Tuesday, February 22, 2011

అంతర్మథనంనన్ను నా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు... వాళ్ళకోసం నేను చేస్తున్న ప్రయత్నాలను కూడా గుర్తించడం లేదు...ఇలా ఎన్నాళ్ళు...అసలు మనుషులంతా ఇంతేనా? ప్రతిమనిషి ఇతరులపై తన ఆశల్ని, ఆకాంక్షలనూ మోపుతూ ఉండడమే జీవితమా? ఒకరిమీద మానసికంగా ఆధారపడకుండా ఇద్దరుమనుషులు కలిసి బతకటం భూమిపైన అంత కష్టమా? మనసంతా దిగులుగా...ఊహూ దిగులు కూడా కాదు, ఓ విధమైన వైరాగ్యం..నైరాశ్యం...

గంటకు ఏభై కి.మీ. వేగంతో బండి తారు రోడ్డుపైన తనపని తాను చేసుకు పోతూంది, చట్టం లాగా.

ఆకాశం - కేన్వాసుపైన భానుడనే ఒక అసమగ్రకళాకారుడు ఏ చిత్రం గీయాలో తెలీక తన రంగులను చిందరవందరగా వంపేసినట్టు రంగులమయంగా ఉంది. ఒకవైపు నుండి చల్లటి గాలి వీస్తూ ఉంది. రోడ్డుపక్కన పొలాలలో తాడిచెట్లు పాఠం అర్థం కాని వెనుకబెంచి విద్యార్థులలాగా స్తబ్ధమైన ముఖాలతో నుంచున్నాయి. ఓ కొంగలబారు ’v’ ఆకారంలో తూర్పు నుండి వస్తూ, ఉత్తరం దిశగా మలుపు తిరిగేయి. ఆ కొంగలబారును చూస్తూ బండి నడుపుతూంటే, రోడ్డు గతుకులూ, బండి కిందపడుతుందేమోనన్న ఆలోచనా ఏదీ మనసుకు పట్టలేదు. కొంగల బారు కాసేపటి తరువాత పడమరగా ఓ బూరుగుచెట్టువైపుకు మళ్ళింది.

కాసేపటి తర్వాత ఓ పెద్ద ఆంజనేయస్వామి బొమ్మ (విగ్రహం) కనిపించింది రోడ్డుకు కుడిపక్కన, మనిషి తన మనసులో దేవునికి నివేదించదలుచుకున్న ఆశల కుప్ప లాగా ఆయన విగ్రహం ఎత్తుగా...దేవుని ముఖంలో అమాయకత్వం, ఆ సంజె వెలుగులో ప్రతిఫలిస్తూన్న అమాయకత్వం తాలూకు ప్రశాంతత. ఆ విగ్రహం పక్కగా ఓ చిన్న రోడ్డు గ్రామానికి దారి తీస్తూంది. నేను వెళ్ళాలనుకున్నది ఆ ఆంజనేయస్వామి మందిరానికి కాదు, దగ్గరలో ఉన్న మరో ప్రసిద్ధమైన మందిరానికి. ఈ మందిరం తాలూకు సంస్థ (?) ప్రపంచప్రఖ్యాతి పొందింది. అయితే అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియక గ్రామం లోనికి వెళ్ళాను. ఆ పల్లెలో ఏదో సంత జరుగుతున్నట్టుంది. రకరకాల తినుబండారాలు, చిన్నచిన్న దుకాణాలు, పిల్లల ఆటవస్తువులూ, బెలూన్లు, తెల్ల రంగు చొక్కా, పంచెలలో గ్రామీణులు, ఎండలకు కమిలిన నల్లటి శరీరాలతో ఉన్న పల్లె స్త్రీలు, చక్కగా అల్లిన వాళ్ళ జడల్లో పూలూ, వాళ్ళల్లో కొంతమంది చంకల్లో బిడ్డలూ, ఆకువక్కా వేసుకుని ఎర్రబడిన నోళ్ళతో పెద్ద వయసులో స్త్రీలూ, సందడిగా అల్లరి చేస్తూన్న చిన్నపిల్లలూ...

అసతోమా సద్గమయ - (అసత్యం నుండీ సత్యంవైపు మళ్ళించు) అన్న ప్రార్థనను కష్టం నుంచి సుఖం వైపుకు నన్ను మళ్ళించు అని అర్థం చేసుకున్న భగవంతుడి దీవెనలా ఉందా పల్లెవాతావరణం.

పల్లెలోపలకు వెళుతూంటే సందడి ఎక్కువై పల్లెబయటకు వెళుతున్నట్టు అనిపించింది. మళ్ళీ వెనక్కు తిరిగి ప్రధాన రహదారి మీదకు వచ్చి నేను వెళ్ళాల్సిన మార్గం పట్టాను. కాసేపటి తరువాత రథం ఆకారంలో ఉన్న మందిరం, రథం ముందు పెద్ద పెద్ద గుర్రాల విగ్రహాలూ, గుడి దగ్గరకు వచ్చాను. మోటారు బండిని అక్కడ ఒకచోట నిలిపి చెప్పులు ఒకచోట విడిచి గుడివైపుగా అడుగులేయసాగాను. ఎవరో విదేశీయ దంపతులు గుడికి వస్తూన్నారు. వారితో బాటూ ఒక యువకుడు, వారికి విషయాలవీ చెప్పడానికి వారివెంటనే వస్తున్నాడు. ఆ అబ్బాయి తాలూకు నల్లకళ్ళజోడు ఉండాల్సిన చోట కాక తలపైన ఉంది.

నా కాళ్ళు గుడికి వెళుతున్నాయి కానీ మనసుమాత్రం శూన్యంగా ఉంది. ఎక్కడైనా మనుషులెవరూ రాలేని చోటికి వెళ్ళి దిక్కులు పిక్కటిల్లేలా, గొంతు పగిలేలా ఏడవాలనిపించే ఓ ఆవేదన, ఆక్రోశం. ఆ ఆవేదనకూ, ఆక్రోశానికి సరైన అర్థం లేదు, కారణమసలే లేదు.

మందిరం బయట ఓ చిన్న తోట. అక్కడ ఓ చిన్న కొలను. నాచు నీళ్ళు, అందులో గుండ్రంగా తామరాకులు, మధ్యన అక్కడక్కడా ముకుళించుకుని ఉన్న తామర మొగ్గలు. వాటినెవరూ చూడట్లేదు. అందరూ ఓ పక్కగా ఉన్న కుందేళ్ళకు చిన్నచిన్న ఆహారపు ముక్కలు వేస్తూ, ఆ కుందేళ్ళు వాటికై సన్నగా పరుగులు పెడుతూంటే తీగల బయట నుండి చూసి సంబరపడుతున్నారు.

ఒకరి ఆకలి మరొకరికి సంబరం.
ఒకరి ఆకలి మరొకరికి పుణ్యసంపాదనామార్గం. (అలా అన్నార్తులు ఉంటేనే పుణ్యం, పుణ్యం సంపాదించుకోగల అవకాశము, అదృష్టమూనూ)
ఒకరి ఆకలి జీవుడికి, దేవుడికీ కూడా అవసరం (దేవుడా రక్షించు నా నైరాశ్యాన్ని, అజ్ఞానాన్ని)

వీటన్నిటికీ దూరంగా, ఈ ప్రపంచకంలో ఉంటూనే, తనకే మాత్రం పట్టనట్టూ ఉన్న తామరాకు దొప్పెలు! ఓ చిన్న కప్ప కాబోలు నీళ్ళలోంచి ఎగిరింది. నీళ్ళలో చిరుప్రకంపనాలు తామరాకు ప్రశాంతతను మరింతగా పెంచుతూ... బయట బార్ లైట్ తాలూకు కాంతి కూడా ఆ నీళ్ళదగ్గర స్పష్టంగా ప్రతిఫలించడం లేదు.

ఆ పక్కన విదేశీయులకు స్వదేశీయుడు ఏవేవో భగవంతుని లీలలకు చెందిన ఘట్టాల బొమ్మలను చూపుతూ వివరిస్తున్నాడు.

కాసేపు తర్వాత గుడిలోనికి అడుగుపెట్టాను. భగవంతునికి హారతి ఇస్తున్నారు.  ప్రతిమ ధూపం తాలూకు పొగల్లో అస్పష్టంగా కనబడుతూంది. భక్తులు ఏవో భజన పాటలు పాడుతూ నాట్యం చేస్తూన్నారు. దేవుని దర్శనం దూరం నుండే చేసుకుని, ప్రసాదం తీసుకుని బయటపడ్డాను.

బయట చీకటి పడింది. ఆ కొలనూ, తామరాకులూ, నిశ్చలతా....ఎందులోనూ మార్పు లేదు. దేవునికన్నా దేవుని సృష్టిలోనే ప్రశాంతత కనిపిస్తూంది, ఎందుచేతనో. చీకట్లో ఆ తామరాకుల అస్పష్టమైన ఆకారం నా మనసులో ఏదో కాంతి నింపింది.

******************************************************************

బండి తీసుకుని బయటపడి, ఊరివైపుగా నడపడానికని మలుపు తిప్పాను. ఆ రోడ్డు అక్కడ కాస్త బావోలేదు. బండి సర్రున జారింది. క్షణకాలం ఏం జరిగిందో తెలీదు. అయ్యో అని ఇద్దరు ముగ్గురు బాటసారుల మాటలు వినబడ్డాయి. బండి మీదనుండి లేచాను. చేతులకంటిన దుమ్ము దులుపుకుని ఇంటిబాట పట్టాను. దెబ్బలు తగిలినా తగలనట్టే ఉంది.