Showing posts with label పద్యం. Show all posts
Showing posts with label పద్యం. Show all posts

Tuesday, October 26, 2010

జయజయ....

ఆదిత్య 369 గుర్తుందా? సకుటుంబ సమేతంగా చూడగలిగిన కొన్నేకొన్ని బాలకృష్ణ సినిమాలలో అది ముఖ్యమైనదని మా ఇంట్లో పెద్దలు నొక్కకుండనే వక్కాణించేవాళ్ళు. ఆ సినిమాలో ఒకానొక దృశ్యంలో కృష్ణదేవరాయలు విష్ణువు మీద ఓ పద్యం చదువుతాడు (పాడతాడు), తనదేవేరితో కలిసి దేవాలయంలో కులదైవాన్ని పూజిస్తున్న సందర్భంలో. ఆ పద్యం ఇక్కడ చూసి రండి. తర్వాత మాట్లాడుకుందాం.

ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడు నాకీ పద్యం తెగనచ్చేసింది. పాడుకోడానికి పాటలా ఉంది, స్తోత్రంలానూ ఉంది. అలాగని కఠినంగా లేక, చాలా లయాత్మకంగా ఉంది. ఇదేం పద్యమబ్బా అని చాలాసార్లు అనుకున్నాను. ఈ పద్యం రాయల వారు పాడారు కాబట్టి, ఆముక్తమాల్యద లోనిదని ఇన్నాళ్ళూ అనుకుంటూ వస్తున్నాను . ఆముక్త మాల్యద లో చాలా పద్యాలు వ్యాఖ్యానం ద్వారా విన్నప్పటికీ, చదివినప్పటికీ ఈ పద్యం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదా అనిపించేది. తెలుగుపద్యం - కామేశ్వరరావు గారిని ఈ పద్యం గురించి చాలాసార్లు అడగాలనుకుని మర్చిపోయాను.

- ఈ పద్యం అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలోనిది. నాకు ఈ మధ్యనే పాతపుస్తకాల దుకాణంలో వావిళ్ళ వారి మనుచరిత్రము, రాఘవపాండవీయము దొరికాయి. ఈ రోజు మనుచరిత్రం సౌరభాన్ని ఆస్వాదించాలని, (ఆఘ్రాణించాలని కూడా) మనసుపుట్టి ఓ పేజీ తెరవగానే చప్పున ఈ పద్యం కనిపించింది. 

ఆరవ ఆశ్వాసంలో, స్వారోచిషునికి హరి ప్రత్యక్షమయితే ఆయనను స్వారోచిషుడీ విధంగా పొగడుతాడు.

జయజయ దానవదారణకారణశార్ఞ్గరథాంగగధాసిధరా
జయజయ చంద్రదినేంద్రశతాయుతసాంద్రశరీరమహఃప్రసరా
జయజయ తామరసోదరసోదరచారుపదోజ్ఝితగాంగఝరా
జయజయ కేశవకేశినిషూదన శౌరి హరీ దురితాపహరా

అర్థం :
దానవ = అసురుల
దారణకారణ = భేదమునకు హేతువులైన
శార్ఞ్గ, రథాంగ, గదా, అసి, ధరా = విల్లు, చక్రము, గద, ఖడ్గము తాల్చినవాడా
జయజయ
చంద్ర దినేంద్ర శతాయుత, సాంద్ర శరీరమహః ప్రసరా = చందురుల, ఆదిత్యుల, పదిలక్షలయొక్క విస్తారమైన శరీరకాంతినిపోలిన శరీరకాంతి కల్గినవాడా
జయజయ
తామరసోదర = పద్మాంతర్భాగమైన కెంపుకు
సోదర = సమానమైన
చారు = మనోహరమైన
పద ఉజ్ఝిత = పాదములనుండి వదలబడిన
గాంగఝరా = గంగానదీప్రవాహము కలిగినవాడా
జయజయ
కేశవ = మంచికేశములు కలిగినవాడు/బ్రహ్మరుద్రులకు పుట్టుక అయినవాడు అని రెండర్థాలుట (శోభానాః కేశాః యస్య సః, కశ్చ, ఈశశ్చ కేశౌ, తావస్మిన్ స్తః ఇతి కేశవః)
కేశినిషూదన = కేశి అనే రాక్షసుని చంపిన
శౌరి = శూరవంశోద్భవుడా
హరీ = హరీ
దురితాపహరా = వృజినములణఁచి వేయువాడా
జయజయ.

ఈ పద్యంలో మరో చక్కటి విశేషముంది. ఇది "కవిరాజవిరాజితము" అన్న ఛందస్సు. ఈ ఛందస్సులో ప్రత్యేకత మొదట నగణం తో మొదలై, ఆ తర్వాత 6 జ గణాలు ( లఘువు, గురువు, లఘువు), చివర్లో వ గణం తాలూకు దీర్ఘం తో ముగుస్తుంది. ఇదో అద్భుత లయ. ఎంత చక్కనిదంటే - మా చిన్నారి మొన్నామధ్య - విశ్వనాథ్ సినిమా, సప్తపది లో ఇదే ఛందస్సులో ఓ పాటని చూస్తూ (వింటూ), పాట ముగిసిన తర్వాత ఆ పాట తాలూకు మకుటాన్ని వచ్చీరాకుండా పాడుకుంది. ఆ పాట/స్తోత్రం ఊహించారా?

అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే
సురవర వంద్య విరోధిని వాహిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హేసితి కంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

(ఇప్పుడు "తమ్మి" (సంహిత) కు పై శ్లోకం చివరిపాదం వచ్చేసింది. ) ఈ ఛందస్సు కాస్త అరుదైనది అనుకుంటున్నాను. ఈ ఛందస్సులో ఏ కవులు వ్రాశారో తెలియకుండా ఉంది. మనుచరిత్రలో మాత్రం రెండు సందర్భాలలో ఈ ఛందస్సు ఉపయోగించాడు కవి.

ఈ రోజు నిదురకు ముందు చక్కటి అనుభూతి. తెలుగు సాహిత్యంలో నాకు చాలా ఇష్టమైన కవి అల్లసాని పెద్దన. (అనేక విధాలుగా ;-)) ఆయన పద్యమే నేను చాలాకాలంగా వెతుకుతున్నదని తెలియటమూ, నాకు నచ్చిన ఛందస్సులో ఉందని తెలియటమూ (ఈ పద్యం ఈ ఛందస్సులోనిదని ఊహించలేదు. పుస్తకం చూసిన తర్వాతే తెలిసింది) ....చాలా బావుంది.

ఈ ఛందస్సు గురించి, ఇతరకవుల ప్రయోగాలను ఎవరైనా తెలిపితే చాలా బావుంటుంది.

Monday, October 4, 2010

పద్యరచన for dummies

ఈ టపా వ్రాయడానికి నాకున్న అర్హత - అనేకమంది ప్రోత్సాహం, ప్రోద్బలం వల్ల నేర్చుకున్న కాసిన్ని ముక్కలు, నా దిక్కుమాలిన ప్రయోగాలున్నూ. నేను ఏ విధమైన కవిని, పండితుణ్ణీ కానని నాకు తెలుసు. మీకు ఇదివరకే పద్యాలు వ్రాసిన అనుభవం ఉంటే ఈ టపాలో సొల్లును పట్టించుకోకండి. ఇక విషయంలోకి.

దాదాపు ఒకటిన్నర యేళ్ళ క్రితం. ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకులు చింతా రామకృష్ణారావు గారోమాట అన్నారు. "వచనం వ్రాయడం కన్నా, పద్యం వ్రాయడం సుళువు. బస్సు నడపడం కన్నా రైలు నడపడం సులువు. నియమాలను పాటిస్తూ వెళితే మిగిలిన సంగతి పద్యమే చూసుకుంటుంది అని. అప్పుడాయన మాట నమ్మశక్యం కాలేదు. అయితే ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది.

పద్యరచనలో మెళకువలు, నియమాలు నేర్పడానికి జాలంలో శంకరయ్య గారు, రామకృష్ణారావు గారు, ఆచార్య ఫణీంద్ర గారు, కామేశ్వర రావు గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు వంటి వారు ఇదివరకే ఉన్నారు. కొన్ని చక్కటి వ్యాసాలు అందం బ్లాగులో రాకేశ్వరరావుగారు వ్రాశారు. ఉపజాతి పద్యాల గురించి పొద్దులో రాఘవగారు చక్కగా వివరించారు. వీటికి తోడు నా అనుభవాలు ఎవరికైనా ఉపయోగపడవచ్చునని ఈ టపా వ్రాస్తున్నాను. ఇందులో కాస్త స్వోత్కర్ష ధ్వనించవచ్చు. అలాగే ఈ చెప్పబోయే విషయాలు సూచనల్లా ధ్వనించినా, నిజానికి అవి నేను అనుకరించిన పద్ధతులు.

మొదట కావలసిన దినుసులు 3.

౧. వ్రాయాలన్న తపన
౨. నియమాలు తెలుసుకోవడం
౩. మంచి గురువు/సలహాలు చెప్పగల వారిని ఎన్నుకోవడం.

రెండవ విషయం - జాలంలో దొరుకుతుంది. అయితే విషయం మీకర్థం అవడం కోసం ఓ పుస్తకంలో మీకు అర్థమయే విధంగా వ్రాసుకోండి. ఈ నియమాలను చూసి భయపడవద్దు, చికాకు పడవద్దు. తప్పులు చేయడానికి జంకవద్దు. ఇంకా వీలయితే మొదట ఓ మాట అనుకుని, దానిని ఛందోబద్ధం చేయడానికి ప్రయత్నించండి.

ఉదా: కాకిపిల్ల కాకికి ముద్దు.

ఇది ఆటవెలదికి దగ్గరగా ఉంది. ఓ గణం (మూడవ గణం), చివరి గణంలో ఓ అక్షరం మాత్రమే లోపం. ఆ మార్పు కాస్తా చేసేద్దాం.

కాకిపిల్ల తల్లికాకికి ముద్దొకొ!

అంతే - ఓ పాదం తయారు!

అత్త లేని కోడలుత్తమురాలు! ఈ వాక్యాన్ని ఒకే ఒక్క చిన్న మార్పుతో ఆటవెలది పాదంగా మార్చవచ్చు. మీకు తెలుసా?

మీకు వ్రాయాలన్న ’తపన’ ఉంటే అదే మీచేత వ్రాయిస్తుంది. నిజం. కానీ మనకు ఈ నియమాలు అవీ చూస్తే చికాకు. ఈ చికాకు, పరాకు పోవాలంటే మీకు ఇష్టమైన విషయంలో మంచి పద్యాలు, వీలయితే చిన్నచిన్న పద్యాలు, తేటగీతి, ఆటవెలది, కందం వీటిలో వ్రాసినవి చదవండి. ఉదాహరణకు - ఓ చక్కని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందం ఎలా ఉందంటే -

నువ్వుపువ్వు నవ్వు జవ్వని నాసిక
చివురుసవురు జవురు నువిదమోవి
మబ్బునుబ్బుగెబ్బు బిబ్బోకవతివేణి
జగమెఱుంగు దాని జగమెఱుంగు.

ఈ పద్యంలో చిన్నచిన్న పదాలలో అమ్మాయి ముక్కును, పెదవిని, జడను వర్ణించడం చూస్తే ఓ మారు ఆహా అనిపిస్తుంది. (ఈ పద్యం నేను పదవ తరగతిలో ఓ లైబ్రరీలో చదివి భట్టీయం వేశాను. ఈ మధ్యనే ఇది చేమకూరవెంకటకవి విజయవిలాసం లోనిదని తెలిసింది)

అలాగే మీకు పదాలతో కవులు ఎలా ఆడుకుంటారు! ఈ విషయం మురిపెంగా అనిపిస్తే ఈ క్రింది పద్యం స్ఫూర్తినివ్వచ్చు.

ఎందుండి ఎందు బోవుచు
ఇందలి కేతెంచినార లిప్పుడు? విద్వ
ద్వందిత! నేడు కదామ
న్మందిరము ధన్యంబయ్యె మాన్యుడ నైతిన్!

ఈ పద్యం మనుచరిత్రలోనిది. ఇలాంటివి అనేకం దొరుకుతాయి. చదువుతూ ఉండండి. ఇంకా సులువుగా , సమస్యాపూరణలు శంకరయ్యగారి బ్లాగులో ప్రతిదినం ఉంటున్నాయి. వాటిని చదవండి.

ఒక్కోసారి, మన కోపాన్ని కూడా ’తపన’ కింద మార్చుకోవచ్చు. ఉదా: నాకు ’ఫలానా’ కామేశ్వర రావు గారంటే కోపం. ఆయనలా పద్యాలు రాయలేకపోతున్నానని ఉక్రోషం. ఆయన బ్లాగు హిట్లను చూసి కుళ్ళు, వగైరా. ఇప్పుడు ఆ ’స్ఫూర్తి’ తో ఎలాగో కష్టపడి

’మర్రిచెట్టు కలదు మహిలోన ఒకచోట
మర్రిచెట్టుకొక్క తొర్ర కలదు’ - అని గరికపాటి వారు వెక్కిరించిన రీతిలో ఓ పద్యం వ్రాసాను. పైగా ఈ పద్యం తప్పొప్పులు చూడమని ఆయన్నే అడుగుతాను! నా ప్రతీకారం, ఆకాంక్ష రెండూ తీరతాయి! పైగా ఆయన్ను ఇలాంటి పద్యాలతో కాల్చుకు తినదం అన్న పురుషార్థమూ దక్కె.చూశారా, ద్వేష బ్లాగు రాయడం కంటే ద్వేషపద్యం వల్ల ఎన్ని అడ్వాంటేజులో!

నేర్చుకోవాలన్న ’తపన’- చాలా పనులు చేయిస్తుంది. ఈ విషయం స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. అంచేత పైన విషయాలు వ్రాశాను.

ఇక గురువు. ఈ విషయంలో చాదస్తం అనుకున్నా పర్లేదు చెప్పాలి. ఒక్కోసారి మంచి గురువు, మీ చేత అద్భుతాలు చేయిస్తాడు, నిజానికి తనేమీ చేయకుండానే. అయితే దీనికి ప్రేమతో కూడిన ఓ బలమైన అభిమానం, నమ్మకం ముఖ్యం. ఈ విషయాలు quantitative కాదు కాబట్టి నిరూపించడం సాధ్యం కాదు. కానీ నా జీవితంలో చాలా సార్లు నాకు ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ విషయం మిమ్మల్ని మీరు అడిగి తెలుసుకోవలసిందే. 

దినుసులు సమకూరాయి.

ఇక మొదలెట్టటం ఎలా? ఇదో భయంకరమైన భూతం. కానీ భూతాన్ని ఎదుర్కోవాలంటే రాకుమారుడు లేదా షాడో లాంటి వీరుడు మొదట దాని వీక్నెస్ ఎక్కడుందో చూస్తాడు. అంటే సమస్యను కుదింపజేయడానికి చూస్తాడు. మనమూ అదే చేస్తే పోలా? ఎలానో క్రమంగా చూద్దాం.

౧. మొదట ఆటవెలది/తేటగీతి పద్యాలు సులువు. వాటితో మొదలెట్టటం మంచిది.
౨. ఏ పద్యం మనకు సులువు? ఇది వ్యక్తులను బట్టి ఉంటుంది. ఒకరికి వర్ణన ఇష్టమైతే ఒకరికి సమస్యాపూరణ ఇష్టం.

సమస్యాపూరణ అనుకోండి. సమస్యాపూరణ చివరిపాదం అయితే అంతకు ముందు ఓ పాదం మాత్రమే వ్రాయండి. ఆ తర్వాత వీలున్నప్పుడు మిగిలిన పాదాలు వ్రాయండి. కుదరకపోతే మీ ప్రయత్నాలు వివరించి గురువులను శరణు వేడండి. వారే మార్గం చూపిస్తారు.

వర్ణన అయితే ఏ పాదానికి ఆ పాదం విడిగా వ్రాసేసుకోడానికి పూనుకోండి. ఉదాహరణకు - పద్యం గురించే రాయాలనుకోండి. ఇలా మొదలెట్టవచ్చు. ఆటవెలది ఎంచుకుందామా?

ఆ.వె:

పద్యము మనసుకును హృద్యముగాఁ దోచు
పద్యము సుమలలిత పద శుభదము
...
...

మిగిలిన రెండు పాదాలు అవే మాటలలో పూరించి ప్రయత్నించి చూడవచ్చు.

అబ్బే! పై పద్యం "నాకొక బుల్లి చెల్లి" ని గ్రాంథికంగా చెప్పినట్టు ఉంది అని మీరనుకోవచ్చు. కానీ "కాకిపిల్ల కాకికి ముద్దు". ఇలా జనులమీద experiment చేస్తేనే మనకు వస్తుంది.

ఇంకాస్త సులువు పద్ధతుంది, అయితే కాస్త తెలివి, ట్రిక్సు కావాలి. ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది. మీ ఎదుట ఇతరులు ’అసలు’విషయం తెలుసుకోలేక మీ పద్యాలను ’ఆహా, ఓహో’ అంటూంటే, భలేగా ఉంటుంది. (నేనిలా బోల్డన్ని రాశాను. :-))

ఉదాహరణకు చాటువుల్లో తిరుపతి కొండమీద ఒకాయన సీసం వ్రాశారు. ప్రతి పాదాంతంలో "కొండ" అని వస్తుంది. నేను అలాగే ప్రతి పాదం చివర్లో "నగరి" అని వాడుకుని పద్యం ప్రయత్నించి సఫలమయ్యాను.

ఇలా తేటగీతులు, ఆటవెలదులు, బ్లాగు జనులమీద ప్రయోగిస్తూ వెళ్ళండి. మధ్యమధ్యలో మన గురువులను సాధ్యమైనంత విసిగిస్తూ ఉందండి. ఇంకా మీ బ్లాగు ఉంది కదా, అక్కడ ఫోటొ, కింద ఓ పద్యం, బాలకృష్ణ, విజయకాంత్ లాంటివారి మీద పద్యాలు, వీలైతే సమస్యా పూరణలు, మీ పాపాయి/బాబు బోసినవ్వు మీద ఓ మాట, ఇంకొన్ని సలహాలు క్రింద.

* ఇతరుల పద్యాలు తీసుకుని, వాటిలో పదాలు మాత్రం మార్చి మీరో పద్యం వ్రాయండి.
* యతి కిట్టించదం కోసం బ్రౌణ్యగ్రంథం వెతకండి. ఉదా: ఇది వరకు పద్యం మీద పద్యం ఉంది కదా. మీకో ఆలోచనొచ్చింది."పద్యము వలన మది ........" తర్వాత రావట్లేదు. ఇప్పుడు -
యతి స్థానంలో "ప", "పం", "పా", "పై", "పౌ", "వ", "వా","వౌ","వై" - వీటితో మొదలయే పదాలు వెతకండి. ఏదో ఓ పదం దొరక్కపోదు!
* వేటూరి పాట, మీకిష్టమైన దాన్ని తేటగీతి/ఆటవెలదిగా మార్చండి. (ఇది నేను చేశానోసారి. మరో ప్రముఖులు కూడా చేశారు.:-))
* మీ దైనందిన జీవితంలో మాటలని పద్యాలుగా మార్చండి. (ఇది చాలా ప్రావీణ్యతనిస్తుంది. నిజం)
* మీరో పద్యపాదం వ్రాశారు. అది చూసి, మీకే "ఏంట్రా ఇది" అనిపించిందనుకోండి. ఫీల్ అవద్దు. కాస్త ఆలోచించి, కుదిరిన చోట్ల అరసున్న పెట్టండి. పద్యానికి హుందాతనం వస్తుంది. నిజమ్.
* చివరిగా - కొంచెం వ్యక్తిత్వ వికాసం టచ్ లో - మీ రచనలను మీరు గర్వంగా ఫీల్ కండి. ఇతరులూ వాటి గురించి అలానే అనుకుంటారు.

Friday, July 23, 2010

మత్తేభ ఘీంకారము

సిరికిం జెప్పడు;శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతింబన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సా హియై.

ఆ పద్యం చదివి వెనకటికి శ్రీనాథుడు పోతనతో అలా ఎలా వస్తాడు? అసంబద్ధం అని లాజించితే, పోతన ఓ రాయిని పెరటి బావిలోకి విసిరి శ్రీనాథునితో, "అయ్యా! మీ అబ్బాయి బావిలో పడ్డాడు" అని చెప్పి, తను పరిగెత్తితే, "ఇదుగో ఇలానే శ్రీవారు కూడా వెళ్ళారండి!" అని జవాబిచ్చాడట.

ఇప్పటి ఐదవతరం హైటెక్ కూలీలకు మాత్రం బాసురుడు పిలిస్తే ఆఫీసుకు పరిగెట్టటం అలవాటే.అలాంటి ఓ మందభాగ్యుని ఉదంతం ఈ పేరడీ.

సతికిం జెప్పడు; పెన్ను పర్సుయుగమున్ షర్టందు సంధింపడే
గతిఁ తిండిన్ తిననేరడద్దముఁ వెసన్ కాంక్షింప డాకర్ణికా
వృత ధమ్మిల్లముఁ జక్కనొత్తడు సుసంప్రీతిన్ విహారాదులన్
మతిఁ గోరండల చేరి బాసురవరున్ మానావనోత్సాహియై

తెరవెనుక:

నాకు మత్తేభం ఎలా వ్రాయాలో తెలియడం లేదు. జాలంలో మత్తేభం అని వెతికితే "సిరికిం జెప్పడు" అని వస్తూంది. నేను మత్తేభం నేర్చుకునే వరకు ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఆగకపోవచ్చు. పోతన మీద ఇదివరకే ఒకాయన కలం చేసుకున్నారు. ఇక్కడ చదవండి.

ఆకర్ణికాంతర ధమ్మిల్లము 
శ్రీకుచో పరిచేలాంచలము - వీటి అర్థాలు తెలపవలసిందని కోరుతున్నాను.

Thursday, May 27, 2010

ఒక పద్యము, కొన్ని పైత్యాలూ

మొదట వేటూరికి నివాళి.

’ఆరేసుకోబోయి పారేసుకున్నాను
యని చిలిపి తలపుల నల రేపు!
’తాంబూలమరుణమందారమనెడుతేనె
లొలికెడి మాటల కలిత బాపు!
’అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
పదమల్లు కైతల పయిడి కాపు!
’గాలినై పోతాను గగనాని కి’దెయని
మలయానిలమయి మయిని మరపు!

పాటలకు పెనిమిటి తేటతేనెకు పాటి
మధురభావపు పదబంధములకు
వేరెవరట సాటి? వేటూరి సుందర
రామ మూర్తి - సుమ మరంద పేటి.

ఇక పైత్యాలు.

రంజుగ సాగెడి ప్రాజెక్ట్.
స్ట్రింజెన్టు క్లయింటు గాడు చెప్పెనిలా! ’వెం
టం జేయి డెలివరి.’ అకట!
కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్

మొన్నను విన్మొబయిలనిరి
నిన్నను కొత్తగ దిగినది నేర్వుడిదె లిమో!
మిన్నగ ఆండ్రాయిడట
ఎన్నగ నేడొచ్చె. రేపు ఇంకే దొచ్చో?

మోడగు మా టీమునకు
మాడరనుగ బ్యూటిజేరె. పండగ ఇకపై
మా డామేజరుకు సి! పూ
బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్

త్రోవలెరుంగకం జవిరి తూరిచి గూర్చిన క్లైంటు స్పెక్సులుం
జేవలుఁ జచ్చిపోయిన డిజేనును అండగ జేసుకొన్న నా
జావలు గారుకోడుయది సాఫ్ట్ వెరు నెల్లెడలందు బొక్కలున్.
బావుర నేడ్చె కష్టమరు ఫైనలు వర్షను జూచి బాధతో!

సృజనతొ వర్కు సేయుడి అసాధ్యము సాధ్యము జేయగానిలన్
అజులయి మీరు నూతన సహాయ మెథడ్సులజైలు లాదిగా
ప్రజలకు తృప్తి గూర్చగ నపారముగన్ యని జేత్రు బోధనల్.
వజనము లేని మాటలివి.వంచన జేయుచునెన్నడున్మహా
భజనలు సేయు వారలకె పై పదవుల్.ఇది నిక్కమెల్లెడల్.

స్పర్ధకు వోయి స్వస్థితిని సైతము జూడకసైనుమెంటునున్
మూర్ధమునందు యెత్తికొనె మూర్ఖశిఖామణి బాసురుండటన్
వర్ధిల జేతుమంచు నట వచ్చిరి యిద్దరు టెక్నికల్ ఫెలోస్.
అర్ధనిశీధమందు అలయంధుడు గాంచెను సూర్యచంద్రులన్

నాతుల గుంపు జేరెనట దారిన, వీధి కొళాయి చెంతకున్
చేతులఁ దిప్పుచున్నొకరు, జిహ్వల వాటము జూపి కొందరున్,
చేతుల బిందెలం గొనుచు చేటగు మాటల పోరు హెచ్చగన్
బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్

తాష్ట్రులు వచ్చిచేరిరిట నాటికి చేటుగ ఉగ్రవాదులై
రాష్ట్రము దోచుచుం జనుల రక్తము పీల్పగ మావొయిష్టులై
త్వష్ట్రము జూపి యా దుడుకు దైత్యుల పాలిటి కాలరూపుడై
రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై

(గత కొన్ని రోజులుగా ఆరోగ్యం కూసింత చెడగొట్టుకుని, పొద్దుపోక వెలగబెట్టిన పైత్యాలు. వూకదంపుడు గారి ఓ పాతటపా నుంచి కొన్ని సమస్యలు , మరో అవధానం పుస్తకంలో ఇంకొన్ని సమస్యలు ఏరాను. తప్పులుంటే కొంచెం పెద్దమనసు చేసుకుని సూచించి క్షమించండి ప్లీజ్!)

Monday, May 24, 2010

మిరపకాయ పేరడీ

ఎద్దాని సంబంధ మెలమి గల్గిన మాత్ర
కూరలెల్లను మంచి గుణము గనునో
కొత్తిమీరను నూరుకొని తిన్న నెయ్యది
కంచెడన్నము తినగలుగ జేయు
ఎద్దాని శిశుజాల మెఱుగక చేబట్టి
కనులు నల్పిగ మంట గలుగ జేయు
ఎద్ది తా క్రమముగ నెదిగి పంపిన మీద
జోటి కెమ్మోవితో సాటి యగునో

నూరి దేనిని పుల్లనై మీరు మెంతి
పెరుగులో గూర్ప స్వర్గము నెరుగజేయు
నరులకెల్లను నా పచ్చి మిరపకాయ
మహితభక్తిని నేను నమస్కరింతు!

తిరుపతి వేంకటకవులు పచ్చిమిరపపై చెప్పిన పద్యమట ఇది. ఈ పద్యం చదవగానే మరో భారతపద్యం స్ఫురించింది. ఇక్కడ వ్యాఖ్యానం చదివి, ఇక్కడ ఆ పద్యం విని రండి. ఈ పద్యం ఆ పద్యానికి పేరడీయా అన్న అనుమానమొచ్చింది. ఓ సారి పాడి చూసుకున్నాను. ఎత్తుగీతి కొంచెం అలానే ఉంది, అయితే తేటగీతి మాత్రం కుదరలేదు.

పై పద్యం నా గొంతులో.

Get this widget | Track details | eSnips Social DNA



(గత పది రోజులుగా నా ఆరోగ్యం బావోలేదు. అందుకనే గొంతు సరిగ్గాలేదు. దయచేసి భరించగలరు.)

Saturday, April 24, 2010

పద్యాలతో నా కసరత్తు!

పొద్దు వారి ఉగాది కవిసమ్మేళనానికి రమ్మని కొత్తపాళీ గారి పిలుపు రూపంలో పొరబాటున నాకో వేగొచ్చింది. నాకు ఏదీ రాకపోయినా (అది నేను చెబుతున్నా), ప్రజలు కొన్ని ఊహల్లో జీవిస్తున్నారని నాకు అ(క)నిపిస్తూనే ఉంటుంది. సరే, భరించే వాళ్ళున్నారు కదాని కొన్ని పూరణలు ప్రయత్నించేను. దాదాపు అన్నీ తప్పులతడకలే. వాటినన్నిటినీ పుల్లెల శ్యాం గారు ఓపికగా సరిదిద్దారు. అలానే కొత్తపాళీ గారు, ఆయన , బిగుసుకు పోవద్దని కొత్త ధైర్యాన్నిచ్చారు. వీరందరి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నేను ప్రయత్నించిన పద్యాలు ఇక్కడ. (ఇవి పొద్దులో ప్రచురింపబడలేదు).

నపుంసకమితి ఙ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మన:
తత్తు తత్రైవ రమతే హతా: పాణినా వయం ||

ఆ పద్య తాత్పర్యం : సంస్కృతంలో ’మనస్’ శబ్దం నపుంసకలింగం. నపుంసకం కదా అని మనస్సును ప్రియురాల వద్దకు పంపితే అది అక్కడే చిక్కుకుని ఆనందిస్తోంది. పాణినీ, నీ(వ్యాకరణం)చేత హతులయ్యామే!

అనువాదం:
షండమది ఉలుకదటంచు సంతసమున
పంపితి మనమును పొలతి పంచకునది
ఇంపుగ యచటే చిక్కి రమింపు రీతి
హన్త! పాణిని నన్ను నిహతుని జేసె!

("హన్త" వెనుక చిన్న కథ. హన్త (హర్షే2నుకమ్పాయాం వాక్యారంభ విషాదయోః) అని అమరం. సంతోషానికి, దయకు, దుఃఖానికి ఈ పదప్రయోగం చేస్తారట. వాక్యారంభంలో చేయాలిట. ఈ పూరణ వేగులో చూసినప్పుడు రాఘవ గారు కాస్త నవ్వుకున్నట్టు గుర్తు)

పొద్దున లెగచిన మొదలు యెద్దుల వలె
పని సలుపుచు వేళకు ఇంత తిని యెరుగని
శుష్క నగరపు జీవులు సుంత పంచ
దారను విడనాడ సుఖము తథ్యమగును

ధీటగు హీరో ’చిరు’కున్
నోటిచ్చు బాబుకునసలు నోనో అంటూ
ధాటిగ హస్తము కేలన
ఓటది నా ఇష్టమనుచు ఓటరు పలికెన్

భాసురమౌ రుక్మిణి భా
మా, సురపతికిం, గుమరుడు మదనుండు సునా
యాసముగ యుద్ధమున బా
ణాసురుఁ గేళీ విధమున నాశము జేసెన్!

ఐసు (eyes) వైడు జేసి ఐప్యాడుఁ గొనిదెచ్చి
ముదము మీర దాని ముందు జేరి
సరస సల్లపనము నెరపంగ, హతవిధీ!
పేరు గొప్ప కాని ఊరు దిబ్బ.

వసతిగ పెళ్ళిఁ చేసుకుని వాసిగ శోభనరాత్రి వేళలో
కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా
కిసలయ సౌకుమార్యమున క్రీగనులన్ నళినాక్షి చూడగా
ముసలము బుట్టదే మదిని? పూశరుఁ బాణము వాడియే సుమీ!

విధేయుడు,
రవి.

Tuesday, February 9, 2010

మా ఊరి మాటలు

"మీనుంచీ మీ సీమోళ్ళ భాష వినబడుతుందేమోనని ఆశపడ్డా, డిసప్పాయింట్ చేశార"ని ఈ మధ్య ఒక యువ బ్లాగ్మిత్రుడన్నాడు. అంత రాక్సాలిడ్ మాట వింటే బాధ కలగాలి, కానీ కొంచెం ఆనందమేసింది. నా ఆనందానికొక చిన్న కనురెప్పపాటువెనుక (ఫ్లాష్ బ్యాక్) ఉంది.

నేను మా ఊరు విడిచి బయటపడకుండా, అక్కడే కూపస్థమండూకంలా, డిగ్రీ వెలగబెడుతున్న రోజుల్లోనే కొంత మంది ఇతర జిల్లా బాహ్యస్థ మండూకాలు సహాధ్యాయులుగా దొరికారు. వాళ్ళలో ఒకడు శ్రీకాకుళం వాడు, కొంతమంది నెల్లూరు వాళ్ళు, ఇశాపట్నమోళ్ళు, కరీంనగర్ వాళ్ళు ఇలా రకరకాలు. తెలుగులో అన్ని రకాలుంటాయని, ఒక్కో తెలుగు ఒక్కో రకంలా ఉండుద్దనీ, అప్పుడే ఎరికయ్యింది. ఆ తర్వాత వూర్ల మీద పడి తిరుగుతున్న రోజుల్లో ఎక్కువగా విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళూ రూమ్మేట్లు గావడంతో నా భాష మారిపోయింది. అదీ జరిగిన సంగతి.

ఫ్లాష్ ఫ్రంటుకొస్తే - మా సీమ భాష అట్లా మర్చిపోయినా, అప్పుడప్పుడూ అలా గుర్తొస్తా ఉంటుంది, రానారె మాటలు విన్నప్పుడూ, నామిని కతలు చదూతున్నప్పుడు వగైరా వగైరా. కానీ ఎక్కడో చిన్న అనుమానం. మా తెలుగు మంచి ప్రామాణికమైన తెలుగేనా అని. ఇది నా కాంప్లెక్సే గానీ, వ్యర్థమైన డౌటు రాజం అని చాలా సార్లు నాకునేను సర్దిచెప్పుకున్నా, అప్పుడప్పుడూ అది తొలుస్తా ఉంటుంది నాకు.

అలానే తెలంగాణా మాండలికంలో వాడబడే "ఉన్నిండ్రు", "ఉంటుండ్రు" వంటి పదాలు అప్పటమైన తెలుగు పదాలని తిరుమల రామచంద్రగారు చెబుతారొకచోట. ఆయన చెప్పిన మరో ప్రయోగం "సేపు". మామూలుగా సేపు అన్న పదం విశేషణాలతో కలిసి "కొంచెం సేపు", "చాలా సేపు" అని వాడబడుతుంది. కానీ కర్ణాటక సరిహద్దు సీమ ప్రాంతాల్లో "సేపెంతయ్యింది" అన్న వాడుక ఉంది.

సరే, కథ కొస్తే, ఈ మధ్య సీమ మాండలికంలో పదాలు ఓ రెండు ప్రబంధాల్లో కనబడ్డాయి. వాటి కథకమామీషు ఇది.

౧. కూపెట్టుట - చాలా ఏళ్ళక్రిందట, మా పక్కింట్లో దంపతులు బాడుగకు దిగారు. వారిది మా జిల్లానే అయినా, దూరప్రాంతం కర్ణాటక సరిహద్దు (మడకశిర) నుంచీ వచ్చారట. వాళ్ళ అమ్మాయి తమ్ముణ్ణిలా పిల్చింది, "రేయ్, అమ్మ కూపెడతా ఉంది. గొజ్జు చేసిందంట, రాల్లంట". అప్పుడు అక్కడ నేనూ, నాతో బాటూ మా అన్నయ్యా, ఇంకొంతమందికీ నవ్వొచ్చింది. కూపెట్టటమేంటి? అని. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి సిగ్గుపడ్డారు మా నవ్వులు చూసి. (గొజ్జు అంటే - పులిహోర గొజ్జు)


అదుగో ఆ కూత ఇన్నాళ్ళకు మళ్ళీ ఇక్కడ.

ఏ పట్టున విసువక ర
క్షా పరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్నుల్
గూపెట్టిన విని తీర్పుము,
కాపురుషుల మీదనిడకు కార్యభరంబుల్

ప్రజల మీద విసుక్కోకు, ఆపన్నులు మొరపెట్టుకుంటే, శ్రద్ధగా ఆలకించు, చెడ్డవాళ్ళ మీద కార్యభారాలు వేయకు అని రాజనీతి సూత్రాలు చెబుతాడు ఒకాయన. ఆ పద్యం మా సీమకు పేరెట్టిన సీమ రాయడి కావ్యంలోనిది. కూపెట్టటమంటే పిలువడమూ, మొరపెట్టుకోవటమూనట.

౨. ఉడ్డ

మెత్తగ నూఱిన చుట్టుం
గత్తిన్ మధుకైటభోరు కంఠము లలనా
డొత్తిన హత్తిన చేదుం
దిత్తుల క్రియ దొడల నుడ్డ తిత్తులు వ్రేలన్.

ముందుగా ఒక ససందర్భ ప్రేలాపన. నామిని మిట్టూరోడి కతల్లో "అలిమేలు మంగమ్మకొక దండం" అన్న కతొకటుంది. ఆ కతలో ఓ వాక్యమిది.

"మడికాడికి ఆవును తోలకబోతా ఉండిన కర్రెక్కా, బోరింగు కాడ బోకులు తోముకుంటుండిన కడుపక్కా, మొగుడికి చద్ది పోస్తాపోస్తా ఉండిన నీలావొతీ అందురూ, చేపలగంప చుట్టూతా వుడ్డజేరిపొయినారు."

ఉడ్డజేరడం అంటే, గుంపు జేరటం అనే అర్థంలో మా ఊళ్ళోనూ నేను చిన్నప్పుడు విన్నాను., ఆ మాట వాడి ఉంటాను కూడాన అయితే ఈ మాట ఎక్కడా కనపడలేదు ఇన్నాళ్ళూ. మళ్ళీ ఆ పైన పద్యం లో "ఉడ్డ" ప్రస్తావన కనబడగానే కొంచెం ఛాతీ సైజు పెరిగింది నాకు.

ఆ పద్యం వివరణ ఇది.

ఆ పద్యం తాలూకు హీరో స్పష్టంగానే తెలుస్తూంది, పాండురంగడని. ఆ అయ్య ఆవులు కాస్తూ, కాస్తూ మధ్యలో సమయం దొరికినప్పుడు మిగిలిన గోపాలకులతో కలిసి గోళీలాడతాడట. అందుకోసం ఆయనకు నాలుగు గోళీకాయ (గచ్చకాయ) సంచులు మొలకు చుట్టుకుంటాడుట. వాటి వర్ణన ఆ పద్యం.

మెత్తగ నూరిన - బాగా పదునెట్టిన
చుట్టుం గత్తిన్ - చక్రం తోటి
మధుకైటభోరు కంఠములలనాడొత్తిన - మధుకైటభుల కంఠాలను తరిగిన (ఒత్తిన అంటే శబ్దం రాకుండా తరిగెయ్యటమట)
చేదుం దిత్తుల - చేదటానికి (గాలి తోడుకోవటానికి) పనికొచ్చే తిత్తులు అంటే ఊపిరితిత్తులట. మధుకైటభులు ఇద్దరివీ చెరో రెండ్రెండు, వెరసి నాలుగు సంచులు.
హత్తిన - లభించిన
క్రియన్ - యట్లుగా
తొడలన్ - తొడలకటూ ఇటూ
ఉడ్డ తిత్తులు వ్రేలన్ - నాలుగు సంచులు వ్రేలాడుతున్నవి.

ఇక్కడ బేతవోలు రామబ్రహ్మం గారి వివరణ -

"ఉడ్డ" అనేది నాలుగు అనే అర్థంలో ఆచ్ఛికపదం. ఉడ్డాముగ్గురు అనేది రాయలసీమ వాడుక. ఏడుగురు అని.

ఉడ్డ అంటే నలుగురు అని విశేషమైన అర్థం తీసుకున్నాడు కవి. అయితే సామాన్యంగా వాడుకమాటల్లో గుంపు అని అర్థమనుకుంటాను.

ఈ పద్యమూ ప్రబంధ కవివరులదే. మొదటి పద్యకర్త పేరులో ఉన్న కృష్ణయ్యే ఈ కవి పేరులోనూ ఉన్నాడు!

(నెనర్లు - పద్యకవితా పరిచయం - బేతవోలు రామబ్రహ్మం గారు - అజోవిభో కందాళం వారి ప్రచురణ)

Thursday, February 5, 2009

పాప - ఆటవెలది

రామకృష్ణా రావు గారి ఆంధ్రామృతం ప్రేరణతో, ముక్కు రాఘవ గారి పొద్దు పాఠాల సహాయంతో, ఆవేశంగా ఓ పద్యం రాయాలి అని, నిన్న రాత్రి ఓ అరగంట కుస్తీ పట్టాను. దేని మీద రాయాలో కాసేపు ఆలోచించి, మా పాప మీద రాద్దాం అని ప్రయత్నిస్తే, నా వల్ల సాధ్యమైనది ఇది.

పాప బోసి నవ్వు పాప ముద్దు మొగము
నాదు మదిని ఎపుడు నలుగుచుండు
నాదు నోము ఫలమొ నాక లోక వరమొ
మరువజాల పాప ననవరతము

ఇందులో దోషాలుంటే పెద్దలు మన్నించాలి. వీలయితే సరిదిద్దాలి.

"నాకొక బుల్లి చెల్లి. గల్లీలో దానికి పెళ్ళి"...ఈ స్త్థాయిలో ఉందేమో మరి. పట్టించుకోవద్దు.

ఇంకా ఆవేశం చల్లారక ఇంకో పద్యం కోసం కుస్తీ మొదలెడితే, ఓ వాక్యం వచ్చి, అంతటితో ఆగిపోయింది.

మిణుకు మనుచు కనులు మిణుగుర్ల రీతిని....
...
...
...

రామకృష్ణా రావు గారు, మీ బ్లాగులో మీరు అంత వేగంగా సమస్యలు పూరించమంటే, నా మృణ్మయ మస్తకం భరించలేదు. నిదానంగా ప్రయత్నిస్తాను. ఏమనుకోకండి.