Monday, August 31, 2009

జానెడు సైజు జానపద నవలలు


"అబ్బా, సెగట్రీ, ఎప్పుడూ పనులూ బిగినెస్సేనా, మడిసనింతర్వాత కూసింత కలాపోసనుండాలి. పరగడుపునే కూసింత పచ్చిగాలి పీల్చి ఆ పత్యచ్చ నారాయుడి సేవజేసుకోవద్దూ".............

ఇంచుమించుగా అదే పద్ధతిలోనే -

"అబ్బా, ఎప్పుడూ చందమామ, బాలమిత్రలేనా. చదివి చదివి బోరు కొడతా ఉంది. కొత్తగా ఏమైనా కొనక్క రావా అమ్మా?".................

నా భ్రాతాశ్రీ అమ్మ దగ్గర అర్జీ పెట్టుకున్నాడు చిన్నప్పుడు.

ఇప్పుడంటే చందమామ చుట్టూ బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా ముసురుకుంటున్నాం కానీ, అప్పట్లో చందమామ రాగానే, దానికోసం - అక్కకూ చెల్లికీ, అన్నకూ తమ్ముడికీ, అక్కకూ తమ్ముడికీ...ఇలా ఏ ఇంట్లో ఏ కాంబినేషన్స్ ఉన్నాయో వారందరికీ మధ్య ఓ సంకుల సమరం జరిగి, ఎట్టాగోలా చందమామ దక్కిన తర్వాత - తీరా చూస్తే, ఓ గంట కంతా పుస్తకం చదవడం అయిపోతుండేది. తిరిగి ఇంకో నెల వరకు వెయిటింగు.

అదుగో..ఆ పరిస్థితి చూసి చూసి, విసిగి వేసారి ఒక రోజు మా అన్న అమ్మ దగ్గర పైన చెప్పిన రకంగా అర్జీ పెట్టుకున్నాడు. ఆ అర్జీ అమాయకమైన అర్జీ కాదు. అఖండుడతను. అంతకు ముందే బాలభారతి పుస్తకం చివరి అట్టమీద రెండు పొట్టి జానపద నవలల ఆడ్స్ చూసి పెట్టుకున్నాడు.

"ఏమి చెయ్యమంటావురా? " అమ్మ విసుక్కుంది.

"వేరే రకం పుస్తకాలు కొనుక్కుంటా". అమ్మ ఏ కళనుందో ఏమో, "సరే. ఏ పుస్తకం" అడిగింది.చెప్పాడు భ్రాతాశ్రీ.

"ఇవా?" కొంచెం సందేహించింది మాతాశ్రీ. (ఇవి దయ్యాలు, భూతల కథలు కదా. ఇవి పిల్లలు చదవచ్చా?)

"సరే. ఒక్క పుస్తకం మాత్రమే". బడ్జెట్ సాంక్షన్ చేసింది మా అమ్మ. అప్పుడా పుస్తకం ఖరీదు 1-75 పైసలు.

చందమామల నుండి మొట్టమొదటి సారి అప్ గ్రేడ్ అయిన వైనం అదీ. నేను చదివిన మొట్టమొదటి పొట్టినవల పేరు గుర్తు లేదు, కానీ ముఖపత్రం, చూచాయగా కథ గుర్తుకు ఉన్నాయి.

ఈ నవలల్లో కథ 80 వ దశకం తెలుగు సినిమాల్లోలాగ కొన్ని ఫిక్సెడ్ ఫార్ములాలు.

ఫార్ములా 1 : ఒక రాజుకు ఎన్ని నోములు నోచినా పిల్లలు కలుగరు. చివరికి ఎలాగోలా ఒక పాప పుడుతుంది. యువరాణీ వారు యుక్తవయస్కులవగానే, ఎవడో పొద్దుపోని మాంత్రికుడొకడు ఆమెను ఎత్తుకుపోతాడు. ఇక ఒక క్షత్రియ యువకుడు ఆమెను వెతుకుతూ వెళతాడు. చివరికి ఎక్కడో సప్త సముద్రాలకవతల ఏ చిలుకలోనో సేఫ్ గా ఉన్న ప్రాణాలను తీస్తాడు. యువరాణి + యువరాజు ఆల్ హాపీస్. యువరాణి కాకపోతే, రాజుకున్న జబ్బు మాన్పించటం - ఇక్కడ వెళ్ళటం ముఖ్యం, ఎందుకు అన్నది కాదు. అలాగే చివరకు మాంత్రికుణ్ణి చంపుతాడు అన్నది ముఖ్యం కాదు, మధ్య దారిలో ఏం జరిగింది అన్నది మాత్రమే ముఖ్యం.

ఫార్ములా 2 : ఒక రాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తుంటాడు. (అంటే మరీ జోకొట్టటాలు, గోరు ముద్దలు తినిపించడాలు ఇలా కాకుండా). అతని సేనాపతి దుర్జయుడికి ఈ కాన్సెప్టు నచ్చదు. రాజ్యాన్ని దొంగగా తన ఏలుబడిలోకి తెచ్చుకోవాలని చూస్తాడు. ఇంతలో ఊళ్ళో ఒక ముసుగు వీరుడు బయలుదేరి అక్కడక్కడా కొన్ని వీరోచిత కృత్యాలు చేస్తుంటాడు. ఈ ముసుగు వీరుణ్ణి యువరాణి ప్రేమిస్తుంది. ఈ ముసుగు వీరుడు చివరికి ఆ దుర్జయుడి ఆటకట్టిస్తాడు. ఇక్కడా కొన్ని పాయింట్లు. ఆట కట్టిస్తాడన్నది ముఖ్యాం కాదు. ఎలాగ అన్నదే మనకు ముఖ్యం.

ఇవి రెండూ కాక మూడో రకం నవలలు. ఇవి పురాణాలో, భారతంలో ముఖ్య పాత్రలో, అరేబియన్ నైట్స్ కథలో,... ఇలాగ వేటి మీదో ఆధారపడి ఉంటాయి. ఇవండీ రసగుళికలు.

బహుళ జాతి సంస్థల్లో హెచ్ ఆర్ వాళ్ళు హోరెత్తించే, ప్రోయాక్టివ్ థింకింగులు, పాజిటివ్ అవుట్ లుక్కులు, హై ఎనెర్జీ లెవెల్లు, యాంటిసిపేషన్లు, రిస్క్ మిటిగేషన్ ప్లాన్లు....ఇలాంటివన్నీ ఈ జానపద నవలల్లో హీరోలకు అలవోకగా స్వతః సిద్ధంగా ఉంటాయి. హెచ్ ఆర్ వారు ఇచ్చే టుమ్రీ ట్రయినింగులకన్నా, ఈ పుస్తకాలు చదవడం చాలా లాభదాయకం.

పఠనాసక్తి ని అమాంతం ఆకాశానికెత్తే ఇలాంటి పుస్తకాలు ఈ కాలం పిల్లలకు అందకపోవడం చాల పెద్ద దురదృష్టం. ఇన్ఫర్మేషన్ యుగం కదా. ఇన్ఫర్మేషన్ ముఖ్యం, ఇమాజినేషను కాదు! పైగా వెధవ డబ్బా ఉండనే ఉంది. ఇక ఇవన్నీ ఎందుకూ?

ఈ జానపద నవలలు, బుజ్జాయి, బాలభారతి, బొమ్మరిల్లు - ఈ సంస్థలు ముద్రించేవి అప్పట్లో. బుజ్జాయి లో "కేశి" అనే ఆయన బొమ్మలేసే వారు. ఎంతచక్కగా ఉండేవో అవి. ఆ "కేశి" గారు చందమామ పత్రికలోనూ బొమ్మలేశారు.

తలవని తలంపుగా నాకు ఈ జానపద నవల నిధి సంవత్సరం క్రితం దొరికింది. ఇప్పటి వరకు ఆ నవలలు పూర్తీ చేయలేదు. చిన్న పిల్లాడికి లాలీపాప్ దొరికితే ఎక్కడ అయిపోతుందో అన్నట్టు నిదానంగా లాగిస్తాడు కదా - అదే కాన్సెప్టు నాదీను.

అన్నట్టు నాకు దొరికిన నవలలకుప్పలో, సంస్కృత నాటకాలయిన రత్నావళి (శ్రీ హర్ష విరచితం) , మృఛ్ఛ కటికం (శూద్రకుడు), కథా సరిత్సాగరం (సోమదత్తుడు), ఇంకా సింద్ బాద్, అల్లా ఉద్దీన్ వంటి అరేబియన్ నైట్స్ కథలు ఉన్నాయి.

సుదూర భవిష్యత్తులో ఓ అందమైన రోజు - నా మనవరాలికి/మనవడికి ఈ కథలు చదివి వినిపిస్తాను, ఆ పాప రాజకుమారుడు మాంత్రికుడిని చంపక ముందే నిద్రపోతుంది. - ఇదీ నా అరుదయిన పగటి కల.

Friday, August 21, 2009

నూరు టపాల సింగారం

ఎట్టకేలకు....నేనూ హండ్రెడ్ షాట్ వాలా సరం పేల్చాను.

రెండేళ్ళు కావస్తూంది, బ్లాగ్లోకంలో అడుగుపెట్టి. నేను బ్లాగు మొదలెట్టిన విధంబెట్టిదనిన .......... మామూలే. ఆదివారం ఈనాడు అనుబంధం చదివి. చదవగానే బాడీ లో మూవ్ మెంట్స్ వచ్చాయి. ఆవేశం తన్నుకొచ్చింది, అదీ కాక ఆ వ్యాసంలో డాక్టర్ ఇస్మాయిల్ గారని మా సీమ డాక్టర్ బ్లాగు గురించి రాశారు! తట్టుకోలేక జూనియర్ ఎన్ టీ ఆర్ "ఆది" సినిమాలో లాగా, "ఎన్నాళ్ళిలాగ", "ఎన్నాళ్ళిలాగ" అని మనసు ఆక్రోశించింది. జనాలు నా రాతలు మిస్ అవుతున్నారు కదా అన్న భావన కుదిపేసింది. (అక్కడికి నా సోది వినడానికిక్కడ అందరూ కాసుక్కూర్చున్నట్టు) ఏదో చేసెయ్యాలి అని ఊగిపోయాను. ఆఫీసుకెళ్ళి చూస్తే అక్కడ బ్లాగర్.కాం వంటి తుచ్చమైన వాటికి పర్మిషన్ లేదు!

ఆ తర్వాత 2007 ఆగస్ట్ లో ఆన్ సైట్ తగిలింది. వాడుకోడానికి లాప్ టాప్ ఇచ్చారు ఆఫీసుగాళ్ళు. రూమ్ లో ఇంటర్నెట్ ధారలై ప్రవహిస్తూంది. అంత ఇంటర్నెట్ తేరగా దొరికే సరికి ఓ రెండు రోజులు అందరు మగాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ తేరగా దొరికితే ఏం చేస్తారో ఆ పనులు చేసి, విసుగెత్తి, బ్లాగుల గురించి చూశాను. త్రివిక్రం గారి బ్లాగు మొట్టమొదట తగిలింది. ఆ తర్వాత రాధిక గారి స్నేహమా బ్లాగు. అంతకు ముందు ఇస్మాయిల్ గారి గురించి విన్నారుగా. ఇదిగోండి, ఈ ముగ్గురే నేను బ్లాగడానికి మూలకారణమైన త్రిమూర్తులు. రానారె, ప్రవీణు, కొ.పా గారు, తదితరులు మొదట్లో రాసిన సోదంతా చదివి ప్రోత్సహించారు. మేధ (నాలో నేను) కూడా ఇంచుమించు అదే టైం లోనే బ్లాగులు మొదలెట్టారనుకుంటా. కాబట్టి ఆమె ఏమి రాస్తున్నారో చూసేవాణ్ణి రెగ్యులర్ గా.

సరే బ్లాగుకు ఏం పేరు పెడదామా అని "నీహారిక" అని డిసైడ్ చేసి, ప్రయత్నిస్తే, ఆ పేరుతో ఎవరో బ్లాగేస్తున్నారు. ఆ తర్వాత "హరివిల్లు", "ఉత్పలమాల" ఇలా ప్రయత్నించి, అవేవి కుదరక, చివరికి మాస్ టైటిల్ ప్రయత్నిస్తే, గూగులమ్మ ఓకే అంది. అదీ టైటిలు కథ.


రాద్దామనుకున్నది పేరడీలు. సినిమా రివ్యూలు. (నాకు కూసింత అనుభవం ఉండేది వాటిలో. మా మిత్రుల వెబ్ సైట్లు బలయ్యాయి నా రాతలకు) ఇప్పుడు రాసేవి చూస్తే, మళయాళం క్లాసిక్ సినిమా కథలా నా రాతలు నాకే అర్థమయి చావడం లేదు.

చాలా రోజులు ఆఫీసులో ఆఫీసుటైం లో బ్లాగిన తర్వాత (ప్రాక్సీ కనుక్కుని, దాని ద్వారా లాగిన్ అయి), మొన్నామధ్య మార్గదర్శిలో చేరకుండానే ఓ లాప్ టాప్ కొనుక్కున్నాను. అదీ నా సెల్ఫ్ డబ్బా.

వెనక్కి తిరిగి చూసుకుంటే -


ఈ రెండేళ్ళలో, కొన్ని నవ్వులు, కొన్ని చమక్కులు, ఇంకొన్ని చురుక్కులు, కొంచెం అమాయకత్వం, కొంచెం ఆస్తికత, కొంచెం తిరగబడ్డ ఆస్తికత్వం, అస్తవ్యస్తమైన ఆలోచనలు, కుదురుగా ఉండలేని తలబిరుసుతనం,
జ్ఞాపకాల అల్మారాలో వెలికితీతలు, హృదయమనే భూగర్భంలో నుంచి తవ్వుకున్న అనుభూతుల జలాలు,

"పుస్తకం" లో వెలగబెట్టిన కబుర్లూ..

అబ్బో.... నా రేంజుకంటే చాలా ఎక్కువే వెలగబెట్టాను!!

నిజానికి నా రాతల్లో చాలా తప్పులు నాకే కనిపిస్తాయి. అవి అలా ఉంటేనే బావుంటుందని నా అవుడియా.


నన్ను అనవసరంగా రాతగాణ్ణి చేసి, నా సోది ఓపికగా విన్న వారికి, వింటున్న వారికి, ప్రోత్సహించిన, ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు (బిల్ కుల్ ముఫ్త్). వీవెన్ గారికి కృతజ్ఞతలు. ఈ రెండేళ్ళలో రెండు సార్లు మాత్రం, ఎందుకొచ్చిన సోది, మానేద్దామనుకున్నాను. తిరిగే కాళ్ళు, తిట్టే నోరు ఊరుకోవు అని సింద్ బాద్ చెప్పినట్టు,మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్నాను. బ్లాగులు అన్నవి తెలియక ముందు, రాయలసీమ వాణ్ణి అని చెప్పుకోవాలంటే - ఓ గోళీలాట ఆటగాడు, క్యారమ్స్, బిలియర్డ్స్ ఆటగాళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయే వాణ్ణి. ఇప్పుడు షర్ట్ కున్న ఓ బటన్ విప్పేసి చెప్పుకుంటున్నాను, నేనో సీమ బ్లాగరిని (రచయితను కాకపోయినా) అని.

అన్నట్టు నా సోది రాతల వల్ల కొందరు సహృదయులను కలిసే అవకాశం దొరికింది. ఇది నా అదృష్టం. ఇంకా బ్లాగర్లు సాధ్యమైనంత మందిని కలవాలని ఉంది. చూడాలి.


(టపాలో వాడుకున్న ఫోటోలకు మోడల్ - సంహిత అనే దుండగురాలు

వయసు - సరిగ్గా యేడాది.

చేసే పనులు - బొమ్మల తలలు, కాళ్ళు విరగ్గొట్టటం,
ఈనాడు పేపర్ రాగానే చింపెయ్యటం,
కొత్త గౌను మీద నీళ్ళు పోసుకోవటం,
మట్టి, చెప్పులు, పరక, ఇలాంటి వాటితో ఆడుకోవడం,
లాప్ టాప్ మీదెక్కి చిచ్చిపోయటం,
నాన్న సులోచనాలను (కళ్ళజోడు) లాగి విసిరెయ్యటం వగైరా..)

Saturday, August 15, 2009

ఎడమకాలి రెండో వేలు గోరు

గంగమ్మ.

పేరు విననీకి అంత బాగలే. అయితేనేమంట? గంగమ్మ అచ్చంగా మా పాలిటికి గంగమ్మ తల్లే. గంగమ్మ మా ఇంట్లో బట్టలుతుకుతా ఉన్నిండే సాకలాయమ్మ.

నాకప్పుడు ఒగ ఏడేండ్లున్నిన్నా? అప్పటి రోజులు నాకు బాగా గ్యాపకం.

మామూలుగా ఒక రోజు మా ఇంటికి ఉతికే బట్టలు తీసకపోనీకి గంగమ్మ ఒచ్చింది. మా అమ్మ గంగమ్మతో మాట్లాడతా, మాట్లాడతానే, మురికి బట్టలు ఒక్కొక్కటి ఎంచి, ఇవతల కుప్ప బేర్సింది. అన్నీ అయిన తర్వాత ఒక చీర పరిచి, దాన్లేకి ఈ కుప్ప బట్టలూ ఏసి, ఇట్లొక గంటు, అట్లొక గంటు ఏసి మూటకట్టె. గూట్లో ఒక చిన్న డిక్టేషన్ బుక్కు. ఆ డిక్టేషను బుక్కు నా రెండో కళాసు లోది. నేను మూడుకొచ్చినా కాబట్టి, అది ఇంక సాకలి పద్దు కు పెట్టుకున్నింది మాయమ్మ. ఆ బుక్కు తీసి పెన్సిలుతో రాసి, మొత్తం పద్నాలుగు బట్టలు గంగమ్మా అనె.

"మొత్తం పద్నాలుగు బట్టలు గంగమ్మా" అంటి నేను గుడక, నవ్వుతా.

కిసుక్కున నవ్వె గంగమ్మ, వక్కాకు ఏసుకున్న నోట్లోంచి, ఎర్ర పండ్లు బయటపెడతా.

"గంగమ్మా అనాకు. గంగమ్మవ్వ అను" కసిరె మాయమ్మ.

"పోన్లేమ్మయ్యా, ఉన్నీలె" అనె గంగమ్మ. గంగమ్మకు నన్ను చూస్సే శానా ముద్దు.

ఒకపాలి నాకు ఎడమకాలు బొటనేలు పక్కనేలు యాడనో తగిలిచ్చుకుని, చీము పట్టి గోరంతా పసుప్పచ్చగాయె. నెప్పి తట్టుకోలేక ఏడస్తా ఉన్నా. మాయమ్మ సత్యనారాయణ డాక్టరు కాడికి పిల్చక పాయె, సూది యేపిచ్చె, వేడన్నము, పసుపు కలిపి ముద్ద కట్టి కాలికి చుట్టె, ఇట్ల ఏమేమో చేసె. అయినా తగ్గలే.

గంగమ్మొచ్చి చూసి, "పిలకాయ నీర్సంగున్నాడు కదమ్మయ్యా. ఏదీ చూడనీ" అనె. అని నాకాలు గోరు కాడ కొంచెమట్ల పిసికె. మొదటే ఉన్న గోరు నొప్పితో నేనెడుస్తా ఉంటే, మాయమ్మ దానికి తోడుగా సూది గుచ్చిపిచ్చిందని కోపంలో ఉన్నా. గంగమ్మ గోరు పిసికే సరికి నాకు తిక్కరేగిపాయె.

"డాక్టరు సూది ఏసినాడు కదా, తగ్గి ఛస్తాదిలే" అన్నా ముకం ముడుచుకుని.

గంగమ్మ మామూలుగానే కిసుక్కన నవ్వి, నా కాలు అట్లిట్ల తిప్పి చూసి, "అమ్మయ్యా, ఎర్రగడ్డ, బాగ కాల్చి, రోంత రోంత కాపడం పెట్టు. తగ్గిపోతాదిలే. రోజులు బాగలేవమ్మయ్య, దిష్టి తీ" అనె. నా గోరు సంగతేమో గానీ, అందరికీ ఇదొక ఆటైపాయె అనుకుంటి నేను. బయటికి చెప్పలే.

ఆ రోజు రాత్రికి, మాయమ్మ సన్నెర్రగడ్డ, బాగ కాల్చి తీసుకొచ్చె. రోంత రోంత అట్ల నా గోరుకు సోకిచ్చి, రోంచేపయిన తర్వాత బాగ అదిమి కట్టు కట్టేసె. ఆ తర్వాత దిష్టి తీసె. నిజం చెప్పాల్నంటే, భలే సమ్మగుండెలే. మరుసట్రోజు పొద్దుగాల చూస్సే, నా గోరు పసుప్పచ్చ రంగు పాయి, గోధుమ రంగులో మారె. ఆ మజ్జాన్నానికి మామూలయిపాయె. రెండ్రోజులు స్కూలెగ్గొట్టినా, గోళీలాడలేకపోతి, ఈ గోరు తకరారు తో. ఆ రోజు మాత్రం మజ్జాన్నం.... ఏం చెప్పల్ల. పండగలే!. అయితే గోళీలాడేటప్పుడు తిరగా రాయి కొట్టుకుని, సగం గోరు ఇరిగిపాయె. అయితే గోరు ఆతలికే మెత్తబడింది గామాలు. నెప్పి లేదు.

ఇంకోసారి ఇట్లాగే ఎదురింట్లో సన్నపిల్లోడు ఏమిటికో ఏడుస్సాంటే గంగమ్మ, నిమ్మళంగ వక్కాకేస్కుంటా వచ్చి, అట్ల చూసి, తేనె, తులిశాకు, వేణ్ణీళ్ళల్లో కలిపి పట్టీమని చెప్పెనంట. మరసట్రోజుకి, ఇంకేముంది? పిల్లోని ఏడుపు, జొరమూ రెండూ తగ్గి నవ్వు ముకంతో తిరగబట్టెనే!

మా గేరులో కసుగందులు ఎవరున్నా సరే, వాండ్ల వీపుకు బాగ ఆముదం తిక్కి, స్నానం చేపిచ్చాలన్నా ఆయమ్మనే లాయక్. కాళ్ళు సాపుకుని, కాళ్ళ మధ్య పిల్లగాండ్లను బోర్లబొక్కల తిప్పి పండుకోబెట్టుకుని, వీపు రుద్దుతాంటే, అదేం చిత్రమో యేమో, అంత వేడి నీళ్ళు గుడక, పిల్లనాయాండ్లు నవ్వుతా పోయిచ్చుకుంటాండ్రి.

ఇంకా, రథసప్తమి నాపొద్దు జిల్లేడాకులు తలమింద పెట్టుకొని స్నానం చేయాల్నంట. ఆరోజుకి జిల్లేడాకులు, దసరానాపొద్దు జమ్మి, అప్పుడప్పుడు బిల్వ పత్రి కాయలు, ఎవరికైనా అమ్మోరొస్తే, వేపాకులు, ఇవన్నీ గంగమ్మనే అందరికీ తెచ్చిస్సాండె.

గంగమ్మ ఇంట్లో, మొత్తం ఏడుమంది. ఐదు మంది మనుషులు, రెండు గాడిదులు. గంగమ్మ, కూతురు లచ్చమ్మ, అల్లుడు ఈరయ్య, ఇంకా ఇద్దరు పిల్లోళ్ళు. ఈరయ్య మారాజు లాంటోడు, అత్తమ్మని అమ్మలాగా చూస్కుంటన్న్యాడని అందరూ చెప్పుకుంటా ఉండిరి. ఈరయ్యకి, లచ్చమ్మకి ఇద్దరు పిల్లలు. ఒక బిడ్డ, ఒక కొడుకు. ఈరమ్మ బిడ్డ నాకంటే ఒక సంవత్సరం పెద్దది. సుబ్బయ్య నాకంటే ఒక సంవత్సరం చిన్నోడు. సుబ్బయ్య ఒక్కడే స్కూలుకు పోతా ఉండే.

నేను ఒక్కో కళాసు ప్యాస్ ఐతానే, టెక్స్ట్ పుస్తకాలన్నీ సుబ్బయ్య కిప్పిస్సా ఉండే మాయమ్మ. అట్ల సుబ్బయ్య నా పుస్తకాలతోనే సదువుకుంటా వచ్చినాడు.

అప్పుడప్పుడూ కొళాయిలో నీళ్ళు రాకపోతే, జానకమ్మోళ్ళ బాయిలో నీళ్ళు చేదిచ్చే పని గుడక గంగమ్మదే. మాకే కాదు, అందరికీ. అందుకు రేటు ఇంటికొక రూపాయి. మా ఇంటికి మట్టుక - ఒక ఆకు వక్క, రోంత సున్నం.

రోజులు బాగలేవని యా ముహూర్తాన చెప్పిన్నిందో, గంగమ్మ, అది నిజమయ్యె. గంగమ్మోల్ల కొట్టం బయట అంగట్లో మూలకి నల్లకుక్క ఈనింది. అందరూ బట్టలుతికేకి కెనాలుకు పోయున్నారు, రోజు రాత్రి గంగమ్మ, ఆడ అంగట్లో ఉన్న బండమీదనే పడుకుంటాండె. ఆ రోజు రాత్రి గూడా అట్లాగే పడుకున్నింది. మూలకి నల్ల కుక్క రోంత గురాయిస్తా ఉన్నింది, గంగమ్మను చూసి. నడి రాత్రి ఏమిటికో లేసి, బయటకొచ్చేటప్పుడు తెలీకుండా కుక్కపిల్లను తొక్కేతలికి, ఆ నల్లకుక్క "భౌ" మని అరుచుకుంటా వచ్చి, కాలు కొరికిందంట.

మల్లా రెండు మూడు రోజుల తర్వాత మాయమ్మ గంగమ్మ బట్టలకోసమొచ్చినప్పుడు అడిగె, "ఏం గంగమ్మా, కాలు కేందా కచ్చు?" అని. "ఏం లేమ్మయ్యా, కుక్క కొరికింది, పోతాదిలే" అనె. "చూపిచ్చుకో గంగమ్మా, ఏమిటికన్నా మంచిది" అన్జెప్పె మాయమ్మ.

రెండు నెలలయ్యె. ఒక రోజు ఈరయ్య మా ఇంటికి ఏడుపు ముకం తో వచ్చె మాయమ్మ కాడికి. ఈరయ్య ఎప్పుడూ పని చూస్కునేదే తప్ప, ఎవురితో మాట్లాడేటోడు కాదు, ఎవరింటికీ పొయేటోడు కాదు. మాయమ్మ ఈరయ్యను చూసి ఏమనడిగె.

"అత్తమ్మకి బాగలేదమ్మయ్యా, పెద్దాస్పిటల్లో చేరిపించినాము" అనె. మా అమ్మ ఈరయ్యకు రోన్ని డబ్బులిచ్చి ఇవి పెట్టుకో మని చెప్పె. తను ఆస్పిటలుకు రిక్షా మాట్లాడుకుని, పోయి చూసేసొచ్చె. "ఏమీ లేదులే. తగ్గిపోతాది" అనుకునె.

ఆ తర్వాత ఒక నెల, నెలన్నర తర్వాత గంగమ్మ పరిస్థితి మాఅమ్మకి అర్థమయిపాయె. గంగమ్మకు పిచ్చెక్కిందంట. పిచ్చెక్కినోళ్ళు ఇంకొకళ్ళను కరిస్తే, వాళ్ళకు పిచ్చి ఎక్కుతాదని చెప్పి, గంగమ్మను ఎవరూ రానీకుండా ఉండిరి. ఈరయ్య, లచ్చుమమ్మ కూడా బయటికి పోనిస్సా ఉన్నిండ్లే. ఒక రోజు రాత్రి. ఆ రోజు వర్షం పడతాన్నింది. లోపల పడుకొనున్న్యాం. రాత్రి పెద్దగా అరుపులు. నేను మా అమ్మని అడిగితి, రాత్రి, ఏమిటికా అరుపులు అని. "ఏం లేదులే పడుకో" అనె మాయమ్మ. ఆ అరుపులు గంగమ్మవి. వర్షాన్ని చూసి, బాగా పిచ్చెక్కి అరిచిన అరుపులంట అవి.

ఆ రోజు తర్వాత గంగమ్మ నాకు కనపరాలే. నల్ల కుక్క మట్టుకు ఒక రోజు కస్ కస్ మని దగ్గుతా మా ఇంటి కాడికొచ్చె. నేను చపాతీ రోంత తుంచి యేసేదానికి పోతే, మాయమ్మ, "ఛీ, పా అవతలికి, పాపిష్టి కుక్క." అని తరిమేసె. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ కుక్కా బాగ చిక్కిపోయి, కడాకు యాడపాయెనో ఏమో, కనపరాలేదు.

-----------------------------------------------------

ప్రస్తుతం.

"ఊర్లోకి ఎక్జిబిషను వచ్చిందంట. పోదామా?" నా భార్య అడిగింది.

మా ఆవిడ అడగటం అంటే "పద. బయలుదేరండి" అని అర్థం.

బట్టలు మార్చుకుని, హడావుడిగా బయటకొస్తాంటే, కాలికి గడప్మాను కొట్టుకునింది.

"అబ్బా. మీ కాలి గోరు ఎప్పుడూ కొట్టుకుంటానే ఉంటుందే, ఎప్పుడూ". నా ఎడమకాలి రెండో వేలు గోరు దగ్గర రెండు గోర్లు- ఒకదానిపైన ఒకటి వచ్చి, కొంచెం చూపుదేలింటుంది. అందుకని, అప్పుడప్పుడూ రాళ్ళకు కొట్టుకొంటా ఉంటది.

మా ఇంటికాడే ఆటో స్టాండు. ఆటోని పిలిచింది మా ఆవిడ. ఆటోను చూడగానే ఆనందంగా కేక పెట్టి, "మామా" అని సన్నగా అరిచింది మాపాప. ఆటో ఎక్కడమంటే విమానం ఎక్కడం లాగ మా పాపకు. అదీ ఆ ఆటోను స్టాండులో చూసి, చూసి అలవాటు దానికి.

"ఎక్జిబిషను దగ్గరికి. ఎంతియ్యాలన్నా?" అడిగింది నా భార్య.

ఆటో అతను తలగీరుకుని, మొహమాటంగా, "పర్వాలేదు. కూర్చోండమ్మా". అని చెప్పినాడు.

పాప, మా ఆవిడ, నేను ఎక్కగానే సుబ్బయ్య ఆటో బయలుదేరింది.

Tuesday, August 11, 2009

సత్య క్రియ

సీత అగ్ని ప్రవేశ ఘట్టం మీద ఈ బ్లాగులో చర్చ జరిగి అప్పుడే సంవత్సరం కావస్తూంది. నిన్న బౌద్ధ జాతక మాల చదువుతుంటే కథ చివర్లో ఒక చోట రామాయణాన్ని, అందునా సీత అగ్ని ప్రవేశ ఘట్టాన్ని ఉటంకిస్తూ రాసిన ఒక ఫుట్ నోట్ చూశాను. అప్పుడు సాగిన ఆలోచనలతో ఈ టపా రాయాలనిపించింది.

రాముడి మీద ప్రశ్నలు, రామాయణం లో విలువలు, గతి తార్కిక భౌతిక వాదాలు ఇవన్నీ తిరగదోడి ఆరోగ్యాలు చెడగొట్టుకొనే తీరిక, ఓపిక, ఆసక్తి ఇప్పుడు నాకు లేవు. కాబట్టి వాటి జోలికి వెళ్ళదల్చుకోలేదు.

ముందుగా కథ, సాధ్యమైనంత విశదంగా.

జాతక మాల లో ఈ కథ పేరు శిబి జాతకం. శిబి అనగానే గుర్తొచ్చే డేగ - పావురం కథ చాలా మందికి తెలిసిందే. జాతకమాలలో ఈ కథ కాస్త భిన్నంగా ఉంటుంది.

ఈ కథలో శిబి (బోధిసత్వుడు) ఓ గణతంత్ర రాజ్యానికి రాజు. ఆయన దాన ప్రవృత్తికి సరిపడా గొప్ప యాచకుడు దొరకలేదని ఒక రోజు మథన పడతాడు. అప్పుడు ఆయన అత్యుదార సంకల్పానికి పృథివి, భర్త యెడల అనురక్తమైన స్త్రీ వలె చలించిపోతుంది. పృథివి చలనానికి మేరు పర్వతం కూడా చలిస్తుంది. ఆ కంపనాన్ని స్వర్గలోకంలో ఇంద్రుడు గమనించి, ఆశ్చర్య పడి, శిబిని పరీక్షించడానికి భూమిపై అడుగెడతాడు.

ఓ వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి శిబి వద్దకు వచ్చి, ఇంద్రుడు, శిబిని ఒక కన్ను దానమడుగుతాడు. అప్పుడు శిబి, ఇన్ని నాళ్ళకు నా దాన ప్రవృత్తికి సార్థకత లభిస్తున్నదని ఆనందపడి తన రెండు కళ్ళను దానమిస్తానంటాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుని, తన గురించి ఇంత గొప్పగా చెప్పి ప్రేరణ కలిగించినదెవరని అడుగుతాడు. అప్పుడా బ్రాహ్మణుడు అది ఇంద్ర ప్రేరణ అని చెబుతాడు.

శిబి మహోన్నత నిర్ణయాన్ని విన్న మంత్రులు, ఆ వచ్చిన వాడు దేవుడని, ఒకరి నేత్రం ఇంకొకరికి అమరదని, ఇలా అతణ్ణి రకరకాలుగా వారిస్తారు. శిబి వారికి నచ్చజెబుతూ, కార్పణ్యదోషం (avarice) పాపహేతువు అని చెబుతాడు.

ఇంకా

నైకకారణ సాధ్యత్వం కార్యాణాం ననుదృశ్యతే
కారణాంతరసాపేక్షః స్యాద్దేవో 2పి విధిర్యతః

ఏకకారణం (single cause) వల్ల కార్యములు (effects) ఏర్పడడం మనకు ఎక్కడా కనిపించదు. కనుక దేవుడికైనా తన కార్యసిద్ధికి కారణ సామగ్రిని ఆపేక్షించక తప్పదని చెబుతాడు. ఇలా చెప్పి అందరిని ఒప్పించి, శిబి తన నయన పద్మాలను సహస్ర నయనునికి అర్పించి, పద్మములు లేని, పద్మాకరముఖుడవుతాడు.

అప్పుడు శక్రుడు మిక్కిలి సంతోషించి, ఈ మహా పురుషుడికి పునః చక్షు ప్రాప్తికి సమర్థమైన ఉపాయం కలిగేలా ప్రేరణ ఇస్తానని తీర్మానించుకుంటాడు.

కొన్ని రోజుల తర్వాత శిబి గాయాలు మానిన తర్వాత, తిరిగి ఇంద్రుడు నిజరూపంతో వస్తాడు. ఏమి కావాలో ఆజ్ఞాపించమంటాడు శిబి. ఇంద్రుడేదయినా వరం కోరుకొమ్మంటాడు. శిబి ఆ మాటలకు ఆశ్చర్యపడి, "శక్రా, నాకు ఏ దానము వద్దు. అయితే నాకు అన్ని సంపదలున్నా, యాచకులు దానం గ్రహించినప్పుడు వారి ముఖంలో సంతోషాన్ని చూడలేకపోతున్నాను. అందుకే మృత్వువును కోరుతున్నా"నంటాడు. చలించిపోతాడు ఇంద్రుడు. అయితే పరీక్షించడానికి, రెచ్చగొడుతూ, "యాచకుల వలనే కదా నీకీ దురవస్థ. యాచకులపై నీ భావాలేమిటి" చెప్పమంటాడు.

తదివ చైతర్హి చ యాచకానాం వచాంసి యాంచానియతాక్షరాని
ౠశీర్మయాణీవ మమ ప్రియాణి యథా తథోదేతు మమైకమక్షి

"యాచకుల యాచనా వాక్యాలు ఆశీర్వాదాల లాగా శ్రవణపేయంగా ఇదివరకు ఎలా అనిపించాయో, ఇప్పుడు అలానే అనిపించే పక్షంలో నాకు ఒక కన్ను ఉదయించుగాక!"

శిబి ఇలా చెప్పగానే సత్యాధిష్టాన బలం వల్ల శిబి కన్ను తిరిగి ఉదయించింది.ఆశ్చర్య చకితుడైన శిబి, ఇంకో శ్లోకం చెబుతాడు.

యశ్చాపి మాం చక్షురయాచితైకం తస్మై ముదా ద్వే నయనే ప్రదాయ
ప్రీత్యుత్సవైకాగ్రమతిర్యథాసం ద్వితీయమప్యక్షి తథా మమాస్తు ||

"ఒక నేత్రాన్ని యాచించిన యాచకుడికి నా రెండు నేత్రాలు మోదంతో ఇచ్చి ఆనందోల్లాసంతో నా చిత్తం లగ్నమై ఉండిన పక్షంలో రెండవ నేత్రం నాకు కలుగుగాక!"

రెండవనేత్రమూ ఆయనకు కలుగుతుంది. ఆ సత్యక్రియకు హర్షం పట్టలేక భూమి కంపిస్తుంది. సాగరుడు చెలియలికట్ట దాటుతాడు. సూర్యదేవుడు శరత్కాలంలో వలె శుద్ధంగా ప్రకాశిస్తాడు. పుష్పవృష్టి కురుస్తుంది. సకల దేవతా గణమూ బోధి సత్వుణ్ణి ప్రశంసిస్తుంది.

ఇది కథ. ఇక విషయానికి వద్దాం.

ఎటువంటి లోపానికి తావివ్వకుండా ధర్మానుచరణ కలిగిన వారి వాక్కులకు ఒక దివ్యప్రభావం సంక్రమిస్తుంది. జీవితంలో ఏదేని అతిక్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు వారు దాన్ని సత్య అధిష్టాన బలం (Power of truth blessing)ద్వారా అధిగమిస్తారు. ఈ సత్యక్రియ ఆచరించేప్పుడు వారి సంకల్పం వాగ్రూపంలో వ్యక్తం కావడం అవసరమై ఉంటుంది. శిబి అంతకు ముందే ఆ క్రియను ఆచరించి, నేత్ర సిద్ధి పొంది ఉండవచ్చు. అయితే ఆ మహనీయుడు అందుకూ ఆశపడక మౌనం వహిస్తే, చివరికి ఇంద్రుడు ప్రేరణ కలిగించవలసి వస్తుంది.ధర్మ మహాత్మ్యానికి భారతీయహృదయం ఇచ్చిన మహోన్నత స్థానానికి సత్యక్రియ ఒక ప్రతీక (symbol).ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఈ సత్యక్రియా ప్రక్రియ ప్రముఖంగా కనబడుతుంది. ఉదా: సీతాదేవి అగ్ని ప్రవేశ ఘట్టం.

పైన శిబి కథలోనూ, సీతాదేవి విషయంలోనూ నాకు కనిపించిన ఒప్పుకోదగిన విషయాలు ఏమంటే - ఈ సందర్భాలలో సత్య క్రియ అన్నది తమకు వచ్చిన ఆపదను తొలగించుకోటానికి, లేదా సత్యంపట్ల తమ అనుయాయులకు, ప్రజలకు నమ్మకం సడలపోరాదని చెప్పటానికి ఉపయోగించబడింది. తమను ధిక్కరించిన వారిపై శాపాలు పెట్టటానికి సత్యక్రియ ఉపయోగించబడలేదు. (మహర్షులు పెట్టే శాపాల మీద వ్యక్తిగతంగా నాకు విశ్వాసం లేదు. కామక్రోధాదులను జయించగోరే వారు, జయించినట్లు చెప్పబడే వాళ్ళు, శాపాలెందుకిస్తారో ఊహకు అందదు. అందులో మానవీయత, మహనీయత కూడా నాకు గోచరించదు.)

పైన శిబి ఉదంతం, సీతా దేవి ఉదంతంలోని సత్యక్రియ నిదర్శన కరుణరసప్లావితమై ఉంటుంది. చూచాయగా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సత్యక్రియ కలిగిన వ్యక్తులు మనజీవితంలోనూ ఎదురవడం కద్దు - మన నమ్మకం, అపనమ్మకం, విశ్వాసాలతో సంబంధం లేకుండా. తిరుమల రామచంద్ర గారి జీవిత చరిత్రలో ఓ చోట రాతి బసవడు, చెక్క బసవడు అని ఇద్దరు మిత్రుల కథ చెబుతారు. వారిద్దరికి సంస్కృతం వంటబట్టదు. ఇంటినుండీ పారిపోతారు. వారికి రామచంద్రగారు మంచి మాట చెబుతారు. ఓ మంచి మాట, మంచి జరగాలనే సంకల్పం అంతే. ఆ తర్వాత ఆ ఇద్దరు మంచి జీవితాలలో స్థిరపడతారు.

నా చిన్నప్పుడు మా ఊళ్ళో వర్షం పడకపోతే, వారం రోజులు మా ఇంటి పక్క గుడిలో ఏవో పూజలు, భజనలు జరిపారు. బాగా జ్ఞాపకం నాకు. సరిగ్గా ఆ వారం చివరిరోజు - మంచి వర్షం కురిసింది. ఇక్కడ నేనా పూజలను, విధానాలను సమర్థించడానికి ప్రయత్నం చేయట్లేదు. వర్షం కురవక, గొంతులెండిన అనేకమంది ఆర్తి - ఆ రోజు అక్కడ సత్యక్రియగా మారింది అని నా అనుకోలు.

అలాంటి పూజలు ఇప్పుడు జరిపినా వర్షం కురుస్తుందన్న ఆశ లేదు. దురదృష్టవశాత్తూ వ్యాపార సంస్కృతి అడుగంటా పాతుకుపోయిన సమాజంలో ఉన్నాం మనం. మనకు ఇలాంటి సంకల్ప బలాలు, సత్యాధిష్టానం తాలూకు ప్రతిఫలాలు బహుశా అర్థమవమేమో. పైగా మనమున్నది సమాచార విప్లవపు సమాజంలో. మనకు సమాచారం, హేతువు, విశ్లేషణ(analysis), విషయాన్ని ముక్కలుగా నరకటం - వీటి మీద ఉన్న శ్రద్ధ, motives ను కనుక్కునే విషయం మీద, విషయాలను సమన్వయం/సంశ్లేషణం (synthesis) చేయడం మీద లేదు. మనిషికి అజ్ఞానం ఇచ్చిన తృప్తి, విజ్ఞానం ఇవ్వలేకపోతోంది.

హేతువుకు దొరకని సంఘటనలు ప్రతి ఒక్కరికి ఎదురవుతుంటాయి. జీవితం మీద అనురక్తిని కలిగించేవి అలాంటి సంఘటనలే. వాటికి హేతువులు వెతకటం కన్నా, motives గురించి ఆలోచించటమో (contemplation), వాటి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమో మాత్రం మనం చేయగలిగినది.

"The unknowable can never be known." - J Krishnamurthy

Wednesday, August 5, 2009

ఓ వర్షం కురవని రాత్రి

"తారా సువర్ణం" హిందీ చానెల్ లో "డర్నా మనా హై" సినిమా వస్తోంది. ఈ సినిమా ఓ మంచి ప్రయోగం. నాకు చాలా నచ్చిన సినిమా. మంచి కథ, కథనం, చక్కటి నటులు, మంచి ఫోటోగ్రఫీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే ..ఇలా అనేక హంగులున్నప్పటికీ "అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని" అన్నట్టు ఎందుకు ఫ్లాపు అయిందో తెలియదు.

డర్నా మనా హై లో కొంతమంది ఏదో పిక్నిక్ కు వెళ్ళి, చీకటి పడ్డాక తిరిగి వస్తూ మధ్యలో ఓ అడవిలో ఆగుతారు. అక్కడ వాళ్ళు ఓ పాడుబడ్డ కొంపలో చేరి, కూర్చుని కథలు చెప్పుకుంటుంటారు. మొత్తం 6 కథలు. కథల మధ్యలో పక్కకెళ్ళిన వారు అందరూ హత్యకు గురవుతుంటారు. ఇలా భయానకంగా ఉంటుంది.

పాతికేళ్ళ క్రితం యండమూరి "దుప్పట్లో మిన్నాగు" అని సరిగ్గా ఈ సినిమా కథలాంటి ప్రయోగమే చేశాడు. 6 కథలను గుది గుచ్చి, ఒక కథ లో భాగంగా రాయటం. ఆ తర్వాత అప్పుడెప్పుడో స్రవంతి పత్రికలో ఈ నవల ఏదో ఇంగ్లీషు నవలను చూసి రాసింది అని చిన్న సైజు దుమారం రేగింది.

రాత్రి పూట ఎటూ కాని చోట ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో నాకూ ఓ సారి అనుభవమైంది.

పన్నెండేళ్ళ ముందు మాట. అప్పటికి పూనా కొచ్చి ఎక్కువ రోజులు కాలేదు. పూనా అంటే పూనా నగరం కాదు. నా నివాసం, పూనాకు దాదాపు పాతిక మైళ్ళ దూరంలో ఉన్న ఓ గ్రామం. ఆ గ్రామం పేరు ఆళంది. మహారాష్ట్రీయులందరికీ ఈ ఊరి పేరు తప్పక తెలిసి ఉంటుంది. ఈ వూళ్ళో 11 వ శతాబ్దంలో జ్ఞానేశ్వరుడనే ఓ గొప్ప మహానుభావుడు పుట్టి చిన్న వయసులోనే "జ్ఞానేశ్వరీ" అని భగవద్గీత కు భాష్యం వ్రాసి, 14 యేళ్ళకు సమాధి చెందాడు. ఆయన సమాధి, ఈ ఊళ్ళో ఇంద్రాణి నది ఒడ్డున ఉన్నది. అలాగే ఈ వూరి నిండా అనేక సత్రాలు, మధుకరం చేబట్టిన విద్యార్థులు..ఇలా చాలా సాంప్రదాయికంగా ఉండేది.

అప్పట్లో నాకు మరాఠీ, హిందీ రెండూ రావు. ఎలానో నెట్టుకొచ్చే వాణ్ణి. మరాఠీ కాస్త అర్థమయేది, ఎందుకంటే కొన్ని సంస్కృత శబ్దాలు కలిసేవి కాబట్టి. (ఉదా : తాందుళ్ - తండులం - బియ్యం)

సెలవు రోజు వస్తే పొద్దునే ఆ ఊరు వదిలి పూనా వెళ్ళే వాణ్ణి నేను. పూనాలో నా ఫ్రెండు, తన మామయ్య వాళ్ళతో గడిపే వాణ్ణి. అలా ఓ సెలవు రోజు ఉదయమే పూనా వెళ్ళాను. వెస్ట్ ఎండ్ లో సినిమా చూసి, సాయంత్రం అలా తిరిగి, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నుండి బయటపడే సరికి బాగా చీకటి పడింది.

సమయం రాత్రి 12:30 . ఆళంది బస్ ఎక్కాను. ఆళంది వెళ్ళటానికి నాకు తెలిసి 2 మార్గాలు ఉండేవి. అయితే నేను ఎక్కిన బస్సు, ఆ రెండు మార్గాల నుండీ కాక, వూరి బయట ఓ రింగు రోడ్డు దారి పట్టింది. బస్ లో పది మంది కంటే ఎక్కువ లేరు. బస్సు హై వే వదిలి లోపల దాదాపు అడవి లాంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో వెళుతూంది.

ఇంతలో బస్సు చక్రం రోడ్డు పక్కగా ఓ బురద గుంతలో కూరుకుపోయింది. డ్రయివర్ చాలా సేపు ప్రయత్నించాడు. ఇక కుదరక ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. బస్ లో వాళ్ళందరూ దిగి ఏదో మాట్లాడేసుకుంటున్నారు.

"కాయ్ ఝాలా"
"లవ్ కర్ కరూన్ టాక్" ...ఇలా...

నేను బస్ దిగలేదు. బస్ ప్రయాణీకులు ఒక్కొక్కరు అలా నడుచుకుంటూ వెళ్ళసాగారు. బస్ దగ్గర కండక్టర్, నేను మిగిలేం. డ్రయివర్ ఏదో అడిగాడు. నాకు ఏమి అర్థమవలే. ఊరుకున్నాను. కాసేపటికి డ్రవర్ ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు. చివరికి నేనొక్కణ్ణి మిగిలా. రోడ్డు పక్కనంతా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్. చిమ్మ చీకటి. నాకు మెల్లగా వెన్నులోంచి చలి మొదలయింది. బయట కూడా చలి!

కాసేపయింతర్వాత ఏదో గోల వినిపించింది. ఆ గోల మెల్ల మెల్లగా అధికమవసాగింది. అలాగే కొన్ని కాగడాలు, కనిపించాయ్ దూరంగా. ఆ కాగడాలు, ఆ కాగడా తాలూకు వాళ్ళు బస్ కు కాస్తంత దూరం వచ్చారు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లెం కాబట్టి అలాగే ఉన్నాను.

ఆ గోల క్రమంగా భజన గా మారింది. విషయమేమంటే ఆ రోజో,మరుసటి రోజో కృష్ణాష్టమి. అక్కడ గ్రామంలో లైట్లు లేవు. వాళ్ళు ఇలా కాగడాలు అవీ వెలిగించుకుని భజన చేస్తున్నారు. ఇక అనుమానం తీరిన తర్వాత అక్కడికెళ్ళా నేను. వాళ్ళు కాసేపటి భజన తర్వాత ప్రసాదం పంచసాగారు. నన్నూ పిలిచేరు. ఆ ప్రసాదం - కాందా పోహే, పూరీ,శ్రీఖండ్. పోహే అంటే అటుకుల తిరుగువాత, ఉల్లిపాయలూ. శ్రీఖండ్ ఎప్పుడైనా రుచి చూశారా? లేకపోతే మీరు జీవితంలో కాస్త కోల్పోయినట్టే. ఆంధ్రులకు పూతరేకులు, ఆవకాయ, గోంగూర ఎలాంటి ట్రేడ్ మార్కు సింబల్సో, మరాఠీలకు శ్రీఖండ్ అలాగ. (దీన్ని మరీ ఎక్కువ తినలేమనుకోండి). అక్కడ నాతో బాటి బస్ తాలూకు ఇతర ప్రయాణీకులూ ఉన్నారు. అందరూ వరుసగా కూర్చున్నారు. ప్రసాదం అందరికీ పంచేరు. నేను వచ్చీ రాని హిందీలో అడిగాను. "ఏం జరుగుతోందని". ఆ గ్రామస్తుడు నవ్వుతూ విడమర్చి చెప్పేడు.

కాసేపటి తర్వాత ఆ గ్రామస్తుల సహాయంతోనే బస్సు కదిలింది. ఎట్టకేలకు తిరిగి ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి చేరుకునేప్పటికి సమయం రాత్రి 2:30.

ఆ తర్వాత ఆ గ్రామానికి మరో సారి వెళ్ళడం తటస్తించింది. ఆ గ్రామం పేరు తులా పూర్. ఇంద్రాణీ, భీమా నదుల సంగమ స్థానం ఆ చోటు. ఔరంగజేబు కిరాతకంగా చంపించిన శంభాజీ (శివాజీ పుత్రుడు) సమాధి ఉందక్కడ.

ఇలా ఓ రోజు రాత్రి అనుభవం అందమైన అనుభూతిగా మిగిలిపోయింది, నాకు.

Sunday, August 2, 2009

ఆమె కన్న నితడు ఘనుడు

ఇక్కడ ఆంధ్రామృతం గ్రోలి రండొకసారి.

ఆతుకూరి మొల్ల ఓ మహా కవయిత్రి. ఈ కవయిత్రి శ్రీ కృష్ణ దేవరాయల ఆశ్రయం పొందగోరి, రాయల వారిని స్తుతిస్తూ ఆయనపై ఈ పద్యం చెప్పిందట.

సీ || అతఁడు గోపాల కుండితఁడు భూపాలకుం
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు పాండవ పక్షుఁడితఁడు పండిత రక్షుఁ
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు యాదవ పోషి యితఁడు యాచక పోషి
యెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు కంసధ్వంసి యితఁడు కష్టధ్వంసి
యెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు

గీ || పల్లెకాతఁడు పట్టణ ప్రభువితఁడు
స్త్రీలకాతఁడు పద్మినీ స్త్రీలకితఁడు
సురలకాతఁడు తలఁప భూసురులకితఁడు
కృష్ణుడాతండు శ్రీమహా కృష్ణుఁడితఁడు.

ఎంత సరళంగా ఉంది కదా. (పల్లె అంటే రేపల్లె అని ఇక్కడ అర్థం అనుకుంటాను)

ఆ సమయంలో రాయల పక్కనున్న రామకృష్ణయ్యకు ఆవిడ రాయల వారిని పొగడటం నచ్చలేదో, లేక ఆ పద్యం నచ్చలేదో, మరింకే కారణమో మరి, వెంటనే ఈ పద్యం చెప్పాడుట.

సీ || అతడంబకు మగఁడు ఈతఁడమ్మకు మగ
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు
నెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడమ్మున నేయు నితఁడు కొమ్మునఁ డాయు
నెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతని కంటను జిచ్చు నితని కంటను బొచ్చు
ఎలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు

గీ || దాత యాతఁడు గోనెల మోత యితఁడు
దక్షుఁడాతండు ప్రజల సంరక్షుడితఁడు
దేవుడాతఁడు కుడితికి దేవుఁడితఁడు
పశుపతి యతండు శ్రీమహా పశువితండు.

ఇలా నందిని గురించి పద్యం చెప్పాడట. వికటకవి అని ఊరికే అన్నారా?
ఇంతకూ ఈ పద్యం విన్న తర్వాత రాయల వారికి కోపమొచ్చిందో, నవ్వొచ్చిందో? రాయల వారు ఆ కవయిత్రిని
మాత్రం అనుగ్రహించినట్టు లేదు. ఈ పద్యాలు రెండూ చాటువులు.

పై టెంప్లేటు (మూస) మనమూ వాడుకుంటే?

(ధీరు డతడు ఇప్పటి మగధీర యితడు
చిరు యతడు వెండితెర పై చిరుత యితడు)