Tuesday, December 30, 2008

నా మొబైల్ కి తెలుగొచ్చేసింది

కొన్ని నెలల క్రితం, ఓపెరా విహరిణి తెలుగు లో రిలీజ్ అయినప్పుడు, వీవెన్ గారు ఓ టపా ద్వారా ఆ విషయం చెప్పారు. అప్పుడు ఓ అనుమానం వచ్చింది. మొబైల్ లో మన తెలుగు బ్లాగులు చూసుకోవచ్చా? అని. ఎందుకంటే, నాకు ఇంటి దగ్గర pc, లాప్టాప్ లేవు. పైగా వీలు చిక్కినప్పుడల్లా వారాంతాలు మా వూరికి ప్రయాణం పెట్టుకుంటూ ఉండడం వల్ల, ప్రయాణంలో బ్లాగులు చదువుకోడానికి అనువుగా మొబైల్ (ఓపెరా మినీ విహరిణి) లో చూసుకోవడం కద్దు. అయితే,నా మొబైల్ ఫోన్ (సోనీ ఎరిక్సన్ w 350-I) లో తెలుగు సదుపాయం లేదు. (అయితే యూనీ కోడు బెంగాలీ ఫాంట్, అరబిక్ వగైరా ఉన్నాయ్) అందుకే తెలుగు బ్లాగులు తెరిచినప్పుడల్లా, డబ్బాలు డబ్బాలు కనిపించేవి. ఫోన్ లో నేటివ్ ఫాంట్ లేకపోతే తెలుగు చదవడం కుదరదని ఓపెరా వారి ఉవాచ. వీవెన్ గారు ఆ విషయం ధ్రువీకరించారు.

ఈ రోజు ఉదయం ఓ అద్భుతం జరిగింది. మొబైల్ ఫోన్ లో ఎందుకో జీమెయిల్ చూసుకుంటుంటే, కొన్ని తెలుగు అక్షరాలు కనిపించాయ్. సరే అని, నా బ్లాగుకు వెళితే, చక్కగా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. అలానే కూడలి, లేఖిని వగైరా...

నేను నా మొబైల్ సాఫ్ట్ వేరు ను అప్డేట్ చేయలేదు. ఓపెరా కొత్త వర్షను దింపుకోలేదు. నా ఫోన్ లో ఇప్పటికీ తెలుగు ఫాంట్ లేదు. అయితే ఇది ఎలా సాధ్యమయిందో తెలియట్లేదు. ఈ మధ్య మా వూళ్ళో ఓ internet cafe లో కెళ్ళి, పాత చిరంజీవి పాటలు, కొన్ని గేములు ఎక్కించుకు రావడం తప్ప మరే పాపమూ ఎరుగను. ఏదైనా వైరస్సు తగులుకుందో ఏమో మరి. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే, ఆ వైరస్సు మాతకు నమోవాకాలు! :-)

మొత్తానికి ఇది చాలా పెద్ద వింతే నాకు!

మొబైల్ లో నా బ్లాగు :-

Thursday, December 11, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౫ప్రపంచంలో అతి పురాతనమైన పిరమిడ్లు ఎక్కడ ఉన్నాయి?

ఈజిప్ట్ అంటే పప్పులో కాలేసినట్లే.సరి అయిన సమాధానం సూడాన్. రాజధాని ఖార్తూం కు ఈశాన్య దిశ గా 500 కిలో మీటర్ల దూరంలో మెరో అన్న ప్రాంతంలో, నైలు నది సమీపాన ఉన్నాయివి. అయితే ఈ పిరమిడ్లు ఆకారంలోనూ, వైశాల్యంలోనూ ఈజిప్ట్ పిరమిడ్ల కన్నా తక్కువ.ఇవి క్రీస్తు జననానికి 3 శతాబ్దాల ముందు కాలానికి చెందిన కుష్ వంశస్తులకు చెందినవని గుర్తించారు. అప్పట్లో భారత దేశానికి ఇక్కడికి వర్తక సంబంధాలు ఉండేవట. ఆ ప్రాంతాన్ని అల్ బజ్రావియా అని వ్యవహరిస్తారు. అయితే ఇవి ఇప్పుడు దాదాపు శిథిలావస్థ కు చేరుకున్నాయి.

మరిన్ని వివరాలిక్కడ. అప్పటి కుష్ వంశ ప్రజల లిపి , (meroetic) పక్కన చిత్ర లిపి కన్నా కాస్త అభివృద్ధి దశలో ఉండటం చూడవచ్చు.

ఐతే అక్కడకు వెళ్ళాలంటే, ఇక్కడ ప్రభుత్వం విధించే అనేక గొంతెమ్మ ఆంక్షలు పాటించాలి, దారిలో ఎదురు పడ్డ పెద్ద మనుషులందరికీ ఆమ్యామ్యాలు సమర్పించాలి.

పిరమిడ్లు కాక మేము చూసిన ఇంకో చక్కటి ప్రదేశం జబల్ అవలియా. అది ఖార్తూం నుండీ గంట ప్రయాణం. అక్కడ నైలు నది (వైట్ నైల్) పై తెల్ల దొరలెవరో ఆనకట్ట కట్టేరు. అంత పెద్ద ఆనకట్ట ఉన్నా, అక్కడ వ్యవసాయం ఛాయలు కూడా లేకపోవడం గమనించాం. అక్కడి ప్రభుత్వపు అలసత్వం కాబోలు. అయితే, చేపల వేట పై ఆధారపడి ఎన్నో చిన్న చిన్న గ్రామాలు నివసిస్తున్నాయి.
ఇక ఆ చుట్టుపక్క గ్రామాలు దారిద్ర్యానికి నిలయాలు. అక్కడ జనాల జీవితం, మనం ఊహించలేని మరో ప్రపంచాన్ని మన ముందు నిలుపుతుంది. ఇటుకలతో కట్టుకున్న చిన్న చిన్న ఇళ్ళు, ఆ ఇళ్ళకు విద్యుచ్ఛక్తి మాట అన్నది లేదు. ఓ గ్రామం ఉండీ ఇంకో గ్రామానికి వెళ్ళటానికి కాలినడక, లేదా గాడిదల బళ్ళు. కాస్త ఆస్తిపరుడైతే, సొంత గాడిదపై సవారీ.

జబల్ అవలియా ఇటు వైపు ఒడ్డున ఓ ఈజిప్టు దేశానికి చెందిన ఓ వౄద్ధ మహిళ (పేరు గుర్తు లేదు) ఓ చిన్ని ఢాబా వంటిది నడుపుతోంది. (ఢాబాను అరబ్బీ లో ఏమంటారో తెలియదు). ఆవిడో సంఘ సంస్కర్త. మహిళా వివక్షత విపరీతంగా ఉన్న రోజుల్లో ఆవిడ నైలు నది లో చేపల వేట వౄత్తిగా స్వీకరించి, చేప మాంసాన్ని తక్కువ ధరల్లో భద్ర పరిచడానికి సదుపాయాలను కనుక్కున్నది. ఆవిడ కు భారత దేశ ప్రభుత్వం తరఫున కూడా ఓ అవార్డ్ ఇచ్చారు. ఆ వార్త, సంబంధించిన చాయాచిత్రం ఆమె ఢాబా లో ఓ చోట చూసాం.


మా వాళ్ళు మధ్యాహ్నం అక్కడ సూడానీ బ్రెడ్ లు, ఉల్లిపాయలు, చేపల కూర తో సుష్టు గా లాగించేరు. నేను శాకాహారిని. మొదట శంకించినా, ఆకలి నకనకలాడుతుండటంతో చివరికి అభక్ష్య భక్షణం చేశాను. నిజం చెప్పద్దూ, భలే రుచి గా ఉన్నాయి. నదిలో చేపలు కాబట్టి అనుకుంటా, నీచు వాసన కూడా లేదు.

Wednesday, December 3, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౪

ప్రపంచంలో ఏ మత్తు పదార్థమూ, మాదక ద్రవ్యమూ ఇవ్వనంత కిక్కు, ఉన్మాదం, సిద్ధాంతం (idealogy) ఇస్తుంది - తీసుకోగలిగితే. ఆ idealogy మతం కావచ్చు, వర్ణ విభేదం కావచ్చు, మరే ఇజమైనా కావచ్చు. మనిషి మనుగడలో సౌలభ్యానికి, మానవీయ విలువల ఆవిష్కరణకూ ఆలంబన కావలసిన మతం మనిషి వినాశనానికి దారి తీయటం శొచనీయం.

*************************************

సూడాన్ దేశం ఆఫ్రికాలో అతి పెద్ద దేశం. మన భారత దేశంలో మూడు వంతులు ఉంటుంది సుమారుగా. జనాభా 4 కోట్లు (మాత్రమే). దేశం లో దక్షిణ (సగ) భాగం పర్వతాలు, అరణ్యాలు అయితే, మిగిలిన భాగం ఎడారి. దేశమంతటా ప్రవహించే నైలు నది.

దేశానికి పడమర దిశగా, సరిహద్దులో ఉన్న ప్రాంతం పేరు దార్ఫుర్.

సూడాను గురించి గూగిలిస్తే, మనకు ఎదురయ్యే లంకె లలో ఎక్కువ భాగం ఆ దార్ ఫుర్ కి సంబంధించినవే.ఓ నాలుగు సంవత్సరాల క్రితం ఆ దార్ఫుర్ ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది పిల్లలు, ఆడవాళ్ళు అని లేకుండా, దారుణంగా హత్య చేయబడ్డారు. హత్యలు, మానభంగాల రాక్షస కాండతో ఆ ప్రాంతం అట్టుడికి పోయింది. లక్షల మంది నిరాశ్రయులై, పక్కన ఉన్న చాడ్ దేశానికి వలస వెళ్ళి కాందిశీకులుగా మారారు.

సూడాన్ అన్న పదానికి అర్థం "నల్ల వాళ్ళ భూమి" (land of blocks) అట. అక్కడ సాధారణంగా రెండు వర్గాల ప్రజలు కనిపిస్తారు. కారునలుపు రంగులో ఉన్న ఆఫ్రికనులు (నీగ్రోలు), కాస్త ముదురు గోధుమ వర్ణంలో ఉన్న ఆఫ్రో అరబ్బు జాతి వారు. (మాకు ఈ తేడా కనిపించింది, మేము చూసిన జన సమూహాల్లో).

ఆ ఆఫ్రికనులు అబ్దుల్ వహిద్ అల్ నుర్ అనే అతని నేతృత్వంలో 1992 లో Sudan Liberation Movement / Army అనబడే పార్టీ స్థాపించి, స్థానికుల (భూమి పుత్రుల) సమస్యలను పరిష్కరించుకోవాలనుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో National Islamic front కేవలం 10 శాతం ఓట్ళ తేడాతో ఓడిపోయింది. ఆ పార్తీ జెనెరల్ అల్ బషిర్ అధికారం హస్తగతం చేసుకుని, వెంటనే SLM మీద "జిహాద్" ప్రకటించి, దక్షిణ సూడాన్ లో నూబా పర్వత ప్రాంతాలపై దాడి చేయించి, భయంకరమైన ఊచకోతకు నాంది పలికాడు. ఆ మారణహోమంలో సుమారు 5 లక్షల మందిని చంపించాడని ఓ అంచనా. కొన్ని సంవత్సరాల పాటు స్తబ్దుగా ఉన్న NLM, తిరిగి దార్ఫుర్ దగ్గర ఓ గ్రూపుగా ఏర్పడి, కార్యకలాపాలు ఆరంభించసాగింది. ఈ సారి అల్ బషిర్, సూడాను లో ఆఫ్రో అరబ్బు తెగకు చెందిన జంజవీద్ అన్న తెగకు ఆయుధాలు అందించి, ఇంకో మారణ హోమానికి నాంది పలికాడు.పాశ్చాత్య ప్రపంచం, UN దీనికి స్పందించి, అక్కడ రక్షణ శిబిరాలు ఏర్పరిచి, సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ వ్యవహారం అంతా, అమెరికనులు, యూరోపియనులు, సహాయం పేరు తో జొర్బడి, సూడానులో ఉన్న తైల వనరుల ఆధిపత్యం కోసం ఆడుతున్న నాటకం అని అక్కడ అనేకమంది మనసులో సందేహం.

ఆ సంక్షోభం మీద ఇంకా అనేక వివరాలు అంతర్జాలంలో కనిపిస్తాయి.

మేము వెళ్ళినది రాజధాని ఖార్తూమ్ కు. ఇది అటు దార్ఫుర్ కు, ఇటు దక్షిణ ప్రాంత అడవులకు చాలా దూరం. అందువల్ల మాకు అక్కడ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదు.

అయితే ఓ రోజు...

ఆ రోజు పొద్దున ఆఫీసుకు వెళ్ళే దారిలో అనేకమంది రోడ్డుపైన జెండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ కనిపించారు. జాగ్రత్తగా గమనిస్తే (తేడా స్వల్పమే అయినా) వాళ్ళందరూ ఆఫ్రికన్లు అని గుర్తించవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత బాల్కనీ దగ్గర నిలబడి ఉన్నాం. మా ఆఫీసుకు కాస్త ముందు నగరంలో ఓ ప్రధానమైన కూడలి. అక్కడ మిలిటరీ దుస్తుల్లో కొంత మంది. పొద్దున బస్సుల్లో, బోక్సు ల్లో కనిపించిన ఆ విప్లవ కారులు ఆ కూడలి వద్ద గుమి గూడి కనిపించారు. ఇంతలో మేము చూస్తుండగనే కొన్ని కాల్పులు, భాష్ప వాయువు ప్రయోగం, నినాదాల జోరు మిన్నుముట్టాయి. మాకు అరబ్బీ రాదు కాబట్టి, ఏమీ అర్థం అవలేదు.ఆ భాష్ప వాయువు ప్రయోగానికి, స్వల్పంగా మాకు కళ్ళల్లో కాస్త మంటగా అనిపించడంతో లోనికి వెళ్ళాము. మా క్లయింట్ తో అడిగేము, ఆ గొడవ ఏమిటని. తను చెప్పినది, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జనాభా చేస్తున్న బందు అని. అప్పటికి నాకు దార్ ఫుర్, సూడాన్ సంక్షోభం గురించి తెలియదు., కాబట్టి పట్టించుకోలేదు. నిజమే కామోసు అనుకున్నా.

ఇంకో విషయం చెప్పటం మరిచాను. మేము ఖార్తూమ్ నగరంలో రోమింగ్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు, వూరి శివారులలో ధ్వంసమైన ఓ ఫాక్టరీ చూసాము. అది ఓ కెమికల్ ఫాక్టరీ. దాని గురించి అప్పుడు మాకు తెలియలేదు. (దాని ఫోటో తీసుకోలేదు, నిషిద్ధం కాబట్టి) తర్వాత ఓ రోజు అక్కడ ఒకతనితో మాటల సందర్భంలో తెలిసిన వివరాలివి.
ఆ ఫాక్టరీ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ఓ తీవ్రవాది తాలూకుది (అని చెప్పబడుతోంది).

ఆ వ్యక్తి ఒసామా బిన్ లాడెన్.

ఆ కర్మాగారంలో రసాయన ఆయుధాల ఉత్పత్తి జరుగుతోందని, పాశ్చాత్యులు ఎవరో దాడి జరిపి ధ్వంసం చేశారట. అక్కడ అలాంటిదేమీ లేదని, అక్కడి అభివృధ్ది ని ఓర్వలేక పాశ్చాత్యులు చేసిన ఆగడం అని అక్కడ కొంతమంది స్థానికుల వాదన. నిజానిజాలు భగవంతుడికే తెలియాలి.

దార్ఫుర్ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి మా అపార్ట్మెంట్ లో పని చేసిన మూసా అనే కుర్రాడు.


ఫోటోలో నల్లనయ్య మూసా. పక్కన మా కొలీగు.

మూసా తల్లిదండ్రులూ, బంధు వర్గం మొత్తం దార్ఫుర్ లో చంపబడ్డారు. ఆ తర్వాత ఏ పుణ్యాత్ముడో తనను తీసుకొచ్చి, ఇక్కడ పనిలో పెట్టేడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడు. ఆఫ్రికనుల వద్ద ఓ విషయం గమనించవచ్చు. వారు అమాయకులు.వారికి వచ్చినది, చెప్పింది చేయడం మాత్రమే.సొంతంగా ఓ విషయాన్ని ఆలోచించి, ఆచరణలో పెట్టే సామర్థ్యం అంతగా కనిపించదు వారిలో. మూసా కూడా అలాంటి వాడే. వాష్ బేసిన్ తాలూకు ఊడిపోయిన నీటి ట్యూబును బిగించమంటే ఓ రోజు "కుల్లు ముశ్కిలా" అన్నాడు, నవ్వుతూ. (కుల్లు ముశ్కిలా అంటే చాలా కష్టం). ఆ ముశ్కిలా అన్న మాట చాలా సార్లు విన్నాం తన దగ్గర. తన పని మా బట్టలు ఉతికి పెట్టటం, పాత్రలు తోమటం వగైరా, వగైరా అంతే. ఆ పైన మరే పని చేయంచాలన్నా మాకు భాష అడ్డు, తనకు "ముశ్కిలా". అయితే మా వాలకం చూసి తనూ, తన వాలకం చూస్తూ మేము, తెగ నవ్వుకునే వాళ్ళం.

(సశేషం)

Tuesday, December 2, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౩

హబూబ్ లో తడిసి మట్టి అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చేము. అక్కడ మా సంస్థలో భోజన శాలలో విచిత్రం. చాలా మంది భారతీయులు మమ్మల్ని చూసి, మేము వాళ్ళను చూసి ఆశ్చర్యపొయాం. సంగతేమిటంటే, అక్కడ ఆ సంస్థలో దాదాపు 30 శాతం భారతీయులే. డిప్యూటీ మేనేజరు తెలుగాయన కృష్ణమోహన్. ఇంకా బిహారీలు, మలయాళీలు (డీఫాల్ట్), ముంబైకర్లు, వగైరా, వగైరా. వంటతను వంగ దేశస్తుడు (బంగ్లా దేశ్)., చక్కటి భోజనం పెట్టేడు మాకు. భోజనం చివర్లో లస్సీ కొసమెరుపు.

అక్కడ ఉన్న భారత దేశ పౌరులు, మమ్మల్ని శుక్రవారం ఆహ్వానించేరు,తమతో గడపడానికి. వాళ్ళకోసం ఓ హాస్టలు ఏర్పాటు చేసారక్కడ.

సరే, మధ్యాహ్నం తిరిగి రోమింగ్ టెస్ట్ కోసం బయలుదేరాం. అంటే, కారులో ఊరంతా తిరుగుతూనే ఉండాలి. (రోమింగ్ టెస్ట్ కోసం)మా ఆఫీసు సందు గొందుల నుండీ కాస్త బయటకు వచ్చి, మెయిన్ రోడ్డు కి రాగానే ఊపిరి ఆగి పోయేంత చక్కటి దృశ్యం. అక్కడ - నైలు నది, దిగువన వరద కారణంగా, దాదాపు రోడ్డు కు ఒరుసుకుని, మట్టి రంగు (వరద) నీళ్ళతో, దాదాపు రెండు కిలో మీటర్ల వెడల్పుతో ఉధృతంగా ప్రవహిస్తోంది!చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది, నైలు నది ప్రపంచంలో అన్ని నదులకన్నా పొడవైనది, మన గంగా నదికి ౩ రెట్లు పొడవైనది అని. అప్పుడు స్వయంగా చూడ్డం. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

మేము చూసినది, బ్లూ నైలు నిజానికి. బ్లూ నైలు , వైట్ నైలు అన్న రెండు నదులు కలిసి, ఓ నదిగా ఏర్పడి, నైలు నదిగా ఉత్తరాన ఈజిప్టు వైపు సాగిపోతుంది. ఆ రెండు నదులు కలిసే చోటు సూడాన్ రాజధాని ఖార్తూమ్ లోనే. మన భారద్దేశం లో అయితే, అలాంటి సంగమం పవిత్రంగా భావిస్తాం. అక్కడ అలాంటిదేమీ లేదు. ఓ చిన్న పార్క్ ఏర్పాటు చేసారా సంగమ ప్రదేశంలో. మేము వెళ్ళినప్పుడు ౨ నదులు వరదలో ఉన్నాయ్ కాబట్టి, మట్టి రంగులోనే కనిపించాయి రెండూనూ.

నైలు నది పక్కన సాయంత్రం ఓ అనిర్వచనీయమైన అనుభూతి.
సరే, మొదటి రోజు ఆఫీసులో అలా గడిచింది. ఆ సాయంత్రం మా బసకు తిరిగి వచ్చేము. మేము సాయంత్రం వచ్చే సరికి, అక్కడ మా ఇంట్లో కరెంట్ పోయింది. మా డ్రయివర్ కు చెప్పాము వెంటనే, కరెంట్ లేదని. సరే, ఇప్పుడే వస్తా అంటూ, ఓ పది నిముషాల తర్వాత వచ్చేడు. వచ్చి కరెంట్ మీటరు దగ్గర ఉన్న కీ పాడ్ లో కొన్ని నంబర్లు నొక్కేడు. కరెంట్ తిరిగి వచ్చింది! అక్కడ కరెంట్ ప్రీ పెయిడ్. ఉన్న డబ్బులకు కరెంట్ అయిపోగానే, విద్యుత్ శాఖ ఆఫీసుకెళ్ళి, డబ్బులు కడితే, వాళ్ళో నంబరు చెబుతారు. ఆ నంబరు ఇంట్లో ఉన్న కరెంట్ మీటరు లో ఎంటర్ చేస్తే చాలు!

అన్నట్టు సాయంత్రం వచ్చేప్పుడు అక్కడ ఓ మిలిటరీ వారి ఆఫీసు చూసేము. అక్కడ UN వారి అనేక బళ్ళు అనేకం ఉన్నాయి. ఓ పెద్ద కాంపస్. ఆ కాంపస్ ద్వారం వద్ద కొంత మంది సాయుధులు కాపు కాస్తున్నారు. ఆ ద్వారం పై భాగాన, కొన్ని ఇసుక మూటలు (?) వెనుక నక్కి, కొంత మంది తమ గన్ లను గురి పెట్టి అలర్ట్ గా ఉన్నారు. అక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం.

సూడాను వివాదం గురించి వచ్చే టపాలో.
(సశేషం)

Friday, November 28, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౨

సూడాను విమానం దాదాపు ఖాళీ గా ఉంది. ఉన్న కొద్ది మంది భారతీయులు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళవటం వల్ల, కీసర బాసర గా గోల చేస్తున్నారు. వాళ్ళు మలయాళీలని వేరే చెప్పాలా?

సూడాను విమానాశ్రయం కు వచ్చి పడ్డాము. సాయంత్రం 4:30 గంటలు దాదాపు.అక్కడ ఇమ్మిగ్రేషన్ కవుంటరు దగ్గర నిలబడి ఉన్నాము. ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఎవరు లేరక్కడ. ఓ అరగంట టెన్షన్ గా గడిచింది. ఆ తర్వాత నల్లగా పొడుగ్గా ఉన్న ఒకతను మా వద్దకు వచ్చి, మా పాస్ పోర్ట్లను దాదాపు గుంజుకున్నంత పని చేశాడు. గంగిరెద్దు మెడ లో గలగంటలా, అతని మెడ నుండీ వేల్లాడుతున్న ఐ డీ కార్డును ఎవరూ చూడలేదు, నేను తప్ప. అతణ్ణి మేము ఎవరని విచారించే లోపల, ఇప్పుడే వస్తానంటూ ఎటో మాయమయాడు!

మా వాళ్ళు టెన్షన్ తో సినిమాల్లో గుండె పోటు వచ్చే ముందు గుమ్మడిలా తయారయ్యారు. షమీరు అయితే, పోలీసు కంప్లయింట్ ఇద్దామని మొదలెట్టాడు. నేను తన మెడలో మా కంపనీ కార్డు చూట్టం వల్ల నాకు కాసేపు అర్థం అవలేదు, జనాలెందుకు టెన్షన్ గా ఉన్నారో.

సరే, ఎలాగయితేనేం, ఆ నల్లనయ్య తిరిగి వచ్చేడు. అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ వాళ్ళతో ఏదో చెప్పి, బయటకు తీస్కెళ్ళాడు. అక్కడ స్కానింగ్ మిషను నడపడానికి ఎవరు లేరు. ఆ మిషను తనే ఆన్ చేసుకుని, ఆ పని అయిందనిపించాడు. సూడాన్ లో అడుగుపెట్టాం.

ఆ వచ్చిన వాడు అజ్ గర్. (అజగరం అంటే పాము అని అర్థం ట). తను అక్కడ మాకు సంబంధించిన కంపనీ లో ఫెసిలిటీస్ మేనేజరు. సూడాన్ లో బయట సంస్థలు స్వయంగా వచ్చి వ్యాపారం చేయడానికి వీల్లేదు. అక్కడ కంపనీ తో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి.

ఇంకో విషయం. ప్రపంచం లో అత్యంత లంచగొండి దేశాల చిట్టాలో మొదటి పదిలో సూడాను ఒకటి (ఎప్పుడో చదివినది). అందులో మన దేశం లేకపోవడానికి, మన వాళ్ళు ఆ చిట్టా తయారు చేసిన సంస్థకు ఎంతో కొంత కట్టబెట్టి ఉంటారని నా ఊహ.

విమానాశ్రయం బయట మా కోసం "బోక్సు" ఎదురు చూస్తోంది. బోక్సు అంటే, కారు కు ఎక్కువ, మెటడోర్ కి తక్కువ. ఓ చిన్న కారుకు, లారీకు వెనుక సైడు లగేజ్ వేయడానికి ఉంచినట్టు, ఓపన్ గా తెరిచి ఉంచారు. కారులో ముగ్గురు మాత్రమే కూర్చోగలరు. మిగిలిన ఇద్దరు కారు వెనుక ట్రాలీలో బయట ప్రకృతి సౌందర్యాన్ని అస్వాదిస్తూ ఊరేగాలి. నేనూ, నితినూ ఆ ఇద్దరం. నాకు చాలా సంతోషమనిపించింది.ఎందుకంటే, ఎప్పుడో కాలేజీ రోజుల్లో వూరి బయట ఉన్న మా కాలేజీ నుండీ వూరికి రావడానికి ఒకట్రెండు సార్లు, బస్సు టాపు పైకి ఎక్కి వచ్చిన రోజులున్నాయి.ఇప్పుడు ఎంతో కాలం తర్వాత అలాంటి అవకాశం !

అన్నట్టు సూడాన్ లో బోక్సు అన్నది ఓ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు. మన ఆటో లాగా.

అజ్ గర్ మమ్మల్ని ఓ అపార్ట్ మెంట్ వద్దకు తీసుకెళ్ళి దింపి, పొద్దున వస్తానని వెళ్ళేడు.

మా ఫ్లాటు లో 2 పడక గదులు, ఓ హాలు, ఓ టాయిలెట్ కం బాత్ రూమ్. అంటే 5 మందికి కలిపి ఒక్కటి! బాత్ రూం లో కాస్త ఫ్రెష్ అవడానికి వెళుతూ, మా కొలీగు నాబ్ ను క్లాక్ వైస్ గా బలంగా తిప్పేడు. అంతే! అది విరిగి చేతికొచ్చింది. అక్కడ మొత్తం మీటలన్ని వ్యతిరేక దిశలో పని చేస్తాయి!! ఉన్న ఒక్క రెస్ట్ రూము, దాని మీట మొదటి రోజు విరగడం. శుభం!!!

మరుసటి రోజు ఉదయం ఆఫీసుకెళ్ళాం. మా పనిలో భాగంగా మేము మా సంస్థ తాలూకు ప్రాడక్టు ను నగరం లో కొన్ని నిర్ణీత ప్రదేశాల్లోనూ, కారులో తిరుగుతూ ఉన్నప్పుడూనూ (రోమింగ్) రకరకాల టెస్ట్ లు జరపాలి. కాబట్టి పొద్దున 10 గంటలకు కారులో బయటపడ్డాం. బయట ఇలా ఉంది.తుఫాను, గాలి వాన అనుకుంటున్నారా? తుఫానే, కానీ గాలివాన కాదు. అది ఇసుక (దుమ్ము) తుఫాను. ఆ ఫోటో లో కనిపిస్తున్నది దుమ్ము, ధూళి. ఎంత ధూళి అంటే, కూత వేటు దూరంలో ఉన్నవి మనకు కనిపించవు. (ఆ ఫోటోలో ఉన్నది మా కొలీగు). దాన్ని "హబూబ్" అంటారు ఇక్కడ.

(సశేషం)Tuesday, November 25, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౧

శ్రీయుతులు గొల్లపూడి మారుతీ రావు గారు కౌముది జాల పత్రికలో జనవరి నుండీ జూలై వరకు ఓ ట్రావెలాగు (టాంజానియా) రాసారు. అత్యద్భుతమైన ట్రావెలాగు అది. అందులో ఆయన టాంజానియా కు ట్రావెలాగు ఏమిటి ఏ అమెరికాకో వెళ్ళక? అన్న అనుమానానికి, ఓ చక్కటి సమాధానం చెబుతారు.

"సంపద ఎక్కడ చూసినా ఒక్కలాగే ఉంటుంది. ఎక్కువ సార్లు చూస్తే బోరుకొడుతుంది....నేలబారు జీవితం ఆకర్షిస్తుంది. ఆలోచింపచేసేట్లు చేస్తుంది.A master piece is monotonus,while life is not...."

బహుశా అందుకేనేమో అభివృద్ధి చెందిన దేశాలకు వెళితే (కొంతకాలం పాటు), మొదట కొన్ని రోజులు ఆ ఆకర్షణ లో మునిగినా, మనకు మన ఇల్లు, మన వూరు, మన జీవితాలు తిరిగి గుర్తుకొస్తాయి. మేధ గారు కొన్ని నెలల క్రితం కొరియా మీద వరుస టపాలు రాశారు. ప్రతి టపా చివర "జై భారత్" తప్పనిసరి.ఆమెది ఆ రకమైన నొస్టాల్జియానే నేమో?

అయితే, ఉన్నన్ని రోజులు (రెండు నెలలు దాదాపు) కాస్తో కూస్తో మన లాంటి మనుషులు, మన జీవిత విధానానికి దగ్గరగా ఉన్న జీవితంతో, Feel at home అన్నట్టు నాకు అనిపించిన (నేను చూసిన) దేశంసూడాను.

************************************

వెంకటేష్ సినిమా "నువ్వు నాకు నచ్చావు" లో చంద్రమోహన్, "మా వాడికి, అదేదో సాఫ్ట్ వేర్ నేర్పించి, అమెరికాకు కాకపోయినా, కనీసం పాకిస్తాన్ అయినా పంపించరా" అంటాడు, ప్రకాష్ రాజ్ తో.

ఒకప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం కూడా అదే. అయితే బుద్ధి propose చేస్తే, లెగ్గు Dispose చేసిందన్నట్టు, నా భీకరమైన లెగ్గు వల్ల వచ్చిన అవకాశాలు అన్ని ఏవో కారణాల వల్ల తప్పిపొయాయి. రోజులలా గడుస్తుండగా ఓ రోజు నేను పనిచేస్తున్న కంపనీకి ఓ సూడాను ప్రాజెక్ట్ వచ్చింది. ఆన్ సయిట్ కి 5 మంది వెళ్ళాలి. సూడాను కాబట్టి ఎవరు ఆసక్తి చూపకపోవడంతో, 12th మాన్ లా పడి ఉన్న నాకు అవకాశం వచ్చింది. సూడాను అయితేనేం, నా జీవితంలో మొట్టమొదటి విదేశయాత్ర!

అయితే, అనుకున్నంత వీజీగా గడవలేదు. ప్రయాణానికి అడుగడుక్కూ ఆటంకాలే. నన్ను తప్పించి, ఇంకో అమ్మాయికి ఆన్ సయిట్ చాన్స్ కట్టబెట్టాలని బాసురుడి ఊహ (ఎందుకో ఊహించుకోండి). అయితే, ఆ అమ్మాయి అదివరకే ఒకట్రెండు అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి ఉండటం వల్లా, పైగా నాకా అమ్మాయి మంచి మిత్రురాలవటం వల్ల, అవకాశం తిరస్కరించింది ఆవిడ.

ఆఫీసులో ఇలా ఉంటే, ఇంటి దగ్గర మా నాన్న నా జీవితం పైన కుట్ర పన్ని నాకు పెళ్ళి చేయాలని తీవ్ర ప్రయత్నాలు ఆరంభించాడు. (నాకు పెళ్ళి సుతరాము ఇష్టం లేదు. ఫిలాసఫీ తల నిండా దట్టించుకున్న వాణ్ణి కాబట్టి). ఓ బలహీనమైన క్షణంలో మా నాన్న మాటకు సరే అన్నాను. ఇక అమ్మాయిని చూసారు. (మాకు తెలిసిన అమ్మాయే). పెళ్ళి చూపులు (బలవంతపు బ్రాహ్మణార్థం) ఎపిసోడ్ అయిపోయింది. అప్పుడు సరిగ్గా ఈ ట్రావెలు.

ఒడిదుడుకులన్నీ అయిన తర్వాత, ఓ సాదా ముహూర్తంలో (శుభ ముహూర్తం అనడం లేదు. ఆఫ్రికాకు వెళ్ళటానికి ఏ తొక్కలో ముహూర్తమైతేనేం?) బెంగళూరు నుండీ కింగ్ ఫిషర్ విమానంలో ముంబై కి బయలుదేరాం. అక్కడ నుండీ ఖతర్ ఎయిర్ లైన్స్ (ఈ పేరు విన్నప్పుడు ఎందుకో ఎడమ కన్ను అదిరింది నాకు) లో మా ప్రయాణం, సూడాను రాజధాని ఖార్తూమ్ కు. మధ్యలో దోహాలో (ఖతర్ రాజధాని) విమానం మార్పు.

*************************************

కింగ్ ఫిషర్ విమానంలో చాలామంది క్వీన్ లు. మొట్టమొదట ఏరోప్లేన్ ఎక్కగానే, అదీ కింగ్ ఫిషర్ విమానం, ఓ కొత్త బంగారు లోకం లోకి వచ్చి పడ్డట్టు అనిపించింది. మా జట్టులో మొత్తం 5 మంది. ఆ ఐదుగురిలో నేనూ, మా ఆన్ సయిటు టీం లీడరు నితినూ మట్టి ముఖాలం., పల్లెటూరి సరుకు. నితిన్ నాకంటే ఓ ఆకు ఎక్కువ నమిలాడు. బీహారీ. మిగిలిన ముగ్గురు సివిలైజ్డ్.

విమానం ఎక్కగానే మమ్మల్ని ఆహ్వానిస్తూ ఓ అమ్మాయి, చిరునవ్వుతో విష్ చేసింది. "ప్లీజ్ వెల్ కం" అంటూ. మా వాడు బదులుగా, ముఖమంతా నవ్వులు పులుముకుంటూ, "గుడ్ మార్ణింగ్" అన్నాడు. అప్పుడు సమయం సరిగ్గా, రాత్రి 9:30 గంటలు.

అలాంటి మరికొన్ని సంఘటనల మధ్య ప్రయాణం ప్రారంభమై, బొంబాయి విమానాశ్రయం వచ్చి పడ్డాం.

అక్కడ నాకు ఓ హర్డిల్ ఎదురయింది. సూడాన్ వెళ్ళటానికి మాకు సూడానులో మా కంపనీ తరపు ఆఫీసు నుండీ, అక్కడ ఎంబసీ ఆమోద ముద్ర పొందిన ఓ ఆహ్వాన పత్రం మాత్రమే ఉన్నది. వీసా (స్టాంపు) లేదు మా దగ్గర. నేను నిలబడ్డ క్యూలో ఉన్న వీసా ఆఫీసరు నన్ను ఎగాదిగా చూసాడు. నా పాస్ పోర్ట్ పెళ్ళి శుభలేఖలా కొత్తగా నవనవలాడుతూ ఉంది. నేను వెళ్ళబోయేది సూడాను. వాడికి అనుమానం వచ్చి, ఓ పెద్ద ఇంటర్వ్యూ మొదలెట్టాడు. యెల్లో ఫీవర్ షాట్ చూపించమన్నాడు (ఆఫ్రికా దేశాలకు వెళ్ళాలంటే, యెల్లో ఫీవరు ఇంజక్షను తీసుకోవడం తప్పనిసరి, తీసుకున్నట్టు ఋజువు కూడా చూపించాలి.), ఇంకా కంపనీ పేరు, అక్కడ సూడానులో మా ఆఫీసెక్కడ, ఇలా... నాకు టెన్షను పెరిగిపోసాగింది. మా వాళ్ళందరు ఇమ్మిగ్రేషన్ దాటి నా కోసం చూస్తున్నారు. ఆ ఇమ్మిగ్రేషను వాడు పక్కకెళ్ళి ఇంకో ఆవిడను పిలుచుకొచ్చాడు. ఆవిడ, వాడు మరాఠీలో మాట్లాడుకున్నారు కాసేపు. ఎట్టకేలకు నన్ను ఆమోదించి, పంపించారు అవతలకు.

ఆన్ సయిట్ కు బలిపశువుల్లా మా ప్రయాణం మొదలయింది. అన్నట్టు ఖతర్ ఎయిర్ లైన్స్ లోగో - మేక.

*************************************

ఎట్టకేలకు విమానం బయలుదేరి, ఖతార్ రాజధాని దోహా లో వచ్చి ఆగింది. దోహా విమానాశ్రయం శుభ్రంగా, విశాలంగా ఉంది. విమానాశ్రయం లో కార్మికులు చాలామంది భారతీయులే. విమానాశ్రయంలో ఓ చోట ప్రపంచ పటం, ఎక్కడెక్కడి నుండీ విమానాలు నడుస్తున్నాయి తదితర వివరాలు సూచించబడ్డాయి.

అందులో భారద్దేశం కూడా ఉంది. అయితే భారద్దేశం లో కాశ్మీరులో కొంత భాగాన్ని మాత్రం (ఆ భాగాన్ని ఆ - ఆక్రమిత పేరుతో పిలవడం అంటే మనస్సు చివుక్కుమంటుంది) పాకిస్తానులో కలిపి చూపించారు!

అక్కడ విమానం మారి సూడాను రాజధానికి వెళ్ళే విమానం ఎక్కాము. మా ఆన్ సయిట్ యాత్ర మొదలయింది.

(యేడాది క్రితం బ్లాగ్లోకంలో నా మొట్టమొదటి టపా కూడా ఇదే మకుటంతో రాసాను. దానికి కొనసాగింపు ఇది.)

(సశేషం)

Monday, November 17, 2008

Appraisal - ఈ డిసెంబరు చలిగా ఉంటుంది.

కార్పోరేట్ కీకారణ్యంలో జనాభాకు యేటా జరిగే తద్దినం తంతు దగ్గర పడింది. బాసుర నక్కలు ఈ పాటికే వ్యూహాలు మొదలెట్టాయ్. ఎవరి నోటి దగ్గర కూడు లాక్కోవాలి? ఎవరికి ఏ సైజు లో పిండం పెట్టాలి. "అమెరికాలో ఎవడికో గజ్జి, దురద., కాబట్టి మన ఎకానమీ కృంగి పోయింది" అని ఏ కారణాలు చెప్పాలి? ఇలా...

ఇక్కడ బెంగళూరు లో దాదాపు ప్రతీ కంపనీలోనూ బాసుర వర్గం ఎక్కువగా తమిళ తంబీలే. ప్రతీ సంవత్సరం ఈ టైమ్ లో వాళ్ళు వాళ్ళ బుద్ధికి పదునుపెట్టి, అస్మదీయులకు ఏదో రకంగా పిండంలో ఎక్కువభాగం ఇచ్చేస్తుంటారు. ఆ అస్మదీయ కాకులూ ఏ మాత్రం సిగ్గు లేకుండా (పడకుండా) ఆ కూడును మింగేస్తుంటాయి. ఈ generalization తప్పే అయినా, నేను చూసిన, విన్న అనేక అనుభవాలు ఇవి. ఈ విషయంలో నాకు మన తెలుగు వాళ్ళే నచ్చుతారు. నాకు తెలుగు బాసు ఎప్పుడూ తగల్లేదనుకోండి, ఇన్నేళ్ళ నా సర్వీసులో.

క్రితం యేడాది నుంచి మా వీరముష్టి (కొరియను) కంపనీలో కొత్త దరిద్రం తీస్కొచ్చి పెట్టేరు. స్కూల్లో పిల్లలకు ఇచ్చినట్టు టీములో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేడు/రాంకు ఇస్తారంట. దీనిని forced evaluation system అని హెచ్ ఆర్ వారు నిర్వచించి, ఇది ఈ మధ్య ప్రతీ కంపనీ వాడు పాటిస్తున్న సరికొత్త పద్ధతి అని, క్రికెట్ లో Duckworth - lewis లాగ ఎవడో తెల్ల వాడు ఈ పద్ధతికి రూపకల్పన చేశాడనిన్నీ, ఈ రూలు మా కంపనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ సంస్థల్లోను (subsideries) పాటిస్తారనిన్నీ నమ్మబలికారు.

ఇది వాళ్ళు ప్రకటించిన కొన్ని రోజులకు నాకు మా CEO తో మాట్లాడే అవకాశం వచ్చింది.

మా కంపనీ CEO చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో "ప్రజల వద్దకు పాలన" టైపులో "Lunch with CEO" అనే వినూత్న పథకానికి రూపు దిద్దాడు. అయితే రెండేళ్ళ క్రితం, ఇలాంటిదేదయినా మొదలెడితే ఐదు చుక్కల పూటకూళ్ళ ఇంట్లో తేలే వాళ్ళం. ఖర్చులో కోత కారణంగా, ఇప్పుడు మాత్రం కంపనీలో ఉన్న ఓ మీటింగ్ రూమ్ లో కొన్ని పిజ్జాలు, బిరియానీ, పెరుగన్నం, ఓ హిమ క్రిమి తో ముగించారు. ఉన్న దరిద్రానికి తోడు, ఆ కార్యక్రమంలో నేను భాగం పంచుకునే రోజు సరిగ్గా ఆ lunch లో బిరియానీ పెడితే, అందులో బొద్దింక వచ్చింది. CEO ఆగ్రహోదగ్రులయారు. (వాడికి బొద్దింక వచ్చినా, పామొచ్చినా పెద్ద తేడా లేదు, కొరియా వాడు కాబట్టి. అయితే డ్రామాలాడి సీను రక్తి కట్టించాడు, మా మీద తెగ concern ఉన్నట్టు).

ఆ అవేశం నుండీ వాడు తేరుకోక ముందే, నేను వాణ్ణి అడిగాను, " ఇట్లా ఉద్యోగులకు, రాంకులు ఇవ్వడం కొరియాలో చెల్లుతుందేమో కానీ, ఇండియా లో చెల్లుబాటు కాదేమో" అని.

అదే నేను చేసిన తప్పు.

కొరియా గాళ్ళకు ఓ భయంకరమైన weakness. వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ కల్చరును విమర్శిస్తే ఏ మాత్రం తట్టుకోలేరు. (కేవలం సిద్ధాంతాల కోసం విడిపోయి, కొట్టుకు చస్తున్న దేశాలు, ఉత్తర, దక్షిణ కొరియాలు. ఇందులో ఉత్తర కొరియా ప్రపంచంలోనే అతి ప్రామాదకరమైన దేశం - నేషనల్ జియోగ్రఫీ వారి ఓ అంచనా ప్రకారం).

ఇక CEO గాడు, మౌలిక విలువలని, కన్ ఫ్యూషియస్ అని తెగ తిన్నాడు నాకు. (కన్ ఫ్యూషియస్ గురించి ఓశో ప్రవచనాల ద్వారా నాకు తెలుసు కొంతవరకు. నాకు తనపై పెద్ద అభిప్రాయం లేదు). చివరికి ఇదో అత్యుత్తమ పద్ధతి అంటూ తేల్చేడు.

నేను నచ్చజెప్పబొయేను, దీని వల్ల బాసురులకు వాళ్ళ అస్మదీయులను పైకి తెచ్చే ఓ అస్త్రం దొరుకుతుందని. వినలేదు వాడు.

గత యేడాది సరిగ్గా అలానే జరిగింది. మా టీములో తమిళ్ మాట్లాడే జనాభా మొత్తం పండుగ చేసుకున్నారు. (నాకు అరవం వచ్చినా,నాలో సీమ రక్తం ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆ కుట్రలో పాలు పంచుకోలేదు).

పాలిసీ పెట్టిన ప్రతి యేడాది హెచ్ ఆర్ వాళ్ళు చెప్పే కథ ఏమంటే, "ప్రతీ పాలసీ లోనూ లోపాలుంటాయ్. ఓ మంచి పాలిసీ ని దీక్షగా పాటించడమే దీనికి సమాధానం" అని.

ప్రతి పాలిసీ లో లోపాలుంటే, కంపనీ మొత్తం లేదా టీము మొత్తం ఉన్న డబ్బును సమాన నిష్పత్తిలో పంచుకుంటే చాలు కదా. ఇంత భాగోతం ఎందుకు? దీనికి సమాధానం కూడా హెచ్ ఆర్ వారు ఓ నవ్వుతో దాటేశారు. (ఆ నవ్వులో మూసుకుని కూర్చోవోయ్, నువ్వో పెద్ద పిస్తా గాడివి బయలుదేరావ్ అన్న సందేశం ఉండాలి).

గత యేడాది జీతం సరిగ్గా పెంచనందుకు వాళ్ళు చెప్పిన కథ, "డాలరు విలువ పడిపోయింది. ఓ డాలరు కు 38 రుపాయలు. మన వ్యాపారం దెబ్బ తింది అని."

ఈ సారి ఓ డాలరుకు 48 రుపాయలు, పైగా మా కంపనీ వ్యాపారంలో యేడాది మొదటి అర్థం గత యేడాదికన్నా 10 శాతం ఎక్కువ లాభాలు ఆర్జించింది. (అనేక కంపనీలు, ఆ మాటకొస్తే). అయితే, వాళ్ళు చెప్పెబోయే కట్టుకథ మాత్రం, "అమెరికా లో ఆర్థిక సంక్షోభం!" అని.

కాబట్టి మానసికంగా ప్రిపేర్ అవడం మంచిది.

అన్నట్టు appraisal ను తెలుగు లో ఏమంటారబ్బా??

Friday, November 14, 2008

సిద్ధాంతం - నమ్మకం

బ్లాగ్లోకంలో సున్నితమైన విషయాల గురించి చర్చలు రకరకాల రీతుల్లో కొనసాగుతున్నాయి. ఇంతకు మునుపు చివుకుల కృష్ణమోహన్ గారి బ్లాగులో మొదలయిన రామాయణ చర్చ అనేక రీతుల్లో సాగి, అంతకు మునుపు ఇదే విషయంపై సాగిన చర్చను వెలికి తీసింది, ఇంకా విభిన్న కోణాలను ఆవిష్కరించింది. అయితే, లోగడ ఓ సారి భైరవభట్ల గారు సూచించినట్లు, ఇలాంటి చర్చల వల్ల అపోహలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.ఆ అపోహలకు కారణం ఆయా వ్యక్తులకు ఆయ విషయాలపై మీద ఉన్న తీవ్రమైన నమ్మకం ఓ కారణం కాగా, రచయిత చెప్పిన విషయాలను, ఉద్దేశ్యాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం కన్నా ముందుగానే అభిప్రాయాలకు వచ్చేయడం ఇంకో కారణం అవుతోంది.

ఓ నమ్మకాన్ని తీవ్రంగా విశ్వసించడం వల్ల మన దృక్కోణం పాక్షికమవుతుంది. సరిగ్గా అక్కడే నమ్మకం సిద్ధాంతంగా మారడం జరుగుతుంది.

తిరిగి అడుసు తొక్కుతున్నానని అనుమానం ఉన్నా, ఇప్పుడు రాముడిపైనో, మత విశ్వాసాల మీదో బురద చల్లడం నా ఉద్దేశ్యం కాదు కాబట్టి, రాముడి సంగతి ప్రస్తావిస్తున్నాను ధైర్యం చేసి.

"రాముడు ఏకపత్నీ వ్రతుడు. శూర్పణఖ వలచినా లొంగలేదు...తన కు భార్య లేకుంటే యాగానికి అనర్హుడనైనప్పుడు బంగారు బొమ్మను పెట్టుకున్న ఆతండ్రి ఏకపత్నీ వ్రతమెక్కడ? ..."

ఓ వ్యక్తి ఔన్నత్యమో, గొప్పతనమో మనం ఊహించేప్పుడు, తన చర్యలను, వాటి వెనుక ఉద్దేశ్యాలను, ఆ తర్వాత ఉద్దేశ్యాల వెనుక సిద్ధాంతాలను మనం పరిగణిస్తాం అసంకల్పితంగానైనా.

"కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ద్వారా కర్తవ్య బోధ చేశాడు"

కృష్ణుడి చర్య - గీత బోధ (ఇక్కడితో ఆగితే మనకు కృష్ణుడి గొప్పతనం తెలియదు)
ఉద్దేశ్యం - కర్తవ్య విమూఢుడిగా ఉన్న అర్జునుడికి దిశానిర్దేశం చేయడం. (ఇక్కడ మనకు ఆయన గొప్పతనం తెలుస్తుంది).

ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం.

"రాముడు ఏకపత్నీ వ్రతుడు. శూర్పణఖ వలచినా...."

చర్య - ఏకపత్నీవ్రతం
ఉద్దేశ్యం - జాగ్రత్తగా ఆలోచిస్తే,

ఏకపత్నీవ్రతం - ఓ గొప్ప వ్రతం.
ఏకపత్నీ వ్రతం - తనకు జీవితానికి అనుకూలం

మొదటి విషయానికి వస్తే, ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతమా? అలా అయితే, స్వయంగా రాముడి తండ్రి దశరథుడు ఏకపత్నీ వ్రతుడెందుకు కాలేదు? ఇంకా కాస్త ముందుకెళితే, సుగ్రీవుడు ఏకపత్నీ వ్రతుడు కాడు. సీతను చెరపట్టక ముందు వరకు రావణుడు - గొప్ప శివభక్తుడు, ఆత్మ లింగాన్ని సాధించిన వాడు, గొప్ప వ్యాకరణవేత్త, జ్యోతిశ్శాస్త్ర పండితుడు, రాజనీతిఙ్ఞుడు. లంకా రాజ్యం సకల సౌభాగ్యాలతో తులతూగేది, కాస్తో కూస్తో అయోధ్యకంటే కూడా. ఆ రావణుడు బహుపత్నీకుడే. అంటే, అప్పటి సమాజ పరిస్థితుల దృష్ట్యా చూచినా బహుపత్నీ వ్రతం పెద్ద దోషం కాదు.ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతమూ కాదు. (ఇక్కడ ఓ చిన్న విషయం. ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతం కాదు అని నేను ఊహించినది దశరథుడు మొదలైన వారు పాటించలేదు కాబట్టి అన్న అంచనాతో వచ్చింది తప్ప, రామాయణ గ్రంథం ఆసాంతం చదివి కాదు. ఒకవేళ వాల్మీకి తగిన కారణాలు చెప్పి ఉంటే తప్పు నాదే.). ద్వాపర యుగానికి వస్తే, కృష్ణ పరమాత్ముడు బహుపత్నీకుడు.

పై కారణాల దృష్ట్యా చూస్తే, ఏకపత్నీ వ్రతం అన్నది, తనకోసం తన అనుకూలత కోసం తను విధించుకున్న నియమం అన్నది మాత్రమే కనిపిస్తుంది.అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే, ఏకపత్నీ వ్రతం అన్నది ఓ సిద్ధాంతం (ideal) తప్ప అంతర్గతంగా విలువను ఆపాదించుకున్న ఓ సత్యం అన్న చెప్పలేము. ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతం అయితే కృష్ణుడి గొప్పతనాన్ని శంకించాలి. రాముడి ఏకపత్నీవ్ర్తతం ఎంత గొప్ప నియమమో, కృష్ణ పరమాత్ముని ప్రేమతత్వం కూడా అంటే గొప్పది. అంటే - (ఓ మనిషి చర్యలో) గొప్ప తనం సిద్ధాంతంలో లేదు!

ఇక్కడ నా ఉద్దేశ్యం, రాముడనే పౌరాణిక పురుషుడిపై బురద చల్లటమో, లేదూ, తప్పుల తడక అభిప్రాయాలను అందరిపై రుద్ధటమో కాదు. కేవలం, ఓ సిద్ధాంతం ఎంత గొప్పగా కనపడినా అందులోని పాక్షికత ను ఉదహరించటమే. అలాగని ఏకపత్నీ వ్రతులందరూ చెడ్డ వారని చెప్పటం లేదు.

రాముడు, లేదా ఓ మహనీయుడి గురించి తెలుసుకోవాలంటే, వారి చర్యలు, వాటి వెనుక అంతర్యం లోని మౌలిక విలువల గురించి సూక్ష్మ పరిశీలన గావించి తెలుసుకోవాలి. లేదంటే, వారి వ్యక్తిత్వాలు మన దైనందిన జీవితాలకు ఉపయోగపడతాయో వాటిని గ్రహించాలి.

సందర్భం వచ్చింది కాబట్టి, నేను చేసిన వ్యాఖ్యలు, గురించి ప్రస్తావిస్తాను.

"కృష్ణుడు ఆత్మ నిర్దేశం ప్రకారం నడుచుకున్న వాడు కాబట్టి అవతార పురుషుడు" - ఈ నమ్మకం నాలో బలంగా నాటుకుపోవటం వల్ల, ఓ సారి నా వ్యాఖను నేను పునశ్చరించుకున్నప్పుడు ఇదో ideal - ప్రతిపాదన లాగానే కనిపించింది తప్ప, ఇందులో నేను కనుక్కున్నది, నిజం అన్నది ఏమీ లేదు. అలానే కృష్ణుడి ఇంకొకరు చెప్పిన statement లో కూడా ప్రతిపాదన కనిపించవచ్చు తప్ప, ఓ మౌలికత, అంతర్గత విలువ అన్నవి లేవు.

ఈ విషయం మనం సంయమనంతో, ఆత్మ పరిశీలనలో మనం తెలుసుకోగలిగితే, వివాదాలు వచ్చే అవకాశం తక్కువ. అప్పుడు ఓ గొప్ప విలువ, లేదా ఓ మహనీయుడి వ్యక్తిత్వం అన్నది మౌలికంగా మన నిత్యజీవితాలకు ఉపయోగపడుతుంది అన్న దృక్పథంలో ఆలోచిస్తామేమో!

Wednesday, November 12, 2008

సైటోపాఖ్యానం

"ఉష్ ష్..మాట్లాడకు"

"మెల్లగా వెనక్కి తిరిగి చూడు"

"ఇప్పుడు కూరగాయలు కొంటున్నట్టు నటిస్తూ, నాకు సైటు కొడతాడు చూడు"

ఏ సినిమా నో తెలిసుండాలి?

గీతాంజలి.

అప్పట్లో "యూత్" కేకలు పెట్టారు, సైట్ కొట్టటం, లేచిపోదాం ...ఇలాంటి డవిలాగులను విని. ఇంకా బాగా వెనక్కి వెళితే, మన నలుపు తెలుపు కళాఖండాల్లో, "ఇల్లరికం" లో నాగేశ్వర్రావు "నిలువవే వాలు కనుల దానా" అంటూ జమున వెనుక పడటం, అప్పట్లో యూత్ ను ఉర్రూతలూగించి ఉంటుంది. ఇంకా "అయ్యయ్యో బ్రహ్మయ్య",అంటూ ఏయెన్నారు, "గుంతలకిడి గుమ్మ" అంటూ స్టిఫ్ గా చేతులు పెట్టుకుని డాన్స్ చేస్తూ కృష్ణ గారు, 80 వ దశకంలో బెల్ బాటం తో శ్రీదేవి ని ఆటపట్టిస్తూ (పీడిస్తూ) ఎన్టీ వోడు, "బెక బెక బావురు కప్పా....కోకోనట్" అంటూ బాపు బొమ్మ వెంటపడ్డ, మెగా స్టారుడు (మంత్రి గారి వియ్యంకుడు), "కోక దాగుడు కోటమ్మో" అంటూ సినిమాల్లో ఆరంగేట్రం చేసిన మొదట్లోనే విజయ శాంతి వెనుకపడ్డ బాలయ్య, "చికుబుకు చికుబుకు రైలే" అంటూ వూగిపోయిన ప్రభుదేవా,మొన్నామధ్య దేశముదురు లో "నిన్నే నిన్నే" అంటూ గ్లామరు సన్యాసి పిల్ల వెంట పడ్డ ఓ దేహముదురు....లిస్టు పెద్దదే!

అమ్మాయిలకు సైట్ కొట్టటం, లైనెయ్యడం అన్నది చాలా చాలా పాత ఫార్ములా అయినా హిట్ ఫార్ములా. నిజానికి ఇది ఫార్ములా కాదు, అన్నం లో ఆవకాయలా సినిమాల్లోనూ, ఇంకా మన జీవితాల్లోనూ ఉన్న ఓ స్పయిసే. మనలో చాలా మంది కూడా కాలేజీ జీవితంలోనో, ఆ తర్వాతో ఎవరికో ఒకరికి, ఏదో రకంగా లైను వేసి ఉంటాం..అమ్మాయిలు వెంటపడే అబ్బాయిలను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొని ఉండటం కూడా మామూలే.

నా వరకూ వస్తే తెగ లైన్లు వేసి, వేసి బాగా స్కిల్స్ సాధించి, లైన్మెన్ స్టేటస్ నుండీ బయటపడే లోపు పెళ్ళయిపోయింది!

సరే, ఇంతకూ సంగతేంటో చెబుతాను. నేను సంస్కృతం చదువుకునే రోజుల్లో, రఘువంశం 6 వ సర్గ ఉండేది మాకు. సర్గ మొత్తం పూర్తిగా. ఆ సర్గ లో సన్నివేశం ఇది.

హీరో స్వయవరానికి వచ్చి ఉంటాడు. స్వయంవరం చేసుకోబోతున్నది, ఇందుమతి అన్న హీరోవిను. పైగా సంచారిణీ దీపశిఖ.ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వరించడానికి ఆశపడని రాజు ఉంటాడా? అయితే అది స్వయంవరమాయె. ప్రతి రాజు దగ్గరా ఆమె కాసేపు ఆగి, ఆ రాజు గుణగణాలు తన చెలికత్తె సునంద విశదీకరించిన తర్వాత, నిర్ణయం తీసుకుంటుంది. ఆ సమయం చాలా తక్కువ.ఆ కొద్ది సమయంలో ఆమెను ఎలాగైనా మెప్పించాలి. అందుకని కొంతమంది రాజులు, ఆమె తమవద్దకు రాగానే ఆమెకు సైటు కొట్టటం ప్రారంభించారు.

అందులో మొదటాయన.

కశ్చిత్కరాభ్యాముపగూఢనాళం
ఆలోల పత్రాభిహతద్విరేఫం
రజోభిరంతః పరివేశబంధి
లీలారవిందం భ్రమయాంచకార

తామర పూవు కాడ (నాళం)ను రెండు అరచేతుల మధ్య ఉంచుకుని (ఇరికించుకుని), రేకులు ఎగిరిపడుతుంటే, ఆ పువ్వు పై వాలిన తుమ్మెదలు చెదరి పడేట్టు, తామర తూడు చుట్టుకుని పోయేట్టుగా, రెండు చేతుల మధ్య విలాసంగా తిప్పుతున్నాట్ట.

ఇక రెండవ కాండిడేటు.

విస్రస్తమంసాదపరో విలాసీ
రత్నానువిద్ధాంగదకోటిలగ్నం
ప్రాలంబముత్కృశ్య యథాప్రదేశం
నినాయ సాచీకృతచారువక్త్రః

కాస్త ఫేసు టర్నింగ్ ఇచ్చుకుని, వదులుగా ఉన్న తన రత్నఖచితమైన భుజకీర్తులను భుజానికి అదుముకుంటూ, వక్షస్తలాన్ని సవరించుకుంటూ ఉన్నాడు (ట).

మూడవ పార్టీ.

ఆకుంచితాగ్రాంగుళినా తతోన్యః
కించిత్సమావర్జిత నేత్రశోభః
తిర్యగ్విసంసర్పినఖప్రభేణ
పాదేన హైమం విలిలేఖ పీఠం

కాస్త తలవంచుకుని, కాలి బొటన వేలిని కాస్త మడిచి, కాంతులీనుతున్న గోరుతో (నఖంతో)హేమ పీఠాన్ని రాస్తున్నాడట.

......
......
............

ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆమెను ఆకర్షించాలని ప్రయత్నించేరు. ఆమె ఆఖరుకు అజ మహారాజు (దశరథుడి తండ్రి) ను వరించింది.

ఈ శ్లోకాలు 10 వ తరగతి లో (తెలియని వయసులో) చదువుకోవడం వల్ల, పెద్దగా అర్థాలు కనబడలేదు.చాలా రోజుల తర్వాత ఈ పుస్తకం దొరికితే, అందులో చూసి, కాస్త గుర్తుకొచ్చింది బ్లాగడం జరిగింది.

ఇంకో విషయం. కాళిదాస కృతులకు భాష్యం రాసినాయన పేరు కోలాచలం మల్లినాథ సూరి. ఈయన పదహారు అణాల తెలుగు వాడు. ప్రతీ శ్లోకంలోని నిగూఢ భావాలకు ఈయన భాష్యం చెప్పాడు(ట). ఉదాహరణకు, పైన మూడవ పార్టీ విషయం తీసుకుంటే, బొటన వేలితో పీఠాన్ని గీరడం దరిద్రానికి చిహ్నమట. అందుకనే ఇందుమతీదేవి ఆ రాజును వరించలేదట!

ఈ విషయాలు ఎవరైనా సంస్కృతం బాగా తెలిసిన వాళ్ళు విడమర్చి బ్లాగితే చాలా బావుంటుంది.

(ఇది ఈ సర్గ పరిచయం మాత్రమే, పైగా నాకు సంస్కృతంలో మంచి అభినివేశం లేదు.కాబట్టి తప్పులు ఉంటే, సవరించగలరు)

***************************

Friday, October 31, 2008

భాషా సేవకుడు, ఆయన రచనల పరిచయం

తిరుమల రామచంద్ర గారి గురించి, ఆయన రచన (ఆత్మకథ) "హంపీ నుంచీ హరప్పా దాకా" గురించి దాదాపు తెలుగు సాహితీ అభిమానులందరికీ పరిచయమే. ఆయన రాసిన మరి కొన్ని పుస్తకాల మీద ఓ చిన్ని పరిచయం.

౧. సాహితీ సుగతుని స్వగతం : రామచంద్ర గారు, చాలా చిన్న వయసులోనే భారతి పత్రిక కు వ్యాసాలు రాసే వారట. అప్పట్లో భారతి పత్రికలో వ్యాసం పడ్డం అంటే, అదో గొప్ప గౌరవమట. ఆ వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. ఇందులో కొన్ని అద్భుతమైన వ్యాసాలు.

ఆంధ్రచ్చందో విశేషములు : "ఎసగు , ఒసగు" అన్న పదాల చర్చకు సంబంధించి శ్రీ వజ్ఘల చిన సీతారామశాస్త్రి గారి వాదనను ఆక్షేపిస్తూ వ్రాసినది. ఈ వ్యాసం చదివిన పండితుడొకాయన ప్రభాకర శాస్త్రి గారి వద్ద ప్రస్తావిస్తూ, భారతి లో ఎవరో గొప్ప వ్యాసం రాసేరని అన్నాట్ట. శాస్త్రి గారు పక్కనున్న రామచంద్ర గారిని చూపించేరట. ఆ పండితుడు విస్తుపోయి, "ఎవరో శాలువా పండితుడనుకున్నాను. ఈ కుర్ర వాడా?" అని మెచ్చుకున్నారుట. ఈ ప్రస్తావన "హంపీ నుండీ..." లో ఉన్నది.

నువ్వులు కొట్టిన ఇడి నూటిడి : నన్నెచోడుడి కుమారసంభవం పరిష్కరిస్తూ, వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఓ చోట, "నూటిడి" అన్న భక్ష్య విశేషాన్ని, "నూబిడి (నువ్వు + పిడి -> పిడికిలి మేర నువ్వులు)" గా పేర్కొంటే, రామచంద్ర గారు, "నూటిడి" పదాన్ని అన్నమయ్య కీర్తనలోనూ, శ్రీనాథుని హరవిలాసం లోనూ వాడినట్టు ఋజువు చేశారు. ఇదో అత్యద్భుతమైన వ్యాసం.

బుద్ధుడికి ముందే ఉన్న ధూమపానం : ధూమపానం పైని వివరణ. ఇంకా ఇందులో ఆఫ్రికా కాల్పనిక సాహిత్యం, అనువాద సమస్యలు వంటి అద్భుతమైన వ్యాసాలున్నాయి. సాహితీ ప్రేమికులు మరువకూడని అద్భుతమైన పుస్తకం ఇది. విశాలాంధ్ర ప్రచురణ. ఇప్పుడు దొరకం లేదు!

౨.మనలిపి - పుట్టుపూర్వోత్తరాలు : లిపి పైన తెలుగులో కానీ, మరే భాషలో కానీ ఇంత సాధికారికమైన, సమగ్రమైన గ్రంథం వెలువడలేదు అంటే అతిశయోక్తి కాదు. రామచంద్ర గారు ప్రాకృతం పరిష్కరింపబడి, సంస్కృతం గా మారిందని, సంస్కృత, ప్రాకృతాల మధ్య జన్య జనక సంబంధం లేదని ఎన్నో ఋజువులు (ఆచార్య హేమచంద్రుడు, గాథా సప్తశతి వగైరా) చూపించారు. ఈ రచనలో పాళీ నుండీ సాగిన లిపి ప్రస్థానం ప్రస్తుత తెలుగు లిపి పరిణామం వరకు ఎంతో అద్భుతంగా వివరించబడింది. లిపి గురించి తెలుసుకోవాలన్న వారు ఈ గ్రంథం చదవకపోతే, వారి ఆసక్తి, అనురక్తి, అసమగ్రం అని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఇంకో గొప్ప విషయం. ఈ రచన వ్యవహార భాషలో సాగటం. ఇలాంటి గ్రంథం వ్యవహార భాషలో అదీ అప్పటి కాలంలో రాయడం ఓ నేర్పు.ఇదీ విశాలాంధ్ర ప్రచురణే.

౩. మనవి మాటలు : ఇదో చక్కని వ్యాస సంకలనం. ఇందులో కేరళ వారి "ఓణం" గురించీ, మాఘుని జ్యోటిశ్శాస్త్ర పాండిత్యం మీద, వినాయక చవితి మీద చక్కటి వ్యాసాలు.

౪. అహం భో అభివాదయే : రామచంద్ర గారు ఆంధ్ర ప్రభ లో పని చేస్తున్నప్పుడు, ఎందరో ప్రముఖులను ముఖాముఖి జరిపారు, మరెందరి మీదో అద్భుతమైన వ్యాసాలు రాసారు. అప్పటి ప్రముఖుల మీద రాసిన వ్యాస సంకలనం ఇది. విశ్వకవి రవీంద్రుడు, ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి, దాలిపర్తి పిచ్చిహరి, విస్సా అప్పారావు గారు, చిలుకూరి నారయణ రావు గారు..ఇలా ఎందరో గొప్ప వ్యక్తుల గురించి ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది.

౫. ప్రాకృత వాఙ్ఞ్మయంలో రామకథ : పైన ఇందాక చెప్పినట్టుగా, ప్రాకృతం అన్నది జనపదాల్లో వాడుకలో ఉన్న భాష కాగా, సంస్కృతం సంస్కరింపబడి, సమాజంలో ఉన్నత వర్గాల ఆదరణకు నోచుకున్న భాష. పల్లె సీమల్లో ఉన్న జీవన రామణీయత, వారి గాథలు మొట్టమొదట సంకలనం చేసిన సహృదయుడు హాలుడు. ఆ గాథలు గాథాసప్తశతి గా పొందుపరుచబడ్డాయి. ఈ పుస్తకంలో కొన్నివ్యాసాలు : వజ్జాలగ్గంలో తెలుగు పదాలు, ప్రాకృత ప్రకృతి (ఇది చాలా అద్భుతమైన వ్యాసం), వివిధ ప్రాకృత కవులు, బౌద్ధ రచనలు మొదలైనవి. ఇది ఓ అందమైన పుస్తకం.

౬. నుడి-నానుడి : మహీధర నళినీ మోహన్ గారి ఓ చిట్టి రచన, పిడుగుదేవర కథ. ఇందులో పిడుగు గురించి చాలా విషయాలు చెప్పారాయన. అందులో ఓ చోట తెలుగు పదాలు ఎలా మొదలయ్యాయి అని ఆసక్తి ఉన్న వారికి నుడి - నానుడి పుస్తకం సూచించారు. ఇదో శీర్షిక, ఆంధ్రజ్యోతి వారపత్రికలో. ఈ పాకెట్ సైజు పుస్తకం లో అనేక తెలుగు పదాలకు మూలాలు వెతికారాయన. ఇది కేవలం వ్యాసం రాస్తున్నట్టుగా, మధ్యమధ్యలో పిట్టకథలు చెబుతూ, కావ్యాల్లో ఉదాహరణలు పేర్కొంటూ, అందంగా సాగుతుంది. తెలుగు భాషా ప్రియులకు ఇదో ఆవకాయ. ఇందులో పేర్కొన్న కొన్ని పదాలు :గోంగూర, మిరపకాయ,నాచకమ్మ, చారు, సేపు వగైరా వగైరా...

౭. లలిత విస్తరం : ఇది బుద్ధ మహానుభావుని జీవితం. బౌద్ధపురాణం. దీన్ని, ఈయన, బులుసు వెంకటరమణయ్య గారు తెనిగించారు. ఈ పుస్తకం నేను చదవలేదు. ఈ మధ్య ఆనంద బుద్ధ విహార ట్ర్సస్ట్, సికందరాబాద్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించినట్టు చూసానెక్కడో.

౮. ఇంకా తెలుగు పత్రిక సాహిత్య సేవ, మరపురాని మనీషులు ఇలాంటి ప్రచురణలు ఈ మధ్య విశాలాంధ్ర వారు మళ్ళీ పునర్ముద్రించలేదు.

***********************************

Tuesday, October 28, 2008

మలయాళంకారం

"మీ ఇండియన్స్ ఇంగ్లీషు ఇంత చక్కగా మాట్లాడతారు కదా, కానీ ఇక్కడ యూనివర్సిటీ లో ఇంగ్లీష్ చెప్పే టీచర్లు ఓ రకమైన యాసతో మాట్లాడతారు. ఎందుకలాగ?" అడిగాడు క్లయింట్ దేవో భవ గాడు, నిరుడు యెమెన్ కి వెళ్ళినప్పుడు.

"అంటే?" అడిగాను అర్థం కాక.

"అంటే, "కాలేజ్" ను "గోళేజ్" అని, అరబ్ ను "యెర్ఱబ్" ఇలా ఖూనీ చేస్తుంటారు దారుణంగా" చెప్పాడు వాడు. వాడి కళ్ళల్లో అరుణిమ.

అర్థమయి నవ్వేశాను. (నవ్వక పోతే, అ కోపం మా మీద చూపించి మమ్మల్ని పీక్కు తింటాడు)

మలయాళంకారం గురించి ఇప్పటికే నెటిజనులకు తెలిసి ఉంటుంది. ఎన్ని మెయిల్స్ వచ్చినా తిరిగి మలయాళీల మీద వచ్చిన జోక్ కొత్తగానే అనిపిస్తుంది.

ఇంతకీ "మలయాళీ" కరెక్టా? "మళయాళీ" కరెక్టా?

***************************

కాలేజ్ అయిపోయిన తర్వాత మా వాడికొకడికి బిర్లా పోలీ ఫాబ్రిక్స్ అన్న కంపనీ లో ఉద్యోగం వచ్చింది. ఆ కంపనీ ఉత్పత్తి గంధకిక ఆంలము (సల్ఫ్యూరిక్ ఏసిడ్). సల్ఫ్యూరిక్ ఏసిడ్ ఉత్పత్తి లో ఓ (అనుబంధ ఉత్పత్తి) బై ప్రాడక్ట్ జనిస్తుంది. దాని పేరు ఓలియం (H2S2O7).

మావాడు డ్యూటీ ఇంజినీరు(ట). తన షిఫ్ట్ లో ఎంత ఉత్పత్తి సాధించేడు, తదితర వివరాలు పద్దు రాసి వెళ్ళాలి షిఫ్ట్ ముగిసి వెళ్ళేప్పుడు.

వాడి బాసురుడు తనిఖీకి వచ్చేట్ట.

"ఒళియూం" ఎంత? అడిగేడట.

ఓహో, "ఓలియం" గురించేమో అని మా వాడు ః౨౨ఓ౭ గురించి చెప్పేడుట.

బాసురుడు ఆగ్రహంతో, "అసలు నీవు ఇంజినీరింగ్ చదివావా? నీకు చెప్పేది అర్థం అవుతుందా ... " ఇలా మొదలెట్టేట్ట.
ఆఖరుకు తేలిందేమంటే, "ఓలియం" (H2S2O7) కు "వాల్యూం" (ఘనపరిమాణం) కు ఆ కేరళ బాసు ఒకే రకంగా సౌండిస్తాడు!


************************

ఇంకో సారి కేరళ కు మా ఇంట్లో వాళ్ళందరం పిక్నిక్ కి వెళ్ళాం. అక్కడ ఓ హోటల్ లో పొద్దునే, కాఫీ టీ లు వదిలేసి ఓ పెద్ద గ్లాసులో తెల్లటి ద్రవ పదార్థం తాగుతున్నారు జనాలు.

వెయిటర్ ను పిలిచి, సైగలతో అడిగేం, యేమిటదని.

వెయిటర్ నిండుగా ఊపిరి పీల్చాడు, సముద్రం లంఘించబోయేముందు ఆంజనేయుడు బిగపట్టినట్టుగా.

"హో-ర్ళి-క్స్" అన్నాడు, వూపిరి వదిలేస్తూ.

మా కజిన్ ఆ దెబ్బకు తుఫానులో చిక్కిన ఎండుటాకులా అల్లాడాడు.

******************************

మా ఇంట్లో మా మేనత్త కేరళ లోని కేలికట్ లో ఉంటుండటంతోనూ, మేము అప్పుడప్పుడు అక్కడికి వెళుతుండటంతోనూ, వాళ్ళ వాళ్ళు మలయాళం లో సంభాషిస్తుండంతోనూ, ఎంగళుక్కు మలయాళం స్వల్పమాయి అరయుం. (మాకు మలయాళం తెలుసు).

కేలికట్ అన్న వూరిని వాళ్ళు పిలిచేది కో-ఝి-కోడ్ అని. ఇక్కడ "ఝి" అన్నది కేవలం తమిళ్, మలయాళం లో ఉన్న ఓ అక్షరం. ఆ అక్షరమే అపభ్రంశం చెంది, ఱ గా మారిందని ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం లో తేల్చారు.

అన్నట్టు ఇంకో విషయం ఏమిటంటే, ఆ భాషలో "సంభాషించడం" అనడానికి ఏమంటారో తెలుసా? "సంసారిక్క్యాం" .

కేరళ భాషలో 64 శాతం సంస్కృత పదాలున్నాయట. ఇది మా మామయ్య చెప్పేడో సారి. ఆయన సంస్కృత, తెలుగు, హిందీ, భాషా పండితుడు. ఆయనకు మలయాళం కూడా తెలుసు. నాకు మాత్రం తెలుగే సంస్కృతానికి దగ్గర అని ఓ అనుమానం. "సంస్కృతం తెలుగు వాడి అబ్బ గంటు" అని ఓ తెలుగు కవి చెప్పినట్టు కూడా గుర్తు.

*************************

మలయాళం అర్థం చేసుకోడానికి, పనికొచ్చే మలయాళంకారం లో రూల్స్ కొన్ని ఇక్కడ పెడుతున్నాను.

1. ఎక్కడ "ల" ఉన్నా, దాన్ని "ళ" గా పలకండి. (కాలేజ్ - గోళేజ్, వగైరా...)
2. "ర" అన్న అక్షరాన్ని అప్పుడప్పుడు "ఱ" తో ఖూనీ చేస్తుండండి. (జేసుదాసు, అదేదో మోహన్ బాబు సినిమాలో "నగుమోము" త్యాగరాజ కృతి పాడేప్పుడు, "నగరాజ" అనే పదాన్ని ఎలా పలుకుతాడో గమనించండీసారి)
3. అక్కడయితే పదం మధ్యలో "ఒ" వస్తే, దాన్ని సాగబీకి, "ఓ" అని పలకండి.
4. వీలున్నప్పుడు, "క చ ట త ప" లను "గ జ డ ద బ" లు గా మార్చండి.
5. మీకు తమిళం తెలుసా, అలాగయితే, బాగా జలుబు తెచ్చుకుని, తమిళ్ మాట్లాడండి. ఓ 40 శాతం మలయాళం వచ్చేసినట్టే.
6. లేదూ, ముక్కు మూసుకుని తమిళం మాట్లాడండి.
7. "అ" ను "ఎ" గా పలకండి. ఏదీ "రెవి" అనండి చూద్దాం ఓసారి. (నా పేరండీ బాబు)
8. ఎంద - ఏమి, ఎత్తరె - ఎంత, యార్- ఎవరు ...ఈ బేసిక్స్ ను విచ్చలవిడిగా ఉపయోగించుకోండి. అవతల వాడు చెప్పినది అర్థం అయినా కాకపోయినా "ఓ!" అంటుండండి.
9. వత్తు పలికేప్పుడు, వత్తు తర్వాత అక్షరం సాగబీకండి. (ఉదా : మెసేజింగ్ అనడానికి, మా ఆఫీసులో ఓ కైరళి "మస్సాజింగ్" అంటుంది. ఆ అమ్మాయి అందం చూసి ఏమనలేక వొదిలేసాను)
10. వంటలో కొబ్బరి నూనెను అధికంగా ఉపయోగించండి. నాలుక జారి, మలయాళం పలుకుతుంది.

*****************************

పైవేవీ వర్క్ అవుట్ అవకపోతే, "వేండామొరు జీవిదం " అని ఓ నమస్కారం చెప్పండి.

Friday, October 24, 2008

ప్రాక్సీ తో నా ప్రయోగాలు!

భగవంతునికీ భక్తునికీ అనుసంధానించడానికి అంబికా దర్బారు బత్తి లా, ఆఫీసులో మీకూ (మీ విహరిణికీ) బ్లాక్ చేయబడ్డ సైట్లనూ చూడ్డానికి నేను ప్రయత్నించిన విధానాలు కొన్ని ఇక్కడ. మీరు నాలాంటి బాధితులే అయితే, ఈ ప్రయత్నాలు ఉపయోగపడతాయేమో ప్రయత్నించండి.

డిస్క్లైమర్ : ఇవి నేను ఎప్పుడో యూత్ లో ప్రయత్నించిన అస్త్రాలు. ఇప్పుడు పని చేయకపోతే నన్ను బూతులు తిట్టుకోవద్దు.

ముందుగా నల్లమోతు శ్రీధర్ గారి ఈ టపా చూడండి.

నా ప్రయత్నాలు.

1. మీ కంపనీ ప్రాక్సీ సర్వరు యూనిక్స్ (లైనక్స్) సర్వరా? అందులో మీకు అకవుంట్ ఉందా? అలా అయితే ఇది ప్రయత్నించండి. ముందుగా winaxe అనే ఈ ఉపకరణాన్ని దింపుకోండి. ఇదో x-సర్వర్. అంటే, మీ సర్వరు లో ఉన్న x windows ను మీ windows లో తెచ్చుకోడానికి ఉపయోగపడే మంచి ఉపకరణం. అంటే, మీరు కేవలం telnet ద్వారా మీ సర్వర్ కు లాగిన్ అయి, నల్లగా ఓ తారు డబ్బాను తెరుచుకుని, అందులో మీరు చేయవలసిన యూనిక్స్ పనులు చేసుకోకుండా, మీ windows PC లోనే, ఓ లైనక్స్ ఎక్స్ విండోస్ ను రన్ చేయాలనుకోండి. ఈ ఉపకరణం ఉపయోగపడుతుంది.

ఉపయోగించే విధానం : దింపుకుని, సంస్థాపించుకున్న ఆ ఉపకరణాన్ని, రన్ చేయండి. ఇప్పుడు మీ లైనక్స్ సర్వర్ లో టెల్ నెట్ ద్వారా ప్రవేశించి, షెల్ ప్రామ్ట్ దగ్గర ఇలా టైపించండి.

$export display=xx.xx.xx.xx:0 (xx.xx.xx.xx ఉన్నచోట మీ pc ఐ పీ అడ్రసు).
$netscape (లేదా విహరిణి నామం) లేదూ $gnome-session అని టైపిస్తే, మొత్తం అక్కడి డస్క్ట్ టాప్ మీ pc లో లభ్యం.

ఇప్పుడు మీ pc లో మీ లైనక్స్ సర్వర్ కు సంబంధించిన విహరిణి తయారు! మామూలుగా సర్వరులో సైట్లు బ్లాక్ చేసి ఉండరు కాబట్టి, అక్కడ మీరు చూడాలనుకున్న(బ్లాక్ అయిన) సైట్లు చూసుకోవచ్చు.

2. మల్టీ ప్రాక్సీ : కొన్ని పెద్ద పెద్ద కంపనీల్లో ఒక్క సర్వరు కాక, లోడ్ బాలన్స్ అవడానికని ఒకటి కంటే ఎక్కువ సర్వర్లను వాడటం కద్దు. మీ కంపనీ లోనూ అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే, మల్టీ ప్రాక్సీ అన్న ఉపకరణాన్ని గూగిలించి పట్టండి. ఇలాంటివి చాలా ఉన్నాయ్. (మల్టీ ప్రాక్సీ అనబడే పేరు తోనే ఓ ఉపకరణం ఉన్నది.అయితే, నేను దాన్ని వాడి ఎన్నో ఏళ్ళు గడిచాయ్.ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటో తెలీదు.) ఆ ఉపకరణం దింపుకుని సంస్థాపించండి. అది, డొబర్ మాన్ కుక్కలాగా మీ కంపనీ సర్వర్ లన్నిటినీ వాసన పసికట్టి ఓ లిస్ట్ తయారు చేస్తుంది. ఆ తర్వాత మీరు చూడాలనుకున్న సైట్ మీ కంపనీలో ఏ ప్రాక్సీ లో తెరుచుకునే వీలుందో, దాన్ని వెతికి, తద్వారా మీ ఆర్తి ని తీరుస్తుంది. ఇంకో సౌలభ్యం ఏమిటంటే, ఇందులో మీ pc ఐ పీ అడ్రసు ను మాస్క్ చేసుకోవచ్చు. అంటే, మీరు మీ pc కి మీ బాసు పేరో, మీకు నచ్చనోడి పేరో ఈ ఉపకరణం ద్వారా తగిలించి, వాడు బ్రవుస్ చేస్తున్నట్టూ, మీరు చాలా sincere గా పని చేసుకుంటున్నట్టు డ్రామాలాడవచ్చు. మంచి ఉపకరణం. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయ్ దీనిలో.

3. ఇంకో చిన్న అవుడియా. మీకు కొన్ని పాక్సీ లు తెలుసు http://www.vtunnel.com/, http://www.kproxy.com/ వంటివి.

అయితే ఇవి మీ ఆఫీసులో తెరుచుకోవు! ఇప్పుడో పని చేయండి. ఆ ప్రాక్సీ ల ఐ పీ అడ్రస్ (పింగ్ చేసి) కనుక్కోండి. డాస్ డబ్బా ఒకటి తెరిచి, అందులో ping http://www.kproxy.com/ అని టైప్ చేస్తే తెలిసిపోతుంది.ఇప్పుడు విహరిణి నావిగేషన్ బార్ లో ఈ ఐ పీ అడ్రస్ టైపు చేయండి. ఇది చాలా వరకు పని చేస్తుంది.

4. ఇది చాలా మందికి తెలిసిందే...చాట్ చేసుకోడానికి మీకు అవకాశం లేకపోతే, మీబో ను ఉపయోగించండి. ఇలాంటిదే మరోటి ఉండాలి, సబీర్ భాటియా ది. పేరు మరిచాను.

***************************

ఇవి కాక ఇంకా ఏమన్నా పద్ధతులు తెలుస్తే, దయచేసి నాకు తెలపండి. :-)

Thursday, October 23, 2008

మా ఇంటి మోనాలిసా

మోనాలిసా బొమ్మ చూసే వాళ్ళకు ఆమె (చిత్రం) లో ఒక్కోసారి ఒక్కో భావం ద్యోతకమవుతుందట. ఇంకో విషయం- ఆ చిత్రం గది లో యే మూల నిలబడి చూసినా చూసే వాళ్ళకు తమను చూస్తున్నట్టు ఉంటుందట.


మా 2 నెలల చంటిది (గుండు) కూడా మోనాలిసా కు ధీటుగా ఫోజు ఇచ్చింది. మా మోనాలిసా (చెబుతున్న ఊసులు) ఇక్కడ...

Wednesday, October 22, 2008

మిత్ర ఖేదం

సూర్యుడికి మేఘంలాగా, అగ్నికి నీరులాగా, పువ్వుకు తుమ్మెదలాగా,గౌతం పాలిటి దినకర్ లాగా మనకు మన జీవితాల్లో కొంతమంది స్నేహితులు తగులుతూనే ఉంటారు. అప్పుడప్పుడూ మనమూ వాళ్ళ పాలిట దినకర్ గా మారుతుంటాము.

గుండ్రాలు....గుండ్రాలు...గుండ్రాలు...

ఇంజినీరింగుకు ముందు, ఎమ్ సెట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రోజులు. ఫలితాలు రానే వచ్చాయ్. నాకూ, నా పాలిట దినకర్ అయిన అనంత్ కూ, మరో ఇద్దరు మిత్రులకూ రాంకు వచ్చింది! సృష్టిలో అప్పుడప్పుడూ అద్భుతాలు జరుగుతాయ్ అన్నది అర్థం అయింది. (ఎమ్సెట్ రాని మిత్రుల లిస్టు పెద్దది కాబట్టి ఇక్కడ చెప్పడం కుదరదు)ఎమ్సెట్ కొట్టామన్న ఆనందాన్ని మా నలుగురు, ఎమ్సెట్ తమను కొట్టిందన్న ఆక్రోశాన్ని మిగిలిన మిత్రులు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం. అందులో భాగంగా జీవితంలో మొట్ట మొదటి సారి ఓ "మంచి" మళయాళ చిత్ర రాజాన్ని చూడాలని నా మిత్ర బృందం నిర్ణయించింది. ఆ చిత్రం పేరు "అడవిలో అందగత్తెలు".

అందరూ మా ఇంటికి వచ్చేరు. మాది చాలా ఆర్తోడాక్స్ ఫ్యామిలీ!

"ఇలాంటి సినిమాలు చూస్తే చెడిపోతాం. అంత కక్కుర్తి తో ఈ సినిమా చూడ్డం నాకు ఇష్టం లేదు. నేను రాను"
ఉద్రేకంగా చెప్పాన్నేను.


ఓ ముప్పావు గంట తర్వాత సినిమా హాలు దగ్గరున్నాము.

అది మా వూళ్ళోని ఓ poorman's multiplex. అందులో 3 సినిమా హాళ్ళు. అందులో ఒక సినిమా హాల్లో శరత్ బాబు ప్రధాన పాత్రధారుడిగా "అయ్యప్ప స్వామి లీలలు" సినిమా ఆడుతోంది. ఆ పక్క సినిమా హాల్లో మేము వెళ్ళదలుచుకున్న సినిమా. రెండు సినిమా ల టికెట్ కవుంటర్లు, థియేటర్ తలుపుకి చెరో వైపున ఉన్నాయ్. అయ్యప్ప సినిమా కు విపరీతమయిన రద్దీ. టికెట్లు ఇవ్వడం ఇంకా ఆరంభించలేదు.

సరే అని బఠాణీలు, శనక్కాయలు షాపింగ్ చేయడానికని హాలు బయటికెళ్ళాం మేము. అక్కడ కాస్త నింపాదిగా కూర్చుని ఉన్నాం. ఇంతలో టికెట్ కవుంటరు ముందు లైటు వెలిగింది.

అంతే!

అయ్యప్ప స్వామి లీలలు సినిమా కోసం కాచుకున్న జనాభా అంతా మూకుమ్మడిగా రెండవ సినిమా హాలు టికెట్ కవుంటర్ వైపు పరిగెత్తుకు రాసాగారు. మేము త్వరగా స్పందించి, కవుంటర్ వైపు పరిగెట్టాము. ఎలాగోలా మా బృందం అందరం క్యూలో నిలబడి టికెట్లు తీసుకున్నాం. మా మిత్ర బృందంలో అనంత్ (దినకర్) మాత్రం లేడు!

బాక్ గ్రవుండ్ లో జరిగిందిదీ! మేము శనక్కాయలు తింటుండగా, మా వాడు అయ్యప్ప స్వామి సినిమా క్యూలో వాళ్ళ అక్కయ్య ఫ్రెండ్ నిలబడి ఉండటం చూసాడు. మాతో "ఇప్పుడే వస్తా" అని చెప్పి పక్కకెళ్ళాడు. నేనూ నా మిత్ర బృందంతో కలిసి పరుగులు తీస్తున్నప్పుడు వాడి అక్కయ్య ఫ్రెండ్ నన్ను చూసింది! (ఆమె ఇల్లు మా వాడి ఇంటి పక్కనే. నేను వాడి ఇంటికి అప్పుడప్పుడూ వెళుతుంటా కాబట్టి, నన్ను ఆమె గుర్తు పట్టింది). వాడు మాత్రం ఆమె కనుమరుగయే వరకు ఎదురు చూసి, తర్వాత మా దగ్గరకు వచ్చాడు.

సినిమా అంతా భయంకరమైన సస్పెన్స్త్ తో , ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలమధ్య, అడవిలో ఉత్కంఠ భరితంగా గడిచింది.ఆ సినిమా కు సెన్సార్ సర్టిఫికట్ ఇచ్చిన వాడికి ఇంగ్లీష్ అక్షరాలు సరిగా రానట్లుంది. "U" అని రాయాల్సిన చోట "A" అని రాసాడు.

మరుసటి రోజు వాడి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అక్క నా వైపు కొంచెం నిరసనగా, అనుమానంగా చూసింది. ఆ పయోముఖ సారా కుంభం గాడు అప్పటికే తప్పును నా మీదకు మళ్ళించి ఉన్నాడు. నాకు కొంచెంగా అర్థమయింది విషయం. ఎందుకంటే, మొట్ట మొదటి సారి జీవితం లో (so called) తప్పు చేసేం. ఎవరు అనుమానించినా అందుకేనేమో అని మనసులో ఓ అభద్రతా భావం.

ఆవిడ అడగనే అడిగింది నన్ను,వాణ్ణి కలిపి, "ఏరా, ఇంజినీరింగు సీటు వస్తూనే కొమ్ములొచ్చాయా? వెధవ పనులు, మీరూను" అంటూ. (నిజానికి వాళ్ళింట్లో అందరికీ, నామీద మంచి నమ్మకం, రవి మంచి బాలుడు అని.)

వాడు చెప్పక ముందే నేను చెప్పేను, "లేదక్కా, అయ్యప్ప సినిమాకని వెళ్ళాము. అక్కడ క్యూలో అందరు ఇంకో సినిమా వైపు పరిగెత్తుతుంటే, మేము పరుగెత్తి టికెట్లు కొన్నాం అంతే, హాలు లోపల చూస్తే, ఈ దరిద్రం సినిమా ఉండె. మాకసలు తెలీనే తెలీదు."

ఆమె నా మాట నమ్మినట్టే కనబడింది. (నా లాంటి అమాయకుడు అలాంటి తప్పులు చేయడని ఆమె గట్టి నమ్మకం కాబట్టి.)అంతా అయ్యప్ప లీల!!!

*********************************

వాణ్ణి దెబ్బ కొట్టే అవకాశం మరో సంవత్సరం తర్వాత నాకు వచ్చింది. ఇంజినీరింగు మొదటి యేడు అచ్చు "హాపీ డేస్" సినిమాలోలా గడిపేం. ఆ యేడు గడవగానే, నాకు రొస్టు సివిల్ ఇంజినీరింగు నుండీ తొట్టి మెకానికల్ కు, వాడికి రొస్టు సివిల్ నుండీ తోలు కెమికల్ కు ప్రమోషన్లు లభించాయ్. రెండవ ఏడు మా ఇద్దరికీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ కామను. మా ఇద్దరికీ నచ్చని ఒకే ఒక సబ్జెక్ట్ అది.

ఆఖరు ఇంటర్నల్ పరీక్షలు వచ్చాయ్. మామూలుగానే పరీక్షలను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఆ సమయంలో, నాకు (అవుట్ అయిన) ప్రశ్నాపత్రం ఓ మిత్రుడి ద్వారా దొరికింది. అప్పుడు...నాకో అద్భుతమైన అవుడియా వచ్చింది. ఎలాగు ప్రశ్నాపత్రం అందరికీ దొరుకుతుంది. అంతలోనే మా వాణ్ణి ఓ చిన్న ఆటాడించాలి! వెంటనే ఆ ప్రశ్నా పత్రానికి ఇంకో ఇంకో 5,6 ప్రశ్నలు (కొన్నిటికి తప్పుడు సమాధానాలు) కలిపి, తన వద్దకు వెళ్ళాను.

"రేయ్, రేపు జరుగబోయే పరీక్ష ప్రశ్నాపత్రం ఇది. ఏం చేస్తావో తెలీదు. మనం సాధ్యమైనంత త్వరగా అన్నిటికీ ఆన్సర్లు పట్టాలి. రాత్రిలోగా ప్రిపేర్ అవాలి" చెప్పాను.

ఆ రోజు రాత్రికి వాడో పేపర్ తీసుకొచ్చాడు. (బాక్ గ్రవుండ్ లో...వాడూ నన్ను దెబ్బ కొట్టాలని, కొన్ని తప్పుడు సమాధానాలు రాసుకుని తీసుకొచ్చేడు) సరే ఎలాగో మొత్తం ప్రిపేర్ అయాం. తర్వాతి పరీక్షలో ఇద్దరం ఫెయిలు!ఆ ర్వాత ఫైనల్ పరీక్షలోనూ విజయ వంతంగా ఫెయిలయాం ఇద్దరూనూ.

ఇక్కడో విషయం. అప్పట్లో మా యూనివర్సిటీ JNTU లో కొన్ని (3,4) సబ్జెక్ట్లు వదులుకున్నా డిగ్రీ రావడానికి ఢోకా ఉండదు. క్రెడిట్ సిస్టం అంటారు దాన్ని. అందువల్ల మాకు ఇబ్బంది లేదు.

అయితే ఇంటి దగ్గర ఊరుకోరు కదా. మా నాన్నకేమో వాడి మీద, వాడి నాన్న కేమో నా మీద నమ్మకం. ఇద్దరం ఫెయిలయ్యాం అన్న విషయం ఎలాగో ఇంట తెలిసింది. మేమిద్దరం మాట్లాడుకుని ఓ ప్లాను వేసుకున్నాం. వాళ్ళ నాన్నను నేను, మా నాన్న ను వాడు కన్విన్స్ చేసేట్టుగా.

అందులో భాగంగా ,అంకుల్ నా దగ్గరకు రాగానే నేను చెప్పాను. "అంకుల్, మా యూనివర్సిటీ పద్దతి చాలా ఆధునికంగా ఉంటుంది. విద్యార్థికి తనకు నచ్చిన సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిగించడం వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం. అందుకనే ఒకట్రెండు పరీక్షలలో ఫెయిలయినా పట్టించుకోదు. నిజానికి ఫెయిలవాలి కూడా. అలా కాకపోతే, వాళ్ళు మా మీద చర్య కూడా తీసుకుంటారు."

"ఇదేం యూనివర్సిటీ రా, పరీక్షల్లో ఫెయిలవమని చెబుతుంది. ఎక్కడా విన్లే" అన్నాడాయన.

"అదే అంకుల్, మా యూనివర్సిటీ గొప్పతనం. అందుకే ఇందులో సీటు రావడం చాలా కష్టం" చెప్పాను నేను.

మా నాన్న వాడి దగ్గరకెళ్ళాడు అనుకున్నట్టుగానే. వాడు అదో గొప్ప విషయంలా మా నాన్నకు సర్ది చెప్పేడు.

శుభం.

ఆ తర్వాత ఎప్పుడైనా వాడు నా మీద, నేను వాడి మీదా కత్తులు నూరాలని ప్రయత్నించినా ఇద్దరికీ చెడుపు చేస్తుండటంతో, అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు తనెక్కడో, ఏ దేశానికి పారిపొయాడో తెలీదు!

********************


Friday, October 17, 2008

తెలుగులో "ఇవ" అర్థములు!

ఓ అందమైన సీస పద్యం చదవడం తటస్థించింది నిన్న.

మామూలుగా కనిపిస్తూనే ఎన్నో విషయాలు తెలిపిందా పద్యం, దానిలో ఉటంకించిన వివరాలూను. ఇంకెందుకు ఆలస్యం., చిత్తగించండి.

సింధు బల్లహు రీతి, శ్రీపతి పండితు
మరియాద, ధూపద మాచిదేవు
నట్లు,మహాకాళుననువున, నల్ల క
ల్కద బ్రహ్మ ఠేవ, గక్కయ విధమున,
శూలద బ్రహ్మయ్య చొప్పున, బిబ్బ బా
చన లీల, వీర నాచాంకు పోల్కి,
కదిరె రెమ్మయగారి కైవడి, దెలుగేశు
మసణయ్య చందాన,మాదిరాజు

కరణి, మోళిగ మారయ్య గతి, దెలుంగు
జొమ్మనార్యుని వడువున, సురియ చౌడు
పగిది, బసవేశ్వరుని మాడ్కి భక్తి యుక్తి
శంభు బూజించి బ్రదుకు రాజన్య చంద్ర!


పై పద్యంలో 16 మంది ప్రముఖ శివ భక్తులు. వారందరి లాగ, రాజా, నీవూ శంభుని పూజించి తరించు అని భావం.

ఆ 16 మంది కథా కమామీషు ఇలా...

1. సింధు బల్లహుడు : ఇతణ్ణే బల్లాణ రాజు, బల్లవ రాయడు అంటారుట.శివుడు జంగముడై, ఈయన వద్దకు వచ్చి, ఓ వేశ్యను యాచించాడుట. ఈయన భార్యను అతని వద్దకు పంపాడుట. శివుడు ఆమెను సమీపించగానే శిశువు గామారాడుట.
2. శ్రీపతి పండితుడు : ఇంద్రకీలాద్రి శాసనంలో ఈయన ప్రస్తావన ఉందిట. ఈయన తన ఉత్తరీయంలో నిప్పులు మూటగట్టేడుట. ఆంధ్ర దేశంలో శైవం వ్యాప్తి చేసిన ముగ్గురిలో ఒకడు. (ఈన పేరు వినగానే మనకు బాగా పరిచయం ఉన్న ఒకాయన పేరు గుర్తుకు వచ్చి వుండాలి. శివునికి తేనె తో ఎన్నో యేళ్ళు అభిషేకం చేస్తే, తీయని స్వరం వస్తుందిట. శ్రీపతి పండితారాధ్యుల బాలు కూడా అదే పని చేసి ఉంటాడు ముందు జన్మల్లో)
3. ధూపద మాచిదేవుడు : ధూపం ఇచ్చేవాడు ధూపదుడు. బసవేశ్వరుని సమకాలికుడు.
4. మహాకాళయ్య : శివుడికి తల అర్పించి తిరిగి తలను పొందిన భక్తుడు.
5. కల్కద బ్రహ్మయ్య : మరో బసవేశ్వరుని సమకాలికుడైన భక్తుడు.
6. ఇంద్రజాలం చేసే కక్కయ్య
7. శూలద బ్రహ్మయ్య : శూలమును ధరించిన ఓ భక్తుడు
8. బిబ్బ బాచన : శివ భక్తుల ఇళ్ళలో బిచ్చమెత్తి, అన్నార్తులకు ప్రసాదించే వాడట ఈ శివ భక్తుడు. అప్పటి బ్రాహ్మణులు ఆయన బండిని నిరోధించాలని విఫలమయ్యేరుట.
9. వీర నాచయ : వీర నాచాంకుడనే మరో భక్తుడు
10. కదిరె రెమ్మయ : కోమాలో వెళ్ళిన ఓ వ్యక్తికి వైద్యం చేసి బతికించినట్లు చెప్పుకునే ఓ పల్లీయుడైన శివ భక్తుడు.
11.తెలుగేశు మసణయ్య: మసణము (శ్మశానము)లో నివశించిన ఓ భక్తుడు
12. మాదిరాజు : మరో భక్తుడు
13 మోళిగ మారయ్య : కట్టెలమ్ముకునే ఓ నిరుపేద భక్తుడు. ఈయనకు శివుడు సువఋనాలను ప్రసాదిస్తే, వాటిని పంచి తిరిగి నిరుపేదగా మిగిలి పొయేడుట.
14. తెలుగు జొమ్మయ్య :వేటగాడైన ఓ శివ భక్తుడు (తిన్నడంటే ఈయన కాదు)
15. సురియ చౌడయ్య :మరో ప్రసిద్ధ శివభక్తుడు.
16. బసవేశ్వరుడు : నంది అవతారుడని చెప్పుకునే, వీర శైవానికి ఆద్యుడైన మహా భక్తుడు. లింగాయతులనబడే వారు, ఈయనను పూజిస్తారు. పాల్కురికి సోమనాథుడి బసవేశ్వర చరిత్ర ఓ గొప్ప గ్రంథం.


బాగానే ఉంది, ఇంతకూ సంగతేంటి అంటారా?

తెలుగు లో "వలె" అనే అర్థం వచ్చే పదాలు మొత్తం 30 ఉన్నయి(ట).అవి- రీతి, మరియాద, అట్లు, అనువున, ఠేవ, విధమున, చొప్పున, లీల, పోల్కి (పోలె), కైవడి, చందాన, కరణి, గతి, వడువున, పగిది, మాడ్కి, లాగు, భాతి, భంగి, గరిమ, రేఖ, భావము, సోయగము, చెలువు, గారవము, వెరవు, సరణి, రమణ, క్రియ, తెఱగు

అందులో ఏకంగా 16 పదాలను ఇందులో ప్రయోగించడం ఓ యెత్తయితే, పేర్లను సీసంలో చక్కగా ఇముడ్చి చేసిన చమత్కారం ఇంకొకటి. (పేర్లను పద్యంలో ఇముడ్చటం కష్టం అని విన్నాను, అయితే నాకు ఉపజాతి పద్యాల గురించి అంతగా తెలియదు. పొద్దు లో రాఘవ గారి వ్యాసాలు ఇంకా పూర్తిగా చదవలేదు.)

ఇంతకూ ఈ పద్యం రాసినాయన ఎవరు అంటారా?

ఊహించండి.

2 క్లూలు.
1. ఈ పద్యం ఓ గ్రంథంలోనిది. ఆ గ్రంథం పేరు ఓ అచ్చుతో మొదలవుతుంది.
2. ఈయన ఓ ప్రబంధ కర్త (పంచ ప్రబంధాల్లో ఓ ప్రబంధం ఈయన కృతి)

(అందంగా కందాలు చెబుతున్న మన బ్లాగు సోదరులకు ఈఇవార్థములు ఉపయోగపడుందేమో అని ఓ ఆశ., అలాగే ఓ అనుమానం. "మాదిరిగా" అని మనం వ్యవహార భాషలో వాడతాం. ఆ పదం ఈ లిస్టులో లేదెందుకో?ఎవరికైనా తెలుస్తే చెప్పగలరు.)

**************

Sunday, October 12, 2008

కాళిదాసు శబ్దాలంకార చమత్కృతి!

ఉపమా కాళిదాసు, ఉత్ప్రేఖ్య కాళిదాసుల గురించి ఇదివరకు (కొన్ని నెలల క్రితం) రెండు మూడు టపాలు వచ్చాయి. ఇప్పుడు కాళిదాసు శబ్దాలంకార చమత్కృతి చూద్దాం.

యావత్తోయధరా ధరాధర ధరా ధారాధర శ్రీధరా
యావచ్చారు చచారు చారు చమరం చామీకరం చామరమ్
యావద్రావణ రామ రామ రమణం రామాయణం శ్రూయతే
తావత్తే భువి భోగ భోగ భువనం భోగాయ భూయాద్విభో

ఈ పద్యం లోని శబ్ద చమత్కారం ఎంత అందంగా ఉందో గమనించండి. ఇలా ఒకే రకంగా ధ్వనించే శబ్దాల ను ఆవృత్తిలో ప్రయోగించడమే యమకాలంకారం లేదా వృత్త్యనుప్రాస అంటారు(ట).

ఈ పద్యానికి అర్థం ఇది.(తప్పులుంటే నిర్మొహమాటంగా సరిదిద్దగలరు)

విభో : ఓ రాజా,తోయధరాః : మేఘాలు,ధరా : భూమి,ధరాధరః : పర్వతాలు,ధారాధరః : భూమిని మోస్తున్న ,శ్రీధరా: ఆది శేషుడు,యావత్ : ఎంతవరకు ఉంటాయో,చారు : అందమైన,చచారు : సంచరించడం అనే స్వభావం ఉన్న,చమరం : చామరీ మృగాలు,చామీకరం చ: సువర్ణ గిరి (మేరు పర్వతము),అమరం : జీవించి, యావత్ : ఎంతవరకు ఉంటాయో,రావణ రామ రామ రమణం : రావణుడు, రాముడు (వంటి పాత్రలతో) వీనులకింపైన,రామాయణం శ్రూయతే : రామాయణం వినబడుతుందో,తావత్ : అంతవరకు,భోగ భోగ భువనం : సకల భొగాలకు నిలయమైన,భువి : పృథ్వి,తే భోగాయ : నీ భోగాల కోసంభూయాత్ : ఉండు గాక!

పై శ్లోకం కాళిదాసు చెప్పిన చాటువు (ట).

ఈ అలంకారం హిందూ స్తోత్రాల్లో కూడా చాలా చోట్ల కనబడుతుంది. నాకు చప్పున స్ఫురించిన ఓ (శివతాండవ) స్తోత్రం లోని శ్లోకం ఇది.

జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్
ద్వినిర్గమ క్రమ స్ఫురత్కరాళ ఫాల హవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శ్శివః

పై స్తోత్రం లో ఇంకో విశేషం (నాకు కనిపించినది) ఏమంటే, సంస్కృతంలో ధాతువు (క్రియా వాచకం) తో ఆరంభించడం గొప్ప వ్యాకరణ పాండిత్యానికి ఋజువు(ట). పై పద్యం "జయతు" తో ఆరంభించడం లో అది కనిపిస్తుంది.

- ఈ టపా రాసేప్పుడు దీనితో పాటుగా ఇంకో టపా రాద్దామని బయలు దేరి, తొందరలో ఈ శబ్దాలంకారాన్ని రూపకం (యమకం అని ఉండాలి) అని చెప్పడం జరిగింది. ఇది చాలా అల్పమైన తప్పిదం. తర్వాత చాలా సిగ్గేసింది. సవరించిన కొత్తపాళీ, చంద్రమోహన్ గార్లకు కృతఙ్ఞతలు.

Saturday, October 11, 2008

ఓ సిగరెట్టు కథ

వచ్చే జన్మలో నేను మనిషిగా పుట్టకపోవచ్చునేమో కానీ, దున్నపోతుగా మాత్రం పుట్టను. ఎందుకంటే, నేనూ సిగరెట్టు తాగాను! గిరీశం శాపనార్థం నాకు తగలదు!

ఖగపతి అమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్

సరే, నా మొదటి సిగరెట్టు కాలేజీ చదువు ముగించి, పూనా లో ఉద్యోగం చూస్తున్న రోజుల్లో మొదలయింది. అప్పట్లో పూనా లో "అల్కా" అని ఓ సినిమా థియేటరు. సెలవు రోజుల్లో అక్కడ చెప్పనవసరమే లేదు. రంగు రంగుల సీతాకోక చిలుకల మయం. అయితే అపశృతి ఏమంటే, అమ్మాయిలందరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోనూ, వాళ్ళ కాలేజీ మేట్స్ తోనూ సినిమాలకు రావడం. నాలాంటి జిడ్డు ముఖాలను అస్సలు పట్టించుకోకపోవటం.

ఎలా...? వాళ్ళ దృష్టిలో పట్టం ఎలా?

ఆ దురాశే నా మొదటి సిగరెట్టు కు హేతువయింది. నేనూ నా మిత్ర బృందం ఓ మూల నిలబడి స్టవిలుగా ఒకే సిగరెట్టు పంచుకుని తాగేము. అమ్మాయిలు రాలే కానీ దగ్గొచ్చింది. ఆ తర్వాత నోరంతా చేదు వాసన..అప్పుడప్పుడూ మా ఆశ చావక మా మిత్ర బృందం సభ్యులు, అలా ఒకే సిగరెట్ పంచుకుని మా వంతు ప్రయత్నాలు చేశాము. అయితే,ఒకే సిగరెట్ అలా పంచుకుని తాగడం వల్ల డబ్బు ఆదా చేయగలిగామని కాస్త ఆత్మ తృప్తి మాత్రం మిగిలింది.మా లో బడ్జెట్ ప్రేమ వ్యవహారాలు మాత్రం ఫలించలేదు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నా వ్యర్థ ప్రయత్నాలను చూసి, ఎగతాళి చేయడం, నలుగురు చూసి నవ్వుకోవడం వంటివి అక్కడి అమ్మాయిలు చేసినట్టు కనబడలేదు. ఆ తర్వాత ఎంతో కాలానికి, నాకు ఆఫీసులో ఇద్దరు ముంబయి అమ్మాయిలు పరిచయమయ్యారు. ఆ అమ్మాయిలు నా టీమ్ లో పనిచేయడానికి ముంబయి IIT నుండీ వచ్చిన వాళ్ళు. (అన్నట్టు నేనో భయంకరమైన మొహమాటం గాణ్ణి లెండి) వాళ్ళతో కాస్త పరిచయం అయిన తర్వాత అర్థమయింది, వాళ్ళ కు అబ్బాయిలు చేసే కోతి చేస్టల గురించి చాలా వీజీగా తెలిసిపోతుంది అని. (అప్పటికి నేనింకా "యూత్" గానే ఉన్నాను). వాళ్ళకో సారి నేను చేసిన వ్యర్థ ప్రయత్నాల గురించి చెప్పేను. పడీ పడీ నవ్వారు. ఆ అమ్మాయిల్లో ఓ అమ్మాయి నన్ను చాలా లైక్ చేసేది(ట). ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ భర్తలతో, పిల్లలతో కాపురాలు చేసుకుంటున్నారు. నాకు మంచి ఫ్రెండ్స్ ఇప్పటికీ....ఓర్కుట్లో!

సరే..

సిగరెట్టు వెనుక నా ఉద్దేశ్యం సిగరెట్టు కాదు కనుక, నాకు అది అలవాటవలేదు. పూనాలోనే కొన్ని రోజులలా గడిచిన తర్వాత, ఉద్యోగం మారాను. ఆ కొత్త ఉద్యోగం లో, ఆఫీసులో ఓ అందమైన మరాఠీ రెసెప్షనిస్టు. తొలి చూపులోనే ప్రేమ మొదలయింది. ఏవేవో ఊహలు, ఎక్కడికో వెళ్ళిపొయే వాణ్ణి. ఆ ఊహల్లో ఓ ఊహ, ఎప్పుడో ఓ సిగరెట్టు తాగినా అది తనకు ద్రోహమే కదా అనేది ఒకటి. ఆ విధంగా సిగరెట్టు ఆలోచనలే దూరమయాయ్. కొసమెరుపు ఏమంటే, ఆ అమ్మాయి స్టయిల్ గా సిగరెట్ తాగే అప్పటి నా కొలీగ్ ని ఒకణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది!

అప్పుడలా వదిలేసిన సిగరెట్టు పొగ, మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత రాజుకుంది. ఈ సారీ అమ్మాయే, అందులోనూ పూనా అమ్మాయే కారణం. ఇక్కడ సాఫ్ట్ వేర్ సంస్థలో నేను పని చేసిన మొదటి ప్రాజెక్ట్ విజయ వంతంగా నాశనం అవడంతో, నన్ను వేరే టీమ్ లోకి మార్చారు. ఆ టీములో చేరిన తర్వాత మొదటి మీటింగు. నా ఎదురుగా ఓ అమ్మాయి వచ్చి కూర్చుంది. నా జీవితంలో ఓ క్షణం నాకు కాకుండా పోయింది. అంత అందమైన కళ్ళు నేనంతవరకు హీరోవిను భానుప్రియ లో మాత్రమే చూసాను.ఆ అమ్మాయి నా పక్క సీట్ అవడంతో మాటలు కలిపేను. ఆ అమ్మాయి తెలివయిందేమో, మొదటి రోజే చెప్పేసింది, తనకు పెళ్ళయినట్టుగా. సిగరెట్ మళ్ళీ రాజుకుందిక్కడ!

అదో పెద్ద బాధాకరమైన విషయం గా మారలేదు.

అయితే ఎప్పుడైనా (ఏ రెండు మూడు నెలలకో ఓ సారి) అలా ఓ సిగరెట్ తాగాలనిపిస్తే, తాగడంలో ఇబ్బంది లేదు. ఎలాగూ అది నాకు అలవాటు కాదు కాబట్టి.

ఓ ఏడాది క్రితం మాత్రం, సిగరెట్ నాకో చిన్న అనుభూతిని మిగిల్చింది. ఉద్యోగ రీత్యా, ఇండోనెషియా వెళ్ళాను ఆన్సైట్ కి. అక్కడ మా (కంపనీ) డ్రయివర్ మాకు బాగా నచ్చేడు. తన పేరు "ఉన్ తుంగ్". అంటే, వాళ్ళ భాషలో "అదృష్టం". అతను చాలా పేద వాడు. భారతీయులంటే చాలా అభిమానం తనకు. తను స్వయంగా షారుఖ్ ఖాన్ కి పంఖా. షారుఖ్ ఖాన్ సినిమాలు అక్కడ వాళ్ళ భాషలో అనువదించినవి సినిమా హాళ్ళలో విడువకుండా చూస్తాడట తను. అక్కడ కంపనీ రూల్స్ ప్రకారం మాకు ఆఫీసు టైములో తప్ప మిగతా సమయాల్లో కారు వాడుకునే అవకాశం లేదు. అయితే, ఈ డ్రయివర్ మాత్రం మా కోసం, అప్పుడైనా వచ్చి సహాయం చేసే వాడు. మేమూ తనకు సహాయం చేసే వాళ్ళం. అక్కడ నుండీ తిరిగి వస్తూ, తనకు ఓ బహుమతిగా ఓ మొబయిల్ ఫోన్ ఇచ్చేము. తనూ మాకు ఏదైనా ఇవ్వాలనుకున్నాడు. అయితే పేదవాడు , పైగా చదువుకోని వాడు కదా..చివరకు అక్కడ వాళ్ళ దేశం లో తయారయే "బుదం గరం" అనే ఓ సిగరెట్ పాక్ ఇచ్చేడు మాకందరికీ. ఆ సిగరెట్ లో ఉన్న ప్రత్యేకత , కాస్త చక్కెర లా తియ్యగా ఉన్న టేస్ట్.

ఆ చక్కెర తీపి, సిగరెట్ దా, ఆ పేదవాడి మనసులో మాపట్ల ఉన్న అభిమానానిదా? ఆ చిన్ని అనుభూతి మరువలేనిది.

Friday, October 3, 2008

ఒక(ప్పటి) ఊపున్న పాట !!

ఈ మధ్య ఆఫీసులో పనెక్కువై, యాహూ పాత మెయిలు చూస్తుంటే, నా మొట్టమొదటి ప్రచురణ కనబడింది. అది చూస్తూనే గుండేలో మరీ కోటి కాకపోయినా, ఓ వెయ్యి వీణలు మోగాయ్. ఇక భరించలేక ఇక్కడ పెడుతున్నాను. అదో పేరడీ పాట.

మృదులాంత్రం (జావా) ఊపులో ఉన్నప్పుడు ౨౦౦౦ లో, మృదులాంత్రం లో అడుగుపెట్టిన, అడుగుపెట్టదలుచుకున్న, ఔత్సాహికులు, పాడుకోదగిన ఊపున్న పాట అది.

అనగనగా ఓ యూఎస్ వుంది
యూఎస్ లోనే ఐటి వుంది
ఐటి వెనకే డాలర్ వుంది
డాలర్ జనులను కదిలించింది
కదిలే జనతా పరుగెత్తింది
పరుగే ప్రైవేట్ కోర్సయ్యింది
ప్రైవేట్ కోర్సే చెసిన జనులా
హెచ్1 వేట మొదలయ్యింది

బాడీషాపర్ నువ్వే కావాలి
నా బాడీషాపర్ నవ్వే కావాలి.
డాలర్ల పంటే పండాలి
యూఎస్ డాలర్ల మోతే మోగాలి.

సాఫ్ట్వేర్ కొమ్మలలోనా ఒ జావా, ఖవ్వాలి పాడి కచ్చ్చేరిచేసే వెళల్లో,
సర్వర్ గుమ్మంలోనా సరదాగా ఒక సర్వ్లెట్ రాసి,హోస్టింగు చేసే వేళల్లో,
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా, కవ్వింతగా

ఆఆ ఆ ఆఅ ఆఆ ఆఆఅ....ఆఆఆఆఆ ఆ

నీ చెలిమే చిటికేసి, నను పిలిచే నీకేసి
నువు ప్రాసెస్ చేసే ,హెచ్1 కోసం నేనొచ్చేసా, పరుగులుతీసి !! (బాడీషాపర్ నువ్వే..)

సిలికాన్ వేలీ చుట్టు , తిరగాలి అనుకుంటూ వూహవూరేగే వెన్నెల దారుల్లో,
నేనున్నా రమ్మంటూ, ఒ ఎంప్లాయర్, గాలాన్నే వేసే వేళల్లో,

నూరేళ్ళకీ సరిపోయె డాలర్స్నీ పండించగా,
ఆ తలపులు చిగురించి , మనసులు కదిలించీ

మరింత మంది సాఫ్ట్వేర్ జనులను యూఎస్ వైపుకు లాగేవేళ,
బాడీషాపర్ నువ్వే కావాలినా బాడీషాపర్ నవ్వే కావాలి...


అనగనగా...

********************************

అప్పుట్లో నేనూ యూఎస్ కోసమ్ ఎగబడ్డాను. అయితే, నా పేపర్స్ రాగానే, అక్కడ యూఎస్ లో భవానాలు కూలాయి.
సరే, కేవలం పేపర్స్ వస్తేనే ఇంత జరిగితే, అక్కడికి వెళితే ఏం జరుగుతుందో అని, లోకకల్యాణార్థం విరమించుకున్నా.

*******************************

ఆ పై పేరడీ అప్పట్లో indiainfo.com అన్న తెలుగు వెబ్ సైట్ లో ప్రచురించబడింది.

Hello Mr.Ravi,We are delighted by your parody song of Nuvve Kavali. And, as you suggested,we put it on the net.http://telugu.indiainfo.com/cinema/slideshow/index.html. Read this andenjoy. Keep sending funny things.All the best,Regards,Yours sincerely,JalapathyTeam memberhttp://telugu.indiainfo.com

(ఇది నా 50 వ టపా. రాయడమే గొప్ప అనుకునే నాకు ఇంత ప్రోత్సాహించీ, ఇన్ని టపాలు రాయించిన బ్లాగ్మిత్రులకు వేల వేల కృతఙ్ఞతలు).

Friday, September 19, 2008

నెట్ వర్క్ లాక్ అంటే?

అనుకున్నట్టుగానే ఐ-ఫోన్ అట్టహాసంతో వచ్చి, ఈ సరికి బాగా చప్పబడిపోయింది. ఇక్కడ మన సగటు భారత దేశపు కొనుగోలుదారుడిని ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఎందుకంటే, మామూలుగా వచ్చే చిన్న చిన్న ఫీచర్స్ కూడా ఇందులో లేవు. (ఉదా: sms forward, బ్లూ టూత్ ద్వారా ఇతర ఫోన్లకు అనుసంధానించడం వగైరా...)ఈ ఐ-ఫోన్ మొదట అమెరికా లో విడుదల అయినప్పుడు, అక్కడ జనాలు ఎగబడ్డానికీ, అక్కడ సక్సెస్ అవడానికీ కారణం, 3జీ ఫీచర్స్ అని నాకో అనుమానం.

నా మిత్రుడు ఒకతను, మొన్నామధ్య ఓ విషయం అడిగాడు. ఐ-ఫోన్ ఎయిర్ టెల్, వొడా ఫోన్ ల ద్వారా విడుదల అయింది కదా, ఫోన్ కొనుక్కుని, ఎయిర్ టెల్ లేదా వొడా ఫోన్ సిమ్ తీసేసి, ఐడియా సిమ్ వేసుకోవచ్చా? అని. ఐ-ఫోన్ సంగతి నాకు తెలియదు. అయితే,ఇదే ప్రశ్నఇంకో రకంగా అడగాలంటే "నెట్ వర్క్ లాక్ అంటే యేమిటి?" సెల్ ఫోన్ ను ఒక్క ఆపరేటర్ (ఎయిర్ టెల్) కి పరిమితం చేయవచ్చా? అని ప్రశ్నిస్తే..

సమాధానం.. వచ్చు. 3 పద్ధతుల ద్వారా. అవేవో చూద్దాం.

౧. MCC - MNC lock : అంటే, mobile country code, mobile network code అని. ప్రపంచంలో ఉన్న మొబయిల్ ఆపరేటర్లను గుర్తించడానికి ఉపయోగపడే సంకేతాలు ఇవి. వీటిని రెంటినీ కలిపి ఉపయోగిస్తారు, సాధారణంగా. ఇది మీరు వాడుతున్న సిమ్ లో పొందుపర్చ బడి ఉంటుంది. మీ సెల్ ఫోన్ బూట్ అవగానే, సిమ్ లో ఉన్న సమాచారాన్నంతా చదువుకుని, అందులో ఉన్న MCC, MNC సంకేతాన్ని కూడా తెలుసుకుంటుంది. ఆ సంకేతాన్ని కేవలం సంబంధిత ఆపరేటర్/కారియర్ కు పరిమితం చేయడం ద్వారా, మీ మొబయిల్ ఫోన్ ను ఇతర నెట్ వర్క్ లో పని చేయించకుండా ఆపగలుగుతారు.

దీన్నే ఇంకో రకంగా కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మొబయిల్ ఫోన్ కంపనీ వారు (నోకియా/సోనీ వగైరా) ఒకే మొబయిల్ ను అనేక దేశాల్లో విడుదల చేయవచ్చు, ఆయా దేశాలకు సంబంధించిన సమాచారాన్ని, ఫీచర్లను పొందుపరిచి. అంటే, ఉదాహరణకు సోనీ 350 I అన్న ఫోన్ ఉందనుకోండి. ఈ ఫోన్, భారతదేశంలో హిందీ భాషలో, కొన్ని భారతదేశానికి సంబంధించిన ఫీచర్లతో మార్కెట్లో ప్రవేశించింది. ఇదే ఫోన్, తిరిగి, గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేయాలనుకోండి. మామూలుగా అయితే, మళ్ళీ తిరిగి మొబైల్ సాఫ్ట్ వేర్ ను పూర్తిగా మార్చాలి. (అరబిక్ భాష, నమాజు సమయాలు వగైరా లాంటి ఆయా దేశపు ఫీచర్లను పొందుపరిచి). అయితే, MCC MNC lock ద్వారా సాఫ్ట్ వేర్ ని తిరిగి రాయాల్సిన అవసరాన్ని పూర్తిగా లేదా కొంతవరకు నిరోధించవచ్చు. (గల్ఫ్ దేశాలకు సంబంధించిన)MCC MNC సంకేతాన్ని గ్రహించి, ఇక్కడ భారతదేశపు ఫోనే (భారత దేశానికి చెందిన సాఫ్త్వేర్నే) ఆ దేశానికి అనుగుణంగా ప్రవర్తింపజేయవచ్చు.తద్వారా మొబయిల్ సంస్థలు development cost ని తగ్గించవచ్చు.

చివరకు వచ్చేసరికి కొనుగోలుదారుడికీ లాభం. మొబయిల్ ఖరీదు తగ్గడం ద్వారా.

౨. SID/NID Lock : System Identification number & Network identification number పూర్తిగా చెప్పాలంటే.

ఇక్కడ system అంటే, సెల్ల్యులార్ system అని అర్థం.SID అన్నది 15 బిట్ నంబరు. ఇది base station (మొబైల్ టవరు) ద్వారా సెల్ ఫోన్ కి పంపబడే సంకేతం. ఈ SID సంకేతం అందుకున్న తర్వాత, సెల్ ఫోన్, తన సాఫ్ట్వేర్ లో భాగమైన PRL (Preferred Roaming list) ద్వారా, హోం నెట్వర్క్, లేదా రోమింగ్ అన్న దాన్ని నిర్ధారిస్తుంది.ప్రతి ఆపరేటర్ కు ఈ SID రేంజ్ అన్నది ఆ దేశపు టెలికామ్ అథారిటీ నిర్ణయిస్తుంది.

ఇక NID అన్నది SID కి ఒక ఉపవ్యవస్థ. (sub system).ఇది 2 బైట్ నంబరు.

ఓ ఆపరేటర్ కు సంబంధించిన SID-NID రేంజి ను ముందుగానే తెలుసుకుని, ఆ పరిధి కి ఆవల ఉన్న SID లను ఫిల్టర్ చేసి, ఓ మొబయిల్ ఫోన్ ను ఒక్క ఆపరేటర్కు మాత్రమే పనిచేయించవచ్చు.

౩. MIN Lock : మీ GSM మొబయిల్ లో *#06# అని టైప్ చేసి చూడండి. మీకో నంబరు కనబడుతుంది. దాన్ని IMEI నంబర్ అంటారు. ఈ నంబరు మొబైల్ తయారీదారు వారి ఫాక్టరీ లో తయారయిన మొబయిల్ ను గుర్తించేకి ఉద్దేశింపబడ్డది. MIN నంబరు కూడా అలాంటిదే. ఇది మీ నెట్వర్క్ ఆపరేటర్ (airtel/vodaphone/bsnl)మీ మొబయిల్ ను గుర్తించడానికి ఉపయోగించే ఓ (10 అంకెల) నంబరు . చాలా సందర్భాల్లో, MIN నంబరు, మొబయిల్ నంబరు ఒకటిగానే ఉంటాయి. ఒక్కొక్క ఆపరేటర్ కు ఈ MIN పరిధి నిర్ణయించబడి ఉంటుంది. ఆ పరిధి ని నియంత్రించడం ద్వారా మొబయిల్ ను ఒక్క ఆపరేటర్ కు నియంత్రించవచ్చు.

*******************************

అయితే, పై చెప్పిన పద్ధతులు సాఫ్ట్ వేర్ ద్వారా నియంత్రించవలసినవే, సాధారణ మొబయిల్ వాడకందారు కు వీటితో అవసరం పడదు.

ఓ పక్క మొబయిల్ సంస్థలు (ముఖ్యంగా CDMA మొబయిల్ తయారీ లో ఉన్నవి), తమ ఆపరేటర్ల కోసం ఇలా మల్లగుల్లాలు పడుతుంటే, హాకర్లు, పై చెప్పిన lock లను చేదించే పనిలో పడ్డారు. ఇది పైకి కనిపించకపోయినా చాలా ప్రమాదకారి. దీని వల్ల Reliance వంటి ఆపరేటర్లకు చాలా నష్టం. వీరి మొబయిల్ ఫోన్ లు స్మగుల్ కాబడి, pirated సాఫ్ట్వేర్ ద్వారా ఇతర దేశాల్లో చలామణి అవబడే అవకాశం ఉంది. ఈ వ్యవహారాలకు కేంద్ర బిందువు చైనా.

Sunday, September 7, 2008

ఓషో ...

"Never born and Never Died. Only visited the planet earth between ...". పుణే లోని ఓషో సమాధి పై వ్రాసి ఉన్న వాక్యం అది. ఈ జగతిని నలుమూలలా ఎంతో మంది తమ భావజాలంతో పరిపుష్టం చేసారు, మానవ జాతికి దిశానిర్దేశం చేసారు. వారిలో శాస్త్రవేత్తలూ, కవులూ, దార్శనికులూ, తత్వవేత్తలు, వగైరా వగైరా..

భారతావని విషయానికి వస్తే, అదీ 20 వ శతాబ్దంలో, భారత ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన మొదటి 100 మంది వ్యక్తుల్లో ఓషో (భగవాన్ రజనీష్) ఒకడు. (ఇండియా టుడే వారి ఓ సర్వే ప్రకారం). ఓషో జీవితం భారతీయులను అంతగా ప్రభావితం చేయడానికి కారణం పరిశీలిస్తే -

ఓషో చిన్నప్పటి నుండే rebellious భావాలు కలవాడట. Rebellious కి, reactive కి మౌలికంగా ఓ తేడా. reactive అంటే, (సమాజపు) విలువలను ప్రశ్నించడం. Rebellious అంటే, ఆ విలువల ప్రాతిపదికను ప్రశ్నిచి, తద్వారా, ఆ విలువల సారాన్శాన్ని వ్యక్తిగతంగా ఆవిష్కృతం చేసుకోవడం. Rebelious is neither for or againest the society. He is for himself. చిన్నప్పటి నుంచే, తన ఇంట, తనకు తెలిసిన సమాజంలోనూ పాటించే విలువలను ప్రశ్నించే వాడట. ఇక కాలేజీ చదువులోనూ, మామూలుగా అందరు చదివే సబ్జెక్ట్లు కాక, తత్వా శాస్తాన్ని ముఖ్య అంశంగా ఎంచుకున్నాడుట. (ఓషో, JK, ఇద్దరూ, తము బోధించేది, తత్వం అని, తాము తత్వ వేత్తలని ఒప్పుకోరు).

ఇక ఓషో బోధలన్నీ, దాదాపుగా, సమాజంలో శతాబ్దాల తరబడి పాతుకుని ఉన్న విలువలను ప్రశ్నించేవిగా ఉంటాయి. మతం, పవిత్ర గ్రంథాలు, సమాజంలో గొప్ప గా చూడబడే వ్యక్తులు (గాంధీ, వినోభా భావే, మదర్ తెరిస్సా, శంకరాచార్యులు, ఇతర వర్గానికి చెందిన సన్యాసులు వగైరా), సమాజంలో గౌరవంగా, ఆదర్శంగా చూడబడే విలువలు (పెళ్ళి, ఆచార వ్యవహారాలు వగైర), వీటన్నిటిని ప్రశ్నిచడం, సమాన్యులెవరూ ఊహించని విధంగా విశ్లేషించడం, ఈ శతాబ్దంలో ఒక్క ఓషో కే చెల్లింది.

తన జీవన విధానం కూడా అలాగే ఉంటుంది. 99 రోల్స్ రాయస్ కార్లు, పుణే లో అత్యంత ఆధునికమైన ఓ ఆశ్రమం, ప్రపంచం నలుమూలలా శిష్యులు, కానీ, ఆఖరు రోజుల్లో, ఇమ్మిగ్రేషన్ సూత్రాలను ఉల్లంఘించాడన్న నేరంపై అమెరికా లో నిర్బంధితుడు అయి, అక్కడే తనపై విషప్రయోగం జరిగి, ఆ తరువాత ప్రపంచంలో 25 దేశాలు తనకు వీసాలు నిరాకరించి, చివరి రోజుల్లో పుణే లోని తన ఆశ్రమంలోనే మరణం...

ఇక వివిధ అంశాలలో తన భావాలను పరిశీలిద్దాం.

మతం.
--------

ఓషో దృష్టిలో వ్యవస్తీకరించ బడ్డ మతం (హిందూ, కిరస్తానీ, బౌద్ధ, జైన వగైరా) ఏదైనా హానికారియే. అందుకే ప్రతీ మతంలోని మతబోధకుల మీద ధ్వజమెత్తాడు ఆయన. పూరీ శంకరాచార్యులు, దిగంబర జైన గురువులు, రాధా స్వామి సంఘ గురువు, పోప్ వగైరా అందరి మీద ఎన్నో విమర్శనాత్మక వాఖ్యలు, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా సభల్లో సవాలు చేయడాలు వంటివి చేశాడు. ప్రపంచం లో అనేక మతాల ప్రాదుర్భావనకు ఆద్యులయిన వారి మీద, వారు బోధల మీద ప్రసంగించిన ఓషో, వారి తదనంతరం జర్గిన మత వ్యవస్తీకరణ ను మాత్రం నిరశించేడు.

దార్శనికులు
-----------

దాదాపు ప్రపంచం లోని గొప్ప దార్శనికులందరి మీద ఓషో సాధికారికంగా వ్యాక్యానించాడు. బుద్ధుడు, జీసస్, పతంజలి, కృష్ణుడు,మీర, కబీర్, గోరఖ్, అష్టా వక్రుడు, లవు త్సు, డయోజినిస్, హెరాక్లిటస్, జెన్ గురువులు, సూఫీ సాధువులు, బాల్స్, చివరకు జిడ్డు కృష్ణమూర్తి (కొన్ని సందర్భాల్లో)...వీరందరి మీద ఓషో అందంగా, అద్భుతంగా, ఆలోచింపజేసేట్టుగా, సాధికారికంగా వ్యాఖ్యానించేడు. అలాగే, వీరి బోధల మీదాను. ధమ్మ పదం, ఉపనిషత్తులు, యోగ, తంత్ర, సెర్మన్ ఆన్ ద మవుంట్, తావ్ తె చింగ్, జెన్ గురువుల బోధలు ఇలా...వివిధ మతాల మీద, ఆయా మతాలకు మూల పురుషుల మీద ఓషో చేసిన వ్యాఖ్యలు, ప్రపంచంలో ఇంకెవ్వరూ చేసి ఉండరు అన్నది అతిశయోక్తి కాబోదు.


నిత్యజీవిత విషయాలు

----------------------------


ఓషో ప్రవచనల్లో కనిపించే ఓ ముఖ్య అన్శం ఏమంటే, అవి అలౌకికంగా, తాత్విక చర్చల్లా కాక, నిజ జీవిత సమస్యలకు, దైనందిన జీవితంలో మానవుడు ఎదుర్కునే మౌలిక సమస్యలకు అన్యయించి చెబుతున్నట్లు ఉంటాయి. అవీ, ఒకింత హాస్య చతురత తో కూడి ఉంటాయి. ఒక్కో సారి, తన శ్రోతలకు ఉలికిపాటు కు గురి చేసే అసభ్యమైన జోకులు చెప్పడమూ, ఈయనకే చెల్లింది. అదే విధంగా, తన బోధల్లో పశ్చిమ దేశాల మనస్తత్వానికి సంబంధించిన వస్తు ప్రపంచానికి (material world) కు, తూరుపు దేశాల మనస్తత్వానికి చెందిన ఆముష్మిక చింతన నూ అద్భుతంగా
సమన్వయ పరచడం కనిపిస్తుంది. ఓ రకంగా తన బోధల సారాన్శం "జోర్బా ద బుద్ధ" . జోర్బా ఓ గ్రీకు సుఖ పురుషుడు. బుద్ధుడు మానవీయ ఆముష్మిక చింతనకు వారధి. వీరిద్దరి సమన్వయమే ఓషో బోధ. ఇంకో కోనం లో చెప్పాలంటే, "Be a laughter un to yourself", బుద్ధుడి "Be a ight un to yourself" కి anomaly.

శృంగారం

-------------

ఓషో శృంగారం పై మొదటి సారి " Sex and the super consciousness" అన్న మకుటంపై కొన్ని వరుస వ్యాఖ్యానాలు చేశాడు. అది ఆ తర్వాత పుస్తకంగా వెలువడింది. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఓషో కు ఎంతో మంది శత్రువులను సంపాదించి పెట్టింది. ఎందుకంటే, ఓషో భావనలు తర తరాలుగా పేరుకుని ఉన్న చాందస భావాలకు గొడ్డలిపెట్టు లాంటివి. వ్యవస్తీకృతమైన ప్రేమ - పెళ్ళి (marriage) పైన ఓషో భావనలు దిగ్భ్రాంతికరంగా ఉంటాయి. (పెళ్ళి పైన JK భావనలు కూడా ఇంచుమించు ఇలాంటివే. ఇద్దరి భావనల మధ్య సారూప్యం చాలా వరకు మనం గమనించ వచ్చు). ఇక ఆ పుస్తకం ఓని super consciousness (అపూర్వ చేతన) గురించి - ధ్యానం అన్నది, నిశ్చేతన (Unconsciousness) నుంచి అపూర్వ చేతన (super consciousness) కు తీసుకెళ్ళగలిగితే, శ్రంగారం చేతన (Consciousness) నుంచి అపూర్వ చేతన (Super consciousness) కు తీసుకెళ్ళ గలుగుతుంది అని చెబుతాడు.


ధ్యానం

-------------

మన 20 వ శతాబ్దంలో మానవుని వేగవంతమైన జీవితం నుండీ కాస్త విరామం కల్పించి, విశ్రాంతి నివ్వడానికి అనేక ధ్యాన పద్ధతులను ఓషో Meditation centreలో పొందుపర్చేడు. ఓషో ధ్యాన పద్ధతులను తీహార్ వంటి జైళ్ళలో నేరస్తులపై అవలంబింప జేసి, కాస్త పరివర్తన దిశగా అడుగులు వేయినిన ఘనత కిరణ్ బేడీ కి దక్కుతుంది.


ఓషో గురించిన ఈ పరిచయం, సముద్రం లో ఓ బిందువు లాంటిది మాత్రమే. అంతర్జాలం లో (http://www.osho.com/) అనేక ప్రవచనాలు, audio, video, textగా లభ్యం అవుతున్నాయి. యు త్యూబ్ లోనూ ఎన్నో వీడియోలు దొరుకుతాయి. అయితే, ఓషో గురించి తెలుసుకోవాలంటే, మనల్ని మనం ప్రశ్నించుకునే ధైర్యం (మనం తర తరాలుగా నమ్మిన విలువలను) ఉండాలి. అలాకాకపోతే, ఓషో గురించి ఆలోచించడం అనవసరం.


చివరగా వివిధ విషయాలపై ఓషో పుస్తకాలలో కొన్నిటిని పేర్కొంటాను.


Autobiography of a spiritually incorrect mystic

Zen, Zip, Zap, Zest and Zing (జెన్ సూత్రాలపై - ఎంతో ఆహ్లాదకరంగా చదివిస్తుంది ఈ పుస్తకం)

The goose is out (చాందస భావాలపి గొడ్డలిపెట్టు)

I am the Gate(జీసస్ పై)

Krishna, the man and his phiosophy- కృష్ణున్ని సామాన్య మానవుడి గా చిత్రీకరిస్తూనే పురుషోత్తముడిగా ఆవిషరించిన ప్రవచనాల సారాన్శం)

The white lotus, Never born Never Died, A cup of Tea, Yoga-the alpha and the omega - ఇవన్నీ వరుసగా, బోధిధర్ముడు, తావ్, జెన్, పతంజలి వీరి మీద వ్యాఖ్యానాలు.
............


Friday, August 29, 2008

అష్ట విధ బ్లాగికలు!

మన ప్రాచీన కావ్యములలోనూ, శాస్త్రీయ నృత్య రీతుల యందునూ నాయికలను అష్ట విధములుగా విభజించిన సంగతి రసఙ్ఞులయిన బ్లాగరులకు విదితమే.

1. ప్రోషిత భర్తృక 2. స్వాధీన పతిక 3. వాసవ సజ్జిక 4. ఖండిత 5. కలహాంతరిత 6. విరహోత్కంఠిత 7. విప్ర లబ్ధ 8. అభిసారిక

ఆ విధములుగా వారిని ఎన్ననగును.

****************************

మన బ్లాగ్లోకమున మహిళా మణుల ప్రాభవము ఎన్నదగినది అనిన, అయ్యది ఏ మాత్రమూ అత్యుక్తి కానేరదు. బ్లాగ్లోకమున నాయికలను ఈ విధములుగా వర్గీకరింపవచ్చును.

1. పోషిత బ్లాగిక 2. స్వాధీన 'గడి 'క 3. మూసవ సజ్జిక 4. కామెంటిత 5. గణకాంతరిత 6. తెవికోత్కంఠిత 7.నెనరు లబ్ధ 8. అభి 'చాటి ' క

ఆయా నాయికల వివరణములు ఈ క్రిందనొసంగ బడినవి.

1. పోషిత బ్లాగిక : బ్లాగ్లోకమున కొత్తగా బ్లాగులు వ్రాయగోరు వారిని ఈ నాయిక ప్రోత్సహించును. కొత్త బ్లాగరులకు అమూల్యమయిన సలహాలనందించుట, తెలుగు (యూనీ కోడు) నందు వ్రాయుటకు వలసిన వివిధ సాంకేతిక సహాయ సౌలభ్యములను సూచించుట ఈ నాయిక సంచారీ భావములు.

2. స్వాధీన 'గడి ' క : తన ఆసక్తిని అత్యుత్తమమైన టపాలను వెలువరించుటయే కాక, పొద్దు అను జాలపత్రిక యందు వచ్చు 'గడి ' ని కూర్చుట ఈ నాయిక ప్రముఖ వ్యాసంగము. గడి ని పూరించుటయే కాక, భావ సారూప్యము కలిగిన గడి ఔత్సాహికులకు తగిన సూచనలు, సలహాలనందించుట మున్నగునవి ఈ నాయిక విజయ వంతముగా నిర్వహించును.

3. మూసవ సజ్జిక : కేవలము టపాలను వ్రాయుటయందే ఆసక్తిని నిలుపుకొనక, కాలముతో వచ్చు మార్పులకు అనుగుణముగా, బ్లాగును వివిధ రకములయిన మూస లనుపయోగించి, దృశ్య రంజితముగా ఈ నాయిక తీర్చిదిద్దును. అంతర్జాలమున, బ్లాగులకు సంబంధించి జరిగెడి , అభివృద్ధిని ఈ నాయిక అత్యంత జాగరూకత తో పరిశీలించును.

4. కామెంటిత : ఈ నాయిక టపాలు వ్రాయుటయందే మాత్రమూ ఆసక్తి కనబర్చక, తోటి బ్లాగరులు వ్రాసిన వ్రాతలను చదివి, వారి టపాలపై, కామెంటును.

5. గణకాంతరిత : తను నిర్వహించు బ్లాగుయందు, సందర్శకుల సంఖ్యని లెక్కించుటకై, గణక యంత్రములను నిక్షిప్తము గావించి, బ్లాగుకు గల ప్రాచుర్యమును తులనాత్మకముగా పరిశీలించును. బ్లాగరులు వ్రాయు వివిధ రచనా వ్యాసంగములకు వచ్చు, వ్యాఖ్యలను గణించి, బ్లాగరు యొక్క రచనా పటిమను అంచనా వేయుట ఈ నాయిక అదనపు లక్షణము.

6. తెవికోత్కంఠిత : తెలుగు వికీపీడియా అనబడు తెలుగు విఙ్ఞాన భాండాగారమునకు తన వంతు సహాయ సహకారములనందించుట ఈ నాయిక లక్షణము. తెవికీ లో తన వూరి వివరములు జోడించుట, వివిధ వ్యాసములను ఆంధ్రీకరించుట, ఇతరులు వ్రాసిన వ్యాసములను సరిదిద్దుట ఈ నాయిక సంచారీ గుణములు.

7. నెనరు లబ్ధ : బ్లాగ్లోకమున వివిధ రకములయిన నూత్న కార్యక్రములను చేబట్టి, బ్లాగరుల చేత నెనరులు గడించుట ఈ నాయిక లక్షణము.

8. అభి 'చాటి ' క : కూడలి యందు బ్లాగరులకి ఒసంగబడిన ఉపకరణము, కూడలి చాట్ ను ఉపయోగించుకుని, రక రకములయిన చర్చా కార్యక్రములకు బ్లాగరులను ఆహ్వానించుటయందు ఈ నాయిక ఆసక్తి కనబర్చును. వారాంతమున తీరిక లేకుండుట సంచారీ గుణము.

***********************

పై విభజన, మరియూ ఆయా లక్షణములు, బ్లాగ్లోకమునకు సంబంధించి, కేవలము మహిళా బ్లాగరులకే గాక, పురుష బ్లాగరులకూ వర్తింపజేయవచ్చును.

ఈ టపా వెనుక, హాస్య స్ఫోరకత మినహా, ఒకరిని అవహేళన చేయుట, నొప్పించవలెనను ప్రయత్నము ఏ మాత్రమూ లేవని బ్లాగ్లోకము గమనించ వలె యని నా ప్రార్థన.

***********************

(70 వ దశకం చివర్లో వార పత్రికలు, మాస పత్రికలను చదివే మహిళా పాఠకులపై శ్రీ రమణ ఓ పేరడీ రాసారు. ఆయన విభజనలు ఇలా ఉన్నాయి.

1. పోషిత పత్రిక 2. స్వాధీన పఠిత 3. పుస్తక సజ్జిక 4. రీడిత 5. నవలాంతరిత 6. కథనోత్కంఠిత 7. చిత్ర లబ్ధ 8. అభిమానిక

ఈ టపాకు శ్రీ రమణ గారి పేరడీ స్ఫూర్తి, ఆధారం)

*************************

Sunday, August 24, 2008

దోసె పురాణం!


పని రోజుల్లోని ఓ రోజు సాయంత్రం. మామూలుగానే రోజంతా మొద్దు యంత్రం ముందు కూర్చుని, సాయంత్రం ఇంటికి వచ్చి, కాస్త స్నానం అదీ చేసి,ఈనాడు పక్కనేస్కుని, వెధవ డబ్బా ముందు రిలాక్స్ అవుతున్నాను. టీవీ లో మామూలుగానే ఒకదాన్ని మించి ఒకటి చెత్త కార్యక్రమాలు, పనికి రాని ధారా.. వాహికలూనూ.ఇక లాభం లేదని ఆపద్ధర్మ చానెల్స్ కుప్ప (ఎన్ జీ సీ, డిస్కవరీ వగైరా) లోకి అడుగు పెట్టాను. యాత్ర మరియూ జీవితం చానెల్ తగిలింది.


సల్మాన్ రష్డీ వాళ్ళ (మాజీ?) ఆవిడ (పద్మా లక్ష్మి) దక్షిణ భారత వంటకాల గురించి, ఒక్కో ఊరు తిరుగుతూ ఏదో చెబుతోంది. యాత్ర లో భాగంగా బెంగళూరు కి వచ్చింది. ఎంటీఆరు వారి హోటల్లో దోసెల గురించి, చట్నీ నంజుకుని తింటూ మరీ చెప్పసాగింది.


ఆ తర్వాత ఈనాడు కర్ణాటక పేపర్ చూడసాగాను. అందులోనూ ఓ చోట విద్యార్థి భవన్ దోసెల గురించి రాసేరు!


నా టిఫిన్ భారతంలో ఆది టిఫిన్ ఇడ్లీ, ద్వితీయం దోసె, మూడవది పూరీ. అందులో దోసె ద్వితీయమైనా అద్వితీయమే. ఇటు నెల్లూరు పద్మావతీ విలాస్, చెన్నై శరవణా భవన్ మొదలుకుని, మన రాజధాని లో మినర్వా, కామత్,బెంగళూరు, కోయంబత్తూరు అన్నపూర్ణ విలాస్ నేతి దోసెల వరకు, ఉత్తరాన పూనా, ముంబై ల వరకూ, నా దోసెల జైత్రయాత్ర సాగింది.చివరకు బెంగళూరుకు వచ్చి ఆగింది.


బెంగళూరు ను భారత దేశ, దోసెల రాజధానిగా ప్రకటించవచ్చు. యష్వంతపూర్ గాయత్రి భవన్, మల్లేశ్వరం జనతా భవన్, జయా నగర్ గణెష్ దర్శిని, శివాజీ నగర్ శిల్పా, బసవన గుడి విద్యార్థీ భవన్, ఎంటీ ఆర్, మెజిస్టిక్ ప్రియదర్శిని ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నని ? బెంగళూరు వచ్చిన కొత్తల్లో ప్రతీ శని వారం సాయంత్రం జయా నగర్ దోసెల క్యాంపు, రాత్రి కో తెలుగు సినిమా , ఆదివారం ఉదయాన్నే విద్యార్థీ భవన్ ఠంచను గా ఉండేది. అవీ హోటెల్ దోసెలే. ఇంటి దగ్గర అమ్మ వేసే దోసెలు మాత్రం నాట్ ఆక్సెప్టబిల్! ఇప్పుడు మా ఆవిడ కూడా అప్పుడప్పుడూ దెప్పుతుంటుంది, "సొంత ఇంటి పుల్ల దోసెల కంటే పొరుగింటి మసాల దోసెలంటేనే" నాకు ప్రాణమని.


ఈ "దోసె" అనే పేరు వెనుక పాపులర్ కథ, దాదాపు అందరికీ తెలిసినదే. తమిళాళ్ళు దోసెలూ పోస్తుంటే, ఉత్తర భారతీయులెవరో, రెండు సార్లు "స్స్" అంది కాబట్టి "దోసె" అన్నారు అని.


దోసె - దో బార్ "స్స్" శబ్దం చేయునది.


తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక బహువ్రీహి సమాసం అది!


ఎందుకంటే, దోసె తమిళ్ వాళ్ళదీనడం నాకు సుతరాము నచ్చలేదు. (నాకు తమిళ దురభిమానం మెండు. సిగ్గు లేకుండా చెబుతున్నాను.) ఇది విన్నప్పుడల్లా అదో బాధ.


ఆ రోజు పద్మా లక్ష్మి (ఆవిడా అరవామెనే అనుకోండి) కూడా అదే చెప్పేసరికి కోపం వచ్చింది.


ఈ మధ్య తెనాలి రామకృష్ణ కవి మీద ఒకాయన రాసిన రీసెర్చి పుస్తకం చదువుతుంటే, అందులో ఓ పద్యం కనబడింది. ఆ పద్యం రాయలవారి అష్ట దిగ్గజాల్లో ఒకాయన అయ్యలరాజు రామభద్రుడు రాసిన "రామాభ్యుదయం" అనే కావ్యం లోనిదట.


ఇడిరమ్మౌనికుపాయనమ్ములు మనోభీష్టంబుగా బూరియల్

వడలుం జక్కెర కర్జకాయలును లడ్వాలుక్కెరల్ పూర్ణపుం

గుడుముల్ గారెలు బెల్లమండెగలు నౌగుల్ కమ్మచాపట్లు నూ

టిడులున్ దోసెలు నప్పముల్ సుకియలున్ హేరాళమై కన్పడన్.

అర్థాత్ : బూరెలు, వడలు, చక్కెర కజ్జికాయలు, లడ్డూలు, ఉక్కెరలు (చక్కెర చేర్చి పొరటిన పిండి), పూర్ణపు కుడుములు, గారెలు, గోధుమ పూరీలు, ఓఉగులు, కమ్మని చాపట్లు, నువ్వులతో చేసిన ఇడులు, దోసెలు, అప్పములు,సుకియలు ...వగైరాలు విస్తరి నిండుగా కంపించేట్లు ఆ మునికి వడ్డించారు(ట).


అంటే దోసె 15 వ శతాబ్దం కణ్టే ముందుదే అన్న మాట! కొసరుగా అదే పద్యంలో బెల్ల మండెగలు అని కూడా కవి పేర్కొన్నడు! బెల్ల మండెగలంటే పూరీలట! (ఆ పుస్తకం లోనే చెప్పారది)


తెలుగు ఉచ్చ స్థితిలో ఉన్న విజయ నగర సామ్రాజ్యం కాలంలో దోసె, తమిళ నాడు నుండీ వచ్చి స్థిరపడి ఉంటుందా? నమ్మను గాక నమ్మను. దోసె ఆంధ్ర వాళ్ళ అబ్బ సొమ్మే! నేను విన్నంతే!


నాకున్న ఇంకో ఆశ, ఇడ్లీ గురించి తెలుసుకోవాలి. అది యే మాస్టారు గారో, సంస్కృత పండితులయిన బ్లాగర్లో దాన్ని గురించి చెబితే, ఇడ్లీ తిన్నంతగా సంతోషిస్తా.

Saturday, August 23, 2008

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాభినందనలు!

అంగుళ్యా కః కవాటం ప్రహరతి?కుటిలే!మాధవః,కిం వసంతః?

నో చక్రీ!కిం కులాలః?నహి,ధరణీధరః కిం ద్విజిహ్వః ఫణీంద్రః?

నాహం ఘోరాహిమర్దీ, కిమసి ఖగపతిః?నో హరిః,కిం కపీంద్రః?

ఇత్యేవం గోపకన్యా ప్రతివచనజితః పాతు నశ్చక్రపాణిః


సత్య : "వేలితో తలుపు తట్టేది ఎవరు?"

కృష్ణ : "కొంటెపిల్లా, మాధవుణ్ణి"

సత్య : " వసంతుడా ?" (మాధవుడంటే, వసంతుడనే అర్థం కూడా ఉన్నది.)

కృష్ణ : "కాదు చక్రిని" (చక్రం ధరించే వాణ్ణి).

సత్య : "కుమ్మరివా ?"(చక్రి అంటే కుమ్మరి అనే అర్థం కూడా ఉన్నది.)

కృష్ణ : "కాదు ధరణీ ధరుణ్ణి." (భూమిని ఉద్ధరించిన విష్ణువును.)

సత్య : "రెండు నాలుకలు కల నాగరాజువా?" (ధరణీ ధరుడు ఆదిశెషుడు కూడా.)

కృష్ణ : "ఘోరమైన పాముని మర్దించిన వాణ్ణి." (ఈ పాము కాళీయుడు.)

సత్య : "గరుత్మంతుడివా?"

కృష్ణ : "కాదు.హరిని."

సత్య :"కోతివా?" (హరి అంటే కోతి అనే అర్థం కూడా ఉన్నది.)


ఇలా సత్యభామ చేత మాటలలో ఓడిఓయిన కృష్ణుడు మిమ్మల్ని రక్షించు గాక.


ఈ అందమైన శ్లోకం చందమామ (జులై 1974) అమరవాణి లో వచ్చింది. శ్రీ కృష్ణ కర్ణామృతం అనే కావ్యం లోనిది (అట). ఆ కావ్యం తాలూకు రచయిత, ఈ కావ్యం పూర్తి వివరాలు తెలియవు!

(శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్లాగ్మిత్రులకు అభినందనలు)