Thursday, December 27, 2007

పోకిరీ ... భవ హారీ ...

మేము మొన్నామధ్యనే ఇల్లు మారాము మా వూళ్ళో. కొత్త ఇల్లు సదుపాయంగానే వుంది. ఇంటి పక్కన ఓ భజన మందిరం కూడాను. అంటే, రాముల వారి ఓ చిన్న గుడి. అంతా బాగుంది అని సంబర పడుతుంటే, ఓ శని వారం వచ్చింది. ఆ శని వారం నిజంగా మాకు 'శని ' వారమే.

ఆ రోజు రాత్రి దాదాపు 7:30 కావస్తొంది. నక్కల వూళలు ఏమి లేవు. ఆ రోజు పౌర్ణమి. ఇంట్లో అంతా యేదో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాము చూస్తున్నాము టీవీ లో. వున్నట్టుండి, భజన మొదలయ్యింది., రాముల వారి గుడి లో.

కర్ణపుటాలు బద్దలయేలా మైకులో గొంతు.
" రామ నామము రామ నామము, రమ్యమైనది రామ నామము.."

పాట పూర్తవగానే ఇంకో పాట.
" గణేశ శరణం, శరణం గణేశ..."

పాట సాగే కొద్దీ, గొంతు లో పిచ్ కూడా అధికం అవసాగింది.

ఆ శబ్దాన్ని నిరోధించడానికి నేను మా ఆఫీసులో క్రైసిస్ మానేజిమెంట్ (ప్రాజెక్ట్ మానేజరు ద్వార అధికముగా వుపయోగించబడు ఓ శబ్దము) తెలివి వుపయోగించా..

ఫాను స్పీడు ఎక్కువ చేసా...మా ఇంట్లో ఫాను తిరిగితే శబ్దం వస్తుంది. గాలి రాదు.

ఈ లోగా, అభిఙ్ఞ వర్గాల ద్వారా, కనుక్కున్న భోగట్టా యేమంటే, భజన రాత్రి అంతా కొనసాగుతుంది !

భజన మందిరం లో కొత్త గొంతు. అలానే పాట కూడా రొటీన్ కి భిన్నంగా వుంది.

" కార్తీక మాసములో..., శివ దేవుని సన్నిధిలో...
కొలిచెదము, నిను తలిచెదము.... "

అరె..ఈ పాట ఎక్కడో విన్నానే అనుకుంటుంటే, గుర్తొచ్చింది. ఈ పాట నేను చిన్నప్పుడు ఆకాశ వాణి కడప కేంద్రం లో యెప్పుడు వస్తుండేది. SP బాలు, P. సుశీల ల పాట (లాంటిది)

"చిరునవ్వుల తొలకరిలో...సిరి మల్లెల వలపులలో...
కలిసెనులే, తొలి హ్రుదయాలే, చిరు వలపుల కలయికలో..."

అయితే కాసేపటి తర్వాత ఓ ఊహించని ట్విస్టు.

"ముక్కంటీ..ముక్కొపీ..ఓ దేవా..మమ్ము బ్రోవా.."
(పాట సరిగా గుర్తుకు లేదు, అయితే రాగం మాత్రం అలాంటిదే)

మీకు గుర్తుకు వచ్చుండాలి. ఇది యే పాటో..అవును మీరు కరెక్టే..
(scroll చేయనవసరం లేదు).

" ముక్కాల ముఖాబ్ లా లైలా.."

ఇలా భజన అంతకంతకూ తీవ్ర స్థాయి దాల్చసాగింది.

నా క్రైసిస్ మానెజిమెంటు టెక్నిక్, మా ఆఫీసు లో లాగానే పని చేయలేదు.

ఇలా కాదనుకుని, మా కంపనీ హెచ్ ఆర్ వారు నుడివిన సుభాషితా రత్నావళి తలుచుకున్నా..ప్రో యాక్టివ్ గా ఆలోచించాలి యెల్ల వేళలా అన్న ఓ సూక్తి గుర్తొచ్చింది.

ఆచరణలో పెట్టా... (నేను అర్థం చేసుకున్న విధానం ఒప్పో కాదో నాకు తెలీదు).

ఓ బ్లాక్ బస్టరు సినిమా పాట ను భక్తి గీతం గా మలిచా ఆ రాత్రంతా కూర్చుని. ఆ ఓరిజినల్ పాట, అదే రాగం లో నేను కష్టపడి రాసిన భజన కింద ఇస్తున్నాను.

ఓరిజినల్ పాట:

డోలె డోలె దిల్ జర జరా
నిను ఓర ఓర గాని నరవరా
జాగు మాని చేయ్ కలపరా
జత చేరి నేడు జతి జరుపరా

జర జల్ది జల్ది పెందలకడనే రారా
వడి ఆంత రంగ సంబరమునకే రారా

రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడ నిశి కేళి వేళ చిత్త చోరా

చలేగ చలేగ యెహ్ హైన్ ఇష్క్ క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కొ దీవాన
చలేగ చలేగ యెహ్ హైన్ ఇష్క్ క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కొ దీవాన

అనువుగా అందిస్తా సొగసుని సందిస్తా
పొదుగుతు కుదురుగ నీలోనా
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
దిల్బర్ దేఖో నా

మిసమిస కన్నే కొసరకు వన్నే వలపుతో వలపన్నీ
నఖశిఖలన్ని నలుగును పన్నే కలబడు సమయాన్నీ

ఒడికి త్వరగా యే..బరిలో కరగా యే..ఒడికి త్వరగా యే..బరిలో కరగా
(Shake it wanna shake it up babe!!)

============================================

నా పాట :

భోలె భోలె ఓ భవ హర
మా మొరలు గనర ఓ సురవరా
జాగు మాని మము బ్రోవరా
గతి నీవె మాకు విశ్వేశ్వరా

మా పూజలన్ని గైకొనగా లేరా
వడి ఆంగ రంగ వైభవముననే రారా

మా మల్లికార్జునుడవు నీవేనురా సారంగపాణి శ్రీ కాళేస్వరా, హే హిమవతనయ చిత్త చోరా

చలేగ చలేగ యెహ్ హై భజన్ క జమాన
మిలెగ మిలెగ యు హి ముక్తి సుహన
చలేగ చలేగ యెహ్ హై భజన్ క జమాన
మిలెగ మిలెగ యు హి ముక్తి సుహన

మనసును అర్పిస్తా స్వాసను బంధిస్తా
బుద్ధిని కుదురుగ నీపైన
ముడుపుతొ మెప్పిస్తా ఒడుపుతొ ఒప్పిస్తా
దిల్బర్ దేఖో నా

మిసమిస వన్నే బుసలను చిమ్మే నాగభరణాన్ని
నఖశిఖలన్ని మసివది పోయి నంది వాహనము తోడి

భువికి త్వరగా యే..
మా మనసు కరుగా యే..
భువికి త్వరగా యే..
మా మనసు కరుగా యే..

(Shake it wanna shake it up babe!!)

==================================

వచ్చే శని వారం భజన అంటూ జరిగితే నేను ఆ భజన లో పాల్గొనడమో ., లేదా, ఆ భజన వీరులలో ఎవరికైన ఈ భజన వినిపించడమో చేయాలి అనుకుంటూ, మరుసటి రోజు పొద్దున 4 గంటలకు నిద్ర పడుతుండగా అనుకున్నా...

(ఎవ్వరి మనసు నొప్పించడం వుద్దేశం కాదు, సరదాగ నవ్వుకోడానికి మాత్రమే. అయితే, ఇందులో కొన్ని మాత్రం నిజాలే. ఇలా పాట రాయడం తప్పేమో మరి, అయితే, ప్రతీకారం తీర్చుకోక పోతె, నా సీమ రక్తం వూరుకునేటట్టు లేదు. పైగా ఇలా రాత్రుళ్ళు దేవుని పేరు మీద జనాల నిద్ర చెడగొట్టడం కూడా విఙ్ఞత అనిపించుకోదు.)