Tuesday, October 26, 2010

జయజయ....

ఆదిత్య 369 గుర్తుందా? సకుటుంబ సమేతంగా చూడగలిగిన కొన్నేకొన్ని బాలకృష్ణ సినిమాలలో అది ముఖ్యమైనదని మా ఇంట్లో పెద్దలు నొక్కకుండనే వక్కాణించేవాళ్ళు. ఆ సినిమాలో ఒకానొక దృశ్యంలో కృష్ణదేవరాయలు విష్ణువు మీద ఓ పద్యం చదువుతాడు (పాడతాడు), తనదేవేరితో కలిసి దేవాలయంలో కులదైవాన్ని పూజిస్తున్న సందర్భంలో. ఆ పద్యం ఇక్కడ చూసి రండి. తర్వాత మాట్లాడుకుందాం.

ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడు నాకీ పద్యం తెగనచ్చేసింది. పాడుకోడానికి పాటలా ఉంది, స్తోత్రంలానూ ఉంది. అలాగని కఠినంగా లేక, చాలా లయాత్మకంగా ఉంది. ఇదేం పద్యమబ్బా అని చాలాసార్లు అనుకున్నాను. ఈ పద్యం రాయల వారు పాడారు కాబట్టి, ఆముక్తమాల్యద లోనిదని ఇన్నాళ్ళూ అనుకుంటూ వస్తున్నాను . ఆముక్త మాల్యద లో చాలా పద్యాలు వ్యాఖ్యానం ద్వారా విన్నప్పటికీ, చదివినప్పటికీ ఈ పద్యం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదా అనిపించేది. తెలుగుపద్యం - కామేశ్వరరావు గారిని ఈ పద్యం గురించి చాలాసార్లు అడగాలనుకుని మర్చిపోయాను.

- ఈ పద్యం అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలోనిది. నాకు ఈ మధ్యనే పాతపుస్తకాల దుకాణంలో వావిళ్ళ వారి మనుచరిత్రము, రాఘవపాండవీయము దొరికాయి. ఈ రోజు మనుచరిత్రం సౌరభాన్ని ఆస్వాదించాలని, (ఆఘ్రాణించాలని కూడా) మనసుపుట్టి ఓ పేజీ తెరవగానే చప్పున ఈ పద్యం కనిపించింది. 

ఆరవ ఆశ్వాసంలో, స్వారోచిషునికి హరి ప్రత్యక్షమయితే ఆయనను స్వారోచిషుడీ విధంగా పొగడుతాడు.

జయజయ దానవదారణకారణశార్ఞ్గరథాంగగధాసిధరా
జయజయ చంద్రదినేంద్రశతాయుతసాంద్రశరీరమహఃప్రసరా
జయజయ తామరసోదరసోదరచారుపదోజ్ఝితగాంగఝరా
జయజయ కేశవకేశినిషూదన శౌరి హరీ దురితాపహరా

అర్థం :
దానవ = అసురుల
దారణకారణ = భేదమునకు హేతువులైన
శార్ఞ్గ, రథాంగ, గదా, అసి, ధరా = విల్లు, చక్రము, గద, ఖడ్గము తాల్చినవాడా
జయజయ
చంద్ర దినేంద్ర శతాయుత, సాంద్ర శరీరమహః ప్రసరా = చందురుల, ఆదిత్యుల, పదిలక్షలయొక్క విస్తారమైన శరీరకాంతినిపోలిన శరీరకాంతి కల్గినవాడా
జయజయ
తామరసోదర = పద్మాంతర్భాగమైన కెంపుకు
సోదర = సమానమైన
చారు = మనోహరమైన
పద ఉజ్ఝిత = పాదములనుండి వదలబడిన
గాంగఝరా = గంగానదీప్రవాహము కలిగినవాడా
జయజయ
కేశవ = మంచికేశములు కలిగినవాడు/బ్రహ్మరుద్రులకు పుట్టుక అయినవాడు అని రెండర్థాలుట (శోభానాః కేశాః యస్య సః, కశ్చ, ఈశశ్చ కేశౌ, తావస్మిన్ స్తః ఇతి కేశవః)
కేశినిషూదన = కేశి అనే రాక్షసుని చంపిన
శౌరి = శూరవంశోద్భవుడా
హరీ = హరీ
దురితాపహరా = వృజినములణఁచి వేయువాడా
జయజయ.

ఈ పద్యంలో మరో చక్కటి విశేషముంది. ఇది "కవిరాజవిరాజితము" అన్న ఛందస్సు. ఈ ఛందస్సులో ప్రత్యేకత మొదట నగణం తో మొదలై, ఆ తర్వాత 6 జ గణాలు ( లఘువు, గురువు, లఘువు), చివర్లో వ గణం తాలూకు దీర్ఘం తో ముగుస్తుంది. ఇదో అద్భుత లయ. ఎంత చక్కనిదంటే - మా చిన్నారి మొన్నామధ్య - విశ్వనాథ్ సినిమా, సప్తపది లో ఇదే ఛందస్సులో ఓ పాటని చూస్తూ (వింటూ), పాట ముగిసిన తర్వాత ఆ పాట తాలూకు మకుటాన్ని వచ్చీరాకుండా పాడుకుంది. ఆ పాట/స్తోత్రం ఊహించారా?

అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే
సురవర వంద్య విరోధిని వాహిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హేసితి కంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

(ఇప్పుడు "తమ్మి" (సంహిత) కు పై శ్లోకం చివరిపాదం వచ్చేసింది. ) ఈ ఛందస్సు కాస్త అరుదైనది అనుకుంటున్నాను. ఈ ఛందస్సులో ఏ కవులు వ్రాశారో తెలియకుండా ఉంది. మనుచరిత్రలో మాత్రం రెండు సందర్భాలలో ఈ ఛందస్సు ఉపయోగించాడు కవి.

ఈ రోజు నిదురకు ముందు చక్కటి అనుభూతి. తెలుగు సాహిత్యంలో నాకు చాలా ఇష్టమైన కవి అల్లసాని పెద్దన. (అనేక విధాలుగా ;-)) ఆయన పద్యమే నేను చాలాకాలంగా వెతుకుతున్నదని తెలియటమూ, నాకు నచ్చిన ఛందస్సులో ఉందని తెలియటమూ (ఈ పద్యం ఈ ఛందస్సులోనిదని ఊహించలేదు. పుస్తకం చూసిన తర్వాతే తెలిసింది) ....చాలా బావుంది.

ఈ ఛందస్సు గురించి, ఇతరకవుల ప్రయోగాలను ఎవరైనా తెలిపితే చాలా బావుంటుంది.

Sunday, October 17, 2010

ఖేలా - ఈ మధ్యకాలంలో నేను చూసిన Best Movie

The weakest relation among all human relations is, Wife-Husband relation. - OSho

భార్యాభర్తల సంబంధం గురించి వేల యేళ్ళుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినా, కొత్తగా చెప్పడానికి ఏదో మూల ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది. భార్యాభర్తల సంబంధంలోని భిన్నత్వాన్ని, ఒకరికొకరిమధ్య అవగాహనారాహిత్యాన్ని హృద్యంగా ఆవిష్కరించిన చిత్రం రితుపర్ణఘోష్ దర్శకత్వం వహించిన ఖేలా.


రాజు భౌమిక్ ఓ సృజనాత్మక దర్శకుడు. అతడికి తన వృత్తే ప్రాణం, ఊపిరి, శ్వాస అన్నీనూ. తన సృజనాత్మకతకు భంగమని పిల్లలు కూడా వద్దనుకునే రకం. అతని భార్య షీలా ఓ సాధారణ గృహిణి. ఆమెకు తన సంసారం, భర్త అనురాగం, భర్త తనమీద అభిమానం చూపాలన్న ఆశ తప్ప మరొకవిషయం పట్టదు. వీరిద్దరి ఆరేళ్ళ కాపురం సాగిన తర్వాత, షీలా అతణ్ణి విడిచి వెళ్ళిపోతుంది.

రాజు భౌమిక్ తర్వాత తీయబోయే సినిమా రబీంద్రనాథ్ ఠాగోర్ వ్రాసిన ఒకానొక నవలిక కు సినిమా రూపమైన "నాలోక్". అందులో బాల బుద్ధుని పాత్రధారికి సరిపోయే పిల్లవాడికోసం తను వెతుకుతుంటాడు. ఓ పట్టాన అతడికి ఎవరూ నచ్చరు. ఓ రోజు నిర్మాత, తను ఆఫీసులో ఉండగా రోడ్డు మీద పానీపూరీ తింటున్న ఇద్దరు స్కూలు కుర్రాళ్ళను చూస్తాడు. అందులో ఒకబ్బాయిని నాలోక్ పాత్రకు నిశ్చయించి, వెంటనే ఆ అబ్బాయిల దగ్గరకు వెళతాడు. ఆ పిల్లవాడికి తనను సినిమా దర్శకుడిగా పరిచయం చేసుకుంటాడు. ఆ అబ్బాయితో బాటు వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ అమ్మానాన్నతో తన చిత్రంలో అబ్బాయిని రెణ్ణెళ్ళు నటింపజేయమని అభ్యర్థిస్తాడు. పిల్లవాడి చదువు పాడవుతుందని వారు ఒప్పుకోరు.

తర్వాతరోజు ఆఫీసులో ఉండగా రాజుకు ఆ అబ్బాయి, అభిరూప్ నుండి ఫోనొస్తుంది. తనను కిడ్నాప్ చేయమని ఆ అబ్బాయి రాజుకు సలహా ఇస్తాడు. రాజు ఆ సలహా ఆచరణలో పెడతాడు. ఈ కిడ్నాప్ నాటకం యూనిట్ లో మరెవరికీ తెలియదు. సినిమా షూటింగు మొదలవుతుంది. పిల్లవాడి బాధ్యత మొత్తం రాజుమీద పడుతుంది.

యూనిట్ లో అప్పుడే కాలేజీ చదువు ముగించిన ఓ అమ్మాయి డ్రెస్ డిజైనరుగా పనిచేస్తుంటుంది. ఆమెకు మొదటి సినిమా ఇది. ఆ అమ్మాయి అభిరూప్ ను చూసుకుంటూ, అల్లరి చేసినప్పుడు సముదాయిస్తూ ఉంటుంది. ఆమెకు, పిల్లవాడికి, రాజుకు అనుబంధం బలపడుతూంటుంది.

అభిరూప్ కు మొదటి రోజు షూటింగ్ లో గుండు కొట్టించగానే ఆ అబ్బాయి ఏడ్చి, మొండితనం చూపించి నానాహంగామా చేస్తాడు. ఇలా గుండు పాత్ర అయితే తను సినిమా ఒప్పుకుని ఉండేవాణ్ణి కాదంటాడు. అతణ్ణి ఎలానో చాక్లెట్లవీ ఇచ్చి బుజ్జగిస్తారు.

ఇక్కడ అభిరూప్ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు సినిమా షూటింగ్ ను ట్రేస్ చేయడానికి మొదలెడతారు. వారికి దొరక్కుండా లొకేషన్ లు మారుస్తూ షూటింగు నడుపుతుంటాడు రాజు.

కొన్ని రోజులకు నిర్మాతకు కిడ్నాప్ విషయం తెలుస్తుంది. ఆ పిల్లవాణ్ణి తల్లిదండ్రులకు అప్పగించి ఇక షూటింగ్ చాలిద్దామంటాడతను. రాజు ఎలాగోలా బతిమాలి, బామాలి మరో రెండు రోజులు షూటింగ్ కొనసాగేలా చూస్తాడు.

ఇలా ఆ అబ్బాయితో రెణ్ణెళ్ళ అనుబంధం రాజుభౌమిక్ వ్యక్తిగత జీవితంలో ఏ మార్పు తీసుకు వచ్చింది? భార్యపట్ల తన దృక్పథం ఎలా మారింది అన్నది కథ.

ఈ సినిమాలో చెప్పుకోవలసినది కాస్టింగ్. రాజుభౌమిక్ పాత్రలో ప్రసేన్ జిత్ అనే బెంగాలీ నటుడు, షీలగా మనిషా కొయిరాలా, డ్రెస్ డిజైనర్ గా రైమాసేన్, పిల్లవాడిగా ఆకాష్ నీల్ ముఖర్జీ అనే అబ్బాయి చాలా సహజంగా నటించారు. రైమాసేన్ నటన ఒక revelation. పిల్లవాని పాత్ర - తారే జమీన్ పర్ లో పిల్లవాడి నటనను గుర్తు తెప్పిస్తుంది.

తర్వాత చెప్పుకోవలసింది స్క్రీన్ ప్లే, ఎడిటింగు. ఒక్క అనవసర సన్నివేశం కూడా లేని సినిమా ఇది. రాజు, షీలల మధ్య వచ్చే సన్నివేశాలు - షూటింగ్ మధ్యమధ్యలో రాజు భార్య గురించి ఆలోచిస్తూండగా ఫ్లాష్బ్యాక్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనిళ్ళలో జరిగే మామూలు సన్నివేశాల్లా ఉంటాయి.

ఇక ఫోటోగ్రఫీ - చాలా హుందాగా ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్ ఇల్లయినా, డార్జీలింగ్ హిల్ స్టేషనయినా చాలా చక్కగా ఉంది. అనవసర అర్భాటాలు లేవు.

పాటలు మరీ అద్భుతంగా లేవు కానీ బావున్నాయి.

************************************************************

ఈ మధ్య కాలంలో ఇంతటి హృద్యమైన సినిమా నేను చూడలేదు. బహుశా ఈ దశాబ్దంలో నేను చూసిన అందమైన సినిమా ఇదేనేమో. ఈ సినిమాలో చిట్టచివరి సన్నివేశం - బహుశా రితుపర్ణఘోష్ తప్ప ఇంకెవరూ ఆ సన్నివేశాన్ని తీయలేరు!

మీగొట్టం (youtube) లంకె ఇది 

Eagle వారి DVD కూడా దొరుకుతోంది.

Friday, October 15, 2010

Adventures of రేవంతో సాన్


2001. భాగ్యనగరంలో ఉద్యోగం వెలగబెట్టే రోజులవి. కంపనీ వారు ఓ శిక్షణా సంస్థలో నాకూ, ఇంకా కొంతమందికి జపనీసు భాష తేరగా నేర్పించడానికి నిర్ణయించారు. పని చెయ్యడానికి మనకు బరువు కానీ, ఇలాంటివి నేర్చుకోమంటే అనిష్టం ఎక్కడుంటుంది? క్లాసులో చేరాను. చేరిన రోజే పరిచయమయాడు రేవంతో సాన్. తనో చిన్న సాఫ్టువేరు సంస్థలో గానుగెద్దు పనిచేసేవాడు.

రేవంత్ - అందగాడు,పొట్టివాడు, అయితేనేం గట్టివాడు. నేనేమో మాటలపొదుపరిని, అమ్మాయిలను చూస్తే బిగుసుకు పోయే వాణ్ణీ అయితే తను మాత్రం మంచి మాటకారి, అమ్మాయిలతో అయితే చెప్పనక్కరలేదు. బైకు బాగా నడిపేవాడు, కాళ్ళు అందక పోయినా. నా లైఫులో నాతో విభేదించేవాళ్ళూ, నా స్వభావానికి విరుద్ధంగా ఉండేవాళ్లే నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పటి వరకు. రేవంత్ కూడా అంతే, నాతో పరిచయమైన కొన్ని రోజుల్లోనే తను నాకు బాగా క్లోజయ్యాడు.

జపనీసు నేర్పడానికి ఇద్దరు అమ్మాయిలు వచ్చేవాళ్ళు మాకు. వాళ్ళ పేర్లు - కవోరి. సతోమి. వారిద్దరిలో కవోరి మెఱుపు తీగ. కవోరి జపాను అమ్మాయిల్లా కాక, కూసింత ఇండియనులా కనిపించేది.ఓ సంక్రాంతి రోజు లంగా ఓణీ కట్టుకుంటే చూసే భాగ్యమూ కలిగించింది తనో సారి.

సతోమి మట్టుకు జపాన్ బొమ్మ. చిట్టి కళ్ళు, చట్టి ముక్కు, వగైరా వగైరా...సతోమి పొద్దున తరగతులకు వస్తే, కవోరి సాయంత్రం వచ్చేది. నేను, రేవంత్ పొద్దున తరగతులకు వెళ్ళేవాళ్ళం. అక్కడ చేరిన అందరిలోకి జపనీసుమీద శ్రద్ధ నాకే ఎక్కువగా ఉండేది కాబట్టి సతోమి నాతో కాస్త బాగా మాట్లాడేది.

ఇలా ఉండగా, రేవంతో సాన్ తను సాయంత్రం తరగతులకు మార్పించుకున్నాడు. ఎందుకని నాకు అర్థం కాలేదు. కానీ, కొన్ని రోజులకు నేనూ సాయంత్రం తరగతులకు వెళ్ళసాగాను. ఓ రోజు క్లాసు ముగిసిన తర్వాత కవోరి, రేవంతో నవ్వుకుంటూ ఏదో మాట్లాడ్డం గమనించాను.తర్వాత ఆదివారం మా రూములో మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో రేవంతో సాన్ విషయం చెప్పేడు. తను కవోరిని పేమిత్తున్నాట్ట! ఇంకా గొప్ప విషయం ఏమంటే - ఆమే ఇతణ్ణి కొంచెం కొంచెం ఇష్టపడుతోంది (లేదా రేవంత్ అలా అనుకుంటున్నాడు)! ఇదేదో ఆషామాషీ వ్యవహారం అనుకున్నాను కానీ, అదో సిన్సియరు వ్యవహారమని (లేదా తను సిన్సియరుగా ఫీల్ అవుతున్నాడని) నాకు తొందరగానే తెలిసింది.

జపనీసు గాళ్ళు మహా పిసినిగొట్లు. ఆటోలో ఈ ఇద్దరు అమ్మయిలు ఎక్కడికైనా వెళితే ఇద్దరూ సగం సగం లెక్క తేల్చేసుకోవాల్సిందే. అంచేత రేవంతో సాన్ ఆ అమ్మాయిని బానే ఆకర్షించగలిగాడు, బైకులో షికార్లూ, హోటళ్ళలో బిరియాణీలు తినిపించడాలవీ చేసి.

లైఫు అలా ప్రశాంతంగా గడిచి ఉంటే ఈ టపా రాసే పరిస్థితి ఎందుకు వస్తుంది? విలన్ ఎంట్రీ ఇచ్చాడు. అదే శిక్షణా సంస్థలో ఏ జావాయో వెలగబెట్టటానికి జపాన్నుంచీ దిగాడు. అతనో బండరాముడు. మహా లావుగా, మోటుగా ఉండేవాడు. వాడి ఇంటిపేరు కూడా "యమమోటో". వాడికి ఉన్నది వాపే కాదు, బలుపు కూడా. అంటే - అతనొక ధనవంతులబ్బాయి. అతడి తండ్రి బిజినెస్ మాన్. ఓ పది పదిహేను ఎలక్ట్రానికి గాడ్జెట్లు ఉండేవి అతని దగ్గర.

విలన్ ఎంట్రీతో అక్కడ రెక్టాంగులర్ లవ్ స్టోరీ మొదలయ్యింది.
రేవంతో - కవోరిని పేమిత్తున్నాడు.
బండరాముడు - సతోమిని లైక్ చేస్తున్నాడు. సతోమి, కవోరి ఫ్రెండ్స్ కాబట్టి కవోరిని కూడా భరిస్తున్నాడు.
సతోమి - బండరాముణ్ణి (బండరాముడి గాడ్జెట్స్ ని కూడా) బాగా ఇష్టపడుతోంది.
కవోరి - గాడ్జెట్సా, బైకులో షికార్లా అన్న డైలమాలో ఉంది. బండరాముడు సతోమిని ఇష్టపడ్డంతో కాస్త జెలసీగా ఫీలవుతోంది.

మనవాడు రేవంతో - పార్ట్ టైము దేవదాసు, పార్ట్ టైము లవరూ పాత్రలు శక్తివంచన లేకుండా పోషిస్తున్నాడు. బండాస్ - మధ్యలో ఓ వారం జపాను వెళ్ళి మరిన్ని గాడ్జెట్సు తీసుకొచ్చి తన విలను రోల్లో జీవించేస్తున్నాడు. ఇంతలో.... ఎంచేతో ఏమో బండరాముడికి వాళ్ళ నాన్న దగ్గర్నుండీ కబురందిందో, లేక పరీక్షలొచ్చాయో తెలీదు కానీ ఊరికి వెళ్ళిపోడానికి సన్నద్ధమయాడు. వాణ్ణి విమానాశ్రయంలో డ్రాపు చేయడానికి ఇద్దరమ్మాయిలు వెళ్ళారు. అక్కడ విమానాశ్రయంలో - కవోరికి అంతకుముందే తనకు విమానంలో పరిచయమైన ఫ్రెండు ఒకడు తిరిగి కనిపించాడు. అతడు వాళ్ళ ఊరికి (చెన్నై) కి కవోరిని రమ్మని, తన ఇంటికి, కుటుంబసభ్యులతో (అమ్మ, నాన్న వగైరా) గడపడానికి గెష్టుగా రమ్మని రిక్వెస్టించాడు. ఆ అమ్మాయి ఓ వారాంతం చెన్నైకి వెళ్ళింది. అక్కడ ఆమెకు దురదృష్టవశాత్తూ ఆ అబ్బాయి కనిపించలేదు.

ఇలాంటి ట్విస్టులన్నీ అయిన తర్వాత రేవంతో లవ్ ట్రాకు గాడిని పడింది. కొన్ని రోజులకు తను నాతో అన్నాడు. " కవోరిని నేను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు." నాకు పక్కలో బాంబుపడినట్లయ్యింది. నేను వాళ్ళింటికి ఒకట్రెండు సార్లు వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నామీద ఓ మోస్తరుగా మంచికుర్రాడన్న అభిప్రాయంతో ఉన్నారు. అలాగని ఇప్పుడీ ఇంటర్నేషనల్ సమస్యను డీల్ చెయ్యలేను. తనకు నచ్చజెప్పాను - "ఇలా ఇంటర్నేషనల్ స్థాయిలో సమస్యలు సృష్టించుకోకు. కొన్ని రోజులు ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ దేశమెళ్ళిపోతుందని". అతనికి కూడా విషయం అర్థమయ్యింది, కానీ జీర్ణించుకోడానికి ఇబ్బందై సతమతమయ్యాడు.


కవోరి తన దేశానికి తిరిగి వెళ్ళే రోజు తొందర్లోనే వచ్చింది. మా కోర్సు ముగిసింది. (జపనీసు వెలగబెట్టిన అందర్లోకి నేను అధికుణ్ణి). రేవంతో సాన్ కూడా పాసయ్యేడు. తనకు ఆ అమ్మాయి మీద ఇష్టం జపాను మీద ఇష్టంగా మారసాగింది. జపానుకు ఎలాగైనా వెళ్ళాలని కలలుగనేవాడు. నాకు బెంగళూరులో ఇంకో ఉద్యోగం రావడంతో బెంగళూరుకు వచ్చేశాను. రేవంతో బెంగళూరుకు ఒకట్రెండు సార్లు వచ్చి నన్ను కలిసేడు. నాకు జపాను ఆన్సైటు ఛాన్సు వస్తే తననూ ఎలాగైనా లాగమని అడిగేవాడు.

కొన్ని నెలల తర్వాత రేవంతోకు ఓ పెద్ద బహుళజాతి సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత యేడాదికి పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదరడంతోబాటూ యోకోహామా కు ఆన్సైటు ఛాన్సూ వచ్చింది. చివరి సారి తన కబురు నాకు ఐదేళ్ళ క్రితం తెలిసింది. ఆ తర్వాత నా యాహూ ఐడీ పాతబడి, ఉపయోగించకుండా మూలబడ్డంతో, ఆ తర్వాత తన వివరాలేవీ నాకు తెలియకుండా పోయినయ్. నాకు మట్టుకు ఇంతవరకు జపాను వెళ్ళే యోగం కలుగలేదు!

Wednesday, October 13, 2010

కథకళి ప్రదర్శన చూసిన రోజు...


"ఒక్క టికెట్టు రెండొందలా?" కథకళి ఆర్టిస్టులా కళ్ళు పెద్దవి చేసి అడిగింది మా శ్రీమతి. నాల్రోజులు సెలవు దొరకడంతో, కేరళకెళ్ళాము నేనూ తనూ, పాపాయీ కలిసి. ఓ సాయంత్రం పూట రిసార్టులో పనేమీ లేకపోవడంతో దగ్గరలో జరిగే కథకళి ప్రదర్శన చూడ్డానికి వచ్చేము. బయట వర్షం కురుస్తోంది.

"పర్లేదులే, చూద్దాం" అన్నాను నేను. నాకూ రెండొందలు ఎక్కువనే అనిపించింది. కానీ ఆమెను వదిలితే బయట వర్షంలో క్రెడిట్ కార్డు తూట్లు పడేలా షాపింగు చేస్తుంది, పైగా ఆమె చేసే షాపింగుకు వర్షంలో ఆమెవెంట అంగరక్షకుడిలా నేను నిలబడి ఛావాలి. అంతకంటే ఈ "కలాపోసన" మేలని నా ఎడమవైపు మెదడు ఘోషించింది.

"సీటు నంబరు 27,28" అన్నాడు టికెట్లిచ్చే యువకుడు. చక్కని ముఖ వర్ఛస్సు ఆ యువకుడిది.

పదడుగుల దూరంలో ఓ స్టేజి, ఓ యాభై ప్లాస్టిక్ కుర్చీలు, పల్చగా జనం. కుర్చీలలో కూర్చున్నాము.

రెండేళ్ళ మా పాప ఇక ప్రశ్నల కార్యక్రమం మొదలెట్టింది.

"రాచ్చతుడు ఏం చేత్తాడు?" (కథకళి ఆర్టిస్టు ముఖం చూసి రాక్షసుడని డిసైడు చేసిందది)
"రాచ్చతుడు కాదమ్మా, దామ"
"దామ ఇప్పుడేం చేత్తాడు?"
"కొంచేం సేపయిన తర్వాత డాన్సు చేస్తాడు"
"ఏ డాన్చు?"
"కథకళి"
"అదేమి"
"దీపం?"
"దీపం ఎందుకు?"
"?"
"నేను దీపం మొక్కుంటా"
"అది మొక్కుకునే దీపం కాదమ్మా"
...
...
...

స్టేజి మీద ఓ దీపం (కలివిళక్కు) వెలిగించారు. ఇద్దరు స్ఫురద్రూపులైన యువకులు కథకళి నృత్యానికి తగినట్టు మేకప్ (చుట్టి - చుట్టి అంటే పురుషపాత్రధారి గడ్డంలా ఉన్న తెల్లటి చక్రం. సామాన్యార్థంలో మేకప్) చేసుకుంటున్నారు. నాట్యంలో ఓ స్త్రీపాత్ర, ఓ పురుషపాత్ర ఉన్నట్టు తెలుస్తూంది.

ముఖానికి మేకప్పు పూర్తవగానే పురుషపాత్రధారి నడుముచుట్టూ ఓ తాడుబిగించి కట్టుకుని, నిలబడ్డాడు.

అతడి నడుముకు బిగించిన తాడు అట్టముక్కలను గుచ్చుతూ, గంపలాగ తాయారు చేశారు. దానిపైకి దుస్తులు తొడిగారు. కాళ్ళకు గజ్జలు, కిరీటం, ఇలా పైపైన ఆహార్యం పూర్తయ్యింది. తెరపైనే ఓ మూలగా ఉన్న గదిలోకెళ్ళి పూర్తిగా తయారయ్యారు.

కాసేపటికి లైట్లవీ ఆర్పి, దీపం వెలుగులో కళాకారులు స్టేజి మీదకు వచ్చారు. తెరపై కళాకారులిద్దరూ వెలిగిపోతున్నారు. వారిని చూసేసరికి, అంతవరకూ ప్రశ్నలతో, స్టేట్ మెంట్లతో ఊపిరి సలుపకుండా చేసిన పాపాయి కూడా నోరు తెరుచుకుని చూడసాగింది. ఇందాక టికెట్లు పంచిన కుర్రాడు మైకు పట్టుకుని, కథకళి గురించి ఆంగ్లంలో క్లుప్తంగా చెప్పేడు.

కథకళి ఆట 17వ శతాబ్దంనుంచి ఉన్నదట. సాహిత్యం, సంగీతం, చిత్రం, నాట్యం, నర్తనం అనే ఐదు అంగాల కలయిక కథకళి. ఈ ఆటను సాధారణంగా దేవాలయాలలో ఆడతారు. సాధారణంగా మహాభారతం, రామాయణం, పురాణాలు మొదలైన గ్రంథాల తాలూకు కథలు లేదా ఆయా గ్రంథాల పాత్రలతో అల్లిన కథలతో కథకళి ఆడటం జరుగుతుంది. కథకళి ఆటలో నర్తించే కళాకారులు పెదవి కదుపరు. కేవలం సైగలతో, హావభావాలతో 24 ముద్రలతో, శరీర కదలికలతో భావాలను ప్రతిఫలింపజేస్తారు. కథకళి తాలూకు పాటలు మణిప్రవాళం (సంస్కృతము, మలయాళమూ కలిసినది) లో ఉంటాయి. ముఖ్యమైన వాయిద్యాలు చండై (తబలా), మద్దాలం,(మద్దెల) ఇలతాళం (భజంత్రీలు), చెంగిల, ఎడక్క (ఘటం కాబోలు) మేము చూసిన ప్రదర్శనలో చండై, ఇలతాళం మాత్రమే ఉపయోగించారు.

మైకులో ఆ యువకుడు కథకళి లో నవరసాల గురించి ఒక్కొక్కటి చెబుతుంటే, యవనికపైన స్త్రీ పాత్రధారి అభినయించి చూపసాగాడు. ఆ తర్వాత 24 ముద్రలు పరిచయం చేశాడు.

తర్వాత ఓ పదిహేను నిముషాలు స్త్రీపాత్రధారి చిన్నబిడ్డను ఎత్తుకున్న తల్లి హావభావాలను అభినయించేడు.

చిన్నబిడ్డను ఎత్తుకున్న తల్లి ముఖంలో మురిపెం,
బిడ్డ అమ్మను గుర్తించి నవ్వితే తల్లి ముఖంలో కనబడే సంతోషం,
బిడ్డ స్పర్శకు తల్లి పులకరింత,
బిడ్డకు స్తన్యం ఇచ్చేప్పుడు తల్లి వదనంలో ప్రశాంతత,
బిడ్డ నిద్రలో నవ్వితే అమ్మ ముఖంలో కనబడే సంబరం, సంభ్రమం,
..
చివరికి బిడ్డ తన అంకంపై ఉచ్చపోస్తే, ఆ ఉచ్చను అలవోకగా విదిలిస్తూ అమ్మ బిడ్డపై చూపే చిరుకోపం
..
అత్యద్భుతంగా, అనన్యసాధ్యంగా అభినయించేడు.

ఆ తర్వాత ఆహ్వానం మూడు విధాలుగా అంటే విన్నపం, ఆజ్ఞ, శాసనం రూపాల్లో అభినయించి ప్రేక్షకులకు ఆహ్వానం పలికాడు. ఆ తర్వాత కథకళి నాట్యప్రదర్శన మొదలైంది. ఆ రోజు నేపథ్య కథ ఇది.

************************************************************

నరకాసురుని దాసి అయిన నక్రతుండి, స్వర్గంలో అప్సరసలను అపహరించుకుని రమ్మని నరకుడు ఆజ్ఞాపిస్తే ఆ కార్యనిమిత్తం స్వర్గానికి వెళుతుంది. అక్కడ ఆమె ఇంద్రసుతుడు జయంతుని చూసి, మోహించి, ఓ అందమైన అమ్మాయిలా మారి, తన పేరు లలిత అని చెప్పుకుంటూ నృత్యగానాదులతో అతణ్ణి సమీపిస్తుంది. 

తను సురకన్యనని, తనను వరించమని జయంతుణ్ణి వేడుకుంటుంది. జయంతుడు, తన గురించి చెప్పుకుని, తన తండ్రి ఆజ్ఞలేనిదే ఏ యువతిని చేపట్టనంటాడు. లలిత వేషంలోని నక్రతుండి విడవక, జయంతుణ్ణి కౌగిలించుకోజూస్తుంది. కృద్ధుడైన జయంతుడు ఆమెను అక్కడనుండి వెళ్ళిపోమని శాసిస్తాడు. నక్రతుండి నిజరూపం ధరించి జయంతుని సమీపిస్తుంది. జయంతుడు నక్రతుండి ముక్కు చెవులు కోసివేస్తే, బాధతో పెనుకేకలు పెడుతూ అక్కడనుండి నక్రతుండి నరకాసురుని దగ్గరకు తిరిగి పరిగెడుతుంది. జయంతుడు తన తండ్రి వద్దకు జరిగిన విహయాలు చెప్పడానికై నిష్క్రమిస్తాడు.

************************************************************

ఓ గంటన్నరసేపు జరిగిన నాట్యం - కేవలం ఇద్దరు పాత్రలతో, ఓ పాటగాడు, ఒకేఒక్క తబలా వాయిద్యంతో
రక్తికట్టించడంలో వారు కృతకృత్యులయ్యేరు. చివర్లో నక్రతుండి ముక్కు చెవులు కోసేప్పుడు స్త్రీపాత్రధారి
హావభావాలు, ఆర్తనాదాలు (భీభత్స రసం) గగుర్పొడిచేలా ఉన్నాయి. మాకు భాష అర్థంకాకపోయినా, అభినయంలోని భావం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇటువైపు మా పాపాయి బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని
చూస్తోంది. మొదట్లో శృంగారం ఎంత చక్కగా అభినయించాడో, చివర్లో భీభత్సం కూడా అంతే చక్కగా అభినయించేడు. పురుషపాత్రధారి వీరత్వం, రౌద్రం కూడా తీసిపోలేదు. నాటకం ముగియగానే అక్కడ ఉన్న ప్రేక్షకుల (కేవలం 26 మంది మాత్రమే) కరతాళధ్వనులతో మారుమోగింది, ప్రదర్శనశాల.

చివర్లో ఆ కళాకారులతో ఫోటోలు దిగడం చక్కటి ముక్తాయింపు. స్త్రీపాత్రధారి పేరు మహేష్ అట. కళాకారులిద్దరినీ మనఃస్ఫూర్తిగా అభినందించేను, అభినందనలు స్వీకరించినట్టు వారి ముఖంలో భావాలు స్పష్టంగా తెలిపాయి.

************************************************************

"ఈ షోకు రెండొందలు తక్కువే" - మా శ్రీమతి వస్తూవస్తూ చెప్పిన మాట.

************************************************************

కథకళి గురించి ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ.

************************************************************

Monday, October 4, 2010

పద్యరచన for dummies

ఈ టపా వ్రాయడానికి నాకున్న అర్హత - అనేకమంది ప్రోత్సాహం, ప్రోద్బలం వల్ల నేర్చుకున్న కాసిన్ని ముక్కలు, నా దిక్కుమాలిన ప్రయోగాలున్నూ. నేను ఏ విధమైన కవిని, పండితుణ్ణీ కానని నాకు తెలుసు. మీకు ఇదివరకే పద్యాలు వ్రాసిన అనుభవం ఉంటే ఈ టపాలో సొల్లును పట్టించుకోకండి. ఇక విషయంలోకి.

దాదాపు ఒకటిన్నర యేళ్ళ క్రితం. ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకులు చింతా రామకృష్ణారావు గారోమాట అన్నారు. "వచనం వ్రాయడం కన్నా, పద్యం వ్రాయడం సుళువు. బస్సు నడపడం కన్నా రైలు నడపడం సులువు. నియమాలను పాటిస్తూ వెళితే మిగిలిన సంగతి పద్యమే చూసుకుంటుంది అని. అప్పుడాయన మాట నమ్మశక్యం కాలేదు. అయితే ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది.

పద్యరచనలో మెళకువలు, నియమాలు నేర్పడానికి జాలంలో శంకరయ్య గారు, రామకృష్ణారావు గారు, ఆచార్య ఫణీంద్ర గారు, కామేశ్వర రావు గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు వంటి వారు ఇదివరకే ఉన్నారు. కొన్ని చక్కటి వ్యాసాలు అందం బ్లాగులో రాకేశ్వరరావుగారు వ్రాశారు. ఉపజాతి పద్యాల గురించి పొద్దులో రాఘవగారు చక్కగా వివరించారు. వీటికి తోడు నా అనుభవాలు ఎవరికైనా ఉపయోగపడవచ్చునని ఈ టపా వ్రాస్తున్నాను. ఇందులో కాస్త స్వోత్కర్ష ధ్వనించవచ్చు. అలాగే ఈ చెప్పబోయే విషయాలు సూచనల్లా ధ్వనించినా, నిజానికి అవి నేను అనుకరించిన పద్ధతులు.

మొదట కావలసిన దినుసులు 3.

౧. వ్రాయాలన్న తపన
౨. నియమాలు తెలుసుకోవడం
౩. మంచి గురువు/సలహాలు చెప్పగల వారిని ఎన్నుకోవడం.

రెండవ విషయం - జాలంలో దొరుకుతుంది. అయితే విషయం మీకర్థం అవడం కోసం ఓ పుస్తకంలో మీకు అర్థమయే విధంగా వ్రాసుకోండి. ఈ నియమాలను చూసి భయపడవద్దు, చికాకు పడవద్దు. తప్పులు చేయడానికి జంకవద్దు. ఇంకా వీలయితే మొదట ఓ మాట అనుకుని, దానిని ఛందోబద్ధం చేయడానికి ప్రయత్నించండి.

ఉదా: కాకిపిల్ల కాకికి ముద్దు.

ఇది ఆటవెలదికి దగ్గరగా ఉంది. ఓ గణం (మూడవ గణం), చివరి గణంలో ఓ అక్షరం మాత్రమే లోపం. ఆ మార్పు కాస్తా చేసేద్దాం.

కాకిపిల్ల తల్లికాకికి ముద్దొకొ!

అంతే - ఓ పాదం తయారు!

అత్త లేని కోడలుత్తమురాలు! ఈ వాక్యాన్ని ఒకే ఒక్క చిన్న మార్పుతో ఆటవెలది పాదంగా మార్చవచ్చు. మీకు తెలుసా?

మీకు వ్రాయాలన్న ’తపన’ ఉంటే అదే మీచేత వ్రాయిస్తుంది. నిజం. కానీ మనకు ఈ నియమాలు అవీ చూస్తే చికాకు. ఈ చికాకు, పరాకు పోవాలంటే మీకు ఇష్టమైన విషయంలో మంచి పద్యాలు, వీలయితే చిన్నచిన్న పద్యాలు, తేటగీతి, ఆటవెలది, కందం వీటిలో వ్రాసినవి చదవండి. ఉదాహరణకు - ఓ చక్కని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందం ఎలా ఉందంటే -

నువ్వుపువ్వు నవ్వు జవ్వని నాసిక
చివురుసవురు జవురు నువిదమోవి
మబ్బునుబ్బుగెబ్బు బిబ్బోకవతివేణి
జగమెఱుంగు దాని జగమెఱుంగు.

ఈ పద్యంలో చిన్నచిన్న పదాలలో అమ్మాయి ముక్కును, పెదవిని, జడను వర్ణించడం చూస్తే ఓ మారు ఆహా అనిపిస్తుంది. (ఈ పద్యం నేను పదవ తరగతిలో ఓ లైబ్రరీలో చదివి భట్టీయం వేశాను. ఈ మధ్యనే ఇది చేమకూరవెంకటకవి విజయవిలాసం లోనిదని తెలిసింది)

అలాగే మీకు పదాలతో కవులు ఎలా ఆడుకుంటారు! ఈ విషయం మురిపెంగా అనిపిస్తే ఈ క్రింది పద్యం స్ఫూర్తినివ్వచ్చు.

ఎందుండి ఎందు బోవుచు
ఇందలి కేతెంచినార లిప్పుడు? విద్వ
ద్వందిత! నేడు కదామ
న్మందిరము ధన్యంబయ్యె మాన్యుడ నైతిన్!

ఈ పద్యం మనుచరిత్రలోనిది. ఇలాంటివి అనేకం దొరుకుతాయి. చదువుతూ ఉండండి. ఇంకా సులువుగా , సమస్యాపూరణలు శంకరయ్యగారి బ్లాగులో ప్రతిదినం ఉంటున్నాయి. వాటిని చదవండి.

ఒక్కోసారి, మన కోపాన్ని కూడా ’తపన’ కింద మార్చుకోవచ్చు. ఉదా: నాకు ’ఫలానా’ కామేశ్వర రావు గారంటే కోపం. ఆయనలా పద్యాలు రాయలేకపోతున్నానని ఉక్రోషం. ఆయన బ్లాగు హిట్లను చూసి కుళ్ళు, వగైరా. ఇప్పుడు ఆ ’స్ఫూర్తి’ తో ఎలాగో కష్టపడి

’మర్రిచెట్టు కలదు మహిలోన ఒకచోట
మర్రిచెట్టుకొక్క తొర్ర కలదు’ - అని గరికపాటి వారు వెక్కిరించిన రీతిలో ఓ పద్యం వ్రాసాను. పైగా ఈ పద్యం తప్పొప్పులు చూడమని ఆయన్నే అడుగుతాను! నా ప్రతీకారం, ఆకాంక్ష రెండూ తీరతాయి! పైగా ఆయన్ను ఇలాంటి పద్యాలతో కాల్చుకు తినదం అన్న పురుషార్థమూ దక్కె.చూశారా, ద్వేష బ్లాగు రాయడం కంటే ద్వేషపద్యం వల్ల ఎన్ని అడ్వాంటేజులో!

నేర్చుకోవాలన్న ’తపన’- చాలా పనులు చేయిస్తుంది. ఈ విషయం స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. అంచేత పైన విషయాలు వ్రాశాను.

ఇక గురువు. ఈ విషయంలో చాదస్తం అనుకున్నా పర్లేదు చెప్పాలి. ఒక్కోసారి మంచి గురువు, మీ చేత అద్భుతాలు చేయిస్తాడు, నిజానికి తనేమీ చేయకుండానే. అయితే దీనికి ప్రేమతో కూడిన ఓ బలమైన అభిమానం, నమ్మకం ముఖ్యం. ఈ విషయాలు quantitative కాదు కాబట్టి నిరూపించడం సాధ్యం కాదు. కానీ నా జీవితంలో చాలా సార్లు నాకు ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ విషయం మిమ్మల్ని మీరు అడిగి తెలుసుకోవలసిందే. 

దినుసులు సమకూరాయి.

ఇక మొదలెట్టటం ఎలా? ఇదో భయంకరమైన భూతం. కానీ భూతాన్ని ఎదుర్కోవాలంటే రాకుమారుడు లేదా షాడో లాంటి వీరుడు మొదట దాని వీక్నెస్ ఎక్కడుందో చూస్తాడు. అంటే సమస్యను కుదింపజేయడానికి చూస్తాడు. మనమూ అదే చేస్తే పోలా? ఎలానో క్రమంగా చూద్దాం.

౧. మొదట ఆటవెలది/తేటగీతి పద్యాలు సులువు. వాటితో మొదలెట్టటం మంచిది.
౨. ఏ పద్యం మనకు సులువు? ఇది వ్యక్తులను బట్టి ఉంటుంది. ఒకరికి వర్ణన ఇష్టమైతే ఒకరికి సమస్యాపూరణ ఇష్టం.

సమస్యాపూరణ అనుకోండి. సమస్యాపూరణ చివరిపాదం అయితే అంతకు ముందు ఓ పాదం మాత్రమే వ్రాయండి. ఆ తర్వాత వీలున్నప్పుడు మిగిలిన పాదాలు వ్రాయండి. కుదరకపోతే మీ ప్రయత్నాలు వివరించి గురువులను శరణు వేడండి. వారే మార్గం చూపిస్తారు.

వర్ణన అయితే ఏ పాదానికి ఆ పాదం విడిగా వ్రాసేసుకోడానికి పూనుకోండి. ఉదాహరణకు - పద్యం గురించే రాయాలనుకోండి. ఇలా మొదలెట్టవచ్చు. ఆటవెలది ఎంచుకుందామా?

ఆ.వె:

పద్యము మనసుకును హృద్యముగాఁ దోచు
పద్యము సుమలలిత పద శుభదము
...
...

మిగిలిన రెండు పాదాలు అవే మాటలలో పూరించి ప్రయత్నించి చూడవచ్చు.

అబ్బే! పై పద్యం "నాకొక బుల్లి చెల్లి" ని గ్రాంథికంగా చెప్పినట్టు ఉంది అని మీరనుకోవచ్చు. కానీ "కాకిపిల్ల కాకికి ముద్దు". ఇలా జనులమీద experiment చేస్తేనే మనకు వస్తుంది.

ఇంకాస్త సులువు పద్ధతుంది, అయితే కాస్త తెలివి, ట్రిక్సు కావాలి. ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది. మీ ఎదుట ఇతరులు ’అసలు’విషయం తెలుసుకోలేక మీ పద్యాలను ’ఆహా, ఓహో’ అంటూంటే, భలేగా ఉంటుంది. (నేనిలా బోల్డన్ని రాశాను. :-))

ఉదాహరణకు చాటువుల్లో తిరుపతి కొండమీద ఒకాయన సీసం వ్రాశారు. ప్రతి పాదాంతంలో "కొండ" అని వస్తుంది. నేను అలాగే ప్రతి పాదం చివర్లో "నగరి" అని వాడుకుని పద్యం ప్రయత్నించి సఫలమయ్యాను.

ఇలా తేటగీతులు, ఆటవెలదులు, బ్లాగు జనులమీద ప్రయోగిస్తూ వెళ్ళండి. మధ్యమధ్యలో మన గురువులను సాధ్యమైనంత విసిగిస్తూ ఉందండి. ఇంకా మీ బ్లాగు ఉంది కదా, అక్కడ ఫోటొ, కింద ఓ పద్యం, బాలకృష్ణ, విజయకాంత్ లాంటివారి మీద పద్యాలు, వీలైతే సమస్యా పూరణలు, మీ పాపాయి/బాబు బోసినవ్వు మీద ఓ మాట, ఇంకొన్ని సలహాలు క్రింద.

* ఇతరుల పద్యాలు తీసుకుని, వాటిలో పదాలు మాత్రం మార్చి మీరో పద్యం వ్రాయండి.
* యతి కిట్టించదం కోసం బ్రౌణ్యగ్రంథం వెతకండి. ఉదా: ఇది వరకు పద్యం మీద పద్యం ఉంది కదా. మీకో ఆలోచనొచ్చింది."పద్యము వలన మది ........" తర్వాత రావట్లేదు. ఇప్పుడు -
యతి స్థానంలో "ప", "పం", "పా", "పై", "పౌ", "వ", "వా","వౌ","వై" - వీటితో మొదలయే పదాలు వెతకండి. ఏదో ఓ పదం దొరక్కపోదు!
* వేటూరి పాట, మీకిష్టమైన దాన్ని తేటగీతి/ఆటవెలదిగా మార్చండి. (ఇది నేను చేశానోసారి. మరో ప్రముఖులు కూడా చేశారు.:-))
* మీ దైనందిన జీవితంలో మాటలని పద్యాలుగా మార్చండి. (ఇది చాలా ప్రావీణ్యతనిస్తుంది. నిజం)
* మీరో పద్యపాదం వ్రాశారు. అది చూసి, మీకే "ఏంట్రా ఇది" అనిపించిందనుకోండి. ఫీల్ అవద్దు. కాస్త ఆలోచించి, కుదిరిన చోట్ల అరసున్న పెట్టండి. పద్యానికి హుందాతనం వస్తుంది. నిజమ్.
* చివరిగా - కొంచెం వ్యక్తిత్వ వికాసం టచ్ లో - మీ రచనలను మీరు గర్వంగా ఫీల్ కండి. ఇతరులూ వాటి గురించి అలానే అనుకుంటారు.