Tuesday, August 31, 2010

సవర్ణదీర్ఘ సంధి for dummies!

తెలుగులో మౌలికాంశం ఒకటి తెలీకండానే ఇన్నిరోజులు బతికేశానని నిన్న తెలిసింది. అదీ సంస్కృత వ్యాకరణం చదువుతుంటే. ఈ కథాకమామీషు ఇది.

చిన్నప్పుడెపుడో తెలుగు టీచరమ్మ సవర్ణదీర్ఘసంధి చెబితే ఊకొట్టాం, ఆ సూత్రం నిర్వచనం ఇలా ఉంటుంది.

అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును. (ఈ సూత్రం వికీపీడియాలో కొట్టుకురాబడినది)

బానే ఉంది, సవర్ణాలంటే? దీనివెనుక ఓ పెద్ద కథ. ఆ కథ కోసం సంస్కృతానికెళ్ళాలి.

**********************************************************************************

సూత్రము: తుల్యాస్య ప్రయత్నం సవర్ణమ్. (౧-౧-౯)

స్థానము, (అభ్యంతర) ప్రయత్నము ఈ రెండునూ ఏ వర్ణమునకు మరే వర్ణముతో తుల్యముగా నుండునో అవి రెండును ఒకదానికొకటి సవర్ణములనబడును.

స్థానము: అర్థమును చెప్పాలన్న బుద్ధి మనస్సును చేరుతుంది. ఆ మనస్సు శరీరంలో అగ్నిని (energy) ని ప్రజ్వలింపజేస్తుంది. ఆ అగ్ని వాయువును ప్రేరేపిస్తే, ఆ వాయువు తగిన ముఖావయవానికి తాకడంతో ధ్వని ఉత్పన్నమవుతుంది. ఏయే స్థానంలో వాయువు తాకితే ఏ శబ్దం వస్తుందో ఈ లంకెలో వివరంగా చెప్పారు.

ప్రయత్నం: కేవలం ఆకాంక్ష ఉంటే సరిపోదుగా, ప్రయత్నం కూడా కావాలి. అంటే "ప" అనే అక్షరం పలుకాలంటే రెండు పెదవులు కలువడం, విడివడడం అన్న క్రియాజాతము జరుగాలి. దాన్నే యత్నము అంటారు. అధికమైన యత్నం - ప్రయత్నం. ఇవి రెండు రకాలు. అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం. బాహ్య ప్రయత్నం ప్రసక్తి సవర్ణనిర్ణయంలో లేదు.

అభ్యంతర ప్రయత్నం, స్పృష్టము (పూర్తిగా స్పర్శించుట),ఈషత్ స్పృష్టము (కొంచెము స్పర్శించుట),వివృతము (విడివడుట), ఈషద్వివృతము (కొంచెము విడివడుట), సంవృతము అని ఐదు రకాలు.

స్థానము, ప్రయత్నము రెండూ కలిసిన వర్ణాలే సవర్ణాలు. స్థానమొక్కటీ, లేదా ప్రయత్నమొక్కటీ కలిస్తే లాభం లేదు. ఉదా: "ప", "ఫ" సవర్ణాలు.

**********************************************************************************

ఇప్పుడు మళ్ళీ సంధికొద్దాం.

అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగుచో - అంటున్నాడు. మనం "అ" ఒక్కటి తీసుకుని సూత్రం ప్రతిక్షేపిద్దాం. "అ" కు సవర్ణాలు వెతకాలి.

"అ" కు సవర్ణం అంటే,
౧. "అ" అనే ధ్వని ఎక్కడ పుడుతుందో, అక్కడే సదరు సవర్ణమూ పుట్టి ఉండాలి.
౨. ఆ ధ్వని పుట్టడానికి జరిగిన ప్రయత్నం సవర్ణానికి కూడా వర్తించాలి.

"అ" అనే ధ్వని కంఠంలో పుడుతుంది. (అకుహ విసర్జనీయానాం కణ్ఠః)

ఇంకా కంఠంలో పుట్టేవి, "అ","ఆ", "హ", "హా", మరియు "క" . వీటిని రెండవ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం.
(అంత అవసరం లేదు నిజానికి. ఎందుకంటే, సవర్ణదీర్ఘసంధి అచ్చులకు మాత్రమే అని చెప్పబడియున్నది. కానీ కొంత సరదా కూడా తీర్చుకుందాం.)

ఈ క్రింది పట్టిక చూడుడి.
వర్ణము - అభ్యంతర ప్రయత్నము
అ - వివృతము
ఆ - వివృతము
హ - ఈషద్వివృతము
హా - ఈషద్వివృతము
క - స్పృష్టము

అంటే "హ" కు "అ", "ఆ" లకు అభ్యంతర ప్రయత్నం తేడా ఉంది కాబట్టి, సవర్ణం అనే పొత్తు కుదరదు. అంచేత "అ", కు "అ", "ఆ" మాత్రమే సవర్ణాలు.

ఉదా:
దైత్యారి = దైత్య+అరి
విశ్వాత్మ = విశ్వ + ఆత్మ
చంద్రాస్య = చంద్ర + ఆస్య

ఇలానే మిగిలిన అచ్చులకూ సవర్ణాలు తెలుసుకోవచ్చు.

ఏ ధ్వని ఏ స్థానంలో పుట్టిందో గుర్తుపెట్టుకోడానికో శ్లోకం పాణిని చెప్పారు.

అకుహ విసర్జనీయానాం కణ్ఠః
ఇచుయశానాం తాలుః
ఋటురషాణాం మూర్ధా
ఌతులసానాం దన్తాః
ఉపూప్ధ్మానీయా నామోష్టౌ
ఞ మ ఙ ణ నానాం నాసికాచ
ఏదైతో కణ్ఠతాలుః
ఓదౌతోః కణ్ఠోష్టం
వకారస్య దంతోష్టం
జిహ్వమూలీయస్య జిహ్వమూలమ్
నాసికా2నుస్వరస్య.


ఇక అభ్యంతర ప్రయత్నాలను చూద్దాం

అ, ఇ, ఉ, ఋ, ఌ, ౡ, ఏ, ఓ, ఐ, ఔ - వివృతము
క వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము - స్పృష్టము
య,ర,ల,వ - ఈషత్పృష్టము
శ,ష,స,హ,ః,ం - ఈషద్వివృతము

ఈ సవర్ణ కథలో చివరి ట్విష్టు ఏమంటే - ఋ వర్గము, ఌ వర్గము ఒకదానికొకటి (అంటే "ఋ" కు "ఌ") పై సూత్రం ప్రకారం సవర్ణాలు కాకపోయినప్పటికీ, వీటికి ప్రత్యేక కోటా కింద "ఋ" ను "ఌ" కు సవర్ణంగా చేర్చారుట. ఋ, ఌ లను ప్రయోగించి, సవర్ణదీర్ఘసంధి చేసుకోవచ్చా అనేది తెలియకుండా ఉంది. అలాంటి ప్రయోగం ఎక్కడైనా ఉందేమో పెద్దలెవరైనా చెబితే బావుణ్ణు.

**********************************************************************************

Disclaimer: పైన చెప్పిన వివరాలు ఓ పుస్తకంలో నాకు అర్థమైన పరిధిలో తెలుసుకుని వ్రాసినవి. తప్పులుండవచ్చు. సరిదిద్దితే సంతోషం.

కృతజ్ఞత - పాణిని లఘుకౌముది మార్గదర్శిని , ఆచార్య శలాక రఘునాథశర్మ.

Sunday, August 15, 2010

తెలుపు

ఏదో మారుమూల పల్లెటూళ్ళో
నేలను తప్ప ఏదీ ఎరుగని మమ్మల్ను
మా కన్నతల్లి లాంటి నేలకు దూరం చేసి
భూమి శిస్తులు పెంచి వ్యవసాయమంటేనే భయంపుట్టేలా చేసి

మా చదువులను మాకే కొత్తగా నేర్పి
మా పురాణాలు, చరిత్రను అర్థం లేనిదని ఎద్దేవా చేసి
మా తోటి వృత్తి పనివాళ్ళ
కడుపు కొట్టి, వాళ్ళ అమ్మల్ని వేశ్యల్ని చేసి

మా సొత్తు దోచుకుని, మమ్మల్ని పేదల్ని చేసి
తిరిగి మా పేదరికాన్నే అవహేళన చేసి
మాలో జాతివైషమ్యాలను నింపి
మా సమస్యలను మమ్మల్ని పరిష్కరించుకోనీకుండా
మీరు కొత్త పరిష్కారాలను కనుక్కుని
వాటిని మాపై రుద్ది

చివరికి పోతూ పోతూ కూడా మా
గుండెలను చీల్చి

మాకో కొత్త జీవితం ప్రసాదించిన తెల్లవాడా
మేమేమయినా పర్లేదు,
నీవు బావుండాలి. చల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలి.

మా క్షమయే మిమ్మల్ని మీకు
కొత్తగా పరిచయం చేసే స్వాతంత్ర్య దినమౌతుందన్న
ఆశతో - మా స్వాతంత్ర్య దినం రోజు
నీకోసం ఓ అమాయకుడు చేస్తున్న విన్నపం.

Sunday, August 1, 2010

మరియొక ఆంగ్ల చిత్రరాజము

ఆంగ్ల చిత్రమును జూచి అనేక దినములు గడచినవి. అందులకై ఇంచుక సేద దీరుటకై ఈ దినమున నొక్క ఆంగ్ల చిత్రరాజమును గంటిని. ఆ చిత్రరాజము యొక్క నామము inception.

చిత్రము చూచుచున్నంత సేపునూ, ఏదియోనొక్క ఊహాలోకమున మదీయమానససారసము విహరించుచునే యున్నది. ఏమని జెప్పవలె? అదియొక్క అద్భుత లోకము! అనితరసాధ్యమయిన ప్రపంచము! ఈ చిత్రమునకు కథ చెప్పుట అత్యంయ క్లిష్టతరమైనయట్టిది. అయిననూ నా శక్తికొలది ప్రయత్నింతును.

కథ:

ఈ కథలో ముఖ్యపాత్రధారి పేరు కోబు. ఈతని వద్ద కొందరు వ్యక్తులు పనిచేయుచుందురు. ఈ కోబ్ అనునాతడు ఓ పరికరము సహాయమున ఎదుటి వ్యక్తి మనమున కలలను కలుగజేసి, ఆ కలలో అతని మెదడున ఒక ఊహను స్థాపించి, ఆ ఊహ పరిణామమును తమకనుకూలముగా మలుచుకొనును. ఎంత క్లుప్తతమముగా జెప్పిననూ ఎంత జటిలముగానున్నదో గమనించితిరి కదా!

ఇక కలలు నిక్షిప్తపరుచుటకు కొన్ని నియమములు గలవు. కలలో తమ అనుభవములను పొందుపరుచరాదు. కలలో పదిగంటలు జరుగు ప్రక్రియ, చేతనా ప్రపంచమున పదినిముషములే గావచ్చును. కలమధ్యలో అధికముగా మెదడు శ్రమకు గురయినచో సదరు కలగనునాతని మెదడు విపత్కరమగు పరిస్థితిలో చిక్కుకొనును. తను ఉన్నది కలయందా కాదా అని ఎరుగుటకు, ఓ చిన్న సంజ్ఞాసూచకము అవసరమగును. కోబు తనవద్ద ఓ బొంగరమును సంజ్ఞాసూచకముగా వాడుచుండును.

ఈ బృందము జపాను దేశమందు ఒక వాణిజ్య ప్రముఖుని ప్రత్యర్థిని వశపర్చుకుని, తన ద్వారా, తన వ్యాపారమునే కూల్చుటకు ప్రేరేపించెడి లాగున ఓ పథకమునల్లుదురు. అందులో భాగముగా, కలలు సృష్టించుట, కలయందు మరియొక కల, అందు మరొకటి, ఇవ్విధముగా ఊహాప్రపంచమున గొనిపోవుదురు. 

మధ్యలో కోబు యొక్క భార్యామణి తారసపడును. ఆమె కలల ప్రపంచమునబడి తననుతాను పోగొట్టుకొనినయట్టి ఒక అభాగిని.

ఈ చిత్రరాజమునందు పోరాట దృశ్యములు శూన్యగురుత్వాకర్షణ యున్న యొక కల్పిత స్థలమున చిత్రీకరింపబడి ఉత్కంఠగొలుపును.

ఇక కొన్ని దృశ్యములలో ప్రపంచము మూసికొని పోవుట, ఊహాలోకమున అనేక భవనములు కంటి యెదురుగ ప్రత్యక్షమగుట వంటి ఉత్కంఠభరితమైన దృశ్యములు గలవు.

ఈ చిత్రరాజమును చూచుటకు మిక్కుటమైన ఏకాగ్రత అవసరము. అయిననూ ఓ రెండు గంటలపర్యంతము ఊహాలోకమున విహరించుట తథ్యము.

లియొనార్డో డీకాప్రియో నను ప్రముఖ నటుడు కోబు పాత్ర పోషించెను.