Wednesday, February 25, 2009

కల - నిజం

ఒకానొకప్పుడు "చెంగ్" రాజ్యానికి చెందిన ఓ వ్యక్తి కట్టెలు కొట్టుకుంటుండగా, ఓ బెదిరిన జింక తనున్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అతడు దాన్ని వేటాడి చంపాడు. ఆ తర్వాత అతడు ఓ గోతిని తవ్వి, చచ్చిన జింకనందులో పూడ్చి, పైన ఆకులతో కప్పి,ఆపైన మట్టితో కప్పేశాడు. ఆ తర్వాత కట్టెలు కొట్టటంలో మునిగిపోయి, ఆ పని పూర్తి చేసి, సాయంత్రం వేళకు ఇంటికి బయలుదేరబోతూ, తను చంపిన జింక కోసం వెతికాడు. అయితే అతడు హడావిడిలో జింకను పూడ్చిన స్థలం మరువటం వల్ల, నిరాశగా ఇంటిదారి పట్టాడు. తను జరిగిన విషయమంతా కలలా ఉందని గొణుక్కుంటూ వెళ్ళటం రెండవ వ్యక్తి విన్నాడు.

ఈ రెండవ వ్యక్తి, ఆ ప్రదేశం వెతికి, గోతిని తవ్వి, జింక కళేబరంతో సహా ఇంటికి చేరుకుని, తన భార్యతో చెప్పాడు."ఒక కట్టెలు కొట్టుకునే అతను జింకను చంపినట్టుగా కలకన్నాడు. అయితే తనకా జింక దక్కలేదు.నాకు దక్కింది.అతను కల అనుకున్నది నిజంగా జరిగింది."

దానికి రెండవ వ్యక్తి భార్య ఇలా అంది. "పగటి కల కన్నది నువ్వు. ఎవరైనా జింకను చంపి దాన్ని ఎక్కడ దాచారో మర్చిపోగలరా? కట్టెలు కొట్టుకుంటున్న వ్యక్తి నీకు కనిపించినట్టు, జింకను చంపినట్టుగా, ఇలా నీలో నువ్వే ఊహించుకుని కలగన్నావు. జింక మనకు దొరికింది. అతనెవ్వరో కల కంటే, అది నువ్వు నిజమని ఎలా భావిస్తావు?"

"నా భార్య చెప్పిందీ నిజమే. అయినా ఎవరు కల కంటేనేం? నాకు జింక దొరికింది. నేను దాన్ని వండుకుంటాను" అనుకున్నాడు రెండవ వ్యక్తి.

ఇక కట్టెలు కొట్టుకునే మొదటి వ్యక్తి, తీవ్రమైన నిరాశతో ఇంటికి చేరి, ఆ రాత్రి జరిగిన విషయాలను మొత్తం - అంటే రెండవ వ్యక్తి తన పక్కన నడుస్తూ, తన గొణుగుడును వినటాన్ని కూడా - కలగన్నాడు. పొద్దున లేచేటప్పటికి తన కలలో జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళముందు ప్రత్యక్షం అయాయి. తన కలలో కనిపించిన జింకను పూడ్చిన గోతి తాలూకు ఆనవాళ్ళను వెతుకుతూ వెళ్ళి, అక్కడ ఉన్న అడుగుజాడలననుసరించి రెండవ వ్యక్తి ఇల్లు కనుక్కుని, జరిగింది గ్రహించి, న్యాయమూర్తి దగ్గర అర్జీ పెట్టుకున్నాడు!

న్యాయమూర్తి పూర్వాపరాలు విచారించిన మీదట తీర్పు చెప్పాడు. " కట్టెలు కొట్టుకునే వ్యక్తి - నిజమైన జింక, అబద్దపు కలతో ఆరంభించి, నిజమైన కల, అబద్దపు జింకతో ముగించేడు. రెండవ వ్యక్తికి దొరికిన జింక మొదటి వ్యక్తి కల తాలూకుది. అతని భార్య వాదనా పరిగణనలో తీసుకుంటే,, మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి ఇద్దరిదీ కలే. కాబట్టి జింక ఎవరికీ చెందరాదు. అయితే జింక తాలూకు కళేబరం నిజంగా కనిపిస్తూంది. కాబటి ఇద్దరూ జింక మాంసాన్ని చెరి సగం పంచుకోవాలి."

ఈ తీర్పు వివరాలు ఆసాంతం విన్న చెంగ్ రాజ్యపు రాజు, ఇలా అనుకొన్నాడు. " ఇది న్యాయమూర్తి కన్న కల మాత్రమే."


****************************************************************

12.

"What language is thine, O sea?"
"The language of eternal question."

"What language is thy answer, O sky?"
"The language of eternal silence."

రవీంద్రుడి సుభాషితం ఇది. ఇక్కడ "Thy" అన్నదాన్ని సత్యానికి అన్వయించుకుంటే - సత్యాన్ని ఎవరూ నిర్వచించలేరు. (నిర్వచించలేరు - అన్న నిర్వచనం తో సహా). ఏది సత్యం కాదో దాన్ని చెప్పగలరు మహా అయితే. దాన్ని ఓ శంకరుడో, ఉపనిషద్దర్శనికుడో, "నేతి" , "నేతి" పద్దతిలో, కనిపించిన ప్రతి వాదాన్ని ఆక్షేపిస్తూ వెళ్ళి, చివరకు ఓ శూన్యం (eternal silence) లో దాన్ని వెతుక్కుంటాడు. కృష్ణమూర్తి అయితే - Truth is the highest form of negative understanding- అంటాడు,

దాదాపు 2500 యేళ్ళ క్రితం, బుద్ధుడికి సమకాలికుడిగా ఓ దార్శనికుడు, ఓ ఋషి చైనాలో జన్మించాడు(ట). ఆయన పేరు లావు త్సు. బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానంలో ఉన్నప్పుడు నిర్వాణం చెందితే, ఈ మహానుభావుడు ఓ పండుటాకు చెట్టుపై నుంచీ రాలి పడటం తదేక దీక్షగా గమనించి, ధ్యానమగ్నుడై సత్యాన్ని ఆవిష్కరింపజేసుకున్నాడట. ఆ వ్యక్తి భావజాలం "తావోఇజం" గా చెప్పుకోబడింది. Tao - అంటే మార్గం. ఎలాంటి మార్గం? ఓ పక్షి గగనంలో ఎగురుతూ వెళ్ళింది. ఆ పక్షి మార్గాన్ని ఎవరూ అనుసరించలేరు.

ఎందుకంటే, గగనంలో ఆ పక్షి తాలూకు నడకల ఆనవాళ్ళు లేవు కాబట్టి. మార్గం అన్నది ఎవరికి వారు ఆవిష్కరించుకోవలసిన పరమ సత్యమే. (Truth is a pathless land). ఆ taoism లో జీవితాన్ని, సత్యాలను చెప్పటానికి ఉపయోగించుకున్న విధానం - anology. తెలుగు లో ఏమంటారో ఈ పదాన్ని? జీవితం లో శూన్యతను analogy సహాయంతో వివరించిన taoism తాలూకు కథ ఇది. ఇలాంటి కథ ఒకటి ఇక్కడ చూసి ఇదంతా వా(బ్లా)గాలనిపించింది.


****************************************************************

6 comments:

 1. చాలా బాగుంది కథ. కథ చదివాక నాకనిపిస్తుంది "ఇది చెంగ్ రాజ్యపు రాజు కన్న కల కూడా..."

  ReplyDelete
 2. ఊహూ! ఇదంతా నిజం కాదు, నా కల. నా కలలో మీరేదో కల గన్నట్లు, కలలో ఓ బ్లాగు పోస్టు వ్రాసినట్లు కనిపించింది. నాదీ కలే, మీదే కలే, ఐనా బ్లాగులో పోస్టు మాత్రం నిజంగా కనిపిస్తుంది. కనుక ఎందుకైనా మంచిదని కామెంటు వ్రాసేస్తున్నాను. ఇది నిజంగా వ్రాశానో వ్రాసినట్లు కల గన్నానో చెప్పాల్సిందిమాత్రం మీరే ;-)

  ReplyDelete
 3. @ చంద్ర మోహన్ గారు,

  :-) :-)

  @ శ్రీ : నెనర్లు.

  ReplyDelete
 4. 'కల'డందురు దీనుల యెడ
  'కల'డందురు భక్త యోగి గణముల పాలం
  (గ)'కల'డందురన్ని దిశలను
  'కల'డు 'కల'న్డనెడు వాడు 'కల'డో లేడో

  "కల యో నిజమో వైష్ణవ మాయో తెలిసీ తెలియని అయోమయములో" :-)

  అంతా కల ;)

  ReplyDelete
 5. Analogy లు బాగుంటాయికాని, (ఒక విషయాన్ని అర్థంచేసుకోవడానికి సహకరిస్తాయి) కానీ వాటిని ఆపాల్సిన చోట ఆపకపోతే చాలా పెద్ద ప్రమాదమే వస్తుంది.
  ప్రత్యేకించి మన భౌతికజీవిత సిద్ధాంతాలకు విరుద్ధంగానుండే సిద్ధాంతాలను తెలపడానికి అనాలజీలు పెద్దగా పనికిరావు. ఉదా - ఆద్వైతం, quantam mechanics etc.
  ఇక చాలా సార్లు తప్పుడు అనాలజీల వల్ల జనాలు తికమకకు గురౌతూవుంటారు . ఉదా - stock market.

  ReplyDelete
 6. ravi garu.., kada naku sariga ardam kaledandi....

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.