Saturday, May 31, 2008

మొబైల్ ఫోన్ల నూతన పోకడలు

మార్కెట్ లో రోజుకో సెల్ ఫోను విడుదలవుతూందీ మధ్య.

మొబైల్ ఫోన్ వాడకం దార్లు పెరిగే కొద్దీ అటు మొబైల్ సంస్థలు, ఇటు నెట్ వర్క్ ఆపరేటర్లు కొత్త కొత్త పద్ధతులతో మార్కెట్ పై దాడి చేస్తున్నారు. ఓ ఏడాదిన్నర క్రితం 13000 ఖరీదు చేసే (అప్పటికి) నవ నూతన మొబైల్ ఫోను ఇప్పుడో 7500 కి లభిస్తోంది. ఇక మార్కెట్ లో 4000 కే ఎక్స్ టర్నల్ మెమరీ, ఎం పీ 3 లు, బ్లూ టూత్ సుదుపాయాలున్న సెల్ ఫోన్లు లభ్యమవుతున్నాయి.

తొండ ముదిరితే ఊసరవెల్లి. మొబైల్ ముదిరితే, ఓ కెమెరా, ఓ కాం కార్డరూ, ఓ ఎం పీ 3 ప్లేయరూ, వగైరా వగైరా.

ఐతే ఇవి కూడా క్రమంగా పాతబడుతున్నాయి.

ఇక వాడకం దార్లను ఆకర్షించడానికి మొబైల్ సంస్థలు కొత్త కొత్త దార్లను ఎంచుకోవాలిగా.

సెల్ ఫోన్లలో ఈ కొత్త సదుపాయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

మొబైల్ కాం కార్డరు : మొబైల్ కెమెరా పాతబడిపోయింది. ఇక వచ్చే సెల్ ఫోన్లలో కాం కార్డరు (రక రకాల ఫైల్ ఫార్మాట్ ల సపోర్ట్ తో) ఓ తప్పని సరి అంశం కాబోతోంది.

మొబైల్ ఫోన్ కి టీవీ అనుసంధానం : మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా.., సారీ మొబైల్ కెమెరా/కాం కార్డరు ద్వారా తీసిన చిత్రాలను ఓ కేబుల్ వైరు ద్వారా టీవీ కి అనుసంధానించుకోవచ్చు. ఎల్ జీ వారి వ్యూటీ మొబైల్, సోనీ ఎరిక్సన్ కొత్త మాడల్స్ దీనికి ఉదాహరణ.

మల్టి సిం కార్డ్ సపోర్ట్ : ఒకే మొబైల్ ఫోన్ లో జీ ఎస్ ఎం, సీ డీ ఎం ఏ సదుపాయాలు. లేదూ, 2 జీ ఎస్ ఎం - సిం కార్డ్ లను వాడుకోవచ్చు. స్పైస్/ఏర్టెల్ మొబైల్ వారు ఇలాంటి మొబైల్ విడుదల చేసినట్టు గుర్తు. ఐతే, ఈ టెక్నాలజీ ఇంకా అంతగా అభివృద్ధి చెందలేదు. పైగా అభివృద్ధి చెందుతున్న (మన దేశం లాంటి) దేశాల్లో ఇది అంత ఆకర్షణీయమైన సదుపాయం కాదు. అందుకే దీనికంతగా ఆదరణ పెరగలేదు.

ఎఫ్ ఎం, వాయిస్, కాల్ రికార్డింగ్ : వాయిస్ రికార్డింగు తెలిసిన అంశమే. ఎఫ్ ఎం, కాల్ రికార్డింగ్ కొత్తవి. ఇవి కాస్త ఆకర్షణీయమైన ఫీచర్సే. కాల్ రికార్డింగ్ అంటే మీకు వచ్చిన కాల్ అందుకుని, సంభాషణ రికార్డు చేసుకొనే సదుపాయం.

ఇంకో కొత్త అంశం (మన దేశానికి సంబంధించి) వీడియో ఆన్ డిమాండు. అంటే ఓ రకంగా మొబైల్ వెబ్ కాం. మీరు మాట్లాడుతున్నప్పుడు వీడియో తీసి, స్ట్రీమింగ్ ద్వారా మీ మిత్రులకు పంపడం. మన దేశానికి అని ఎందుకు వాడానంటే, ఇది జరగాలంటే 3జీ నెట్వర్క్ తప్పనిసరి. భారతదేశం లో ఇంకా 3జీ నెట్ వర్క్ రాలేదు. (ప్రపంచం ఇప్పటికే 4జీ వైపు అడుగులేస్తున్నది).

ఇక వాల్యూ ఏడెడ్ సర్వీసెస్ విషయానికి వస్తే

పంచాంగం : కొంతమంది నెట్వర్క్ ఆపరేటర్లు ఈ సర్వీసు ఇప్పటికే ఇస్తున్నారు, ఎస్ ఎం ఎస్ ఆధారంగా. అంటే ఫలానా నంబరు కు ఎస్ ఎం ఎస్ చేసి, ఈ రోజు తిథి, నక్షత్రం వగైరా తెలుసుకోండి టైపు. ఐతే ఈ మధ్య వచ్చిన ఓ సాం సంగ్ ఫోన్లో ఈ సదుపాయం కాలెండరు కి అనుసంధానించేరు. అంటే, ఎస్ ఎం ఎస్ అవసరం లేకుండా, ఫోన్లో అంతర్భాగంగానే.మిగిలిన మొబైల్ ఫోన్లలోనూ ఇది మొదలవచ్చు.

ఎస్ ఎం ఎస్ ద్వారా వాణిజ్య ప్రకటనలు : మీ మొబైల్ ఫోన్లో మా ప్రకటనలను అనుమతించండి. మీకు ప్రకటనకు ఇంత చొప్పున ఇచ్చుకుంటాం అన్నది ఓ టైపు. (
http://www.m-earn.com/) ఇది కాక ఇంకో ఎస్ ఎం ఎస్ - 2 అనబడే స్టాండర్డ్ ఇప్పటికే రూపు దిద్దుకుంది. ఇది ఇంకా పూర్తిగా విజృంభించలేదు.

మొబైల్ బ్లాగింగ్ : ఇది ఆరంభ దశ లో ఉంది. రిలయన్స్ వారి సర్వీసు.

ఇవన్నీ కాక ఇంకా..స్త ముందుకెళితే ఎలా ఉంటుంది అని నా ఫ్రెండొకడితో ఓ సారి మాటల సందర్భంలో ఊహించేము. మా మాటల మధ్య ఓ అవుడియా దొర్లిందిలా..

భవిష్యత్తులో ఓ రోజు. మీరు ఏ సినిమాకో వెళుతున్నారు, సకుటుంబ సమేతంగా (ఆ డబ్బుతో ఓ మొబైల్ కొనుక్కోవచ్చు!). మీ ఇంటికి భద్రత లేదు. ఎలా??

మరేం ఫర్లేదు. మీ 'ఫలానా ' మొబైల్ ను వాకిలి కి కాస్త ఎడంగా బిగించి వెళ్ళండి. మొబైల్ ను ఆన్ చేసుంచండి. అలానే బ్లూ టూత్ ను కూడా.

మీ వాకిలికి ఓ సెన్సర్ ఉంది. మీ ఇంటికి దొంగ వచ్చి తలుపు కాస్త కదుపగానే వాకిలికి బిగించిన సెన్సర్ రంగం లోకి దిగుతుంది. అది కాస్త ఎడంగా తన కోసమే కాసుక్కూర్చున్న మొబైల్ కు కన్ను గీటుతుంది, బ్లూటూత్ ద్వారా. వెంటనే మీ మొబైల్, మీకు (మీ ఆవిడకు) ఎస్ ఎం ఎస్ పంపుతుంది. మీరు ఆఘమేఘాల మీద వచ్చి మీ ఇంటిని రక్షించుకుంటారు! లేదూ, కాస్త తక్కువ ధర ఉన్న ఫోన్ ఐతే ఓ అలారం మోగిస్తుంది. దాంతో దొంగ పరారు!

ఎలా ఉంది అవుడియా ?

సమాచార విప్లవం ఆగదు మరి. ఇప్పుడే ఇలా ఉంటే, రాబోయే తరంలో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహ కందకుండా ఉంది. ఎల్ కె జీ చదివే పిల్లలకే ఐ-ఫోన్ వాడకం కంపల్సరీ అనా ఆశ్చర్యం లేదు.

జరుగుతున్నది సమాచార విప్లవం.
ముందున్నది సమాచార (ఆర్) నారాయణ మూర్తుల తరం.


Tuesday, May 27, 2008

బుజ్జి గాడు, మేడ్ ఫర్ మాస్

ఈ పాటికి జనాలు ఓ నిర్ణయానికి వచ్చేసుంటారు, ఇదో ముష్టి సినిమా అని. ఐతే ఎవరైనా, నాతో భావ సారూప్యం కలిగిన మాస్ ప్రజ ఉంటే వాళ్ళ కోసం ఈ రివ్యూ. దర్శక పూరీ ఈ సినిమా లో చెప్ప(చూపించ)దల్చుకున్నది కేవలం హీరోఇజాన్ని.ఈ సినిమా చూడాలంటే అది తప్ప మరో కారణం లేదు.

కథ : బుజ్జి, చిట్టి పూవు పుట్టగనే పరిమళించినట్లు, మరీ చిన్న వయసు లోనే ఒకరినొకరు ఇష్టపడుతుంటారు. చిట్టి ఓ రోజు బుజ్జి తో నాతో 12 ఏళ్ళు మాట్లాడద్దు అంది. దానితో బుజ్జి, బుజ్జి దేవదాసు గా మారి, చెన్నై పారిపోతాడు.

పారిపోయిన బుజ్జి, రజనీకాంత్ సినిమాలు చూసుకుంటూ, తీరిక వేళల్లో కోళ్ళ ఫారం లో ఫైట్స్ అవీ చేసుకుంటూ ఆరు పలకల బాడీ తోటి తిరుగుతుంటాడు. 12 యేళ్ళ తర్వాత చిట్టి కోసం వెతుక్కుంటూ వచ్చి, విలన్ల కళ్ళబడతాడు. ఓ కోటి రూపాయలకు శివన్న (మోహన్ బాబు) ను చంపడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. శివన్న ను అటాక్ చేయబోయి మధ్యలో దెబ్బలు తింటాడు. బుజ్జి ధైర్యం, దమ్ము మెచ్చుకుని, శివన్న తన దగ్గరే ఉంచుకుని వైద్యం చేయిస్తుంటాడు.

ఆ శివన్న చెల్లెలే చిట్టి. బుజ్జి, చిట్టి ఎలా కలుసుకున్నారనేదే మిగతా కథ.

ఈ సినిమాలో చెప్పుకోవలసింది., ప్రభాస్ (బుజ్జి) నటన. కాస్తో, కూస్తూ తనకి వప్పిన గోదావరి యాస. పూరీ మార్కు డవిలాగులు.
" కండక్ట్రూ, అద్దాలు అలా.. బద్దలు కొట్టుకుని మనుషులు బస్ బయటకు ఎగరడం చూసావా ఎప్పుడైనా?

"" డిప్రషను మెయింటయిను చేస్తున్నట్టున్నావ్? కొందరమ్మాయిలకు ఇది బావోదు. నీకు పర్లేదు. కంటిన్యూ ఐపో "

" టిప్పర్ లారీ స్కూటర్ ను గుద్దితే ఎలా ఉంటదో, నాతో పెట్టుకుంటే అలా ఉంటది. "

ఫోటోగ్రఫీ, రీ రికార్డింగూ బావున్నాయి. రెండవ హీరోయిను బావుంది, ఐతే ఒక్క పాట కూడా పెట్టకుండా వేస్టు చేసారు. సునీల్,కోటా, ఎంవీఎస్, ఆహుతి ప్రసాద్ తదితరులు ఓకే.ఇక చెప్పుకోకూడనివి, త్రిష , మోహన్ బాబు.

పూరీ కి ప్రకాష్ రాజ్ అరుపులు వినీ వినీ బోర్ కొట్టినట్టుంది. మోహన్ బాబు ని దింపాడు. కనీసం హరి అయినా బాగుండేదేమో.

ఈనను మొదట కరకు గా చూపించి, సడన్ గా సాధు జంతువు గా మార్చారు.దాంతో దెబ్బ తింది.

సందీప్ చౌతా మ్యూజిక్ 'ని 'కొట్టాడు. బాగా దెబ్బలు తగిలాయ్ దానికి.

ఈ సినిమా చూడాలంటే కింద రాసిన 'ఇఫ్ ' కండిషన్లు గుర్తు పెట్టుకోండి.
ఇఫ్ ( మీరు ఎటు తిరిగి తెలుగు సినిమా చూడాలనుకుంటున్నారు )

{

ఇఫ్ (మీ ఇంటి వద్ద మామూలు థియేటర్ - మల్టిప్లెక్స్ కానిది ఉంది)

{

ఇఫ్ (మీరు మాస్ సినిమాలు ఇష్టపడతారు - అంటే, కేవలం శెఖర్ కమ్ముల, యేలేటి చంద్ర శెఖర్ రేంజి కాకుండా కొంచెం కింద)

{

చూడండి.

}

}

ఎల్స్ ఇఫ్ (మీరు ఉన్న జీతాన్నంతా ఇ ఎం ఐ లకి అర్పించి, సోడెక్సొ లతో కడుపు నింపుకునే బడుగు మృదులాంత్రపు జీవి కాదు)

{

వెళ్ళి జేబుకు చిల్లు పెట్టుకోండి.

}

}

ఫైనల్ గా ఓ మాట. కంత్రీ, పరుగు ల కంటే ఈ సినిమా కాస్త బెటర్. ఇక మీరే ఆలోచించుకోండి.

Thursday, May 22, 2008

తంకుబాన్ పెరహు - ఇండోనేషియా లో ఓ అగ్నిపర్వతం!

ఫోటో లో కనిపిస్తున్నది ఓ అగ్నిపర్వతం. ఇండోనేషియా లోని జావా ద్వీపం, రాజధాని జకార్తా కు దాదాపు 100 కిలో మీటర్ల దూరంలో, బాండుంగ్ అనే ఓ ప్రదేశానికి దగ్గరలో ఉంటుంది.

ఈ అగ్నిపర్వతం అచేతనావస్థ (Passive Volcano) లో ఉంది.

పచ్చగా కనిపిస్తున్నది, భూమి నుండి ఉబికి వచ్చిన గంధకిక ఆంలము (sulfuric acid). అది పొగలు గక్కుతూ ఉంటుంది.

ఈ ప్రదేశం భూమి ఉపరితలానికి 7000 అడుగుల ఎత్తుపై ఉంది. ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత పైనుండి ఈ అగ్ని పర్వతాన్ని చూడవచ్చు. ఈ పర్వతం కాస్త తగ్గు లో ఉంటుంది. చాలా ఎత్తు (విమానం లేదా హెలికాప్టర్) నుండీ చూస్తే ఇది తిరగబడ్డ పడవలా అగుపిస్తుందట. అదే దీని పేరు (తంకుబాన్ పెరహు - తిరగబడ్డ నావ).
దీని వెనుక ఓ కథ.

అనగనగా 'దయాంగ్ సుంబి ' అనే ఓ అందమైన యువతి. ఆమెకో కొడుకు. పేరు 'సంకురియాంగ్ '. ఓ రోజు ఆ అమ్మ పిల్లాణ్ణి అల్లరి చేసినందుకు గానూ కొట్టింది. పిల్లాడు ఫీలయి, ఇంటి నుండీ వెళ్ళిపొయేడు. ఆ బాధలో ఆమె కనబడ్డ దేవుళ్ళకందరికీ మొక్కుందట. దేవుళ్ళు అనుగ్రహించి ఆమెకు నిత్య యవ్వనాన్ని ఇచ్చేరు ,ఎప్పటికైనా కొడుకు తిరిగి ఆమె ను చేరుకుంటాడు గా అని.

ఎన్నో యేళ్ళ తర్వాత అతను యువకుడై తిరిగి వచ్చేడు. వస్తూనే తల్లిని గుర్తుపట్టలేక ఆమెను మోహిస్తాడు. పెళ్ళి చేసుకుంటానంటాడు. కొడుకని తెలీక ఆమె వొప్పుకుంటుంది. తర్వాత ఈ అబ్బాయి తన కొడుకే అని ఆమెకు తెలుస్తుంది. అయితే ఆ సరికే ఆమె పెళ్ళికి ఒప్పుకుంది కదా..ఆ పెళ్ళి ని ఎలాగైనా ఆపాలని ఆమె 2 షరతులు విధిస్తుంది. సూర్యోదయం లోగా నది కి ఆనకట్ట నిర్మించి, నదిని దాటడానికి ఓ నావ తయారు చేస్తెనే పెళ్ళి అని చెబుతుంది.

సంకురియాంగ్ తనూ దేవతల్ని ప్రార్థించి, దేవదూతల సహాయంతో, రాత్రికి రాత్రి ఓ ఆనకట్ట, ఓ పడవ తయారు చేయడానికి పూనుకుంటాడు.పని దాదాపు పూర్తి అయే తరుణంలో, దయాంగ్ సుంబి గమనించి, తన అనుచరులతో, నగరానికి తూరుపు వైపు తన ఎర్ర చీర పరిపిస్తుంది. ఆ చీర కాంతులతో ఉదయం అయిందని భ్రమ పడి ఆవేశంతో తన ఆనకట్టను తనే ధ్వంసం చేసి, తన పడవ ను తలకిందులయేలా తంతాడు.

ఆనకట్ట బద్దలవడంతో తుఫాను వచ్చి, తను, తన తల్లితో బాటు నగరంలో అందరు చనిపోతారు.

తిరగబడ్డ నావ సంకురియాంగ్ మనసులో బాధకు చిహ్నంగా అగ్నిపర్వతం అవుతుంది.

ఈ కథ కూడా అక్కడ బోర్డు పైన రాసుంచారు. ఈ అగ్ని పర్వతం వయస్సు 5 లక్షల సంవత్సరాలు (అక్షరాలా) అని కనుగొన్నారట.

ఇలాంటి కథే ఒకటుంది మనకూను. శ్రీశైల మహత్మ్యం సినిమాలో ఓ కథ. ఓ తండ్రి తన కూతుర్నే మోహించి ఆఖర్న ఓ శిలగా మారి పాతాళగంగ లో పడతాడు. కలియుగం ఆఖరుకు భక్తుల పుణ్యం తో ఆ శిల కరిగి శాప విమోచనం అవుతుందట.

ఈ చోటికి వెళ్ళే దారి, కేరళ మూనార్ లాగా, టీ తోటలతో నిండి ఉంటుంది.

మేమక్కడికి వెళ్ళిన రోజు ఇంకో అందమైన, మర్చిపోలేని అనుభవం యేమిటంటే, ఆ రోజు వర్షం కురుస్తోంది. ఒకే సమయంలో మేఘాలని తాకుతూ, అదే సమయంలో ఇంకో వైపు అగ్నిపర్వతపు సెగలు. అదో అనుభూతి. (ఫోటో లో పైన కనిపించేవి మేఘాలు. కింద అగ్ని పర్వతపు సెగలూ చూడవచ్చు).

ఆన్సైటు లో అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి.

ఇది గత సంవత్సరం ఇదే రోజు (మే 21 , 2007) జరిగింది.

Friday, May 16, 2008

గల్ఫ్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ రోజు!

ఒక్కో సారి మనకు పక్కన పరిసరాలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా 'ఎంజాయ్ ' చెయ్యమని మనసు చెబుతూ ఉంటుంది. అయితే వచ్చిన బాధ ఏమంటే, అలా చేయనీకుండా అదేదో అడ్డు పడుతూ ఉంటుంది.

ఇలాంటి ఓ చిన్న సంఘటన. మొన్న ఆదివారం 'కంత్రీ ' సినిమా కెళ్ళాము, నేను, మా ఆవిడా, మా మరిది. సినిమా టైటిల్ బాగా ఆలోచించి పెట్టినట్టున్నారు. సార్థక నామధేయం. పిచ్చ బోరు. ఇంకేం చెయాలి? ఆవిడేమో అంత బోర్ సినిమాలో లీనమై చూస్తుంది. ఇంతలో పాట మొదలైంది. నాకు ఆ పాట చూస్తూ ఈల వేయాలనిపించింది. పాట బాగుండి కాదు, ఏదో చేయకపోతే తల్నొప్పి వచ్చేట్లుంది, అందుకు. ఓ రెండేళ్ళ ముందయితే, ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణ లో పెట్టుండే వాణ్ణి. ఇప్పుడు నేనో 'బాధ్యత ' గల గృహస్థును. ఏం చేస్తాం ?

ఇంతలో కరెంట్ పోయింది. అప్పుడు కాస్త ధైర్యం చేసి, ఓ చిన్న ఈల వేశాను.

ఫలితం ....

తల వాచేట్లు చివాట్లు, రెండు రోజులు మా ఆవిడ మౌన వ్రతం.

ఇలాంటి ఓ అనుభవం గల్ఫ్ ఎయిర్ వారి విమానంలో సరిగ్గా ఓ నెల ముందు.

****************************************************
ఏప్రిల్ 12 వ తేదీ.
యెమన్ దేశం,
సనా నగరం.

నెల రోజుల తర్వాత ఆఫీసు పని ముగించుకుని, స్వదేశానికి తిరుగు ముఖం పడుతున్నాం. ఎందుకనో ఏమో మాటిమాటికీ చిరునవ్వు తన్నుకుని వస్తూంది. ఆ రోజు నుండీ అక్కడ యెమన్ దేశంలో ఏవో సెలవులట.

అక్కడ పని చేస్తున్న మన భారతీయులు చాలా మంది మేము వస్తున్న విమానంలో సెలవులకని మన దేశానికి వస్తున్నారు.

ఇక్కడ ఓ విషయం. గల్ఫ్ దేశాల్లో 'భారతీయులు 'అనే మాటకి అర్థం - 'మళయాళీలు ' అని.

విమానం అంతా 'గజడదబ ' లతో గజగజలాడుతోంది.

నేను, నా మిత్రులిద్దరు ఓ సీట్లో కూర్చున్నాము. ముందు సీట్ లలో ఇద్దరు మలయాళీ ఉరఫ్ అమ్ముకుట్టీ అలియాస్ కాట్రవల్లి కండో లు. ఓ హిందీ యువకుడు. వాళ్ళకటుగా ఓ ఫిలిప్పీన్ జంట. మాకటు పక్క (ఫిలిప్పీన్ జంట వెనుక సీట్లలో) ఓ ఇద్దరు, మధ్య వయసు నుండీ వార్ధక్యం దిశ గా దూసుకుని వెళుతున్న వృద్ధ యువకులు. వీళ్ళిద్దరు సూటు బూటులతో బాగా డిగ్నిఫైడ్ గా కనిపిస్తున్నారు.

వీళ్ళే ఈ టపా నాయకులు.

వీళ్ళు యెమెన్ దేశస్తులే (అరబిక్ లో మాట్లాడుకుంటున్నారు. ఐతే, హిందీ కూడా ఓ మోస్తరు గా వచ్చినట్టుంది)

వెనుక ఓ ఖాళీ సీటు, ఆ తర్వాత కేబిన్ క్రూ వాళ్ళ స్టోరేజ్ గది.

మా ప్రయాణ సమయం 2 గంటలు.(సనా నుండీ బహ్రైన్ వరకు)

విమానం టేకాఫ్ అయి ఓ ఐదు నిముషాలయి ఉంటుంది. మొదటి హీరో వెనుక రూం (స్టోరేజ్) కెళ్ళాడు. ఎలా మేనేజ్ చేసాడో తెలీదు. చేతిలో ఓ పెగ్గు. రెండవ హీరో నీళ్ళు తెప్పించుకి తాగేసేడు. ఆ మంచి నీళ్ళ గ్లాసులో మొదటి హీరో విస్కీ కాస్త అందించేడు.

కాసేపయింది.

ఓ యువతి ట్రాలీ లో రకరకాల పళ్ళ రసాలు, వైను, కోకా కోలా లాంటి సాఫ్టు డ్రింక్స్ తోసుకుంటూ వచ్చింది.

ఆ యువతి అదేదో సినిమాలో చెప్పినట్టు,
అంత లావు కాదు, అంత సన్నమూ కాదు.
అంత పొడుగూ కాదు, అంత పొట్టీ కాదు.
అంత తెలుపూ కాదు, అంత చామన చాయా కాదు.
ఐతే మామూలు కంటే కొంచెం లావు అన్నట్టు కనబడుతుంది.

మా సీట్లు చివర్న కాబట్టి, మమ్మల్ని దాటుకుని వెళ్ళి, మొదట సీటు నుండీ సర్వ్ చేయాలని వెళుతోందావిడ.

ఆవిడను ఆటకాయించి చెరో పెగ్గు (వోడ్కా), స్ప్రైటు గుంజేరు వృద్ద మానవులిద్దరు.

ఆవిడ సర్వ్ చేసుకుంటూ మా సీట్ వద్దకు వచ్చింది.

నాకు కాస్త వైను రుచి చూడాలనిపించింది. ఐతే, నాకు తాగడం అలవాటు లేదు (అప్పుడప్పుడూ ఏవో చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం తప్ప).

హీరోలిద్దరూ, వాళ్ళకోసం వైను తీసుకోమని మమ్మల్ని ప్రాధేయపడ్డారు. మేము వైను తీసుకుని, హీరోలకి అందించేము.

ఆ సరికి, కురు వృద్ధులిద్దరికీ బాగా మత్తెక్కింది.

" మొహబ్బత్ జిందగీ హై " అన్నాడు రెండవ హీరో, ఎయ్ర్ కాబిన్ క్రూ అమ్మాయి వంక చూస్తూ. ఆ అమ్మాయి కి అరబిక్ తప్ప వేరే భాష తెలీదు.

మా ముందు సీట్ లో ఉన్న మళయాళీ ఫార్మ్ లో కొచ్చాడు.

" పెణ్ కుట్టి ప్రమాదమాయి " (అమ్మాయి బావుంది) అన్నాడతను ఆ వృద్ద హీరోల వంక చూస్తూ.

" అగర్ విమాన్ గిర్ నే వాల్యా హై తో, గిర్ నే కే బెహ్లే క్యా గరోగే ? ఉస్ సే షాదీ గరోగే? "

2వ మళయాలీ అడిగేడు, హీరో నంబర్ 2 ను.

విస్కీ సీసా పగిలినట్టు భళ్ళున నవ్వేడు హీరో. ఆ నవ్వుతో శృతి కలిపేడు ఇంకో హీరో.

నవ్వు మధ్యలో ఆగి " కుల్లు ముశ్కిలా " చెప్పి మళ్ళీ నవ్వు కంటిన్యూ చేసాడు.

కుల్లు ముశ్కిలా (అరబిక్) - చాలా కష్టం (తెలుగు)

ఎయిర్ కాబిన్ క్రూ అమ్మాయి ఏమీ పట్టించుకోలేదు.

'నహీ, ముఝే జిందగీ మే కుచ్ నహీ చాహియే బస్ ఏక్ పెగ్ ' హీరో నంబర్ 2 చెప్పాడు.

ఇలా ఈ తంతు కాసేపు జరిగింది. మధ్యలో ఫిలిప్పీన్ జంట మీద కూడా జోకులు.

కాసేపు తర్వాత విమానం లాండ్ అవబోతుంది అని ప్రకటించేరు. ఓ నాలుగు సీట్ల ముందు ఏదో గొడవ. ఒకతను విండో షట్టర్ మూసి కూర్చున్నాడు. విమానం లాండ్ అయేటప్పుడు అవి తెరవాలి. తెరవనని గొడవ. ఓ
పెగ్గు మందు పోస్తే షట్టర్ తీస్తాడట.

సామ భేద ఉపాయాల తర్వాత దండోపాయం తో అతనికి సర్ది చెప్పేరు.

ఇక విమాన ప్రయాణం ముగిసి దిగబోయే ముందు, రెండో వృద్దుడు ఏమనుకున్నాడో ఏమో కాబిన్ క్రూ అమ్మాయి తో, అరబిక్ లో ఏదో చెప్పాడు (సారీ లాంటిదనుకుంటా). ఆ అమ్మాయి నవ్వేసి, ' వెళ్ళి రండి తాతయ్యలూ ' అంది.

దిగేప్పుడు ఆ వృద్దులు చెప్పారు. వాళ్ళిద్దరూ డాక్టర్లట (వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చేరు). వాళ్ళ దేశం (యెమన్) లో మద్యం దొరకదు. అందుకని, దొరికినప్పుడిలా 'ఎంజాయ్ ' చేస్తారట. ఇబ్బంది కలిగిస్తే మన్నించమని చెప్పేరు.

ఈ ప్రహసనం లో ఓ విషయం గమనించాను. ఆ వృద్దుల గొడవలో అసభ్యత, లేదు. ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆనందించారంతే.

మిగిలిన ప్రయాణీకులు కూడా వాళ్ళ గొడవ ను ఆనందించినట్టే కనబడ్డారు.

అదండీ ఓ పూట నా విమాన ప్రయాణం లో పదనిసలు.

Friday, May 9, 2008

ఎందరో మహానుభావులు!

నా మిత్రుడు (కన్నడ కస్తూరి) ఒకతనికి జాతకాలు, న్యూమరాలజీ వీటిపైన గురి. ఓ సారి తను, మే నెల జాతకుల గురించి చెబుతూ, ఈ నెలలో పుట్టిన వాళ్ళు కళాత్మక హృదయులు, సత్య శోధకులు, ఒకింత అంతర్ముఖులు వగైరా వగైరా అంటూ చెప్పుకొచ్చాడు.

మనకంత సీను లేదు కదా (నేను మే 2 వతేదీ అఘోరించాను లెండి), కస్తూరి ఏమిటి ఇలా అంటాడు అని అనుకున్నా. వాడు, తన మాటలు నేను నమ్మట్లేదన్న ఆవేశంతో ఓ లంకె చెప్పి, అందులో వివరాలు వెతుక్కోమన్నాడు. (http://www.findyourfate.com) ఆ వెబ్ సైటు లో చాలా వరకు పచ్చి నిజాలున్నాయిష!

సరే, ఈ నెలలో పుట్టిన మహానుభావుల వివరాలు తెలుసుకుంటే తను చెప్పిన సంగతి నిజమో కాదో తెలుస్తుంది కదా..చూద్దాం లే అనుకున్నా.

తర్వాత నా వరకూ ఓ ఆశ్చర్యకరమైన సంగతి తెలిసింది. నేను అభిమానించి, ఆరాధించే వ్యక్తుల్లో చాలా మంది ఈ మాసం లోనే జన్మించారు. పై చెప్పిన లక్షణాలు కూడా అతికినట్టు సరిపోతాయి వాళ్ళకు. ఈ మహానుభావుల్లో ఒకరికి ఇంతకు మునుపు టపాలో నివాళి తెలిపాను. మిగిలిన వారి గురించి స్థూలంగా ప్రస్తావిస్తాను.

ఈ జట్టు కి కాప్టన్ నిశ్చయంగా మిస్టర్ గౌతం గారే.

గౌతమ బుద్ధుడు : ఈ మహానుభావుడు వైశాఖ పౌర్ణమి రోజు జన్మించాడు (ఈ నెల 12 వ తేదీ అవుతుంది). ఓషో, రజనీష్ ఓ ప్రసంగంలో అంటాడు., సమయాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని క్రీస్తు ని కొలబద్ధ గా తీసుకోవడం ఓ పొరపాటు. బుద్ధ పూర్వం, బుద్ధ శకం అని ఉండాలి. అది నిజమే.

మన భారత దేశ (ఒక్క భారత దేశమే కాక, ఓ రకంగా, మొత్తం ప్రపంచానికే)పునరుజ్జీవనం బుద్ధుని తో మొదలయ్యింది అతిశయోక్తి అవబోదు. మన మొదటి లిపి పాళీ. (సంస్కృతం కేవలం వాఙ్ఞ్మయం మాత్రమే అప్పటికి). విగ్రహారాధన, లళిత కళలు, విశ్వవిద్యాలయాలు (తక్షశిల, నలందా) విదేశీ యానాలు, నాటికలు (కాళిదాసు కన్నా ముందే సంస్కృత నాటిక ఉన్నదట.అది అశ్వఘోషుని సారిపుత్ర ప్రకరణం అని ప్రాఙ్ఞుల ఉవాచ) ఇవన్నీ బుద్ధుడితో ఆరంభమయినవే. కేవలం సాంస్కృతికంగా మాత్రమే కాక సామాజిక పరంగా చూచినా మొదటి ప్రజా స్వామ్యం (లిచ్చపీ గణతంత్రం), మొదటి వర్గ రహిత సమాజం (బుద్ధుని సంఘారామాలు), ఇలా సర్వతోముఖాభి వృద్ధికి సోపానం బుద్ధుని తో సాధ్యమయింది. కాలక్రమేణా బౌద్ధం లో ఇబ్బడి ముబ్బడిగా శాఖలు బయలుదేరి, క్షీణించడం జరిగింది.

ఇంకో విషయం. పాశ్చాత్య దేశాలలో పునరుజ్జీవనం యుద్ధం ద్వారా మాత్రమే సాధ్యమయింది. కొరియా, జపాను, జర్మనీ దేశాల అభివృద్ధి యుద్ధం తర్వాత జరిగింది.

భారత దేశంలో ఓ వ్యక్తి ద్వారా జరగడం అపూర్వం.

ఈయన జీవిత చరిత్ర అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ ప్రస్తావించబోవట్లేదు. ఈయన తను చనిపోయే ముందు చెప్పిన ఆఖరు వాక్యం ఇది " ఆత్మ దీపో భవ! "

జిడ్డు కృష్ణమూర్తి (మే 11) :పైన ఉదహరించిన "ఆత్మ దీపో భవ! " అనే వాక్యానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణాజీ జీవితం. మనం బుద్ధుడి గురించి కథలు మాత్రమే చదువుకున్నాం. బుద్ధుడు ఇప్పుడు 21 వ శతాబ్దంలో పుట్టి వుంటే ? ఈ పృశ్న కు సమాధానం జిడ్డు కృష్ణమూర్తి.

బుద్ధుడు దుఃఖిత మానవాళి సముద్ధ్రణకై సర్వం వీడి అర్హతుడై, తథాగతుడై సత్యాన్ని బోధించాడు.
1895 లో జన్మించిన కృష్ణమూర్తి చిన్నతనం లోనే అమ్మను కోల్పోయి, అనీబిసెంట్ ద్వారా దత్తు తీసుకోబడి, తన దేశాన్ని, తండ్రి ని, భాషను, ఆఖరు తన ప్రాణం తో సమానైన తమ్ముని కోల్పోయి, విశ్వ గురువు పాత్రలో నటించి, అన్ని వదిలి సత్య పథంలో నిత్య యాత్రికుడై, కృష్ణాజీ గా మిగిలి ఎందరికో మార్గదర్శకుడయ్యాడు.


ఈయన ప్రవచనాలు గహనం, గంభీరం కావడంతో అర్థమయీ అర్థమవకుండా ... అలా మనల్ను తదాత్మ్యత కు లోను చేస్తాయి.

కృష్ణాజీ గురించి చెప్పవలసి వస్తే, ముఖ్యంగా చెప్పాల్సింది ఆయన స్థాపించిన పాఠశాల గురించి. విద్యను పరీక్షల చట్రం లో బంధించి విద్యార్థుల జీవితం ఉద్యోగం సంపాదించడానికే అన్న ఇప్పటి విద్యా విధానాన్ని ఈయన నిరసించాడు.

ఇక ఈయన ప్రవచనాల గురించి, ఈయన చెప్పదలుచుకున్న వాటి గురించి ఈయన పుస్తకాల ద్వారానే తెలుసుకుంటేనే బావుంటుంది.

త్యాగరాజ స్వామి (మే 3):ఆచార్య తిరుమల రామచంద్ర గారు తమ తమ సాహితీ సుగతుని స్వగతం అనే రచనలో త్యాగరాజు గురించి చెబుతూ, త్యాగరాజ స్వామి కీర్తనలు సంగీత పరంగానే కాక సాహిత్య పరంగానూ అమూల్యమైనవి అని విశ్వసిస్తాను. అన్నారు. అందుకు ఉదాహరణ చెబుతూ,

"రాగ సుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా! " అనే కీర్తన 3 భ గణాలతో మొదలై పల్లకీ లో అలా అలా ఊరేగుతున్నట్టు ఉంటుంది అంటారు. ఈ కీర్తన ఆందోళిక రాగమట. ఆందోళిక అంటే, పల్లకీ అని అర్థంట.

త్యాగరాజ స్వామి సంగీత సేవ గురించి విఙ్ఞులయిన బ్లాగర్లకు తెలిసిన విషయమే. ఈ ఋషి కి నీరాజనాలు.


సత్యజిత్ రే (మే 2):సత్యజిత్ రే నాకు మొదట కథకుడిగానే పరిచయం. ఈయన కథా సంపుటి ఆగంతకుడు, ఇండిగో వగైరా కథలు, మొదట బెంగాల్ లో తను నడిపే సందేశ్ అనే పత్రికలో ప్రచురింపబడ్డాయిట. 'సందేశ్ ' అనేది ఓ బెంగాలి స్వీటట. ఆ స్వీటు ఎలా వుంటుందో ఎమో కానీ ఈ కథలు మాత్రం వాటికంటే ఇంకా రుచి గా ఉంటాయి.

ఈ ఆగంతుక్ లో ఓ కథను అదే పేరుతో అలానే సినిమా తీసాడీయన. మానవ సంబంధాల గురించి ఓ హృద్యమైన కావ్యం ఆ సినిమా.


ఇంకో విషయం ఎక్కడొ చదివినది. స్పీల్ బర్గ్ ఈ.టీ సినిమాలో అంతరిక్ష జీవి రూప కల్పన చేసినది మన సత్యజిత్ రే అట.

సత్యజిత్ రే గురించి నేనింకా తెలుసుకోవాలి.

ఇంకా ఈ నెలలో ఉమర్ ఖయ్యాం లాంటి ఎందరో కళాకారులు, మహానుభావులు. అందరికీ నీరాజనాలు.

(ఈ టపాలో తప్పులుంటే తెలుపండి. సరిదిద్దుకోగలను. - రవి )

Tuesday, May 6, 2008

తుమికి కేబల్ చభి! శోధ్ పాతే లేఖా ?

చిట్టి తల్లీ! ఆర్తిగా నన్ను చుట్టే నీ చేతుల్లా,
నా పాట సంగీతమై నిన్ను కమ్ముకోనీ!

ఈ నా పాట నీ నుదుట ముద్దుగా నిన్ను దీవించనీ!

ఏకాంతంలో నీతో ఊసులాడనీ!
జనారణ్యం లో కవచంలా నిన్ను కాపాడనీ!

నీ కలలకు రెక్కలు తొడగనీ!
నీ హృదయాన్ని దిగంతాలకు చేర్చనీ!
నిశీధి లో విశ్వాసపాత్రమైన తారలా నీకు మార్గం చూపనీ!
నా పాట నీ కనుపాపై నీ హృదయానికి దారి చూపనీ!


నా మాట మరణంతో మూగవోయినప్పుడు నా పాట నీ హృదయంలో అమృతాలను నింపనీ!

(విశ్వకవి రవీంద్ర నాథ్ టాగూర్ - నెలవంక లో ఓ కవిత కు నేను రాసుకున్న అనువాదం)

***********************************************************************************

సెప్టెంబర్ - 2007,
సియోల్ నగరం,
దక్షిణ కొరియా,
తెల్లవారు ఝాము 8 : 30 గంటలు.

నేనిక్కడకు ఆఫీసు పని రీత్యా వచ్చి 2 రోజులవుతోంది. వచ్చిన రోజు నుండీ గమనించిన సంగతి ఒకటుంది. బయట మార్కెట్ లోనూ, మరెక్కడా కూడానూ, భారతదేశానికి సంబంధించిన ఒక్క వస్తువు కనబడ్డం లేదు. ఇతర (నేను చూసిన) దేశాల్లో యే బజాజ్ ఆటో లో, టాటా వారి వాహనాలో, లేదూ, కనీసం బాటా చెప్పుల దుకాణమో కనబడేది.

ఆకలిగా ఉండడంతో సూపర్ మార్కెట్ లో కేక్ లాంటిదేమైనా దొరుకుతుందేమో వెతుకుతున్నాను. సీల్ చేసిన డ్రింక్స్ (మన ఫ్రూటి లాంటివి) కనబడ్డాయి. వాటి మధ్యలో ఓ లస్సి పాక్ కనబడింది. ఆ పాక్ మీద రవీంద్ర నాథ్ ఠాగూర్ (పై)కవిత ఆంగ్లంలో. అప్పుడు నాకు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

************************************************************

రవీంద్ర కవీంద్రుడు తన కవితలతో ఓ అద్భుతమైన మార్మిక జగత్తు ని సృష్టించాడు అనడం అతిశయోక్తి కాబోదు. కేవలం కవితలకే ఈ విషయం పరిమితం కాదు. ఈయన కథల్లోనూ (పోస్ట్ మాస్టర్, కాబులి వాలా, సుభా, హంగ్రీ స్టోన్స్ వగైరా) ఓ అనిర్వచనీయమైన ఆర్ద్రత తో కూడిన సౌందర్యం కనబడుతుంది.

ఇంకో గొప్ప విషయం, ఈయన రచనల్లో కనబడేది, జీవితం పై అనురక్తి. ఈయన జీవితం పై వైరాగ్యం తో సన్యసించడాన్ని నిరసించాడు. ఈయన ఒక్కోసారి నెలల తరబడి మౌనం గా గడిపే వాడట. అలాంటి ఒకానొక తరుణం లోనే పద్మా నది లో పడవపై విహరిస్తూ రాసిన కథ పోస్ట్ మాస్టర్ (అట).

ఈ మహానుభావుని రచనా వ్యాసంగాల గురించి ప్రస్తావించడం సూర్యుని ముందు కొవ్వొత్తి వెలిగించడమే. అయినా ఓ చిన్న ప్రయత్నం. .
నాకు నచ్చిన 4 కవితా సంపుటాలు.

1. నెలవంక.(Crescent Moon) ఈ కవితా సంపుటి చిన్నపిల్లలపైన, వాళ్ళ చిన్నారి ఊహా లోకం లోనూ విహరింపజేస్తుంది మనల్ను. వర్షం వెలిసిన తర్వాత ఓ చిన్న చెట్టు కింద నిలబడి చెట్టుని అలా కుదిపితే ఎలా వుంటుందో, అలాంటి భావన కలుగుతుంది ఈ కవితలు చదివేప్పుడు.

2. తోటమాలి. (Gardener)ఇందులో మొదటి కవితే అద్భుతంగా ఆరంభమవుతుంది. గుప్పెడు మల్లెపూలతో మనసుని కొట్టినట్టు అనిపిస్తుంది. మిగిలిన (వచన) కవితలు కూడా అలానే వుంటాయి.


విషాదానికి దారితీసినా ప్రేమను విశ్వసించు.హృదయపు ద్వారాలను ఎన్నటికీ మూయకు.
నేస్తం, నీ పదాల ముసుగు వెనుక భావం నిగూఢం, నేను అర్థం చేసుకోలేకపోతున్నా.
ప్రియతమా, ఓ మధుర గీతానికి కన్నీటి చుక్కను జోడించి, హృదయం ద్వారా సమర్పించు.
నేస్తం, నీ పదాల ముసుగు వెనుక భావం నిగూఢం, నేను అర్థం చేసుకోలేకపోతున్నా.
సుఖం, నీహారికలా క్షణికం. నవ్వుతూనే దాని మరణం. విషాదం శాశ్వతం, బలోపేతం. విషాదభరితమైన ప్రేమను, నీ నయనాలలో మేల్కొలుపు.
నేస్తం, నీ పదాల ముసుగు వెనుక భావం నిగూఢం, నేను అర్థం చేసుకోలేకపోతున్నా.
ఉషొదయానికి కమలం తనను తాను లోకానికి సమర్పించుకుంటూ, వికసిస్తుంది. మంచు ముసుగు అనే శాశ్వతత్వం వెనుక విత్తులో దాగి ఉండదు.
నేస్తం, నీ పదాల ముసుగు వెనుక భావం నిగూఢం, నేను అర్థం చేసుకోలేకపోతున్నా.

(తోటమాలి - 27, మళ్ళీ నేను రాసుకున్న అనువాదమే)

3. స్వేచ్చా విహంగాలు. (stray birds) ఈ కవితల్లో ఒక్కొక్కటి ఒక్కో వాక్యం లో అందంగా ఇమిడిపోతుంది. వీటిని ఒక్కసారి కాదు, తరుచూ చదువుకుంటూ, ఆనందించవచ్చు.

4. గీతాంజలి. ఇది రవీంద్ర కవీంద్రుని కవితలలో తలమానికం. మార్మికత తారాస్థాయిలో కనబడుతుంది ఇందులో. ఇంకో అద్భుతమిన విషయం, మృత్యువుని ఆహ్వానిస్తూ, మృత్యువుని ఓ అతిథిలా ఆదరిస్తూ వర్ణించడం. మృత్యువు గురించి ఇంత అందంగా వర్ణించిన వారు ఇంకొకరున్నారు. ఆయన మన తెలుగు వాడు, నిత్య సత్యాన్వేషి జిడ్డు కృష్ణమూర్తి.

మృత్యువు నీ తలుపు తట్టిన రోజు యే బహుమతినిస్తావు ?
ఓ ! నా అతిథి కి నా పూర్ణ జీవిత కలశాన్ని సమర్పిస్తాను.రిక్త హస్తాలతో తిరిగి పంపను.

నా శరత్కాలపు దినాల, గ్రీష్మ రాత్రుల మధురాసవాన్ని, తీరికలేని జీవితంలో నేను పోగు చేసుకున్న సంపదను, నా అంతిమ దినాలలో తలుపు తట్టిన ప్రభువు కు సమర్పిస్తాను.

రవీంద్రుడు ఒక వేళ కవితలు రాయకపోయినా, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఆయన కథలు చాలునట. ఇది ఆయన అభిమానుల, ఆరాధకుల, విమర్శకుల మాట.

ఈ కథల్లో 'కాబులి వాలా, పోస్ట్ మాస్టర్ ఇలాంటివి 'దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. ఇవే కాకా ఈ కవి నాటికలు, వ్యాసాలు పుంఖానుపుంఖాలు. విశ్వకవి గురించి ఓ రకంగా చెప్పాలంటే, అదీ ఆయన మాటల్లోనే...

" తుమికి కేబల్ చభి! శోధ్ పాతే లేఖా ? "

" నీవు కేవలం చిత్తరువేనా ? పోగొట్టుకున్న లేఖవా ? "


(మే 7 వతేదీ విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ 147వ జయంతి సందర్భంగా ఓ చిన్ని నివాళి. )