Friday, May 11, 2012

సత్తెయ్య - శాకయ్య


ఒకింత దుర్భాగ్యవశమున ఈ మధ్య నొక జ్ఞాని రచనను చదువుట తటస్థించినది. పుస్తకమున 240 పేజీలు మాత్రముండినవి. యది నా అదృష్టము. ఈ రచనకు సమీక్ష వ్యర్థమయిననూ, నా సమయము హరించిన ఈ పుస్తకమును గూర్చి యొక పరి వ్రాసి పెట్టుకొనుట మంచిదని వ్రాసికొనుచున్నాను. ఆ పుస్తకము పేరు ’దిండు కింద పోకచెక్క’. ఇది యొక నవల.

ఆ శీర్షిక యందు సత్తెయ్య అనగా రచయిత. రచయిత యనగానొక పేరుండవలెను. లోకమున నొక్కొక్కనికి నొక్కొక్క పేరుండును. కొందరి పేర్లకు వెనుక విశేషణములుండును. మరికొందరు తమనామములకు ముందున కొన్ని బిరుదములను తగిలించుకొందురు. ఈ నవలా రచయితకును విశ్వనాథ సత్యనారాయణ యను పేరు కలదు. ఈ నవలయందు రచయితయూ నొక పాత్రధారి. నవల యందు నడచినకథకు ఐదువేల సంవత్సరముల తరువాత అనగా నేటికాలమందు ఈయన ప్రభవించునని చెప్పుకొనును. నవలయందు ఈయన విశేషణము జ్ఞానాగ్ధిదగ్ధకర్ముడు, బ్రహ్మపదార్థజ్ఞాత. జ్ఞానియగు నొకవ్యక్తి తనను తాను యివ్విధముగా పొగడుకొనుట అహంకారమని, అనౌచిత్యమని కొందరు భ్రమింపవచ్చును. అది యజ్ఞానము గావచ్చును. అహంకారమే బ్రహ్మజ్ఞానమేమో? లేక బ్రహ్మపదార్థమును రచనలో జొప్పించినవాడు బ్రహ్మజ్ఞానియని యెఱుగవలెనేమో!

నవల యనగా నొక ప్రతినాయకుడుండవలెను. ఈ నవలారాజమున ప్రధానపాత్ర, మరియు ప్రతినాయకుని పేరు శాకయ్య. శాకయ్య అనునది రచయిత సృజించిన నామము కాగా అతని నామము శాక్యుడు. ఈతడు శాక్యముని బుద్ధుడు కాడట. అంతకు మునుపు ద్వాపరాంతమున నాంధ్రదేశమున జన్మించిన నొక కుత్సితుడట. ఈ శాక్యుడు, లేదా శాకయ్యకు శాక్యసింహమని పేరుండెను.

నవలయనగా కథయునూ యించుక నుండవలెను. కొందరు కథ కోసము నవల వ్రాయుదురు, కొందరు తమ తత్త్వములనెఱింగించుటకు కథ తెలుపుదురు. ఇది రెండవకోవకు చెందినదనవచ్చును.

కథాకాలము ఐదువేలవత్సరములకు పూర్వము. మహాభారతయుద్ధమునకు స్వల్పకాలము ముందు. శాకయ్య ఆంధ్రుడు. ఆతడికి పదునైదు వత్సరములకు బెండ్లి అయినది. ఆరుగురు సంతానము. అతడు పిత్రార్జితముతో నెట్లో తన జీవనమును గడుపుచుండును. ఇట్లు అతనికి ముప్పది యేండ్లు గడచిన తర్వాత, యాతడు ఇండ్లు వదిలి దేశద్రిమ్మరి యగును. కొన్ని క్షుద్రమంత్రములను నేర్చి, వశీకరణాది అల్పవిద్యలను అలవర్చుకొనును. అతనికి యున్న మరొక గుణము విపరీతకాముకత్వము. తన శరీరమును అందుకు బాగుగ సహకరించును. యతడు ఆయా దేశముల దిరుగుచూ, అచ్చట తను మోజుపడిన స్త్రీలను లొంగదీసుకొనును. లొంగనివారిని బలవంతముగా అనుభవించును. లొంగినవారితో కొంతకాలము కాపురముండి వారిని గర్భవతుల జేసి తప్పికొనును. ఇట్లు అతని మోసమునకు గురైన వారు రత్నావళి, నాలాయిక మున్నగువారు.

ఆ కాలమందు పురాణములలో జెప్పినవిధమున కలియుగమున బుద్ధుడవతరించునని నమ్మికయుండెను. శాకయ్య ప్రజలలో గల ఆ నమ్మకమును తనకనుగుణముగా మార్చుకొననెంచెను. అందుకై యాతడు అహింసాధర్మమును, కొత్తమతమునూ బోధింపుచూ సన్యాసి వేషమెత్తి ప్రజలకు చేరువగును. ఇట్లు అతడు పేరుప్రతిష్టలూ బడయును. అతడు వేలాది సంవత్సరములు బ్రదుకుటకు నుపకరించు నొక రొట్టెవంటి పదార్థము, తిప్సిల అను యొక సర్పమునకు చెందిన ఆహారమునకై వెదకుచుండును. ఆ ప్రయత్నమున నాతనికి గీలా (నిరాలంబ) యను నొక యువతి పరిచయమగును. ఆమెను  కూడా యతడు అనుభవించి వదలును. ఇట్లు యతడు దేశదేశములు దాటి నేపాళదేశమునకు బోవును. ఒక మదపుటేనుగును లొంగదీసి, యచ్చటి రాజు జితేదాస్తి ప్రాపకమును, నలుగురు శిష్యులను సంపాదించుకొనును. ఈతడి వలన మోసగింపబడిన స్త్రీలకు సంతానము కలిగి పెద్దవారగుదురు. వారిలో నొకడు గోస్వామి. ఆతడు పండితుడై, మిగిలిన తన యన్నదమ్ములను, తల్లులను కూడగట్టి ప్రతీకారము నెరపుట, యజ్ఞము జరిపి శాకయ్య భార్యలపాపములను గ్రహించి పిశాచమగుటతో నవల ముగింపునకు వచ్చును.

************************************************************************************************

ఈ నవల యట్టమీద ’కల్పనాత్మకమైన చారిత్రక నవల’ యని వ్రాసి ఉన్నది. కల్పనయే - ఆత్మ గావున యిందున విషయమంతయూ కల్పన. అచ్చటచ్చటా వార్ష్ణేయుల ప్రస్తావన, మగధాధిపతి జరాసంధుడనియు, ఆతని పుత్త్రుడు సహదేవుడనియూ, ఆ కాలమునందు కృష్ణవ్యతిరేకులున్నట్లు కొన్ని కల్పనలు తక్క, ఇందున చారిత్రకమైన వాతావరణమూ, పేళ్ళూ, యప్పటి సంస్కృతీ సాంప్రదాయ లక్షణములు, సమాజమూ, మతవ్యవస్థా, దేశమునందు వివిధ రాజ్యముల వ్యవహారములూ వీటి చిత్రణము మిక్కిలి అసమర్థముగ నున్నవి. కల్పన యనగా వాస్తవాభాసము. చరిత్ర నేతిబీరకాయ. వెరసి సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి. ఇందున విషయమేమి? ఒకడు దేశదేశములందు తిరిగి అనేక వనితలను బలాత్కరించుచూ, వారియందు బీజారోపము జేయుచూ బోయెనని కాబోలు.  కథా విషయమున ఆధునిక "రేప్" "మర్డరు" మిస్టరీ నవలలకు ధీటైన రచన ఇది.

నేపాళరాజచరిత్ర శృంఖలము పేరిట వ్రాసిన రచనలకిది యాద్యమట. ఇందులో మౌలికముగ రచయిత చెప్పవచ్చినదేమో?  అసలిది రాజచరిత్రమే కాదు.

కల్పనకునూ ఒక్కొక్కసారి పౌరాణికాధారముండును. లేదా ప్రఖ్యాత గ్రంథమున గౌణముగనున్న నొక ప్రస్తావనను రచయిత వస్తువుగ స్వీకరించుట గలదు. కాని అవేవియును నిందులో లేవు. మరి ఈ రచన యెందుకు వ్రాసినట్లు? ’శాక్యుని’ గురించి వ్రాయలేదని జెప్పుచూ అహింసాసిద్ధాంతమును అసంబద్ధముగ నర్థము జేసికొని విమర్శించుట కనిపించును. శాక్యముని యను నామసామ్యమును స్వీకరించి, పరోక్షముగ అహింసాసిద్ధాంతవిమర్శనము జేయును. ఈ సృష్టి యంతయునూ హింసయేనట. హింసలేనిది పుట్టుక, పదినెలల గర్భధారణ ఇవేవియునూ లేవట - యిట్లు సిద్ధాంతము. ఒకచోట ఈ రచయిత విడమరచును - సమాజమునకు కులీనత యను అహంకారము అత్యంతావశ్యకమట. మరియొక చోట ’వేమన’ ను పేరు జెప్పక వాల్మీకితో పోల్చి ఈ రచయిత యవమానించును.  వీటి వెనుక రచయిత ఉద్దేశ్యములు కుటిలములని దోచును.

బుద్ధావతారము గురించి నవలలో యొకచోట కొంత వివరణ యున్నది. దశావతారములలో బుద్ధుడొకడు. ఈతడు శ్రీమన్నారాయణుని యవతారమే. త్రిపురాసురులను సంహరించుటకు శివునకు విష్ణువు అవసరమాయెను. అప్పుడు విష్ణువు సన్యాసి అవతారమెత్తి త్రిపురాసురుల భార్యలకడకు వెళ్ళి వారికి శీలము, పాతివ్రత్యము, వర్ణవిభేదము వంటి వాటిని గూరిచి వైదికధర్మవిరుద్ధముగా జెప్పగా, వారు పాతివ్రత్యములఁ గోల్పోయిరట. అందువలన వారి పతులకు ముప్పు వచ్చి శక్తులను కోలుపోగా శివుడు వారలను సంహరించెనట. ఈ బుద్ధావతారమును గూర్చి సామాన్యులు యెఱుగరు. మేధావులకే నిది తెలిసియుండెనోపు.

అంతటి వైదికనిరతులు, ధర్మనిష్టులైన ఆ స్త్రీలను యధర్మపు బాటపట్టించి వారి పతులను శివునిచేత చంపించి సన్యాసి బుద్ధుడు, శ్రీమన్నారాయణావతారము బావుకున్నదేమిటన్న ప్రశ్న యడుగరాదు. అంతకంటే మంచి రాచమార్గమున్నది కదా. అవతారమెత్తి త్రిపురాసురుల బుద్ధులను ద్రిప్పవచ్చును. అట్లు చేయుట భగవంతుని లక్షణము కాదు కాబోలు! పైగా యది అహింసాసిద్ధాంతమును సమర్థించినట్లగును. అది రచయిత భావజాలమునకే విరుద్ధము. భగవంతుడు అవతారమెత్తి త్రిపురాసురుల పెండ్లాముల మనస్సులను చెడగొట్టి పాతివ్రత్యభంగము గావించుటే ధర్మము. బ్రహ్మజ్ఞాని యైన రచయిత యేది ప్రతిపాదించునో అదియే సత్యమని యెఱుగవలెను!

అప్పటినుండి విష్ణువుకు ఈ సూత్రము అచ్చిరాగా అప్పుడప్పుడూ బుద్ధావతారమెత్తుచూ యుండునట. అహింసాసిద్ధాంతమును బోధించుచూ జనులను పాపులను గావించుచూ, వైదిక ధర్మబాహ్యులను జేయుచూ యుండునట. కాదని యనరాదట. నిజమునకు బుద్ధుని యవతారము మిగిలిన యవతారములకంటే విలక్షణమైనదట. కృతయుగమున ఈ యవతారమెత్తితినని విష్ణువు ఈ యవతారమునెత్తక మానడట. ఇట్లు జెప్పి తదనంతరము పుస్తకపు చివర, బుద్ధుడు వేరని, యతని పండితులాశ్రయింతురని, అతని మతము ప్రఖ్యాతమగునని రచయిత మాటమార్చగల సమర్థుడు.

యనగానేమి? బుద్ధుడు గొప్పవాడు కానీ అహింస గొప్పది కాదు. సరి అలాగే అనుకొందము. నిజముగానిది బౌద్ధవిమర్శనమైనచో ’అహింస’ యను మాటను శాక్యముని యే యర్థమున వాడినాడన్న ఎఱుక రచయితకు లేదు. అహింస హింసకు వ్యతిరేకమట. అహింసను బోధించుట యనగా శ్రీకృష్ణునికి విరుద్ధమగునట. బుద్ధుని యనుసరించు వారు శ్రీకృష్ణునికి వ్యతిరేకులన్నట్లు గౌణముగ నొక సూచన జేయుట. ఇది యొక పెడవాదము.

బహుశా యిట్టి రచన(ల)తో వచ్చిన ధైర్యమో యేమో కాబోలు, ఈ రచయిత అనేక రచనలయందునూ, చివరికి పసిపిల్లల పాఠ్యపుస్తకములయందునూ శాక్యముని గౌతమబుద్ధునిపై కుత్సితమగు తన ఆలోచనలను వింగడించెను.

దిండుకింద పోకచెక్క యను ఈ నవల చక్కగా చదివించును. అచ్చటచ్చటా ఇక్షుపాకము అయిననూ, కొన్ని చోట్ల మాత్రము సీడ్ లెస్ ద్రాక్షాపాకమనియే జెప్పవచ్చును. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధించు చందమున కొన్ని పేజీలు గలవు. "హిమగిరి యనగా మంచు గుట్ట. మంచు కరిగినచో నీరగును. నీరు నదిగా మారి ప్రవహించును. కరుగని చోట్ల రాళ్ళు ఉండును. అట్టి రాల మధ్య చెట్లు మొలచును" - ఇది యొక హింస. ఈయన వాదమే హింసావాదము గదా. ఆశ్చర్యమేమి?

మరికొన్ని సందర్భములలో ఇతడు వైదిక ధర్మబోధ జేయును. అనగానేమి? "చాకలి బట్టలు యుదికిన మరియొక వర్ణము వానికి 'భావగత ' మాలిన్యము దొలగును. స్త్రీ పాతివ్రత్యము పురుషుని రక్షించును, ఏలయనగా, పాతివ్రత్యము నెరపని యెడల, ఆమెను అనేకులు మోహించి ఈర్ష్యాళువులగుటకు వీలున్నది.. ఆ సంభావ్యత తొలగించుట ద్వారా స్త్రీ పాతివ్రత్యము పూరుషుని సౌఖ్యదోహద హేతువు అగుచున్నది." - ఇట్టి తింగరి వాదములన్నమాట.
సమయహరణమునకు, దిండు వలెనూ కూడా ఈ పుస్తకము చక్కని యుపకరణము. అంతకు మించి సామాన్యులాశించుట వ్యర్థము.

జ్ఞానమనగా నేమి? ఆత్మ - శూన్యమని యొక యెఱుక. శూన్యమనగా నేమి? ఒక విధమైన వంచన. అనగా ఆత్మజ్ఞానమనగ ఆత్మవంచన యని యర్థము చెప్పుకోవచ్చును.  (బ్రహ్మజ్ఞానమనగా ఇతరులను వంచించుట అని యేమో) ఆత్మజ్ఞానాభిలాషులకు ఇట్టి రచనలు పసందగును. పండితులకు నిది మరింతఁ బనికి వచ్చును.