Showing posts with label Fun. Show all posts
Showing posts with label Fun. Show all posts

Sunday, June 23, 2013

సంకేతపదనిర్మాణతరుణోపాయన(స)ము

అనగనగా ఒక రోజు - నాలుగు సార్లు ఫ్రెండ్స్ తో బాటు కేంటీన్ కు వెళ్ళి కాఫీ తాగి సీటు దగ్గరకు వచ్చి, ఫేసుబుక్కూ, ప్లస్సూ, కూడలి, యూట్యూబూ, మరో నాలుగు కిటికీలు తెరిచి ఆఫీసులో చాలా బిజీగా పనిచేసుకుంటూ ఉన్నాను.

తెర మీదకు ఒక మిస్సైల్లా  ఒక డబ్బా వచ్చింది. దాని మీద ఉన్న సారాంశం ఇది.

"మీ యంత్రం తాలూకు సంకేతపదం ఆరునెలలుగా పాచిపోయి కంపు కొడుతూ ఉంది. దానిని మార్చండి."

ఓస్ అంతే కదా అనుకుని "సరే" అన్న పోకముడిని ...ఛ ఛ .. బొత్తామును నొక్కాను. ఒక భయంకరమైన విషవలయంలో అడుగుపెట్టబోతున్నానని నాకా క్షణం తెలీదు.

అదివరకు ఇలాంటి బెదిరింపులను చూసి ఉన్నాను. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు గ్రామసింహం ..ఛ ఛ ..సీమసింహం బెదరదు అని సంకేతపదం ఇలా టంకించాను. -

"వెధవ123"

ఇక్కడో మినీ ఫ్లాష్బాకు. ఇలా సంకేతపదాలు మార్చమని మూడు నెలలకో మారు మాకు విన్నపం వస్తుంది. "వెధవ123", "చవట123" - ఈ రెండు సంకేతపదాలనే నేను మార్చి మార్చి వాడటం అలవాటు. మా మిత్రులు ఇలాంటివే ఏవో పద్ధతుల్లో తమ సంకేతపదాలను గుర్తుంచుకోవడానికి వీలుగా తీర్చిదిద్దుకోవడం నాకు తెలుసు.

తెరపైకి ఒక డబ్బా, దాంట్లో తిట్టు లాంటిది కనిపించింది - "మూర్ఖుడా, నీ సంకేతపదం లో వరుసగా మూడు నంబర్లను పెట్టావు. మార్చు." బేక్ గ్రవుండ్ లో చిన్న సైజు వికటాట్టహాసం.

ఈ తతంగాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేయడం తక్షణ కర్తవ్యం అని, కేన్సిల్ నాడా ...అదే బొత్తామును నొక్కాను. మరో డబ్బా. "కేన్సిల్ నొక్కి ఫేస్బుక్ కు వెళ్ళిపోదామనుకుంటున్నావా? కుదరదోయ్. సంకేతపదం మార్చేదాకా వదలను. వదల బొమ్మాళా వదల, రీస్టార్ట్ చేసినా వదల"

నా మనసు కాస్త కీడు శంకించింది. ఇలాంటిది ఇదివరకెప్పుడూ రాలేదు

సరే అని కాస్త ఆలోచించి ఇలా మార్చాను. "వెధవ321". ఫలితం ఇది.

"ఒరే కోడి బుర్ర వెధవా, వరుసగా అన్నాను. అది వెనుకనుండైనా కావచ్చు"

"వెధవ007"

"హమ్మా? ఆశ దోశ అప్పడం వడ! ఒకటే నంబర్ రెండు సార్లు రాకూడదోయ్".

తల వేడెక్కింది. కాస్త ఆలోచించాను. నేను మొట్టమొదటిసారి యాహూ అకవుంటు తెరిచినప్పుడు నా ప్రియతమ నాయిక సోనాలీ బేంద్రే స్మృత్యర్థమై ..అదే ఆమె గుర్తుండడానికి సోనాలి1 లాంటిది వాడినట్టు గుర్తు. ఇప్పుడు ఆమె, నా యాహూ ఖాతా రెండూ పదవీవిరమణ చేశాయ్. ఇప్పుడు దాన్ని వాడితే ఎలా ఉంటుంది? ఆచరణలో పెట్టాను.

"ఒరే! సంకేతపదంలో ప్రత్యేక చిహ్నం లేకుంటే ఒప్పుకోను" సందేశం, బేక్ గ్రవుండ్ లో తొడకొట్టిన సవుండూ వినిపించాయ్.

అప్పుడు సన్నగా వెన్నెముక క్రింది భాగాన చల్లటి అనుభూతి. చిన్న వణుకు.

తొడకొట్టిన సౌండు విన్నప్పుడల్లా నా హృదయం బలహీనమవుతుంది. ఎందుకంటే అదేదో సినిమాలో హీరో తొడకొట్టగానే కుర్చీ తనంతట తాను జరుక్కుంటూ హీరో దగ్గరకు వెళ్ళిపోతుంది.

అలా కుర్చీలు జరగటం గతితార్కిక భౌతికవాదులు, హేతువాదులూ నమ్మరు. నేను కేవలం అవకాశవాదిని కాబట్టి దేన్నైనా నమ్ముతాను. ఇప్పుడు నా కుర్చీ కూడా జరుగుకుంటూ నాతో సహా ఐటీ డిపార్ట్ మెంటు కు వెళ్ళిపోతే?. అలా వెళితే ఆ "ట్రావెల్" ను ఎంజాయ్ చేయడానికి ఇబ్బందేమీ లేదు కానీ ఐటీ వాళ్ళది రెండో అంతస్తు., నేనున్నది ఐదవది. ఐటీ మేనేజర్ మంత్రశక్తిని కుర్చీ అపార్థం చేసుకుంటే మెట్లపైనుండి నేను క్రిందపడతాను.అంత రిస్కు చేయలేను.

అందుకని మరింత దీక్షగా ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరింది F1 గంటును ..సారీ... బొత్తామును నొక్కాను. అక్కడ సంకేతపదం మార్చడానికి నియమాలు వ్రాసి ఉన్నాయి.

1. సంకేతపదం లో కనీసం ఎనిమిది అక్షరాలు ఉండాలి.
2. కనీసం ఒక పెద్ద అక్షరం, ఒక చిన్న అక్షరం, ఒక అంకె, ఒక చిహ్నం ఉండాలి.
3. వరుసగా అంకెలు రాకూడదు.
4. వరుసగా అక్షరాలు రాకూడదు.
5. ఒకే అక్షరం లేదా అంకె తిరిగి తిరిగి రాకూడదు.
6. మీ సంకేతం మీ జీవితం లో ఎప్పుడూ ఉపయోగించనిదై ఉండాలి. ఒకవేళ పాతది కనుక్కోలేరు అనుకుని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది.
7. టంకించే ముందు కాళ్ళు కడుక్కుని వచ్చి ఉండాలి.
...
...
ఇలా అనేక సూచనలు పొందుపర్చబడి ఉన్నాయ్.

ఒక పదిహేను ఇరవై విఫల ప్రయత్నాల తర్వాత ఒక భయంకరమైన పాస్ వర్డ్ నిర్ణయించాను. అది ఎలానూ గుర్తుండి ఛావదు కాబట్టి దాన్ని మొబైల్ ఫోను లోనూ, పర్సులో ఉన్న ఒక పుస్తకం లోనూ రాసి పెట్టుకున్నాను.

అయితే అది అంతం కాదు ఆరంభం మాత్రమే. మరుసటి రోజు మా సంస్థ అంతఃజాలం (intranet) సంకేతపదం కూర్చటానికి మరో యజ్ఞం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత మరొకదానికి. ఇలా సమస్య తీవ్రతరమయ్యేటప్పటికి ఒక బ్రహ్మాండమైన మీటింగు పెట్టి సమస్యను చర్చించారు అందరూ.

చివరికి కనుక్కున పరిష్కారం ఇది.
- ప్రతి ఉద్యోగికి రెండు యంత్రాలుంటాయి. మొదటి దానిలో సురక్షిత వ్యవస్థ ఉంటుంది. మరొకటి సాధారణమైనది. రోజు సాదా యంత్రంలో పని చేసి రోజు చివరన, వ్యవస్థీకృతమైన యంత్రంలోకి డేటాను తర్జుమా చేస్తారు.

ఇలా కనుక్కున్న పరిష్కారంతో సమస్య కొలిక్కి వచ్చింది.

Wednesday, June 5, 2013

నిత్యసౌందర్యం

అనగనగా సరస్వతీదేవికి ఒక కొడుకు పుట్టాడుట. అతని పేరు కావ్యపురుషుడు. ఓ మారు సరస్వతి ఏదో దేవతల సమావేశానికి వెళుతుంటే కొడుకు - ’అమ్మా, నేను వస్తా’నని వెంటబడ్డాడుట. అప్పుడా అమ్మ ’బాబు నీవు అక్కడికి రారాదు. నేనిప్పుడే వచ్చేస్తా, నీవిక్కడే ఉండు’ అని వెళ్ళిపోయిందట. ఈ బాబుకు కోపం వచ్చి తామున్న హిమాలయాల దిగువన ఉన్న జంబూ ద్వీపానికి బయలు దేరాడట. అతణ్ణి చూసి, స్నేహితుడైన కుమారస్వామి కూడా కెవ్వున ఏడుస్తూ నేనూ వెళతానని వాళ్ళ అమ్మ పార్వతి దగ్గర గొడవ చేశాడట.

అప్పుడు పార్వతి ఒక అమ్మాయిని సృష్టించి - అమ్మాయీ ఇదుగో ఆ వెళుతున్నతనే నీ భర్త. అతణ్ణి అనుసరించి వెనక్కి తీసుకురా అన్నదిట. ఆ అమ్మాయి సాహిత్యవిద్యావధువు. కావ్యపురుషుడు మొదట తూర్పు (గౌడ) దేశానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే సాహిత్యవధువు అక్కడి వాతావరణానికి అనుగుణంగా తన ఆహార్యం మార్చుకుందిట.

ఆమెను చూసిన కావ్యపురుషుడికి కోపం తగ్గక చురచురలాడాడుట.  ఆ పద్ధతి గౌడీ రీతి అని స్థిరపడింది. గౌడీరీతి అంటే - సమాసభరితంగా క్లిష్టంగా ఉంటుంది.

ఆ తర్వాత కావ్యపురుషుడు పాంచాల రాజ్యం, ఆ చుట్టు పక్కలకెళ్ళాడు. అమ్మాయి అక్కడి వాతావరణానికనుగుణంగా ఆహార్యం స్వీకరించింది. ఈ సారి అబ్బాయి మెత్తబడ్డాడు కాస్త. అమ్మాయి వంక చూస్తున్నాడు, నవ్వకపోయినా. అప్పుడతని భావాలు, మాటలు పాంచాలీ రీతిగా పేరు పొందినయ్.

ఆ తర్వాత అతను మరింత క్రిందకు వచ్చి విదర్భకు వచ్చాడు. ఈ సారి కావ్యపురుషుడు బాగా ఐసయి పోయాడు. ఇప్పుడు అతని మాటల శైలి చాలా అందంగా, సుకుమారంగా ఉంది. అతని శైలి వైదర్భి. ఇంకా ఆయన దక్షిణ సముద్రంపైన ఉన్న వేయి యోజనాలు తిరిగాడు. అలా తిరుగుతూ కేరళకూ వచ్చినాడు. అక్కడ అమ్మాయి తన ఆహార్యం, వస్త్రమూ ఇలా చేసుకుందిట.

ఆమూలతో వలితకున్తలచారుచూడః
చూర్ణాలకప్రచయలాంఛితఫాలభాగః ||
కక్షానివేశనిబిడీకృతనీవిరేషః
వేషశ్చిరం జయతి కేరళకామినీనామ్ ||

మొదళ్ళకంటా తిప్పి కట్టిన కుంతలాలతో అందమైన ముఖం కలది, అక్కడక్కడా ముంగురులతో అలంకృతమైన ఫాలభాగం ఉన్నది, భుజం క్రింద కోకముడి బిగించి కట్టినది, అయిన కేరళ ముద్దుగుమ్మల వేషం భేషుగ్గా ఉంది!

ఇలా...
ఆమె అందంతో సాటి రాకపోయినా ఓ కందం.

కం ||

పురిసల్పి మొదల గట్టిన
నెరుల నొయారంపు మోము, నెన్నుదుట బడం
కురులు, ఎరక దిగి కోకను
నెరఁ గట్టిన కేరళ నెరి నిత్యము ముదమౌన్

నెరులు = కుంతలములు
ఎరక = భుజము

ఉహూ...మరొక ఉత్పలమాల కూడా..

ఉ||
సొమ్మగు ముంగురుల్ నొసట సోలిన మోమెలదేటి దాటులన్
బమ్మెరవోవఁ దోలు దెగబారెడు వేనలి, మూపు క్రిందుగన్
క్రొమ్ముడి, కొప్పు నందెసగు కూటపు ముత్తెములున్, సుధౌష్టము
న్నమ్మకచెల్ల ! కేరళ సునందిని నిత్యము చెన్నువొందగన్.

అందమైన ముంగురులు నుదుటన పడుతూ ఉన్న మోము,
ఎలదేటి దాటులు అంటే తుమ్మెదలు - అవి నివ్వెరపడేట్టుగా ఉన్న నిడుపాటి జడ (వేనలి = జడ), 
భుజానికి కాస్త కిందుగా కట్టిన కొత్త (రకం) కోకముడి, 
కొప్పుపైన వెలుగుతున్న ముత్యాలరాశులూ, 
అమృతం లాంటి పెదవి, 
అమ్మకచెల్ల! కేరళ అమ్మాయి నిత్యమూ అందంగా ఉండాలి (ఉంటుంది).. :) 

(ఈ పద్యం కూడా కొట్టుకొచ్చిన ఓ పెద్ద పేరడీయే ;)

ఇంతకూ కథ ఏమయిందండి అంటారా? అంత అందమైన డ్రెస్సుతో అమ్మాయి కనిపిస్తే ఐసవకుండా ఉంటాడా అబ్బాయి? సరస్వతి కొడుకూ, పార్వతి కూతురూ పెళ్ళి చేసికొని హిమాలయాల్లో కాపురం పెట్టారు. అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సూ, ఆమె హొయలూ ఈనాటికీ కేరళలో వ్యాపించి ఉన్నాయి.

అదండి కేరళ నిత్యసౌందర్య కథ.

Monday, January 7, 2013

జంతు ప్రపంచం


ఆర్నెల్ల క్రితం హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయింది నాకు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు ఒక వినూత్నమైన, అద్భుతమైన సత్యం నాకు తెలిసింది. బెంగళూర్ లో లాగా వీధికి కనీసం పదికుక్కల చొప్పున లేవు. బహుశా నాగార్జున వాళ్ళావిడ అమల ఆ మధ్య శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ లో తలమునకలై కుక్కల బాధ్యతను విస్మరించినట్టుంది.

బెంగళూరులో వీధిలో ఒక రాయి విసిరితే, అది - అయితే సాఫ్టు వేర్ వాడికి లేదా కుక్కకు తగులుద్ది అని ఒక సూక్తి. అదొక భయంకరమైన నిజం.

బెంగళూరు లో మొరుగేశ్ పాళ్యలో, ఉన్న భయానకమైన రోజులు మర్చిపోలేను. చీకటి వేళల్లో పిల్లిలాగా, శబ్దం చేయకుండా నడవడం ప్రాక్టీసు చేసి అందులో నిష్ణాతుణ్ణయినా, గుండెలు పీచుమనేవి. మా ఇంటి గేటు దగ్గర ఆఖరు గండం ఉండేది. ఆ చివరి మజిలీ దాటి, ప్రపంచాన్ని జయించినట్లు ఫీలయిన సందర్భాలెన్నో. ఆ బాధలు అలా పడీ ఓ రోజు దేవుడిని ప్రార్థించాను.

దేవుడా,
ఎక్కడ వీధికి పదికుక్కలు లేవో
ఎక్కడ రాత్రుళ్ళు ప్రశాంతంగా గడుస్తుందో
ఆ ఊరికి నన్ను తరిమేసెయ్

ఆ ప్రార్థన ఫలించినట్టుంది. భాగ్యనగరంలో నేను ఆద్దెకున్న వీధిలో మూడు కుక్కలే ఉన్నాయి. అవి కూడా మొరగటం లేదు.

ఇలా ఆనందదాయకమైన ప్రపంచంలో ఉంటూ - ఓ సాయంత్రం సూపర్ బజార్ నుండి సరుకులు తెస్తుండగా - ఒక కుక్క ’భవాన్ భిక్షాం దేహి’ అని వెనుక పడింది. యే మాత్రం మొరగకుండా అహింసాపద్ధతిలో భిక్ష అడిగిన ఆ సాత్విక శునకాన్ని చూసి నా హృదయం స్పందించింది. (నా చొక్కా పై జేబులో సెల్ ఫోను ఉంటుంది). ఒక బిస్కట్ ముక్క విసిరాను.

అదే నేను చేసిన తప్పు.

ఆ శునకం కేవలం క్రీమ్ బిస్కట్లనే తింటుందని, ఆ నియమం ఉంది కనుకనే తుచ్ఛమైన ఇతర బిస్కట్ల జోలికి పోదని నాకు అప్పుడు తెలియలేదు. మరుసటి రోజు యథావిధిగా మరోసారి సూపర్ బజార్ నుండి వస్తుంటే - ఆ శునకం దగ్గరకొచ్చింది. ఈ సారి నేను కాస్త బెట్టు చేశాను. ఆ కుక్క నన్ను చూసి స్వల్పంగా ’గుర్’ మన్న హలోట్యూను చేసి చుట్టూ చూసింది.

అర్థమయ్యింది నాకు. అదొక పెద్ద ఇంటలెక్చువల్ కుక్క. దాని సంకేతానికి అర్థం - క్రీమ్ బిస్కట్ ఇస్తావా లేక దూరంగా కుతూహలంగా చూస్తున్న శునకరాజాలను పిలవమంటావా? అని. ఆ బలహీనమైన క్షణంలో నేను ఆ శునకానికి లొంగిపోయాను.

అదే నేను చేసిన రెండవ తప్పు.

అలా ఆ ఇంటలెక్చువల్ కుక్క నన్ను మానసికంగా లోబర్చుకుంది. ప్రతిదినం సాయంత్రం ఇంటికి వచ్చే ముందు క్రీమ్ బిస్కట్ల కోసం షాపింగుకు వెళ్ళటం ఆనవాయితీ అయింది నాకు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే - ఇల్లు మారాలి. తప్పదు.

అలా ఇల్లు మారేను.

ఇప్పుడు ఉన్నది కొత్త ఇల్లు. ఇక్కడ కుక్కలు లేవు కానీ కొన్ని రోజులకు ముందు - పొద్దునే ఆఫీసుకు తగలడుతుంటే ఇంటి బయట ఒక నల్లని జీవి కనబడింది. ఆ జీవిని మార్జాలంగా నా మెదడు గుర్తించింది. పిల్లుల గురించి నాకొక ఫ్లాష్ బ్యాక్ ఉంది.

*********************************

ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో - నేను ఒక చిన్న సైజు అభ్యుదయవాదిని.

మా ఇంటిలో ఎలుకల బాధ అధికం. ప్రతిరోజూ బోనులో కనీసం ఎనిమిది ఎలుకలైనా పడేవి. ఆ ఎలుకలను చూసి పొద్దునే మా ఇంటిదగ్గర పిల్లులు క్యూ కట్టేవి. వాటి ముఖం చూస్తే దరిద్రమని మా అమ్మా నాన్న విసుక్కునే వారు. వారిని నా అభ్యుదయవాద దృక్పథం సైలెంటుగా ఖండించేది. (సౌండుతో ఖండిస్తే పాకెట్ మనీ రాదు. అందుకే సైలెంట్ ఖండన). అది ఎంతవరకు వెళ్ళిందంటే కావాలని పనిగట్టుకుని ఫ్రెండ్ సహాయంతో పిల్లిని నా దారికి అడ్డం పరిగెత్తించి ఇంటర్మీడియట్ ఆంగ్ల పరీక్షకు అటెండ్ అయాను. ఆ పరీక్షలో పాస్ అయి మా నాన్నకు అభ్యుదయ వాదం పవర్ చెప్పి వివరించాను. (ఇంటర్మీడియట్ లో నాకు అన్నిటికన్నా తక్కువ మార్కులు ఇంగ్లీషులో వచ్చాయి. ఆ మాట అప్రస్తుతం కాబట్టి చెప్పట్లేదు)

*********************************

ఇంత తీవ్రమైన అభ్యుదయవాదిని నన్ను పిల్లులేమి చేయగలవు అని ఆ రోజు ఆఫీసుకు ధైర్యంగా తగలడ్డాను. మా ఆఫీసు - ఎల్లవేళలా రక్తచరిత్ర సినిమాకు భాష్యంలాగా ఉంటుంది. ప్రాజెక్టుకు ముందే డెడ్లైన్లు, విపరీతమైన నస, బూతులు సర్వసాధారణం. కొన్ని రోజులుగా అలా లేదు. అయితే పిల్లి కనబడ్డ మొదటి రోజు సాయంత్రం ఉన్నట్టుండి భయంకరమైన పని మొదలయ్యింది. రక్తం మరిగించే టెన్షన్.

తర్వాత రెండు రోజుల తర్వాత ఆ నల్లని పిల్లి - నన్ను చూసి స్మయిలిచ్చింది. ఆ రోజు ఆఫీసులో రుధిరం చిమ్మింది. నరాలు చిట్లిపోయే టెన్షన్. ఇండియా - పాకిస్తాను వరల్డ్ కప్ మాచ్ లోనూ అంత టెన్షన్ ఉండదు.

ఇలా ఆ పిల్లి కనబడ్డం, ఆఫీసులో రక్తం చిమ్మటం వరుసగా జరిగేసరికి నా అభ్యుదయ వాదం బీటలు వారింది. ఇప్పుడు నేను ఆ పిల్లికి కనబడకుండా వీరప్పన్ లా తప్పించుకుని తిరుగుతున్నాను. ఈ ఏరియాకు ’మియాపూర్’ అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడిప్పుడే తెలుస్తూంది.

పిల్లులు, కుక్కలు, దోమలు లేని కొత్త చోటికి ఇల్లు మారాలి. మ్యాజిక్ బ్రిక్స్ అన్న వెబ్ సైట్ లో ఇలా పిల్లులు, కుక్కలు లేని చోట ఇల్లు అద్దెకు కావాలని ప్రకటిద్దామంటే - ఆ సదుపాయం లేదట.

నా ప్రస్తుతసమస్య ఎలా గట్టెక్కుతుందో దీర్ఘంగా ఆలోచిస్తున్నాను.

Tuesday, July 10, 2012

తామరశ్రీ మోసరి రామాయణరావు ధిషణా హేల

రామాయణరావు వ్యక్తి కాదు సుత్తి. అవును. మీరు సరిగ్గానే చదివారు. రామాయణరావు ఒక మహాసుత్తి. ఆ సుత్తి తాలూకు ప్రస్థానమే ఈ కథనం.

ఒక వ్యక్తి కి ఎన్ని పార్శ్వాలుంటాయి? సాధారణంగా రెండు. రామాయణరావులో అనేక పార్శ్వాలున్నాయి.
ఒక పత్రికాధిపతి
ఒక నటుడు
ఒక దర్శకుడు
ఒక నిర్మాత
ఒక పాటల రచయిత
ఒక మాటల రచయిత
ఒక రాజకీయనాయకుడు
ఇన్ని పార్శ్వాలను పూర్తిగా ఖర్చుపెట్టే సరికి సారం అంతా పోయి, అతడు నాలుగేళ్ళు వరుసగా బ్లాగులు రాసేసిన తెలుగు బ్లాగర్ లా నిస్సారంగా తయారయ్యాడు. ప్రేక్షకులకు అతని సంగతి తెలిసి, అతని సినిమాలు ఎప్పుడో చూడ్డం మానేశారు. ఇక మిగిలిన పార్శ్వాలూ అరిగిపోయాయి. దాంతో అతని పైశాచికత్వం బయటపడింది. చలనచిత్ర సీమలో ఎక్కడ మీటింగు జరిగితే అక్కడ దాపురించి, శ్రోతల మెదళ్ళను కబళించడం అతనికి కొంతకాలంగా అలవడిన రాక్షసవిద్య. ఇది ఎప్పుడు అంతమవుతుందో తెలుగు టీవీ ప్రేక్షకులు, శ్రోతలు దీనికి ఎన్ని త్యాగాలు చెయ్యాలో అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.

**********************************************************

అది 1980 వ దశాబ్దం. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే - హీరో తాలూకు ఫ్యామిలీ ని విలన్ చంపడం, విలన్ ముసలి వాడై, ఇంకో రెండు రోజుల్లో వాడంతట వాడే ఛస్తాడనగా హీరో అతనిపై పగ సాధించడం - అని మాత్రమే తెలిసిన ఒక అమాయకమైన కాలం.

ఆ కాలంలో రామాయణరావు దర్శకుడిలా మారాడు. క్లీనర్ రాముడు, సర్కార్ పేష్వారాయుడు, బొబ్బిలిభల్లూకం, కామాభిషేకం, దాహసందేశం, శ్రీవారి కుంపట్లు వంటి చిత్రాలతో తెలుగు తెరపై ఒక మాయాజాలాన్ని సృష్టించాడు. అతడికి రె. కాఘవేంద్రరావు పోటీ. కాఘవేంద్రరావు కంటే ముందే ఈతను దర్శకరాట్న అనిపించుకున్నాడు.

ఇలా దర్శకరాట్న గా మారి తన రాట్నం తిప్పసాగాడు రామాయణ్. కాలక్రమంలో అతనికోసం అతని వెనుక పనిచేసిన పిశాచులకు (ఘోస్టులు) మోక్షం కలిగి దిక్కులకొక్కరుగా వెళ్ళిపోయి ఇతణ్ణి ఒంటరివాణ్ణి చేశారు. రామాయణ్ నిరాశ చెందలేదు. 

తరువాతి తరం వచ్చింది. దర్శకరాట్న కు సరికొత్త ఛాలెంజ్.

నటబ్రహ్మాండ కొడుకు సర్పార్జున తెలుగుపరిశ్రమలో అడుగుపెట్టి కొన్నేళ్లే అయింది. సర్పార్జున కళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది. అవి దైన్యాన్ని తప్ప మరోభావాన్ని పలికించవు. ఆ విషయం గ్రహించాడు దర్శకరాట్న. అతనితో గుజ్ను అనే కళాఖండాన్ని తీశాడు. అలాగే మురుగెశ్ తో కొన్ని సినిమాలు తీశాడు. శిశుకృష్ణ తోనూ కొన్ని సినిమాలు తీశాడు. ఇలా ఒక్కొక్కరినీ తన రాట్నానికి బలి చేస్తూ తన అద్భుత ప్రతిభతో రిచంజీవి తో సింహళేశ్వరుడు సినిమా తీశాడు. ఆ సినిమా ఆంధ్రదేశంలో స్కైలాబ్ లా పడింది. ప్రేక్షకులు విలవిలలాడిపోయారు. ఆ సినిమాలో - చెల్లెలు చచ్చిపోతే హీరో బ్రేక్ డేన్సు చేసినట్టు చూపడం దర్శకరాట్న ప్రతిభాపైశాచికత్వానికి పరాకాష్ట. తర్వాత ఒక సభలో మాట్లాడుతూ దర్శకరాట్న ఒక అపూర్వమైన విషయం చెప్పాడు. "రిచంజీవి సినిమాలో కథ ఉండరాదు. నేను ఈ సినిమాలో మంచి కథ చెప్పాను. అదే జరిగిన పొఱబాటుకు కారణం".

ఇతని దెబ్బ కాచుకోవడానికి, ఇతణ్ణి పడగొట్టడానికి పథకానికి బీజాలు పడినయ్.

**********************************************************

1990 దశాబ్దం మొదట్లో, అప్పట్లో తెలుగు సినిమా నటుల్లో ప్రముఖులు సర్పార్జున, గిగాస్టార్ రిచంజీవి, దగ్గుబాటి మురుగేశ్, శిశుకృష్ణ తదితరులు ఒక చోట చేరారు. ఆ సమావేశం అజెండా రామాయణరావును ఎదుర్కోవడం ఎలా?

సమావేశం ఆరంభిస్తూ మురుగేశ్ చెప్పాడు. మురుగేశ్ , సర్పార్జున అప్పుడప్పుడే తెలుగులో వత్తులు నేర్చుకుని చిత్రపరిశ్రమలో పైకొస్తున్నారు. కాబట్టి వారి మాటల్లో వత్తులు పలుకవు. శిశుకృష్ణకు ఆవేశం ఎక్కువ. ఒక పదం పూర్తి చెయ్యకముందే మరో పదానికి పరుగులు తీయిస్తుంది ఆ ఆవేశం. అంచేత మాటల్లో చివర్లు సరిగ్గా ఉండవు.

"సబ్యులందర్కీ నమస్కారం.  ఇవ్వాళ మనం ఇక్కడ కలుసుకున్నది రామాయణరావును ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై ఒక తీర్మానానికి రావడానికి. ఈ విషయంపై ఒక స్ట్రాటెజీని మనం తయారు చేసుకోవాలని నా ఆకాంచ". చెప్పాడు మురుగేశ్.

"రామాయణరావు మనపాలిట శాపంగా మారాడు. ఎప్పుడు సినిమా తీస్తానంటాడో తెలీదు. వద్దు అందామంటే మొహమాటం. మొన్న సింహళేశ్వరుడు సినిమా తీసి నా పరువు తీశాడు." - వాపోయాడు రిచంజీవి.

"నాకూ అంతే. గుజ్ను సినిమా తీశాడు. అది హిట్ అయినప్పటి నుండి ఇంకో సినిమా తీస్తానని వెంట బడుతున్నాడు. ఇప్పుడు నాకు వతులు వచ్చేశాయి. అతనితో నేనెందుకు సినిమా తీయాలో నాకర్దం కావట్లేదు" - చెప్పాడు సర్పార్జున. సర్పార్జున కంఠం పాము బుసకొట్టినట్టు ఉంది.

"అహ, అతణ్ణి ఎదుర్కోవాలంటే మనం అతణ్ణి ఉబ్బేయాలి. అదే చక్కగా పనిచేస్తుంది." - శిశు కృష్ణ చెప్పాడు.

చివరికి శిశుకృష్ణ చెప్పిన దానితో అందరూ ఏకీభవించారు. అతణ్ణి ప్రతి సమావేశానికి పిలవాలి. ప్రతి పత్రికలోనూ పొగడాలి. అతడు సినిమా తీస్తానంటే మీరు ఆస్కార్ స్థాయి దర్శకులని, మాకు ఆ స్థాయి లేదని తప్పించుకోవాలి.

**********************************************************

ఆ కుట్ర చక్కగా పనిచేసింది. రామాయణరావు పీడను చిత్రపరిశ్రమ అగ్రనటులు అలా సమర్థంగా ఎదుర్కున్నారు. దర్శకరాట్న తన ప్రయత్నాలు మానలేదు. మొన్నతరం నటి భాగమతితోనూ, నిన్నటితరం అపజయశాంతి తోనూ సినిమాలు తీశాడు. ఆ పైన తన సుపుత్త్రుణ్ణి వెండితెరకు పరిచయం చేస్తూ సినిమా తీసి, తను కూర్చున్న కొమ్మను తనే విరుగగొట్టుకున్నాడు.

రామాయణరావుకు ఆఖరుగా హిట్ వచ్చిన చిత్రం ’ఏమేవ్ నారాయణమ్మ".

ఆ తర్వాత అతడు సినిమాకళాకారుల సంఘానికి అధ్యక్షుడయాడు. కానివ్వకపోతే అతడితో సినిమా తీస్తానని వెంటబడతాడని అందరి భయం. ఆ తర్వాత సినిమా ఫంక్షన్ లలో ప్రసంగాలు ఇవ్వడం రామాయణరావుకు అలవాటుగా మారింది. ప్రతి సినిమా ఫంక్షన్ కూ హాజరై తన పురాణం వినిపిస్తూ శ్రోతల్లో గుండెల్లో నిద్రపోవడం అతనికి కొత్తగా అలవడిన విద్య.సంచలనాలు అన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి కాబట్టి అప్పుడప్పుడూ ఈయన తన మాటలతో సంచలనం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మధ్య ఎన్నో యేళ్ల తర్వాత శిశుకృష్ణతో సినిమా తీశాడు. ఆ సినిమాకు తుస్కార్ అవార్డు వస్తుందన్న స్థాయిలో రామాయణరావు ఆశపడ్డాడు. పరిశ్రమవర్గాలూ ఆ మాటే అన్నాయి (అనకపోతే జరిగేది తెలుసు కాబట్టి).

ప్రస్తుతం .... రామాయణ రావు సినిమా ఫంక్షన్ లలో స్పీచులిస్తూ ప్రశాంతంగా ప్రజల గుండెల్లో నిద్రపోతున్నాడు. ఇతడివి 140 సినిమాలయాయి. మరో తొమ్మిది సినిమాల వరకూ టైముంది. ఆ తర్వాత తన 150 వ చిత్రం ఎవరితో తీయబోతాడో! అప్పుడు సునామీలా ఎవరిమీద విరుచుకుపడనున్నాడో దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Wednesday, June 13, 2012

చివరికి మోహన్ బాబే గెలిచాడు!


పాడుతా తీయగా చల్లగా కార్యక్రమం అంటే ఒకప్పుడు ఎంతో ఆసక్తి నాకు. చాలా రోజుల తర్వాత ఈ మధ్య మళ్ళీ చూడ్డం తటస్థించింది.

ఇదివరకు బాలు పిల్లకాయల మీద కాస్త అతిగా కామెంటేవాడనుకుంటా. ఈ మధ్య కాస్త తగ్గించాడు. సరే బావుంది లెమ్మని తర్వాత ఎపిసోడ్లు చూడ్డం కొనసాగించాను. క్వార్టర్ ఫైనల్, సెమి ఫైనల్ లలో నేను చూసిన ఎపిసోడ్ లలో బాలు తో బాటు మరో ఇద్దరు ప్రముఖులు వచ్చారు. ఒకాయన తి.తి,దే ఆస్థాన విద్వాంసులు, మరొకరు ద్వారం వెంకటస్వామినాయుడు గారి మనవరాలు, మరొకామె మల్లీశ్వరి సినిమాలో ఒక నటి, సింగర్, ఇదివరకు ఇదే కార్యక్రమంలో విజేత. చాలా చక్కటి జడ్జెస్ వచ్చారు కదా అని అనుకున్నాను. ఇక ఫైనల్స్!

********************************************************************************

ఫైనల్స్ లో - బాలు ఆనాటి గెస్ట్ గురించి చెప్పాడు. నా హృదయం ఏదో కీడును శంకించింది. ఎడమ కన్ను తనపని తను చేసుకుపోయింది. ఆ నేపథ్యంలో స్టేజ్ మీదకు ఒకనాటి ఎమ్జీయార్ టోపీ ధరించి ఒక ’సెలెబ్రిటీ’ ...కాదు కాదు..లెజెండ్ అడుగుపెట్టాడు. బాలు గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఆ టెన్షన్ తన మాటల్లో ప్రతిఫలించింది. "ఈ నాటి మన గెస్టు కళాప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారు. మోహన్ బాబుకు నాకు 1975 నుండీ పరిచయం. తను సినిమారంగానికి వచ్చిన మొదటి రోజు నుండి నాకు తెలుసు. ఈ రోజు వారి పక్కన కూర్చుని నా బాధ్యత నిర్వర్తించడం ఎలానో తెలియట్లేదు! ఇదొక విషమ పరీక్ష నాకు. అతణ్ణి వేదిక మీదకు సగౌరవంగా తనను ఆహ్వానిస్తున్నాను." (చివరి మాట అంటున్నప్పుడు బాలు గొంతు దుఃఖంతో పూడుకు పోయింది)

మోహన్ బాబు గారు వచ్చారు. బాలును గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత తన సీటు దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

అభ్యర్థులకు కూడా ఫైనల్స్ లో మంచి పాటలు, మంచి సంగీతం కన్నా కూడా మోహన్ బాబును ఎలా మెప్పించాలన్న ధ్యాస మొదలైన క్షణమది.

మొదటి అభ్యర్థి వేదిక మీదకు పిలువబడ్డాడు. అతను ఎంచుకున్న పాట - "పుణ్యభూమి నా దేశం నమోనమామి". చాలా గంభీరంగా, పాడాడు, పాట మధ్యలో వచ్చే "ఒరే తెల్లకుక్కా, ఎందుకు కట్టాలిరా శిస్తు..." వంటివి ఎంతో గంభీరంగా మాట్లాడాడు, చివరకు ముగించాడు.

అవతల మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయాడు. తను సినిమా రంగంలో కూడు లేక పడుకున్న రాత్రుల దగ్గర్నుంచి ఈ పాట వరకూ తన జీవిత చరిత్రను లక్షలాది ప్రజలకు వినిపించాడు. అతని మనసులో ఇంత చేసినా తను లెజెండ్ కాకుండా సెలబ్రిటీ గా మిగిలిపోయాడన్న బాధ సుళ్ళు తిరుగుతూ ఉండాలి! ఆ పాటను బాలు తప్ప మరెవరూ అంత బాగా పాడలేరన్నాడు. ఇవతల అభ్యర్థి అయిన పిల్లవాడి ముఖంలో అయోమయం, బాధ! అతను కనీసం సెలబ్రిటీ అయినా అయాడు, నా పాట గురించి కనీసం ఒకమాట మాట్లాడలేదే అని ఆ అబ్బాయి పాపం పరితపించాడు. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణాన్ని చల్లబరిచే కొండంత బాధ్యతను బాలు తన భుజాలపై మోశాడు. కాసేపు మోహన్ బాబును ఇమిటేట్ చేశాడు.  తమ అనుబంధం, మిత్రత్వం గురించి చెప్పాడు. అతడి గొంతును అనుకరించి జనాలను ఆహ్లాదపరిచాడు. మోహన్ బాబు తనకు వంద రూపాయలు బాకీ అని చెప్పాడు. మండుతున్న మోహన్ బాబు గుండెలో పన్నీరు చల్లాడు. చివరకు అతణ్ణి ఎలాగో జనజీవనస్రవంతిలోకి ఈడ్చుకుని వచ్చాడు.

ప్రోగ్రాములో కమర్షియల్ బ్రేక్ వచ్చింది. దాదాపు ముప్ఫై వాణిజ్య ప్రకటనల తర్వాత తిరిగి ప్రోగ్రాం మొదలయ్యింది. "ముద్దబంతి పువ్వులో మూగ బాసలు.." ఈ పాట పాడాడు అభ్యర్థి. పాట ముగిసింది. మోహన్ బాబు మరో సారి తన పురాణం వినిపించాడు. ఈ పాట వెనుక కృషి, తన నిద్రలేని రాత్రులు, రె. కాఘవేంద్రరావు తనను మెచ్చుకోవడం, తను అప్పుల్లో మునిగి ఉండడం వంటివి శ్రోతలు అందరికి స్ఫూర్తిదాయకమైన రీతిలో చెప్పాడు. అభ్యర్థికి సలహా ఇస్తూ, "నవ్వుతూ పాడాల"న్నాడు.

"ఏదీ నవ్వుతూ ఓ ముక్క పాడు చూద్దాం!" అన్నాడు. ఆ అభ్యర్థి పాపం - నవ్వలేక ఏడుస్తూ పాడాడు. నవ్వితే పాటెలా వస్తుంది? నవ్వడమైనా ఉండాలి, లేదా పాడ్డమైన ఉండాలి. రెండూ కలిపితే పులుసులోకి ఆముదపునూనెతో తిరగమోత పెట్టినట్టుంది. అయినా సరే అభ్యర్థి గుండె చిక్కబట్టుకుని తన పని నిర్వహించాడు.

మళ్ళీ కమర్షియల్ బ్రేకు!

ఆ తర్వాత మూడో అభ్యర్థిని ఏదో పాట పాడింది. మోహన్ బాబు తిరిగి విజృంభించాడు. బాలు తనకన్నా పెద్దవాడెలాగన్నాడు? తన తండ్రి వయసు 94 యేళ్ళు అన్న విశేషాలు, తను ఎప్పుడు చిత్రరంగంలో అడుగుపెట్టాడు అన్న విషయమూ చెప్పాడు. మధ్యలో బాలు అతణ్ణి చల్లబరచాలని, తను మోహన్ బాబుకన్నా తక్కువ వయసు వాడన్నాడు. మోహన్ బాబుకు కోపం + అనుమానం వచ్చాయి. కొంపదీసి బాలు తనని లెజెండ్ కాదని శంకిస్తున్నాడా? బాలు మీద అనుమానంతో ఆ అమ్మాయిని ఓ  ప్రశ్న అడిగాడు.

"అమ్మాయ్, నువ్వు చెప్పు! నేను నా సినిమాలో ఛాన్సిస్తా! బాలు పెద్దవాడా? నేనా?" ఆ అమ్మాయి జడ్జులిద్దరిలో ఎవరిని అంటే ఏమౌతుందోనని భయపడింది. ఏం చెప్పాలో తెలియలేదంది. అదే ఆ పాప పాలిట శాపమౌతుందని ఆ క్షణాన ఆ అమ్మాయికి తెలీదు!

చివర్న - చివరి అభ్యర్థి - పాటపాడింది. ఈ సారి మోహన్ బాబు కు బాలు ఏం చెప్పాడో తెలీదు. కాస్త తొందరగానే వదిలాడు.

********************************************************************************

ఒక రోజులో ముగించాల్సిన పని మరోవారానికి వాయిదా పడింది. మరో ఎపిసోడు మొదలయ్యింది.

********************************************************************************

ఈ సారి మొదటి అభ్యర్థి - మోహన్ బాబును గాలికి వదిలేశాడు. అతణ్ణి ఇంప్రెస్ చేయడానికి కాకుండా నిజంగానే గొప్పపాట అయిన "శివశంకరీ, శివానంద లహరి" ని చక్కగా పాడాడు. మోహన్ బాబు గుండెలో కోటి వీణలు మోగాయి. అన్న పాట పాడినందుకు ఆ అభ్యర్థిని అభినందించాడు. బాలు మాత్రం ఈ సారి ఆ అబ్బాయి పాటలో కాసిన్ని తప్పులేరాడు. బాలు బాధ ఏమంటే - తను మాట్లాడకపోతే మోహన్ బాబుకు శ్రోతగా మారే ప్రమాదం ఉంది. అంచేత ఈ సారి స్ట్రాటెజికల్ గా ప్లాను వేసి తనే లీడ్ తీసుకున్నాడు. బాలు ప్రయత్నం వృథా పోలేదు. మోహన్ బాబును తన జీవిత చరిత్ర ఒక ఎపిసోడు పాటు చెప్పకుండా నిరోధించడంలో అతను 70 శాతం కృతకృత్యుడయ్యాడనే చెప్పాలి.

రెండవ అభ్యర్థి. ’రసిక రాజ తగువారము కామా’ పాట పాడాడు. అద్భుతంగా పాడాడనే చెప్పాలి. కానీ రసికులెవరక్కడ! పిల్లవాడికి కూడా పాడడానికి ’లెజెండ్ రాజ తగువారము కామా’ అనే పాటలేదుగా మరి! అయినా పాటెవడిక్కావాలి? ఎప్పుడు పాట ముగుస్తుందా, తన జీవిత చరిత్ర మొదలెడదామా అని మోహన్ బాబు! అతణ్ణెలా కంట్రోలు చెయ్యాలా అని బాలు! ఎలాగో పాట ముగిసింది. అయితే ఎలాగో మోహన్ బాబు తన శక్తి మొత్తం కూడగట్టుకుని తన జీవిత చరిత్ర చెప్పకుండా ఆవేశాన్ని అణచుకున్నాడు.

మూడవ అభ్యర్థిని - పాపం ముందు ఎపిసోడ్ లో మోహన్ బాబు అడిగిన ధర్మసందేహం దెబ్బకు ఆమె ఇంకా కోలుకోలేదు. అంచేత చిన్న పొఱబాటు చేసింది. (అందుకు తగిన మూల్యమూ ఆ అమ్మాయి చెల్లించింది) జానకి పాడిన "నీలీల పాడెద దేవా" మొదలెట్టింది. (ఆ ’లీల’ ఎవరిదో దేవుడికే తెలియాలి). ఆ పాట మధ్యలో వచ్చే సంగీతం బిట్లు కాస్త తప్పుగా పాడింది. పాట ముగిసింది. అంతే! మోహన్ బాబుకు బాల్యం గుర్తొచ్చింది. తను వాళ్ళ గురువు గారు చెప్పిన సంస్కృత శ్లోకాన్ని ఎలా భట్టీ పట్టారో చెప్పాడు. అటుపై తన తండ్రికున్న మూడెకరాల పొలం, కష్టాలు, తనకు పెళ్ళి లేటవడం ...వగైరా విషయాలు చెప్పాడు. చివర్న పాట పాడిన అమ్మాయి ’ఏదో’ పొఱబాటు చేసినట్టు తన లెజెండ్రీ బుద్ధికి తోస్తున్నట్టు నొక్కి వక్కాణించాడు.

బాలు ఆ మిగిలిన దాన్ని పూరించాడు. ( ఈ సారి బాలు మోహన్ బాబును ఒక ఎపిసోడ్ అనుభవంతో బాగా ఎదుర్కున్నాడు. మోహన్ బాబుతో తన మిత్రత్వం గురించి చెప్పాడు) ఆ అమ్మాయి తప్పు చూపించాడు.

చివరి అమ్మాయి - అప్పటికే ఈ పోరాటంలో బాలు, మోహన్ బాబులు అలసి పోయారు. ఆ అమ్మాయి పాలిట అది వరమయ్యింది. స్వతహాగానే అందమైన గొంతున్న అమ్మాయి చక్కగా పాడింది. ఆ అమ్మాయి పాట ముగిసింది.

ప్రథమ బహుమతి ఆ చివరి అమ్మాయికే వచ్చింది. ఆ అమ్మాయి సంతోషించింది. ప్రోగ్రామును (బాబును) ఎలానో వదల్చుకున్నందుకు బాలు ఆనందపడ్డాడు.

*********************************************************

ఈ కార్యక్రమంలో నిజమైన విజేత ఎవరు???? ఇది తెలిసీ చెప్పకపోతే అతడికి మోహన్ బాబు జీవిత చరిత్ర కాసెట్ వందసార్లు చూసే అవకాశం వస్తుంది.

అవును మీరు కరెక్టే. తనే విజేత. ఇది మోహన్ బాబు లెజెండ్ అన్నంత పచ్చి నిజం.

Tuesday, March 27, 2012

భోజనప్రలాపం

...అనే తిండిగోలను చాలకాలం తర్వాత నా బ్లాగులో చెప్పుకోవాలనిపించి రాస్తున్నాను.

దీనికి శ్రీకారం చుట్టించినాయన శ్రీనాథుడు. అవును. ఈ మధ్య శ్రీనాథ కవిసార్వభౌమ అనే ఎన్టీవోడి సినిమా డీవీడీ లో చూశాను. సినిమా గురించి నా అభిప్రాయం చెప్పను కానీ, అందులో శ్రీనాథుడు తిండిపై కూసిన పద్యాలు విన్న తర్వాత నా చెవులలో చిమ్మిరేగింది.

నేటి సారస్వతవిమర్శకులు కవిహృదయం ఎఱుగకుండా సాహిత్యం మీద విమర్శించిన రీతిలో - ఎంతసేపూ జొన్నన్నం మీద నోరు చేసుకునేకే సరిపోయింది కానీ అసలు జొన్నలలో స్వారస్యం కనుక్కుందామనే ఆలోచన ఆయనకు లేకుండా పోయింది.

శ్రీ కృష్ణుడా, పూతన చన్నులచేదు తాగినాను, దవాగ్ని మింగినాను అని చెప్పబాకు, ఉడుకు చింతాకు బచ్చలి కూర జొన్నకూటితో ఒక ముద్ద తినిచూడు నీ పస కనిపిస్తుంది - అట.

బహుశా ఆయనకు జొన్నన్నమో, జొన్నరొట్టో చేసిపెట్టినావిడ మెత్తగా చేసి ఉండదు. అంతే తప్ప జొన్నరొట్టె, చింతచివురు పప్పు ఒకసారి మా సీమకొచ్చి తిని చూడు అని స్వర్గానికి వినిపించేలా చెప్పాలనిపించింది.

చెల్లవు, సార్వభౌమ! కడు చెన్నగు భోజన సౌఖ్యమందినా
డల్ల సుభాగ్యముల్ గొనితి టంచును నిక్కెదవేమొ! తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు పప్పును మెత్తని జొన్నరొట్టెతో
మెల్లగ యొక్క ముక్క దిగ మ్రింగుమ! మోక్షము కానవచ్చెడిన్.

(చిన్న మాట. జొన్నరొట్టె పై పద్యంలాగా ఏడ్సినట్టు ఉండదు. శ్రీనాథుని పద్యం లానే ఉంటుందని మనవి)

ఒక్క చింతాకు పప్పేమిటీ, గుత్తివంకాయ కూర, పెరుగు, కారప్పొడి కాదేదీ జొన్నరొట్టెతో నంజుడుకనర్హం. శ్రీనాథుల వారు ఇంతటితో ఎలానో ఆగారు రాగి ముద్దపైనా, లేదా గోంగూర డ్రగ్ మీదా ఏమీ అనలేదు. శుభం. (గోంగూర ’డ్రగ్’ ఎందుకంటే నాకు ఓ మారు సరైన గోంగూర పచ్చడి తగిలి రుచి చూడ్డం జరిగితే ఆ తర్వాత భోజనానికి అది లేకపోతే ప్రాణం పోయినట్టు ఉంటుంది.)

శ్రీనాథుని మీద పై పద్యం ద్వారా చేయి చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న డవుటొచ్చింది. శ్రీనాథుడు తిన్నది జొన్నన్నము కదా, జొన్నరొట్టె గురించి అప్పటికి తెలియదేమోనని. కానీ ’రొట్టె’ శ్రీనాథుని కాలం నాటికి ఉన్నది. సాక్ష్యం -

ఉలుమిడి చెక్కయున్, మిగుల నొక్కయుఁ జప్పని రొట్టెముక్కయున్
మలినపు గుడ్డలున్, నులుక మంచపుఁ గుక్కియుఁ, జీరటిల్లునుం
దలఁచిన రోఁత వచ్చు, నొకనాఁటి సుఖం బొకయేఁటి దుఃఖమీ
పలివెల వారకాంతల యుపస్థలకున్ బదివేల దండముల్.

హిందీ రోటీ - తెలుగులో రొట్టె అయిందని నా ఊహ. కానీ శ్రీనాథుని కాలానికి రొట్టె తెలిసిందంటే యేమో!

భోజన విషయంలో ఈయనకు స్వ-పర భేదాలు లేవన్నట్టు తెలుస్తూంది. మరో పద్యంలో తమిళులవంటను ఆడిపోసుకున్నాడు. మొట్టమొదటనే మిర్యపుచారు చెవులలో పొగరేగేటట్టు వడ్డిస్తారట. ఇలా మొదలెట్టి అరవ వారి విందెల్ల యాగడంబు అంటాడీయన.

నిజానికి తమిళుల ఇళ్ళల్లో చప్పని పప్పు, నేయి వడ్డించడం కొన్ని చోట్ల నేను గమనించాను. అలాగే మరికొంతమంది ఇళ్ళల్లో పప్పుతో బాటు పెరుగుపచ్చడి కలిపి భోంచెయ్యడం ఒక ఆనవాయితీ. శ్రీనాథుడు చెప్పే సాంబారు కూడా అంత అన్యాయమేమీ కాదు. ముఖ్యంగా ములక్కాడల సాంబారు. ఇదంతా చూస్తూంటే శ్రీనాథుడు బెంగాలీ వాళ్ళలాగా పొద్దున లేచి స్వీట్లు, కాఫీలో వెన్న తగలెట్టుకుని తాగే రకమా అని ఒక అనుమానం వస్తుంది. మరీ కొంచెం కూడా ఘాటు తింటున్నట్టు ఎక్కడా లేదు, బాపు సినిమాలో మాత్రం "ఆవ ఠేవ" ఏదీ? అని ఆయనతో అనిపిస్తాడు దర్శకుడు. నిజానికి ఆవకాయ ఆయన కాలానికి లేదు. ఊరుగాయ - అంటే ఉప్పునీటిలో ఊరవేసిన కొన్ని కాయలు అనే కాన్సెప్టు 15 వ శతాబ్దానికి కానీ రాలేదు. ఆ తర్వాత 18 వ శతాబ్దానికి కానీ మిరపకాయ భారద్దేశానికి రాలేదు. అది శ్రీనాథుని సినిమాలో బాపు చేసిన చందోభంగం.

ఇందాక సాంబారు అంటే గుర్తొచ్చింది. మా ఊళ్ళో ఓ మారు నాగఫణిశర్మ గారి అవధానం జరిగింది. అందులో దత్తపదిలో భాగంగా సాంబారు, పూరీ, వడ, దోస లతో శివుణ్ణి వర్ణించమన్నారు. నాకు పద్యం గుర్తు లేదు కానీ, సాంబా! రుద్రా! అని చివరిపాదంలో రావడం గుర్తుండిపోయింది.

తమిళులు అన్నారు కాబట్టి ఇంకొంచెం దూరం వెళ్ళి మలయాళీలనూ పలకరించి వద్దాం. మలయాళీల సాంబారు/పులుసు/గ్రేవీ కూర పేరు ’అవియల్’. దీని వెనుక టెక్నాలజీ నాకు తెలీదు కానీ, ఇందులో ముక్కలను నిలువునా కోసి తగలెడతారు (అదేనండి పొయ్యిమీద పెడతారు). అంటే కేరట్ ముక్కలు రౌండు రౌండుగా కాక కాస్త పొడుగు పొడుగు ముక్కలుగా అన్నట్టు. అరటి, కేరట్టు, కంద, గుమ్మడి ఇత్యాది కూరగాయల కలగలుపుగా ఈ వంటకం తయారు చేస్తారు. ఇక మలయాళీల పేటెంట్ కొబ్బరినూనె తప్పనిసరి. ఈ వంటకం చేసేప్పుడు వంటగది వైపుకు వెళ్ళటం రిస్కు. కొబ్బరి నూనె ఉడికేప్పుడు వచ్చే వాసన భరించవలసి వస్తుంది. అయితే సరిగ్గా చేస్తే దీని రుచి - "న్యాన్ ఎంద పరయుమ్!" - అంతే. ఈ అవియల్ మలయాళీల పండుగ ఓణం కు చేసే వంటకాల లిస్టులో ఒకటి. ఆ విందును ’సద్య’ అని అందురు. దాని గురించి మరెప్పుడైనా.

ఈ మధ్య నా వెరైటీ తిండిగోలతోటి నా శీర్షం మీదికి తెచ్చుకున్నాను. బెంగళూరు బ్రిగేడు రోడ్డులో నీలగిరి దుకాణాని కెళ్ళానో మారు. అక్కడ ఎండబెట్టిన తామరతూళ్ళను చూశాను. (తామరకళంగు వరువల్) వాటిని ఫ్రై చేసుకుని తినాలట. వాటిని ఇంటికి తెచ్చి మా ఆవిడకు ఆర్డరిచ్చాను. మా పాప తమ్మి (సంహిత) మొదటి ముక్క బానే తిన్నది. ఆ తర్వాతి ముక్కకు దానికి ఖోపం వచ్చేసింది. మా ఆవిడ డవుటు పడి దారుణాయుధాలు ప్రయోగించకముందే మిగిలిన వాటినన్నిటినీ బలవంతంగా తినవలసివచ్చింది.

ఇక్కడ దుర్భాగ్యనగరం హైటెక్ సిటీ నుండి లోపలకు వచ్చే దారిలో అవియల్ పేరుతో ఒక రెస్టారెంటు ఉంది. అక్కడ అవియల్ చేస్తారో లేదో తెలియదు.

ఈ అవియల్ ను తమిళులు (ముఖ్యంగా తమిళబ్రాహ్మలు), మలయాళీలు భోజనంలోనే కాక ములగాకు అట్టుతో కలిపి తింటారు.

శ్రీనాథుడు ఇవన్నీ తిని డెఫినిట్ గా ఉండడు. మనకా అవకాశం ఉంది. ఉపయోగించుకుందాం. తిని ఉండబట్టలేక ఇలా వాగుదాం.

Thursday, December 23, 2010

చక్కిలాలు, జంతికలోయ్..




ధనుర్మాసం చలి దంచేస్తోంది. ఈ చలిలో కరకరలాడుతూ చక్కిలాలు తింటూ, టీవీయో, నెట్టో, పుస్తకమో పట్టుకుంటే ఎంత బావుంటుంది? వర్షంలో పకోడీలూ, ఎండకు చల్లటి మజ్జిగా, చలికి కరకరలాడే చక్కిలాలూ ఊహించని జీవితం జీవితమేనా?

నా ఊహ మటుకు ఈ రోజు నిజమయినది. పెళ్ళిళ్ళ సీజను కాబట్టి ఈ మధ్య నాకు ఓ పెళ్ళి తాలూకు కైమురుకులు/చక్కిలాలు దొరికాయ్. ఆ చక్కిలాలు లాగిస్తూంటే, ఇదుగో ఈ టపా తట్టింది. క్రితం ఏడాది ధనుర్మాసం ఇలానే పులిహోర మీద నోరు, చేయి చేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు చక్కిలాల మీదపడ్డానికి అభ్యంతరం లేదనిపించి రాస్తున్నాను.

చక్కిలాలు - వీటిని కొన్నిచోట్ల మురుకులు అంటారు. జంతికలు అని కొందరంటారేమో కానీ నాకు తెలిసి జంతికలు అంటే గుండ్రంగా ఉండక, చుట్లు చుట్లుగా ఉన్నవి. చక్కిలాలు, జంతికలు, మురుకులు, పాలకాయలు, నిప్పట్లు, చేగోడీలు ఏవైతేనేం? అన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. "యుష్మాకం సహకుటుంబానాం భక్షణ సమయే సముచిత స్థాన ప్రాప్తిరస్తు!"

ఇవి తిండిలో అజాతశత్రువులు. ఇవి నచ్చని వాడెవడూ ఉండడు. అయినా - అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా - అందరూ గారెలూ, బూరెలూ, బొబ్బట్లూ తలుచుకుంటారు కానీ వీటిని తలుచుకునే నాథుడు లేడు. చివరికి ’వివాహభోజనంబు..’ లో కూడా పింగళి వారు "ఔరౌర గారెలల్ల, ఒహ్హోరె బూరెలిల్ల..ఇవెల్ల నాకె చెల్ల" అంటూ చక్కిలం ఫ్యామిలీలో పెద్ద అయిన గారెలని తలుచుకున్నాడు కానీ చక్కిలాలకు సముచిత స్థానం ఇవ్వలేదు. చివరికి మన దేవాలయాల్లో కూడా చక్కిలానికి వివక్షత. ఏ దేవుడూ చక్కిలాన్ని ప్రసాదంగా తీసుకోడు (నాకు తెలిసినంత వరకు). పెళ్ళిళ్ళప్పుడు మాత్రం తగుదునమ్మా అని పెద్దపెద్ద గుండ్రాలుగా తీర్చిదిద్ది, పెళ్ళి తంతులో కూర్చోబెడతారు. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.

నా చిన్నతనంలో సెలవులకు మా పిన్ని ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ మాకు చక్కిలాలు భలే దొరికేవి. వాళ్ళింట్లో ఓ పెద్ద డబ్బా, అందులో నిత్యాగ్నిహోత్రంలా నిరతమూ లభ్యమయే చిరుతిండి. ఆ పెద్ద బాక్సు సగానికి వచ్చినప్పుడల్లా తిరిగి నిండుతుండేది, అక్షయ తూణీరంలా, అక్షయఖండనఖాద్యపేటిక అని చెప్పుకోవచ్చు. అవి తింటూ టీవీ చూసుకుంటూ అలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ సెలవులను అలవోకగా గడిపేసే వాళ్ళం.

మా ఊళ్ళో శ్రీకంఠం అని ఓ సినిమా థియేటర్ ఉంది. అక్కడ వచ్చే సినిమాలేమో గానీ అక్కడ ఇంటర్వెల్ లో దొరికే చక్కిలాలు మాత్రం నా చిన్నతనంలో ఫేమసు. నాకు చక్కిలాల పిచ్చి కాస్త ఎక్కువే అప్పట్లో. ఎనిమిదవ తరగతిలోననుకుంటాను ఓ మారు చిరంజీవి సినిమాకు టికెట్లు దొరక్క నిరాశతో ఇంటికి తిరిగి రాబుద్ధి పుట్టక ఏ సినిమా ఐతే ఏముందని ఈ సినిమా థియేటర్కు వెళ్ళాము నేనూ నా ఫ్రెండూనూ. సినిమా పోస్టర్ చూడలేదు. ఏదో డబ్బింగ్ సినిమా. సినిమా చూశాము, ఇంటర్వెల్ లో చక్కిలాలు, కలర్ సోడా కూడా లాగించాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అడిగారు ఏరా సినిమా బావుందా ఎలా ఉంది. జరిగింది చెప్పాను నేను. చిన్న సైజు బడితె పూజ చేశారు. నేనేం పాపమూ ఎరుగకపోయినా బడితె పూజ! ఎందుకంటే - ఆ సినిమా మలయాళ చిత్రరాజమట. నాకూ నా స్నేహితునికి బూతు అ(క)నిపించలేదు, సకుటుంబ సమేతంగా చూడవచ్చు ఆ సినిమాని. ఎవడో డాక్టరు వచ్చిన వాళ్ళకు ఏదో చెబుతుంటాడు. అదీ ఆ సినిమా కథ. అలా చక్కిలాల కోసం చెయ్యని పాపానికి దెబ్బలు తిన్నాం.

ఇదివరకెప్పుడో నా బ్లాగులో ఇడ్లీల గురించి ఓ మాటనుకున్నప్పుడు ఇడ్లీలు ఇండోనేషియా నుండి వచ్చాయని మనసు విరిచేశారు పరుచూరి శ్రీనివాస్ గారు. చక్కిలం మటుకూ భారతదేశ వంటకమని నా వాదన. సంస్కృతంలో చక్కిలాలను "శష్కులీ" అంటారు. (శష్కులీ ప్రకృతి - చక్కిలి వికృతి కాబోలు). ఈ శష్కులీ గురించి ఓ శ్లోకం ఈ రోజే నా కళ్ళబడింది.

నృపమాన సమిష్టమానసస్సనిమిజ్జత్కుతు కామృతోర్మిషు |
అవలంబిత కర్ణశష్కులీ కలశీకం రచయన్నవోచత ||

ఇష్టమానసః = ప్రియమైన మానస సరస్సుగల
సః = ఆ రాజహంస
కుతుకామృతోర్మిషు = సంతోషామృత లహరులలో
నిమజ్జత్ = మునిగిన
నృపమానసం = నలుని చిత్తమును
అవలంబిత కర్ణశష్కులీ = పట్టుకొనబడిన చక్కిలము వంటి చెవులనెడి
కలశీకం = కలశములు కలదిగా
రచయన్ = చేయుచూ
అవోచత = పలికెను

కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా అర్థం ఇదీ.
మానస సరోవరం లో తిరిగే రాజహంస సంతోషాంతరంగ లహరులలో ఓలలాడే నలుని చక్కిలాలవంటిచెవులను కలశములచే నిలబెట్టి (సావధానచిత్తునిగా చేసి) చెప్పసాగింది.

చక్కిలాలవంటి చెవులను కలశాలుగా చేయడం - ఈ మాటకు అర్థం ఇంచుమించుగా ఇది. నదిలో మునిగేవాడికి ఖాళీ బిందె దొరికితే దాని సహాయంతో (మునక్కుందా పైకి పట్టుకుని) ఎలా వస్తాడో అలా సంతోష తరంగాల్లో మునిగిన నలునికి చెవులనే కలశాలు దొరికాయిట. ఆ చెవులు చక్కిలాల్లా ఉన్నాయిష!

కర్ణశష్కులీ - ఉపమాలంకారము.

పై శ్లోకం నైషధీయచరితంలో రెండవ ఆశ్వాసంలోనిది. రచయిత శ్రీహర్షుడు. ఈయన పదవ శతాబ్దపు ఆసుపాసుల్లోనివాడనుకుంటాను కాబట్టి మనం చక్కిలం భారతీయమైనదని ఒప్పేసుకుకోవచ్చు అనుకుంటాను. చక్కిలాల రుచిచూసేనేమో ఆయన "ఖండనఖండఖాద్యం" అన్న ఓ తర్కగ్రంథం వ్రాశాడు. ఆ మాటకర్థం - ఖండనం అనబడే చిరుతిండి. ఇది అద్వైత వాదం సమర్థించే ప్రౌఢగ్రంథం.

తెలుగులో జంతికల గురించి వేమన ఓ పద్యం చెప్పాడు.

తమకుఁ గలుగుపెక్కుతప్పు లటుండఁగా
నొరుల నేరమెంచు టొప్పు గాదు
చక్కిలంబు విడిచి జంతిక లేరుటా?
విశ్వదాభిరామ వినుర వేమ.

Friday, July 23, 2010

మత్తేభ ఘీంకారము

సిరికిం జెప్పడు;శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతింబన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సా హియై.

ఆ పద్యం చదివి వెనకటికి శ్రీనాథుడు పోతనతో అలా ఎలా వస్తాడు? అసంబద్ధం అని లాజించితే, పోతన ఓ రాయిని పెరటి బావిలోకి విసిరి శ్రీనాథునితో, "అయ్యా! మీ అబ్బాయి బావిలో పడ్డాడు" అని చెప్పి, తను పరిగెత్తితే, "ఇదుగో ఇలానే శ్రీవారు కూడా వెళ్ళారండి!" అని జవాబిచ్చాడట.

ఇప్పటి ఐదవతరం హైటెక్ కూలీలకు మాత్రం బాసురుడు పిలిస్తే ఆఫీసుకు పరిగెట్టటం అలవాటే.అలాంటి ఓ మందభాగ్యుని ఉదంతం ఈ పేరడీ.

సతికిం జెప్పడు; పెన్ను పర్సుయుగమున్ షర్టందు సంధింపడే
గతిఁ తిండిన్ తిననేరడద్దముఁ వెసన్ కాంక్షింప డాకర్ణికా
వృత ధమ్మిల్లముఁ జక్కనొత్తడు సుసంప్రీతిన్ విహారాదులన్
మతిఁ గోరండల చేరి బాసురవరున్ మానావనోత్సాహియై

తెరవెనుక:

నాకు మత్తేభం ఎలా వ్రాయాలో తెలియడం లేదు. జాలంలో మత్తేభం అని వెతికితే "సిరికిం జెప్పడు" అని వస్తూంది. నేను మత్తేభం నేర్చుకునే వరకు ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఆగకపోవచ్చు. పోతన మీద ఇదివరకే ఒకాయన కలం చేసుకున్నారు. ఇక్కడ చదవండి.

ఆకర్ణికాంతర ధమ్మిల్లము 
శ్రీకుచో పరిచేలాంచలము - వీటి అర్థాలు తెలపవలసిందని కోరుతున్నాను.

Thursday, July 8, 2010

సమస్యా రణములు

సాధారణంగా పద్యాల సమస్యాపూరణాలలో సమస్యలు గమనిస్తే మనకో విషయం స్ఫురిస్తుంది. ఏదైనా అస్వాభావికమైనది, ప్రకృతి విరుద్ధమైనది సమస్యగా కూర్చడం సులభం.అలాంటి ప్రకృతి విరుద్ధమైన విషయాలంటే మన సినిమా హీరోలు గుర్తొచ్చారు.రజనీ కాంత్, విజయకాంత్, బాలకృష్ణ, హిందీలో మిథున్ ముందువరుస ఆసామీలు ఈ విషయంలో.

కాదేదీ క’పి’త కనర్హం కాబట్టి,పై వారిలో బాలయ్య స్ఫూర్తిగా కొన్ని సమస్యలు, వాటి ఆధారంగా నేనల్లుకున్న పద్యాలతో ఈ టపా కూర్చాను.సమస్యలన్నీ చివరిపాదంలో చదువుకోండి.ఈ సందర్భాలు చాలా వరకూ తెలిసినవే. కొన్నిటికి లంకించాను. మరికొన్ని "మీగొట్టం" (youtube) లో దొరుకుతాయి.

వీరరాఘవరెడ్డిని పీచమడఁచ
సమర సింహుడు వెడలెను శౌర్యమొప్ప
సింహ నాదము జేయుచుఁ జెప్పె - "వత్తు
ఇంట నట్టింట వంటింట యెక్క డైన"
(సమరసింహా రెడ్డి)

మిక్కుటమౌ రోషానలి
ఠక్కున తన కనులఁ వెలువడంగను జేసెన్
మిక్కిలిగ బాలయ చెలఁగి.
కుక్కురములు బెదరి నిలిచె కూనల వోలెన్.
(నరహింస నాయుడు)

నేర్వుదురిలను పశువుల,నీడ వళుల
భాషలన్ మనుజులుఁ గోరి.బాలు నేర్చె
యచరముల భాష.విలను గృహముకు నరిఁగి
ధాటిగ తొడను గొట్టగ సీటు కదిలె.

తొల్లి బాలయ విలనులు యున్న రైల్ జూచి
ధాటిగ తొడ గొట్టి నంత మాత్ర
ముననె ప్రాణమొచ్చి భుగభుగ మనుచును
రైలు వెనుక మరలె రయము గాను
(పలనాటి బ్రహ్మనాయుడు)

దోషుల వెదకుచుఁ జేరెను
వేషపు ధారియగు బాలు వీసా లేకే
భేషుగ దుష్టులఁ దునుమఁగ
భాషగఁ దనకును తెనుఁగయె పాకిస్తానున్
(విజయేంద్ర వర్మ)

బంధితుడయి యొప్పు బాలయ కొంపలు
మునుగు యవసరమున ముప్పుఁ దప్ప
గుండును గురి జూచి గొట్టె ఎఱుపు రంగు
మీటనొక్క దాని నోటి తోను
(అల్లరి పిడుగు)

బాలు పాండురంగడయెను ప్రజలు మెచ్చ
దర్శకేంద్రుని లీలనుఁ దలుప వశమె?
భరత భూమినిఁ బుట్టిన భక్త మూర్తి
ధవళ భామల సరసను నాట్యమాడె.
(పాండురంగడు)

చిరంజీవి కూడా తక్కువ తినలేదు.ఆయన ఘనకార్యాలిలా ఉంటై.

వందల కొలదిగ జనముల బాదెన్ ఘనుడై.
ట్రాక్టరు నెగిరించెను చిరు ఠారెత్తింపన్.

Wednesday, June 16, 2010

బన్ జాయ్ (షాడో స్పై అడ్వెంచర్)

"వేళకు వస్తానన్న పెద్దమనిషి గంటైనా సిస్టం దగ్గర నుండీ లేవకపోతే కోపం వస్తుందా రాదా నువ్వే చెప్పు" కాకా అంగడి యజమానిని అడిగేడు గంగారాం. టూ టవును లో ఓ సినిమాహాలు వద్ద ఉన్న కాకా టిఫిన్ సెంటర్లో గంటన్నర నుండీ వెయిట్ చేస్తున్నాడతను. ఓ వారం రోజులుగా తల హూనమయేట్టు ప్రాజెక్టుపని చేసి, శుక్రవారం సాయంత్రం డెలివరీ చేసివస్తున్నాడు. డేమేజరుకు రిపోర్ట్ ఇచ్చేసి ఇదుగో ఇప్పుడే వచ్చేస్తానని, ఈవెనింగ్ షో కు తనకూ టికెట్లు తీసుంచమని చెప్పాడు ప్రాజెక్టు లీడరు షాడో తనకు.

ఏమీ సమాధానం చెప్పలేదు కాకా. అప్పటికే రెండు ప్లేట్ల పూరీకూర్మా, ఓ మూడు చాయ్ లు లాగించిన కస్టమరునెలా వదులుకుంటాడు?

"మరో చాయ్ తెప్పించమంటారా?" రాగయుక్తంగా అడిగాడు టీబంకు యజమాని.అడగడమే కాదు, పొగలు వెలువరిస్తున్న స్పెషల్ అల్లం టీని తనే స్వయంగా తీసుకొచ్చి గంగారాంకందించాడు.

ఆ టీతో బాటు బరో బన్నును లాగించి, త్రేనుస్తూ లేచాడు గంగారాం. బిల్లుకు మరో రెండునోట్లను కలిపి టీ బంకు యజమానికి అందించాడు. ముఖమంతా నవ్వులమయం అయిపోతుండగా, భక్తితో అందుకున్నాడు టీబంకు కాకా.

అలా చల్లగాలికి మరికాసేపు తిరిగి చీకట్లో ఓ మూల సందులో లఘుశంక తీర్చుకోవడం కోసం వెళ్ళాడు.

"అగ్గిపెట్టుందా బ్రదర్?" రెండు గొలుసులు ఒకదాన్నొకటి రాచుకుంటున్నట్టున ఓ గొంతు పక్కన వినబడింది గంగారాంకు. ఉలికిపాటును నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ పక్కకు చూశాడు. ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టు నిలబడి ఉన్నాడో ధృఢకాయుడు అక్కడ.

"లేదు" అంటూ పక్కకు జరిగి మెయిన్ రోడ్డుకు వెళ్ళబోయాడు.

"ఎక్కడికి బే?" అంటూ రఫ్ గా భుజం చరుస్తూ ముందుకు వచ్చారు మరో ఇద్దరు ధృఢకాయులు పక్కనుంచి.

లాగిపెట్టి వాళ్ళ ముఖం మీద చరిచి రోడ్డువైపు పరిగెత్తాడు గంగారాం. ఓ నాలుగడుగులు వేయగానే అతణ్ణి మరో నలుగురు ధృఢకాయులు కమ్ముకున్నారు. లాగిపెట్టి భుజం మీద తన్నాడు అందులో ఒకడు, గంగారాం ను.


అంతటితో సహనం నశించింది గంగారాంకు.

"ఈ గంగారాం మీదే చెయ్యి వేస్తార్రా, అమ్మా కలకత్తా కాళీ వీళ్ళందరినీ ఐదు నిముషాల్లో పడగొడితే నీకో వేటపుంజు బలి గ్యారంటీ" అంటూ వాళ్ళ మధ్య తిరుగుతూ, దొరికిన వాణ్ణి దొరికినట్టు విరగదీయడం ఆరంభించాడు. "ఫట్ ఫట్" మంటూ వినవస్తున్నాయి ధ్వనులు. సరిగ్గా ఐదు నిముషాల్లో గుంపును విరగదీసి పక్కకు వచ్చాడు. అప్పుడు సరిగ్గా, తల మీద బాణాకర్రతో దెబ్బ పడింది. వెనక్కి తిరిగి చూసే లోపల మరో దెబ్బపడింది. వెచ్చటి రక్తం బుగ్గలమీదుగా జాలువారింది. కళ్ళముందు నల్లటి పరదాలు క్రియేట్ అవుతుండగా, అలాగే వెనక్కి విరుచుకుపడిపోయేడు.

********

పిశాచం లాంటి ఆకారమొకటి తన గొంతు నులుముతున్నట్టు దారుణమైన కలగన్నాడు షాడో. శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు డెలివరీ ఇవ్వగానే, డేమేజరుకు చెప్పి తనూ బయల్దేరాలనుకున్నాడు. అంత తొందరగా ఇంటికి పంపుతే డామేజరెలా అవుతాడు?

"క్లయింటు వద్ద నుండీ సేనిటీ రిపోర్టు అందగానే వెళ్ళు" అంటూ వెకిలినవ్వులు చిందిస్తూ తనను అక్కడే నిలిపేశాడు డేమేజరు. దాంతో రాత్రంతా అక్కడే కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడ్డాడు తను. మాగన్నుగా నిద్రపట్టగానే కలగన్నాడు.

వాచీ శనివారం పొద్దున తొమ్మిది అని చూపిస్తోంది. విసుగ్గా లేచికూర్చుని బాత్ రూం వైపు అడుగులేశాడు. ముఖం కడుక్కుని, చాయ్ కలుపుకుని తన సీటు వద్దకు వచ్చి డేమేజరు కోసం ఎదురుచూడనారంభించాడు. ఓ గంటకు షాడో ఎదురుచూపులు ఫలించాయి.

డేమేజరు రాగానే, "ఇంతవరకూ ఏ సమస్యా లేదని", ఇక ఇంటికి వెళతానని అడిగాడు షాడో.

"ఇంకా పని ఉంది బే. రిపోర్టు పూర్తిగా వచ్చే వరకు ఇక్కడే ఉండు" క్రూరంగా నవ్వుతూ చెప్పాడు డేమేజరు.

"ఒక్క మూడు గంటలు సమయమివ్వండి. డెవలపర్ గంగారాం ఏమయ్యాడో, ఎక్కడున్నాడో చూసొస్తాను" వదలకుండా ప్రాధేయపడ్డాడు షాడో.

షాడో మాటలు వినబడనట్టు నటిస్తూ తన కేబిన్ వైపు అడుగు వేయబోతున్నాడు డేమేజరు. అంతటితో షాడో సహనం నశించింది. కంఠం నుండీ దారుణమైన కుంగ్ ఫూ షౌట్ వెలువరిస్తూ, ఫెడీ మని తన్నాడు డేమేజరు గుండెల మీద.

మామూలు వ్యక్తి అయితే ఓ పదడుగులు వెనక్కి విరుచుకు పడి ఉండేవాడు ఆ దెబ్బకు. డేమేజరు మాత్రం ఓ రెండడుగులు వెనక్కి వేసి నిలద్రొక్కుకున్నాడు. విచిత్రంగా నవ్వుతూ "నీ పై అధికారిని గౌరవించమని హెచ్చార్ వారు చెప్పిన నీతి సందేశాన్ని పెడచెవిన బెట్టావు. సాఫ్ట్ వేర్ పీఠం నియమాలను ఉల్లంఘించినందుకు నీకు తగిన శాస్తి చేస్తాను" అంటూ కంటికి కనిపించనంతవేగంతో చేయిని విసిరాడు షాడోమీదకు. రెండు చేతులూ అడ్డు పెట్టి ఆ దెబ్బ కాచుకున్నాడు షాడో. అయినప్పటికీ భుజానికి తగలనే తగిలింది. భుజం విరిగిపోయినట్టుగా ఫీలవుతూ పక్కకు జంప్ చేశాడు.

అవధులు మించిన ఆగ్రహంతో ముందుకు వచ్చాడు డేమేజర్. ముందుకు జరిగి ఫ్రంట్ కిక్ వెలువరించ బోయాడు. అక్కడే పాదం మెలికపడింది. డెస్క్ టాప్ ఎల్ సీడీమీద పడి తల బద్దలు కొట్టుకోకముందే పక్కకు లాగేశాడతణ్ణి షాడో. అతి ప్రయత్నం మీద భుజం మీద ఎత్తుకుని సోఫాలో కుదేశాడు.

డేమేజరు తిరిగి లేవకముందే వెనక్కి తిరిగి జంప్ చేసి మూడే మూడంగల్లో అక్కడ నుండీ అదృశ్యమయాడు.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


చటుక్కున మెలకువ వచ్చింది. పక్కనే బంజాయ్ - షాడో నవల సగం చదివినట్టి సగానికి మూసి ఉంది. పన్నెండింటికి ఆఫీసునుండీ వచ్చి పడుకుంటే రెండుకు నిద్రపట్టింది. ఇప్పుడు నాలుగ్గంటలయ్యింది. కాసిన్ని మంచినీళ్ళు తాగి మళ్ళీ ముసుగుతన్నాను.

Thursday, May 27, 2010

ఒక పద్యము, కొన్ని పైత్యాలూ

మొదట వేటూరికి నివాళి.

’ఆరేసుకోబోయి పారేసుకున్నాను
యని చిలిపి తలపుల నల రేపు!
’తాంబూలమరుణమందారమనెడుతేనె
లొలికెడి మాటల కలిత బాపు!
’అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
పదమల్లు కైతల పయిడి కాపు!
’గాలినై పోతాను గగనాని కి’దెయని
మలయానిలమయి మయిని మరపు!

పాటలకు పెనిమిటి తేటతేనెకు పాటి
మధురభావపు పదబంధములకు
వేరెవరట సాటి? వేటూరి సుందర
రామ మూర్తి - సుమ మరంద పేటి.

ఇక పైత్యాలు.

రంజుగ సాగెడి ప్రాజెక్ట్.
స్ట్రింజెన్టు క్లయింటు గాడు చెప్పెనిలా! ’వెం
టం జేయి డెలివరి.’ అకట!
కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్

మొన్నను విన్మొబయిలనిరి
నిన్నను కొత్తగ దిగినది నేర్వుడిదె లిమో!
మిన్నగ ఆండ్రాయిడట
ఎన్నగ నేడొచ్చె. రేపు ఇంకే దొచ్చో?

మోడగు మా టీమునకు
మాడరనుగ బ్యూటిజేరె. పండగ ఇకపై
మా డామేజరుకు సి! పూ
బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్

త్రోవలెరుంగకం జవిరి తూరిచి గూర్చిన క్లైంటు స్పెక్సులుం
జేవలుఁ జచ్చిపోయిన డిజేనును అండగ జేసుకొన్న నా
జావలు గారుకోడుయది సాఫ్ట్ వెరు నెల్లెడలందు బొక్కలున్.
బావుర నేడ్చె కష్టమరు ఫైనలు వర్షను జూచి బాధతో!

సృజనతొ వర్కు సేయుడి అసాధ్యము సాధ్యము జేయగానిలన్
అజులయి మీరు నూతన సహాయ మెథడ్సులజైలు లాదిగా
ప్రజలకు తృప్తి గూర్చగ నపారముగన్ యని జేత్రు బోధనల్.
వజనము లేని మాటలివి.వంచన జేయుచునెన్నడున్మహా
భజనలు సేయు వారలకె పై పదవుల్.ఇది నిక్కమెల్లెడల్.

స్పర్ధకు వోయి స్వస్థితిని సైతము జూడకసైనుమెంటునున్
మూర్ధమునందు యెత్తికొనె మూర్ఖశిఖామణి బాసురుండటన్
వర్ధిల జేతుమంచు నట వచ్చిరి యిద్దరు టెక్నికల్ ఫెలోస్.
అర్ధనిశీధమందు అలయంధుడు గాంచెను సూర్యచంద్రులన్

నాతుల గుంపు జేరెనట దారిన, వీధి కొళాయి చెంతకున్
చేతులఁ దిప్పుచున్నొకరు, జిహ్వల వాటము జూపి కొందరున్,
చేతుల బిందెలం గొనుచు చేటగు మాటల పోరు హెచ్చగన్
బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్

తాష్ట్రులు వచ్చిచేరిరిట నాటికి చేటుగ ఉగ్రవాదులై
రాష్ట్రము దోచుచుం జనుల రక్తము పీల్పగ మావొయిష్టులై
త్వష్ట్రము జూపి యా దుడుకు దైత్యుల పాలిటి కాలరూపుడై
రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై

(గత కొన్ని రోజులుగా ఆరోగ్యం కూసింత చెడగొట్టుకుని, పొద్దుపోక వెలగబెట్టిన పైత్యాలు. వూకదంపుడు గారి ఓ పాతటపా నుంచి కొన్ని సమస్యలు , మరో అవధానం పుస్తకంలో ఇంకొన్ని సమస్యలు ఏరాను. తప్పులుంటే కొంచెం పెద్దమనసు చేసుకుని సూచించి క్షమించండి ప్లీజ్!)

Monday, March 8, 2010

ఫలానా దినోత్సవం

ఈ టపా మగాళ్ళకు మాత్రమే.

ప్రతీ సోమవారం లాగే అంతకు ముందు ఐదు రోజుల గబ్బును రెండు రోజుల సబ్బుతో వదిలించేసుకుని, కచేరీలో పొద్దున అడుగుపెట్టి చూద్దును కదా. హాశ్చర్యం. అమ్మాయిలందరూ .. ఆ కాదు ., ఆంటీలందరూ (మా ఆఫీసులో అమ్మాయిలు ఆంటీల్లా ఉంటారు) చుడీదార్లు, చున్నీలూ వదిలేసి చీరలు కట్టుకొచ్చేస్తున్నారు. ఒక కైరళి (ఈమె మటుకు అమ్మాయిలానే ఉంది) తెల్లచీర, నుదుటిన చందనపు బొట్టు, వదిలేసిన జడతో సాంప్రదాయబద్ధంగా వచ్చింది. ఏంటో ఏమో అనుకుని లోపల అడుగు పెడితే వుమన్స్ డే అట. అమ్మాయి బొమ్మ తాలూకు శక్తిబిందువు (పవర్ పాయింటు) ప్రెజెంటేషన్ గోడ మీద నడిపిస్తున్నారు.

పడమటి సంధ్యారాగం సినిమాలో నటుడు "అమ్మ దినం ఏంటి తద్దినం లాగా?" అని విసుక్కున్నట్టు, నాకూ ఇవి కాస్త చీకాకే. పక్క సీటోణ్ణి ఏంటిది? మగాళ్ళకు దినాల్లేవా? అనడిగితే వాడన్నాడు, మిగిలిన మూడొందలరవై నాలుగు రోజులూ మనవే అని.

ఈ ఫలానా దినోత్సవాలు నాకు తెలిసి ఆర్చీస్ కంపెనీ వాడి కుట్ర అని నా ప్రఘాఢ నమ్మకం. ఎందుకంటే ఈ దినాల వల్ల బాగుపడేది వాడే. అందులో కూడా కొత్త కొత్త ఇన్వెన్షన్లు. అపుడెపుడో మా గ్రూపులో ఒకమ్మాయి మణికట్టు గమనించాను. రంగురంగులుగా ఉంది. అడిగితే ఒక త్రాడు దేవుడికి (వదిలేద్దాం). మరొకటి ఫ్రెండ్ షిప్ డేది. మరొకటి రాఖీ. ఇంకోటి ఏదో .. ఇలా చెప్పుకొచ్చింది. ఇది ఆర్చీస్ కి ప్రత్యామ్నాయం అనుకుంటాను.

హా, మళ్ళీ ఆఫీసుకొస్తా. ఆఫీసులో అమ్మాయిలు...వద్దులెండి. స్త్రీలందరికీ ఈ రోజు చుక్కల పూటకూళ్ళ కొంపలో ಊಟ, ఒక్కొక్కరికి ఒక కుసుమ రాజం బహుమతి. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆటవిడుపు. ఇదీ మెను. ఇది జెండరు డిస్క్రిమినేషన్ గా పరిగణించాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను.

ఎయిడ్స్ డే, వేలెంటైన్స్ డే, ఇప్పటికే ఇలాంటివి ఉన్నాయి. భవిష్యత్తులో
శిశువుల దినోత్సవం
పశువుల దినోత్సవం,
జంతువుల దినోత్సవం (ఇంకా ముదిరితే ఒక్కో జంతువుకొకటి),
పక్షుల దినోత్సవం,
చెట్ల దినోత్సవం,
పుట్టల దినోత్సవం,
పిట్టల దినోత్సవం,
గుట్టల దినోత్సవం,
మొక్కల దినోత్సవం,
నాచు మొక్కల దినోత్సవం
ఇలా ఏదిబడితే అది వచ్చే అవకాశం లేకపోలేదు. ఇంకా ముదిరితే పూటలు. కేన్సరు అర్ధ దినోత్సవం, తాతయ్యల పూట, శిశువుల గంట - ఇలాంటివి కూడా వచ్చేస్తాయేమో!

(ఈ టపా సరదాగా మాత్రమే. ఈ టపాలో సంఘటనలూ, వ్యక్తులూ కేవలం కల్పితాలు. (నిజ్జం). ఏదైనా సారూప్యం తగిలితే అది కేవలం కాకతాళీయం అని గమనించగలరు.)

ఈనాడు శనివారం రోజున నా బ్లాగు పరిచయం వచ్చింది. అభినందనలు తెలుపుతూ వేగులు, వ్యాఖ్యలూ వచ్చాయి్, వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు. నా బ్లాగు పరిచయం చేసిన సుజాత (మనసులో మాట) గారికి కృతజ్ఞతలు. - రవి.

Friday, February 12, 2010

భోళాతనపు ధవళవర్ణమూర్తి, మాయలమారి శ్యామసుందరుడూ!


ముందుగా కొన్నాళ్ళక్రితం గొడవ , వ్యాఖ్యలతో చదివి రండి.

మహాశివరాత్రి సందర్భంగా ఏదైనా చక్కటి పద్యమో, శ్లోకమో గుర్తు తెచ్చుకుని బ్లాగులో రాసుకుందామనుకుంటే, ఒక్క పద్యమైనా, కనీసం హలోట్యూనయినా గుర్తొస్తేనా? అదే ఆయన కాంపిటీటరు, ఆయన తాలూకు పోలీమార్ఫిక్ అవతారాల మీదయితే బోల్డన్ని పద్యాలు, ఉపమానాలూ, ఈ అమాయకపు దేముడి మీద అనవసర అభాండాలూ, దీర్ఘాలున్నూ.

అసలేమైనా అంటే అన్నామంటారు గానీ, ఈయనకు నిలువ నీడ ఉందా? ఏదో అత్తవారిచ్చిన కాస్తంత ఎడం లో ఫ్యామిలీ, ప్రమధగణాలు అందరూ సర్దుకుని ఉంటున్నారు. కట్టుకోడానికి ఓ నాలుగు జతలు బట్టలున్నాయా పోనీ ? పుట్టినరోజు పండక్కన్నా కొత్తబట్టలు పెట్టేవాళ్ళున్నారా? రెండు పూట్లా ప్లేటు మీల్స్ అయినా తింటున్నాడా? అసలు కూగూగు అన్న బేసిక్ అవసరాలే తీరకున్నా పెళ్ళాం బిడ్డల్ని ఏదోలా పోషించుకుంటూ గమ్మునుండాడే.ఈయన మీదనాండి మీ అభాండాలు?

ఓ రకంగా దేవతల్లో సమైక్య వాది గా శివయ్యనే చెప్పుకోవాలి. ఎందుకంటే చెడ్డోళ్ళూ, మంచోళ్ళని చూడకుండా, ఎగేసుకుంటూ వెళ్ళి వరాలిచ్చేదీయనే కదా. వెనకటికి రావణుడనే ఆయన అంత లావున తపస్సు చేసి, కొంపకెసరు పెట్టి, చివరికి పేగులవీ తెంపుకుని వీణ వాయించి మరీ వరాలు తెచ్చుకుంటే, నల్లటాయనేమో ఓ అవతారమెత్తి, అంతోటి వాణ్ణీ మర్డర్ చేశాడు. అదీ దేనికిట, తన పెళ్ళాన్ని ఆ పదితలకాయల రావణుడు కిడ్నాప్ చేశాడు కాబట్టి. తన పర్సనల్ ప్రాబ్లెం సాల్వ్ చేసుకోటం కోసం ఆ రావణుడంతోణ్ణి చంపి, ఆ ఘనకార్యంతోటి తన అవతారానికి అంత మార్కెటింగు తెచ్చుకున్నాడే. ఆ జాణతనాన్నేమనాలి? ఇంతా చేసి ఏమయ్యా అంటే, ఆయనకు పెళ్ళాం వెతికి పెట్టడానికి ఈయన హనుమంతుడి అవతారమెత్తవలసి వచ్చింది. తెరవెనుక సాంకేతిక సహాయం మాదీనూ, తెరవెనుక హీరో రోలూ మీదీనూ.

భృగువు అని మునులందరికీ ఓ కన్వీనర్. ఈయనా ముక్కంటే. కాబోతే ఈయన మూడో కన్ను అరికాల్లో ఉంది. (మనలో కొందరికి తలలు మోకాళ్ళలో ఉన్నట్టుగా కాబోలు) ఈ పార్టీ దేవుళ్ళలో టాప్ సీడ్ ఎవరు అని ఎంట్రన్స్ ఎక్జాం కండక్ట్ చేశాడుట ఓసారి. నాలాగ ముక్కంటే కదా అని కన్సెషన్ కూడా ఇవ్వలేదీయన శివయ్యకు. సరే వదిలేద్దాం. ఈ భృగు ఆ నల్లటాయన దగ్గరకెళ్ళి కాలితో తాపు తంతే, ఆయన చాలా తెలివిగా "మీ కాళ్ళు నా వక్షస్థలం మీద తగిలి మీకేమైనా అయింటుంది" అంటూ ఓవరాక్షన్ చేసి, ఆయన కాలుమధ్య కంటిని వత్తేశాడు. అది మామూలు కుట్రగాదండి. ఫ్యూచర్ లో భృగువు "నేను ముక్కంటే, నీవు ముక్కంటే" అని పాట పాడేసుకుంటూ వెళ్ళి ఎక్కడ శివయ్యకు మిస్టర్ యూనివర్స్ టైటిల్ ఇస్తాడేమో అన్జెప్పి, దానినడ్డుకోడానికి జరిగిన చేసిన పన్నాగం.

కథ అంతటితో పూర్తవలేదండి. ఆ కోన్ కిస్కా (క్షమించాలి) నేనున్న ప్లేసును తంతాడా అని అమ్మవారు అలిగి ఇండియాకు ఆన్సైటు కొచ్చింది. దానికా జగన్నాటక సూత్రధారి (పెళ్ళాం ఊరిళితే మొగుళ్ళు ఎలా ఫీలవుతారన్నది జగమెరిగిన సత్యం) ఫీలయినట్లు నటించి, దిగొచ్చేసి, ఆ వంకతో కాస్ట్లీయెస్ట్ దేవుడిగా స్థిరపడిపోయాడు! ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు! (ఒకే దెబ్బకు ఏడు తాడిచెట్లను కొట్టినాయనకిదేం లెక్క లెండి)

వద్దులెండి, ఆ పురాణ కథలొద్దు. నేలపైకొద్దాం. ఓ నెల ముందు ధనుర్మాసం లో గుళ్ళో పూజ చేయిస్తే, కమ్మటి చక్రపొంగలి, పులిహోరా పెట్టారు అయ్యవారు. శివరాత్రికో? శివరాత్రి పేరు మీద అంటూ ఓ కమ్మటి వంటకం అయినా ఉందా? అసలు కర్ణాటకలో కన్నడ రాజ్యోత్సవ లాగా కంపల్సరీ హాలిడే అయినా ఉందా ఈ పండక్కు?

వెనకటికి అతనెవరో దొంగట. దొంగతనాలవీ చేసి, పట్టుకోడానికి జనాలెంటబడితే, మారేడు చెట్టెక్కి, తెల్లార్లూ మేల్కొని, పొద్దు గడవడం కోసం ఆకులవీ తెంపుతూ, నమిలి కిందనున్న లింగం మీద ఊస్తూ గడిపాడుట. బర్త్ డే రోజు ఈ ట్రీట్ మెంట్ దొరికినా ఏమనుకోకుండా, ఆ భక్తుడిని అనుగ్రహించాడంటే ఎంత పిచ్చి మాలోకమనుకోవాలీయన్ని? తిన్నడనే అనే ఇంకొకాయన మాంసమదీ పెట్టి, ఎంగిలి నీళ్ళతో అభిషేకం చేసి, కాళ్ళతో లింగాన్ని ముడితే, ఆతణ్ణీ ఈయన నెత్తిన పెట్టుకున్నాడు కదా. హవ్వ, హవ్వ, హవ్వ!

ఈశ్వరుడి మీద వర్ణన అంటే కాళిదాసు శ్లోకం

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ"

అంతోటి శ్లోకం ఉంది కదా అంటారు కొంతమంది. జాగ్రత్తగా గమనించండి. రఘువంశం అనే ౨౩ సర్గల ప్రో-విష్ణుమూర్తి కావ్యం రచిస్తూ, మొదట ఒకేఒక శ్లోకం శివుడికి కేటాయించాడా పెద్దమనిషి. ఆ శ్లోకంలోనూ దణ్ణం పెట్టాడు కానీ, "చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ" అనే రేంజులో పొగడ్డం లేదు. ఇంకా మాట్లాడితే శ్లోకంలో మళ్ళీ అర్ధం క్రెడిట్ పార్వతికి వెళుతుంది.(ఎంతైనా "కాళి"దాసు కదా). అదే వరుసలో రెండో శ్లోకంకెళ్ళండి, "క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్ప విషయామతిః" (రఘువంశమెక్కడ? అల్పబుద్ధి నేనెక్కడ) అంటూ ఓ పొగడ్త!

అంతచేసి, కుమారసంభవంలో ఈయన్ని వర్ణించకుండా, "అస్త్యుత్తరస్యాం దిశి " అంటూ హిమాలయాలతో మొదలెడతాడు కావ్యాన్ని.ఏమనుకోవాలి? శివుణ్ణి టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అనుకోడం గాదా?

తెలుగుకొద్దాం. ఆయనెవరో శ్రీనాథుడట. నాపేరు పెట్టుకుని, హరవిలాసం అంటూ ఇంకొకళ్ళ కావ్యం రాస్తావా అని ఆయన్ని బొడ్డుపల్లి మాన్యాలు (శంకరగిరి లో శంకరుడున్నాడు కాబట్టి, ఆ ఊరి మాన్యాలు ఒగ్గేశాడు) పట్టించాడుగా నల్లాయన.

అలాగెలాగ? "తిరిపెమునకిద్దరాండ్రా! పరమేశా గంగ విడుము పార్వతి చాలున్" అన్నందుకు శివయ్యే
ఆయనకు శిక్ష వేశాడు అంటారా? అప్పుడయినా మన పార్టీ వాడని ఏమాత్రం పక్షపాతం లేకండా శిక్షించినందుకు శివయ్యే గ్రేటు.

తను స్మార్టు కాకపోయినా తనలను కొలిచే వాళ్ళు స్మార్తులుగా అనుగ్రహించిన ఆ భోళా శంకరుడిని ఓ చిన్న శ్లోకం ద్వారా గుర్తు చేసుకుంటున్నాను.

పాతువో నీలకంఠస్య కంఠః శ్యామాంబుదోపమః
గౌరీభుజలతా యత్ర విద్యుల్లేఖేవ రాజతే !

యత్ర - ఏ చోట
గౌరీ భుజలతా - పార్వతీదేవి యొక్క లతవంటి బాహువు
విద్యుల్లేఖా ఇవ - మెరుపు తీగ వలె
రాజతే - విరాజిల్లుతోందో
(అట్టి)నీలకంఠస్య - నీలకంఠుని యొక్క
శ్యామ+అంబుద+ఉపమః - నీలిమేఘము వంటి
కంఠః - గళసీమ
వః - మమ్ములను
పాతు - రక్షించుగాక!

చిన్న శ్లోకం అయినా కొన్ని చక్కటి చమత్కారాలున్నాయిట. శివుడు ధవళవర్ణుడు. ఆయన కంఠం మాత్రం ముదురు నీలి రంగులో ఉంది. ఆ కంఠం చుట్టూ గౌరీ (గౌరవర్ణం - పసుపు ముద్ద రంగు)దేవి తాలూకు భుజలత పెనవేసుకుంది. (కౌగిలించి ఉంది).

తెల్లటి దేహమూ, నీలిరంగు గళమూ, దాన్ని చుట్టిన పసుపు రంగు తీవెలాంటి బాహువు!

నీలకంఠుని కంఠం నీలిమేఘంలా ఉంటే, అమ్మవారి బాహులత గౌరవర్ణం లా ఉందట.

నీలకంఠుని కంఠము - శ్యామాంబుదోపమ
గౌరీభుజలత - విద్యుల్లత

ఒక ఉపమాలంకారానికి, మరో ఉపమాలంకారం - ఉపమ అవుతోంది. అదీ రెండు సార్లు.

(నెనర్లు - మృచ్ఛకటికం - బేతవోలు రామబ్రహ్మం గారు)

Saturday, October 24, 2009

ఆంగ్ల చిత్రం - యండమూరి స్టైలు కథనం

బ్రూస్ విల్లిస్ మామూలుగా ప్రతీ రోజు లాగే తన FBI ఆఫీసుకు బయల్దేరేడు. ఏదో జరుగబోతోందని మనసు చెబుతోంది. ఆ ఫీలింగ్ కు అర్థం లేదు. అప్రమేయము, అనిరతము కాని ఓ అనిమిష భావన అతణ్ణి ఊపేస్తోంది.

సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి బయల్దేరబోయే ముందు అతడికి ఫోన్ వచ్చింది, ఓ వ్యక్తి కాల్పులలో మరణించినట్టుగా. బయల్దేరేడు. ఆ సంఘటన తన జీవితాన్నే మార్చేస్తుందని అతడికప్పుడు తెలీదు. హత్యాస్థలాన్ని చేరుకునేప్పటికి అరగంట పట్టింది. దాదాపు పది అడుగుల దూరం నుంచీ 0.5 mm కాలిబర్ పిస్టల్ తో కాల్చారెవరో. హంతకుని వెన్నెముక గుండా, గుండెలనుంచి తూటాలు దూసుకుపోయినట్టు కనబడుతూంది. కాస్తంత దూరంగా హతుడి వాలెట్. అది కాదు అతడు చూస్తున్నది. హంతకుని కడుపునుంచీ బయటకు వచ్చిన తీగలు, చిప్ లు. అవీ, అక్కడ నిలిచిపోయిందతని చూపు. చనిపోయిన వ్యక్తి ఓ సరోగేట్.

సరోగేట్.

ఈ పదానికి అర్థం తెలియాలంటే సరీగ్గా నలభై సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి.

*************************************************

21వ శతాబ్దం ప్రథమార్థంలో ఇంటర్నెట్ కనిపెట్టబడింది. దాంతో కంప్యూటర్ ల వాడకం ఊపందుకుంది. ఈ పరిస్థితిని మార్కెట్ లో ఉన్న అనేక కంప్యూటర్ తయారుదారీ సంస్థలు సొమ్ము చేసుకున్నాయి. అప్పట్లో అమెరికాలో దాదాపు ప్రతి వ్యక్తికీ ఓ ల్యాప్ టాప్ ఉన్నట్లు ఓ అంచనా. ఇటుపక్క జపాన్ లో రోబోల వాడకం ల్యాప్ టాప్ లంత కాకపోయినా నెమ్మదిగా, స్ఫుటంగా ఎక్కువవుతూ వస్తూంది. ఇక్కడో విషయం చెప్పాలి.

మనిషి (యజమాని) చెప్పే సూచనలను అర్థం చేసుకుని, తనలో నిక్షిప్తం అయి ఉన్న ప్రోగ్రామ్ ద్వారా ఆ సూచనలకు అనుగుణంగా స్పందించటమే రోబోల పని. ఆ ప్రోగ్రామ్ కు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేరు.

కంప్యూటర్ ల సాంకేతిక పరిజ్ఞానాన్ని రోబోలకు అనుసంధానించి, మనిషికి ప్రత్యామ్నాయంగా రోబోలను వాడవచ్చుననే ఆలోచన చేసిన వాడు మిస్టర్ వి. అతడి పూర్తీ పేరు ఎవరికీ తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఆనవాళ్ళు లేవు. ఓ ప్రభంజనంలా దూసుకొచ్చేడు. ఓ కొత్త ఆలోచనా విధానాన్ని రూపొందించేడు.

అతడి ఆలోచన ప్రకారం, మనిషి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అతడి తలకు బిగించిన వైర్ల ద్వారా మెదడులోని ఆలోచనలు ఓ కంప్యూటరుకు చేరతాయి. ఆ ఆలోచనలు సూచనలుగా మార్చబడి, రోబోలో అమర్చబడిన చిప్ కు చేరతాయి.

అంతే.

మనిషికి మారుగా మరో మరమనిషి తయారు. ఈ ఆలోచనను మార్కెట్ చేయడానికి వికలాంగులను, వృద్ధులను ఎంచుకోవడంలోనే అతడి తెలివితేటలు కనబడతాయి. "మీరు వికలాంగులా? మీరూ మామూలు మనుషుల్లా సాధారణ జీవితం గడపాలనుకుంటున్నారా? అయితే వాడండి, మీ కోసం, మా ద్వారా తయారు చేయబడిన సరోగేట్. మీరు కోరుకున్న కొత్త జీవితం కోసం" - ఇదీ అతడి స్లోగన్.

ఈ స్లోగన్ ఎంత పాపులర్ అయిందంటే, ఆ తర్వాత ఐదేళ్ళలో అమెరికాలో ఉన్న వృద్ధులలో దాదాపు 80 శాతం మంది సరోగేట్ లను కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఈ ఆలోచనను మామూలు వ్యక్తులకూ అన్వయింపజేసేడు. సాధారణ వ్యక్తులు సరోగేట్ లను పెంచుకున్నారు (ఈ పదం కరెక్టేనా?). సమాజంలో ఎవరు సరోగేట్, ఎవరు అసలు మనిషో తెలియని స్థితికి వచ్చింది.

కొందరు కొన్ని రంగాల్లో మాత్రమే అభ్యున్నతి సాధించగలుగుతారు. సాంకేతిక పరంగానూ, మార్కెట్ పరంగానూ అసాధారణ తెలివితేటలున్న వాడు మిస్టర్ వి.సరోగేట్ టెక్నాలజీ మొదట పేటెంట్ చేసి, అభివృద్ధి చేయడం అతడి తెలివితేటలకు పరాకాష్ట.

అతడి పేరు చెబితే సిలికాన్ వాలీ లో కార్పోరేట్ సంస్థల యజమానులకు కాళ్ళు చేతులు ఆడవు. అతడితో పోటీ అంటే వ్యాపారానికి శుభం చెప్పటమేనని భావిస్తారు మరికొందరు.

మిస్టర్ వి. అతడి సంస్థ పేరు వీ ఎల్ సీ.

*************************************************

నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో ప్రశాంతమైన ప్రదేశంలో కట్టబడిందా ఆశ్రమం. ఆ ఆశ్రమం ఓ మధ్యవయసు నీగ్రోది. ఆ నీగ్రో వూడూ వంటి విద్యలలో ప్రవీణుడు. సమాజంలో సరోగేట్ ల వల్ల సాధారణ జీవితం దెబ్బతింటుందని అతడి ఉద్బోధ. త్వరలోనే ఆ ఉద్బోధకు అనేకమంది ఆకర్షితులయ్యేరు. మిస్టర్ వి, ధనికులకు గాలం వేస్తే, ఈ స్వామీజీ పేదవాళ్ళను గాలం వేసి పట్టేడు.

*************************************************

ఓ సరోగేట్ హత్య చేయబడితే అందువల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడే బ్రూస్ విల్లిస్ సరిగ్గా అంచనా వేసేడు. అతడి అనుమానం స్వామీజీ మీదకు మళ్ళింది. అయితే బ్రూస్ విల్లిస్ కు తెలియనిది ఆ స్వామీజీ బలగం. అక్కడ అతని అంచనా తప్పయింది. ఆశ్రమం తాలూకు వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో, ప్రాణాలు కోల్పోతాడు బ్రూస్ విల్లిస్.

ఇక్కడ ఇంటిదగ్గర నిజమైన బ్రూస్ విల్లిస్ లేచి కూర్చుంటాడు.

చనిపోయినది బ్రూస్ విల్లిస్ కాదు, అతడి సరోగేట్ మాత్రమే.

*************************************************

అతడికి బ్రతకాలని లేదు, అలాగని చావాలనీ లేదు. దుఃఖానికి అతీతమయిన స్థితి నిస్పృహ. తను ఇన్నాళ్ళు కాపురం చేస్తున్నది ఓ సరోగేట్ భార్యతో అని ఇప్పుడే తెలిసింది. తెలిసి తెలిసి, తనే కదా అనుమతిచ్చాడు.

పక్క గదిలో తన భార్య తాలూకు సరోగేట్ మరికొంతమంది తో డ్రగ్స్ సేవిస్తూంది. గోల ఎక్కువవడంతో అక్కడికెళ్ళేడు. ఇద్దరు సరోగేట్ల సరాగాన్ని తన భార్య ఎన్జాయ్ చేస్తోంది. అతడి దవడ కండరం బిగుసుకుంది. సాచి లెంపకాయ కొట్టబోయేడు. ఏం ప్రయోజనం? నెప్పెట్టేవి తనచేతులేగా? తన ఆవేశాన్నంతా ఎదురుగా ఓ రోబో మీద చూపించి, దాన్ని బద్దలు కొట్టేడు.

ఇటు బ్రూస్ విల్లిస్ నిజమైన భార్య కుర్చీలో పడుకుని ఉంది. ఆమె చెంపమీద ఓ కన్నీటి చుక్క దిగువకు రావాలా వద్దా అన్నట్టుగా దిగులుగా చూస్తోంది.

*************************************************

స్వామీజీ ఆశ్రమం చుట్టూ జాగ్రత్తగా వలపన్నబడింది. కాల్పులు మొదలయ్యాయి. ఆ కాల్పుల్లో స్వామీజీ మరణించేడు. ఆ స్వామీజీ శవం దగ్గరకు వెళ్ళిన బ్రూస్ విల్లిస్ కు ఊపిరి స్థంభించింది. అక్కడ రక్తపు మడుగులో ఉన్నది స్వామీజీ తాలూకు స-రో-గే-ట్.

సరోగేట్ మరణిస్తే, నిజమైన వ్యక్తి ఎవరు? పెద్దగా కష్టపడకుండానే బ్రూస్ విల్లిస్ కు సమాధానం దొరికింది.

ఆ వ్యక్తి - సరోగసీ ప్రోగ్రామ్ కు రూపకర్త అయిన మిస్టర్ వి.

*************************************************

సినిమా చివర్లో బ్రూస్ విల్లిస్ మిస్టర్ వీ తాలూకు ప్రోగ్రామ్ ను నాశనం చేస్తాడు, మామూలుగా అయితే అలా నాశనం చేస్తే, వాటి తాలూకు వ్యక్తులూ నాశనమయేట్టు ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే అలా కాకుండా కేవలం సరోగేట్ లను మాత్రమే ధ్వంసం చేసేట్టు కంట్రోల్, ఆల్ట్, డిలీట్ బటన్ లను నొక్కి సరి చూసుకుంటాడు.

*************************************************

(యండమూరి రచనల గురించి కొత్తగా చెప్పే పని లేదు. మామూలుగా జరిగే వాటిని కూడా కథకుడికి పట్టేలా చెప్పడం ఓ టెక్నిక్. అది తనకు మాత్రమే సొంతం. సరోగేట్స్ సినిమాకు తను టూకీగా కథా పరిచయం రాస్తే ఎలా ఉంటుందో అన్న ఊహ ఇది. )

Thursday, October 22, 2009

ఆంగ్ల చిత్రమునకు తెలుగు సమీక్ష!

ఒకానొక బలీయమైన విధి దుర్విపాకమున క్రితము వారము నేనొక ఆంగ్ల సాంఘిక చిత్రమునుఁ జూచుట తటస్థించినది. ఆ విధివశమును ఏమని వర్ణింతును? ఆ చలన చిత్రమును గురించి హెచ్చరించి చదువరులను ఆప్రమత్తులఁ గావించుట యొక్కటే నా ప్రస్తుత లక్ష్యమని దోచుచున్నది. అందులకే ఈ సమీక్ష.

చిత్రము పేఱు "సరోగేట్స్". "సరోగేట్స్" అననేమి? "స్పయిడరు మేను", "సూపరు మేను", లేదా "బాట్ మేను", అనగా నర్థము ఛప్పున స్ఫురించును. కానీ "సరోగేట్స్" ఏమిటి నా శ్రాధ్ధము? ఇంచుక ఆంగ్ల నిఘంటువును పరిశీలింతము. అందు "డిప్యూటీ" అని వ్రాయబడి ఉన్నది. తెలుగున జెప్పవలెనన్న "ఒకని కార్యకలాపములు జూచుటకై నియమితుడయిన మరొకడు" అని జెప్పుకొన వచ్చును. ఈ చలన చిత్రమున కథ కూడా అదేను.

కథ అంతయును, భవిష్యత్కాలమున సాగును. సుదూర భవిష్యత్తులో ఒకానొక దినమున మనుజుని బుద్ధి వికటించి, తన బదులుగా కార్యకలాపములు సాగించుటకు, తనకు మారుగా ఒక యంత్రమును నియమించి, ఆ యంత్రము ద్వారా దైనందిన వ్యవహారములు సాగించును. ఆ యంత్రము మాటలాడును, ఆటలాడును, ఇంకనూ అనేక కార్యములు జేయును. అదియొక చమత్కారము.

ఇక ఆ యంత్రమును ఉపయోగించెడి మనుజుడు, సుదీర్ఘ నిద్రావస్థుడై ఉండును. తన మెదడులోని సంకేతములను గైకొని, తనద్వారా, తనకొరకు నియమింపబడిన యంత్రము, బాహ్య ప్రాపంచిక కార్యములను అత్యంత జాగరూకతతో నిర్వహించును. ఈ విధముగ, సమాజమంతయును, అనగా వ్యాపారులు, రక్షకభటులు, వివిధ ఉద్యోగులు, పిన్న వారు, పెద్ద వారు, ఒకరని యేల? అందరును యంత్రములే.

కథానాయకుడు ఒక రక్షకభటుడు. తను కూడా ఒక యంత్రమును నియమించును. ఆ యంత్రము, ఒకానొక పోరాటమందు మరణించును. మరణించినది యంత్రమే కదా. మన కథానాయకుడు మాత్రము జీవించియే ఉండును. వాడికొక భార్యా రత్నము. ఆమెయునూ తన బదులుగా యంత్రమును నియమించును. ఈ యంత్రములు రెండునూ కలిసిఁ గాపురము జేయుచుండును. కథానాయకుడి యొక్క యంత్రము మరణించిన పిమ్మట, ఆతనికి స్వచ్ఛమైన ప్రేమయొక్క ఆవశ్యకత తెలియవచ్చును. ఆతడు, తన భార్యారత్నము (యంత్రము) తో ఏమేమో మాటలాడును. ప్రార్థించును, కన్నీళ్ళు పెట్టుకొనును. ఆ యంత్రము మనసు కరుగదు. (అదంతయును నటన యని మనము భావించవలె)

వారి గోల అట్లుండనిమ్ము.

సమాజమున ఈ యంత్రముల వల్ల మానవ సహజ జీవితము నశించుచున్నదని ఒకడు గోలపెట్టుచుండును. వీడొక నల్లవాడు. వీడు నగరమునకవతల ఒకానొక ఆశ్రమమును స్థాపించి, జనావళికి సత్కర్మలు బోధించుచుండును. కథానాయకుడు ఈ నల్లవాని మాటలలోని డొల్లతనమును బయటపెట్టుటకు ప్రయత్నించుచుండును. ఒకానొక సందర్భమున రక్షకభటుల దాడియందు, ఈ నల్లనయ్య మరణించును. అంతయును జేసి, చివరికి ఏమయ్యా అన్నచో, ఆ నల్లనయ్యనూ యంత్రమే.

ప్రియమైన పాఠకులారా? మీకు ఇప్పటికే శిరః కంపము మొదలయినదని అనుకొనుచున్నాను. అందువలన ఈ చిత్రము చివర ఏమగునో చెప్పి ముగింతును. చిత్రము చివర ఈ యంత్ర వ్యవస్థను కథానాయకుడు సమూలముగ నాశనము జేయును. అన్ని యంత్రములు నశించి, తిరిగి ప్రజలు జనజీవన స్రవంతిలో గలియుదురు. ఇంతియే కథ.

బ్రూస్ విల్లిస్ అనునాతడు ఈ చిత్రమున కథానాయకుని పాత్రను పోషించెను.

ఈ చిత్రమున కథ లేదు (జదివితిరి కదా), ప్రతి నాయకుడు లేడు, హాస్య, శృంగారాది రసపోషణములు లేవు. ఇక యేమున్నది, సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి.

ఈ సమీక్షా శకలమును జదివి ఒక్కరైనను, ఇటువంటి చిత్రరాజమును వెళ్ళుటకు ముందు నిమేష మాత్రము ఆలోచించినచో, ఈ వ్యాసోద్దేశ్యము నెఱవేఱునని తలపోయుచు, విరమించుచున్నాను.

మ్లేఛ్ఛ సృజనాత్మకతకు ఉదాహరణగా జెప్పుకోదగిన ఈ చిత్రమును బహుశా లక్ష్మీగణపతీ పిక్చర్స్ వారు, తెనుగున అనువదించుదురని నా ఊహ. వారి పటాటోప ప్రకటనా పాఠములకు ఎవ్వరునూ ప్రలోభపడకుందురు గాక!

(శ్రీరమణ పేరడీల లో ఒకానొక పేరడీ - సుప్రసిద్ధ ఆంధ్ర రచయితల తెలుగు సినిమా సమీక్ష. అందులో ఆయన విశ్వనాథ వారి శైలిని అనుకరిస్తూ ఓ పేరడీ వ్రాశారు. అదే ఈ టపాకు ప్రేరణ.

ఈ టపాలో హేళన ధ్వనిస్తే క్షంతవ్యుణ్ణి. మనస్స్ఫూర్తిగా - అది నా ఉద్దేశ్యం కాదని మనవి.)

Tuesday, August 19, 2008

బంగారు పథ(త)కం!

అది ఒకప్పటి గాంధార దేశంగా పిలవబడ్డ ప్రస్తుత ఘనీభవిస్తాన్. అక్కడ ఓ భూగృహంలో అత్యవసరంగా ఓ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశానికి నాసామి బిన్ డాలిన్, పీకిస్తాన్ దేశ అధ్యక్షుడు లాపర్వా సమురాఫ్, వారితో ’భావ సారూప్యం’ గల ఇంకొంత మంది దేశాధిపతులు, ప్రపంచ శాంతిని కాంక్షించే ప్రఖ్యాత శాంతి కాముక సంస్థ ISI, ముష్కరీ తోలుబా, బుల్ బుల్ జాముద్దీన్ వంటి శాంతి కాముక (చిల్లర) సంస్థల ప్రతినిధులూ పోగయారు.



ఆ సమావేశపు అజెండా, ప్రస్తుత "నీచా" దేశంలో నడుస్తున్న ప్రపంచ క్రీడల్లో ఈ శాంతి కాముక దేశాల వారికి ఒక్క పతకం కూడా దక్కకపోవడం, ప్రపంచ క్రీడలు మొదలుపెట్టినప్పటి నుండీ ఇప్పటి వరకూ, ఎన్ని పతకాలు వచ్చాయో అన్ని పతకాలు ఓ అగ్ర రాజ్యపు (అందునా ఓ టెర్రరిస్ట్ అగ్ర రాజ్యానికి చెందిన) క్రీడాకారుడు పల్ప్ కి ఒకే రోజు దక్కడం, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవడం వంటి విషయాల గురించి చర్చించడం.



సమావేశానికి అధ్యక్షుడు, నాసామి డాలిన్ లేచి నిలబడ్డాడు. ఆ నాసామి డాలిన్ చచ్చిపోయాడని ప్రపంచం అంతా అనుకుంటున్నది. అయితే ఈ సమావేశానికి వచ్చినాయన నిజంగా అతడేనా, లేదూ, వాడి డూపు గాడా అని ఎవ్వరికీ తెలియదు.



సభ్యులందరూ లేచి ఆ..శాంత మూర్తికి అభివాదం చేశారు.



(ఆ సభ్యుల్లో బుల్ బుల్ సంస్థకి చెందిన ఓ కుర్ర సభ్యుడికి అది మొదటి ఆన్సయిటు అవడంతో, శాంత మూర్తి కి అభివాదం చేయడం మరిచాడు.వెంటనే ఆ సభ్యుడిని లాక్కెళ్ళి శిక్షగా చేతి వేళ్ళు నరికేశారు నాసామి అనుచరులు.)



నాసామి ఆరంభ ప్రసంగం చేస్తూ, ఇలా అన్నాడు.



"ఇవాళ ప్రపంచం అంతా మనం చేస్తున్న పవిత్ర యుద్ధపు పరిణామాలు చూస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా మనం ఎంతో అభివృద్ధి సాధించాం. ఎన్నో రకాల బాంబులు సమకూర్చుకున్నాం.ప్రపంచపు అన్నికోణాల్లోనూ మన శాంతి దూతలు బాంబులతో తమ పవిత్ర యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాగే మనం మరిన్ని పథకాల ద్వారా మొత్తం ప్రపంచాన్నంతా మన హస్తగతం చేసుకోవాలి.



ఇక పోతే, ఇవాళ మన తోటి దేశాలు "నీచా" దేశంలో ప్రపంచ క్రీడలు జరుపుకుంటూ, మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే మనం ఇంత శాంతి కాముకులం అనే కనీస ఙ్ఞానం లేకుండా, పతకాల్లో మనకు ఏ మాత్రం కన్సెషను ఇవ్వట్లేదు. ఆఖరుకు మన పొరుగున ఉన్న జంబూ ద్వీపానికి కూడా ఓ బంగారు పతకం కట్టబెట్టేరు, అదీ మనకు బాగా పరిచయమున్న క్రీడ లో.ఈ పరిస్థితి ని ఎదుర్కోవడం పై మీ సలహాలు కావాలి. అదీ ఈ సమావేశపు ఉద్దేశ్యం" అంటూ ముగించేడు.



"నాసామి కీ జై, నాసామికీ జై" అంటూ జయ జయ ధ్వానాలు మిన్ను ముట్టేయ్. (ఇందాక అభివాదం చెయ్యని సభ్యునికి ఏ గతి పట్టించారో చూసారు కాబట్టి, సభ్యులందరూ పాల్గొన్నారీ సారి, భయంతో వణుకుతూ!)



ఆ తర్వాత ప్రపంచ క్రీడల్లో సంస్కృతి కాపాడ్డానికి తీసుకోవాలి, కొత్త రకం పోటీలు ఏవి ప్రతిపాదించాలి (శాంతి కాముక దేశాల వాళ్ళు పతకాలు గెల్చి సావడం కోసం) వంటి వాటిపై చర్చ జరిగింది.





" క్రీడలు జరుగుతున్న కాకి గూడు స్టేడియం పై విమానం తోలి దాన్ని పేలుద్దామా?" ముష్కరీ తోలుబా సంస్థకు చెందిన కుర్ర వాడొకడు చిలిపిగా ప్రశ్నించాడు.



సభ్యులందరూ మెచ్చుకోలుగా అతని వంక చూసేరు.



లాపర్వా సమాధానం చెప్పేడు. " నీచా దేశం మనకు కావలసిన దేశం. వాళ్ళకు ఓ ప్రాంతాన్ని ఎలా కబళించాలి అనే దానిపైన మంచి అనుభవం ఉంది. అది మనకు ఉపయోగపడచ్చు. కాబట్టి, వాళ్ళ దేశపు కాకి గూడు స్టేడియం ను ధ్వంసం చేయడం మంచిది కాదు".



తోలుబా కుర్రవాడు నిరాశగా నిట్టూర్చేడు.



నీకు అంతగా పేల్చాలని ఉంటే ఈ సారి జంబూ ద్వీపం లో ఓ నగరంలో పెట్టబోయే వరుస బాంబుల ల ప్రాజెక్ట్ కు లీడర్ గా చేద్దువు గానీలే, అంటూ తోలుబా సంస్థ అధిపతి అనునయిస్తూ సర్దిచెప్పేడు. (క్రితం సారి మిసి సంస్థకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చేరు. అయితే ఈ సారి మాత్రం తమే ప్రాజెక్ట్ చేసుకోవాలని వాళ్ళ ప్లాను)



ఇలాంటి అర్థవంతమైన చర్చలతో ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి MOM (Minutes of Meeting) తయారు చేశారు. ఆ తర్వాత action items అవీ తీర్మానించి, దీనిపై తర్వాతి రోజు ఓ లిస్టు తయారు చేసారు.



ఆ రోజు రాత్రి సభ్యులకు విందు, నాసామి నడుపుతున్న ఆల్-ఖైమా సంస్థ కు చెందిన కొన్ని మర్డర్ ऽ రేప్ వీడియోల ప్రదర్శనా, లైవ్ మర్డర్ షో వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయ్.



తర్వాతి రోజు జయ జయ ధ్వానాల మధ్య క్రీడలకు సంబంధించి ఈ క్రింది తీర్మానాలు సభ్యులందరితో ఆమోదించబడ్డాయ్. (ఆమోదించని సభ్యులకు ఏం జరుగుతుందో వేరే చెప్పాలా?)



1. టెన్నిస్, పోల్ వాల్ట్, ఈత, పరుగు, జిమ్నాస్టిక్స్ లాంటి పందేలు జరుగుతున్నప్పుడు, పోటీదార్లు అసభ్యమైన బట్టలు వేసుకుంటున్నారు. ఇకపై అందరూ విధిగా శరీరంలో ఏ భాగమూ కనబడని నలుపు దుస్తులు ధరించాలి.



2. ఈటె విసరడం, ఇనప గుండు విసరడం, షూటింగు లాంటి క్రీడలు జరిగేప్పుడు శాంటి కాముక దేశాల ఆటగాళ్ళ (మానసిక ఉద్దీపన) కోసం ఆ ఈటె/గుండు/గోలీ పడే చోట సరిగ్గా, టెర్రరిస్ట్ దేశాల ప్రజలను నిలబెట్టాలి.



3. కొత్త కొత్త క్రీడలు (బాంబులు విసరడం, విమానం తో భవనాలను మోదడం వగైరా) ప్రవేశపెట్టాలి.



4. కేవలం శారీరకమైన క్రీడలే కాక మానసిక వికాసానికి తోడ్పడే క్రీడలకూ (విమానాలను హైజాక్ చేయడం, ఎవరికీ తెలియని చోట బాంబులను నిక్షిపం చేయడం) సముచిత స్థానం ఇవ్వాలి.



5. మొత్తం పతకాల్లో కనీసం 50 శాతం రిజర్వేషన్లు శాంతికాముక దేశాలకు ప్రకటించాలి.



6. టెర్రరిస్ట్ దేశాలకు కేవలం వెండి,కాంస్య పతకాల్లో మాత్రమే స్థానం కల్పించాలి.



ఈ ముషాయిరా తీర్మానాలను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించేరు. ఇకపై వీటిని అమలు జరిపాల్సిన బాధ్యత ప్రతీ పవిత్ర యుద్ధపు సైనికునిపైనా ఉన్నదని నాసామి నొక్కి వక్కాణించాడు. (దేన్ని నొక్కి అని అడగద్దు.)



ఆ మరుసటి రోజు సభ్యులందరూ సెలవు తీసుకుని, గాంధార దేశం నుండీ వాళ్ళ వాళ్ళ స్థానాలకు తిరిగి వెళ్ళి పొయేరు.



మరో పవిత్ర యుద్ధం మొదలయింది!