంవత్సరం హనుమజ్జయంతి తాలూకు కొన్ని స్మృతులు (ఇవిగో).ఎన్ని రక్తపు మడుగులకు సాక్షీభూతమయిందో, మాఇంటి ఈపాతకాలం నాటి కత్తి (కరవాలం)...


తిరిగి వస్తున్న దారిలో అనంతపురం ఇస్కాన్ దేవస్థానం సందర్శించినప్పుడి ఫోటోలు కొన్ని...
Tuesday, June 17, 2008

నేడు భాషాసేవకుడి 95 వ జయంతి

ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ లాంటి పత్రికలలో ఎంతో కాలం పని చేసి, 'నుడి నానుడి ' లాంటి ఎన్నో శీర్షికలను సమర్థంగా నిర్వహించిన పాళీ ఎవరిది?

తిరుపతి సంస్కృత కళాశాలలో చదువుతూ, స్వతంత్ర సంగ్రామం లో పాల్గొని, గోవిందరాజుల స్వామి దేవస్థానం పై భారత జండానెగురవేసిన ధీరుడు ఎవరు ?

తిరునల్వేలి జైలు లో భగత్ సింగ్ తో పాటు ఉరిశిక్ష కు గురయిన బటుకేశ్వర దత్తా తో జైలు జీవితాన్ని పంచుకున్న తెలుగువాడు ?

ఎన్నో తెలుగు ప్రబంధాల పరిష్కర్త అప్పటి సాహిత్య వినీలాకాశంలో దేదీప్యమైన తార వేటూరి ప్రభాకర శాస్త్రి శిష్య ప్రవరుడూ, ఆయనతో పాటు ఎన్నో సాహిత్య చర్చలలో పాల్గొన్న ఈ అఙ్ఞాత పుంభావ సరస్వతి ఎవరు ?

తెలుగు లిపి తో పాటు భారతీయ లిపులన్నిటి మీద సశాస్త్రీయంగా, సమర్థంగాను, సప్రామాణికంగాను, అద్భుతమైన గ్రంథ రాజాన్ని వెలయించి, తెలుగు తల్లి కి అక్షరలక్షలు ఒసంగిన మేరు నగధీరుడు ?

కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు, గాంధీ మొదలుకుని, యల్లా ప్రగడ సుబ్బారావు, మల్లం పల్లి సోమశెఖర శర్మ, మానవల్లి రామకృష్ణ కవి, డాక్టర్ రఘువీర్ మొదలయిన అనేక మంది తో తమ అనుభవాలను పంచుకుని, హంపీ నుండీ హరప్పా వరకు భారతదేశాన్ని అసాంతం చుట్టి వచ్చిన మనశ్వి, యశస్వి ఎవరు ?

'జనని సంస్కృతంబు సకల భాషలకునూ అన్న వాక్యాన్ని ప్రశ్నించడమే కాక, సంస్కృత, ప్రాకృతాల మధ్య జన్య జనక సంబంధం లేదని, ప్రాకృతం సంస్కరింపబడి సంస్కృతం అయిందనీ, ఎన్నెన్నో ఆధారాలు చూపించి, చెరుకూరి నారాయణ రావు వంటి సాహితీ ప్రముఖులచేత 'ద్రవిడ భాషా సన్నిపాత జ్వరితుడు ' అన్న తిట్టును కూడా వినయంగా భరించిన వినయశీలి?

ఆయన మా (మన) రాయల సీమ (అనంతపురం) ముద్దుబిడ్డ డాక్టర్ తిరుమల రామచంద్ర గారు. ఆయన 95 జయంతి నేడు.

తిరుమల రామచంద్ర గారు 1913 లో ఇదే రోజు జన్మించి 1997 లో అక్టోబర్ 12 వ తేదీ పరమపదించారు. ఈయనది శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థాన పండితుడు తాతాచార్యుల వారి వంశమట.

ఈయన రచనలు కొన్ని, కింద ఉదహరిస్తున్నారు, ఔత్సాహిక బ్లాగర్ల కోసం...
1. హంపీ నుండీ హరప్పా దాకా (ఆత్మకథ..అజోవిభొ ప్రచురణ)

2. సాహితీ సుగతుని స్వగతం
3. మన లిపి పుట్టు పూర్వోత్తరాలు
4. బృహదారణ్యకం
5. అహం భో అభివాదయే
6. ప్రాకృత వాఙ్ఞయంలో రామకథ
7. నుడి - నానుడి
8. లలిత విస్తరం (అనువాదం, ఈయన బులుసు వెంకట రమణయ్య గార్లు)
9. తెలుగు పత్రికల సాహిత్య సేవ
10. గాథా సప్త సతి లో తెలుగు పదాలు

ఇంకా ఎన్నెన్నో ... తెలుగు వారు మర్చిపోయిన ఈ మహానుభావుడికి వందనాలు.

Saturday, June 14, 2008

కాళిదాసు - వ్యక్తిత్వం, సమాజ పరిశీలన, కొన్ని భిన్నాభిప్రాయాలు

రచన -

కావ్యం, ప్రబంధం, పురాణం, నవల, కథ, ఆఖరుకు బ్లాగు, ఏదైనా కానివ్వండి, తను ఉంటున్న సమాజాన్ని ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ప్రతిబింబించడం సహజం. ఇది అన్ని కళలకూ వర్తిస్తుంది. అది సాహితీ చరిత లో గొప్పగా వెలుగొందినదే అవచ్చు, అద్భుతమైన వర్ణనలు ఉండవచ్చు, ఆ వర్ణనల వెనుకైనా సమాజం లోని భిన్న కోణాలు ఆవిష్కృతమవడం కద్దు. ఒకవేళ రచయిత ఉన్న (కాలంలో) సమాజం లో అసమానతలు ఉన్నట్లయితే, ఆ అసమానతలు కూడా రచనలో కనుపించ వచ్చు. (ఉదా :- ఓ కావ్యంలో వేశ్యను అద్భుతంగా వర్ణించారనుకోండి., ఆ వర్ణనలోని అద్భుతంతో బాటు, ఆ సమాజం లో అసమానత-వేశ్యా వృత్తి అన్నది మరుగవదు).

అలాగే ప్రతి కళాకారుడు, లేదా రచయితా వర్గ సమాజంలో, ఏదో ఓ వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తాడు. ఏవో కొన్ని రచనలు / కళాకృతులు (ఆబ్జెక్టివ్ ఆర్ట్ - ఉపనిషత్తులూ/ జీసస్ సెర్మన్ ఆన్ ద మవుంట్/ ధమ్మపదం వగైరా) వీటికి మినహాయింపు కావచ్చు. రచైత/కళాకారుడు ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు అన్న విషయంలోనే ఆ రచయిత ఔన్నత్యం తెలుస్తుంది.

********************************************************
కాళిదాసు -


సంస్కృత సాహిత్యం (ఆ మాట కొస్తే సాహిత్యం తో) తో కనీస పరిచయం ఉన్న వారికైనా తెలిసిన పెద్ద పేరు.

పురా కవీనాం గణన ప్రసంగే కనిష్టికాధిస్టిత కాళిదాసః
అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ !

పూర్వకవులను లెక్కెడుతూ చివరి వేలు (అనామిక) ని మడిచామనుకోండి. ఆ తరువాత అంతటి కవి ఇంకొకరు లేకపోవడంతో అనామిక అన్నపేరు చిటికిన వ్రేలుకు సార్థకంగా ఒప్పింది అని భావం.

ఇంకా కవికులగురువు, ఉపమా కాళిదాసు, దీపశిఖా కాళిదాసు వంటి విశేషణాలు ఎన్నో కాళిదాసు సొంతం.
ఈయనను తన భార్య, అస్తి కశ్చిద్వాగ్విషయః ? (ఏమైనా చెప్పదగిన సమాచారం ఉన్నదా?) అని అడిగిందట. దానికి సమాధానంగా అస్తి అనే పదం తో మొదలుకుని "అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా .. " అన్న పద్యంతో కుమార సంభవాన్ని, కశ్చిత్ అన్న పదంతో మొదలుకుని " కశ్చిత్ కాంతా విరహ గురుణా " అన్న పద్యంతో మేఘ సందేశాన్ని, వాక్ అన్న పదంతో " వాగర్థావివ సంపృక్తౌ ..." అన్న పద్యంతో రఘు వంశాన్ని వెలయించాడని లోకోక్తి.


ఈయన ప్రభావం తన తదనంతర కవుల మీద అపారం అన్నది అతిశయోక్తి కాబోదు.

*******************************************************

రచన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి ?
1. మానసిక వికాసం
2. అప్పటి సమాజ పరిశీలన
ఓ అద్భుతమైన కావ్యాన్ని (మేఘ సందేశం అనుకోండి ఉదాహరణకు) చదివి రసాస్వాదన చేయవచ్చు. ఇది మానసిక వికాసం. ఐతే ఏ రచననైనా సామాజిక పరిశీలనకు ఎన్నుకుంటే దాన్ని సాధ్యమైనంత వరకు నిస్పాక్షిక దృష్టితో చూడాలి. అందులో భాగంగా కొన్ని కఠినమైన సత్యాలను ఒప్పుకోవలసి వస్తే ఒప్పుకోవాలి. తప్పదు. అలానే తార్కిక దృష్టి తో ఓ విషయం పరిశీలించేప్పుడు రాగ రంజితమైన దృక్పథం కూడదు. ఓ కవి భగవంతుని అనుగ్రహ పాత్రుడు, కాబట్టి తనను విమర్శించడం తప్పు అన్న భావన తార్కిక దృష్టి లో సమాజ పరిశీలకులకు ఉండదు.


ఈ రకమైన పరిశీలన మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ గారు మన భారతదేశపు కవుల మీదే కాక భారత దేశ సమాజం మీద చేశారు. రాహుల్ సాంకృత్యాయన్ పండితుడు, సుప్రసిద్ధ పాళీ భాషా శాస్త్రవేత్త, త్రిపీఠకాచార్య అన్న బిరుదుతో గౌరవింపబడినవాడు, లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా బోధకుడు, స్వాతంత్రం కోసం 10 యేళ్ళు జైళ్ళలో మగ్గిన మానవతా మూర్తి. ఈయన రాసిన చారిత్రక పుస్తకాలు భారత సారస్వతాన్ని పరిపుష్టం చేసాయి. అందులో కొన్ని " వోల్గా నుండి గంగా వరకు ", "సిం హ సేనాపతి ", "ఋగ్వేద ఆర్యులు " మొదలైనవి.
రాహుల్ సాంకృత్యాయన్ గారు కాళిదాసు మీద కొన్ని దృక్కోణాల ద్వారా పరిశీలించారు. అవి.
1. రాజాశ్రయం.కాళిదాసు చంద్రగుప్త విక్రమాదిత్యుని (భోజ రాజు) సమకాలికుడు, ఆ రాజాశ్రితుడు అన్నది జగద్విదితం. 2. విలువలు, సామాజిక స్పృహ

3. తదనంతర కవులపైన (తప్పుడు ?) ఒరవడి
4. ఇతరములు కొన్ని.

ఇవి చర్చించే ముందు కాళిదాసు కాలం, అప్పటి సమాజ పరిశీలన తప్పక చేయాలి.

********************************************************
గౌతమ బుద్ధుడు


క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం (ఇంచుమించుగా) భారతావని ఓ రకంగా సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం. అప్పటికే భరతావని లో వేళ్ళూనుకున్న అతి హేయమైన అస్పృశ్యత, యగ్న యాగాది కర్మ కాండలు, మూఢత్వం వంటి వాటి మీద ఓ సామాజిక విప్లవం.

( బ్రాహ్మణో అస్య ముఖమాసీత్, బహూరాజన్య
కృతఃఊరూ తదస్యయద్ వైశ్యః, పద్భ్యా శూద్రో అజాయతః - ఋగ్వేదం 10-90-12)

(ఆతని ముఖము నుండీ బ్రాహ్మణుడు, భుజముల నుండీ క్షత్రియుడూ, తొడల నుండీ వైశ్యుడు, కాళ్ళ నుండీ శూద్రుడు జన్మించారు.)

హిందూ వాఙ్మయంలో అప్పటికే ఉపనిషత్తులు ఉన్నప్పటికీ (బుద్ధ బోధ ఉపనిషత్తుల సారమే అని ఒక వాదన) అవి జన సామాన్యానికి అందుబాటులో లేని సంస్కృత భాష కు మాత్రమే పరిమితం.

బుద్ధుడి సంఘంలో వర్ణ వివక్షతకు చోటు లేదు. సంఘం లో అందరు వ్యక్తులు సమానమే. అలాగే సంఘంలో ఆస్తులు అన్ని ఉమ్మడి ఆస్తులు మాత్రమే. వినయ ధర్మాల అనుసారం ప్రతి వ్యక్తి, తన భిక్షా పాత్ర, కర్ర, పై వస్త్రం లాంటి 7 వస్తువులకు మాత్రమే సొంతదారు.అంటే సంఘం కేవలం సన్యాసుల మఠమా? కాదు. సంఘంలో గృహస్తులూ సభ్యులే. అప్పటి రాజ్యాలు కూడా గణతంత్ర రాజ్యాలే. ఈ గణతంత్ర రాజ్యాలకు రాజు ఉండడు. అధికారులు కేవలం వృత్తి నిర్వాహకులు మాత్రమే. అలాగే అవసరం వస్తే, రాజ్యం లో ప్రతి వ్యక్తీ కత్తి చేతబట్టి పోరాడుతాడు. అది ఓ రకంగా జగతి లోనే మొదటి వర్గ రహిత సమాజం.అలాగే గ్రీకు (యవన), భారతీయ సంస్కృతుల మేళవింపు, పరస్పర ఆదాన ప్రదానాలు అప్పటి కాలం నాటివే. గ్రీకులు ఎంతో మంది బుద్ధ దార్శనికత కు అనుకూలురై, భారతీయ జీవన స్రవంతిలో కలిసి మమేకయ్యారు.

(నాటిక అన్న ప్రక్రియ గ్రీకు దేశం నుండీ వచ్చిందట. అలాగే పైథాగరస్ తత్వ చింతన మీద భారతీయ చింతన ప్రభావం ఉన్నది అని కొందరి ఊహ)

కేవలం యవన దేశ సంస్కృతి ప్రభావమే కాక తక్షశిల, నలందా విశ్వ విద్యాలయాల ప్రాదుర్భవం వల్ల ఎన్నో దేశాల సాంస్కృతిక, వైఙ్ఞానిక చింతనలతో భారతీయ చింతన పరిపుష్టం అయింది.

ఈ గణతంత్ర రాజ్యాలు ఏమయ్యాయి?సమాజంలో తిరిగి అస్పృశ్యతా రక్కసి ఎలా వేళ్ళూనుకుంది?భారతీయ సంస్కృతి లో మమేకమైన గ్రీకులు తిరిగి అప్రాచ్యులు గా ఎలా అయారు?

వీటన్నిటికీ సమాధానం గుప్త వంశ ప్రాదుర్భావం అని రాహుల్ సాంకృత్యాయన్ గారు సాధికారికంగా విశ్లేషించారు.

***********************************************
రాజాశ్రయం -----


కాళిదాసు చంద్రగుప్త విక్రమాదిత్య రాజాశ్రితుడని లోకవిదితం. అప్పటికి ఇతర కవులు లేరా? వారందరూ రాజాశ్రితులేనా? ఈ రాజాశ్రయం అన్నది కేవలం భుక్తి కోసమా? ఇంకేదైనా స్వప్రయోజనం ఉన్నదా? స్వ ప్రయోజనం ఉన్నప్పటికీ, రాజును దైవాంశ సంభూతుడిగా చిత్రీకరించవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఈ పరిణామంలో ఆ కవి పాటించిన విలువలు ఏమిటి? ఈ ప్రశ్నలను సాంకృత్యాయన్ గారు అప్పటి చారిత్రక యవనిక పై చర్చిస్తారు.

ఇక కాళిదాసు రాజాశ్రయం కేవలం భుక్తి కోసమా? అప్పటి ఎన్నో చాటువుల ద్వారా, కొందరు చారిత్రకుల సిద్ధాంతాల ద్వారా గుప్తుల కాలం స్వర్ణ యుగం. ఆ స్వర్ణయుగం లో కాళిదాసు కేవలం భుక్తి కోసం రాజుని ఆశ్రయించడంలో ఔచిత్యం కనబడుతుందా?

సాంకృత్యాయన్ గారు చెప్పిన ఇంకొక విషయం కుమార సంభవం అన్న కావ్యం, కుమార గుప్తుని కీర్తించడానికి అన్నది. ఇందులో విడ్డూరం ఏమీ లేదంటారాయన. అలాగే ఊర్వశీ పురూరవం అనవలసిన నాటకం విక్రమోర్వశీయం ఎందుకయింది? అని ఓ ప్రశ్న.

మన పోతన ' బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ ' అని ఎందుకు ప్రశ్నించలేదు అన్న ప్రశ్న కూడా ఇక్కడ అనుచితం అనుకుంటాను.

ఈ రకంగా కాళిదాసు తన తదనంతర కవుల మీద కూడా ఓ రకమైన తప్పుడు ఒరవడి ప్రవేశపెట్టాడంటారు. కాళిదాసుని అనుకరిస్తున్నం అన్న భ్రమలో తర్వాతి కవులు (ఉదాహరణకు బాణ భట్టు హర్షుని ఆశ్రయించినట్టు) తమను తాము వంచన చేసుకోవచ్చని కూడా సాంకృత్యాయన్ గారు ఓ పాత్రతో చెప్పిస్తారు.

విలువలు----

కాళిదాసు పూర్వకవి అశ్వఘోషుడు. ఈయన బుద్ధ చరిత, సౌందర నందం, సారిపుత్ర ప్రకరణం (మొట్ట మొదటి సంస్కృత నాటకం) వంటి కావ్య నాటకాలను రచించాడు. ఈయన తన రచనల్లో అక్కడక్కడా ప్రాకృతం వాడాడు (ట). ఈయన రచనలు కొన్ని వేయేళ్ళ పూర్వమే అరబ్బీ లో అనువదితమయ్యయిట (ఆచార్య తిరుమల రామచంద్ర - ప్రాకృత వాఞ్ఙయంలో రామకథ).

రాహుల్ సాంకృత్యాయన్ గారు "వోల్గా నుండీ గంగా వరకు " అన్న పుస్తకంలో ఈ అశ్వఘోషుని ఓ మహనీయునిగా చిత్రీకరించారు. అలాగే ఆ పుస్తకంలో కాళిదాసుతోనే " అశ్వఘోషుడు కేవలం పండితుడే కాక మహా మానవతా వాది " అని చెప్పిస్తారు. మరి ఆ అశ్వఘోషుడు కాళిదాసుకు ఆదర్శం ఎందుకు కాకూడదు? అలాగే కాళిదాసు సమకాలికుడు 'దిఙ్నాగాచార్యుడు '.కాళిదాసు మేఘసందేశం-14 లో ఈ దిఙ్నాగుని ప్రస్తావన వస్తుంది.

ఈ దిఙ్నాగుడు (ఈయన ఇంకొక పేరు భదంత ధీరనాగుడు) ప్రమాణ సముచ్చయం, ప్రమాణ సముచ్చయ పరీక్ష, హేతుచక్ర డమరుకం, న్యాయావయవం వంటి తర్క శాస్త గ్రంథాలు, కుందమాల అనే ఓ అపూర్వమైన నాటకాన్ని రచించాడు. కుందమాలను సుగృహీత మానవల్లి రామకృష్ణ కవి తెలుగులో అనువదించారు. ఈ దిఙ్నాగుడు ఆంధ్రుడు అని తిరుమల రామచంద్ర గారు వివరిస్తున్నారు. దిఙ్నాగుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో తర్క శాస్త్రం బోధించే వాడట.

ఈ దిఙ్నాగుని గురువు భదంత వసుబంధువు. ఆయన ఓ గొప్ప కవి.

ఈ కాళిదాసు సమకాలికుల, పూర్వకవులతో పోల్చి చూస్తే, కాళిదాసు రచనల వెనుక ఉద్దేశ్యం కొంచెంగా (పూర్తిగా కాకపోయినా) అవగతమవుతుంది.

కాళిదాసు హిందువు.వర్ణాశ్రమ ధర్మానుయాయి.బ్రాహ్మణ, క్షత్రియ పక్షపాతి.

ఇంకొక్క విషయం సాంకృత్యాయన్ గారు అనేక పర్యాయాలు చర్చిస్తారు. అది గోసంరక్షణ. వేద కాలం లో, మహా భారత కాలాల్లో బ్రాహ్మణులు గోభక్షణ చేసే వారుట.అప్పటి సమాజం లో అది విపరీతమైన విషయం కాదు. అలా గోవులను బ్రాహ్మణుల కోసం వధించిన రక్తంతో చర్మణ్వతి అన్న నది ఏర్పడ్డది (మేఘసందేశం -49, మహా భారతం వనపర్వం, శాంతి పర్వాలలో రంతిదేవుని ప్రస్తావనలు). ఐతే కాళిదాసు కాలంలో ఈ గోపూజ, గో సమ్రక్షణ ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకున్నాయి? బౌద్ధాన్ని ప్రశ్నించి, సమాజంలో తిరిగి వర్ణాశ్రమ ధర్మాలను నెలకొల్పడానికి, బ్రాహ్మణుల ప్రాముఖ్యత పెంపుదలకే అని సాంకృత్యాయన్ గారు విశ్వసిస్తారు. తద్వారా కాళిదాసు విలువలను ప్రశ్నిస్తారు.

ఒక్క విషయం. ఈ విషయాలన్నిటినీ ఆధారం ఇంతకు ముందు చెప్పినట్టు చారిత్రక, సమాజ పరిశీలన మాత్రమే. కాళిదాసు కవితలో మాధుర్యాన్ని ప్రశ్నించే సాహసం, ప్రఙ్ఞ నిస్సందేహంగా ఎవరికీ లేదు. అలానే ప్రతీ వ్యక్తికీ (రాహుల్ సాంకృత్యాయన్ పండితుడికీనూ) కొన్ని విశ్వాసాలు, నమ్మకాలు సహజం. ఈయన కు కొన్ని విశ్వాసాలు బుద్ధ బోధ, బుద్ధుడి ప్రతీత్య సముత్పాదం, ఆర్య అష్టాంగిక మార్గం పట్ల విశ్వాసం మెండు అని మనకు తెలుస్తుంది. ఇలాంటి విశ్వాసాల పరదాల నుండీ ఒక్కొక సారి మనం చేసే విశ్లేషణలు కూడా ఒక్కోసారి వ్యక్తిగతంగా కనిపించవచ్చు.

ఐతే అన్నిటికీ మూలం సత్య సందర్శనేచ్చ మాత్రమే.

*****************************************************

మిత్రుడు నాగమురళి కోసం ఈ బ్లాగు రాయడానికి ఈ క్రింది పుస్తకాలు తిరగేయడం జరిగింది.
రంగనాయకమ్మ - రామాయణ విషవృక్షం (3 భాగాలు)

కాళిదాసు - మేఘ సందేశం, కుమార సంభవం (మొదటి సర్గ)
రాహుల్ సాంకృత్యాయన్ - ఋగ్వేద ఆర్యులు, సిమ్హ సేనాపతి, వోల్గా నుండీ గంగా వరకు
తిరుమల రామచంద్ర - మన లిపి పుట్టు పూర్వోత్తరాలు, ప్రాకృత వాఙ్ఞయంలో రామకథ,
విశ్వదర్శనం - నండూరి రామ మోహన రావు

ఈ టపా ద్వారా ఎవరి విశ్వాసాలను ప్రశ్నించే సాహసం నాకు లేదు. ఎవరైనా నొప్పిస్తే, క్షమాపణలు.

Friday, June 13, 2008

అనగనగా ఓ తెలుగక్షరం 'అ ' !

అక్షరాణాం అకారోస్మి
ద్వంద్వస్సామాసికస్య చ

అంటాడు గీతాకారుడు విభూతి యోగంలో. 'అ ' అక్షరానికున్న ప్రాముఖ్యం అది. మన తెలుగు అక్షరాలలో అందమైనది ఏది అని ప్రశ్నించుకుంటే, నా వరకు నాకు దొరికిన సమాధానం 'అ '.
'శ్రీ ' ఇంకా బావుంటుందనుకోండి (జంధ్యాల చంటబ్బాయి ఓ పాట చరణంలో 'శ్రీ ' లో అమ్మాయి రూపాన్ని ఊహిస్తాడు గీతకర్త), ఐతే 'శ్రీ ' సం యుక్తాక్షరం. అచ్చు, హల్లు ల్లో ఇది రాదు.
నా చిన్నప్పుడు మా తాతయ్య అన్నాడో సారి, "మీ చదువులేం చదువుల్రా.." 'అ ' తో ప్రారంభిస్తారు. అప్పుతో చదువు. మేము ఓనామాలు దిద్దుకున్న తర్వాతే ఐదు బర్లు".

ఓనమాలు అంటే ఇప్పటి పిల్లలకు తెలీదేమో మరి, మనలో చాలా మందికి తెలిసిందే "ఓం నమశ్శివాయ, సిద్ధం నమః " అని.
ఇక ఐదు బర్లు అంటే..

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
ఖ గ ఘ ఙ చ చ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ
త థ ద ధ న ప ఫ బ భ మ
య ర ల వ ష స హ
క్ష ఱ ఇతి

ఈ అక్షరాలను చూచి పరవశించే, మన పూర్వ కవులు "ఆణి ముత్యముల సోయగము మించిన వ్రాలు", "లలిత ముక్తాఫలాకార విలసనమున" అని వర్ణించారేమో!

వాటిలో కొన్ని అక్షరాలు ఇప్పుడు రిటైర్ అయిపొయాయి (ఌ, ౡ) అనుకోండి.

ఆ ఐదు బర్లు ఇసుకలో దిద్దుకునే వాళ్ళట. (బరి - కన్నడంలో రాత, వ్రాయి. ఈ బరి - బడి గా రూపాంతరం చెందిందట)

ఇప్పట్లో కాన్వెంట్ రైంస్ లా నేను చదువుకున్నప్పుడు పెద్దబాలశిక్ష లో ఓ తెలుగు రైం ఉండేది.

"ఒంకర టింకర 'ఓ '
దాని తమ్ముడు 'సో '
రెండు గుడ్ల 'మి '
నాలుగు కాళ్ళ 'బే '"

'అ ' అక్షరానికి అలాంటి అవలక్షణాలేం లేవు. ఇది అప్పటమైన తెలుగు అందం. అచ్చు, తిరుపతి లడ్డులా గుండ్రంగా...ఆ లడ్డులో వట్టి ద్రాక్ష ముక్కలా ఎడమ వైపు పైమూల ఓ చిన్న వృత్తం...లడ్డులో గోడంబి ముక్కలా ఓ అడ్డుగీత....

ఈ 'అ ' అక్షరం (ఆ మాటకొస్తే మన తెలుగు లిపి) ఎలా ఉండేది అని పుస్తకాల షాపులో గాలిస్తే ఓ ఆణిముత్యం కనబడింది (వివరాలు చివర్లో). అలానే వికి పీడిస్తే ఈ వివరాలు దొరుకుతాయి.

మన తెలుగు లిపి ది అచ్చంగా 2000 యేళ్ళకు పైబడిన చరిత్ర!

మన దేశానికి సంబంధించిన అతి ప్రాచీన లిపి పాళీ లో 'అ ' ఇలా ఉండేదట. అంతకు ముందు మన దేశంలో చిత్ర లిపి (చిత్రాల ద్వారా రాసుకునే అక్షరాలు - చైనా అక్షరాల లాగా) ఉండేదట. హరప్ప, మొహంజొదడో (సింధు నాగరికత) త్రవ్వకాల్లో ఓ లిపి బయటపడినా, ఆ లిపి ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు!చూడండి. ఇప్పటి మన 'అ ' కు అప్పటికీ పొంతనే కనబడదు. అప్పటి ఆ పాళీ 'అ ' ఇప్పటి మన అందమైన 'అ ' వరకూ సాగిన ప్రస్థానం ఈ
లంకె లో చూడండి. ఆ లంకెలో మధ్య పల్లవుల కాలంలో తెలుగు కాస్త వ్యత్యాసంగా ఉండడం గమనించ వచ్చు. (పల్లవులు తమిళులు కాబట్టి, ఆ అక్షరాలు ఇప్పటి తమిళ అక్షరాలకు మాతృక కావచ్చునేమో)

మన తెలుగు 'అ ' ప్రస్థానాన్ని చూసి, దేవనాగరి లిపి 'अ ' ను కూడా కాస్త ఊహించవచ్చు.

మన భారతీయ లిపికి ఇంకో ప్రాముఖ్యం ఉంది. అదేమిటంటే, అక్షరాలనే కాకుండా, ఒక్కో అక్షరం పుట్టుక స్థానం కూడా కనుగొన్నారు మన వాళ్ళు. వీటిని కంఠ్యములు(గొంతు), తాలవ్యములు(దవడ),మూర్ధన్యములు(అంగిలి),దంత్యములు(పళ్ళు),ఓష్ట్యములు(పెదవులు) అని విభజించారు.ఈ మౌలికమైన విభజన కాక ఇంకొన్ని అక్షరాలను కంఠౌష్ట్యములు, దంత్యౌష్ట్యములు, లాంటి విభాగాల లోనూ చేర్చారు.

గొంతు ద్వారా పలకబడే అక్షరాలు 'అ ', 'క ' , 'హ ' మొదలైనవి. పెదవుల ద్వారా ఐతే 'ప ', 'మ ' మొదలైనవి. పుట్టిన బిడ్డ మొట్టమొదట నేర్చుకునే పదం 'అమ్మ ' అన్నది గొంతు, పెదవి ద్వారా పలకబడే సులువయిన శబ్దాలు ’అ ’ , ’మ ’ కావడమే అని మా తాత చెప్పేవాడు. (మిగిలిన భాగాలు, అంగిలి, దంతాలు మొదలైనవి ఇంకా వచ్చి ఉండవు కాబట్టి.)

అలానే 'అ ', 'హ ' ఇవి పలికేప్పుడు గాలి బయటకు వెళుతుంది. కరుణశ్రీ గారు స్వారోచిష మను సంభవం లో ఓ పద్యానికి (ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో....)భాష్యం చెబుతూ,వరూధిని తనను కౌగిలించుకున్నప్పుడు, ప్రవరుడు ఆమె భుజాలను పట్టి తోసి వేస్తూ, 'హా! శ్రీ హరీ ' అంటాడు కదా ’హా! శ్రీ హరీ ’ అనే అని ఎందుకనాలి? అని చక్కగా విశదీకరించారు.

'హా! శ్రీ హరీ ' అన్నప్పుడు గాలి బయటకు వెళుతుందట. అంటే ప్రవరుడు తన ముఖం పక్కకు తిప్పుకోవడంలోనే కాకుండా, తన వాచికంలోనూ అయిష్టత ను చూపించ దలిచాడట (ఈ 'హా! శ్రీ హరీ ' అని అనడం ద్వారా)

ముగించే ముందు మన తెలుగు వాడి గుత్త సొమ్ము తలకట్టు గురించి ఓ పద్యం గుర్తు చేసుకుంటాను.

కన్నులు దీర్ఘముల్ నగుమొగంబవురా తలకట్టు తమ్మిపూ
పున్నమ చందమామలకు బొక్కిలి చక్కదనంబు చెప్పగా
నున్నదె!మేలు బంతులు పయోధరముల్ మరి కౌను సున్నయౌ
నెన్నిక కెక్కు వ్రాతఫలమివ్వర వర్ణినికిన్నింజంబుగన్.

(ఉపకరించిన పుస్తకం, ఆచార్య తిరుమల రామచంద్ర - మన లిపి పుట్టు పూర్వోత్తరాలు, విశాలాంధ్ర ప్రచురణ)

Wednesday, June 11, 2008

పొద్దు లో నా స్వేచ్చానువాదాలు...

రవీంద్రుని కవితలకు నేను రాసుకున్న స్వేచ్చానువాదాలు, పొద్దులో..
ప్రోత్సహించిన మితృడికి ధన్యవాదాలు.