Thursday, August 14, 2008

కమ్మదనం, తెలుగుదనాల బాల్యం!

"మావయ్యా, ఎత్తుకో మావయ్యా!"
"ఎందుకురా? పెద్దోడయినావు కదరా, నడవాల మరి."
"కాళ్ళు కాలుతున్నాయి మామయ్యా!"

బయట పిండారబోసినట్టు వెన్నెల. నింగిని మిడిసిపడుతున్న రాతిరి రేడు. భోజనాలకు ముందు, నన్నెత్తుకుని కాస్సేపలా తిప్పడానికి వచ్చాడు(ట) మా మామయ్య. అప్పుడు నా వయస్సు ఓ నాలుగేళ్ళు ఉంటుందేమో?

"చందమామ మనతో పాటే వస్తున్నాడు. ఎందుకు?"
"చందమామకు నువ్వంటే ఇష్టం రా అందుకు."

ఇంకా ఏ జవాబు లేని ప్రశ్నలు అడి(గుంటానో)గానో ఏమో, మా మామయ్య దుకాణం దగ్గర చాక్లెట్టు కొనడానికి ఆగాడు(ట).

"ఏం కావాలిరా?"
"నాకు చాక్లెటొద్దు.ఆ కనబడే పచ్చ రంగు ఇల్లు కావాలి."
మా మామయ్య నవ్వుకుని," పెద్దయ్యాక కొందాం లేరా" అన్నాడు(ట).
"ఇప్పుడే కావల్ల"
"****" మామయ్యకు చుక్కలు కనిపించుంటాయ్.

ఇవి మా మామయ్య ఙ్ఞాపకాలు. ఎప్పుడు మా ఇంట పండుగో, పబ్బమో జరిగి, నలుగురూ చేరిన వేళ, ఆయన మాతో తన ఙ్ఞాపకాలను పంచుకుని మురిసి పోవడం పరిపాటి. నాకు ఆ చందమామ, ఆకుపచ్చ ఇంటి సంగతి మాత్రం లీలగా ఙ్ఞాపకం.

*****************

ఆ ఆకుపచ్చ ఇంటాయన బసయ్య మా వూళ్ళో గొప్ప షాహుకారు.ఓ చిన్న హోటల్ నడుపుకుంటున్నమా నాన్నను "స్వామీ" అంటూ, ఎంతో ఆప్యాయంగా పలుకరించే వాడు. ఆయన కొడుకు కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులో బిర్లా గుడి దగ్గర కనిపించేడు.చాలా సంతోషపడిపొయేడు.

******************

నాకు చిన్నప్పుడు పెరుగు, ఆవకాయ అంటే ప్రాణం. అదీ మా ఇంట్లో ఓ ప్రత్యేకమైన తట్ట (పళ్ళెం) ఉండేదిట, మధ్యలో ఓ ప్రత్యేకమైన డిజయిను తో. అందులోనే తినాలి. ఇక మా ఇంట బంధువుల పిల్లలు (మా ఇద్దరు పిన్నమ్మలు, మామయ్యల కొడుకులు, కూతుళ్ళు)వస్తే మాత్రం, పండగే (ఇప్పటికీ). చింత చివురు పప్పుతో మా అమ్మ అందరికీ ముద్దలు కలిపి పెట్టేది.

మా ఇంట్లో ఓ తెల్ల ఏనుగు చెక్కబొమ్మ ఉండేది, నాకు ఊహ తెలిసినప్పటి నుండి. ఆ బొమ్మ, మా నాన్నకు తన బాల్యంలో ఎవరో కొనిపెట్టేరుట. ఆ బొమ్మకు చక్రాలు పెట్టుకొందుకు రెండు కన్నాలు, కాళ్ల కింద. నేను 4 వ తరగతి చదువుతున్నప్పుడనుకుంటా, ఆ బొమ్మను మరింత అందంగా మార్చాలని, ఎర్ర రంగు బాల్ పాయింట్ పెన్ను నుంచీ ఇంకు వూదేసుకు తీసి ఆ ఏనుగు కళ్ళకు, నీలి రంగు (బాల్ పాయింట్ ఇంకు) దాని తోకకు పూసేను. ఆ మరకలతోటి చాలాకాలం ఉన్నదది.ఈ మధ్యనో ఇల్లు మారేటప్పుడు పోయింది.

తెలుపు రంగు మీద ఇష్టం ఇప్పటికీ అంతర్గతంగా ఉందేమో మరి, ఇడ్డెన్లన్నా,పూత రేకులన్నా, కోవా బిళ్ళలన్నా,గడ్ద పెరుగన్నా ఇప్పటికీ ప్రాణం (కక్కుర్తి, సరిగ్గా చెప్పాలంటే).

********************

బడిలో వేశారుట నన్ను, పారిపోకుండా పట్టుకోడానికి ఓ ఇద్దరు ధృఢ కాయుల సహాయంతో. అదీ సంస్కృతం బడిలో. పెద్ద గంట కొట్టాక ఇంటికి రా. ఒకటి, రెండు, ఇలా చిన్న గంటలు వినబడితే రాగాకు అని చెప్పి పంపేరు(ట). ఓ రెండు గంటల తర్వాత ఇంట్లో ప్రత్యక్షం అయిన నన్ను అడిగారుట, "ఏరా, ఇంత తొందరగా వచ్చావు?" అని. "ఆ దరిద్రుడు, ఎంతకీ పెద్దగంట కొట్టటం లేదమ్మా, ఏం చేయను?" ఇదీ సమాధానం.

********************

మాది కరువు ప్రాంతం కదా, వర్షాలు తక్కువ. నాకేమో చిన్నప్పుడు, నీళ్ళంటే తెగ ఇష్టం. ఓ సారి, సాయంత్రం, కొళాయిలో నీళ్ళు వచ్చేప్పుడు (స్కూలు వదిలే టైము), వెళ్ళి, ఆ కొళాయి కింద కూర్చున్నానుట.అలా ఓ గంట సేపు నానిన తర్వాత ఎవరో ఇంటికి వచ్చి చెప్పేరు, చేసిన ఘన కార్యం గురించి. 5 వ తరగతిలో ఇంకో ఘన కార్యం. మా వూరి కెనాల్ (తుంగ భద్ర డాము నుండీ, మా వూరికి కాలువ నీళ్ళు వస్తాయి)లో ఈత నేర్చుకుందుకు ఇంట్లో చెప్పకుండా వెళ్ళి, నేనూ, నా మిత్రుడూ, చివరకు దొరికి పోయి తన్నులు తిన్నాము.

********************

తెలుగు అంటే, నాకు చందమామ గుర్తొస్తుంది.మొదటి సారి, 1978 లో అనుకుంటా. "భల్లూక మాంత్రికుడు" అనే ఓ సీరియల్ వచ్చేది. ఓ చందమామ పుస్తకం లో సీరియల్ మధ్యలో భాగం (అర్థం కాకపోయినా) చదివి , చివర్లో "ఇంకా ఉంది" అన్నది చూసి, ఆ "ఇంకా" ఎక్కడ ఉంది అని, అందరినీ అడిగినది ఇప్పటికీ గుర్తు. కొన్నేళ్ళ తర్వాత మా ఇంట "బాల జ్యోతి", "ఆంధ్ర జ్యోతి" పత్రికలు తెప్పించేది అమ్మ. ఆంధ్ర జ్యోతి లో "మధూలిక", "చంటబ్బాయ్", "అభిలాష" సీరియల్స్ వచ్చేవి. బొమ్మలు చూడ్డం వరకే నా పని. మొట్టమొదటి సారి చదివిన సీరియల్, "రెండు రెళ్ళు ఆరు", మల్లాది సీరియల్. వారం వారం కాచుకుని చదవడం - ఓహ్!

*********************

మా సీమలో గోంగూర, తేగలు, జున్ను, కాజాలు, పూత రేకులు...ఇలా తెలుగు తనానికి ఆనవాళ్ళుగా చెప్పుకునే అనేకం చిన్నప్పుడు నేను ఎరుగను. మా ఇంట కూడా వాటికి అంత ప్రాచుర్యం లేదు. నాకు ఇష్టమైన తిండి, ’ఉగ్గాని ’. ఇది సర్కారు, తెలంగాణా వాళ్ళకు తెలియదనుకుంటాను. రాయల సీమలోనూ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే దీని పేరు తెలుసనుకుంటా.

ఉగ్గాని అంటే, బొరుగులు (మరమరాలు) నీటిలో నానబెట్టి, తర్వాతి రోజు మసాలా,ఉల్లిపాయలతో, కలపి తిరుగుమోత బెట్టటం. దీనికి వ్యంజనం గా మిరప కాయ బజ్జీలు. దీని రుచి....ఎంత చెప్పినా తక్కువే.

*********************

6 వ తరగతిలో మా కొత్త తెలుగు టీచరు పాఠం చెబుతున్నారు. కాకతీయుల ఆస్థాన కవి విద్యానాథుడి గురించిన పాఠం అది. చెబుతూ ఆగి, మన తరగతిలోనూ విద్యానాథుడు ఒకడున్నాడని విన్నాను ఎవరతను అని అడిగేరు. (నా పేరు, విద్యానాథ రవి). నేను లేచి నిలబడ్డాను. ఓ పద్యం చెప్పమందావిడ. చెప్పేను. మెచ్చుకుంది. అప్పటి నుండీ, 10 వ తరగతి వరకూ, ఆవిడే మా టీచరు,అప్రతిహతంగా తెలుగులో నాకే మొదటి మార్కులు. 10 వ తరగతిలో 89 మార్కులు, తెలుగులో. అప్పట్లో అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. అయితే, మా తెలుగు టీచరు మాత్రం కాస్త బాధపడ్డది. ఆ మార్కులు తక్కువని. (నా మీద అంత నమ్మకం ఆవిడకు).

ఆ తర్వాత నా పేరు నోరు తిరగని వ్యక్తులకు చిత్ర హింసలకు గురవడంతో, కుదించాల్సొచ్చింది.

*********************

ఇప్పుడు బాలజ్యొతీ లేదు,
మా అమ్మ గారు స్వర్గస్తులయేరు,
బాల్యం ముగిసింది,
మా వూరి చెరువు ఎండిపోయింది,
ఆవకాయ తో కూడిన పెరుగన్నం ఖరీదు దాదాపు 25 రుపాయలు నగరంలో,
తెలుగుదనపు ఙ్ఞాపకాలు మాత్రం మిగిలేయ్.

" कालॊह्ययं निरवधि॒ः विपुलाच पृथ्वी ! "

22 comments:

 1. రవి గారూ, అద్భుతం. మీ చిన్ననాటి జ్ఞాపకాలు చదువుతుంటే ఎంతో హాయిగా అనిపించింది. చాలా బాగా రాశారు.

  మీ పాత టపాలన్నీ చదివినా కామెంటేసే టైము లేక వదిలేశా. (నేను బ్లాగులు చాలామటుకు ఆఫీసులో చదువుతా.) అన్నీ చాలా బాగున్నాయి.

  ReplyDelete
 2. ఆపకుండా చదివాను..
  కొన్ని జ్ఞాపకాలు అందంగా, కొన్ని అల్లరిగా, కొన్ని ఆర్ద్రంగా బాగా రాసారు.

  ReplyDelete
 3. చాలా బాగా రాసారు. నా చిన్నతనపు రోజులు గుర్తుకి వస్తున్నాయి. సందర్భం వచ్చింది కనుక (రేపే వరలక్ష్మి వ్రతం ) చెబుతున్నాను. నా చిన్నపుడు, శ్రావణ శుక్రవారం - వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక సాయంకాలం చుట్టుపక్కల ఉండే అందరు ఆడవారిని పేరంటానికి పిలవటం నా వంతు. ఆ పని కోసం మధ్యాహ్నం బయలుదేరి ఒక్కో ఇంటికి వెళ్లి కబుర్లు చెప్తూ ఉంటే సాయంకాలం అక్కడే అయిపోయేది. నా కోసం చూసీ చూసీ, మా అమ్మే అన్ని మిగతా పనులు సగం పైనే చేసుకునేది. ఆ తరువాత ఆలస్యంగా మా ఇంటికి వచ్చి మా అమ్మ తో చచ్చే తిట్లు తినడం అస్సలు మరిచిపోలేను. ఇప్పుడు ఈ పండగకి అన్నీ నేనే చేసుకుంటూ ఉంటే ... ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండును ... అనుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కరికీ చిన్నతనాన్ని గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు.

  ReplyDelete
 4. రవి గారు, చాలా బాగా వ్రాశారు. బాగున్నాయి మీ ఙ్ఞాపకాలు.
  నాకు కూడా ’ఇంకావుంది’ అని వ్రాసి ఉంటే అస్సలు అర్థం కాకాపోయేది !!!!

  ReplyDelete
 5. రవి గారూ,
  మీ చిన్ననాటి జ్ఞాపకాలు చదివిన మాకే ఎంతో మధురంగా ఉన్నాయి. దీనితో మొదలుపెట్టి మీ పాత టపాలన్నీ చదివాను. కాళిదాసు పై మీరు వ్రాసిన టపా చదివి వెంటనే కామెంటు వ్రాయడం మొదలు పెట్టాను గానీ, ఇప్పటికే టపాను మించిన పొడవాటి కామెంట్లతో చాంతాడంత ఉన్న దాన్ని మరింత పెంచడం ఎందుకని ఆపేశాను.

  మీ టపాలన్నీ బాగున్నాయి.

  ReplyDelete
 6. విద్యానాథా,

  కాకతీయుల ఆస్థాన కవి ఒకరున్నారని మీరు చెప్పేదాక నాకు తెలీదు. ఈ కవి రచనలేమిటో ఆ వివరాలు తెలిస్తే మీరే చెప్పాలని వినతి.

  గోంగూర మీకు తెలీకపోవడం కొంచెం ఆశ్చర్యంగా వుంది. వీరబల్లె సంతలో మస్తుగా దొరికేదిది. కాకపోతే దీన్ని గోగాకు అంటారు. ఈ గోగాకుల పచ్చడిని గోంగూర అనడానికి బదులు గోగాకు ఊరిమిండి అంటారు. గోగాకును సంతలో కొనాల్సిన పని కూడా లేదు. గోగులు (గోగు విత్తనాలు) చల్లి చేల గట్లమీద పెంచుతారు.

  వ్యంజనం అంటే నంజటే కదా?

  చివర్లోని ఆ సంస్కృత వాక్యానికి అర్థం చెప్పి పెరుగన్నం మూటగట్టుకోండి.

  ReplyDelete
 7. @శ్రీ విద్య, @విరజాజి,@ప్రఫుల్ల చంద్ర, @చంద్రమోహన్, @ నాగమురళి ,

  అందరికీ ధన్యవాదాలు.

  @రానారె : విద్యానాథుడి గురించి చదువుకోవడం తప్ప, తెలుసుకున్నది లేదు :-). సమగ్రాంధ్ర సాహిత్యం చూసి చెబుతాను :-).

  మీరు గోగాకు అని చెప్పిన తర్వాత గుర్తొచ్చింది. గోగాకు, గోంగూర ఒకటేనన్నమాట! గోగులు పూచే, గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి...ఈ పాట విని, గొబ్బెమ్మ మధ్య నున్న పువ్వు పేరు అదేమో అని అనుకున్నాను.

  అయినా కూడా, "గోంగూర లేనిది ముద్ద దిగదు" అనేంతగా మా ఇంట గోంగూర వాడినట్టు నాకు గుర్తు లేదు.

  ఊరిమిండి అనే పదం మా ఇంట్లోనూ వాడుకలో ఉంది.

  వ్యంజనం (తత్సమం) అంటే, నంజట(తద్భవం) , అధరువు, నంజు...

  ఇక ఆ ఆఖరు వాక్యం. సంస్కృత సాహిత్యం లో ఓ అద్భుతమైన శ్లోకం అది, భారవి (నాగమురళి గారూ, కరెక్టేనా?) రాసినది.

  ఉత్పశ్యతే మమ తు కోపి సమాన ధర్మాః
  కాలోహ్యయం నిరవధిః విపులాచ పృథ్వీ |

  (నా భావలకు ప్రతిస్పందించే వ్యక్తి పుట్టకపోడు. కాలం అనంతం , ధరణి విశాలం. )

  ఈ శ్లోకం వెనుక కథా కమామీషు నాగమురళి గారే చెప్పాలి. (నాకు లీలగా తెలుసు, తెలిసింది కరెక్టో , కాదో తెలీదు!)

  ReplyDelete
 8. రవి గారూ, రానారె గారూ,

  ఆ కొటేషన్ భవభూతిది. నా టపాలో ఒక దాన్లో ఆ శ్లోకం, అర్థం రాశాను, చూడండి -

  http://nagamurali.wordpress.com/2008/02/27/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%A3%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B8%E0%B1%80%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2/

  ReplyDelete
 9. అబ్బో! 'నంజట'కు ఇన్ని సమానార్థకాలున్నాయన్నమాట.

  రవీ, మీరు విద్యానాధుని సంగతులు చెప్పడం మరియు భవభూతి శ్లోకం వెనుక కథ చెప్పడం బాకీ పడ్డారు గుర్తుంచుకోండి. :-)

  నాగమురళిగారికి కృతజ్ఞతలు.

  ReplyDelete
 10. బాల్యం నిజంగా మనకెన్ని తీపి గుర్తులు మిగుల్చుతుందో కదూ...
  మనము మన పిల్లలకి ఎన్ని ఇవ్వగలుగుతామో ?

  ReplyDelete
 11. @రానారె గారు : ఈ భవభూతి శ్లోకం వెనుక కథ నాకు తెలియదు. నేనకున్నది, "సహసా విదధీత న క్రియాం" అన్న భారవి శ్లోకం గురించి. కొంచెం తికమక పడ్డాను.

  ఈ శ్లోకం (సహసా...) గురించి మరెప్పుడైనా...(ఈ పాటికే ఎవరైనా టపా రాసినా రాసుండవచ్చు కూడా :-))

  విద్యానాథుడి గురించి సమగ్రాంధ్ర సాహిత్యం చూసి చెబుతాను.

  @ప్రవీణ్ : ఈ కాలం పిల్లలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. గోళీలు, జిల్ల కట్టె, అందమైన ఙ్ఞాపకాలు, ఇవేమి లేకుండా ఏదో ప్లాస్టిక్ జీవితం లా ఉంటుంది.

  @విరజాజి గారు : మీరు చెప్పిన సంగతులు విరజాజిలానే ఉంది. మీరో టపా లాగించండి.

  ReplyDelete
 12. రా.నా.రె గారు: విద్యానాథుడు తెలుగులో రాసినట్లుగా లేదు :-) ఒకవేళ రాసినా నాకు తెలిసినంతలో ఏమీ అందుబాటులో లేవు. కానీ, సంస్కృత అలంకారీకులలో ప్రముఖుడు. అతను రాసిన, చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతాపరుద్రీయ యశోభూషణం అన్న కావ్యం గురించి విని వుంటారు.

  ఇంక భవభూతి గారి ప్రముఖంగా ఉటంకింపబడే (oft-cited-line :-) ) శ్లోకానికి/పంక్తికొస్తే:

  "[...] కాలోహ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ"
  --> "కాలానికి అవధి లేదు. భూమి ఎంతో విశాలమైనది."

  ఆయన తన ప్రత్యర్థుల్ని (/కుకవుల్ని) నిందిస్తున్నాడన్న సంగతి (ఎంతైనా కుకవి నింద మన సాహిత్యశాస్త్రంలో భాగం కదా!) పక్కనపెట్టి ఈ ఒక్క పంక్తిని ప్రముఖంగా యెత్తి చూపించడం సర్వసాధారణమై పోయింది. అదీన్ను ఒక పొగడత/ప్రశంశగా! హతవిధీ!! :-)

  -- శ్రీనివాస్

  ReplyDelete
 13. రవి గారు, చాలా బాగ రాసారండి. కెనాల్, ఉగ్గాని చదువుతుంటె అనంతపురం (మా వూరు అదే)గుర్తు వచ్చింది. మీ ఉద్యోగ భారతం-కాలేజి పర్వం లొ ఫొర్ ట్రాన్, మె.ప, స్టాంపు లు ముద్రించడం చదివితే అనంతపురం J.N.T.U (నేను అక్కడే చదువుకున్నాను)గుర్తు వచ్చింది.

  ReplyDelete
 14. చాలా బాగున్నాయి. కాదు చాలా కమ్మగా ఉన్నాయి. పెరుగన్నం లోఆవకాయలా.

  ReplyDelete
 15. @శ్రీనివాస్ గారు : మంచి మంచి సంగతులు కామెంట్లలో చెబుతారు, వాటి గురించి విశదంగా టపాలు కూడా రాయండి..ఆ విద్యానాథుడి మీద టపా మీకు ఔట్ సోర్స్ చేయచ్చా??

  @స్నేహ గారు : మీరు అభినవభారతం, మె.ప (భారతం అని ఎందుకన్నానంటే, మాకు దాన్ని బోధించింది కృష్ణ ద్వైపాయనుడు అనబడే ఓ లెక్చరరు గారు) బాధితులా? బయట వర్షం వచ్చింది సాయంత్రం. ఉగ్గరిణి తినాలనిపిస్తుంది ఈ రోజు :-)...నెనర్లు.

  @ మురళి : నెనర్లు .

  ReplyDelete
 16. మీ బాల్యస్మృతులు చాలా హృద్యంగా ఉన్నాయండీ!
  నేనూ నా చిన్నతనపు తీపుగుర్తులు (తెలుగువారికే సొంతమనిపించేవి) ఇంకాస్త వివరంగా పంచుకోవాలన్న స్ఫూర్తినిచ్చారు! వీలుచూసుకొని ఎప్పుడో బ్లాగాలి.

  ReplyDelete
 17. @భైరవ భట్ల గారు : ఓ నిజం చెబుతున్నాను. నా ఈ టపా కు స్పూర్తి, మీ తెలుగు వీర లేవరా బ్లాగు లోని, తెలుగుదనం టపా...అందులో మీరు పాఠోళీ గురించి రాసారు (పాఠోళీ అంటే ఏమిటో నాకు తెలియదు!). అయితే, నాకు మా వూరి "ఉగ్గాని " గుర్తొచ్చి, దాని గురించి రాసాను.

  ఈ టపా మీకు స్పూర్తి కావడం...బావుంది సంబడం :-)

  ReplyDelete
 18. బొ..రు..గు..లా! అంటే మనదీ రాయలసీమన్నమాట. టపా అదుర్స్..మనదీ ఇంచుమించు మీలాంటి బాపతే.

  ReplyDelete
 19. Ravi ,
  Your blog took me to the days of my childhood at your home in holidays with your mother's chinta chiguru pappu, rasam. And I use to visit your home in october dasara holidays and your mom use to buy some crackers for me. :)
  Njoyed it a lot brother. Keep writing.

  ReplyDelete
 20. Beautiful Beautiful Beautiful.
  పొద్దున ఏదో గుర్తొచ్చి ఏదో వెదుకుతూ విపులాచ పృథ్వీ అనే ఆర్యోక్తి ఆదో శ్లోకపాదమేమో అని గూగులిస్తే ఈ టపా కంటబడింది. చివరికొచ్చేసరికి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
  What can I say - Beautiful!

  ReplyDelete
 21. ఎలానో మిస్స్ అయ్యాను ఈ టపాని. ఇప్పుడే చూస్తున్న. ఇంత అందమైన బాల్యం మీ సొంతమైనందుకు అభినందనలు. అవి మాతో పంచుకున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు!

  (చింతచిగురు పప్పు, తెలుగు మార్కులు- టీచరు విషయాల్లో మీకూ నాకూ పోలికలున్నాయి :-) )

  ReplyDelete
 22. చాలా ఆర్ధ్రంగా ఉంది.
  చాలా బాగుంది. గుండె తడిచింది.
  మంచి టపా
  బొల్లోజు బాబా

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.