Sunday, April 14, 2013

మాదీ హైదరాబాద్

సిటీ బస్సు మామూలుగా అన్ని ఊళ్ళల్లోలాగా కాకుండా స్టాపుకంటే కొంతదూరం ముందుకు వెళ్ళి ఆగింది. స్టాపులో ఉన్న జనం పోలో మంటూ బస్సు దగ్గరకు ఉరికారు. ఆ జనాల్లో ఒక చిన్నసైజు మహిళామండలి కూడా చీరలు కట్టుకుని రేసులో పాల్గొంటున్న పీటీ ఉష, అశ్వినీ నాచప్ప ల్లాగా పరుగెట్టారు. మా నాన్నా, నేనూ పరిగెత్తాము మందతోబాటు. మా నాన్నెలానో బస్సు ఎక్కేశాడు. నేను కాస్త వెనుకబడ్డాను. బస్సు బయలుదేరేసింది. నేను పరుగు కంటిన్యూ చేశా.

బస్సు అలా బయల్దేరి కాస్త దూరం వెళ్ళగానే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. పరిగెత్తుతున్న నేను కడ్డీ పట్టుకుని బస్సులో జొరబడ్డా. పట్టు తప్పబోయి పడిపోబోతున్న నా రెండవ చేతిని బస్సులో ఒకతను పట్టుకుని పైకి లాగేశాడు.

"కాయ్ కు రే! ఛడ్ నా నహీ ఆతా?" - ఇలాంటిదేదో వినబడింది. పక్కన తెల్లటి షేర్వాణీ, గంతల టోపీ, తాంబూల చర్వణం, సెంటు వాసన - ఇత్యాది భూషణాలతో ఇద్దరు సాహెబులు నవ్వుతున్నారు. నేనూ మొహమాటంగా నవ్వాను.

పదిహేడేళ్ళ వయసులో హైదరాబాదుతో నా తొలి అనుబంధం అది. నాయన వెంట ఎమ్సెట్ కౌన్సిలింగు కోసం నగరానికి వచ్చిన రోజులు. ’బస్సులో పరిగెత్తుకుని ఎక్కని హైదరాబాదీ తాబేలై పుట్టున్’ - అని హైదరాబాదు వాళ్ళ నినాదం. వాళ్ళలా చేస్తారనే డ్రయివర్లకు కూడా స్టాపులో బస్సునాపటం ఇష్టం ఉండదు.

అంతకు ముందు చాలా సార్లు బెంగళూరికి వెళ్ళి ఉన్నాను. అయితే బెంగళూరు కు వెళ్ళినప్పుడల్లా, ఒక ఆటవికుడు మొట్టమొదటి సారి నగరానికి వెళ్ళినట్టు ఉండేది. పైపెచ్చు మనది తెలుగు మీడియం కాబట్టి, అక్కడ మా బంధువుల పిల్లకాయలందరూ ఇంగిలీసు కాబట్టి భయంకరమైన పరిస్థితి. నా వేషభాషలు చూసి అందరూ నవ్వేవాళ్ళు. వాళ్ళదీ తప్పులేదు.

"What is your name?" అంటే "I am name Ravi" అంటే నవ్వరా వాళ్ళు?

అలాంటి పరిస్థితిలో ఉన్న నాకు హైదరాబాదు ’కొత్త’గా అనిపించింది. బెంగళూర్లో అపరిచితుడు మనతో ఆంగ్ల భాషలో మాట్లాడతాడు. ఇక్కడో? ’కాయ్ కు రే?’ - హెంత తేడా అసలు? బస్సును పరిగెత్తుకుని ఎక్కుట - ఎంత థ్రిల్లూ? హైదరాబాదుకు ఎట్లైనా సరే మళ్ళీ రావాలి - ఆలోచన పీకేసింది. ఆ ఛాన్సు పది రోజుల్లోనే వచ్చింది. స్టడీ సర్టిఫికెట్ మర్చిపోవడంతోటి, కవున్సిలింగు వాళ్ళు పది రోజుల్లో తెచ్చివ్వమన్నారు. అది తెచ్చివ్వడం కోసం మా నాన్నకు నచ్చజెప్పి నేనొక్కణ్ణీ హైదరాబాదుకు వచ్చాను.  ఈ సారి హైదరాబాదు మరింత అందంగా కనిపించింది. ఉస్మానియా పరిసరాలు భలే ఉన్నాయి! సికిందరాబాదు దగ్గర ఇరానీ చాయ్, నాంపల్లి పుల్లారెడ్డి స్వీట్లూ, కరాచీ బేకరీ బిస్కట్లూ ........హ్మ్... హైదరాబాదు లో ఏదో ఉంది!

ఫ్లాష్ ఫ్రంట్: తదనంతరకాలంలో బస్సులో పరిగెత్తుకుని ఎక్కే ఆర్ట్ ను నేను మాస్టర్ చేసేశాను. ఈ మధ్య తిరిగి హైదరాబాదులో అడుగు పెట్టినప్పుడు ఆ విద్య ప్రదర్శించి, వేగంగా వెళుతున్న బస్సులో విజయవంతంగా ఎక్కి, అందరూ నన్ను ఆరాధనాపూర్వకంగా చూస్తుంటే వాళ్ళవంక ఇలా ఒక లుక్కు ఇచ్చాను.

అయితే మరుసటి క్షణంలో నా మొఖం ఇలా మొఖంలా మారిపోయింది.

నా జేబులో కొత్తగా కొనుక్కున్న HTC మొబయిల్ ఫోను ఎవరో లేపేశారు. నేను బస్సుతో బాటు సమాంతరంగా పరిగెత్తి, సరిగ్గా బస్సు ఎక్కుతున్నప్పుడు ఒకడు న్యూస్ పేపర్ ను అడ్డుపెట్టి దాని కిందుగా చేయిపోనిచ్చి నా పై జేబులో ఉన్న ఫోను ఎత్తేశాడు. బస్సు ఎక్కుతూనే ఇది మెహ్దీ పట్నం బస్సు కాదా? అని అడుగుతూ దిగిపోయాడు....

****************************************************************************

మళ్ళీ భాగ్యనగర దర్శనం ఉద్యోగరీత్యా కలిగింది. ఈ సారి దర్శనం తో బాటు జీవనం కూడా. గుండు బొచ్చు లో....అదేనండి అలాంటిదేదో ఉంది కదా...హ్మ్....గచ్చీబౌలి అని అదన్నమాట. గుండు బొచ్చు ....అదే గచ్చిబౌలి అప్పట్లో చాలా పీస్ ఫుల్ ఏరియా. వినాయక నగర్ లక్ష్మి అనెక్స్ అపార్ట్మెంట్ లో రూమ్మేట్లతో కలిసి సావాసం.

ఓ రోజు...

శ్రీదేవి థియేటర్ లో రాత్రి సెకండ్ షో "జోష్" హిందీ సినిమా టికట్లు పట్టుకొచ్చాడు నా ఫ్రెండు. సినిమా కెళితే మొదలు పెట్టటానికి బాగా లేటయ్యింది. ఇంటికి వచ్చే సరికి రాత్రి ఒకటిన్నర గంటలవుతోంది. గచ్చిబౌలి పక్కన క్వార్టర్స్ లో మా వాడి ఇల్లు. వాడి ఇంటిదగ్గర దిగిపోతే నేను నడుచుకుంటూ వస్తున్నాను. పోలీసు జీపు పక్కన వచ్చి ఆగింది.

"ఏయ్ యాడకెళ్తున్నావ్?" - ఒక అధికార స్వరం
"ఇంటికి సార్"
"యాడకెల్లి వస్తున్నవ్?"
"సినిమాకి"
"టికెట్ చూయించు"
చూపించాను. టికెట్ నూ నన్నూ తేరిపార చూశాడతను. అతని యూనిఫారమ్ మీద ఖాన్ అని రాసుంది.
"హైదరాబాదుకు కొత్తా?" - నా అవతారం చూడగానే పోల్చుకున్నాడతను.
"అవును సార్"
చూడు, నీకింకా తెలుస్త లేదు, హైదరాబాదంటే. రాత్రి పూట తిరగాకు. - కుసో..అని బండ్లో కూర్చోబెట్టుకుని కాస్త దూరంలో ఉన్న ఇంటిదగ్గర దింపాడతను. చిన్న సంఘటన. ఎందుకో అతని మొఖం, ఆ రోజూ అలా నిల్చిపోయినై.

****************************************************************************

మా రూమ్మేట్లు అమెరికాకు పారిపోవడంతోటి గచ్చి బౌలి నుండి సికిందరాబాదుకు షిఫ్ట్ అయాను. కవాడిగూడా లో అపార్ట్ మెంటు. ఆరవ అంతస్తు. ఐదుమంది జనాభా. అందరిదీ మా ఊరే. ఇద్దరు ఉద్యోగులం, ఒకడు నిరుద్యోగి, ఇంకో ఇద్దరు చదువు.

ఆ ఇంటికి వాకబుల్ డిస్టన్స్ లో అబ్బాయ్ మెస్సు.
రన్నబుల్ డిస్టన్స్ లో క్రాస్ రోడ్స్. ఒక కుప్ప సినిమా థియేటర్లు.
జాగబుల్ డిస్టన్స్ లో టాంకు బండ్.

అందరూ సినిమా పిచ్చోళ్ళే. ఇంకేం? ప్రతి శుక్ర, శనివారాలు పండగే పండగ.

అక్కడా ఓ రోజు ... (ఆగస్ట్ 21. 2000 అనుకుంటా)

రాత్రి ఆఫీస్ నుండి వస్తూ వస్తూ రోడ్డు దాటి ఒక కిలో పెరుగు కొనుక్కొచ్చాం (శతమర్కటాలు x 5 = ఐదు వందల కోతులకు సరిపోవాలి కదా). అప్పుడు వర్షం మొదలయ్యింది. అప్పుడు మొదలైన వర్షం రాత్రంతా ఒక్క ఊపు ఊపేసింది. పొద్దున్నే ఆరవ అంతస్తు పక్కన డాబాపైకెళ్ళగానే దూరంగా హుస్సేన్ సాగర్ పరవళ్ళు తొక్కుతా కనిపించింది. నేను ముందు రోజు దాటిన రోడ్డు ప్లేసులో ఆరడుగుల యెత్తులో నీళ్ళు పారుతున్నాయి. ఆ పెట్టె అంగడి లేనే లేదు. భీభత్సం. వరద.

ఆ నీళ్ళల్లో దాటుకుంటూ ఆఫీసుకు బయలు దేరితే బేగంపేట దగ్గర బ్రిడ్జుకు పైన నీళ్ళు!

సీమ నుండి బయటకు అడుగుపెట్టి మొట్టమొదటి సారి నా జీవితంలో వరద అనుభవం.

ఆ రూమూ కొన్ని రోజులకు వదిలి ఒక్కణ్ణే మరోచోటికి షిఫ్టయ్యాను.

****************************************************************************

తాజ్ బంజారాలో అదేదో కంపెనీ లో నడకలోపల ముఖాముఖులు (Walkin interviews) జరుగుతుంటే వెళ్ళాను. ఇట్లాంటి వాటికి ఇస్టార్ హోటల్ లోపలికెళ్ళడం కోసమే అటెండ్ అవడం నాకు హాబీ. అట్లాంటి హై ఫై పరిసరాలను చూస్తేనూ, కోట్లూ గట్రా వేసుకుని సూటుకేసులు పట్టుకొని హడావుడిగా తిరిగే జనాలను చూస్తేనూ నేనొక ఆటవికుణ్ణి అన్న ఫీలింగు నాకు అప్పట్లో. అది పోగొట్టుకోవాలన్న తపనతో అలాంటి రోజుల్లో అట్టాంటి హోటళ్ళ దగ్గర తచ్చాడుతా ఉండేవాణ్ణి.

లిఫ్టు ఎక్కకుండా మెట్లెక్కి పైకెళుతున్నా. (లిఫ్ట్ ఎక్కి మూడవ ఫ్లోర్ కెళటానికి రెండు నొక్కాలా, మూడు నొక్కాలా అని తెలిసి ఛస్తే కదా). అక్కడ లాబీలో ఒక యువకుడు నీలిరంగు గళ్ళ చొక్కా, జన్యువుల (జీన్స్) పంట్లామూ తొడుక్కుని కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నాడు. అతను పేపర్ నుండి ముఖం తిప్పి నా వంక చూశాడు. ఎంత హేండ్సమ్ గా ఉన్నాడు! బాగా తెలిసిన ముఖమే. ఛప్పున గుర్తుకు రాలే. ఎక్కడ చూశాను? మెట్లెక్కి పై ఫ్లోర్ కెళ్ళిన తర్వాత బల్బు వెలిగింది.

అతను -

అప్పటికతను కొన్ని సినిమాలు తీశాడు రాజకుమారుడు, వగైరా కానీ అంత పెద్ద హిట్లు కావు. భాగ్యనగరంలో ఇలా సైన్మా హీరో మరో చిత్రమైన సందర్భంలో ఒకచోట పుణుకులు తింటూ ఉంటే అగపడ్డాడు. అది మరీ శీను వైట్ల సినిమా సీనులా ఉంటుంది కాబట్టి రాయను.

****************************************************************************

హైదరాబాదులో ఎండాకాలంలో ఒక రోజు.

ఒక లారీలో మామిడి పళ్ళు అమ్ముతున్నారు. అవి నూజివీడు రసాలట. మా వైపు అవి దొరకవు. సరే ఒక కిలో (16 పళ్ళు) తీసుకున్నా. ఇంటికెళ్ళి మింగడం మొదలెడితే పదహారు దగ్గర ఆగింది. అప్పుడే అయిపోయాయా? ఛ. మళ్ళీ దండయాత్ర జరిపి కక్కుర్తిగా మరో మూడు కిలోలు తీసుకొచ్చాను. ఆ మూడు కిలోలు వరుసబెట్టి లాగించేశాను. ఆ రోజు బానే ఉంది. మరుసటి రోజు నుంచీ శరీరం ఇస్త్రీపెట్టెలా మారింది. మా ఫ్రెండ్స్ ఎలానో కనుక్కుని వచ్చి నా బాడీని మోసుకొని పోయి వాళ్ళ రూములో పారేశారు. అక్కడే వారం తిష్ట.

****************************************************************************

అమ్చీ హైదరాబాదులో ఉండగానే మా సంస్థ వాళ్ళు డబ్బులు కట్టి నన్ను జపాను భాష వెలగబెట్టమని శ్రీనగర్ కాలనీ లో ఒక ఇన్స్టిట్యూట్ కు పంపారు. పని చెయ్యమంటే బద్ధకం కానీ, ఇలా ఉద్ధరి బేరాలు తగిలితే విజృంభించమా యేంది? జపనీసు మూడు చెర్రీ బ్లోసమ్ పూవులు, ఆరు చెర్రీ కాయలూ లాగా సాగింది. రేవంతో సాన్ తో కొన్ని అడ్వెంచర్లూ, డిబెంచర్లూ చేయటానికి అవకాశం వచ్చింది. 

ఇంకా హైదరాబాదుతో అనుభవాలు బోల్డు, మినర్వా కాఫీబార్ లో కారప్పొడి ఇడ్లీలు, జయభేరి దగ్గరున్న సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, విశాలాంధ్ర పుస్తకాలూ, సికందరాబాద్ సంతోష్ సినిమా లో ఇంగ్లీషు సినేమాలు, పాతనగరం లస్సీ, ఫెలూదా, హర్ష, వెంకటరమణా, అబ్బాయి మెస్సుల్లో మీల్సూ, అభిరుచి లో జున్నూ, శ్రీనగర్ లో నెల్లూరు వాళ్ళ కారం దోసె (ఇప్పుడు లేదు).....ఇంకా మా రూమ్మేట్లు సూర్య, చక్రి గాడి సినిమా కబుర్లూ, భాగ్యనగరంలో వర్షం.....

భాగ్యనగరం - మొదటిసారి ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు - నాకు సమయమూ, డబ్బూ రెండూ అవసరమైన రోజులు. అప్పుడు మా అమ్మగారి చివరి రోజులు, ఇంట్లో కొన్ని అప్పులు. మా నాన్న తర్వాత నా హయాం మొదలైన రోజులు. ’భాగ్య’నగరం - పేరు నిలుపుకుంది. ఋణపడేలా చేసుకుంది. చాలా అవసరాలలో భాగ్యనగరం నన్ను ఆదుకొనింది. భాగ్యనగరం తో వ్యక్తిగతంగా నాకు ఏదో అనుబంధం ఉంది. డవుట్ లేదు.