Wednesday, March 24, 2010

ప్రపంచం చాలా చిన్నది

కొన్నేళ్ళ క్రితం, నా జీవితంలో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ఓ రెండు సంఘటనలు.

మొదటిది.

ఓ ప్రాజెక్టు నిమిత్తమై ఇండోనేషియా కు వెళ్ళాను. అక్కడ నా పనిలో భాగంగా ఓ కొరియన్ మార్కెటింగు మేనేజరుతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఉంటుందా, ఊడుతుందా అన్న ప్రాజెక్టు అదృష్టవశాత్తూ, అనుకున్నదానికన్నా బాగా వచ్చి, విజయవంతమయింది. ఆ మానేజరు మాతో చాలా ఆప్యాయంగా వ్యవహరించేవాడు. (కొరియా వాళ్ళు పని తప్ప మిగిలిన విషయాలు మామూలుగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా, వారి ప్రవర్తనలో diplomacy తప్ప అప్యాయత ఉండదు) చివరి రోజు ఆ కొరియా ఆయన మాకు ఓ పార్టీ ఇచ్చాడు. పార్టీలో ముచ్చటిస్తూ, ఆయన ఓ వింత కథ చెప్పాడు. ఆ విషయం కొరియా సంస్కృతికి సంబంధించిన చిన్న అంశం.


వందల సంవత్సరాల క్రితం భారతదేశం, అయోధ్యానగరానికి చెందిన ఓ రాకుమారి, పడవలో సువర్ణద్వీపానికి బయలుదేరింది. ప్రయాణం మధ్యలో తుఫాను రావడంతో, పడవ తలక్రిందులయింది. ఆమె దొరికిన ఓ చెక్కముక్కను పట్టుకుని ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుంది. అలా ఆమె ఓ తీరం చేరుకుంది. అది కొరియా దేశంలోని తీరం. అక్కడ ఆమెను ఎవరో రక్షించి, రాజు గారికి తెలిపారు. రాజు ఆమెను చేరదీసి, ఆమెకు ఏ లోటు రానివ్వకుండా, ఘనంగా చూసుకున్నాడు. ఆ రాజుకు, ఆ దేశ ప్రజల అభిమానానికి మెచ్చి, ఆ రాకుమారి, అతణ్ణే పెళ్ళాడి, అక్కడే స్థిరపడిపోయింది. ఆమెకు, ఆ రాజుకు పుట్టిన వంశం "కిమ్" అన్న పేరుతో పిలువబడ్డారు. (కొరియాలో అడుగుకు ఓ పదిమంది "కిమ్" లు, ఓ ఐదు మంది "లీ" లు, మరో మూడు మంది "పార్క్" లు తారసపడతారు. అయితే అందరు "కిమ్" లు ఆ రాకుమారి వంశస్థులు కారు. ఏదో ఒక్క "కిమ్" వారు మాత్రమే ఆ రాకుమారి వారసులు). రాకుమారి, ఆ దేశపు రాణి గారు కదా! రాణి గారిది భారతదేశం కాబట్టి, భారతీయులను "cousins" అన్నదమ్ముల్లా భావించమని రాజు ఆజ్ఞ జారీచేశారు. అప్పటి కథ ప్రకారం కొరియనులు, భారతీయులు, సహోదరులు అని ఓ భావన.


మాకు పార్టీ ఇచ్చినాయన పేరు మీరు ఊహించగలరనుకుంటాను.

ఇంతా చెప్పి, ఆయన ఓ చిన్న ట్విస్టు ఇచ్చాడు. అయోధ్య అనే నగరం ఒకటి థాయిలాండులో ఉన్నదట. ఆ రాకుమారి థాయిలాండు దేశానికి కూడా చెందినది అయి ఉండవచ్చు అని ఓ మెలిక పెట్టాడు. అయితే మాపట్ల అతడి ప్రవర్తన, అతడిమనసును మాకు చెప్పకనే చెప్పేది

*******************************************************************

ఇంకో కథ.


ఈ సారి మరో ప్రాజెక్టు, మరో దేశం, యెమెన్.

ఈ సారి మార్కెటింగ్ అధికారి పేరు అహ్మద్. ఆ దేశస్థుడే. యువకుడు, అందగాడు, పనిరాక్షసుడు, పనిలో ఏ చిన్న పొరబాటూ సహించనివాడూ. ఈతడితో కలిసి పనిచేసేప్పుడు ఆసక్తికరమైన విషయాలు చెప్పేవాడు.

నేను యెమెన్ లో ఉన్నప్పుడు మా ఆవిడకు నాలుగో నెల.


ఈ యెమెన్ లో తిండి విషయంలో మాకు ఏ లోటూ రాలేదు. నేనూ, నా మిత్రుడూ, శాకాహారులమైనా, అక్కడ మాకు మంచి రుచికరమైన చపాతీలు, రోటీలు (భట్టీలో గోడలకు తాపించి తయారు చేసినవి), కూర (ముషక్కల్ ఆధి (అరబ్బీ) - శాకాహారపు కూర) దొరికేది. బయట కిరాణా కొట్లలో కూడా చపాతీలు దొరికేవి. ఒక చపాతీ భారతదేశ రూపాయల్లో ఒక రూపాయి. ఓ రోజెందుకో మా ఆవిడ యెమెన్ నుండీ వస్తూ ఆ చపాతీలు పట్టుకు రమ్మని చెప్పింది. ఈ విషయం నేను అహ్మద్ కు మాటవరసకు చెబితే, తనన్నాడు. గర్భవతుల కోరిక ఎటువంటిదైనా నెరవేర్చాలి. అతడికో చెల్లి. ఆమె చూలాలుగా ఉన్నప్పుడు, ఓ రోజు పుచ్చకాయ (కళింగడి) తినాలనుందని కోరిందట, అహ్మద్ ను. అప్పుడు ఆ ఫలాల సీజన్ కాదు. అయినప్పటికీ ఈ అబ్బాయి ఎక్కడెక్కడో వెతికి ఏవో తిప్పలు పడి ప్రయత్నాలు చేశాడుట. చివరికి పుచ్చకాయ దొరకలేదట. ఆ తర్వాత అహ్మద్ చెల్లెలికి ఓ పాపాయి పుట్టిందట. ఆ పాపాయి కడుపు మీద కాస్త ముదురు రంగు చార, ఆ చార మీద అక్కడక్కడా నల్లటి చుక్కలు. (పుచ్చకాయ రూపులో) ఈ ఉదంతం చెప్పి, చివర్లో అహ్మద్ "గర్భవతులకు రెండు హృదయాలు ఉంటాయి. ఒకటి తనది, రెండవది కడుపులో పెరుగుతున్న పాపాయిది" అంటూ ముక్తాయించాడు.


ఆ తర్వాత కొన్ని నెలలకు రఘువంశకావ్యం చదువుతుంటే, అందులో "దౌహృదా" అన్న ప్రయోగం చూశాను. దిలీపుడి భార్య సుదక్షిణా దేవి గర్భవతి అయినప్పటి సన్నివేశంలో. "దౌహృదా" అంటే - రెండు హృదయాలు కలది అని అర్థం.

ఎక్కడి అరబ్బు? ఎక్కడి భారతదేశం?


(ఇంతకూ నా విషయం ఏమైందంటే, నేను ఆ చపాతీలు పట్టుకు రాలేదు, మా ఆవిడకోసం. మా పాపాయికి చారలవీ రాలేదు కానీ.....ఈ క్రింద బొమ్మ చూడండి.
.....అదీ కథ. దానికి చపాతీల పీట, అప్పడాలకర్ర చూస్తే, ఆవేశం ఆగదు.)

ఓ చిన్న విషయం చెప్పి ముక్తాయిస్తాను. ప్రపంచంలో మనిషికి మనిషికి మధ్య, భాష, సంస్కృతి, సంప్రదాయము, రంగు, మతం ఇలాంటివాటికి అతీతంగా ఏదో రకమైన అనుబంధం ఉందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటూంది. (It may sound sentimental & romantic, but it gets revealed to us few times magically) దీనికి దృష్టాంతాలు మనం వెతికి చూస్తే కనబడుతూనే ఉంటాయి.

Sunday, March 21, 2010

సంస్కృత సాహిత్యంలో పేరడీలుసరస్వతి అమ్మవారు బంతి ఆడుతున్నారు. ఆ తల్లి బంతి ఆడుతున్న తీరు ముగ్గురు ఉద్దండులైన సంస్కృతకవులిలా వర్ణిస్తున్నారు(ట).

దండి:

ఏకో2పి త్రయ ఇవ భాతి కందుకో2యం కాన్తాయాః కరతలరాగరక్తరక్తః |
భూమౌ తచ్చరణనఖాంశుగౌరగౌరః స్వస్థః తన్నయనమరీచినీలనీలః ||

అయం కన్దుకః = ఆ బంతి (సరస్వతి చేత ఆడబడుతున్నయట్టిది)
కరతలరాగరక్తరక్తః = (ఆమె) కరతలము యొక్క శోణవర్ణం చేత శోణవర్ణం దాల్చినదై
భూమౌ = భూమి యందు (భూమి దిశగా వెళ్ళినప్పుడు)
తచ్చరణనఖాంశుగౌరగౌరః = (ఆమె) పాదం గోరు తాలూకు ధవళవర్ణం చేత ధవళ వర్ణం సంతరించుకున్నదై
స్వస్థః = పైకి ఎగసినపుడు
తన్నయనమరీచినీలనీలః = (ఆమె) కనులనబడే ఇంద్రనీలమణుల నీలము చేత నీలము కాబడి
ఏకః అపి = ఒకటి అయిననూ (ఒక్క బంతే)
త్రయ ఇవ = మూడు (బంతుల) వలే
భాతి = ప్రకాశించుచున్నది.

భవభూతి:

విదితం నము కన్దుక తే హృదయం దయితాధరసంగమలుబ్ధ ఇవ |
వనితాకరతామరసాభిహతః పతితఃపతితః పునరుత్పతసి ||

కన్దుక = ఓ బంతీ!
తే హృదయం = నీ హృదయము
దయితాధరసంగమలుబ్ధః ఇవ = వనితాధరచుంబన మోహిత అని
విదితం నము = తెలుసుకున్నానోయి.
(అందుకనే)
వనితాకరతామరసాభిహతః = పద్మముల వంటి వనిత కరముల చేత కొట్టబడి
పతితః పతితః (అపి) = మాటి మాటికి క్రిందపడుచున్ననూ
పునరుత్పతసి = తిరిగి ఎగురుచున్నావు!

కాళిదాసు:

పయోధరాకారధరో హి కన్దుకః కరేణ రోషాదభిహన్యతే ముహుః |
ఇతీవ నేత్రాకృతిభీతముత్పలం స్త్రియాః ప్రసాదాయ పపాత పాదయోః ||

(ఈ శ్లోకం నాకు ఖచ్చితంగా అర్థం కాలేదు. అయితే నాకు అర్థమైనది వ్రాస్తున్నాను. భావం ముందుగా: సరస్వతి అమ్మవారు పయోధరాకారంలో ఉన్న బంతిని రోషంతో నేలకు కొడుతున్నారు. ఆ అదటుకు ఆమె తలలో తామర పువ్వు జారి ఆమె పాదాలపై బడి శరణు వేడింది. భయం ఎందుకంటే ఆమె పద్మనయనాలలో రోషం తనను కొడుతున్నట్టు ఉంది కాబట్టి.)

పయోధరాకారధరః హి కన్దుకః = చనుగుబ్బల ఆకారము దాల్చిన బంతి
కరేణ = చేతితో
ముహుః = మాటిమాటికీ
రోషాదభిహన్యతే = రోషంగా కొట్టబడుచున్నది.
నేత్రాకృతిభీతముత్పలం = ఆమె కనుల ఆకారంలో ఉన్న (ఆమె జడలోని) తామర
స్త్రియాః ప్రసాదాయ + ఆమె శరణు కొరకు
పాదయోః పపాత ఇవ = పాదద్వయమందు పడినది.

పైన వర్ణించబడ్ద శ్లోకాలు ఆయా కవులకు పేరడీలు. ఈ శ్లోకాలకు కర్త ఎవరో తెలియదు. (భోజప్రబంధం వ్రాసిన బల్లాలుడు అని ఊహ.)

చైత్రశుద్ధ పంచమి పర్వదినం సందర్భంగా, సరస్వతి అమ్మవారి దయకు ఎల్లరూ పాత్రులవుదురు గాక! శుభమ్.

Monday, March 8, 2010

ఫలానా దినోత్సవం

ఈ టపా మగాళ్ళకు మాత్రమే.

ప్రతీ సోమవారం లాగే అంతకు ముందు ఐదు రోజుల గబ్బును రెండు రోజుల సబ్బుతో వదిలించేసుకుని, కచేరీలో పొద్దున అడుగుపెట్టి చూద్దును కదా. హాశ్చర్యం. అమ్మాయిలందరూ .. ఆ కాదు ., ఆంటీలందరూ (మా ఆఫీసులో అమ్మాయిలు ఆంటీల్లా ఉంటారు) చుడీదార్లు, చున్నీలూ వదిలేసి చీరలు కట్టుకొచ్చేస్తున్నారు. ఒక కైరళి (ఈమె మటుకు అమ్మాయిలానే ఉంది) తెల్లచీర, నుదుటిన చందనపు బొట్టు, వదిలేసిన జడతో సాంప్రదాయబద్ధంగా వచ్చింది. ఏంటో ఏమో అనుకుని లోపల అడుగు పెడితే వుమన్స్ డే అట. అమ్మాయి బొమ్మ తాలూకు శక్తిబిందువు (పవర్ పాయింటు) ప్రెజెంటేషన్ గోడ మీద నడిపిస్తున్నారు.

పడమటి సంధ్యారాగం సినిమాలో నటుడు "అమ్మ దినం ఏంటి తద్దినం లాగా?" అని విసుక్కున్నట్టు, నాకూ ఇవి కాస్త చీకాకే. పక్క సీటోణ్ణి ఏంటిది? మగాళ్ళకు దినాల్లేవా? అనడిగితే వాడన్నాడు, మిగిలిన మూడొందలరవై నాలుగు రోజులూ మనవే అని.

ఈ ఫలానా దినోత్సవాలు నాకు తెలిసి ఆర్చీస్ కంపెనీ వాడి కుట్ర అని నా ప్రఘాఢ నమ్మకం. ఎందుకంటే ఈ దినాల వల్ల బాగుపడేది వాడే. అందులో కూడా కొత్త కొత్త ఇన్వెన్షన్లు. అపుడెపుడో మా గ్రూపులో ఒకమ్మాయి మణికట్టు గమనించాను. రంగురంగులుగా ఉంది. అడిగితే ఒక త్రాడు దేవుడికి (వదిలేద్దాం). మరొకటి ఫ్రెండ్ షిప్ డేది. మరొకటి రాఖీ. ఇంకోటి ఏదో .. ఇలా చెప్పుకొచ్చింది. ఇది ఆర్చీస్ కి ప్రత్యామ్నాయం అనుకుంటాను.

హా, మళ్ళీ ఆఫీసుకొస్తా. ఆఫీసులో అమ్మాయిలు...వద్దులెండి. స్త్రీలందరికీ ఈ రోజు చుక్కల పూటకూళ్ళ కొంపలో ಊಟ, ఒక్కొక్కరికి ఒక కుసుమ రాజం బహుమతి. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆటవిడుపు. ఇదీ మెను. ఇది జెండరు డిస్క్రిమినేషన్ గా పరిగణించాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను.

ఎయిడ్స్ డే, వేలెంటైన్స్ డే, ఇప్పటికే ఇలాంటివి ఉన్నాయి. భవిష్యత్తులో
శిశువుల దినోత్సవం
పశువుల దినోత్సవం,
జంతువుల దినోత్సవం (ఇంకా ముదిరితే ఒక్కో జంతువుకొకటి),
పక్షుల దినోత్సవం,
చెట్ల దినోత్సవం,
పుట్టల దినోత్సవం,
పిట్టల దినోత్సవం,
గుట్టల దినోత్సవం,
మొక్కల దినోత్సవం,
నాచు మొక్కల దినోత్సవం
ఇలా ఏదిబడితే అది వచ్చే అవకాశం లేకపోలేదు. ఇంకా ముదిరితే పూటలు. కేన్సరు అర్ధ దినోత్సవం, తాతయ్యల పూట, శిశువుల గంట - ఇలాంటివి కూడా వచ్చేస్తాయేమో!

(ఈ టపా సరదాగా మాత్రమే. ఈ టపాలో సంఘటనలూ, వ్యక్తులూ కేవలం కల్పితాలు. (నిజ్జం). ఏదైనా సారూప్యం తగిలితే అది కేవలం కాకతాళీయం అని గమనించగలరు.)

ఈనాడు శనివారం రోజున నా బ్లాగు పరిచయం వచ్చింది. అభినందనలు తెలుపుతూ వేగులు, వ్యాఖ్యలూ వచ్చాయి్, వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు. నా బ్లాగు పరిచయం చేసిన సుజాత (మనసులో మాట) గారికి కృతజ్ఞతలు. - రవి.