Sunday, November 22, 2009

ఊరికి పోదాం ...

రోజూ చూస్తున్న పూలు, చెట్లూ, మనుషులూ ఒక్కోసారి కొత్తగా కొంగ్రొత్తగా కనబడితే ఆ అనుభూతి ఎలాంటిది? నా వరకూ ఆ అనుభూతి, ఊరికి వెళ్ళేప్పుడు, ఊరిలో మన వారిని కలుసుకోబోతున్నాం అన్న ఆనందం లాంటిది. జీవితం వారాంతపు సంకెళ్ళలో కట్టివేయబడిన ఓ సగటు నిర్భాగ్యోద్యోగిని నేను. అదుగో ఆ వారాంతం ఒకింత ముందుగా ఒచ్చింది మొన్న శుక్రవారం. ఊరికే రాలేదండోయ్. ఓ అర్ధ రోజు సెలవును మింగేస్తూ వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరాను మా ఊరికి.

అనుభూతిపరంగా రైలు ప్రయాణంలో ఉన్నంత సుఖం బస్సు ప్రయాణంలో ఉండదు. రైలు తలుపు దగ్గర నుంచుని, ఆ గాలిలో చెట్లు పరుగెత్తుకుని వెనక్కెళ్ళి పోతుంటే, ఓ మేఘం చాలా దూరం వరకూ వచ్చి, దూరమైన స్నేహితుడిలా వీడుకోలు పలుకుతూ వెళ్ళిపోతుంటే అబ్బ! ఎంత హాయిగా ఉంటుంది! ఆ పక్కన జామకాయలమ్మి, స్టేషన్ లో దొరికే తినుబండారాలు, అవి తింటూ కూర్చుంటే, రైలు బయలుదేరిపోతుందనే ఆదుర్దా, మన కూపేలో అందమైన అమ్మాయి ఎక్కినప్పుడు "ఆహా!" అన్న ఓ చిన్ని ఆనందం, అంతలోనే ఆ అమ్మాయి పుస్తకంలో కూరుకుపోతే ఆవిరయిపోయిన ఆ అనుభూతి, చిన్నపిల్లాడు వాళ్ళమ్మను అడిగే "ఇంటెలిజెంట్ ప్రశ్నలూ" ..రైలు ప్రయాణం ఓ అందమైన లఘు కావ్యం, ఒక్క "లేటు" అన్న ముద్రారాక్షసం తక్క.

అయితే, బస్సు ప్రయాణం కూడా ఇందుకు తీసిపోదు ఒక్కోసారి. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడూ, వర్షం వెలిసినప్పుడూ, ఆ తర్వాత వచ్చే ఇంద్రధనుస్సు "హాయ్" మన్నప్పుడూ!

మొదటికొస్తాను. బస్సు నేషనల్ హైవే 7 మీదుగా వెళుతూంది. బెంగళూరు దాటింది. వర్షం పడసాగింది. మెత్తగా జారిపోతున్న బస్సు! సుతిమెత్తగా కిటికీ పక్కనుంచీ కొడుతున్న వాన చినుకులు! (ఏదో యద్దనపూడి నవలలో అనుకుంటా, ఆరంభం అట్టాగే ఉంటది). ఇంతలో .... ఏజోల్డు నోస్టాల్జియా! తగుదునమ్మా అని ఒచ్చేసింది. అదేనండి, శనగపిండి ప్రొడక్షన్స్ వారి పకోడీలు! వర్షం పడుతూంటే పకోడీలు తినని వాడు పశువై పుట్టున్! ఇది గిరీశం లాంటోడికి కూడా ట్రివియల్ మాటరు. అందుకే ఎక్కడా చెప్పలే! సరే బస్సు హైవే నుండి పక్కకు మట్టి రోడ్డులోకి, అప్పుడే కొత్తగా నడకలు నేర్చుకున్నట్టు ఊగుతూ కొంతదూరం నడిచి, ఓ హోటలు అలియాస్ ఢాబా దగ్గరాగింది. ఆ హోటలు వాడికున్నంత సామాజిక స్పృహ తెలుగు బ్లాగర్లలో కూడా లేదు. వేడి వేడి పకోడీలు, చపాతీలూ, దోసెలూ, చిక్కటి కాఫీ, నీళ్ళటి అల్లం టీ, ఇవీ అక్కడ మెనూ కార్డు లో ఐటమ్సు. మెను కార్డు బూర్జువా వ్యవస్థ కు ప్రతిరూపమనేమో అక్కడ పెట్టలేదు. దానికి ముందు వర్షను వాయిస్ మెనూ కార్డే అక్కడ నడుస్తూంది. ఆ వర్షంలో పకోడీ తింటూ, మధ్య మధ్యలో నీళ్ళటి అల్లం టీ తాగుతున్నప్పుడు - ఆహా! కరడుగట్టిన నాస్తికులకు, గతి తార్కిక భౌతిక వాదులకు కూడా కాసేపు దేముడు కనబడతాడు. అది ఆ హోటలు వాడి శాపం లాంటి వరం. అదంతే!

తిరిగి బస్సు రోడ్డునపడింది. (క్షమించాలి. మామూలుగానే అన్నా, విమర్శనాత్మకంగా కాదు!) ఈ సారి వర్షం వెలసింది. అయితే ఈ సారి రివ్వున, చల్లటి గాలి కొట్టసాగింది. ప్రేమలో పడ్డవాళ్ళకు ఆకాశం మామూలుగాకన్నా, ఎక్కువగా నీలంగా కనిపిస్తుందట. సైన్సు కేవలం వర్ణాంధత్వం (కలరు బ్లయిండ్ నెస్సు) గురించే చెబుతుంది కానీ, ఈ కలరు ఎన్రిచ్ మెంటు గురించి మాట్లాడదు. నాకు అట్లాగే కనిపించింది బయట. ఎందుకో మరి. (మనలో మాట. నేను ప్రేమలో చాలా సార్లు పడ్డాను కానీ, పడి దెబ్బలు తగిలించుకోలే. కనీసం మోకాళ్ళు దోక్కుపోలే.నాది విశ్వజనీనమైన ప్రేమో, విశ్వస్త ప్రేమో నాకే తెలీదు). హైవే బ్లూస్ ను మీరూ చూస్తారా?
మీకో గుండెలు పిండేసే నిజం చెప్పనా? ఆ ఫోటోలు రాయలసీమ, అందునా కరువుకు ఇంటిపేరయిన మా అనంతపురం జిల్లా తాలూకువి. అసలు కెనడాలు, న్యూజీలాండులకెందుకెళ్తారో ఈ సినిమా వాళ్ళు. కాస్త కళ్ళు తెరిస్తే ఇక్కడే ఇలాంటివి కనిపిస్తాయి.


ఏం చెబుతున్నా. సీనికి బ్యూటీ గురించి కదా! ఆ బ్యూటీతో పాటుగా నేను చేస్తున్నపని ఇంకొకటున్నది.

మొన్న పుస్తక ప్రదర్శనలో కొన్న ఓ కావ్యం (తెలుగు వ్యాఖ్యానసహితం) చదువుతున్నాను. అందులో వర్షం వర్ణన మొదలయింది. (ఆ పుస్తకం గురించి పెద్దలెవరైనా చెబుతారేమో అని ఎదురుచూస్తున్నా. ఎవరో లేకపోతే నేనే ఓ రోజు పెద్దరికం తీసుకోవాలి)

వర్షంలో మైమరిచిన కొంగలు చిందులేస్తూ, ప్రావృట్, ప్రావృట్ అని అరుస్తున్నాయిట. అదీ వర్ణన. బయట ఆ వర్ణనకు తగినట్టుగా కొంగలు కనబడ్డాయ్. (ఫోటోలో బంధించలేకపోయాను)

కాసేపటికి మేఘాలలా దూరంగా ఒళ్ళు విరుచుకుంటున్నట్టు కనబడ్డాయ్. గరుత్మంతుడు విష్ణువును మోసి, మోసి, అలసి, నిలబడి రెక్కలు బారజాపి, .. అలా ఒళ్ళు విరుచుకుంటున్నట్టు, ఓ బ్రహ్మాండమైన మేఘం గరుడపక్షి రూపంలో ఇలా....

మరి కాస్సేపటికి ఓ వరాహ రూపంలో భూమి పైకి యుద్దానికి వస్తున్నట్టుగా ఓ మేఘం. ఆ వరాహం ధనుస్సును కూడా ధరించింది. అది - ఇంద్రధనుస్సు. (ఫోటో మీద క్లిక్కి, తదేక దీక్షతో చూస్తే, రైన్ బో ముక్క కనిపిస్తుంది) ఈ ఫోటోలో ఆంగిల్ లేదు! రెసొల్యూషన్ లేదు!పొజిషనూ లేదు!(ఈ టీలో రంగులేదు! రుచి లేదు!చిక్కదనం లేదు! ఆ టోన్ లో అనుకోండి). అనుకోవడం వరకే ఛాయిస్.మరి కాసేపటికి సింహం (సింహం దవడకండరం కాస్త బిగుసుకుంది. ఏమనుకోకండి!)
నలుపు, ఆకుపచ్చ, నీలాలతో ప్రకృతి త్రివర్ణ పతాకలా ఉంది.అదీనండీ..అలా చూసుకుంటూ, మల్లీశ్వరిలో "పరుగులు తీయాలి" పాట వినుకుంటూ ఊరికి చేరుకున్నానండి.ఊరు చేరగానే సాయంత్రమయింది. మా ఊరు యథావిధిగా వర్షాలు అవీ లేకుండా క్షామంగా ప్రశాంతంగా ఉంది. మా పాపాయి ఇంటి ముందు ఇసుకలో ఆడుతూ స్వాగతం పలికింది.
రెండు రోజుల జీవితం తర్వాత మళ్ళీ బతకడానికి నగరానికొచ్చేశాను యథావిధిగా.