Tuesday, July 10, 2012

తామరశ్రీ మోసరి రామాయణరావు ధిషణా హేల

రామాయణరావు వ్యక్తి కాదు సుత్తి. అవును. మీరు సరిగ్గానే చదివారు. రామాయణరావు ఒక మహాసుత్తి. ఆ సుత్తి తాలూకు ప్రస్థానమే ఈ కథనం.

ఒక వ్యక్తి కి ఎన్ని పార్శ్వాలుంటాయి? సాధారణంగా రెండు. రామాయణరావులో అనేక పార్శ్వాలున్నాయి.
ఒక పత్రికాధిపతి
ఒక నటుడు
ఒక దర్శకుడు
ఒక నిర్మాత
ఒక పాటల రచయిత
ఒక మాటల రచయిత
ఒక రాజకీయనాయకుడు
ఇన్ని పార్శ్వాలను పూర్తిగా ఖర్చుపెట్టే సరికి సారం అంతా పోయి, అతడు నాలుగేళ్ళు వరుసగా బ్లాగులు రాసేసిన తెలుగు బ్లాగర్ లా నిస్సారంగా తయారయ్యాడు. ప్రేక్షకులకు అతని సంగతి తెలిసి, అతని సినిమాలు ఎప్పుడో చూడ్డం మానేశారు. ఇక మిగిలిన పార్శ్వాలూ అరిగిపోయాయి. దాంతో అతని పైశాచికత్వం బయటపడింది. చలనచిత్ర సీమలో ఎక్కడ మీటింగు జరిగితే అక్కడ దాపురించి, శ్రోతల మెదళ్ళను కబళించడం అతనికి కొంతకాలంగా అలవడిన రాక్షసవిద్య. ఇది ఎప్పుడు అంతమవుతుందో తెలుగు టీవీ ప్రేక్షకులు, శ్రోతలు దీనికి ఎన్ని త్యాగాలు చెయ్యాలో అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.

**********************************************************

అది 1980 వ దశాబ్దం. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే - హీరో తాలూకు ఫ్యామిలీ ని విలన్ చంపడం, విలన్ ముసలి వాడై, ఇంకో రెండు రోజుల్లో వాడంతట వాడే ఛస్తాడనగా హీరో అతనిపై పగ సాధించడం - అని మాత్రమే తెలిసిన ఒక అమాయకమైన కాలం.

ఆ కాలంలో రామాయణరావు దర్శకుడిలా మారాడు. క్లీనర్ రాముడు, సర్కార్ పేష్వారాయుడు, బొబ్బిలిభల్లూకం, కామాభిషేకం, దాహసందేశం, శ్రీవారి కుంపట్లు వంటి చిత్రాలతో తెలుగు తెరపై ఒక మాయాజాలాన్ని సృష్టించాడు. అతడికి రె. కాఘవేంద్రరావు పోటీ. కాఘవేంద్రరావు కంటే ముందే ఈతను దర్శకరాట్న అనిపించుకున్నాడు.

ఇలా దర్శకరాట్న గా మారి తన రాట్నం తిప్పసాగాడు రామాయణ్. కాలక్రమంలో అతనికోసం అతని వెనుక పనిచేసిన పిశాచులకు (ఘోస్టులు) మోక్షం కలిగి దిక్కులకొక్కరుగా వెళ్ళిపోయి ఇతణ్ణి ఒంటరివాణ్ణి చేశారు. రామాయణ్ నిరాశ చెందలేదు. 

తరువాతి తరం వచ్చింది. దర్శకరాట్న కు సరికొత్త ఛాలెంజ్.

నటబ్రహ్మాండ కొడుకు సర్పార్జున తెలుగుపరిశ్రమలో అడుగుపెట్టి కొన్నేళ్లే అయింది. సర్పార్జున కళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది. అవి దైన్యాన్ని తప్ప మరోభావాన్ని పలికించవు. ఆ విషయం గ్రహించాడు దర్శకరాట్న. అతనితో గుజ్ను అనే కళాఖండాన్ని తీశాడు. అలాగే మురుగెశ్ తో కొన్ని సినిమాలు తీశాడు. శిశుకృష్ణ తోనూ కొన్ని సినిమాలు తీశాడు. ఇలా ఒక్కొక్కరినీ తన రాట్నానికి బలి చేస్తూ తన అద్భుత ప్రతిభతో రిచంజీవి తో సింహళేశ్వరుడు సినిమా తీశాడు. ఆ సినిమా ఆంధ్రదేశంలో స్కైలాబ్ లా పడింది. ప్రేక్షకులు విలవిలలాడిపోయారు. ఆ సినిమాలో - చెల్లెలు చచ్చిపోతే హీరో బ్రేక్ డేన్సు చేసినట్టు చూపడం దర్శకరాట్న ప్రతిభాపైశాచికత్వానికి పరాకాష్ట. తర్వాత ఒక సభలో మాట్లాడుతూ దర్శకరాట్న ఒక అపూర్వమైన విషయం చెప్పాడు. "రిచంజీవి సినిమాలో కథ ఉండరాదు. నేను ఈ సినిమాలో మంచి కథ చెప్పాను. అదే జరిగిన పొఱబాటుకు కారణం".

ఇతని దెబ్బ కాచుకోవడానికి, ఇతణ్ణి పడగొట్టడానికి పథకానికి బీజాలు పడినయ్.

**********************************************************

1990 దశాబ్దం మొదట్లో, అప్పట్లో తెలుగు సినిమా నటుల్లో ప్రముఖులు సర్పార్జున, గిగాస్టార్ రిచంజీవి, దగ్గుబాటి మురుగేశ్, శిశుకృష్ణ తదితరులు ఒక చోట చేరారు. ఆ సమావేశం అజెండా రామాయణరావును ఎదుర్కోవడం ఎలా?

సమావేశం ఆరంభిస్తూ మురుగేశ్ చెప్పాడు. మురుగేశ్ , సర్పార్జున అప్పుడప్పుడే తెలుగులో వత్తులు నేర్చుకుని చిత్రపరిశ్రమలో పైకొస్తున్నారు. కాబట్టి వారి మాటల్లో వత్తులు పలుకవు. శిశుకృష్ణకు ఆవేశం ఎక్కువ. ఒక పదం పూర్తి చెయ్యకముందే మరో పదానికి పరుగులు తీయిస్తుంది ఆ ఆవేశం. అంచేత మాటల్లో చివర్లు సరిగ్గా ఉండవు.

"సబ్యులందర్కీ నమస్కారం.  ఇవ్వాళ మనం ఇక్కడ కలుసుకున్నది రామాయణరావును ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై ఒక తీర్మానానికి రావడానికి. ఈ విషయంపై ఒక స్ట్రాటెజీని మనం తయారు చేసుకోవాలని నా ఆకాంచ". చెప్పాడు మురుగేశ్.

"రామాయణరావు మనపాలిట శాపంగా మారాడు. ఎప్పుడు సినిమా తీస్తానంటాడో తెలీదు. వద్దు అందామంటే మొహమాటం. మొన్న సింహళేశ్వరుడు సినిమా తీసి నా పరువు తీశాడు." - వాపోయాడు రిచంజీవి.

"నాకూ అంతే. గుజ్ను సినిమా తీశాడు. అది హిట్ అయినప్పటి నుండి ఇంకో సినిమా తీస్తానని వెంట బడుతున్నాడు. ఇప్పుడు నాకు వతులు వచ్చేశాయి. అతనితో నేనెందుకు సినిమా తీయాలో నాకర్దం కావట్లేదు" - చెప్పాడు సర్పార్జున. సర్పార్జున కంఠం పాము బుసకొట్టినట్టు ఉంది.

"అహ, అతణ్ణి ఎదుర్కోవాలంటే మనం అతణ్ణి ఉబ్బేయాలి. అదే చక్కగా పనిచేస్తుంది." - శిశు కృష్ణ చెప్పాడు.

చివరికి శిశుకృష్ణ చెప్పిన దానితో అందరూ ఏకీభవించారు. అతణ్ణి ప్రతి సమావేశానికి పిలవాలి. ప్రతి పత్రికలోనూ పొగడాలి. అతడు సినిమా తీస్తానంటే మీరు ఆస్కార్ స్థాయి దర్శకులని, మాకు ఆ స్థాయి లేదని తప్పించుకోవాలి.

**********************************************************

ఆ కుట్ర చక్కగా పనిచేసింది. రామాయణరావు పీడను చిత్రపరిశ్రమ అగ్రనటులు అలా సమర్థంగా ఎదుర్కున్నారు. దర్శకరాట్న తన ప్రయత్నాలు మానలేదు. మొన్నతరం నటి భాగమతితోనూ, నిన్నటితరం అపజయశాంతి తోనూ సినిమాలు తీశాడు. ఆ పైన తన సుపుత్త్రుణ్ణి వెండితెరకు పరిచయం చేస్తూ సినిమా తీసి, తను కూర్చున్న కొమ్మను తనే విరుగగొట్టుకున్నాడు.

రామాయణరావుకు ఆఖరుగా హిట్ వచ్చిన చిత్రం ’ఏమేవ్ నారాయణమ్మ".

ఆ తర్వాత అతడు సినిమాకళాకారుల సంఘానికి అధ్యక్షుడయాడు. కానివ్వకపోతే అతడితో సినిమా తీస్తానని వెంటబడతాడని అందరి భయం. ఆ తర్వాత సినిమా ఫంక్షన్ లలో ప్రసంగాలు ఇవ్వడం రామాయణరావుకు అలవాటుగా మారింది. ప్రతి సినిమా ఫంక్షన్ కూ హాజరై తన పురాణం వినిపిస్తూ శ్రోతల్లో గుండెల్లో నిద్రపోవడం అతనికి కొత్తగా అలవడిన విద్య.సంచలనాలు అన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి కాబట్టి అప్పుడప్పుడూ ఈయన తన మాటలతో సంచలనం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మధ్య ఎన్నో యేళ్ల తర్వాత శిశుకృష్ణతో సినిమా తీశాడు. ఆ సినిమాకు తుస్కార్ అవార్డు వస్తుందన్న స్థాయిలో రామాయణరావు ఆశపడ్డాడు. పరిశ్రమవర్గాలూ ఆ మాటే అన్నాయి (అనకపోతే జరిగేది తెలుసు కాబట్టి).

ప్రస్తుతం .... రామాయణ రావు సినిమా ఫంక్షన్ లలో స్పీచులిస్తూ ప్రశాంతంగా ప్రజల గుండెల్లో నిద్రపోతున్నాడు. ఇతడివి 140 సినిమాలయాయి. మరో తొమ్మిది సినిమాల వరకూ టైముంది. ఆ తర్వాత తన 150 వ చిత్రం ఎవరితో తీయబోతాడో! అప్పుడు సునామీలా ఎవరిమీద విరుచుకుపడనున్నాడో దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Saturday, July 7, 2012

వేయిపడగలతో నేను

అబ్బ! దాదాపు పాతికేళ్ళ క్రితం మొదలెట్టిన పని ఒక్కటి నిన్నటికి పూర్తి అయ్యింది. వేయి పడగలు చదివేశాను!

మాకు చిన్నతనంలో సంస్కృతం చెప్పిన అయ్యవారు విశ్వనాథ వారి శిష్యుడు, భక్తుడు. ఆయన అనువాదం క్లాసులో పాఠాలతో బాటు, మిగతా విషయాలు కూడా చెప్పేవారు. అందులో భాగంగా విశ్వనాథ గురించి చెప్పడమే కాక, ఆయన నవలలు తెఱచిరాజు, వేయిపడగలు, చెలియలి కట్ట వంటి వాటిని తరగతికి తీసుకు వచ్చి కొన్ని భాగాలు మాకు చదివి వినిపించేవారు. తెఱచిరాజులో కత్తియుద్ధవర్ణనా, వేయిపడగల ధర్మారావు గారి ఉపదేశాలు, చెలియలి కట్ట లో కొంతా ఏదో లీలగా జ్ఞాపకం ఉన్నాయి. చెలియలి కట్ట అర్థం కూడా ఆయన ద్వారానే తెలిసింది. ఒక్క సంఘటన మాత్రం జ్ఞాపకపు పొరల్లోంచి మొన్న వెలికి వచ్చింది. " స్త్రీలు మధ్యవయసు వాళ్ళను ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు? స్త్రీలు మామూలుగా భోగాసక్తులు, అలా కాకపోతే ఇద్దరు ముగ్గురు భార్యలుండి పిల్లల్లేని దుష్యంతుని శకుంతల ఎందుకు పెళ్ళి చేసుకుంది?" అని ఒకనాడాయన వేయిపడగలలో (18 వ అధ్యాయం) నుండి ఉటంకించారు. నేను  ఆయనను ఆక్షేపిస్తూ, "స్త్రీలందరూ భోగాసక్తులైతే మరి సుకన్య చ్యవనుణ్ణి ఎందుకు పెళ్ళి చేసుకుంది?" అని అడిగినట్టు గుర్తు. మా అయ్యవారికది నచ్చలేదు. ఏదో చెప్పారు, గుర్తు లేదు. నాకు మాత్రం విశ్వనాథ, మా అయ్యవారూ ఇద్దరూ అప్పట్లో నచ్చలేదు. ఆ నచ్చకపోవడం - మాకళీదుర్గంలో కుక్క - తో కాస్త బలపడింది. ఆ కథ నా తొమ్మిదవతరగతి పాఠ్యాంశం. ఆ కథా నాకప్పట్లో అర్థం కాలేదు. ఆ శైలీ నచ్చలేదు. (ఇప్పటికీ)

అంతలా ఆయన చెప్పిన వేయిపడగలు చదవాలని అప్పుడు నిశ్చయించుకున్నాను. మా పుస్తకం మా అయ్యవారినడిగితే ఇవ్వలేదు. విశ్వనాథ పుస్తకాలు అందరికీ సరిపోవని, బదులుగా మహీధరనళినీమోహన్ పుస్తకాలు చదవమని చెప్పారాయన.

అయితే వేయిపడగలు చదవాలన్న కుతూహలంతో మా ఊరి లైబ్రరీకి వెళ్ళి కొంచెం కొంచెం చదువుతూ వచ్చాను. అలా ఓ వందపేజీలు మాత్రమే సాగింది. ఇన్నేళ్ళ తర్వాత అది ముగిసింది.

*********************************************************************************

వేయిపడగల గురించి నా అభిప్రాయం


నవలలో ఆంగ్లేయుల దమన నీతిని గురించి వివరణలూ, భారతీయుల ఔన్నత్యప్రదర్శనా, గ్రామస్వరాజ్య విచ్ఛిత్తి వివరణల్లోని సూక్ష్మతా సంచలనాత్మకంగా, అద్భుతంగా ఉన్నాయి. ఒక చోట జేబులు కొట్టుకునే పిల్లవాని ఔన్నత్యం, అతనిలోని భారతీయాత్మ గురించి చెబుతాడు. హృదయం కదిలిపోతుంది. (అలాంటి సంఘటనలు నిజజీవితంలో ఎదురైతే వాటి విలువ తెలుస్తుంది.)  కొన్ని కొన్ని సంఘటనలు కరుణరసాత్మకంగా ఉన్నాయి. అదే సమయంలో ఆంగ్లేయులను ఉద్దేశించి సమాధానాలు చెప్పినంత మాత్రాన ఈయన భావాలు సరైనవని ఎందుకు ఒప్పుకోవాలో తెలియలేదు.

ఉదాహరణకు: "మోటారు వాహనానికి పెట్టే డబ్బు ముండకు పెడితే తప్పేంటి? ఒక వేశ్యకు పూటకు తినడానికి తిండి అయినా దొరుకుతుంది." - అంటాడొకచోట. ఇది నవలలో వచ్చే కొందరు వర్ణాధికుల వేశ్యాలంపటకు చవకబారు సమర్థన. ఆంగ్లేయులు లేని కాలంలో వేశ్యాలంపటను రచయిత ఏ రకంగా సమర్థిస్తాడు? 

ఇంకా - శూద్రుల దేవాలయ ప్రవేశనిరాకరణకు రచయిత సమర్థనా, దేవదాసీ వ్యవస్థకు glorification, ఆమె పాత్రచుట్టూ చిక్కగా అల్లిన కూటనీతి ఇలాంటివి కాస్తో కూస్తో ఆలోచనాపరులైన పాఠకులకు సహించవు. (తనసిద్ధాంతాలు కరెక్టని నిరూపించడం కోసం విశ్వనాథ సహృదయులు సిగ్గుపడే వాదనలు చేస్తాడు - వల్లంపాటి వెంకటసుబ్బయ్య) ఇక విస్సన్న చెప్పింది వేదమన్నట్టు లెక్చర్లు దంచడం, భిన్నవాదాలు ఇతర పాత్రలతో చెప్పి చర్చించకుండా, తనకు తెలిసింది ధర్మమన్నట్లు హీరో చెబుతూ పోవడం, వింటున్నవాళ్ళు ’బాంచెన్ దొరా’ అన్నట్టు ఊరుకోవడం కృతకంగా, పేలవంగా ఉంటాయి.

విద్యుచ్ఛక్తి మీద విశ్వనాథ విమర్శలు చదివితే రా.రా. మాటలు గుర్తొచ్చి నవ్వొస్తుంది. వీథిదీపాలు రావడం వల్ల ఆ తీగల మీద కూర్చుని కాకులు చచ్చిపోతాయట. అవి రావడం వల్ల ఆడాళ్ళు సాయంకాలం దీపాలు పెట్టరు, అందువల్ల ఇంట్లో మహాలక్ష్మి వెళ్ళిపోతుంది, పైగా ఆముదం అవసరం తీరిపోవడంతో ఆముదం పంట రైతులు మానేసి వరిపంటనే పండిస్తారట!

ఈ రచన విశ్వనాథ స్వీయచరిత్రేనని, నవలలో ధర్మారావు ఈయనేనని, ధర్మారావు, ఆయన మిత్రుల అభిప్రాయాలు, భావజాలం రచయితవేనని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నవలను విమర్శిస్తే భావజాలాన్ని విమర్శించనట్లవుతుందో, లేక రచనను మాత్రమే విమర్శించినట్లవుతుందో తెలియదు.

నవల చదివేప్పుడు చాలాసార్లు ఠాగూర్ గుర్తొచ్చాడు.  నవల పూర్తి చేసి వెతికితే ఆర్. ఎస్. సుదర్శనం గారు విశ్వనాథను, రవీంద్రనాథుని పోల్చి వ్రాసిన విమర్శ దొరికింది. (1964 భారతి సెప్టెంబరు నెలలో ప్రచురితం) కొన్ని లోపాలున్నప్పటికీ మంచి వ్యాసం. ఈ వ్యాసాన్ని తిరిగి సారస్వత వివేచనలో రా.రా. సమీక్షించాడు. అదీ గొప్పవ్యాసమే.

ఇంకా "కొల్లాయి గట్టితేనేమి" కూడా గుర్తొచ్చింది. కొల్లాయి గట్టితేనేమి, వేయిపడగలు రెండింటి కథాకాలం ఒక్కటే. 1920 లలో సమాజ ప్రభావం కుటుంబం పైనా, సాంప్రదాయవాది అయిన వ్యక్తి మీద ఎలా ఉన్నదో ఒక అగ్రహార నేపథ్యంతో చెప్పిన కథ మొదటిదైతే, అదే కాలంలో సుబ్బన్నపేట అనే ఒక గ్రామ (స్వరాజ్య) విచ్ఛిన్నతను వ్యక్తులజీవిత నేపథ్యాలతో చెప్పిన కథ రెండవది. మొదటిది Evolution. రెండవది Involution.  బిగువైన కథనం, చిక్కటి సన్నివేశచిత్రణా మొదటి నవలలో కనిపిస్తే, రెండవదానిలో ఉపదేశధోరణీ, సాంప్రయవాదం, జమీందారీవ్యవస్థాప్రతిష్టాపనాపరాయణత్వం, విస్తృతవిషయసంగ్రహం కనిపిస్తాయి. మొదటి నవల శైలి అనాయాసమూ, సులభమూ. రెండవ నవల శైలి గ్రాంథికం లాంటి వ్యావహారికం, వ్యావహారికం లాంటి గ్రాంథికం. ఈ రెంటిని పోల్చి తులనాత్మకంగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి.

వేయి అరఠావులు, 650 పేజీల ఈ నవలను ఈ రచయిత 29  రాజుల్లో వ్రాశాడట. గొప్పవిషయమే, కానీ అది quantitative assertion అవుతుంది. రచయిత పాండిత్యంకన్నా పాఠకునికి ఒరిగినదేమిటి అనేది సరైన ప్రశ్న. నవలలో విషయవిస్తృతి విషయవివేచనను మింగివేసింది. మొత్తం చదివిన తర్వాత పాఠకునికి ఎన్నో విషయాలు చదివినట్లున్నా అనేక విషయాలపై స్పష్టమైన అభిప్రాయం, అవగాహన ఏర్పడదు.ఎందుకంటే ఈ రచన మేధోనిష్టమైనది.

సాహిత్యం హృదయనిష్టమైనది. పాండిత్యం మేధోనిష్టమైనది. రెండిటికీ తేడా ఠాగూర్ కు, విశ్వనాథకు ఉన్నంత!