Monday, December 7, 2015

విశ్వనాథుల వారి గిరిక

శ్రీమాన్ రామేశ్వరశాస్త్రి గారు త్రయీవిద్యకు నిదర్శనం. భారతదేశపు ఆత్మ. సాక్షాత్తూ సుబ్రహ్మణ్యస్వామి అవతారం. ఈయన సుబ్బన్నపేటలో జన్మించారు. సనాతనవాది, సాంప్రదాయానురక్తుడు అయిన ఈయన తన భార్యల వర్ణాల విషయంలో మాత్రం ఆధునికంగా ఆలోచించి సోషలిజం పాటించారు. అనగా, ఈయన బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు స్త్రీలను వివాహమాడిరి. పంచమవర్ణమొకటి కూడా అదనంగా ఉన్నది కాబట్టి బహుశా అందుకు ప్రతీకగా ఒక ఉంపుడుకత్తెను కూడా వారు చేరదీశారు.

కాలక్రమంలో వారు తమ భార్యలయందు, తన ఉంపుడుగత్తె యందూ కూడా ఉ(అను)చితమగు సంతానములను బడసిరి. బ్రాహ్మణభార్యకు బ్రాహ్మణోచిత లక్షణాలతో ధర్మారావు, క్షత్రియభార్యకు క్షత్రియోచిత లక్షణాలతోనొక పుత్రుడు, వైశ్యభార్యకు వైశ్యోచిత లక్షణాలతోనొక పుత్రుడు, శూద్రభార్యకు పాములా వంకర తిరిగి శారీరక, మానసిక అవలక్షణాలతో, పొద్దస్తమానం చెట్ల, పుట్టల వెంబడి తిరిగే పాము వంటి ఒక కొడుకూ కలిగారు. శూద్రభార్యకే ఇలాంటి కొడుకు కలుగుట యాదృచ్ఛికం. ఆ బాలునికి "పసిరిక" అని పేరు పెట్టారు. ఉంపుడుగత్తెకూ ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పేరు గిరిక.

అందరూ కాలక్రమంలో పెరిగి పెద్దవారయ్యారు. ధర్మా’రావు’ తపస్సూ, ధ్యానమూ, స్వాధ్యాయమూ, వేదాధ్యయనమూ వంటివేవీ చేయకపోయినా పేరుకు తగినట్టు ధర్మమూర్తి. పుట్టడంతోటే అతనొక జ్ఞాని. ఈతను గిరికను చెల్లెలుగా చూచుకుంటూ ఉంటాడు. 

గిరిక పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడామె మహాసౌందర్యవతి. ఈమెకు తన కులం పట్ల, తన జాతి పట్ల, అంతులేని వేదన. పుట్టుకతోనే తనొక నీచురాలినని, తన కులం నీచకులమని ఆమెకు తెలిసి వచ్చింది.  తన తండ్రి శ్రీ మాన్ రామేశ్వర శాస్త్రి గారి పవిత్రత, దైవాంశ, మహత్త్వమూ - కన్న కూతురి కులాన్ని ఉద్ధరించడానికి పనికిరాక, ఊరిలో అందరి జీవితాలనూ ఉద్ధరించుటకు పనికి వచ్చింది.అది ఏమి దరిద్రమో యేమో - తనకు తండ్రి కులం తాలూకు పవిత్రత రాకపోయినా, తల్లి కులం తాలూకు నీచత్వం మాత్రం తగులుకుంది! ఇది యే జన్మాంతరసంచితపాపమో! ఆ న్యూనతా భావంతో ఆమెలో దైన్యం అంకురించింది. ఆమెను ధర్మారావు ఓదారుస్తున్నాడు. ఆమె పట్ల ఎనలేని సానుభూతి కనబరుస్తున్నాడు. 

ఈ దైన్యం మితి మీరి పోవడంతోటి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలాగైనా సరే తన కులం తాలూకు నీచత్వాన్ని తాను ప్రక్షాళన చేసుకోవాలి. కానీ ఎలాగ? నీచత్వం సబ్బుతో కడిగితే పోయే గబ్బు కాదు కదా. అందుకని ఆమె కృష్ణస్వామి దేవాలయంలో దేవదాసీ కావడానికి నిశ్చయించుకుంది. ఆ స్వామినే మనసారా నమ్మి, భర్తగా భావించి ఆ దేవాలయంలో నృత్యగాన విశేషాలతో పండుగలసమయాలలో స్వామిని అర్చిస్తూ, ఆ విధంగా ’తన’ (తల్లి) కులానికి ఉచితమైన పని చేస్తూ, చివరకు స్వామిలో ఐక్యం అయి, ఆత్మార్పణ గావించుకొని తన జన్మాంతర సంచిత పాపాన్ని కడిగివేసుకుంటుంది. అలా కడుక్కుంటే, ఆ తర్వాత వచ్చే జన్మలో ఆమెకు మంచి జన్మ లభిస్తుంది. ఇది ఆమెకు లైఫ్ టైమ్ అజెండా.

గిరిక తల్లి రత్నావళి నీచురాలు. నీచకులజురాలు. కానీ అమెను ఉంచుకున్న రామేశ్వరశాస్త్రి గారు ధర్మమూర్తి. ఆమె నీచత్వం ఆయనకు అంటదు. "ధర్మేషు అర్థేషు కామేషు మోక్షేషు చ నాతిచరామి.." అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి, వివాహం చేసుకోలేదు కాబట్టి, ఆమె నీచత్వమనే (కుల) ధర్మంతో ఆయనకు సంబంధం లేదు. 

తుచ్ఛమైన లౌకిక విషయాలపై అనురక్తిని పెంచుకుని అవి తీరక మరణించడం వ్యర్థం. సాక్షాత్తూ భగవంతునికి మనస్సునర్పించి, తన కులానికి పట్టిన నీచత్వాన్ని కడిగివేసుకోవాలని సంకల్పించడం ఆత్మార్పణ. ఇదొక మహనీయమైన చర్య. ఈ మహత్వమైన చర్యను, గిరిక దేవదాసీ కావడాన్ని ధర్మారావు సంపూర్ణంగా, ఇష్టపూర్వకంగా ఆమోదించాడు. అంతే కాక, ఆమెకూ, పాఠకులకూ "భోగాంగన వేరు, వారాంగన వేరు" - అని కూడా నచ్చజెప్పాడు.

ఈ విధంగా ధర్మమూర్తి ధర్మారావు చెల్లికి ’అమ్మాయీ! ఈ డాన్సులవీ ఎందుకు? మంచి అబ్బాయిని చూసి చక్కగా పెళ్ళి చేస్తా, భర్తతో కాపురం చేసుకో, పిల్లలను కను,భర్తను, ఆ పిమ్మట సంతానాన్ని ఆశ్రయించి సుఖపడు’ అని తను వ్యక్తిగతంగా పాటించే నశ్వరమైన లౌకిక ధర్మాలు చెప్పకుండా, ధర్మబద్ధంగా ఆమెను దేవదాసీ కావడానికి ప్రోత్సహించాడు. ఆమెకు నాట్యశాస్త్రమూ, అలంకారశాస్త్రమూ వీటికి చెందిన పాఠాలు కూడా చెప్పసాగినాడు. గిరిక ఆత్మార్పణం (Neo Suicide?) చేసుకోబోతున్నదని కూడా ధర్మారావు గారికి తెలుసు. ఈ విషయాన్ని అతను తన భార్య అరుంధతికి చెవిలో చెబుతాడు.చెల్లెలు ఛస్తుందని తెలుస్తున్నా, ధర్మానికి కట్టుబడి, ఆమె శారీరక లేదా మానసిక రోగానికి మందు ఇప్పించక, ఆమె జీవితాన్ని దేవదాసీ తనానికి అంకితం చేసేలా ప్రేరేపించి, ఆమె ఛావును ఆమె ఛావనివ్వడం ధర్మారావు గారి ఉత్కృష్టమైన నీతికి, అన్నగా ఆతను ఆచరించే ఉదాత్తమైన ధర్మానికి ప్రతిబింబంగా స-హృదయులైన పాఠకులకు అర్థమవుతుంది. అరుంధతి, ధర్మారావులే కాక ఇతర బంధువర్గమూ ఆమెను ఈ విధంగా ఆదరిస్తున్నారు. 

గిరిక కృష్ణస్వామిని ఆరాధిస్తూనే ఉన్నది. ఆ ఊళ్ళో ఒకరిద్దరు ఆమెను కామిస్తే వారిబారి నుండి ధర్మారావు గిరికను కాపాడినాడు. గిరికకూ వదిన అరుంధతికీ కూడా మంచి అనుబంధం ఉంది. అప్పుడప్పుడూ ఆమె కూడా గిరికతో బాటూ దేవాలయానికి వెళుతుంది. అంతే కాదు, ఆ వదినామరదళ్ళ మధ్య సరస సంభాషణలూ చోటు చేసుకుంటూ ఉంటాయి.

"ఏవమ్మో! నేనూ గుడికొస్తే మీ ఆయన నిన్నే చూస్తూ మమ్మల్ని గమనించడేమో!" (మీ ఆయన = శ్రీకృష్ణుడు)
"ఆయన భగవంతుడు.అందరినీ సమానంగా ఆదరిస్తాడు"
"సరసురాలివే!"

ఇలాంటివే కాక "నీకింత అవిదితశ్రోణీభరమేలనే?" (శ్రోణి = జఘనం = కటిభాగం = పిరుదులు) వంటి చిలిపి సంబోధనలూ వారిద్దరి మధ్యా కద్దు.

గిరిక ధర్మారావుకు చెల్లెలుగా ఈ విధంగా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ, డాన్సులవీ చేసుకుంటూ చివరికి ఒక కృష్ణాష్టమి నాడు - నృత్య, నాట్య సంగీతాదులతో ఎందరినో మెప్పించి ప్రాణత్యాగం చేసింది.

ఆమె దేవదాసీ కావడానికి మూల కారణమేమిటి? ఆమె కులం తాలూకు నీచత్వప్రక్షాళన. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? లేదా? ఆమె కులానికి పట్టిన నీచత్వం పోయిందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఉండదు కూడా. రచనలో పాత్ర - రచయిత యొక్క (స్వార్థ) సిద్ధాంతానికి ఉపయోగపడిన తర్వాత ఆ పాత్ర లక్ష్యం గురించి పట్టించుకునేదెవరు? 

రచయిత ఆధ్యాత్మిక విదుడు, బ్రాహ్మీమయమూర్తి. అలాంటి రచయిత రచనలో గొప్ప విషయాలు వెతకటమే పాఠకుల పరమావధి. జ్ఞానపీఠం తెచ్చుకున్న రచయిత తాలూకు రచనలో ఏం రాసినా తప్పు లేదు. పీఠం ఎక్కారా లేదా అన్నది ముఖ్యం. రచనలో నిర్దయ, క్రౌర్యం, అసహజత్వం, కుతర్కం, మతిమాలిన విషయాలు - ఇవన్నీ పాఠకులకు అనవసరం.

***************************************

వేయిపడగలు అనే వచన కావ్యంలో రచయిత గారు చిత్రించిన గిరిక పాత్ర స్థూలంగా ఇది. ఈ పాత్ర ద్వారా, పాత్ర మూలంగా ఆ రచయిత ఎంతో జ్ఞానాన్ని పంచారు. హంస లాగా మంచి విషయాలను మాత్రమే స్వీకరించాలి. నవలలో పాత్ర కృష్ణస్వామికి అంకితమైతే, అది భక్తి కింద భావించడం పాఠకుల బాధ్యత. ఆమె కులమూ, ఆ కులానికి పట్టిన చీడా, పవిత్రాశయం (ఆమె కులానికి అంటిన గబ్బు తొలగించుకోవడం) కోసం పోయిన తుచ్ఛమైన ప్రాణం గురించి ఆలోచించకుండా పాఠకులూ ధర్మారావులా ధర్మమూర్తులు కావాలని ఈ పాత్ర ద్వారా గ్రహించాలి. ధర్మారావులానే పాఠకులూ ఉదాత్తంగా ఉండాలని పాత్ర ద్వారా రచయిత చెప్పించినాడు. ఇది ఆధునికసాహిత్యంలోనే గొప్పదైన వేయిపడగలలో గిరిక పాత్ర, ఆ పాత్రల చుట్టూ ఉన్న మహత్వమున్నూ.