Tuesday, January 26, 2010

మంచితనం - మానవ సంబంధాలు

చాలా యేళ్ళ క్రితం ఉద్యోగం దొరికిన కొత్తల్లో రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో నరేంద్రుడనే అతను అనేక యాత్రలు జరిపి, చీనా దేశానికి చేరుకుని అక్కడ అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ మరణిస్తాడు. అతడి వృద్ధాప్యంలో అతననుకుంటాడు. "ప్రజలు దీనులూ, దరిద్రులూ అయితేనే కదా, వాళ్ళకు సేవ చేసే అవకాశం లభించేది నాకు? అంటే పరోక్షంగా వాళ్ళు దీనులు కావాలని కోరుకుంటున్నానన్నమాటే కదా?" - ఈ వాక్యాలు చాలా కాలం గుర్తుండిపోయాయి.

మన మంచితనం వెనుక ఉన్నది స్వార్థమా? నిస్వార్థమా? అని ఓ అవిశ్వాసమూ, అపోహా నాకు. ధనసాయం కానివ్వండి, మాటసాయం కానివ్వండి, నైతిక మద్దతు కానివ్వండి, ఎంత ప్రతిఫలాపేక్ష ఆశించకపోయినప్పటికీ, మనుషులు చేసే మంచిపనుల్లోనూ అంతర్లీనమైన స్వార్థం ఉండకపోదని చాలాసార్లు అనిపిస్తుంది. స్పష్టంగా ఫలానా అని చెప్పలేకపోయినా, ఏదో అంతర్లీనమయిన స్వార్థం మటుకు ఉండి ఉండాలి.

కొన్నేళ్ళ క్రితం నాకో సహోద్యోగి ఉండేవాడు. చాలా ధనవంతుడు. ఉద్యోగం నామమాత్రమే. మామిడి తోటలూ, అవీ ఉండేవి వాడికి. వాడి భార్యా, ఉద్యోగస్తురాలే. DINK సంసారం. చీకూ చింతల్లేవు. ఆఫీసు వాళ్ళు ఏదైనా చారిటీ కార్యక్రమాలు అవీ ఏర్పాటు చేస్తే, వితరణల్లో వాడి పేరు మొదట నిల్చేది. వేలల్లో ఖర్చు పెట్టేవాడు. అయితే కారులో వెళుతూన్నప్పుడు మధ్య కూడలిలో ఎవరైనా అనాథలు కనబడితే చాలా అసహనం ప్రదర్శించేవాడు. నాకు అతగాణ్ణి చూసి విచిత్రం అనిపించేది.

ఓ రోజు నాకూ ఓ సందర్భం ఎదురయ్యింది. కాలు చెయ్యి బావున్నా, మాసిపోయిన గడ్డమూ, చింపిరిజుత్తూ ఉన్న ఒకతను చాలా దీనంగా అడుక్కుంటూ వచ్చాడు మా ఇంటిదగ్గరకు. అతడి కొడుకు చిన్నపిల్లాడట. భార్య రోగగ్రస్తురాలట. అతడు ఏదో పని చేసుకునే వాడు, కానీ పని వదిలేసి ఇలా ప్రత్యక్షమయాడో రోజు. అతణ్ణి చూడగానే సహాయం చెయ్యాలనిపించింది, కానీ తటపటాయింపు. ఆ డబ్బు అతడు తాగటానికి ఖర్చుపెడతాడేమో, లేకపోతే, అదంతా నాటకమనో ఇలా. అదే ఆఫీసు వాళ్ళో, మరొకళ్ళో ఎవరైనా డొనేషన్ అడిగితే ఆ అనుమానాలు రావు!. దానికి కారణం - ఎక్కడో, ఏ మూలనో "దానం చెయ్యడం" కన్నా, "నేను" దానం చేస్తున్నానన్న భావన మనకు ముఖ్యం. ఇది మంచితనమా? స్వార్థమా?

(అతడిది నాటకం కాదని, అతడు నిజమే చెబుతున్నాడని తెలిసింది ఆ తర్వాత. అయితే తెలుసుకునేసరికి అతడి భార్యా, పిల్లాడు పోయారు. అతనూ పోయాడు కొన్ని రోజులకు)

నైతిక మద్దతు (moral support) కూడా అలాంటిదే. మొదట నైతిక మద్దతు ఇచ్చేందుకు ఎగబడతాము, అవతలి వాడు బాగుపడిన తర్వాత, నా వల్లే అతడు బాగుపడ్డాడని చెప్పుకోవడానికి సందేహించము. ఎవరైనా మనకు సహాయం చేయడానికి అవకాశం ఇస్తున్నారంటే, అది వారు మనతో అనుబంధం పెంచుకోవడానికి ఇస్తున్న అవకాశం తప్ప, వారి బలహీనత ఎంతమాత్రం కాదు.

కుటుంబసంబంధాలు పరస్పరం ఇలానే ఉండేవి క్రిందటి తరం వరకు. నా చిన్నతనంలో మా చిన్నాన్నలూ, మామయ్యలూ, ఇతర బంధువులూ ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆ తర్వాత తీర్చేయడాలూ, చాలా సాధారణంగా ఉండేవి. వాళ్ళలా ఉంటే, ఇప్పటి తరం వాళ్ళమయిన నేనూ, మా అన్నయ్యా, మా కజిన్స్ మాత్రం ఒకరిదగ్గర ఒకరు సహాయం అడగడం నామోషీగా భావిస్తున్నాం. నేను ఓ సారి అవసరమొచ్చినప్పుడు సిటీబ్యాంకు వాడి దగ్గర లోనుకెళితే, ఇంకొకరు సహాయం అవసరమని మాటవరసకైనా చెప్పరు. మా ఇంట ఏదైనా పండుగో పబ్బమో వస్తే, మా అత్తలూ, పిన్నమ్మలూ, ఇతరత్రా అందరూ వచ్చి కలిసికట్టుగా వంటపనుల్లో పాల్గొని పనులు చూసుకునే వారు. ఇప్పుడు మాత్రం వారిని పిలిచి వారి సహాయం అడిగి "చులకన" అవడం కన్నా ఏ క్యాటరింగు వాడికో పని వప్పజెబితే సరి!

మనిషికి డబ్బు తో బాటూ సమాంతరంగా మరొకటీ పెరుగుతూ పోతూంది. అది ఏకాకితనం (isolation). స్వార్థం అనేది బయటకు వ్యక్తమయే ఏకాకితనం. ఏకాకితనం అన్నది తెరమరుగున దాగిన కనబడని స్వార్థం. ఇది ప్రస్తుత కాలంలో కుటుంబంలో బంధువులమధ్య మొదలై, మెల్లమెల్లగా తండ్రీకొడుకుల మధ్యా పాకుతూ వస్తూంది. మెల్లగా అయినా స్ఫుటంగా ఇది భార్యాభర్తల మధ్యా వ్యాపిస్తూ ఉంది. ఎంత గొప్ప అనుబంధమైనా, ఏడేడు జన్మలబంధమైనా ఒకరికొకరికి మధ్య బలీయమైన మానసిక అవసరం లేకపోతే ఆ బంధంలో ఆపేక్ష తగ్గుతుంది. ఏ కారణం చేతయినా కానివ్వండి, స్త్రీ, పురుషుడి మీద ఆధారపడడం ద్వారా కుటుంబ బంధం బలంగా ఉండేది ఇదివరకటి రోజుల్లో. స్త్రీలకు విద్యా, పరిమితమైన ఆర్థిక స్వేచ్ఛా అవసరమే.అయితే ఉద్యోగం చేసే అవసరం మాత్రం రాకూడదు. వారి శారీరక, మానసిక సామర్థ్యాలకనుగుణంగా వారికంటూ నిర్దిష్టమైన గృహధర్మాలు ఉన్నవి.

కుటుంబసభ్యుల మధ్యే కాక, బయట సమాజంలోనూ ఈ స్వార్థం (ఏకాకితనం) బహిర్గతంగా ప్రకటితమవుతూ ఉంది. వీధికొకటి చొప్పున ఉదయిస్తున్న వృద్ధాశ్రమాలు, అమ్మమ్మల అవసరం లేకుండా పిల్లలను చదివించే ఆట ఇళ్ళూ (ప్లే హోమ్స్) వంటివి దీనికి ఉదాహరణలు.

ఇంట్లో డబ్బు సంపాదించేవాడి అవసరమెంతో, డబ్బు సంపాదించలేని వారి (అమ్మమ్మలూ, తాతయ్యలూ వగైరా) అవసరమూ మన ముందుతరంలో బాగా ఉండేది. చిట్టి మనవళ్ళనూ, మనవరాళ్ళను కాళ్ళమధ్యన బోర్లపడుకోబెట్టుకుని లాల పోసే అవసరం తో మొదలయి, వారి ఆలనాపాలనా చూస్తూ, వారికి భాషా, మంచిమాటలూ, పనుల్లో నేర్పూ అన్నీ దగ్గరుండి చెప్పించే వాళ్ళ అవసరం తగ్గిపోతూ వస్తూంది. "శాస్త్రీయ" పద్ధతుల్లో ఆటా, పాట నేర్పడానికి ప్లే హోమ్స్, రెండున్నరేళ్ళవగానే ఎగబడ్డానికి స్కూళ్ళూ ఉన్నాయి.

("శాస్త్రీయ" పద్ధతుల్లో పిల్లలను చూసుకుని, వారికి తగిన తర్ఫీదు ఇవ్వబడును. అని బెంగళూరులో ఓ బోర్డు చూశా మొన్నామధ్య)

నిజమైన సమస్య, కొడుకులు స్వార్థపరులవడమో లేక, వృద్ధులు పనికిరాకుండా పోవడమో కాదు. అది బయట కనిపించే చిహ్నం (symptom) మాత్రమే. అసలు కారణం ఒకరి మీద ఒకరికి ఆధారపడే అవసరం లోపించటము. ఆ అవసరానికి ముఖ్య ఆలంబన అయిన ధనపరమైన స్వాతంత్ర్యం సమాజంలో ఎక్కువవటమూనూ. అవసరం లేనిచోట అనుబంధం మనగలగటం కష్టం.

ఈ రకమైన సమస్యలు నిర్మూలించబడాలంటే కీలకం - అవసరాలు కల్పించుకోవడంలో ఉంది. మారుతున్న సమాజ, కుటుంబ సమీకరణాల్లో సహాయం చెయ్యటంకన్నా, సహాయం అడగటం గొప్పవిషయం. మన పెద్దలను, మన బంధువులను, మిత్రులను సహాయం అడగటం వల్ల, "చులకన" అవుతామేమో అన్నది ఓ అపోహ. తన సామర్థ్యం మీద నమ్మకం ఉన్నవాడెవడూ ఈ అపోహలు పెంచుకోడు. అలా ఎవరైనా నిజంగా చులకన చేసినా కూడా నవ్వుతూ దులిపేసుకుని పోతాడు తప్ప తలకెక్కించుకోడు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడనేది పాతమాట. వలసినప్పుడు సహాయం అడిగి, ఆ తర్వాత కుదిరినప్పుడు తిరుగు సహాయం చేస్తూ, సాధ్యమైనంతవరకూ సంబంధాలను నిలుపుకునేవాడే ఇప్పటికి ధన్యుడు! అలాంటివాళ్ళ అవసరమే ఈ రోజు మనకు కావాలి.

Tuesday, January 5, 2010

పిపీలికం

వంటింట్లో నిలువున్న నిన్నటి చపాతీలు తిందామని చూద్దును కదా, అందులో ఎర్రచీమలు.

చీమ! జాగ్రత్తగా గమనిస్తే ఎంత చక్కటి ఆకారం! రెండు అండాకారాలు - ఒకటి ఎర్రనిదీ, మరొకటి నల్లనిదీనూ. వాటిని దారంలా కలుపుతూ సన్నటి నడుము. అటూ ఇటూ హడావుడిగా పరుగెడుతూ ఉన్నాయి. ఇటు వైపు వెళ్ళే చీమకు అట్నుంచి వచ్చే చీమ అడ్డుపడితే, ఓ లిప్తపాటు తలను తాకించి, ఏదో సందేశాన్నందిస్తూంది. కొన్ని చీమలు కలిసికట్టుగా చేరి, ఓ పెద్ద ముక్కను లాగుతున్నాయి. ఆ చీమలబారు ఎక్కడి నుంచీ మొదలవుతుందో చూద్దామని పరికిస్తూ వెళితే, గోడవారగా పక్కగదిలోకి, అలా గది చివర్న ఓ చిన్న పుట్టలోనికి దారి తీసింది. అందులో సగం బారును లెక్కపెడితే, ఉజ్జాయింపుగా 450 చీమలున్నాయి. ఇటు వెళుతున్నవి, తిరిగి వస్తున్నవీ కలిపి. అంటే, దాదాపు వేయి చీమలు ఆహార సేకరణ అనే ఆ మహా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి!

భగవంతుని సృష్టిలో అన్నీ అద్భుతాలే. ఉహూ.. ఆ వాక్యం బావోలేదు. సృష్టిలోని అణువణువులోనూ భగవంతుడు తానై రూపాంతరం చెందాడేమో. ఠాగూర్ అనుకుంటాను గుర్తు లేదు. చూడగలిగితే భిన్నత్వం అణువణువులోనూ ఉందంటాడు. ఓ చెట్టులో ఏ రెండు ఆకులను ఆకులను చూచినా, ఆ ఆకులపైని మెఱుపులోనో, ఆ ఆకుల తాలూకు ఈనెలలోనో, ఆ ఆకు ఆకారంలోనో ఏదోక భిన్నత్వం కనిపిస్తుంది(ట). ఓ చెట్టులోని ఆకుకు, మరో ఆకుకూ మధ్య కూడా వ్యత్యాసం స్పష్టంగా చూడవచ్చట, కనులు తెరిచి పరికిస్తే.

ఓ చెట్టులోని ఆకులను అలా చూస్తూనే లెక్కెట్టటం అనే విద్య ఒకటుండేదట, పూర్వకాలంలో. నలదమయంతుల కథలోని నలమహారాజుకు ఈ విద్య తెలుసట. ఈ విద్య పేరు అశ్వ హృదయం అనో, అశ్వహృదయంలో ఈ గణనం కూడా ఓ అంగమనో చిన్నప్పుడెప్పుడో మాష్టారు చెప్పిన గుర్తు. (ఈ నా జ్ఞాపకం పొరబాటు కూడా అయి ఉండవచ్చు. అయితే ఈ రకమైన విద్య మాత్రం ఏదో ఉన్నట్టు చెప్పారన్నది బాగా గుర్తుంది).

చీమల గురించి ఏదో ఆలోచనలో పడి ఎక్కడికో వెళ్ళాను. కనిపిస్తున్న ఇన్ని చీమలలో కూడా ఒకచీమకూ, మరో చీమకూ మధ్య వ్యత్యాసం ఉందా? అదెలా తెలుసుకోవచ్చో? అయినా ఏ ఎమ్బీయేలూ, మేనేజిమెంటులు చదవకుండానే వీటికి, ఇలా తమ ఆహారాన్ని వర్షాకాలం కోసం దాచుకోవాలని ఎలా తెలిసిందో? ఒక మి.మీ. లో అర్ధ భాగం కూడా లేని వాటి తలలలో, ఈ ఆలోచన ఎలా వచ్చిందో? లేకపోతే, మెదడుతో సంబంధం లేని మరో అద్భుత యంత్రాంగం ఏదో ఈ జీవప్రపంచంలో ఉండి ఉండాలి. నేర్చుకోవాలన్న తపన అవసరమే కానీ, మనకు నేర్పడానికి భగవంతుడు అణిమాది రూపాల నుంచి, బ్రహ్మాండమంతటా తానే అయిన మహిమాత్మక రూపం వరకూ ఎదుట కనిపిస్తూ ఆశ్చర్యానందాద్భుతాలకూ ఎప్పుడూ గురి చేస్తూనే ఉంటాడు. మహిమాన్వితమైన ఆ తేజో రూపం గురించి ఏం మాట్లాడగలుగుతాం? కైమోడ్చి శిరసు వంచటం తప్ప?

నల్ల చీమలను (నల్ల గండు చీమలు కాదు. చిన్నవి) ఎట్టి పరిస్థితిలోనూ చంపరాదని మా అమ్మ చిన్నప్పుడు మాకు విధించిన ఆంక్ష! అవి వినాయకుడి చీమలట. వాటికి చక్కెర కూడా పెట్టేది మా అమ్మ.

సత్యజిత్ రే రాసిన ఓ కథ ఉంది. శాశ్మల్ అనే ఓ ఆసామీ, తన సెలవు రోజును గడపడం కోసం, ఒక్కడే కలకత్తాకు దూరంగా అడవిలో ఓ రిసార్టుకెళతాడు. అక్కడ అడవికి మధ్య, చౌకీదారును పంపేసి, గదిలో నిద్రకుపక్రమిస్తాడు. అప్పుడు ఆ రాత్రి - తను చిన్నప్పట్నించీ చంపిన ప్రాణులన్నీ ఒక్కొక్కటిగా ఆ గదిలో కనబడ్డం ఆరంభిస్తాయి. వాటిలో ఓ చీమలబారు కూడా. అతను తన స్కూలు రోజుల్లో ఓ పైకి వెళుతున్న చీమలబారును, కాగితానికి చివర నిప్పంటించి, ఆ నిప్పుతో ఆ చీమల దండుకు మంటెడతాడు. ఆ చీమల బారు, తన కారు కింద పడ్డ కుక్క, తమ బంధువులింట ఎవరికీ హాని తలపెట్టకుండా, దైవంలా అందరూ పూజించబడుతూ, తనచేత కర్రతో కొట్టి చంపబడ్డ పాము, ఓ పక్షి, పిల్లి....ఇలా... ఆ కథ చివరికేమవుతుందో మాత్రం ఇప్పటికి సస్పెన్స్!

అంతరిక్షమూ, పాలపుంతలూ, గ్రహాలు, నక్షత్రాలు ఆదిగా గల ఈ బ్రహ్మాండంలో మనిషి అస్తిత్వం కూడా పిపీలిక పరిమాణమే కాదూ!

చీమలదండు గురించి ఆలోచిస్తూ, వాటికి పెట్టిన ప్రసాదం వదిలేసి, ఏదో అలా మింగి, కొత్త సంవత్సరం ఏ టపా రాద్దామా అని ఈ టపా రాస్తున్నాను. ఆ చపాతీల పాత్రకు కాస్త దూరంగా సాయంత్రం వెలిగించిన సంధ్యాదీపం ఇంకా వెలుగుతూంది దివ్యంగా.

(జిడ్డు కృష్ణమూర్తి గారు తన బాల్యంలో చీమలను దీక్షగా గమనించేవారట. చీమలపై ఆయన వ్రాసిన ఓ పేరా స్ఫూర్తిగా)