Monday, February 25, 2008

రెండు అందమైన సుత్తి సినిమాలు

మొన్న రాత్రి హెచ్.బీ.ఓ. లో 'మెమోయిర్స్ ఆఫ్ ఎ గీషా 'సినిమా వచ్చింది. పీవీఆర్ లో 2006 లో నేను చూసిన అద్భుతమైన సినిమాల్లో ఇదొకటి.

ఆఫ్ బీట్ సినిమాలు నచ్చని వారికి ఈ సినిమా నచ్చక పోవచ్చు. (నాకూ ఆఫ్ బీటు సినిమాలు నచ్చవనుకోండి :-)). అయితే ఈ సినిమా లో ప్రత్యేకత ఆఫ్ బీట్ గా వుండడం కాదు.

సినిమాటోగ్రఫీ. మనం ఈ మధ్య ప్రతీ సినిమా కూ వింటున్నాము, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అని. ఐతే చిత్రం లో ప్రతీ ఫ్రేము ఓ మైఖెలాంజిలో, ఓ విన్సెంట్ వాన్ గోఘ్ కుంచె నుండీ జాలువారిన చిత్రం లా వుంటుంది.

కొన్ని సన్నివేశాల్లో, ముఖ్యంగా చెర్రీ పూలు కురిసేటప్పుడు, మంచు కురిసె బాక్ డ్రాప్ లో చిత్రించిన దృశ్యాలూ వూపిరి స్థంభింపచేసేంత అందంగా వుంటాయి.

ఓ అందమైన రంగు పరదా వెనకల కారు నలుపు లాంటి 'గీషా ' జీవితం. 'గీషా' ఆచారం మన దేవదాసీ ఆచారం లా వుంటుంది. చిన్నప్పుడు ఓ ఇంట్లో దాసీ గా చేర్పించబడ్డ ఓ అమ్మాయి, పెరిగి పెద్దదయిన తర్వాత 'గీషా ' గా మారడం, తన మిత్రులే శత్రువులు గా మారడం, చిన్న తనం లో తన పట్ల కరుణ చూపించిన ఓ ఆసామీ కోసం తను అర్పించుకోవాలనుకోవడం, ఇంతలో పరిస్థితుల ప్రభావం తో ఆశలు అడియాసలవడం, ఇలా జరుగుతుంది కథ.

ఇంత అందమైన సినిమాటోగ్రఫీ ఖచ్చితంగా చెప్పాలంటే కళా దర్శకత్వం (ఆర్ట్ డైరెక్షన్) చాలా చాలా అరుదు గ మనకు కనబడుతుంది. ఈ సినిమా కు ఇదే విభాగంలో ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చినట్టు గుర్తు.

సినిమాటోగ్రఫీ లో ఈ సినిమాకు సరిసాటి కూడా 2006 లోనే పీవీ ఆర్ లో నేను చూసాను. ఆ చిత్రం పేరు ' సంసార '.

నేను కాశ్మీర్ లో లడాఖ్ చూడలేదు. ఐతే ఈ సినిమా చూసాను. ఇంతకంటే అందంగా చూపించడం సాధ్యం కాదనుకుంటా మరి.

ఇదీ కొంచెం సుత్తి సినిమా నే. ఐతే సినిమాటొగ్రఫీ లో తలమానికం ఇది. ఈ చిత్రానికి కూడా ఎన్నో అవార్డ్ లు వచ్చాయి.
మొత్తానికి బోర్ కొట్టించినా కూడా మర్చిపోలెని సినిమాలు ఈ రెండూ.

Tuesday, February 12, 2008

టీ9 కథా కమామీషు

చాలా రోజులుగా ఓ సాంకేతిక టపా రాయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. ఇందులో, చాలా వరకు మీకు తెలిసిన విషయాలు అయి వుండచ్చు, కొన్ని కొత్త విషయాలు నాకు తెలిసినవి జోడించడం జరిగింది.

టీ9 కి అర్థం టెక్స్ట్ ఇన్ 9 కీస్ అని.

మీరు వాడే మొబైల్ లో సరళ సందేశం పంపడానికి ఉద్దేశించబడ్డ ఎడిటర్ లో, ఓ ఎంపిక టీ9. మామూలుగా మీరు మీ సందేశాన్ని టైప్ చేయడానికి 2 పద్దతులు.

1. మల్టీ టాప్ పద్ధతి.
2. టీ9 లేదా, డిక్షనరీ.

మొదటి పద్ధతి లో, వుదాహరణకు, మీరు 'బెట్' అనే పదం టైప్ చేయాలంటే, మీరు ఈ సీక్వెన్సు పాటించాలి.
2 (2 సార్లు), 3 (2 సార్లు), 8 (1 సారి)

ఇక టీ9 విషయానికి వస్తే, (మీరు డిక్షనరీ మోడ్ లో వుంటే) ఇదే పదాన్ని టైప్ చేయడానికి 2,3,8 ఒక్కోసారి టైప్ చేస్తే చాలు. మీక్కావలసిన పదం రెడీ.

ఈ టీ9 లో పదాల ఎంపిక రెండు విభిన్న తరహాలలో జరుగుతుంది.

1. ప్రెడిక్టివ్ టెక్స్ట్. (వూహాత్మక వ్యాఖ్య అందామా?)
2. కాంటెక్స్ట్ బేస్డ్ టెక్స్ట్.(సందర్భోచిత వ్యాఖ్య)

ఇందాక మనం చర్చించుకున్న 'బెట్ ' పదం ప్రెడిక్టివ్ టెక్స్ట్ కి చెందుతుంది. ఈ టీ9 లో మీరు మీకు కావలసిన పదాన్ని కూడా జోడించుకోవచ్చు. ఎలా అన్నది ఇది మీరు వాడుతున్న మొభైల్ అనుసరించే విధానం బట్టి వుంటుంది. వుదాహరణకు ఎల్జీ వారి మొబైల్ లో, మీక్కవలసిన పదాన్ని, మల్టీ టాప్ పద్ధతి లో టైప్ చేసి, మోడ్ ను టీ9 లో మార్చుకుంటే (* కీ నొక్కడం ద్వారా) చాలు.

ఇంకో విషయం. ఒక్కోసారి, మీకు కావలసిన పదం యొక్క కీ సీక్వెన్స్ లో, వెరే పదాలు వుండే అవకాశం కూడా వుంది. ఉదాహరణకు, మీరు 'హోం ' అనే పదం టైప్ చేయాలనుకోండి. 4,6,6,3 టైప్ చేయాలి. అయితే, మీకు కనబడే పదం 'గుడ్ ' అని వుంటుంది. ఎందుకంటే, గుడ్ అని టైప్ చేయాలంటేనూ, 4,6,6,3 వాడాలి. అయితే, టీ9 , మీకు కావలసిన పదాన్ని వాడుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇక్కడ మళ్ళీ, మీరు వాడే మొబైల్ అనుసరించే విధానం బట్టి ఈ సౌలభ్యం వుంటుంది. వుదాహరణకు, సొనీ ఎరిక్సన్ లో అయితే, మీరు 4,6,6,3 టైప్ చేయగానే, మీకో డ్రాప్ డవున్ మెను కనిపిస్తుంది. మోటొరోలా లో, స్క్రీను కింద భాగాన పదాలు కనిపిస్తాయి.

ఇక కాంటెక్స్ట్ బేస్డ్ టెక్స్ట్.(సందర్భోచిత వ్యాఖ్య) గురించి తెలుసుకుందాం.

మీరు ఓ సరళ సందేశం లో 'ఐ లవ్ యూ ' అన్న వాక్యం వాడారనుకోండి. తరువాత సందర్భంలో, మీరు 'ఐ' అన్న పదం టైప్ చేసి, స్పేస్ (ఖాళీ) నొక్కగానే, మీ ఎడిటర్ మీకు 'లవ్ ' అనే పదం సూచిస్తుంది. మీకు అదే పదం కావాలనుకుంటే, రైట్ కీ నొక్కడం ద్వారా దాన్ని ఎన్నుకోవచ్చు, లేదూ, మరో కొత్త పదాన్ని టైప్ చేసుకోవచ్చు.

కొత్తగా వుంది కదూ. ఈ సౌలభ్యం నాకు తెలిసి, కేవలం ఎల్జీ వారి రిలయన్శ్ మొబైల్ లో మాత్రమే లభ్యం.

ఇంకో ఉపయోగం. ఓ పదం లో మొదటి అక్షరం మీకు తెలుసు. క్రితం సారి అదే అక్షరం తో యే పదాన్ని మీరు ఉపయోగించారు తెలుసుకోవాలి. ఇందుకు మీరు చేయవలసింది, మొదటి అక్షరం నొక్కిన తర్వాత '0 ' టైప్ చేయడమే.

టీ9 లో వున్న ఇంకో వుపయోగం, మీరు యే మోడ్ లో వున్నా, మధ్యలో, మీరు ఓ నంబరు వాడుకోవాలంటే, వుదాహరణకు 'టీ 9 ' అనే పదాన్నే తీసుకోండి. 'టీ ' తర్వాత 9 కావాలంటే, మళ్ళీ నంబర్ మోడ్ కు మారవలసిన అవసరం లేకుండా, '9 ' కీ ని నొక్కి పట్టుకోండి. మీకు 9 నంబరు దొరుకుతుంది. ఈ సౌకర్యం కూడా అన్ని మొబైల్స్ లో లేదనుకుంటాను. 'ఆల్ఫా లాంగ్ కీ ' అంటారు దీన్ని సాంకేతిక పరిభాషలో.

ఇంకో విషయం. ఈ టీ9 దిక్షనరీ సదుపాయం మిగతా భాషల్లో కూడా వుంది. మన తెలుగు లో (టీ9 వెర్ 7.2.1) కూడా. అయితే, నాకు తెలిసి, తెలుగు సదుపాయం ఓ సాం సంగ్ మొబైల్ లో మాత్రం చూసినట్టు గుర్తు.

టీ9 గురించి మీకు ఇంకా వివరాలు, ఉపయోగాలు కావలంటే www.t9.com లంకె కు వెళ్ళండి.

Thursday, February 7, 2008

అమెరికన్ ముఠా మేస్త్రి రివ్యూ

చాలా కాలం తర్వాత ఓ దమ్మున్న సినిమా, అమెరికన్ గాంగ్ స్టర్ చూసాను, ఫోరం లో పోయిన వారం.

ఈ సినిమా ఓ రాం గోపాల్ వర్మ మార్క్ సినిమా లాంటిది. నాకు దీనికి వర్మ 'సత్య 'కు కొన్ని పోలికలు కనిపించాయి. సత్య లో , ఓ వ్యక్తి, జీవిక కోసం ముంబై కోసం వచ్చి, పరిస్థితుల ప్రభావం వల్ల, మాఫియా లో చేరి, అందులో ఉచ్చ స్థితి కి చేరిన తర్వాత, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇందులోనూ, ఓ వ్యక్తి, తన వాళ్ళ కోసం, తను నమ్మిన కొన్ని సిద్ధాంతాల కోసం ఒంటరిగా మాదక ద్రవ్యాల వ్యాపారం లో ప్రవేశించి, ఉచ్చ స్థితి కి చేరుకుని, ఆఖరున, పోలీసులకు లొంగి పోయి, అప్రూవర్ గా మారడం. అలానే, సత్య లో ఓ నిజాయితీ గల పోలీసు ఆఫీసర్. ఇందులోనూ, అలాంటి పాత్ర.

అయితే, అమెరికన్ ముఠా మేస్త్రి లో, చెప్పుకోదగ్గ విషయం యేమంటే, ఈ సినిమా మెలోడ్రామా, సన్నివేసాలు మీదకన్నా పాత్రల కారక్టరైజేషన్ మీద నడుస్తుంది. ఇది ఓ రకంగా కత్తి మీద సాము. ఇదే ఈ దర్శకుని (రిడ్లీ స్కాట్) గొప్పతనం.

కథ :

ఇది నిజంగానే జరిగిన (ఓ వ్యక్తి) కథ.కథాకాలం 60 వ దశకం చివర్లో, 70 వ దశకం మొదట్లో. బంపీ జాన్సన్ అనే ఓ నీగ్రో వద్ద ఫ్రాంక్ లుకాస్ (ఇతను నీగ్రో నే) అనబడే వ్యక్తి పని చేస్తుంటాడు.జాన్సన్ చనిపోవడం తో, తన (అక్రమ) వ్యాపార వ్యవహారాలన్నీ కకావికలు అవుతాయి. ఆ సమయం లో, అనేక ప్రతికూల పరిస్థుల మధ్య, ఫ్రాంక్ లుకాస్, తను నమ్మిన కొద్ది మంది (తన బంధువుల) సహాయంతో, మాదక ద్రవ్యాల దిగుమతి వ్యాపరం ప్రారంభిస్తాడు.

ఇతనికి కొన్ని సిద్ధాంతాలు వుంటాయి. వ్యక్తి సమాజానికి జవాబుదారీ కాడు. సమాజం లో రుగ్మతలు వ్యక్తి మంచితనం తో జయించడం కుదరదు. వ్యక్తి తనకు, తన కుటుంబ సభ్యులకు, తను చేసే పని (అది యేదైనా సరే) కి మాత్రమే జవాబు దారీ.


తన మాదక ద్రవ్యాల (క్లాస్ 4 హెరాయిన్) దిగుమతి లో మధ్య దళారీలను ఆశ్రయించడు. తన సరుకు నాణ్యత కోసం యే మాత్రం రాజీ పడడు. తనకు నమ్మకమైన కొద్ది మంది కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వాములు. అచిర కాలం లోనే కోటీశ్వరుడౌతాడు. తన తల్లి ని, తమ్ముళ్ళనూ, తన వద్దకు రప్పించుకుంటాడు.

ఇతనికి శత్రువులు, పోలీసులు, ఇతని సరుకు పంపిణీదార్లు వగైరా.

=======================================================

ఇతనికి కాంట్రస్టింగ్ గా నార్కోటిక్స్ విభాగం లో పని చేసే, రిచీ రాబర్ట్స్ అనబడే ఓ డిటెక్టివ్. ఇతనికి నిజాయితీ యే జీవితం. ఓ కేసు సందర్భంగా ఇతనికి అనామతు తరహా 1 మిలియన్ డాలర్లు దొరుకుతాయి. ఆ డబ్బు తను తస్కరించడానికి అవకాశం వచ్చినా, దాన్ని సరెండర్ చేస్తాడు. చేయిస్తాడు.

అతని భార్య విడాకులు ఇస్తుంది.

ఇతనికీ కొన్ని సిద్ధాంతాలు.

వ్యక్తి తన బతుకుతున్న సమాజానికి ప్రతీక. తను మొదట సమాజనికి జవాబుదారీ, తరువాత తనకు, తన జీవితానికీ.

బ్లూ మాజిక్ అనబడే హెరాయిన్ దిగుమతి కేసు తను ఆరంభిస్తాడు. తన ప్రతిభ తో ఒక్కొక్క చిక్కు ముడి ని విప్పుతూ, ఈ దిగుమతి ఫ్రాంక్ లుకాస్ వ్యాపారమే అని తెలుసుకుంటాడు. ఆఖరున ఫ్రాంక్ లుకాస్ ను అరెస్ట్ చేసి, తన ద్వారానె, ఈ మాదక ద్రవ్యాల ఉచ్చు లో వున్న మొత్తం అధికారులను, అరెస్ట్ చేయిస్తాడు.


===================================================

ఇదీ క్లుప్తంగా కథ. అయితే, మొదట చెప్పినట్టు, ఈ సినిమా లొ బలం అంతా పాత్రల కారక్టరైజేషన్. పాత్రల స్వభావాన్ని చిత్రీకరించడానికి సన్నివేశాల్ని వాడుకున్నాడు అనిపిస్తుంది.

ఈ సినిమా నిడివి 2:30 గంటలు. పెద్ద సినిమాయే, ఇంగ్లీషు సినిమాల పరంగా చూస్తే. ఇంతసేపూ ప్రేక్షకులను కూర్చోబెట్టి, కథనం లో బిగువు సడలకుండా, మనస్థత్వాలని ప్రతిబింబిస్తూ, ఉత్కంఠ గా చిత్రీకరించడం....హాట్స్ ఆఫ్.

ఇక కరడు గట్టిన ముఠా మేస్త్రి, ఫ్రాంక్ లుకాస్ గా డెంజెల్ వాషింగ్ టన్ అదరగొట్టాడు. రాబర్ట్స్ పాత్రలో రసెల్ 'కాకి '(క్రో)...గురించి చెప్పనవసరం లేదు. క్యూబా గుడింగ్ చిన్న పాత్రలో అయినా బాగా నటించాడు.

అయితే, ఈ సినిమాలో మాటి మాటికీ వినిపించే, నాలుగు అక్షరాల (ఇంగ్లీషు) బూతు పదం, కుటుంబం తో సహా చూడడానికి ఇబ్బంది పడేటట్టు చేస్తుంది.

మీరు సినిమా ప్రియులయితే, ఈ సినిమా ను మిస్ అవకండి.