Monday, September 16, 2013

మృచ్ఛకటికం - కొన్ని ఆలోచనలు


రచయితకు గొప్ప ఉదాత్తత (sensibility) అన్నది ఉన్నప్పుడు, ఆ ఉదాత్తతను ప్రతిబింబిస్తూ ఒక పాత్ర వెలువడినప్పుడూ, రచయిత యొక్క sensibilities కు తగిన పాఠకుడు ఆ రచనను చదవడం తటస్థించినప్పుడు ఆ రచయితకూ ఆ పాఠకుడికి మధ్య జరిగే ఏకాంతమైన అవగాహన సద్యఃపరనిర్వృతి అని నా అభిప్రాయం. దీన్నే రసనిష్పందం అనవచ్చునేమో. రాళ్ళపల్లి వారు ఒకచోట అన్నట్టు రసం అంటే తొమ్మిది భేదాలతో మాత్రమే నిర్వచింపదగిన emotion మాత్రమే కాదు. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఏదో అనుకూలం కోసం రసాలను నవవిధాలుగా వింగడించుకున్నప్పటికీ రసనిష్పందం యొక్క ఖచ్చితత్వం ఆ వింగడింపులో మాత్రమే లేదు.

సద్యః పరనిర్వృతి కలిగించే రచయితను కవి అని, ఆ పాఠకుడిని సహృదయుడని అనవచ్చునేమో.

వ్యక్తి వ్యక్తికీ సున్నితత్వపు తేడాలు సహజం. అదే స్థాయిలోనూ పాఠకుల సహృదయత కూడా మారుతుంది. అభిమాన రచయిత కూడా మారుతాడు. శాశ్వతంగా అందరికీ నచ్చే రచయిత కానీ, నచ్చే రచన కానీ ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఫలానా రచన నా అభిమాన రచన, ఫలానా రచయిత నా అభిమాన రచయిత అన్నది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. అభిప్రాయాలకంటే రచన తాలూకు sensibilities గురించి మాట్లాడుకోవడం మంచిది.

వర్షాకాలం గురించి అనుకోగానే నాకు శూద్రక మహాకవి, మృచ్ఛకటికకావ్యం, అందులో వర్షర్తు వర్ణనా గుర్తొస్తాయి. అలాంటి వర్ణన అంతకన్నా గొప్పగా ఇతర కావ్యాలలో ఉండవచ్చు గాక. అయితే మృచ్ఛకటికం తాలూకు ఉదాత్తత కేవలం వర్ణనలో లేదు. అది దృశ్యకావ్యమవడం మూలాననూ, అక్కడ కవి కల్పించిన సన్నివేశం వల్లనూ, వసంతసేన పాత్ర యొక్క ఉదాత్త స్వరూపం నేపథ్యంగానూ ఆ వర్ణన యొక్క సౌందర్యం వ్యక్తమవుతుంది.

వసంతసేన ఒక గణిక, క్షత్రియ. ఈమె దరిద్రుడూ, అప్పటికే భార్య, పుత్రుడు ఉన్న ఒక సార్థవాహుణ్ణి (బ్రాహ్మణుడు/వైశ్యుడు) ప్రేమించింది. ఒకానొక రాత్రి తన ప్రియుని ఇంటికి బయలుదేరింది. ప్రియుణ్ణి మొదటి సారి చూడబోతున్న తరుణం. ఆమె చిత్తం లోపల ఉద్వేగమూ, ఆనందమూ పెనవేసుకుని ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్రశ్న. గణిక - అంటే ఒక వేశ్యకు - అంటే పురుషసంగమం అలవాటైన ఒక యువతికి - ఒక మొగవాని పట్ల అలాంటి భావాలు ఉండటం ఎలా సంభవం? సరిగ్గా ఇక్కడే పాత్ర ఉదాత్తత - సహృదయునికి తెలుస్తుంది. శీలం వేరు, స్వచ్ఛత వేరు. శీలం సామాజికం అయితే స్వచ్ఛత మానసికం. రెండూ పరస్పర వ్యతిరేకాలు కావు, దోహదకారులూ కానవసరం లేదు. సందర్భమో కాదో తెలియదు కానీ ఈ మధ్య మరోసారి చదివిన యండమూరి నవల అష్టావక్ర గుర్తొస్తుంది. అందులో ప్రతిమా అగర్వాల్ పాత్ర ఇదే పాయింట్ మీద నడుస్తుంది. అలాగే హంపి నుండి హరప్పా దాక లో బసివి నాగమ్మ గురించి రామచంద్రగారు వివరిస్తారు. ఆ పాత్ర గురించి చదివిన తర్వాత పాఠకుడికి సానుభూతే తప్ప ఏ విధమైన వికారమూ కలుగదు. వసంతసేన కూడా అలాంటి ఒక ఉదాత్తమైన పాత్ర.

వసంతసేన ఉద్వేగానందాలను ప్రతిబింబిస్తూ బయట వాతావరణం. కుండపోతగా వర్షం. ఆ వాతావరణంలో వసంతసేనకు తోడుగా గొడుగు పట్టి వెంట వస్తున్న విటునికి, వసంతసేనకూ మధ్య వర్షం గురించిన సంభాషణ.

ఇందులో ఓ రెండు పద్యాలు.

గర్జంతి శైలశిఖరేషు విలంబిబింబా మేఘా వియుక్తవనితా హృదయానుకారాః |
యేషాం రవేణ సహసోప్తతితైః మయూరైః ఖం వీజ్యతే మణిమయైరివ తాళశృంగైః ||

వసంతసేనా! చూడు!చూడు! శైలశిఖరాల మీద గర్జిస్తున్న ఆ మేఘాలు విరహిణుల హృదయాల లాగా ఎలా భారంగా ఉన్నాయో! వాటి చప్పుడుకు ఒక్క ఉదుటున పైకెగిరిన నెమళ్ళ పింఛాలతో ఆకాశం మణిమయమైన వింజామరలచేత వీయబడుతున్నట్టుగా లేదూ!

మూఢే ! నిరంతర పయోధరవా మయైవ కాంతః సహాభిరమతే యది కిం తవాత్ర!
మాం గర్జితైరితి ముహుర్వినివారయంతీ మార్గం రుణద్ధి కుపితేవ నిశా పత్నీ ||

‘ఓసి మూర్ఖురాలా! వసంతసేనా! దట్టమైన మబ్బులున్న (ఇఱుకు పయోధరాలు) ఉన్న నేను నా కాంతుడితో రమిస్తూంటే, మధ్యలో నీకేంటి?’ అని ఉరుములతో మాటిమాటికీ నివారిస్తూ (నాపై ఉరుముతూ) ఈ నిశ, సవతి లా మారి, నా దారిని అడ్డగిస్తూంది కదా!
(సవతి ఎందుకంటే, తనను తన ప్రియుడి వద్దకు చేఱుకోనీకుండా అడ్డుపడుతున్నది కాబట్టి) అని వాపోతుంది. పయః అన్న సంస్కృతపదానికి నీరు, పాలు అని రెండు అర్థాలు. నిరంతర పయోధరములు అన్నది శ్లేష. దట్టమైన మబ్బులు అని ఒక అర్థం, (నిర్ + అంతర) ఇఱుకు పయోధరాలని మరొక అర్థం.

********************************************
ఇక్కడ మరో సారి అనంతకృష్ణశర్మ గారిని గుర్తు తెచ్చుకుంటాను. యే ఉదాత్త రచన అయినా రచయిత యొక్క శాంతస్వభావం మూలం కావాలి. ధిషణాహంకారాలూ, పాండిత్యప్రగల్భా వాచ్యార్థాల ప్రాభవం పెంపు చేయవచ్చును, కానీ ఉదాత్తమైన భావం కవి అంతః కుహరాల్లోనుంచి రావాలి. అందుకు శాంతమే ఆలంబన. నిజమైన శృంగార వర్ణన - అది నిజంగా సున్నితత్వాన్ని నింపుకొన్నదైతే ఉద్రేకాన్నీ, ఆవేశాన్నీ కలిగించరాదు. అది చిత్త ఆహ్లాదకారకం కావాలి. అంతమాత్రమే కాదు, రంజింపజేయాలి. కవి తాలూకు దార్శనికత సహృదయుడైన పాఠకుడికి దారి చూపాలి.

మృచ్ఛకటికం కావ్యంలోని ఈ ఘట్టం నిజంగానే వర్షంలో తడుస్తున్న అనుభూతి కలిగిస్తుంది. అనుభవైకవేద్యం. సన్నివేశం, పాత్రలూ, వాటి ఉదాత్తతా నేపథ్యంగా ఔచిత్యశోభితంగా ప్రావృట్వర్ణన అనే వస్తువును వర్ణించిన అపూర్వమైన ఘట్టం. వ్యక్తిగతంగా నాకు నచ్చిన గొప్ప వర్ణన.