Showing posts with label బాల్యం. Show all posts
Showing posts with label బాల్యం. Show all posts

Sunday, April 10, 2011

కర్రదెబ్బలూ - మొట్టికాయలూ

గు శబ్దః అంధకారః రు శబ్దస్తు తన్నిరోధకః
అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే ||

గురు అంటే అంధకారాన్ని వదిలించి కాంతిపథాన్ని దర్శింపజేసేవాడురా. ఎవడ్ని బడితే వాణ్ణి గురు అనకూడదురా రేయ్. శాస్త్రి సారు చెప్పారు.

గురు అని సినిమా ఉంది సార్, అది చూడచ్చా? వెనకబెంచీ వాడొకడు ధర్మసంకటం వెలిబుచ్చాడు. అయ్యవారికి కోపమూ, నవ్వూ వచ్చినై. నవ్వు దాచుకుని, కోపం చూపిస్తూ వాడి చెవులు పట్టుకుని వీపు వంచారు. జేబు నుంచీ నేత ముళ్ళకంప ఆకు కాస్త కిందపడింది. లేత ముళ్ళకంపాకు జేబులో కూరుకుంటే ఆ రోజు దెబ్బలు తగలవని పిల్లకాయలకు ఒక నమ్మకం.

ఇదేందిరా? అయ్యవారు పక్కన పిల్లవాణ్ణి అడిగారు.

"సార్. అది జేబులో పెట్టుకుంటే తన్నులు పడవంట సార్." - చెప్పాడా అబ్బాయి.

బెల్లు కొట్టారింతలో.

అయ్యవారు కిందపడిన ఆ ఆకులు తీసి ఆ పిల్లవాని జేబులో కూరి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

"అమ్మయ్య. దెబ్బలు తప్పినయ్ గురూ.." వాడు పక్కనున్న పిల్లవానితో అన్నాడు.

**************************************************************************

మరో అయ్యవారు వచ్చారు. ఈ అయ్యవారికి కోపమొస్తే రూళ్ళకర్ర తెప్పిస్తారు. దేవుడికన్నా పూజారి వరం అవసరమని ఆ రూళ్ళకర్ర తెచ్చే ప్యూపిల్ లీడరుకు తెగ డిమాండు. ఒక్కోసారి అయ్యవారి హిట్ లిస్టులో అస్మదీయులు ఎక్కువగా ఉంటే, సారు ఆజ్ఞ అయిన తర్వాత రూములో రూళ్ళకర్ర దాచిపెట్టి వచ్చి, అయ్యవారికి "కర్ర దొరకలేదు సార్" అని చెబుతుంటాడు.

ఆ రోజు పూజారి పాత్రధారి దగ్గరకు గోపాల్ వచ్చాడు.

"ఒరే, నేను హోమ్ వర్కు చేయలేదు, ఈ రోజు సారుతో తన్నులు తినకుండ నువ్వే ఏదో చెయ్య"మన్నాడు. వీడు "నాకేమిస్తావ"ని అడిగినాడు.

పూజారికి రెండు కమ్మరకట్టలు, ఒక జీడి మామిడి కాయకు ఇచ్చేలా బేరం కుదిరింది.

అయ్యవారు రానే వచ్చారు. రూళ్ళకర్రకు పురమాయించారు. కాసేపటికి - "రూళ్ళకర్ర కనిపిస్తా లేదు సార్" అన్న సమాధానం వచ్చింది. సరిగ్గా అక్కడ, ఆ రోజు కథం అడ్డం తిరిగింది.

అయ్యవారి కోసం ఎవరో అతిథి వస్తే తన రూముకు తీసుకు వెళ్ళారు. అక్కడ అతిథి అల్మైరా పక్కన కుర్చీలో కూర్చుని ఉంటే అల్మైరా పైనుండీ రూళ్ళకర్ర దొర్లుకుంటూ వచ్చి తన తలమీద పడింది. అతిథిని పంపేసి రెట్టించిన కోపంతో క్లాసుకు ఒచ్చినారు. ప్యూపిల్ లీడరు రూళ్ళ కర్రను అల్మైరా పైన దాచి ఉంచినాడని అర్థమయిపోయిందాయనకు. అయితే అతని సంగతి పక్కనబెట్టి వస్తూనే హోమ్ వర్కు గురించి ఆరా తీశారు.

గోపాల్ కు ఇక అర్థమైపోయింది. అయితే వాడు పంచతంత్రంలో ప్రాప్తకాలజ్ఞుడిలాంటి వాడు. అయ్యవారు రూళ్ళకర్రతో కొట్టడం మొదలెట్టగానే ఫిట్స్ వచ్చినవాడిలా పడిపోయి తల అటూ ఇటూ కదల్చడం మొదలుపెట్టినాడు. అయ్యవారి కోపం బెరుకుగా మారింది. ఏదో కీచైను చేతిలో పెట్టి, నీళ్ళు చల్లి ఇట్లా ఏదేదో చేసినాడు. ఆ గొడవలో అసలు దొంగను మర్చిపోయినాడు.

ప్యూపిల్ లీడరే కమ్మరకట్టలు, మామిడికాయలూ, రసగుల్లాలు ఇచ్చుకోవలసి వచ్చింది చివరికి.

మా గోపాల్ గురించి రెండు మాటలు. చిన్నప్పుడు నువ్వేమౌతావురా అంటే అందరూ నేను డాక్టరు, ఇంజినీరు, టీచరూ - ఇట్ల చెబితే వాడు మాత్రం రాజకీయనాయకుడైతానని అన్నాడు. ఇప్పుడు ఏదో పల్లెలో సర్పంచ్ అయినట్లున్నాడు.

**************************************************************************

మరో పీరియడు వచ్చింది. ఈ అయ్యవారు క్లాసులో సైలెన్స్ ను ఇష్టపడతారు. అలా క్లాసంతా సైలెంటుగా ఉంటే ఆయన పుస్తకం మధ్యలో చందమామ పెట్టుకుని హాయిగా చదువుకుంటుంటారు. అనువాదం క్లాసు కాబట్టి చెప్పేదేమీ లేదు. తరతరాల సంపదగా వస్తున్న నోట్సు రాసుకోవడమే.

సైలెన్సు పాటించడం కోసం ఈయన భేదోపాయం అనుసరిస్తారు. ఎవడైనా మాట్లాడితే పక్కన వాడు మొట్టికాయ వేయమని చెప్పారు.

కాసేపు బానే ఉంది. ఆ తర్వాత ఒకడికి మొట్టికాయ పడింది. "ఎందుకు కొట్టావు?" అని అడిగాడు వాడు. తక్షణం రెండు మొట్టికాయలు - ఇవతల వాడు, అవతలి వాడు వేశారు. (మాట్లాడాడు కాబట్టి). వీడు వస్తున్న కోపం దిగమింగి మొదటి మొట్టికాయకు ప్రతీకారం తీర్చుకుందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యర్థి పడనీయడం లేదు. అయ్యవారు ధ్యానముద్ర నుండి లేవగానే మొదటి బెంచి లో సీను కనబడింది. వాడెవడో (ఇందాకటి ప్రత్యర్థి) ఊరికే కూర్చుంటే వీడు వాణ్ణి తన్నడానికి వెళుతున్నాడు! "రేయ్ వీడికి ఒకటెయ్యండ్రా". ఈ సారి ఒరిజినల్ సఫరర్ కు ఇటువైపు, అటువైపు మాత్రమే కాకుండా వెనుకనుండి రెండూ వెరసి నాలుగు మొట్టికాయలు పడ్డాయి.

**************************************************************************

(ఈ మధ్య మా ఊళ్ళో స్కూలు మిత్రులం కలిసినప్పుడు గుర్తుకు వచ్చిన జ్ఞాపకాలు కొన్ని)

Thursday, November 25, 2010

రామాశాస్త్రి గారి భార్య

సత్యం దానమథాద్రోహ అనృశంస్యం త్రపా ఘృణా
తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతీరితః - (మహాభారతం శాంతిపర్వం)

ఎవనిలో సత్యము, దానము, ఇతరులకు అపకారం చెయ్యకపోవడం, మృదుత్వం, సిగ్గు (ఎవరేమనుకుంటారో అన్న జంకు), జాలి, తపస్సు ఉంటాయో అతను బ్రాహ్మణుడు.

**********************************************************************************

"రాజమ్మా రెండు ఇడ్లీలు" - రామాశాస్త్రి మా ఇల్లు/హోటలు గుమ్మం దగ్గర వచ్చి అడిగేరు.
"ఇదిగోండి స్వామీ" ఓ పేపరు, ఆ పైన అరటి ఆకు అందులో వేడి వేడి ఇడ్లీలు, పల్చటి చట్నీ  మా అమ్మ ఆయనకు అందించింది. పొద్దున 8:30 గంటలవుతోంది. నేను అప్పుడే బడికి వెళ్ళడానికి ఆయత్తమవుతున్నాను. శాస్త్రి గారు, నన్ను చూసి పలకరింపుగా నవ్వారు.

పొద్దున బ్రాహ్మీముహూర్తంలో లేవగానే, మడితో భార్య అందించిన నీటి కడవను దేవళంలోనికి తీసుకువెళ్ళి, అభిషేకం చేసి, రుద్రమూ అదీ చదివి, రోజూవారి పూజలు నిర్వహించిన తరువాత దేవస్థానం పురోహితులు శాస్త్రి గారు మా చిన్న హోటలుకు వచ్చి అప్పుడప్పుడు టిఫిన్ తీసుకుంటుంటారు. శాస్త్రి గారి భార్యగారు (పేరు గుర్తు లేదు) కూడా తర్వాత నిదానంగా మా అమ్మ చేసే ఇడ్లీల కోసం రావడం కద్దు.  ఏదైనా పండగ పబ్బం ఉన్న రోజుల్లోనైతే - పూజ అయిపోయి భక్తులకు ప్రసాద వితరణ జరిగింతర్వాత మా ఇంటికి ప్రసాదం పట్టుకొచ్చి ఇచ్చేవారు శాస్త్రిగారు. ఆయన మర్చిపోతే ఆయన భార్య.

శాస్త్రి గారు సన్నగా ఉన్నా, చుఱుకుగా ఉండేవారు. కోలగా మానవల్లి రామకృష్ణకవి గారిలా ముఖవర్ఛస్సు. ఎప్పుడూ అడ్డపంచె, ఉత్తరీయం. షర్టు, పేంటులలో నేనాయన్ను చూసింది లేదు. శాస్త్రి గారి భార్య స్థూలకాయురాలు. కాస్త కష్టంగా నడిచేది. గుండ్రంగా, దయగా ఉన్న ముఖం, నవ్వుతున్న కళ్ళు. నిజానికి మా అమ్మలానే ఉండేది.

మా ఇంట్లో నాకూ, మా అన్నకూ కొబ్బరిపూర్ణం అంటే తెగ ఇది (ఇది = ఇష్టం + ఇంకాస్త). వినాయక చవితి రోజు - మా అమ్మ ఇంట్లో తమిళుల ఇళ్ళలో లాగా కొబ్బరిపూర్ణం బియ్యప్పిండి మధ్యలో పెట్టి ఆవిరి కుడుములు చేసేది. వీటికి తమిళభాషలో "కొఝకట్టై" అని పేరు.(మా అమ్మకు అన్ని దక్షిణభారతదేశ వంటలూ వచ్చు). ఇవి కజ్జికాయలు కావు. తెల్లగా చిన్న చిన్న ముద్దల లాగా అగుపిస్తాయి. (బొమ్మ చూడండి) అలాగే కారం కుడుములు కూడాను.సదరు కొబ్బరి పూర్ణం కుడుములు చేయడానికి కొబ్బెర - శాస్త్రిగారి ఆవిడే స్పాన్సరు మా అమ్మకు. మా అమ్మ కుడుములు చేసిన తర్వాత శాస్త్రిగారికి పంచడమూ ఒప్పందంలో భాగమే.

శాస్త్రి దంపతులకు పిల్లలు లేరు. అంచేత వాళ్ళ ఇంటికి ఏ పిల్లవాడు వెళ్ళినా, ఏదో ఒకటి దొరకబుచ్చుకోవడం రివాజు. కనీసం కొబ్బరి ముక్కయినా సరే. ఇక మా అమ్మకు, ఆవిడకు పులుసులు, కూరలు, పప్పుల మధ్య అండర్ స్టాండింగు కావలసినంత. ఏదైనా బావుందని అనిపిస్తే, ఆవిడ మా ఇంటికి ఓ గిన్నెలో తన వంట పంపడం, మా అమ్మ వాళ్ళింటికి పంపడం తెర వెనుక జరిగే ఆనవాయితీనే. పొరుగింటి కమ్మనైన కూర కాబట్టి నేనూ, మా అన్నా కూడా వాటికి ఎగబడ్డం మామూలే.

అలాగే మా ఇంట్లో ఏ వ్రతమో, అబ్ధీకమో వచ్చినా శాస్త్రి గారు రావలసిందే, పూజ జరిపించవలసిందే. మా అమ్మ వంట ఆయన రుచి చూడవలసిందే.

ఆ రోజుల్లో టీవీలు, అవీ లేవు కాబట్టి సాయంత్రం పూట తీరుబడిగా ఉంటే మా అమ్మా, ఆవిడా అలా మాట్లాడుకుంటూ ఉండడం, మా అమ్మ వాళ్ళింటి గుమ్మం దగ్గర ఉందన్న కారణంతో మేమక్కడకి వెళ్ళి, ఆ మిష మీద శాస్త్రి గారి ఇంట్లో ఏ కలకండో, కొబ్బరి ముక్కలో, పంచామృతమో కాజెయ్యడం అలవాటైన పని. శాస్త్రి గారు గుంభనంగా పిల్లలను చూసి నవ్వుకోవడమూ, ఆయనను చూసి ఆ ఇల్లాలు మురిసిపోవడమూ ఇవన్నీ - ఈ రోజు నీలి ఆకసంలో తేలియాడుతూ వెళ్ళే చిన్న చిన్న మేఘపు తునకల్లా గుర్తుకువచ్చే మధురమైన జ్ఞాపకాలు.

నాకు ఎనిమిదో ఏటననుకుంటాను. వడుగు చేయాలని నిశ్చయించారు మా తాతయ్య. ఓ శంకర జయంతి రోజు సార్వజనిక ఉపనయనాలు జరుగుతుంటే అందులో భాగంగా మాకు ఉపనయనం చేశారు. ఆ తంతు ముగిసిన తర్వాత వటువు నలుగురి వద్దా భిక్ష స్వీకరించాలి. ఆ రకంగా నాకు మొదటి భిక్ష శాస్త్రి గారి భార్య పెట్టారు.

జీవితంలో అన్నీ సౌమ్యంగా, ఆహ్లాదంగా జరిగితే అది జీవితమెలా అవుతుంది? శాస్త్రి గారి జీవితంలో అతిపెద్ద విషాదం అనుకోకుండా జరిగింది. ఏదో పండుగకోసం దేవళాన్ని శుభ్రం చేస్తూ, సున్నం అదీ తనే స్వయంగా కొడుతున్నారు. వాళ్ళావిడ ఆయనకు ఏదో సహాయం చేస్తున్నారు. ఇంతలో ఆమె కుర్చీలోంచి జారిపడ్డదట. పెద్దగా దెబ్బలవీ తగల్లేదు కానీ, ఎంచేతో ఏమో - "రేపట్నుంచి నేను మీకు ఏమీ చేయలేను" అని అన్నారట ఆవిడ శాస్త్రి గారితో. ఆ మాట పొల్లుపోకుండా జరిగింది.

మరుసటి రోజు ఉదయం ఆవిడ స్నానం చేయడానికి మా ఊరి కెనాలు (కాలువ) వద్దకెళ్ళింది. కాస్తంత ప్రశాంతంగా స్నానం చేద్దామని జనం తక్కువగా ఉన్నచోటికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో, ఏమో ఎవరూ చూడలేదు. కాసేపటి తర్వాత ఆమె రాకపోతే ఖంగారుపడి శాస్త్రిగారు చూద్దురు కదా, గట్టు మీద ఆమె ఉంచిన పొడిచీర మాత్రం కనిపించింది. ఇంతలో జనం వచ్చారు. అందులో ఒకరిద్దరు నీళ్ళలో వెతికారు. దొరక్కపోతే కాస్త బాగా ఈత వచ్చిన సంజీవులు వచ్చాడు. ఆమె శవం దాదాపు మూడు కిలోమూటర్ల దూరంలో నీళ్ళలో దొరికింది.

మరణానికి సరిగ్గా ఒక్క రోజు ముందు చాలామందికి తమ మరణం రేపేనని తెలుస్తుందట. ఇది ఆమె విషయంలో ఋజువయ్యింది. (మా తాతయ్య, అమ్మగార్ల విషయంలోనూ ఇది జరిగింది).

ఆ తర్వాత శాస్త్రి గారు గుడి పౌరోహిత్యం మానివేశారు. మరోచోట ఉంటూ కాలం వెళ్ళదీశారు. అప్పుడప్పుడూ మమ్మల్ని చూసినప్పుడు మొహమాటం, పలకరింపు కలిగిన నవ్వు ఒకటి విరిసేది.

కొన్నేళ్ళ క్రితం మా ఇంట్లో ఆయన గురించి అడిగితే, ఆయన పోయాడని, అనాయాసంగా అరగంటలో ప్రాణం విడిచారని విన్నాను. ఒకరి మీద మరొకరికి అంత గొప్ప అనురాగం, అప్యాయతా ఉన్న దంపతులను, దాంపత్యాన్ని, తను నడివయసులో ఉన్నప్పటికీ భార్య పోయిన తర్వాత విరాగి అయి, అత్యంత సాధారణమైన జీవితం గడిపిన భర్తనూ నేను మరెక్కడా చూడలేదు, ఈ రోజు వరకూ.

ఇప్పుడూ ఏదో తెలియని లోకంలో - శాస్త్రిగారి భార్యా, మా అమ్మా ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. శాస్త్రి గారు వడివడిగా తనదైన నడకతో అక్కడికొస్తారు. మా అమ్మ లేవబోతే, "కూర్చో రాజమ్మా" అని ఇంట్లో ఏ కర్పూరమూ తీసుకొని అక్కడినుండి నిష్క్రమిస్తారు! ఆ ఇల్లాలు నవ్వుముఖంతో లోపలికెళ్ళి ఏ కొబ్బరి ముక్కో, కలకండో, ఎండిన ఖర్జూరం ముక్కో తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెడుతుంది! ఆ కలకండ తాలూకు తీపి, ఇలా మధురమైన జ్ఞాపకంగా నన్ను పలుకరిస్తుంది!

Thursday, July 15, 2010

జ్ఞానార్జన

ఆచార్యాత్ పదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా |
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ ||

గురువు నుండి ఒక పాలు, స్వమేధతో ఒక పాలు, ఇతరుల వల్ల ఒకపాలు, కాలక్రమేణా ఒక పాలు. శిష్యుడు ఈ విధంగా జ్ఞానం స్వీకరిస్తాడు.

***********************************************************

ఓ వారం పది రోజుల క్రితం తమ్మి (రెండేళ్ళకు ఓ నెల తక్కువ వయసున్న మా పాప) పలక, చాక్ పీసు పట్టుకుని దగ్గరకొచ్చింది. తను అలా నా దగ్గరకు రావడం, నేను గుర్రం బొమ్మ వేస్తే చూసి గాడిదని, ఏనుగేస్తే పందని అనడం మామూలే. నేను రూటు మార్చి పందులు, కుక్కల బొమ్మలెయ్య్డడం అనే అడ్వాన్సు స్టేజు కూడా వచ్చింది. అయితే ఈ రోజు తను వచ్చింది వేరే విషయమై.

"ఏం చేత్తున్నావు?" అడిగేను పాపను.
"ఏ రాతినా" అంటూ పలక చూపించింది. అవును పలక మీద అది "A" రాసింది.
మొదట ఆశ్చర్యమేసింది.
"ఏదీ, మళ్లీ రాయి" అడిగాను.
"తలే" అని A ఎడమవైపు కొస నుండి మొదలెట్టి, పైకి తీసుకెళ్ళి, అట్నుంచి కిందికి తీసుకొచ్చి, అడ్డగీత కంటికి కనిపించనంత వేగంతో గీసింది. (షాడో అలంకారం)

ఎలా నేర్చుకుందబ్బా ఆలోచించాను. అర్థమయింది. మా ఆవిడ పిన్నిగారు పిల్లలకు ట్యూషన్ చెబుతుంటారు. ఆ పిల్లల దగ్గర చేరి వెలగబెట్టిన నిర్వాకం ఇది. సో, పైన శ్లోకంలో మొదటి పాదం (గురువు నుండి నేర్చుట) బైపాస్ అయిపోయి మూడవపాదంలోకి (ఇతరులనుండి నేర్చుట) అడుగుపెట్టింది.

మా పాప మొదటి సారి "అమ్మ" అనే ప్రయత్నం చేసినప్పుడు -
Baby joy
Baby joy.mp4
Hosted by eSnips


మొదటిసారి గోడవారగా నుంచున్నప్పుడు -


మొదటిసారి చెంగావి రంగు చీర కట్టినప్పుడు

మొదటి సారి పాక్కుంటూ  ఇంటి వరండా దాటిన సందర్భంలో ఇంట్లో కుడుములు చేసినప్పుడు -
మొదటి సారి కుర్చీ ఎక్కడం నేర్చుకున్నప్పుడు -
మొదటి సారి నడిచినప్పుడు -
మొదటి సారి ’నాన్న" అన్నప్పుడు -

ఏదో లోకంలో ఉన్నట్టు బానే గడిచింది కానీ పలక మీద A రాయడం మొదట్లో బానే అనిపించినా తర్వాత "అ" రాయకుండానే A రాయడం కొంత మింగుడుపడలేదు. అయితే ఎవరూ నేర్పించకుండా తనే నేర్చుకుంది కాబట్టి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అయితే "తెలుగు", మాతృభాష, ఇంకాస్త గీర్వాణ భాష ఫీలింగులు ఉన్న నేను పాప విషయంలో ఓ హిపోక్రైట్ గా మారే రోజు దగ్గరలో ఉందని చూచాయగా అనిపిస్తోంది.

***********************************************************

సమయం వచ్చింది కాబట్టి నాకు అక్షరాలు నేర్పించిన గురువును కూడా స్మరిస్తాను. నాకు "అ" దిద్దించిన అయ్యవారి పేరు శంకరయ్య గారు. మా అమ్మా నాన్నా, నన్ను బడిలో "వేయ"డానికి యమ యాతన పడ్డారుట. బలవంతంగా ఆయనకు ఒప్పగించారుట. బడిలో పెద్దబెల్లు కొట్టేవరకూ ఇంటికి రావద్దంటే, కాసేపటికే పరిగెత్తుకొచ్చానట. "ఏరా ఇంతలోపే వచ్చావు" అనడిగితే, "ఆ శంకరయ్య, బెల్లే కొట్టి ఛావడు, అందుకని నేనే వచ్చేశా" అని చెప్పానట. బడిలో బెల్లు కొట్టే గుమాస్తా పేరు కూడా శంకరయ్యే.

ప్యూను శంకరయ్య ఏవో కారణాల వల్ల స్కూలు ఉద్యోగం మానేసి, ఓ సైకిలు షాపు, సోడాల షాపు నడుపుకుని కొన్నేళ్ళ క్రితం చనిపోయాడు.

శంకరయ్య మాస్టారు గురించి. ఆయన లింగాయతులు. మాట కర్కశం. మనసు వెన్న. ఆయన కోదండం వేస్తానని బెదిరించడం నాకు బాగా జ్ఞాపకం. ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకూ ఒకే స్కూల్లో చదివి, వీడుతున్నప్పుడు చివరగా ఆయన్ను కలిశాను. తను పెంచిన మొక్క సొంతంగా ఎదుగుతుందన్నట్టుగా ఆయన చూపు. అదే నాకు దొరికిన ఆఖరు చూపు కూడాను. కొన్నేళ్ళ తర్వాత ఆయన చాక్ పీసుల తాలూకు ధూళి ఊపిరితిత్తుల్లో చేరుకుని, శ్వాస తీసుకోవడం కష్టమై స్వర్గస్తులయ్యారు. ఆయనకు ముగ్గురు కొడుకులు. చివరి అబ్బాయి పేరు కూడా రవి. వాళ్ళు అందరూ బానే ఉన్నారని విన్నాను.

***********************************************************

మళ్ళీ శ్లోకానికి. శ్లోకం కాస్త పరిశీలిస్తే నాకో విషయం అనిపిస్తున్నది. స్వమేధతోనూ, కాలక్రమేణా ఒకరి బుద్ధి వికసిస్తుంది. గురువు వల్ల, ఇతరులను చూసి హృదయం వికసించాలి. అప్పుడే చదువు సంపూర్ణమవుతుంది అని నేను భావిస్తాను.

Monday, August 31, 2009

జానెడు సైజు జానపద నవలలు


"అబ్బా, సెగట్రీ, ఎప్పుడూ పనులూ బిగినెస్సేనా, మడిసనింతర్వాత కూసింత కలాపోసనుండాలి. పరగడుపునే కూసింత పచ్చిగాలి పీల్చి ఆ పత్యచ్చ నారాయుడి సేవజేసుకోవద్దూ".............

ఇంచుమించుగా అదే పద్ధతిలోనే -

"అబ్బా, ఎప్పుడూ చందమామ, బాలమిత్రలేనా. చదివి చదివి బోరు కొడతా ఉంది. కొత్తగా ఏమైనా కొనక్క రావా అమ్మా?".................

నా భ్రాతాశ్రీ అమ్మ దగ్గర అర్జీ పెట్టుకున్నాడు చిన్నప్పుడు.

ఇప్పుడంటే చందమామ చుట్టూ బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా ముసురుకుంటున్నాం కానీ, అప్పట్లో చందమామ రాగానే, దానికోసం - అక్కకూ చెల్లికీ, అన్నకూ తమ్ముడికీ, అక్కకూ తమ్ముడికీ...ఇలా ఏ ఇంట్లో ఏ కాంబినేషన్స్ ఉన్నాయో వారందరికీ మధ్య ఓ సంకుల సమరం జరిగి, ఎట్టాగోలా చందమామ దక్కిన తర్వాత - తీరా చూస్తే, ఓ గంట కంతా పుస్తకం చదవడం అయిపోతుండేది. తిరిగి ఇంకో నెల వరకు వెయిటింగు.

అదుగో..ఆ పరిస్థితి చూసి చూసి, విసిగి వేసారి ఒక రోజు మా అన్న అమ్మ దగ్గర పైన చెప్పిన రకంగా అర్జీ పెట్టుకున్నాడు. ఆ అర్జీ అమాయకమైన అర్జీ కాదు. అఖండుడతను. అంతకు ముందే బాలభారతి పుస్తకం చివరి అట్టమీద రెండు పొట్టి జానపద నవలల ఆడ్స్ చూసి పెట్టుకున్నాడు.

"ఏమి చెయ్యమంటావురా? " అమ్మ విసుక్కుంది.

"వేరే రకం పుస్తకాలు కొనుక్కుంటా". అమ్మ ఏ కళనుందో ఏమో, "సరే. ఏ పుస్తకం" అడిగింది.చెప్పాడు భ్రాతాశ్రీ.

"ఇవా?" కొంచెం సందేహించింది మాతాశ్రీ. (ఇవి దయ్యాలు, భూతల కథలు కదా. ఇవి పిల్లలు చదవచ్చా?)

"సరే. ఒక్క పుస్తకం మాత్రమే". బడ్జెట్ సాంక్షన్ చేసింది మా అమ్మ. అప్పుడా పుస్తకం ఖరీదు 1-75 పైసలు.

చందమామల నుండి మొట్టమొదటి సారి అప్ గ్రేడ్ అయిన వైనం అదీ. నేను చదివిన మొట్టమొదటి పొట్టినవల పేరు గుర్తు లేదు, కానీ ముఖపత్రం, చూచాయగా కథ గుర్తుకు ఉన్నాయి.

ఈ నవలల్లో కథ 80 వ దశకం తెలుగు సినిమాల్లోలాగ కొన్ని ఫిక్సెడ్ ఫార్ములాలు.

ఫార్ములా 1 : ఒక రాజుకు ఎన్ని నోములు నోచినా పిల్లలు కలుగరు. చివరికి ఎలాగోలా ఒక పాప పుడుతుంది. యువరాణీ వారు యుక్తవయస్కులవగానే, ఎవడో పొద్దుపోని మాంత్రికుడొకడు ఆమెను ఎత్తుకుపోతాడు. ఇక ఒక క్షత్రియ యువకుడు ఆమెను వెతుకుతూ వెళతాడు. చివరికి ఎక్కడో సప్త సముద్రాలకవతల ఏ చిలుకలోనో సేఫ్ గా ఉన్న ప్రాణాలను తీస్తాడు. యువరాణి + యువరాజు ఆల్ హాపీస్. యువరాణి కాకపోతే, రాజుకున్న జబ్బు మాన్పించటం - ఇక్కడ వెళ్ళటం ముఖ్యం, ఎందుకు అన్నది కాదు. అలాగే చివరకు మాంత్రికుణ్ణి చంపుతాడు అన్నది ముఖ్యం కాదు, మధ్య దారిలో ఏం జరిగింది అన్నది మాత్రమే ముఖ్యం.

ఫార్ములా 2 : ఒక రాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తుంటాడు. (అంటే మరీ జోకొట్టటాలు, గోరు ముద్దలు తినిపించడాలు ఇలా కాకుండా). అతని సేనాపతి దుర్జయుడికి ఈ కాన్సెప్టు నచ్చదు. రాజ్యాన్ని దొంగగా తన ఏలుబడిలోకి తెచ్చుకోవాలని చూస్తాడు. ఇంతలో ఊళ్ళో ఒక ముసుగు వీరుడు బయలుదేరి అక్కడక్కడా కొన్ని వీరోచిత కృత్యాలు చేస్తుంటాడు. ఈ ముసుగు వీరుణ్ణి యువరాణి ప్రేమిస్తుంది. ఈ ముసుగు వీరుడు చివరికి ఆ దుర్జయుడి ఆటకట్టిస్తాడు. ఇక్కడా కొన్ని పాయింట్లు. ఆట కట్టిస్తాడన్నది ముఖ్యాం కాదు. ఎలాగ అన్నదే మనకు ముఖ్యం.

ఇవి రెండూ కాక మూడో రకం నవలలు. ఇవి పురాణాలో, భారతంలో ముఖ్య పాత్రలో, అరేబియన్ నైట్స్ కథలో,... ఇలాగ వేటి మీదో ఆధారపడి ఉంటాయి. ఇవండీ రసగుళికలు.

బహుళ జాతి సంస్థల్లో హెచ్ ఆర్ వాళ్ళు హోరెత్తించే, ప్రోయాక్టివ్ థింకింగులు, పాజిటివ్ అవుట్ లుక్కులు, హై ఎనెర్జీ లెవెల్లు, యాంటిసిపేషన్లు, రిస్క్ మిటిగేషన్ ప్లాన్లు....ఇలాంటివన్నీ ఈ జానపద నవలల్లో హీరోలకు అలవోకగా స్వతః సిద్ధంగా ఉంటాయి. హెచ్ ఆర్ వారు ఇచ్చే టుమ్రీ ట్రయినింగులకన్నా, ఈ పుస్తకాలు చదవడం చాలా లాభదాయకం.

పఠనాసక్తి ని అమాంతం ఆకాశానికెత్తే ఇలాంటి పుస్తకాలు ఈ కాలం పిల్లలకు అందకపోవడం చాల పెద్ద దురదృష్టం. ఇన్ఫర్మేషన్ యుగం కదా. ఇన్ఫర్మేషన్ ముఖ్యం, ఇమాజినేషను కాదు! పైగా వెధవ డబ్బా ఉండనే ఉంది. ఇక ఇవన్నీ ఎందుకూ?

ఈ జానపద నవలలు, బుజ్జాయి, బాలభారతి, బొమ్మరిల్లు - ఈ సంస్థలు ముద్రించేవి అప్పట్లో. బుజ్జాయి లో "కేశి" అనే ఆయన బొమ్మలేసే వారు. ఎంతచక్కగా ఉండేవో అవి. ఆ "కేశి" గారు చందమామ పత్రికలోనూ బొమ్మలేశారు.

తలవని తలంపుగా నాకు ఈ జానపద నవల నిధి సంవత్సరం క్రితం దొరికింది. ఇప్పటి వరకు ఆ నవలలు పూర్తీ చేయలేదు. చిన్న పిల్లాడికి లాలీపాప్ దొరికితే ఎక్కడ అయిపోతుందో అన్నట్టు నిదానంగా లాగిస్తాడు కదా - అదే కాన్సెప్టు నాదీను.

అన్నట్టు నాకు దొరికిన నవలలకుప్పలో, సంస్కృత నాటకాలయిన రత్నావళి (శ్రీ హర్ష విరచితం) , మృఛ్ఛ కటికం (శూద్రకుడు), కథా సరిత్సాగరం (సోమదత్తుడు), ఇంకా సింద్ బాద్, అల్లా ఉద్దీన్ వంటి అరేబియన్ నైట్స్ కథలు ఉన్నాయి.

సుదూర భవిష్యత్తులో ఓ అందమైన రోజు - నా మనవరాలికి/మనవడికి ఈ కథలు చదివి వినిపిస్తాను, ఆ పాప రాజకుమారుడు మాంత్రికుడిని చంపక ముందే నిద్రపోతుంది. - ఇదీ నా అరుదయిన పగటి కల.