Tuesday, August 12, 2008

కథ పరయుంబోల్....

....అంటే "కథ చెప్పినట్లుగా" అని మళయాలంలో అర్థం. దీన్నే తెలుగులో "కథానాయకుడు", అరవంలో "కుచేలన్" గా రూపొందించారు. మొన్న వారాంతం ఈ సినిమాకు వెళ్ళడానికి ముందు నాకెక్కడో ఓ సందేహం. మళయాలంలో "కళాత్మక" సినిమాలెక్కువ. ఒక్కోసారి ఈ కళాత్మకత ముదిరి అర్థం పర్థం లేని ఆర్ట్ సినిమాలుగా రూపొందడం కూడా జరిగింది. (మమ్ముట్టి కి నేషనల్ అవార్డ్ సంపాదించి పెట్టిన ఓ సినిమా చాలా కాలం క్రితం చూసాను. అది ఆ కోవ లోదే!). "కథ పరయుంబోల్" మాతృకలో, అవార్డ్ సినిమాలకు ఆయువుపట్టు-మమ్ముట్టి హీరో.

అందుకే కొంచెం సందేహించేను, "కొండ నాలుక్కి మందేస్తే, ఉన్న నాలుక ఊడిందన్న" అన్నసామెత చెప్పినట్టుగా ఆ కళా ఖండాన్ని తెలుగులో తీసి "సామెత పరయుంబోల్" గా మారుస్తారేమో అని.అయితే అదేం జరగలేదు.

కళాత్మక చాయలున్న మంచి సినిమా ఇది.

కథ : ఓ భర్త, ఓ భార్య, పిల్లలు, భర్తారావుకో సూపర్ స్టార్ బాల్యస్నేహితుడు. ఇదీ కథ. (నిజ్జం.. కథ ఇంతే!)

కథనం : బాలకృష్ణ, శ్రీదేవిలది అన్యోన్య దాంపత్యం. (శ్రీదేవి బోనీకపూర్కి ఎప్పుడు విడాకులిచ్చింది? బాలకృష్ణకు సడన్ గా ఏమ్ పోయేకాలం వచ్చింది? లాంటి ఇంటెలిజెంట్ ప్రశ్నలు వేయకండి. అవి సినిమాలో జగపతిబాబు, మీనాలపేర్లు). బాలకృష్ణ కు భయంకరమైన సినిమా కష్టాలు. అతడో క్షురకుడు. తన షాపులో చెక్క కుర్చీ రిపేరు కు కూడా తన వద్ద డబ్బులు ఉండవు.ఇక పిల్లల ఫీజులేం కడతాడు? ఆ వూళ్ళోకి సూపర్ స్టార్ అశోక్ కుమార్ సినిమా షూటింగ్ కోసం వస్తాడు. సదరు సూపర్ స్టార్ మన బాలుకు బాల్యమిత్రుడు(ట). ఇక ఊళ్ళో వాళ్ళంతా బాలు వెంటపడతారు, తమకు సూపర్ స్టార్ తో పరిచయం కలిగించమని.బాలుకు ఇది ఇష్టం లేకపోయినా, తన సినిమా కష్టాలు గట్టెక్కాలంటే, వేరే మార్గం కనబడదు. సూపర్ స్టార్ ను కలుసుకోవాలని విఫల ప్రయత్నాలు చేస్తుంటాడు.చివరకు బాలు అశోక్ కుమార్ ను కలిశాడా? తన సినిమా కష్టాలు గట్టెక్కాయా?

ఈ సినిమాకు ఆయువుపట్టు, చివరి 20 నిముషాలు. స్నేహ బాంధవ్యాన్ని హృద్యంగా, ఉద్వేగంగా (కొండొకచో మనసులను, నిమ్మకాయ ముక్క పిండినట్టుగా) చిత్రీకరించాడు దర్శకుడు.

పాత్రలు, పాత్రధారులు : సూపర్ స్టార్ గా రజని నటన తనే ఆ పాత్ర చేయగలడు అనేటట్టుగా ఉంది. జగపతి, నటనలో ’గజ’పతి అనిపించుకున్నాడు. తనికెళ్ళ భరణి, ధర్మవరపు, సునీల్ వగైరా ఓకే.నయన తార, నయన మనోహరంగా ఉంది. మీనా అంతకన్నా బావుంది.

ఇక ఆపై చెప్పుకోదగ్గవి, ఫోటొగ్రఫీ, తోట తరణి కళా దర్శకత్వం. మాటలు ఓకే.

లోపాలు : నేటివిటీ లోపించిందీ చిత్రంలో.బార్బర్ షాపు అంటే,ఓ బంకు, అందులో సినిమా వాల్ పోస్టర్లూ, ’బెంచ్’ పైన ఉన్న వాళ్ళ కోసం సితార, జ్యోతి చిత్ర లాంటి పత్రికలూ, కబుర్లు చెబుతూ, అనాయాసంగా క్షవరం చేస్తూ,your freindly neighborhood లాంటి క్షురకుడూ...ఇవేవి లేవు. జగపతి బాబు షాపు యే మాత్రం బావోలేదు. అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుంపు కాస్త మళయాళ వాసన కొట్టింది. కామెడీ తేలిపోయింది. ప్రభు, మమతా మోహన్ దాస్ ...వీళ్ళ పాత్రలు శుద్ధ వేష్ట్.

మొత్తానికి, పాట, ఫైటూ, పాట, ఫైటూ ఈ సీక్వెన్స్ తో వచ్చే చెత్త కంటే, ఈ చిత్రం కాస్త నయమే. ఒక్క సారి చూడవచ్చు.4 comments:

 1. అలాగంటారా! ఈమధ్య సినిమాలతో వరుసగా తల బొప్పికట్టించుకున్నాక దీన్ని చూడ్డానికి సాహసించలేదు. చూసొచ్చినవాళ్లు కూడా దీని గురించి ఏమీ మాట్లాళ్లేదు. :)

  ReplyDelete
 2. రివ్యూ చితక్కొట్టేసారు.
  బాలకృష్ణ, శ్రీదేవిలది అన్యోన్య దాంపత్యం. (శ్రీదేవి బోనీకపూర్కి ఎప్పుడు విడాకులిచ్చింది? బాలకృష్ణకు సడన్ గా ఏమ్ పోయేకాలం వచ్చింది? లాంటి ఇంటెలిజెంట్ ప్రశ్నలు వేయకండి. అవి సినిమాలో జగపతిబాబు, మీనాలపేర్లు).

  This para is too good :)

  ReplyDelete
 3. ఈ సినిమా చూసిన వాళ్ళు ఇంకో రకంగా చెబుతున్నారేంటి చెప్మా? :-)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.