Wednesday, February 25, 2009

కల - నిజం

ఒకానొకప్పుడు "చెంగ్" రాజ్యానికి చెందిన ఓ వ్యక్తి కట్టెలు కొట్టుకుంటుండగా, ఓ బెదిరిన జింక తనున్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అతడు దాన్ని వేటాడి చంపాడు. ఆ తర్వాత అతడు ఓ గోతిని తవ్వి, చచ్చిన జింకనందులో పూడ్చి, పైన ఆకులతో కప్పి,ఆపైన మట్టితో కప్పేశాడు. ఆ తర్వాత కట్టెలు కొట్టటంలో మునిగిపోయి, ఆ పని పూర్తి చేసి, సాయంత్రం వేళకు ఇంటికి బయలుదేరబోతూ, తను చంపిన జింక కోసం వెతికాడు. అయితే అతడు హడావిడిలో జింకను పూడ్చిన స్థలం మరువటం వల్ల, నిరాశగా ఇంటిదారి పట్టాడు. తను జరిగిన విషయమంతా కలలా ఉందని గొణుక్కుంటూ వెళ్ళటం రెండవ వ్యక్తి విన్నాడు.

ఈ రెండవ వ్యక్తి, ఆ ప్రదేశం వెతికి, గోతిని తవ్వి, జింక కళేబరంతో సహా ఇంటికి చేరుకుని, తన భార్యతో చెప్పాడు."ఒక కట్టెలు కొట్టుకునే అతను జింకను చంపినట్టుగా కలకన్నాడు. అయితే తనకా జింక దక్కలేదు.నాకు దక్కింది.అతను కల అనుకున్నది నిజంగా జరిగింది."

దానికి రెండవ వ్యక్తి భార్య ఇలా అంది. "పగటి కల కన్నది నువ్వు. ఎవరైనా జింకను చంపి దాన్ని ఎక్కడ దాచారో మర్చిపోగలరా? కట్టెలు కొట్టుకుంటున్న వ్యక్తి నీకు కనిపించినట్టు, జింకను చంపినట్టుగా, ఇలా నీలో నువ్వే ఊహించుకుని కలగన్నావు. జింక మనకు దొరికింది. అతనెవ్వరో కల కంటే, అది నువ్వు నిజమని ఎలా భావిస్తావు?"

"నా భార్య చెప్పిందీ నిజమే. అయినా ఎవరు కల కంటేనేం? నాకు జింక దొరికింది. నేను దాన్ని వండుకుంటాను" అనుకున్నాడు రెండవ వ్యక్తి.

ఇక కట్టెలు కొట్టుకునే మొదటి వ్యక్తి, తీవ్రమైన నిరాశతో ఇంటికి చేరి, ఆ రాత్రి జరిగిన విషయాలను మొత్తం - అంటే రెండవ వ్యక్తి తన పక్కన నడుస్తూ, తన గొణుగుడును వినటాన్ని కూడా - కలగన్నాడు. పొద్దున లేచేటప్పటికి తన కలలో జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళముందు ప్రత్యక్షం అయాయి. తన కలలో కనిపించిన జింకను పూడ్చిన గోతి తాలూకు ఆనవాళ్ళను వెతుకుతూ వెళ్ళి, అక్కడ ఉన్న అడుగుజాడలననుసరించి రెండవ వ్యక్తి ఇల్లు కనుక్కుని, జరిగింది గ్రహించి, న్యాయమూర్తి దగ్గర అర్జీ పెట్టుకున్నాడు!

న్యాయమూర్తి పూర్వాపరాలు విచారించిన మీదట తీర్పు చెప్పాడు. " కట్టెలు కొట్టుకునే వ్యక్తి - నిజమైన జింక, అబద్దపు కలతో ఆరంభించి, నిజమైన కల, అబద్దపు జింకతో ముగించేడు. రెండవ వ్యక్తికి దొరికిన జింక మొదటి వ్యక్తి కల తాలూకుది. అతని భార్య వాదనా పరిగణనలో తీసుకుంటే,, మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి ఇద్దరిదీ కలే. కాబట్టి జింక ఎవరికీ చెందరాదు. అయితే జింక తాలూకు కళేబరం నిజంగా కనిపిస్తూంది. కాబటి ఇద్దరూ జింక మాంసాన్ని చెరి సగం పంచుకోవాలి."

ఈ తీర్పు వివరాలు ఆసాంతం విన్న చెంగ్ రాజ్యపు రాజు, ఇలా అనుకొన్నాడు. " ఇది న్యాయమూర్తి కన్న కల మాత్రమే."


****************************************************************

12.

"What language is thine, O sea?"
"The language of eternal question."

"What language is thy answer, O sky?"
"The language of eternal silence."

రవీంద్రుడి సుభాషితం ఇది. ఇక్కడ "Thy" అన్నదాన్ని సత్యానికి అన్వయించుకుంటే - సత్యాన్ని ఎవరూ నిర్వచించలేరు. (నిర్వచించలేరు - అన్న నిర్వచనం తో సహా). ఏది సత్యం కాదో దాన్ని చెప్పగలరు మహా అయితే. దాన్ని ఓ శంకరుడో, ఉపనిషద్దర్శనికుడో, "నేతి" , "నేతి" పద్దతిలో, కనిపించిన ప్రతి వాదాన్ని ఆక్షేపిస్తూ వెళ్ళి, చివరకు ఓ శూన్యం (eternal silence) లో దాన్ని వెతుక్కుంటాడు. కృష్ణమూర్తి అయితే - Truth is the highest form of negative understanding- అంటాడు,

దాదాపు 2500 యేళ్ళ క్రితం, బుద్ధుడికి సమకాలికుడిగా ఓ దార్శనికుడు, ఓ ఋషి చైనాలో జన్మించాడు(ట). ఆయన పేరు లావు త్సు. బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానంలో ఉన్నప్పుడు నిర్వాణం చెందితే, ఈ మహానుభావుడు ఓ పండుటాకు చెట్టుపై నుంచీ రాలి పడటం తదేక దీక్షగా గమనించి, ధ్యానమగ్నుడై సత్యాన్ని ఆవిష్కరింపజేసుకున్నాడట. ఆ వ్యక్తి భావజాలం "తావోఇజం" గా చెప్పుకోబడింది. Tao - అంటే మార్గం. ఎలాంటి మార్గం? ఓ పక్షి గగనంలో ఎగురుతూ వెళ్ళింది. ఆ పక్షి మార్గాన్ని ఎవరూ అనుసరించలేరు.

ఎందుకంటే, గగనంలో ఆ పక్షి తాలూకు నడకల ఆనవాళ్ళు లేవు కాబట్టి. మార్గం అన్నది ఎవరికి వారు ఆవిష్కరించుకోవలసిన పరమ సత్యమే. (Truth is a pathless land). ఆ taoism లో జీవితాన్ని, సత్యాలను చెప్పటానికి ఉపయోగించుకున్న విధానం - anology. తెలుగు లో ఏమంటారో ఈ పదాన్ని? జీవితం లో శూన్యతను analogy సహాయంతో వివరించిన taoism తాలూకు కథ ఇది. ఇలాంటి కథ ఒకటి ఇక్కడ చూసి ఇదంతా వా(బ్లా)గాలనిపించింది.


****************************************************************

Tuesday, February 24, 2009

తరుణ శశాంక శేఖర మరాళమునకు ....

శివరాత్రి పర్వదినం సందర్భంగా, (దాటిపోయిందనుకోండి, అయినా పరమేశ్వరుణ్ణి తలుచుకోటానికి వేళా పాళా అవసరమా ఏమిటి?) శివుణ్ణీ, పనిలో పనిగా శ్రీనాథుడినీ తలుచుకున్నారు ఇద్దరు బ్లాగ్మిత్రులు. ఉభయతారకంగా అటు పుణ్యము, పురుషార్థమూ. శుభం! ఇదే పని నేనూ చేద్దామని, తెలిసిన పద్యాలూ, వాటి గురించి ఆలోచిస్తే, చప్పున తోచిన పద్యం ఇదీ. తెనాలి రామకృష్ణ .... కాదు కాదు తెనాలి రామలింగకవిది.

తరుణ శశాంక శేఖర మరాళమునకు
సార గంభీర కాసారమగుచు
కైలాస గిరినాథ కలకంఠ భర్తకు
కొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీధర షట్పదమునకు
ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు
రాజరాజప్రియ రాజకీరమునకు
మానిత పంజర స్థానమగుచు

ఉరగవల్లభ హార మయూరమునకు
చెన్ను మీఱిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి
అద్రినందన బొల్చె విహారవేళ

నిండు యవ్వనంలో ఉన్నాడు మన రామలింగడు. చక్కని భార్య (కమల), ముచ్చటైన ఒక్కగానొక్క సంతానం, మాధవుడు. అప్పటికి తన కేరాఫ్ అడ్రెస్ తెనాలే. తెనాలి రామలింగేశ్వర స్వామి వరప్రసాదం కాబట్టి ఆయన పేరే కొడుక్కు పెట్టుకుని మురిసిపోయాడు గార్లపాటి రామన్న మంత్రి (తెనాలి రామలింగడి తండ్రి). స్వతహాగా శైవుడు. నందవరీకుల నియోగి బిడ్డ. చిన్నవయసు లోనే అపరిమిత పాండిత్యం సాధించేడు. కుమారభారతి అనిపించుకున్నాడు. సరే, అంతా బావుంది, అయితే అప్పటికి తన కష్టాలింకా గట్టెక్కలేదు. ఇంట్లో నూకలు నిండుకున్నాయి. తనేమో ఓ కావ్యం వ్రాయాలని పట్టుబట్టి అహోరాత్రాలు కృషి చేస్తున్నాడాయె. కావ్యం పూర్తయ్యే వరకూ ఎటూ కదలరాదని పంతం. అయితే సంసారం నడవాలిగా. ఇక తల్లి కలుగజేసుకుంది. "నాయనా, రామయ్య, తాటాకులు తేరగా వచ్చాయని ఎడతెరిపి లేకుండా అలా రాస్తూ కూర్చుంటే ఎలారా? పెద్ద పండుగ దగ్గరవుతుందిరా అబ్బాయ్. నీకు పట్టకపోతే మానె, కనీసం బిడ్డకైనా కొత్తబట్టలు పెట్టాలి కదరా. నీ కవిత్వాన్ని ఊరి పెద్ద రావూరి రంగారావు గారికి వినిపించి, సంసారం గట్టెక్కించరా" అంది. ఇక తప్పనిసరై, తన కావ్యం "ఉద్భటారాధ్య చరిత్రం" లో పై పద్యాన్ని ఏరి వినిపించాడు రంగారావు గారికి. రంగారావు గారేమో పాపం ఈ పద్యం లో వర్ణనలు జీర్ణించుకోలేకపోయాడేమో, " బాబూ నలుగురూ మెచ్చని రకంగా ఇలా వర్ణనలు గుప్పిస్తూ, సమాస భూయిష్టంగా రాస్తే వ్యర్థం" అని తేల్చేసేడు. అదే మంచిదయ్యింది రాముడికి. విద్యానగరానికి ప్రయాణం కట్టేడు. లింగడు కాస్తా కృష్ణుడయ్యేడు. రాయల వారి సభలో ఓ జటిలమైన సమస్యకు పరిష్కారం సూచించి, రాయల ప్రాపకం సంపాదించేడు. ఇన్ని వందల యేళ్ళ తర్వాత కూడా తెలుగు వాళ్ళ (తెలుగేమిటి, మొత్తం భారతదేశం అంతానూ) నోళ్ళలో నానుతున్నాడు.

ఆ పద్యం అర్థం ప్రయత్నిద్దామా?

శివపార్వతులిద్దరు హిమగిరి సానువులలో విహరిస్తున్నారు. ఆ విహార సమయంలో, లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి, పార్వతీ దేవి, పరమేశ్వరుడి పక్కన ఎలా (ఒప్పి) ఉన్నదంటే -పున్నమి చంద్రుని వంటి శేఖరమనే హంసకు మంచి నీటితో కూడిన లోతైన సరస్సు లాగా, కోకిల కూజితం లాంటి కంఠస్వరం ఉన్న భర్తకు, లేమావి కొమ్మ లాగా, సురలోకవాహిని - అంటే గంగ - గంగాధరమనే భ్రమరానికి, ప్రాతః కాలంలో పూచిన తామర లా (పొద్దున పూచిన పూలలో తేనె మెండుగా ఉంటుంది కదా), రాజరాజు (చంద్రుడికి రాజు) అనబడే రామచిలుకకు తనై తను ఒప్పుకుని చేరుకున్న పంజరంలా (మానిత పంజర స్థానము), ఉరగాన్నే హారంగా ధరించిన ఈశ్వరుడనే నెమలికి ఎత్తైన పర్వత సానువు లాగా (నెమళ్ళు పర్వత సానువులనే ఎక్కువ ఆశ్రయిస్తాయి కాబోలు).....ఇలా ఉందట.

(పైన అర్థం లో పొరబాట్లు విజ్ఞులు సవరించగలరు)

మామూలుగా మనం, ఔచిత్యం అనే పదం వాడుతుంటాం. ఆ ఔచిత్యం అంటే ఏమిటో బాగా అర్థం అవుతుంది ఈ పద్యం ద్వారా. మామూలుగా శివుడి రంగు తెలుపట, కాబట్టే తరుణ శశాంక శేఖర మరాళమయ్యాడు. ఆ తెలుపు రంగు శివయ్యకు కంఠం మాత్రం నలుపు. విషం మింగాడుగా. మరందుకే కైలాస గిరినాథ కలకంఠ భర్త అయ్యాడాయన. ఇక అమ్మవారో - లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి. భర్త కు తగిన ఇల్లాలు. అందుకే కాబోలు చిఱ్ఱు బుఱ్ఱులాడే ప్రియురాలిలాగా కాకుండా - అంటే - కలహంసకు కాసారంలా, కోకిలకు లేమావికొమ్మలా, తేనెటీగకు కంజాతంలా, రామచిలుకకు ఇష్టపడి బంధించుకున్న పంజరంలా ...ఇలా అందంగా, అనుకూలంగా ఉన్నది భర్త పక్కన.

ఆ శివయ్యా, లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అమ్మవారు - బ్లాగ్లోకానికి శుభములు చేకూర్చు గాక!

(తెనాలి రామకృష్ణ సినిమాలో దృశ్యానికి, ముత్తేవి రవీంద్రనాథ్ గారు తెనాలి రామకృష్ణ కవి మీద వ్రాసిన సమగ్ర గ్రంథంలో కొన్ని అంశాలని జోడించి, కొంత ఊహతో రాసిన టపా ఇది)

Thursday, February 5, 2009

పాప - ఆటవెలది

రామకృష్ణా రావు గారి ఆంధ్రామృతం ప్రేరణతో, ముక్కు రాఘవ గారి పొద్దు పాఠాల సహాయంతో, ఆవేశంగా ఓ పద్యం రాయాలి అని, నిన్న రాత్రి ఓ అరగంట కుస్తీ పట్టాను. దేని మీద రాయాలో కాసేపు ఆలోచించి, మా పాప మీద రాద్దాం అని ప్రయత్నిస్తే, నా వల్ల సాధ్యమైనది ఇది.

పాప బోసి నవ్వు పాప ముద్దు మొగము
నాదు మదిని ఎపుడు నలుగుచుండు
నాదు నోము ఫలమొ నాక లోక వరమొ
మరువజాల పాప ననవరతము

ఇందులో దోషాలుంటే పెద్దలు మన్నించాలి. వీలయితే సరిదిద్దాలి.

"నాకొక బుల్లి చెల్లి. గల్లీలో దానికి పెళ్ళి"...ఈ స్త్థాయిలో ఉందేమో మరి. పట్టించుకోవద్దు.

ఇంకా ఆవేశం చల్లారక ఇంకో పద్యం కోసం కుస్తీ మొదలెడితే, ఓ వాక్యం వచ్చి, అంతటితో ఆగిపోయింది.

మిణుకు మనుచు కనులు మిణుగుర్ల రీతిని....
...
...
...

రామకృష్ణా రావు గారు, మీ బ్లాగులో మీరు అంత వేగంగా సమస్యలు పూరించమంటే, నా మృణ్మయ మస్తకం భరించలేదు. నిదానంగా ప్రయత్నిస్తాను. ఏమనుకోకండి.