Wednesday, May 27, 2009

చెట్టు - మనిషి - దేవుడు


ఓ రావి చెట్టు (అశ్వత్థ వృక్షం). కాస్త ఎడంగా ఓ వేపచెట్టు. అదే సరళ రేఖలో మరింత ఎడంగా ఓ బిల్వ (మారేడు)చెట్టు. మా ఇంటి ముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లా. ఓ గుడి ఆవరణలో ఉండే వాళ్ళం చిన్నప్పుడు.

ఇంకో పక్క బాదామి చెట్టు. కాస్త దూరంలో బంకీరు కాయల చెట్టు. భక్తులు ప్రదక్షిణం చేసే దారిలో కాస్త మూల ఒద్దికగా ఓ ఉసిరి చెట్టు మొలిచింది కొన్నళ్ళకు. ఈ ఉసిరి చెట్టు కాయలు చిన్నవి, కాస్త వగరు తక్కువగా ఉన్నవీను. గింజ కూడా పెద్ద ఉసిరి కాయల్లా కాక చిన్నగా ఉండేవి. ఉసిరి చెట్టు ఐదు దేవతా వృక్షాల్లో ఒకటి అని మా తాతయ్య చెప్పేవారు. మిగిలిన నాలుగు కూడా చెప్పారు కానీ గుర్తులేవు.

ఆ ఆవరణలోనే వెనుక వైపు బ్రహ్మాండమైన వేపచెట్టు, దానికి పక్కనే ఓ కాగితంపూలచెట్టు. భాగవతంలో కృష్ణుని కథలో, చిన్ని కృష్ణుని యశోదమ్మ ఓ మద్దెలకు కట్టేసి వదిలేస్తే, ఆయన రెండు మద్ది చెట్ల గుండా వెళ్ళి, రెంటినీ పడగొట్టి గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడని చదువుకున్నాం కదా. అదుగో, అప్పుడు ఆ మద్దిచెట్ల మధ్య ఎంత ఎడం ఉండి ఉండేదో, సరిగ్గా అంతే ఎడం వేప చెట్టు, కాగితం పూల చెట్టు మధ్యానూ.శాపగ్రస్తులైన గంధర్వుల్లా ఆకుల మధ్యలోనుంచీ సంగీతం వినిపిస్తూ, ఓ తేలికపాటి సువాసన వెదజల్లుతూ, అద్భుతంగా, ఆకాశాన్ని తాకుతూ ఉండేవి అవి. వాటి నీడన ఆవులు, పొద్దస్తమానం ఏదో నముల్తూ.

(ఆ ఆవులు ఎందుకమ్మా, పొద్దస్తమానం ఏదో నముల్తుంటాయి? - నేను.
ఏమో తెలీదమ్మా - అమ్మ)

వాటి నీడన గుడి పూజారి, సత్యనారాయణ శాస్త్రి అలియాస్ సత్యమయ్య. ఆయనలో ఓ గొప్పకళాకారుడుండేవాడు. మధ్యాహ్నం పూట భోజనం ముగించి, నులక మంచం మీద పడుకున్న తర్వాత ఆయన లోని కళాకారుడు గొంతు విప్పేవాడు, "భక్త యోగ పదన్యాసి, వారణాసి..పావన క్షేత్రముల రా...శి" "రా" కు "శి" కు మధ్య ఓ అల లాంటి గమకం పెట్టి పాడుకుంటుండే వాడు, అర్ధనిమీలిత నేత్రాలతో.

ఇంకాస్త వెనుక సీమ చింతకాయల చెట్టొకటి.

ఇంకా జమ్మిచెట్టు, మరో బిల్వపత్రి, వరుసగా పూల చెట్లు, నాగుల కట్ట ఓ వేపచెట్టుకింద నీడలో...

మొట్టమొదట కనుమరుగయినది, వెనకున్న సీమ చింతకాయల చెట్టు. నరికేశారు దాన్ని. రోజు ఆ సీమ చింతకాయలకోసం ఆ చెట్టును రాళ్ళతో కొట్టేవాళ్ళు పిల్లలు. బహుశా నవ్వుకొనేదేమో ఆ చెట్టు. ఆ చెట్టు పడిపోయిన రోజు, దాని కాయలు కింద చిందరవందరగా పడ్డాయి. అన్ని కాయలు కళ్ళ ముందు కనబడ్డా, చిత్రంగా ఆ కాయలు ఏరుకోడానికి పిల్లలకు సంకోచం, రేపట్నించీ ఈ చెట్టు లేదుగా అనేమో. చెట్టు ఏమనుకుందో ఏమో? రాళ్ళదెబ్బలకంటే పెద్ద దెబ్బ తగిలినందుకు నవ్వుకుందో, పిల్లలు కాయలు తీసుకోనందుకు నొచ్చుకుందో?

కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు కాగితం పూలచెట్టుకు ఎసరు పెట్టారు. దానికి ఓ కథ అల్లారు. కాగితం పూల చెట్టు, వేప చెట్టు, ఒకదాని పక్కన మరొకటి ఉంటే అరిష్టం అట. అలా అని రాసుందట. ఆ చెప్పినాయన పెద్దాయన. పూజ్యుడు, ఎన్నో శాస్త్రాలు చదువుకున్నవాడూనట. ఇక చేసేదేముంది. శాపగ్రస్తుడైన గంధర్వుడికి శాపవిమోచనం జరుగలేదు. జనాలు దాన్ని శాపంతోనూ ఉండనివ్వలేదు. చచ్చిపోయిందది. ఈ చెట్టూ నవ్వుకుని ఉంటుంది, మనుషుల మూర్ఖత్వం చూసి. దీని చెలికత్తె, వేప చెట్టు మాత్రం మనసులో కుమిలిపోయి ఉంటుంది.

మరి కొన్నాళ్ళు గడిచింది. ఎవరో పుణ్యాత్ములు నాటిన విత్తుతో ఓ పక్కగా చెట్టు మొలిచింది. అసలది యే చెట్టో మాకు తెలియదు. మా ఇంటికి దగ్గరలో ఉండటంతో, మా అమ్మ నీళ్ళు పోసేది దానికి. అలా మా కళ్ళ ముందు పెరిగింది. ఆ చెట్టుతో రాధామాధవం పూలతీగ నేస్తం కట్టింది. ఎంచక్కా, ఆ చెట్టుకు కమ్ముకుని, నమ్ముకుని, అల్లుకుపోయింది. పెద్దగయిన తర్వాత ఆ చెట్టుకు కాయలు కాసాయి. అప్పుడు తెలిసింది అది ఉసిరి చెట్టని. మా అమ్మ కళ్ళలో తెలియని సంతోషం. పసిబిడ్డ మొట్టమొదటి సారి "అమ్మా" అని అని పలిచినప్పుడు ఎలాంటి సంతోషమో అలాంటిది. ఆ చెట్టు వద్దకు అప్పుడప్పుడూ, వనభోజనాలని జనం వచ్చేవారు. ఉసిరి చెట్టు కింద మొదల కుంకుమ పెట్టి పూజించి, మొక్కుకుని, ఆ తర్వాత కుటుంబంతో సహా భోంచేసి ఇళ్ళకెళ్ళేవారు. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆ ఉసిరి కాయలు, పక్కన బాదం కాయలు గర్వంగా కోసుకొని తెచ్చిచ్చేవాళ్ళం.

దేవాలయం ఆవరణ సుమారుగా పెద్దదే. నిజానికి అందులో మూడు చిన్న చిన్న మందిరాలు, లింగాష్టకం, నవగ్రహ స్తోత్రం వగైరా రాతి ఫలకలపై రాతలు, నవగ్రహాలు. ఓ రోజు భక్తులకో ఆలోచన వచ్చింది. ఇందరు దేవుళ్ళున్నారు, కానీ "మన" దేవుడు లేడు. ఆ దేవుడి కోసమూ గుడి కట్టాలి. అందుకు చందాలు పోగయ్యాయ్. కొత్త గుడి వస్తే, ఆదాయం బావుంటుంది, కాబట్టి అందరూ సంతోషించారు. గుడికి కావలసిన స్థలం సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి, ఓ గొప్ప ఎమ్మెల్ల్యే ( అప్పటి మంత్రి, ఇప్పుడూ ఉన్నాడు. రాజశేఖరుడి ద్వారా మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన ఇద్దరు ప్రముఖులలో ఒకడు) .

వారగా ఉన్న పూల మొక్కలు తెగ్గోట్టేరు. ఆ పూలతో రోజూ పూజ చేయించుకునే దేవుడు ఇప్పుడు పూలు కొనుక్కుని పూజలు చేయించుకుంటాడు. గుడి కట్టటం మొదలయింది. దాదాపు పూర్తి కావచ్చింది. గుడికి మెట్లు పెట్టాలి. ఉసిరి చెట్టు ఆ మెట్లకు అడ్డమయింది కాస్త. దాన్ని కూల్చేయాలని తీర్మానించారు. ఓ భక్తుడు మరుసటి రోజు ఓ మచ్చు కత్తి తీసుకొచ్చాడు. మా అమ్మ అడ్డుపడింది. "అయ్యా, ఉప్పు తిన్న ఇంటికి ద్రోహం చేస్తారా? చెయ్యం కదా. ఈ ఉసిరి చెట్టు ఉప్పు కూడా మనం తిన్నాం కదా. పచ్చని చెట్టుకెందుకయ్యా ఎసరు పెడతారు" అంది. దేవుడికి గుడి కడుతున్నామమ్మా, చెట్టు అడ్డమొస్తుంది అన్నాడతను. నిజానికి చెట్టు వారగనే ఉంది. మెట్లకు పక్కగా. మా అమ్మా అదే అంది. కుదరదన్నాడతను. మేము చందాలేసుకున్నాం, దైవ కార్యం, పైగా దేవాలయం కమిటీ ఒప్పుకుంది, మధ్యలో మీరెవరు అని వాదులాటకు దిగాడు. "ఏం చెబుతుంది? ఆ చెట్టు మేం నాటలేదు. నీళ్ళు పోశామంతే" అని చెప్పాలి. అదీ చెప్పలేదు మా అమ్మ. ఆ చెట్టూ నరికేశారు.

నరికిన తర్వాత మొదలయింది మరో కథ. ఉసిరి దేవతా వృక్షం, కూల్చరాదు. అని ఒకాయన చెప్పాడు (ఇందాక కాగితం పూల విషయంలో శాస్త్రాలు చదువుకునొచ్చి వివరాలు చెప్పినాయన). సరే, పరిహారం కోసం పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కాని దేవుడు ఖచ్చితంగా వెళ్ళిపోయుంటాడు అక్కడ నుంచీ.

ఇప్పుడు మా అమ్మా, అక్కడ చెట్లలో కొన్ని వదిల్సి మిగినవన్నీ, భూమ్మీద లేరు.

చెట్టు కూలిస్తే వాతావరణం సంగతి ఏమవుతుందో కానీ, ఆ చెట్టు పక్కన కాయల కోసం వచ్చే పిల్లలు, ఆ చల్ల గాలి, గాలి వాలున పడుకున్న గోమాత, గాలిలో తేలాడే పరిమళం, వీటన్నిటికి వెనకాల దాగిన ఓ సున్నితత్వం, ఆ సున్నితత్వం తాలుకు మనిషి అస్తిత్వానికి నిర్వచనం, ఇవేవి ఉండవు.

చెట్టు దైవం.
ఆ చెట్టుకు అనవసరంగా హాని తలపెట్టే మనిషి రాక్షసుడు.
దాన్ని మౌనంగా చూసే దేవుడు నిమిత్తమాత్రుడు!

Tuesday, May 19, 2009

ఇదే నా మొదటి ప్రేమలేఖ......

ఓ చింకి చేప, తల మాసిన దిండొకటి, దుప్పటి. ఆ పక్కనే చిందరవందరగా పుస్తకాలు. ఆ పుస్తకాల మధ్య నిరాశగా చూస్తున్న కృష్ణమూర్తి, కౄరంగా చూస్తున్న ఓషో, నవ్వుతున్న చలం, పేపర్లు చినిగిపోతున్న చందమామలు, అల్మారా వెతికి తీసిన కొన్ని పాత పుస్తకాలు... మరో పక్క, అలాంటి బలిచక్రవర్తులు నాకో లెక్కా అంటూ వామనావతారం లాంటి చిన్న ఝండూ బాం సీసా.

ఝండూ బాం కాస్త తలకు పట్టించాను. కాసేపటికి బాగా నిద్ర పట్టింది.

"ప్రియతమా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. "దర్శనే స్పర్శనే వాపి స్మరణే భాషణేపి వా యత్ర ద్రవత్యంతరంగం స స్నేహ ఇతి కథ్యతే" అని మన సంస్కృతం అయ్యవారు చెప్పినది మన గురించేనేమో. నిన్న తెలుగు టీచరు, "భర్తృహరి సుభాషితాలు తెలుగులో అనువాదం చేసినది ఎవరు?" అని అడిగినప్పుడు, ఏనుగు లక్ష్మణ కవి అని చెప్పడానికి బదులు ఏడిద నాగేశ్వర్రావు అని చెప్పినది ఎందుకోసమో తెలుసా? నేను తప్పు చెప్పిన తర్వాత టీచరు నిన్ను అడుగుతుంది. అప్పుడు నువ్వు సరిగ్గా సమాధానం చెబితే, నీతో నాకు ముక్కు చెంపలు వేయిస్తుంది. అలాగైనా నువ్వు నన్ను తాకే చాన్సు దొరుకుతుంది కదా. అదుగో, అందుకే. అయితే, టీచర్ నన్ను అడిగిన వెంటనే బెల్లు కొట్టటంతో నా ఆశ ఫలించలేదు. స్కూలు కొన్ని నెలల్లో ముగిసిపోతుందంటేనే ఏదోలా ఉంది.

రాసేప్పుడు గుండె లబ్ డబ్ అని కాక ధన్ ధన్ మని కొట్టుకుంది.

రాయడం ముగించి, నా 10 వ తరగతి తెలుగు వాచకం మధ్యలో పెట్టబోయి ఆగాను. అమ్మో, క్లాసు మధ్యలో జారిపడితే? వద్దు. జేబులో పెట్టుకున్నాను. (చదువరీ, పైన ప్రేమ పత్రంలో భాషను కొంచెం పల్చగా, భావాన్ని మరింత చిక్కగా మార్చి, యథాశక్తి కలుపుకోవలసింది. చదువరి != శిరీష్ కుమార్)


మధ్యాహ్నం పూట ఓ గంట భోజన విరామం. హిందీలో "భిక్షుక్" అనే పాఠంలో దోహే ఒకటి కంఠాపాఠం చేస్తున్నాను. 12 వ సారి. మ్యాత్స్ లో 80 మార్కులు తెచ్చుకోవటం ఈజీయేమో గాని ఈ హిందీ లో 20 మార్కులు తెచ్చుకోవటం సాధ్యం కాకుండా ఉంది.


పోస్ట్ మాన్ వచ్చాడింతలో. నేను కూర్చున్నది తరగతి గుమ్మం దగ్గర వరండాలో. అతను నా దగ్గర వచ్చి అడిగాడు. "బాబూ, టెంత్ క్లాసు ఎక్కడ?"


"ఇదే. నేనూ టెంత్ క్లాసే." చెప్పాను. ఇంతలో కొంతమంది మా క్లాసు విద్యార్థులు వచ్చి మూగారు.

ఓ రెండు కార్డు ముక్కలు తీశాడు. "ఫలానా-1, ఫలానా-2" మీ క్లాసేనా?అడిగాడు.

"ఆ మా క్లాసేనండి." చెప్పాను.

ఈ కార్డ్లు వాళ్ళిద్దరికీ ఇచ్చేస్తావా? అంటూ చేతిలో పెట్టాడు.

తీసుకున్నాను.

ఆ కార్డులో మొదటి లైను ఇలా ఉంది. "ఫలానా-1, నువ్వు చాలా అందంగా ఉంటావు. అచ్చు శ్రీదేవిలా..." బాపు మొట్ట మొదటి సారి అక్షరాలు దిద్దుకున్నప్పుడెలా రాసి ఉంటాడో అలా ఉన్నాయి, ఆ అక్షరాలు. అవి చేతిలో తీసుకోబోతుండగా "ఏంట్రా అది" అంటూ సంస్కృతం అయ్యవారు వచ్చారు, భోజనం ముగించి, వక్కాకు నములుతూ.

"ఏవో లెటర్ లంట సార్." ఆయనకిచ్చాను.

ఆయన కాసేపు చూసి తల పంకించి అవి తీసుకుని వెళ్ళిపోయారు.

మధ్యాహ్నం మొదటి పీరియడ్. రావలసిన మ్యాత్స్ సారు చాలా సేపయినా రాలేదు. అందరూ కీసర బాసరగా మాట్లాడేసుకుంటున్నారు. మ్యాత్స్ సారు చివరికి రానే వచ్చారు. "ఐ యామ్ అషేమ్డ్ అట్ యు" అన్నారు గంభీరంగా చూస్తూ. ఇందాక గమనించలేదు కానీ, క్లాసులో ఫలానా-1, ఫలానా-2 అమ్మాయిలిద్దరు, కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. (అలా ఏడవడం భారత దేశ సంస్కృతి అన్నట్టు). చివరి బెంచి లో ఇద్దరు ఆకతాయిలు కుమిలి కుమిలి నవ్వుకుంటున్నారు. క్లాసులో పిన్ డ్రాప్ సైలెన్స్. (మరీ పిన్ డ్రాప్ కాదు, పెన్ డ్రాప్ అనుకుందాం). అయ్య వారు ఆ మాట ఎందుకంటున్నారో, సందర్భమును వివరింపుడు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఫలానా-1, ఫలానా-2 లకు ఎవరో లవ్ లెటర్స్ రాసి పంపారని ఊహించిన వాళ్ళు ఊహించారు, చాలా మంది ఊహించలేదు. నాకు విషయం కాస్త అర్థమయింది కానీ, పూర్తిగా తెలియలేదు.

కాసేపు చెడా మడా తిట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత సంస్కృతం అయ్యవారు. వస్తూనే గర్జించారు. "ఎవడో ఈ స్కూలుకు మచ్చ తీసుకొచ్చే పని చేశాడు. వాడు మీలో ఎవడైనా సరే వదిలేది లేదు. వాడికి నేను శాపం పెడుతున్నాను. నా శాపం ఊరికే పోదు" ఇలా...ఆ తర్వాత ఆంగ్ల బోధకుడు, షెర్లాక్ హోమ్స్ లా తన పని మొదలెట్టారు. డిక్టేషన్ చెబుతాను, మీరు అర్థాలు తెలుగులో వ్రాయండి, అని డిక్టేషన్ మొదలెట్టేరు. ఆ డిక్టేషన్ లో ఓ పదం "beauty".
స్కీము ఏమిటంటే, ఆ డిక్టేషనులో రాసిన అక్షరమ్ముక్కల ద్వారా ఆ లెటర్ ఎవడు రాశాడొ కనిపెట్టటం అన్నట్టు.

అందరూ రాసిన తర్వాత, ఒక్కొక్కరి దగ్గరే వచ్చి ఆ అక్షరాలను పరికించి చూశారు. ఒకతణ్ణి మాత్రం, నువ్వు ఇలా రా, అంటూ క్లాసు మధ్యలో బయటకు తీసుకెళ్ళి పోయారు.

నాకు ఆ రోజు సాయంత్రానికి "విషయం" తెలిసింది. ఎవరో ఆకతాయిలు ఇద్దరు అమ్మాయిలకు లవ్ లెటర్స్ రాసి పంపారు. సాయంత్రం నాకు ఇక్కడ భయంతో వణుకు. నా జేబులో ఒక ప్రేమ పత్రం ఉంది కదా. అందుకు. చివరకు ఇంట్లో ఆ పేపర్ ను ఎవరూ చూడకుండా కాల్చేసేంత వరకు నెమ్మది లేకపోయింది.

చాలా రోజుల తర్వాత, నేను పదవ తరగతి ముగించి, ఇంటర్మీడియట్ చేరిన ఆ వెధవ పని చేసింది ఎవరో తెలిసింది, ఆ అమ్మాయిలిద్దరు ఒకే కాలనీలో ఉండే వాళ్ళు. ఆ కాలనీలో ఉన్న మరో స్కూలు కుర్రాడు, ఆ పని చేసింది.నిద్రలో అటు నించీ ఇటు పొర్లాను. చేతికో చిన్న పుస్తకం తగిలింది. ఇదేం పుస్తకమబ్బా, అని లేచి లైట్ వేశాను.

అదో చిన్న ఆటోగ్రాఫ్ పుస్తకం. జీర్ణావస్థలో ఉంది. స్కూలు వదిలేసేప్పుడు అందరితో సంతకాలు తీసుకున్నది. ఈ మధ్య ఇల్లు మారుతున్నప్పుడు తవ్వకాల్లో బయటపడింది. అందులో "ఫలానా-1" అమ్మాయి ఆటోగ్రాఫ్. " I'll remember you forever - your fiend"అని.

మీరు సరిగానే కాదివారు. fiend అనే రాసిందామె.

సదరు "ఫలానా-1" పేరు మూడక్షరాల ఓ పతివ్రత పేరు. ఆ అమ్మాయి ఇప్పుడెక్కడ ఉందో తెలియదు.

"ఫలానా-2" మాత్రం నాకో దినకర్ (ఇంజినీరింగ్ చదివేప్పుడు తగిలాడు నా పాలిట) ఉండేవాడు. వాడి భార్య. ఇద్దరు పిల్లలామెకు. ఇద్దరూ అమ్మాయిలే.

ఫలానా-2 పేరు - కాళిదాసు వ్రాసిన ఓ దండకం లో మొదటి మూడక్షరాలు.

అలా నా మొదటి ప్రేమలేఖ మొన్న కలలో నన్ను తిరిగి పలుకరించింది.

Sunday, May 10, 2009

తసమదీయులు

మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి దగ్గర రాక్షసులకు చదువు చెప్పటానికో గురువు పని చేస్తుంటాడు. ఆ "గురువు" గారి పేరు "చిన్నమయ్య". ఆ చిన్నమయ్య పాత్ర పోషించినాయన పొడుగ్గా, గెడకర్రలా ఉన్న రమణారెడ్డి! సదరు రాక్షస శిష్యులకు మాత్రం "గురువులు" , సంయుక్తాక్షరాలు పలకవు! "దుష్ట చతుష్టయము" అని పలకడానికి "దుషట చతుషటయము" అని అంటుంటారు. అలాగే అస్మదీయులు అనడానికి అసమదీయులు. అలానే "తసమదీయులు"...

ఇక్కడ "తసమదీయులు" అన్న పదం గురించి చెప్పుకోవాలి. సంస్కృతంలో "అస్మద్" శబ్దం ఉన్నది, అలానే "యుష్మద్" శబ్దమూ. అంటే అస్మదీయులు అన్న పదానికి వ్యతిరేకపదం యుష్మదీయులు అవాలి. కానీ ఆ సినిమాలో "తసమదీయులు" అన్న పదం ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి!

ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు మాత్రం ఈ "తసమదీయులు" అన్నపదం మన మన రాజకీయ నాయకులకు బాగా సరిపోతుందనుకుంటాను. మొన్న ఎన్నికల ముందు వరకు గాంక్రెస్ అంటే, అసహ్యమూ, రోత అన్న రిచంజీవి గారు ఇప్పుడు తమకు 100 సీట్లు వస్తే గాంక్రెసు మద్దతు స్వీకరించేట్టు, అంతకన్న తక్కువ సీట్లు వస్తే, మద్దతు ఇచ్చేట్టు రహస్య ఒప్పందాలు చేసుకున్నట్టు వార్త. అంటే, రాజకీయాల్లో అస్మదీయులు, యుష్మదీయులు ఇద్దరూ లేరు, ఉన్నదంతా తసమదీయులే.

ఇదిలా ఉంటే, అలాంటి ఒప్పందం జరగలేదని డ్రామాను మరింత రక్తి కట్టించే ప్రయత్నం ఇంకో పక్క సాగుతోంది.

ఏతావతా, "యాక్టరు ముదిరితే రాజకీయ నాయకుడు" అన్న న్యూనుడి సార్థకమయేట్లు ఉంది.

Thursday, May 7, 2009

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నా నివాళి.

గ్రీష్మం.

హేమంతం, శిశిరం, వసంతం, వర్షర్తువు, శరత్తు - ఈ మిగిలిన ఋతువులన్నీ ఎందరో కవులను ఆకర్షించాయి. వసంతంలో కోకిల కూజితం ఓ కవికి ప్రణవమై, కవితా గానాన్ని ప్రేరేపిస్తే, శరజ్జ్యోత్స్నలు మరో కవిలో ప్రణయభావాలను మేల్కొలుపుతాయి. హేమంతం నీహారికలను అందిస్తే, ప్రావృష మేఘమాలలు మరోకవి, ప్రియురాలికి సందేశాన్నంపడానికి ప్రేరేపిస్తాయి.

మరి గ్రీష్మం?

గ్రీష్మానికి అచ్చట్లు ముచ్చట్లు లేవా?అలాఎండుతూ, మండుతూ కూర్చోవలసిందేనా?

..................

..................


పూర్తి వ్యాసం
ఇక్కడ.