Sunday, July 3, 2011

తొలకరి జల్లు


ఈ మధ్య బ్లాగులు వ్రాయడంలో ఏ మాత్రం ఆసక్తి కుదరట్లేదు. ఇటు రెండేళ్ళు కుస్తీ పట్టి, అయ్యవార్లను పీడించి
నేర్పించుకున్న పద్యాలు కూడా ఎంచేతో కుదరట్లేదు. ఏదో ఒకటి రాయాలి..రాయాలి..అని మనసు లాగేస్తోంది. సరే ఏం రాద్దాం అనుకుంటే ఈ రోజు (నా డిక్షనరీలో ఈ రోజు అంటే నిన్న)  ఆషాఢమాసం అని తెలిసొచ్చింది. ఈ మధ్య న్యూసు, టీవీ పుణ్యమాని మదర్స్ డే లు ఫాదర్స్ డేలు తెలుస్తున్నాయి కానీ ఆషాఢ మాసాలు, పాడ్యమి తిథీ, నక్షత్రాలు తెలియట్లేదు. షో కేసులో ప్లాస్టిక్ పూలు చూసుకుని మురిసి పోయే రకాలం మనం. ఏదైనా ప్రశాంతంగా ఉన్న తోటలోకి పారిపోయి పూలమొక్కల మధ్య ఓ సాయంత్రం మొత్తం మౌనంగా గడిపి వస్తే మనసుకు పట్టిన తుప్పు వదిలి ఫలితం కనబడవచ్చునేమో!

విషయానికొద్దాం. ఆషాఢమాసం వర్షర్తువు, ప్రావృట్కాలం. "మాసానాం మార్గశీర్షోsహం ఋతూనాం కుసుమాకరః" అంటాడు గీతాకారుడు విభూతి యోగంలో. "నెఱ్ఱెలు విచ్చిన నేలతల్లిని చూసి పైనున్న ఆకాశం రాల్చిన అశ్రుకణం తాకే ఆషాఢ మాసం" -ఆయన్ను కదిలించలేకపోయింది. ఆయనేమో ఆనంద స్వరూపుడాయె. ఆయనకు కోకిల కుహూరవాలు, మామిడి పూతలు, చిగురించే పుష్పాలతో అవసరం. మనం మనుషులం కాబట్టి మనకు తొలకరి జల్లులు, మట్టి వాసనలు, పసి పిల్లల కాగితపు పడవలు మనకివి ఆనందం. (అఫ్కోర్సు due apologies on గీతాకారుడు)   
 
వర్షం పడుతూంటే కిటికీ పక్కన చల్లగాలి తగులుతూంటే ప్లేట్లో పకోడీలు, ఇటుపక్కన ఏ చిట్టిబాబు వీణానాదమో, ఆకాశవాణి లో ఛాయాగీత్ కానీ వింటూ, పక్కనో పాత చందమామ లేదా యువ పత్రిక తిరగేస్తూ ఉంటే.. ఆహా. స్వర్గంలో రంభలూ,ఊర్వశులు తప్ప ఇలాటి ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో.

నాకు నా చిన్నతనం నుండీ నీళ్ళ పిచ్చి విపరీతంగా ఉండేదట. అపసోపాలు పడి బడిలో చేర్పించాక, ఒక రోజు పొద్దున మా వీధి మొగదల వీధి కొళాయి నీళ్ళు అందరూ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను దానికింద తిష్టవేశానట. అలా నీళ్ళలో తడిసిపోతూ ఆనందంలో మునిగి తేలుతా ఉంటే, ఎవరో దుర్మార్గుడు మా ఇంట్లో వాళ్ళకు చెప్పి, వాళ్ళు నా తడిచిపోయిన పలక, బలపం తీసేసుకుని లాక్కుపోయి బడితెపూజ చేశారట. (ఈ విషయాలు మా ఇంట్లో వాళ్ళెప్పుడైనా చెప్పుకుంటూంటారు) ఆ తర్వాత ఏడవ తరగతిలో ఓ మారు మా ఫ్రెండు ఇంట్లో దిగుడు బావి ఉంటే అక్కడకెళ్ళి మునగబెండ్లవీ కట్టుకుని ఈత నేర్చుకుందుకు ప్రయత్నిస్తే, ఆ కుట్రను కూడా మా ఇంట్లో వాళ్ళు కనిపెట్టి భగ్నం చేశారు.

మూడేళ్ళ తమ్మి (సంహిత) కి కొన్ని నాన్న బుద్దులు వచ్చాయి. అమ్మ వారసత్వం కూడా (తమ్మి వాళ్ళమ్మ రైతుబిడ్డ). నాన్న బుద్దులు విజృంభించినప్పుడు వర్షంలో/నీళ్లలో ఆటలు, అమ్మ వారసత్వం బలంగా పని చేసినప్పుడు మా ఇంటి వెనుక చెట్లకు పాదులు తవ్వడం వంటి శ్రమజీవి లక్షణాలు అలవర్చుకుంది. నాకైతే అమ్మవారసత్వం ఇబ్బంది లేదు కానీ, మా ఆవిడ మాత్రం తమ్మి తాలూకు నాన్న బుద్ధుల్ని నిరసిస్తుంది. వర్షంలో తడిస్తే కసురుతూంటుంది.

రెండేళ్ళ క్రితం ఓ రోజు బస్సులో వెళుతున్నాను. బయట చినుకులు పడుతున్నాయి. ఆకాశం మన కళ్ళు పడితే
దిష్టి కొడుతుందేమో అన్నంత అందంగా ముస్తాబయింది. అప్పుడు బయట ఆకాశం, కిటికి పక్కన అలవోకగా జల్లు
కొడుతున్నప్పుడు మృచ్ఛకటికం అనే సంస్కృతనాటకం పుస్తకం చదివాను. ఆ నాటకంలోనూ కాకతాళీయంగా (ఐదవ అంకం) వర్ష రుతు వర్ణన. ఆ నాటకంలో సందర్భం ఇది. నాయిక వసంతసేన తన ప్రియుడి ఇంటికి వెళుతూంటుంది. ఆమెకు తోడుగా ఒకతను. వాళ్ళిద్దరూ (గాసిప్పులవీ కాకుండా) వర్షం గురించి మాట్లాడుకొంటూ, వర్షాన్ని వర్ణిస్తూ ఉంటారు.

" ఆహా ఈ నల్లమబ్బులు విరహిణుల హృదయాల్లాగా ఎంత భారంగా ఉన్నాయి? ఇదుగో ఈ ఉరుములు విని నెమళ్ళు పైకెగిరి, రెక్కలు అల్లల్లాడిస్తూంటే, ఆకాశాన్ని ఎవరో మణిమయవింజామరలతో వీస్తున్నట్టు లేదూ!"

"మేఘుడు వర్షధారలనే శరాలతో కొట్టి చంద్రుణ్ణి వశపర్చుకున్నాడు. ఉరుములు ఈ యుద్ధంలో భేరీనినాదాలు. మెఱుపులు మేఘుని విజయపతాకలు. చంద్రకిరణాలు - చంద్రుడు పన్నుల ద్వారా ప్రజలను పిండి వసూలు చేసిన సొమ్ము. వాటిని మేఘుడు కబళించాడు."

"ఈ దట్టమైన మేఘం చూడు! ఏనుగాలాగా ఉంది. ఆ కొంగలబారును చూశావూ! ఏనుగు కుంభస్థలంమీద అలంకరించిన పట్టుపాగాలానూ, మెఱుపులు వింజామరల్లానూ లేవూ?"

"ఆ పైనున్న మేఘాలు ఇంద్రుడి ఆజ్ఞ మేర మెఱుపులనే వెండి మోకులు విడిచి భూమిని కట్టి పైకి లాగుతున్నట్టుగా ఉంది!"

"ఆ కదంబ వృక్షం ఎఱ్ఱటి దివ్వెలా ఎలా వెలిగిపోతుంది చూడు!"

"దుష్టుడికి చేసిన ఉపకారాల్లాగా నక్షత్రాలు ముఖం చాటు చేశేసాయి.  ప్రోషితభర్తృకలలాగా దిక్కులు శోభను కోల్పోయినాయి."

"ఈ ఆకాశం మెఱుపులతో మండుతూంది. కొంగల గుంపుతో నవ్వుతూంది. హరివిల్లుతో కయ్యం పెట్టుకుంటూంది. పిడుగులతో అరుస్తూంది. మబ్బులతో ధూపంలా ఉంది"

....
....
....

అన్నట్టు ప్రోషిత భర్తృక = సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్య అని అర్థమట. ఈ మధ్యే తెలిసింది.

మృచ్ఛకటికం లో ఈ వర్ష ఋతు వర్ణన, సంస్కృత సాహిత్యంలో ఎన్నటికీ నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన వర్ణనగా పండితులు చెబుతారు.

అంత హెవీగా కాకపోయినా మన రవీంద్రుడు కూడా వర్షాన్ని తెగ వర్ణిస్తాడు. ఉరుముల శబ్దం, వలలో చిక్కిన అడవిదున్న ఆర్తనాదంలా ఉందంటాడాయన. ఈ వర్ణనలకన్నా, నాకు మాత్రం (కవీంద్రుని) కాగితపు పడవ తెగ నచ్చుతుంది. మా పాపకు కూడా.