Thursday, June 27, 2013

నీడ పై దాడి - 1

వదనంబునకంటిన స్వేదంబును వసనంబునకనుగుణమౌ కౌనునకు నాదేశంబు గావించుచు నలుదెసలం బరికించెను విట్టోరియో.

అల్జీర్స్ పట్టణంబునందున్న అనామికా బజారు అతనిటఁ దిరుఁగు కూటమితోడనూ, రహదారుల పార్శ్వంబందున బెరగిన దుకాణ సముచ్చయంబులన్ గుమిగూడిన యాత్రికుల తోడనూ, జనబంధురమై, గహనదురంధరమై భాసించుచున్నది.

ఆతఁడు కరిదంతంబుల నెరపిన వస్తుసముచ్చయంబుల విక్రయంబు జేయునొక విక్రయశాలను వినిమితము గావించి, నాలుగు యడుగులనద్దిశ వైపుగాఁ గదిలించి, ఐదవ యడుగు మోపునెడ - కలకలమను నొక్క కోలాహలమచ్చోటఁ బెచ్చరిల్లెను.

"ఓరి భగవంతుఁడా! నా ధనము...నా ధనంబునెవరో యపహరించిరి ...రక్షకభటులను రావింపుడీ" యను ఎలుగు ఱాపడునట్టు స్వరంబు వికస్వరంబుగా వినిపించుచుండనొక స్త్రీ దుకాణాంగనమున పఱుగున నఱుదెంచెను.

మ్రోయు యడుగునుపసంహరించి వెడవెడ నడక సాగించుచు అచ్చోటి నుండి దవ్వునకరిగెను విట్టోరియో.

యాత్రికురాలి రావంబులకు జాగరూకమైన బజారునకొకింత దవ్వున మూలగానొక్క తేనీటి యంగడి యందు ఉల్లాసంబుగ సల్లాపంబుల మఱగిన రక్షకభట చయము యల్లన రంగంబునన్ డిగ్గి మాయమైపోయిన ధనంబును శోధింపబూనుకొనిరి.

ఆ గడబిడ గడవకయే తానా యెడ నడుగిడిన ముడుసులు వెడలునని ఎఱిఁగి విట్టోరియో చేజారిన యమూల్యావకాశంబును తలఁచి శంకించుచు, ఖిన్నుడై నొక మూలనున్న తిన్నెను జేరి విశ్రమించెను.

ఆ సందర్భమున "ఏమోయీ! ప్రియమిత్రుఁడా విట్టోరియో!" యనుచు వచ్చిన మిత్రుడొకడాతనిని పలుకరించి, "త్వదీయాననమవనతమైన కారణంబెయ్యది సోదరా? ఇంతవరకునూ యారంభమవలేదొకొ??" యని అపహాస్యపూరితభాషణంబొనర్చి వెన్నుపై చరచి నిచ్చంబోయెను.

ఆతని వెనుక నెడనే బోయి ముఖనాసికాద్వయమునేకమొనర్చవలెనను కౌతుకమునడగించుకొని తానున్న యెడనే విశ్రమించెను విట్టోరియో.

ఆ మిత్రుని యుత్ప్రాసంబున నొక్క ప్రల్లదమును లేదు. వేకువ తొడరిన కడ నుండీ శక్తికి వెరవక ప్రయత్నము సాగించుచున్ననూ, విధివిలాసంబున నాటంకములు సంభవించుచున్నవి. తన వదనంబవనతంబు గాక మరేమగు?**************************************

ఎసాల్ట్ ఆన్ షాడో - అను మధుబాబు నవలకు గ్రాంథికీకరణము. మధుబాబు గారికి, పరవస్తు చిన్నయసూరి గారికీ క్షమాపణలతో..

Sunday, June 23, 2013

సంకేతపదనిర్మాణతరుణోపాయన(స)ము

అనగనగా ఒక రోజు - నాలుగు సార్లు ఫ్రెండ్స్ తో బాటు కేంటీన్ కు వెళ్ళి కాఫీ తాగి సీటు దగ్గరకు వచ్చి, ఫేసుబుక్కూ, ప్లస్సూ, కూడలి, యూట్యూబూ, మరో నాలుగు కిటికీలు తెరిచి ఆఫీసులో చాలా బిజీగా పనిచేసుకుంటూ ఉన్నాను.

తెర మీదకు ఒక మిస్సైల్లా  ఒక డబ్బా వచ్చింది. దాని మీద ఉన్న సారాంశం ఇది.

"మీ యంత్రం తాలూకు సంకేతపదం ఆరునెలలుగా పాచిపోయి కంపు కొడుతూ ఉంది. దానిని మార్చండి."

ఓస్ అంతే కదా అనుకుని "సరే" అన్న పోకముడిని ...ఛ ఛ .. బొత్తామును నొక్కాను. ఒక భయంకరమైన విషవలయంలో అడుగుపెట్టబోతున్నానని నాకా క్షణం తెలీదు.

అదివరకు ఇలాంటి బెదిరింపులను చూసి ఉన్నాను. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు గ్రామసింహం ..ఛ ఛ ..సీమసింహం బెదరదు అని సంకేతపదం ఇలా టంకించాను. -

"వెధవ123"

ఇక్కడో మినీ ఫ్లాష్బాకు. ఇలా సంకేతపదాలు మార్చమని మూడు నెలలకో మారు మాకు విన్నపం వస్తుంది. "వెధవ123", "చవట123" - ఈ రెండు సంకేతపదాలనే నేను మార్చి మార్చి వాడటం అలవాటు. మా మిత్రులు ఇలాంటివే ఏవో పద్ధతుల్లో తమ సంకేతపదాలను గుర్తుంచుకోవడానికి వీలుగా తీర్చిదిద్దుకోవడం నాకు తెలుసు.

తెరపైకి ఒక డబ్బా, దాంట్లో తిట్టు లాంటిది కనిపించింది - "మూర్ఖుడా, నీ సంకేతపదం లో వరుసగా మూడు నంబర్లను పెట్టావు. మార్చు." బేక్ గ్రవుండ్ లో చిన్న సైజు వికటాట్టహాసం.

ఈ తతంగాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేయడం తక్షణ కర్తవ్యం అని, కేన్సిల్ నాడా ...అదే బొత్తామును నొక్కాను. మరో డబ్బా. "కేన్సిల్ నొక్కి ఫేస్బుక్ కు వెళ్ళిపోదామనుకుంటున్నావా? కుదరదోయ్. సంకేతపదం మార్చేదాకా వదలను. వదల బొమ్మాళా వదల, రీస్టార్ట్ చేసినా వదల"

నా మనసు కాస్త కీడు శంకించింది. ఇలాంటిది ఇదివరకెప్పుడూ రాలేదు

సరే అని కాస్త ఆలోచించి ఇలా మార్చాను. "వెధవ321". ఫలితం ఇది.

"ఒరే కోడి బుర్ర వెధవా, వరుసగా అన్నాను. అది వెనుకనుండైనా కావచ్చు"

"వెధవ007"

"హమ్మా? ఆశ దోశ అప్పడం వడ! ఒకటే నంబర్ రెండు సార్లు రాకూడదోయ్".

తల వేడెక్కింది. కాస్త ఆలోచించాను. నేను మొట్టమొదటిసారి యాహూ అకవుంటు తెరిచినప్పుడు నా ప్రియతమ నాయిక సోనాలీ బేంద్రే స్మృత్యర్థమై ..అదే ఆమె గుర్తుండడానికి సోనాలి1 లాంటిది వాడినట్టు గుర్తు. ఇప్పుడు ఆమె, నా యాహూ ఖాతా రెండూ పదవీవిరమణ చేశాయ్. ఇప్పుడు దాన్ని వాడితే ఎలా ఉంటుంది? ఆచరణలో పెట్టాను.

"ఒరే! సంకేతపదంలో ప్రత్యేక చిహ్నం లేకుంటే ఒప్పుకోను" సందేశం, బేక్ గ్రవుండ్ లో తొడకొట్టిన సవుండూ వినిపించాయ్.

అప్పుడు సన్నగా వెన్నెముక క్రింది భాగాన చల్లటి అనుభూతి. చిన్న వణుకు.

తొడకొట్టిన సౌండు విన్నప్పుడల్లా నా హృదయం బలహీనమవుతుంది. ఎందుకంటే అదేదో సినిమాలో హీరో తొడకొట్టగానే కుర్చీ తనంతట తాను జరుక్కుంటూ హీరో దగ్గరకు వెళ్ళిపోతుంది.

అలా కుర్చీలు జరగటం గతితార్కిక భౌతికవాదులు, హేతువాదులూ నమ్మరు. నేను కేవలం అవకాశవాదిని కాబట్టి దేన్నైనా నమ్ముతాను. ఇప్పుడు నా కుర్చీ కూడా జరుగుకుంటూ నాతో సహా ఐటీ డిపార్ట్ మెంటు కు వెళ్ళిపోతే?. అలా వెళితే ఆ "ట్రావెల్" ను ఎంజాయ్ చేయడానికి ఇబ్బందేమీ లేదు కానీ ఐటీ వాళ్ళది రెండో అంతస్తు., నేనున్నది ఐదవది. ఐటీ మేనేజర్ మంత్రశక్తిని కుర్చీ అపార్థం చేసుకుంటే మెట్లపైనుండి నేను క్రిందపడతాను.అంత రిస్కు చేయలేను.

అందుకని మరింత దీక్షగా ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరింది F1 గంటును ..సారీ... బొత్తామును నొక్కాను. అక్కడ సంకేతపదం మార్చడానికి నియమాలు వ్రాసి ఉన్నాయి.

1. సంకేతపదం లో కనీసం ఎనిమిది అక్షరాలు ఉండాలి.
2. కనీసం ఒక పెద్ద అక్షరం, ఒక చిన్న అక్షరం, ఒక అంకె, ఒక చిహ్నం ఉండాలి.
3. వరుసగా అంకెలు రాకూడదు.
4. వరుసగా అక్షరాలు రాకూడదు.
5. ఒకే అక్షరం లేదా అంకె తిరిగి తిరిగి రాకూడదు.
6. మీ సంకేతం మీ జీవితం లో ఎప్పుడూ ఉపయోగించనిదై ఉండాలి. ఒకవేళ పాతది కనుక్కోలేరు అనుకుని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది.
7. టంకించే ముందు కాళ్ళు కడుక్కుని వచ్చి ఉండాలి.
...
...
ఇలా అనేక సూచనలు పొందుపర్చబడి ఉన్నాయ్.

ఒక పదిహేను ఇరవై విఫల ప్రయత్నాల తర్వాత ఒక భయంకరమైన పాస్ వర్డ్ నిర్ణయించాను. అది ఎలానూ గుర్తుండి ఛావదు కాబట్టి దాన్ని మొబైల్ ఫోను లోనూ, పర్సులో ఉన్న ఒక పుస్తకం లోనూ రాసి పెట్టుకున్నాను.

అయితే అది అంతం కాదు ఆరంభం మాత్రమే. మరుసటి రోజు మా సంస్థ అంతఃజాలం (intranet) సంకేతపదం కూర్చటానికి మరో యజ్ఞం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత మరొకదానికి. ఇలా సమస్య తీవ్రతరమయ్యేటప్పటికి ఒక బ్రహ్మాండమైన మీటింగు పెట్టి సమస్యను చర్చించారు అందరూ.

చివరికి కనుక్కున పరిష్కారం ఇది.
- ప్రతి ఉద్యోగికి రెండు యంత్రాలుంటాయి. మొదటి దానిలో సురక్షిత వ్యవస్థ ఉంటుంది. మరొకటి సాధారణమైనది. రోజు సాదా యంత్రంలో పని చేసి రోజు చివరన, వ్యవస్థీకృతమైన యంత్రంలోకి డేటాను తర్జుమా చేస్తారు.

ఇలా కనుక్కున్న పరిష్కారంతో సమస్య కొలిక్కి వచ్చింది.

Wednesday, June 5, 2013

నిత్యసౌందర్యం

అనగనగా సరస్వతీదేవికి ఒక కొడుకు పుట్టాడుట. అతని పేరు కావ్యపురుషుడు. ఓ మారు సరస్వతి ఏదో దేవతల సమావేశానికి వెళుతుంటే కొడుకు - ’అమ్మా, నేను వస్తా’నని వెంటబడ్డాడుట. అప్పుడా అమ్మ ’బాబు నీవు అక్కడికి రారాదు. నేనిప్పుడే వచ్చేస్తా, నీవిక్కడే ఉండు’ అని వెళ్ళిపోయిందట. ఈ బాబుకు కోపం వచ్చి తామున్న హిమాలయాల దిగువన ఉన్న జంబూ ద్వీపానికి బయలు దేరాడట. అతణ్ణి చూసి, స్నేహితుడైన కుమారస్వామి కూడా కెవ్వున ఏడుస్తూ నేనూ వెళతానని వాళ్ళ అమ్మ పార్వతి దగ్గర గొడవ చేశాడట.

అప్పుడు పార్వతి ఒక అమ్మాయిని సృష్టించి - అమ్మాయీ ఇదుగో ఆ వెళుతున్నతనే నీ భర్త. అతణ్ణి అనుసరించి వెనక్కి తీసుకురా అన్నదిట. ఆ అమ్మాయి సాహిత్యవిద్యావధువు. కావ్యపురుషుడు మొదట తూర్పు (గౌడ) దేశానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే సాహిత్యవధువు అక్కడి వాతావరణానికి అనుగుణంగా తన ఆహార్యం మార్చుకుందిట.

ఆమెను చూసిన కావ్యపురుషుడికి కోపం తగ్గక చురచురలాడాడుట.  ఆ పద్ధతి గౌడీ రీతి అని స్థిరపడింది. గౌడీరీతి అంటే - సమాసభరితంగా క్లిష్టంగా ఉంటుంది.

ఆ తర్వాత కావ్యపురుషుడు పాంచాల రాజ్యం, ఆ చుట్టు పక్కలకెళ్ళాడు. అమ్మాయి అక్కడి వాతావరణానికనుగుణంగా ఆహార్యం స్వీకరించింది. ఈ సారి అబ్బాయి మెత్తబడ్డాడు కాస్త. అమ్మాయి వంక చూస్తున్నాడు, నవ్వకపోయినా. అప్పుడతని భావాలు, మాటలు పాంచాలీ రీతిగా పేరు పొందినయ్.

ఆ తర్వాత అతను మరింత క్రిందకు వచ్చి విదర్భకు వచ్చాడు. ఈ సారి కావ్యపురుషుడు బాగా ఐసయి పోయాడు. ఇప్పుడు అతని మాటల శైలి చాలా అందంగా, సుకుమారంగా ఉంది. అతని శైలి వైదర్భి. ఇంకా ఆయన దక్షిణ సముద్రంపైన ఉన్న వేయి యోజనాలు తిరిగాడు. అలా తిరుగుతూ కేరళకూ వచ్చినాడు. అక్కడ అమ్మాయి తన ఆహార్యం, వస్త్రమూ ఇలా చేసుకుందిట.

ఆమూలతో వలితకున్తలచారుచూడః
చూర్ణాలకప్రచయలాంఛితఫాలభాగః ||
కక్షానివేశనిబిడీకృతనీవిరేషః
వేషశ్చిరం జయతి కేరళకామినీనామ్ ||

మొదళ్ళకంటా తిప్పి కట్టిన కుంతలాలతో అందమైన ముఖం కలది, అక్కడక్కడా ముంగురులతో అలంకృతమైన ఫాలభాగం ఉన్నది, భుజం క్రింద కోకముడి బిగించి కట్టినది, అయిన కేరళ ముద్దుగుమ్మల వేషం భేషుగ్గా ఉంది!

ఇలా...
ఆమె అందంతో సాటి రాకపోయినా ఓ కందం.

కం ||

పురిసల్పి మొదల గట్టిన
నెరుల నొయారంపు మోము, నెన్నుదుట బడం
కురులు, ఎరక దిగి కోకను
నెరఁ గట్టిన కేరళ నెరి నిత్యము ముదమౌన్

నెరులు = కుంతలములు
ఎరక = భుజము

ఉహూ...మరొక ఉత్పలమాల కూడా..

ఉ||
సొమ్మగు ముంగురుల్ నొసట సోలిన మోమెలదేటి దాటులన్
బమ్మెరవోవఁ దోలు దెగబారెడు వేనలి, మూపు క్రిందుగన్
క్రొమ్ముడి, కొప్పు నందెసగు కూటపు ముత్తెములున్, సుధౌష్టము
న్నమ్మకచెల్ల ! కేరళ సునందిని నిత్యము చెన్నువొందగన్.

అందమైన ముంగురులు నుదుటన పడుతూ ఉన్న మోము,
ఎలదేటి దాటులు అంటే తుమ్మెదలు - అవి నివ్వెరపడేట్టుగా ఉన్న నిడుపాటి జడ (వేనలి = జడ), 
భుజానికి కాస్త కిందుగా కట్టిన కొత్త (రకం) కోకముడి, 
కొప్పుపైన వెలుగుతున్న ముత్యాలరాశులూ, 
అమృతం లాంటి పెదవి, 
అమ్మకచెల్ల! కేరళ అమ్మాయి నిత్యమూ అందంగా ఉండాలి (ఉంటుంది).. :) 

(ఈ పద్యం కూడా కొట్టుకొచ్చిన ఓ పెద్ద పేరడీయే ;)

ఇంతకూ కథ ఏమయిందండి అంటారా? అంత అందమైన డ్రెస్సుతో అమ్మాయి కనిపిస్తే ఐసవకుండా ఉంటాడా అబ్బాయి? సరస్వతి కొడుకూ, పార్వతి కూతురూ పెళ్ళి చేసికొని హిమాలయాల్లో కాపురం పెట్టారు. అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సూ, ఆమె హొయలూ ఈనాటికీ కేరళలో వ్యాపించి ఉన్నాయి.

అదండి కేరళ నిత్యసౌందర్య కథ.