Sunday, December 9, 2012

క్రిష్ ఆడిన నాటకం - కృష్ణం వన్దే జగద్గురుమ్కొన్నాళ్ళ క్రితం దిండు క్రింద పోక చెక్క అన్న నవల చదివాను. దాని అట్టపైన "కల్పనాత్మకమైన చారిత్రక నవల" అని రాసుంది. అందులో ఉన్నది అంతా కల్పనే. చరిత్ర శూన్యం. ఆ కల్పన వెనుక ఉన్నది రచయిత విశ్వనాథ సత్యనారాయణ యొక్క కుత్సితత్వపు బుద్ధి అన్నది నవల చదివితే అర్థమవుతుంది.

ఈ రోజు సాక్షి పేపర్ లో జాగర్లమూడి క్రిష్ గారి ముఖాముఖి లో "సినిమా" గురించి తన అభిప్రాయం కూడా అలాంటిదే. "సినిమా వ్యాపారాత్మక కళ" అని ఆయన వాక్రుచ్చారు. ఆయన లేటెస్టు సినిమా "క్రిష్ణం వన్దే జగద్గురుమ్" లో "కళ" కంటే వ్యాపారమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఆ వ్యాపారం వెనుక ఏముంది అని ఆలోచిస్తే, ఇది క్రిష్ గారు జనాల మెదళ్ళమీద ఆడిన డ్రామా లాగా అనిపిస్తా ఉంది.

ఇదివరకు ఠాగూర్, అపరిచితుడు, మల్లన్న, శివాజీ వంటి సుగర్ కోటెడ్ సినిమాలు వచ్చినాయి. ఇవన్నీ ఏదో సామాజిక సమస్య మీద వ్యక్తి పోరాడుతున్నట్టు చిత్రీకరించి హీరోతో విలన్లను చితకబాదించి, ఆయనతో దైవాంశ సంభూతమైన పనులు చేయించి నేల విడిచి సాము చేసి, మధ్యలో హీరోవిన్లతో ప్రదర్శన చేయించి ఓ మూడుగంటలు ప్రేక్షకులను ఎంటర్ టయిన్ చేసి, పబ్బం గడుపుకున్నాయి. క్రిష్ గారు చేసిన "కొత్త" పని ఏమంటే - ఆ సుగర్ కు "దైవత్వం" అన్న మరొక లేయర్ "తేనె" దట్టించటం. ఈ కొత్త పని వల్ల ఆయనకు వచ్చే అడ్వాంటేజి ఏమిటంటే - ఈ సినిమాను మెచ్చుకుంటే "దైవత్వం" తాలూకు గొప్పతనాన్ని ఒప్పుకున్నట్టు ప్రేక్షకుడికి కలిగే భ్రమ, ఈ సినిమాలో లోపాలెత్తి చూపితే వాడికి టెస్టూ సెంటిమెంటూ లేవని చెప్పడానికి కలిగే వెసులుబాటూనూ.

ఇంతా చేసి ఈ సినిమాలో హీరో గారు చేసిన పనుల సారాంశం ఏమంటే - లక్ష కోట్ల ఆస్తి ఉన్న విలన్ ను డ్రమటిక్ గా నరసింహ స్వామి రూపం ధరించి చంపెయ్యటం. అందుకు పైకి చెప్పే కారణం - ఆ విలనుడు నేలను తవ్వి వ్యాపారం చేసి, అడవులను నాశనం చేసి, అడవి బిడ్డల్ని తిప్పలు పెట్టాడని. ఆ కారణం మీదనే సినిమా నడుస్తే మంచిదే. అయితే అలా చేస్తే "వ్యాపారం" ఎలా? అందుకని విలన్ గారు హీరో తల్లితండ్రులను చంపిన మేనమామ అన్న తెలుగు సినిమా తాలూకు పాచిపోయిన భావదారిద్ర్యపు ఫార్ములానే దర్శకుడు వాడుకున్నారు. హీరోతో విన్యాసాలు, ఫైట్లు చేయించారు. హీరోవినును ప్రేమింపజేశారు. అట్టహాసపు డవిలాగుల హంగులను, పాటల జిలుగులను అద్దెకు తెచ్చుకున్నారు. సగటు ప్రేక్షకుడిని "సగటు" గానే ఉండమని సరికొత్తగా చెప్పారు.

నాటక రంగం నాశనమైపోయిందని ఈ సినిమాలో హీరో, వారి తాతగారి (దర్శకుడి) బాధ. (ఇది మాటల్లోనూ, సన్నివేశకల్పనలోనూ చూపించడంలో సఫలమయ్యారనే చెప్పవచ్చు) అయితే దానికి నేపథ్యం కావాలని బళ్ళారి కి హీరోను తీసుకొచ్చారు. హీరో తాతగారిది బళ్ళారిట. ఆ బళ్ళారి బాబులు బళ్ళారి తెలుగులో మాట్లాడరు. శుద్ధమైన కోనసీమభాషలో మాట్లాడుతారు, టేక్సీ డ్రయివరుతో సహా. పోనీ కన్నడ భాషయినా సరిగ్గా వెలగబెట్టారా అంటే అదీ లేదు. నిజానికి బళ్ళారి కన్నడ బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో కన్నడకంటే భిన్నమైన యాస. తెలుక్కే గతిలేదు, ఇక కన్నడ యాసకెక్కడ? ఇలాంటివి మామూలు సినిమాల లో కనిపిస్తే ఓకే. కానీ ఈ సినిమాలో "కళ" మీద గొప్పగొప్ప డవిలాగులు రాయించుకున్న క్రిష్ గారికి కళ కు ప్రాంతీయత్వపు సౌరభం అతి ముఖ్యమైన అంగమని, అవసరమని తెలియకుండా పోయింది. ఒక్క యాసే కాదు, బళ్ళారి, అసలు రాయలసీమ తాలూకు వాసనే ఈ సినిమాలో కనిపించదు. ఆ ఊరి పేరు మీద రామోజీ సిటీలో వేసిన చవకబారు సెట్లు తప్ప. బళ్ళారి రాఘవ, వారి శిష్యులూ, ఇంకా ధర్మవరం రామకృష్ణమాచార్యులు, ధర్మవరం గోపాలాచార్యులు, యడవల్లి సూర్యనారాయణ, ఇత్యాది మహానుభావులు ఒకప్పుడు సీమ ప్రాంతంలో పోషించిన  బళ్ళారి నాటకరంగం తాలూకు ఆనవాళ్ళు మచ్చుకైనా లేవు. వారి ఫోటోలు కూడా హీరో గారి ఇళ్ళల్లోనూ మరెక్కడానూ లేవు. బళ్ళారిలో రైట్ ఆనరబుల్ కోలాచలం వారు కట్టించిన రంగ మందిరం, (నేటి మునిసిపల్ ఆఫీసు అనుకుంటాను) వారి "సుమనోహర" సంఘం, వారు వ్రాసిన నాటకాలు, రూపనగుడి నారాయణరావు గారి సాహిత్యం ...ఊహూ...ఏవీ కాబట్టలేదు. చివరికి బళ్ళారి పట్టణంలో నాటి చరిత్రకు మౌనసాక్ష్యాలైన టిప్పుసుల్తాను కోట, వార్డ్ లా కాలేజ్, మెడికల్ కాలేజ్ (బ్రిటిష్ హయాంలో స్వాతంత్ర్య సమరయోధుల జైలు) ఏవీ లేవు. అసలు బళ్ళారి ఊరికే వెళ్ళకుండా ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఊపిరి పోసుకున్న మహోజ్జ్వల కళ గురించి క్రిష్ గారు రామోజీ సిటీ సహాయంతో ప్రేక్షకులకు జ్ఞానసంపద పంచిపెట్టారు! హాట్సాఫ్!

నేపథ్యం "కళ" తో క్లాసు ప్రేక్షకులను గేలం వేసి, మైనింగు, లక్ష కోట్లు సంపాదించిన విలను, అతని క్రూరత్వం, వీటి ద్వారా సాధారణ సినిమాకు కావలసిన మసాలా హంగులను కూర్చుకోవడంలో చక్కని తెలివి తేటలు కనబర్చారు. ఆ లక్ష కోట్ల విలను - చేసే పనులు కాస్త లాజిక్ ఉపయోగిస్తే పేలవమైనవని తెలిసిపోతాయి. అన్ని కోట్లు కూడగట్టి, పేరలల్ ప్రభుత్వం నడుపుతున్నతను, హీరోయిన్ ను చంపాలని, ఆమె దగ్గర రహస్యాలున్నాయని తాపత్రయపడటమేమిటో? చక్కగా ఆమె బాస్ ను డబ్బుతో కొనెయ్యచ్చు, లేదా మీడియానే కొనెయ్యవచ్చు, లేదా సాక్ష్యాలు తారుమారు చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి, ఒక సిన్సియర్ తెలుగు విలన్ లా, హీరోవిన్ ను, చంపాలని తన మందితో ప్రయత్నిస్తాడు! నిజానికి ఆ స్థాయి విలన్ తన చెయ్యికి మట్టి అంటకుండా పనులు చేస్తాడు. తన రౌడీలతో అలాగే చేయిస్తాడు. ఆ రౌడీలు దర్శకుడి చేతిలో కీలుబొమ్మలు కనుక, హీరోగారి ట్రూపులో సభ్యుణ్ణి అనవసరంగా నాలుక కోసి, హీరో తాత గారి అస్తికలపై మూత్రం పోసి హీరోతో వైరాన్ని కొనితెచ్చుకొని, ఆ ప్రయత్నంలో దైవాంశసంభూతుడిలాంటి అతని చేతిలో తన్నులు తింటూ, హీరో పగను మరింత రెచ్చగొడుతూ తమ ప్రాణం మీదకు తెచ్చుకుంటూ ఉంటారు!

ఒక్క విషయానికి మాత్రం క్రిష్ గారిని మెచ్చుకోవాలి. లాజిక్ కు అందని విన్యాసాలను చక్కగా అడవి పుత్రుల తాలూకు ఎమోషన్ సీన్స్ ద్వారా కవర్ చేసి ఊపిరి ఆడకుండా పని జరిపేసుకున్నారు. సామాన్యుల ఆక్రోశం, మట్టి రాజు అనే పాత్ర ద్వారా మట్టిని ఎవరూ దోచుకెళ్ళకుండా నీళ్ళలోకి వేసి దాచిపెడుతున్నట్టు చూపించడం, వాళ్ళ ఆగ్రహాన్ని చూపించడానికి హీరో వాళ్ళతో కుండలు పగులగొట్టించటం, చివర్లో విలన్ ను మోసుకొచ్చి వాళ్ళ ద్వారానే చంపించటం, దానిని చూసిన ఒక పిల్లవాడు "ఏ దేవుడు" అంటే - మనిషి దేవుడనటం....సిరివెన్నెల గారి దశావతారాల్లో కృష్ణుడి వరకు మాత్రమే వచ్చిన పాట, పవర్ ఫుల్ డైలాగులు, సినిమా మొదట్లో అభిమన్యుడు, ఘటోత్కచుల అద్భుత ప్రదర్శన, హీరో హీమేనిజం, హీరోవిన్ తో సరమైన శృంగారం, చీప్ కామెడీ, ఒకట్రెండు చవకబారు ఐటెమ్ సాంగ్స్ - అన్నీ కలిపి, ఈ సినిమాను హిట్ సినిమా చేస్తాయి. అయితే ఈ సినిమా "కళ" కు అద్దం పట్టిందనో, గొప్ప సినిమా అనో అంటే మభ్యపడే ప్రేక్షకులతో బాటూ సైలెంట్ గా కూర్చుని ఆలోచించే వాళ్ళూ ఉంటారు. అలాంటి వారికి ఇది క్రిష్ గారు ఆడించిన డ్రామా అని తెలిసిపోతుంది.

మంచి ఎంటర్ టైనర్ ఈ సినిమా. సరికొత్త ప్రయోగం కూడా. డవిలాగులు చాలా బావున్నాయి. సినిమా తప్పక చూడండి. అయితే "కళ" గురించి క్రిష్ గారు వేసే జోకులు డ్రామాలో భాగంగాను, టీవీ ఛానెళ్ళలో సిరివెన్నెల గారిని అడ్డుపెట్టుకుని దశావతారాలని అవని ఇవని, కళ అని పడికట్టు మాటలలో వెనుక ఉండే హంగామాను జాగ్రత్తగా గమనించండి.