Tuesday, December 29, 2009

పులిహోర

"అప్పన్నా!నీ బుద్ధిలో దద్ధోజనం పసేగానీ పులిహోర ప్రభావం రవంత కూడా కనిపించలేదురా!" అంటారు తాతాచార్యుల వారు శిష్యపరమాణువు అప్పలాచార్యుల వారితో, తెనాలి రామకృష్ణ సినిమాలో.

అవును, వేణుగోపాల స్వామి వారి కోవెలలో అప్పనంగా వచ్చే ప్రసాదం అయినంతమాత్రాన పులిహోర ప్రభావం తక్కువ కాదు. అసలు సిసలు పులిహోర అంటేనే - గమ్మున ఆ నేతిసువాసన గుబాళించాలి. నాలుకకు తగులగానే కారంతో కూడిన రుచి నషాళానికంటాలి. ఆ తర్వాత ఏ ఆనందలోకంలోనో విహరించాలి. పులిహోరలో అద్వైత సిద్ధాంతం దాగుందనడంలో సందేహం లేదు. మొదట పంచేంద్రియాలను, ఆ తర్వాత దాన్నధిగమించి జ్ఞానేంద్రియాన్ని పరిచయం చేస్తున్న పదార్థమనే కాబోలు - వైష్ణవ దేవాలయాల్లో ఇందుకు పెద్దపీట! మొన్నటికి మొన్న తిరుపతికెళ్ళినప్పుడు స్వామి వారి ఉచిత ప్రసాదం పులిహోర దొరికింది. చెప్పొద్దూ, కాసేపు వైకుంఠం ఇన్ ఎ నట్ షెల్ కనిపించింది.

నూడుల్స్ రాకమునుపు ఇది కూడా బాచిలర్స్ అమ్ములపొదిలో ఒక అస్త్రం. ఇది నిజం. అన్నమొకటి వార్చేసుకుని, అమ్మ తన ప్రేమను కూడా కలిపి గట్టిగా మూతెట్టేసిన జాడీలోంచి, కాస్త గుజ్జు, అందుకు తోడుగా నెయ్యి కలుపుకుంటే - ఆ పూట ఆత్మారాముడు అనంతంగా శాంతించేవాడు. ఆ తర్వాత ఫలశృతికి పెరుగూ ఆవకాయ ఉండనే ఉన్నాయి.

ఉన్నట్టుండి ఈ రోజెందుకిలా పులిహోర పైత్యం? అంటే - ఉందండి. మా ఫ్రెండు, ఆఫీసులో నా కొలీగు విఠ్ఠల్ అగార్కర్ చాలా యేళ్ళ తర్వాత కన్నడ పులిహోర రుచి చూపించి నన్ను శిఖరం ఎక్కించాడు. ఆ అబ్బాయి వంటల్లో ఘనాపాఠీ. ఓ సారి విదేశానికి ఆన్ సైటు వెళ్ళినప్పుడు నాకు రూమ్మేటు. చిత్రంగా అతడికి మా ఇంటి అధరువులు తెగనచ్చాయి అప్పట్లో. నాకు మాత్రం ఆ అబ్బాయి వంటలు తెగ నచ్చేసేవి. ఓ శిల్పి శిల్పం చెక్కుతున్నట్టుగా వంట చేసేవాడతను.

కాలేజీ రోజుల్లో మా అమ్మ పులిహోర క్యారియరు కట్టించేది. (నేను డే స్కాలర్ ను) ఆ ఘుమఘుమలు అలా సోకంగానే నా మిత్రులు అలా దాని మీద పడి ఖాళీ చేసేవారు. చింత చచ్చినా పులుపు చావనట్లు, చిన్నతనం అయిపోయినా చింత చిగురు, పులిహోర జ్ఞాపకాలు వదలకుండా వేధిస్తూ ఉంటాయి నన్ను. అమ్మ గోరుముద్దల్లో నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది ఈ చింతచిగురు పప్పు అన్నమే. సంగటితో ఈ పప్పు కలుపుకుంటే - చింతాకు జితా జితా అనుకోవాల్సిందే. (ఈ చింతచిగురు పప్పు ఇప్పుడు ఎవరూ చేయట్లేదనుకుంటాను)

మా వూళ్ళో దీన్ని పులగం అని కూడా అంటారు. ఈ పులిహోర లో పులి నేతిబీరకాయ లోనేతి లా కాకపోయినా చిన్నసైజు ముద్రారాక్షసమో టైపాటో లాంటిదే. అది నిజానికి "పుళి". పుళి అంటే తమిళంలో పుల్లనిది. (ఆమ్లము). చింతపండును కూడా పుళి అనే అంటారు. గోంగూరను తమిళంలో పుళిచ్చకీరై అంటారు(ట). అదుగో ఆ పుళి, పులిలా మీదబడి అంటుకుంది. "హోర" ఎలా వచ్చిందో మరి తెలియదు నాకు. పుళియ ఊర - పుళిహోర అయిందా?

కన్నడంలో పుళి - హుళి కావాలి. అయితే ఆ హుళి హుళక్కి అయిపోయి, పులిగానే మిగిలిందెందుకో మరి.

ఈ పులిహోర ఉరఫ్ పులగం కన్నడ వారిదేనేమో అని నా ఊహ. "తింత్రిణీ పల్లవ యుక్తమౌ ఉడుకుబచ్చలి శాకము" - గుజ్జు కాకపోయినా (తింత్రిణీ పల్లవం అన్నారు కాబట్టి) తింత్రిణీ ఫలావిష్టమైన శాకాలు కూడా ఇదే ప్రాంతానికి చెందినవై ఉండవచ్చు. వైద్యానికి పనికి వచ్చే కాయ అని ఒకప్పుడు ఈసడించబడినా, శ్రీవారి కొలువులో ప్రసాదం దాకా దీని ప్రస్థానం సాగింది కనుక దీని ప్రాభవాన్ని విస్మరించడానికి వీలు లేదు.

ఆ పద్యం ఓ సారి పునశ్చరణ

ఫుల్ల సరోజ నేత్ర! యలపూతన చన్నుల చేదు ద్రావి, నా
డల్ల దవాగ్ని మ్రింగితి వటంచును నిక్కెద వేమొ! తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన యొక్క ముద్ద దిగమ్రింగుమ! నీ పస కాన నయ్యెడిన్.

నా చిన్నప్పుడు మా ఊళ్ళో శ్మశానం దగ్గర ఓ చింతచెట్టు ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతం కాస్త నిర్మానుష్యంగా ఉండేది. నేనూ, నా స్నేహితులు "అతడు" సినిమాలో చూపించినట్లుగా పందేలయితే వేసుకోలేదు కానీ, మాట్లాడుకునే వాళ్ళం, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళగలిగే ధైర్యం ఎవరికుందా అని. నేనప్పట్లో పిరికి వాడిని అయినా ఓ రోజు సాహసం చేసి, మరీ రాత్రి పూట కాకపోయినా కాస్త వెలుగు రేకలు పర్చుకుంటున్న సమయంలో దీర్ఘశంక కోసం ఆ చెట్టు దరిదాపులదాకా వెళ్ళిన గుర్తు.

ఎవరు రాశారు, ఏమిటి గుర్తు లేదు కానీ ఓ సంస్కృత చాటువు గుర్తొచ్చింది.

మేరుమందరసమానమధ్యమా
తింత్రిణీదళవిశాలలోచనా |
అర్కశుష్కఫలకోమలస్తనీ
పెద్దిభట్టగృహిణీ విరాజతే ||

మందరపర్వతం లాంటి నడుమూ, చింతాకులా విశాలమైన కన్నులూ, ఎండిన జిల్లేడుకాయల్లాంటి ఉరోజాలు కలిగి ఉన్నది పెద్దిభట్ట వారి గృహిణి అని అర్థం. ఇంత వ్యంగ్యం ఎందుకు రాశారో మరి.

(చాలా రోజుల తర్వాత సోది చెప్పుకోవాలనిపించి రాసిన కబుర్లివి. ఇంతటితో సమాప్తం.)

Sunday, December 20, 2009

ఆశయం


మరిడేశ్వర్రావు.


కర్రిగా, మామూలుకన్నా రోంత ఎత్తుగా ఉండేటోడు. నల్లగున్నా, మొకంలో మంచి కళ. నవ్వితే మట్టుకు, కండ్లు మూసకపోయి స్కెచ్చి పెన్నుతో రెండు గీతలు ఒకదానిమీద ఇంగోటి గీసినట్టు కనిపిస్తాండె. వీడు నాకు పదోతరగతిలో ట్యూషన్ మేటు. వానిది పొట్రాం (పొట్టి శ్రీరాములు) స్కూలు. నాది వేరే బడి. కుళ్ళాయప్ప ట్యూషనులో సాయంకాలం కలిసేటోడు. పేరు మరిడేశ్వర్రావు గదా, పొల్లాపగలు మరిడేశ్వర్రావు అని పూర్తీ పేరుతో పిలసాల్లంటే ఎట్లబ్బా అనుకుంటి. ఆ తర్వాత వాణ్ణి ఈశ్వర్ అని పిలుస్తా ఉంటే, నేను అట్లే అనబడ్తి.

ఆ రోజు ..

తెలుగు ఐవారు, తిరుపతి వెంకటకవుల పాఠం చెప్తా ఉన్న్యాడు. "ఏనుగునెక్కినాము, ధరణీంద్రులు మొక్కగనిక్కినాము.." ఈ పద్యం రాగం తీయబట్టినాడు. ఇట్లా పద్యాలు, రాగాలు తీసేటోళ్ళు తీస్తేనే కమ్మగుంటుంది. తెలుగైవారు బండ గొంతుతో రాగాలు తీస్తా, మధ్యలో నిలబెడతా, పాఠం చెప్తా ఉంటే, పిలకాయలు ఎవడి పాటుకు వాడు నకరాలు చేస్తా ఉన్న్యారు. నేను ఈశ్వర్ పక్కన లాస్ట్ లో కూచునుంటిని.

నా కాడ తెలుగువాచకం లేకపోతే, వాడే నాకు పాఠం చూపిస్తాండె. కొదమ సింహం సినిమాలో చిరంజీవి మొకం కనబడేటట్ల తెలుగు వాచకానికి ఆంధ్రజ్యోతి పేపరుది అట్ట యేసినాడు. పుస్తకంలోపల తిరపతి వెంకటకవుల్లో ఒకాయనకి మీసాలు, నల్లకంటద్దాలు బాల్ పెన్నుతో దిద్దినాడు. ఇంకొకాయనకి తలపైన గుండ్రం టోపీ పెట్టి, నోట్లో సిగరెట్టు పెట్టినాడు. సారు పాఠం కన్నా, ఈ బొమ్మలే బాగుండె. ఆ బొమ్మలు చూస్తా, నేను నవ్వితే, వాడు నన్ను చూస్తా నవ్వుతా ఉండే.

వాని బుక్కు నిండా ఇట్లా యవ్వారాలే. ఒకచోట ఇట్ల రాసినాడు - "నా పేరు 13వ పేజిలో ఉంది." ఆ పేజికి పోతే, "నా పేరు 64 పేజిలో ఉంది." ఇట్లా రాసుకుంటా పోయి, కడాకు, లాస్టు అట్ట మింద, "ఇంగ ఎతికింది సాలు. నా పేరు N. మరిడేశ్వర్రావు" అని రాసుంది. పరవస్తు చిన్నయ సూరి పాఠంలో ఒగచాట, ’వార్ధక్యమున ప్రశాంతముగ కాలంబు పుచ్చక ’అని రాసుంటే, ఆ చివరి పదం కింద అండర్ లైను చేసినాడు.

ట్యూషన్ లో నాకు మొదట్లో పరిచయమైనా గుడకా, నాకు ఈశ్వర్ కి పెద్దగా మాటలుండేటివి గాదు. నేను బక్కోణ్ణి, మామూలుగా కొంచెం మాట్లాడేది తక్కువ. నాకు ఎన్టీయారు, బాలక్రిష్ణ ఇష్టమయితే వాడు చిరంజీవి అంటే పడి సచ్చేటోడు. దానికి తోడు పొట్రాం స్కూలోళ్ళది వేరే గుంపు. వాళ్ళతో నేను ఎక్కువగా కలుస్తా ఉండ్లే.

ఎప్పుడైనా నన్ను చూసి నవ్వేటోడు, మాటలు పడినప్పుడు మట్టుకు, స్వచ్ఛంగ మనసులోంచి మాట్లాడేటోడు.

చిరంజీవి సినిమా వస్తే, స్టారు చేసేది, కటవుట్ కి పూల దండ, దండ మధ్యలో గుమ్మడికాయ, గుమ్మడికాయ చుట్టూతా కలర్ పేపరూ, ఇట్లా పనుల్లో మనోడు తగ్గేటోడు కాదు. ఆ రోజు స్కూలు, ట్యూషనూ అన్నీ ఎగ్గొట్టేటోడు.

ట్యూషనులో కుళ్ళాయప్ప సారికి కోపమొస్తే భలే తిట్టేటోడు. శాపాలు పెట్టేటోడు. భలే భయపడేటోళ్ళు పిలకాయలు. ఒకరోజు కుళ్ళాయప్ప సారు శ్రేఢుల్లో ఒక అభ్యాసంలో లెక్క జేస్తా గుణశ్రేఢి లో సంఖ్యల మొత్తానికి సూత్రం అడిగితే వాడు అంకశ్రేఢి సూత్రం చెప్పినాడు. ఐవారికి కోపమొచ్చి తిట్టబట్టె. "లే, బేకుఫ్! నువ్వు మీ నాయన మాదిరిగా సైకిలు షాపు, టైర్లు పంచర్లేసుకుంటా బతుకుతావు. నీ బతుకింతే ఫో!" అనె. వాడు సారు తిట్టింతర్వాత కూసుని, పుస్తకం అడ్డం పెట్టుకుని కిస కిస నవ్వె. నాకు భలే నవ్వొచ్చె. కానీ నవ్వితే ఐవారు నన్ను సంపుతాడు. ఉగ్గబట్టుకొని, ఆ తర్వాత గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నా.

ఒకరోజు ఉన్నిందున్నట్టు ఈశ్వర్ ట్యూషన్ కి ఒక నాలగు రోజులు రాలే. స్కూల్లో గుడకా కనబడతా ఉన్నిండ్లేదంట. ఇట్లా వారమాయె. ఆ తర్వాత సోమవారం వాళ్ళమ్మ ట్యూషన్ కాడికొచ్చి, కుళ్ళాయప్ప సారుతో, ఏడుస్తా ఏందో చెప్పబట్టె. వాడు ఇంట్లో కూడా లేడంట! యాడకి పోయినాడో ఏందో!

ఇట్ల దగ్గర దగ్గర ఒక నెలన్నరైపాయె. ఒక రోజు ట్యూషన్ మొత్తం, ఒగటే గలాట గలాట. ఈశ్వర్ తిరిగొచ్చినాడంట. వాని చుట్టూతా అందరు మూగి ఏందో మాట్లాడతా ఉన్న్యారు. కొంతమంది ఆ గుంపు లో దూరదామని, దూరలేక దూరం నుండీ వాని వంక హీరోని చూసినట్టు చూస్తా ఉన్న్యారు. నాకు ఆ మరుసట్రోజు విషయం తెలిసె.

ఇంతకీ సంగతేందంటే, మనోడు మడ్రాసు బండెక్కి, మడ్రాసుకు పోయినాడు. ఆడ ఒకచోట కాఫీ షాపులో పని చేసుకుంటా, చిరంజీవిని చూడాలని తిరిగినాడంట. ఇట్ల కన్నగచాట్లు పడి, కడాకు ఒకరోజు చిరంజీవిని ఎట్లో కలుసుకున్న్యాడు. చిరంజీవి వానికి ఒక మూడు వేల రూపాయలు, ఒక సూట్ కేసు, ఒకట్రేండు బట్టలూ ఇచ్చి, మాట్లాడి ఊరికి పొమ్మని సాగనంపినాడంట.

కొన్ని రోజుల తర్వాత ఐవారు ఏదో చెబుతా, "ప్రతి ఒకనికీ జీవితంలో ఆశయం ఉండాల. అది సాధించుకునేకి ప్రయత్నిస్తా ఉండాల. మీరు గొప్పోళ్ళు కావాల. గొప్ప గొప్ప ఉద్యోగాలు చెయ్యాల. ఇంజినీర్లు కావాల." ఇట్లా చెప్తా వచ్చె. ఆ రోజు వాడు నా పక్కన మామూలుగానే నవ్వుతా, "నా ఆశయం ఒగటే ఉండే. అది తీరిపాయె." అని గొణిగి, మామూలుగా కిసకిస నవ్వె.

తర్వాత ఈశ్వర్ చుట్టూతా వాని ఫ్రెండ్స్ ఎక్కువైరి, ఆ తర్వాత నాకు అట్లా దూరమాయె.

టెన్త్ పరీక్షల తర్వాత వాడు, ఇంటర్మీడియట్ లో తెలుగు మీడియంలో చేరె. నాది ఇంగ్లీషు మీడియము. ఆ తర్వాత ఏదో డిగ్రీ, ప్యాసయినాడో, ఫెయిలో తెలీదు.

***********************************

చానా ఏండ్ల తర్వాత నాకు మొన్న మా వూర్లో నా బండికి టైరు మార్చి, ఏదో రిపేరు చెయ్యాలని ఒక షాపుకు పోతి. ఆడ ఒక రూములో ప్రొప్రైటర్ మరిడేశ్వర్రావు అని పేరు రాసున్నింది. అవును మరిడేశ్వర్రావుకు ఇప్పుడు ఊర్లో రెండు టైర్ల షాపులు ఉన్నయ్యంట, బైపాసు రోడ్డు కు అవపక్క ఒక నాలుగిండ్లు ఉన్నాయంట. ఇవి తెలిసిన సంగతులు.

అన్నట్లు నేను షాపులో పనై పోతానే నేరుగ ఇంటికొచ్చేస్తి. ఈశ్వర్ ని కలవలే, మాట్లాడలే. ఏమిటికి అంటే - నా కాడ సమాధానం లేదు.

(నా ఒకానొక బాల్యస్మృతి. పేర్లు మారాయి.నిజంగా జరిగినది, చిరంజీవి ఘటనతో సహా. ఒకే ఒక్క పిసరు కల్పితం. :-))

Saturday, December 19, 2009

అవతారం - ఓ సామాన్యుడి గోల

నిన్న నవతరంగం లో రామ్ గోపాల్ వర్మ బ్లాగులో అవతార్ సినిమా గురించి అతని ప్రశంస చదివి అతని మీద నమ్మకంతో, అవతార్ సినిమాకు టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడే ఓ మల్టీప్లెక్స్ లో ఈ 3D సినిమా చూసొస్తున్నాను.

రాము వ్యాఖ్య ప్రకారం ఈ సినిమా ఓ అనుభవం. అక్షరాలా. సందేహం లేదు. అయితే, అనుభవం వేరు, అనుభూతి వేరు. అనుభవానికి ఆలంబన ఇంద్రియాలు, వాటి తాలూకు ప్రకంపనలు, ఇంకాస్త ముందుకు వెళితే, ఇంద్రియాల ద్వారా చోదితమైన బుద్ధి అయితే అనుభూతికి ఆలంబన మనస్సు. అవతార్ సినిమా స్టార్ వార్స్ సినిమా గుర్తు తెప్పిస్తే, నాకు మాత్రం స్పీల్ బెర్గ్ E.T. సినిమా గుర్తొచ్చింది. అందులో ఉన్నది, ఈ సినిమాలో లేనిది కాస్త స్పష్టంగానే కనిపించింది.

ఇది కేవలం నా సోది కాబట్టి, నా ఆలోచనల్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. చాలా రోజుల క్రితం, ఓ శుక్రవారం రాత్రి, "అన్బే శివం" అన్న కమల్ హాసన్ సినిమా చూశాను. ఆ సినిమాలో - ఓ బస్సు ఆక్సిడెంట్ కు గురవుతుంది. దానికి కారణం ఓ కుక్క. ఈ సంగతి తెలిసీ, కమల్ ఆ కుక్కను చేరదీస్తాడు. ఆ సినిమా ఆలోచనలతో రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు. రాత్రి కిటికీ బయట కుక్క ఏడుస్తోంది. రోడ్డుపై ఎవరో దాన్ని కసరడమూ వినబడింది. ఆ తర్వాత మాగన్నుగా నిద్రపట్టింది. (ఆ సినిమాకు చలించిన నా బుద్ధి నిజంగా ఎదురుగా కుక్క ఏడుస్తుంటే పట్టించుకోలేదెందుకో) ఇంతకూ నేను చెప్పదల్చుకున్నదేమంటే, - మనసుకు, బుద్ధికి దగ్గరగా కనిపించే, వినిపించే సంఘటనలకు ప్రతిస్పందించటం మానవ సహజం. మొన్న వరదతాలూకు ప్రభావం టీవీల్లో చూసి, ప్రజలు స్పందించారు. అదే సమయంలో ఏ ఇరాన్ లోనో, మరెక్కడో ఏ దుర్ఘటనలోనో అంతకంటే ఎక్కువ ప్రజలు చచ్చినా, మనం పట్టించుకోము. ఉద్వేగం బుద్ధిని తాకితే అది "అద్భుతం". ఉద్వేగం మనసును తాకితే అది "కరుణ". రెండూ రసానుభూతులే అయినా "ఏకో రసః కరుణ ఏవ" . మనిషి ఆలోచనలను సత్యం వైపుగా మరల్చడానికి "కరుణ" రసమే ఆలంబన అవుతుంది, కానీ అద్భుతం కాదు.

అవతార్ సినిమాలో ఆటవికుల (?) బాధ చూసినప్పుడూ అందులో "అద్భుతం" కనబడిందే తప్ప, వారి "ఆక్రోశం" నా మనసుకు తాకలేదు. (ఇది నా గోల. అందరికీ ఇలానే అనిపిస్తుందో మరి నాకు తెలీదు). ఆ ఆటవికుల ఆహార్యం విచిత్రంగా అనిపించింది కానీ ఆహ్లాదంగా కనిపించలేదు. ఇక నేపథ్య సంగీతం పేలవంగా ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదన్నట్టుగా ఉంది.మరో లోకానికి మనల్ని "ఈడ్చుకెళ్ళినట్టు" ఉన్నది తప్ప, "తీసుకు వెళ్ళినట్టు" ఈ సినిమా నాకు అనిపించట్లేదు.

Imagination will be a creation, if it touches one's heart, and is identifiable by the heart. Otherwise, it remains as a technical grandeur. (ఇది నా కోటింగే, ఎవరిదీ కాదు)

అవతార్ సినిమా ఓ Technical masterpiece అనిపించింది తప్ప, ఓ కళాఖండం అని నాకు అనిపించట్లేదు.

ఇందాక అన్నట్టు, నాకు E.T. సినిమా గుర్తొచ్చింది. అందులో ఉపగ్రహపు బాలుడి వేలు కొసను, భూలోకపు బాలుడు తాకుతాడు. ఈ సినిమా ప్రోమోస్ లో కూడా ఇది కనిపిస్తుంది. ఈ సినిమాలో ఈ దృశ్యం అనుభవైకవైద్యం. అదే సినిమా 3D లో తీసి ఉంటే, ఓ ఒక్క దృశ్యం కోసం సినిమా చాలాసార్లు చూసి ఉండవచ్చు. అవతార్ సినిమాలో కనిపించే (నాగమల్లి) పూలు, జలపాతాలు, యుద్ధ విమానాలు, మరో లోకానికి తీసుకు వెళతాయి తప్ప దర్శకుడు అంతర్లీనంగా చెప్పదల్చుకున్న సందేశానికి ప్రోద్బలం చేసేలా మాత్రం లేవు.

"ఇంతకంటే, ఓ మామూలు థియేటర్ లో ఓ తెలుగు మాస్ సినిమా చూసి ఉంటే మేలు".ఈ సినిమా చూసి, బయటకు వచ్చిన తర్వాత నాకు, నిజాయితీగా నాకు కలిగిన ఫీలింగ్.

1200 కోట్ల సినిమా, రాము మెచ్చిన సినిమా ఇట్లాంటి పనికిరాని మాటలు నా వంటికి పడవని మరో మారు అర్థమయింది. గొప్ప సినిమా అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు.

(అవతార్ సినిమా చివర్లో, ఓ 20 నిమిషాలకు ముందు లేచొచ్చాను నేను. ఆ 20 నిముషాల్లో, నా ఆలోచనల్ని తిప్పేసే సంఘటనలు సినిమాలో జరిగి ఉంటాయని నేను భావించట్లేదు)