Wednesday, June 13, 2012

చివరికి మోహన్ బాబే గెలిచాడు!


పాడుతా తీయగా చల్లగా కార్యక్రమం అంటే ఒకప్పుడు ఎంతో ఆసక్తి నాకు. చాలా రోజుల తర్వాత ఈ మధ్య మళ్ళీ చూడ్డం తటస్థించింది.

ఇదివరకు బాలు పిల్లకాయల మీద కాస్త అతిగా కామెంటేవాడనుకుంటా. ఈ మధ్య కాస్త తగ్గించాడు. సరే బావుంది లెమ్మని తర్వాత ఎపిసోడ్లు చూడ్డం కొనసాగించాను. క్వార్టర్ ఫైనల్, సెమి ఫైనల్ లలో నేను చూసిన ఎపిసోడ్ లలో బాలు తో బాటు మరో ఇద్దరు ప్రముఖులు వచ్చారు. ఒకాయన తి.తి,దే ఆస్థాన విద్వాంసులు, మరొకరు ద్వారం వెంకటస్వామినాయుడు గారి మనవరాలు, మరొకామె మల్లీశ్వరి సినిమాలో ఒక నటి, సింగర్, ఇదివరకు ఇదే కార్యక్రమంలో విజేత. చాలా చక్కటి జడ్జెస్ వచ్చారు కదా అని అనుకున్నాను. ఇక ఫైనల్స్!

********************************************************************************

ఫైనల్స్ లో - బాలు ఆనాటి గెస్ట్ గురించి చెప్పాడు. నా హృదయం ఏదో కీడును శంకించింది. ఎడమ కన్ను తనపని తను చేసుకుపోయింది. ఆ నేపథ్యంలో స్టేజ్ మీదకు ఒకనాటి ఎమ్జీయార్ టోపీ ధరించి ఒక ’సెలెబ్రిటీ’ ...కాదు కాదు..లెజెండ్ అడుగుపెట్టాడు. బాలు గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఆ టెన్షన్ తన మాటల్లో ప్రతిఫలించింది. "ఈ నాటి మన గెస్టు కళాప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారు. మోహన్ బాబుకు నాకు 1975 నుండీ పరిచయం. తను సినిమారంగానికి వచ్చిన మొదటి రోజు నుండి నాకు తెలుసు. ఈ రోజు వారి పక్కన కూర్చుని నా బాధ్యత నిర్వర్తించడం ఎలానో తెలియట్లేదు! ఇదొక విషమ పరీక్ష నాకు. అతణ్ణి వేదిక మీదకు సగౌరవంగా తనను ఆహ్వానిస్తున్నాను." (చివరి మాట అంటున్నప్పుడు బాలు గొంతు దుఃఖంతో పూడుకు పోయింది)

మోహన్ బాబు గారు వచ్చారు. బాలును గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత తన సీటు దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

అభ్యర్థులకు కూడా ఫైనల్స్ లో మంచి పాటలు, మంచి సంగీతం కన్నా కూడా మోహన్ బాబును ఎలా మెప్పించాలన్న ధ్యాస మొదలైన క్షణమది.

మొదటి అభ్యర్థి వేదిక మీదకు పిలువబడ్డాడు. అతను ఎంచుకున్న పాట - "పుణ్యభూమి నా దేశం నమోనమామి". చాలా గంభీరంగా, పాడాడు, పాట మధ్యలో వచ్చే "ఒరే తెల్లకుక్కా, ఎందుకు కట్టాలిరా శిస్తు..." వంటివి ఎంతో గంభీరంగా మాట్లాడాడు, చివరకు ముగించాడు.

అవతల మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయాడు. తను సినిమా రంగంలో కూడు లేక పడుకున్న రాత్రుల దగ్గర్నుంచి ఈ పాట వరకూ తన జీవిత చరిత్రను లక్షలాది ప్రజలకు వినిపించాడు. అతని మనసులో ఇంత చేసినా తను లెజెండ్ కాకుండా సెలబ్రిటీ గా మిగిలిపోయాడన్న బాధ సుళ్ళు తిరుగుతూ ఉండాలి! ఆ పాటను బాలు తప్ప మరెవరూ అంత బాగా పాడలేరన్నాడు. ఇవతల అభ్యర్థి అయిన పిల్లవాడి ముఖంలో అయోమయం, బాధ! అతను కనీసం సెలబ్రిటీ అయినా అయాడు, నా పాట గురించి కనీసం ఒకమాట మాట్లాడలేదే అని ఆ అబ్బాయి పాపం పరితపించాడు. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణాన్ని చల్లబరిచే కొండంత బాధ్యతను బాలు తన భుజాలపై మోశాడు. కాసేపు మోహన్ బాబును ఇమిటేట్ చేశాడు.  తమ అనుబంధం, మిత్రత్వం గురించి చెప్పాడు. అతడి గొంతును అనుకరించి జనాలను ఆహ్లాదపరిచాడు. మోహన్ బాబు తనకు వంద రూపాయలు బాకీ అని చెప్పాడు. మండుతున్న మోహన్ బాబు గుండెలో పన్నీరు చల్లాడు. చివరకు అతణ్ణి ఎలాగో జనజీవనస్రవంతిలోకి ఈడ్చుకుని వచ్చాడు.

ప్రోగ్రాములో కమర్షియల్ బ్రేక్ వచ్చింది. దాదాపు ముప్ఫై వాణిజ్య ప్రకటనల తర్వాత తిరిగి ప్రోగ్రాం మొదలయ్యింది. "ముద్దబంతి పువ్వులో మూగ బాసలు.." ఈ పాట పాడాడు అభ్యర్థి. పాట ముగిసింది. మోహన్ బాబు మరో సారి తన పురాణం వినిపించాడు. ఈ పాట వెనుక కృషి, తన నిద్రలేని రాత్రులు, రె. కాఘవేంద్రరావు తనను మెచ్చుకోవడం, తను అప్పుల్లో మునిగి ఉండడం వంటివి శ్రోతలు అందరికి స్ఫూర్తిదాయకమైన రీతిలో చెప్పాడు. అభ్యర్థికి సలహా ఇస్తూ, "నవ్వుతూ పాడాల"న్నాడు.

"ఏదీ నవ్వుతూ ఓ ముక్క పాడు చూద్దాం!" అన్నాడు. ఆ అభ్యర్థి పాపం - నవ్వలేక ఏడుస్తూ పాడాడు. నవ్వితే పాటెలా వస్తుంది? నవ్వడమైనా ఉండాలి, లేదా పాడ్డమైన ఉండాలి. రెండూ కలిపితే పులుసులోకి ఆముదపునూనెతో తిరగమోత పెట్టినట్టుంది. అయినా సరే అభ్యర్థి గుండె చిక్కబట్టుకుని తన పని నిర్వహించాడు.

మళ్ళీ కమర్షియల్ బ్రేకు!

ఆ తర్వాత మూడో అభ్యర్థిని ఏదో పాట పాడింది. మోహన్ బాబు తిరిగి విజృంభించాడు. బాలు తనకన్నా పెద్దవాడెలాగన్నాడు? తన తండ్రి వయసు 94 యేళ్ళు అన్న విశేషాలు, తను ఎప్పుడు చిత్రరంగంలో అడుగుపెట్టాడు అన్న విషయమూ చెప్పాడు. మధ్యలో బాలు అతణ్ణి చల్లబరచాలని, తను మోహన్ బాబుకన్నా తక్కువ వయసు వాడన్నాడు. మోహన్ బాబుకు కోపం + అనుమానం వచ్చాయి. కొంపదీసి బాలు తనని లెజెండ్ కాదని శంకిస్తున్నాడా? బాలు మీద అనుమానంతో ఆ అమ్మాయిని ఓ  ప్రశ్న అడిగాడు.

"అమ్మాయ్, నువ్వు చెప్పు! నేను నా సినిమాలో ఛాన్సిస్తా! బాలు పెద్దవాడా? నేనా?" ఆ అమ్మాయి జడ్జులిద్దరిలో ఎవరిని అంటే ఏమౌతుందోనని భయపడింది. ఏం చెప్పాలో తెలియలేదంది. అదే ఆ పాప పాలిట శాపమౌతుందని ఆ క్షణాన ఆ అమ్మాయికి తెలీదు!

చివర్న - చివరి అభ్యర్థి - పాటపాడింది. ఈ సారి మోహన్ బాబు కు బాలు ఏం చెప్పాడో తెలీదు. కాస్త తొందరగానే వదిలాడు.

********************************************************************************

ఒక రోజులో ముగించాల్సిన పని మరోవారానికి వాయిదా పడింది. మరో ఎపిసోడు మొదలయ్యింది.

********************************************************************************

ఈ సారి మొదటి అభ్యర్థి - మోహన్ బాబును గాలికి వదిలేశాడు. అతణ్ణి ఇంప్రెస్ చేయడానికి కాకుండా నిజంగానే గొప్పపాట అయిన "శివశంకరీ, శివానంద లహరి" ని చక్కగా పాడాడు. మోహన్ బాబు గుండెలో కోటి వీణలు మోగాయి. అన్న పాట పాడినందుకు ఆ అభ్యర్థిని అభినందించాడు. బాలు మాత్రం ఈ సారి ఆ అబ్బాయి పాటలో కాసిన్ని తప్పులేరాడు. బాలు బాధ ఏమంటే - తను మాట్లాడకపోతే మోహన్ బాబుకు శ్రోతగా మారే ప్రమాదం ఉంది. అంచేత ఈ సారి స్ట్రాటెజికల్ గా ప్లాను వేసి తనే లీడ్ తీసుకున్నాడు. బాలు ప్రయత్నం వృథా పోలేదు. మోహన్ బాబును తన జీవిత చరిత్ర ఒక ఎపిసోడు పాటు చెప్పకుండా నిరోధించడంలో అతను 70 శాతం కృతకృత్యుడయ్యాడనే చెప్పాలి.

రెండవ అభ్యర్థి. ’రసిక రాజ తగువారము కామా’ పాట పాడాడు. అద్భుతంగా పాడాడనే చెప్పాలి. కానీ రసికులెవరక్కడ! పిల్లవాడికి కూడా పాడడానికి ’లెజెండ్ రాజ తగువారము కామా’ అనే పాటలేదుగా మరి! అయినా పాటెవడిక్కావాలి? ఎప్పుడు పాట ముగుస్తుందా, తన జీవిత చరిత్ర మొదలెడదామా అని మోహన్ బాబు! అతణ్ణెలా కంట్రోలు చెయ్యాలా అని బాలు! ఎలాగో పాట ముగిసింది. అయితే ఎలాగో మోహన్ బాబు తన శక్తి మొత్తం కూడగట్టుకుని తన జీవిత చరిత్ర చెప్పకుండా ఆవేశాన్ని అణచుకున్నాడు.

మూడవ అభ్యర్థిని - పాపం ముందు ఎపిసోడ్ లో మోహన్ బాబు అడిగిన ధర్మసందేహం దెబ్బకు ఆమె ఇంకా కోలుకోలేదు. అంచేత చిన్న పొఱబాటు చేసింది. (అందుకు తగిన మూల్యమూ ఆ అమ్మాయి చెల్లించింది) జానకి పాడిన "నీలీల పాడెద దేవా" మొదలెట్టింది. (ఆ ’లీల’ ఎవరిదో దేవుడికే తెలియాలి). ఆ పాట మధ్యలో వచ్చే సంగీతం బిట్లు కాస్త తప్పుగా పాడింది. పాట ముగిసింది. అంతే! మోహన్ బాబుకు బాల్యం గుర్తొచ్చింది. తను వాళ్ళ గురువు గారు చెప్పిన సంస్కృత శ్లోకాన్ని ఎలా భట్టీ పట్టారో చెప్పాడు. అటుపై తన తండ్రికున్న మూడెకరాల పొలం, కష్టాలు, తనకు పెళ్ళి లేటవడం ...వగైరా విషయాలు చెప్పాడు. చివర్న పాట పాడిన అమ్మాయి ’ఏదో’ పొఱబాటు చేసినట్టు తన లెజెండ్రీ బుద్ధికి తోస్తున్నట్టు నొక్కి వక్కాణించాడు.

బాలు ఆ మిగిలిన దాన్ని పూరించాడు. ( ఈ సారి బాలు మోహన్ బాబును ఒక ఎపిసోడ్ అనుభవంతో బాగా ఎదుర్కున్నాడు. మోహన్ బాబుతో తన మిత్రత్వం గురించి చెప్పాడు) ఆ అమ్మాయి తప్పు చూపించాడు.

చివరి అమ్మాయి - అప్పటికే ఈ పోరాటంలో బాలు, మోహన్ బాబులు అలసి పోయారు. ఆ అమ్మాయి పాలిట అది వరమయ్యింది. స్వతహాగానే అందమైన గొంతున్న అమ్మాయి చక్కగా పాడింది. ఆ అమ్మాయి పాట ముగిసింది.

ప్రథమ బహుమతి ఆ చివరి అమ్మాయికే వచ్చింది. ఆ అమ్మాయి సంతోషించింది. ప్రోగ్రామును (బాబును) ఎలానో వదల్చుకున్నందుకు బాలు ఆనందపడ్డాడు.

*********************************************************

ఈ కార్యక్రమంలో నిజమైన విజేత ఎవరు???? ఇది తెలిసీ చెప్పకపోతే అతడికి మోహన్ బాబు జీవిత చరిత్ర కాసెట్ వందసార్లు చూసే అవకాశం వస్తుంది.

అవును మీరు కరెక్టే. తనే విజేత. ఇది మోహన్ బాబు లెజెండ్ అన్నంత పచ్చి నిజం.