Thursday, February 5, 2009

పాప - ఆటవెలది

రామకృష్ణా రావు గారి ఆంధ్రామృతం ప్రేరణతో, ముక్కు రాఘవ గారి పొద్దు పాఠాల సహాయంతో, ఆవేశంగా ఓ పద్యం రాయాలి అని, నిన్న రాత్రి ఓ అరగంట కుస్తీ పట్టాను. దేని మీద రాయాలో కాసేపు ఆలోచించి, మా పాప మీద రాద్దాం అని ప్రయత్నిస్తే, నా వల్ల సాధ్యమైనది ఇది.

పాప బోసి నవ్వు పాప ముద్దు మొగము
నాదు మదిని ఎపుడు నలుగుచుండు
నాదు నోము ఫలమొ నాక లోక వరమొ
మరువజాల పాప ననవరతము

ఇందులో దోషాలుంటే పెద్దలు మన్నించాలి. వీలయితే సరిదిద్దాలి.

"నాకొక బుల్లి చెల్లి. గల్లీలో దానికి పెళ్ళి"...ఈ స్త్థాయిలో ఉందేమో మరి. పట్టించుకోవద్దు.

ఇంకా ఆవేశం చల్లారక ఇంకో పద్యం కోసం కుస్తీ మొదలెడితే, ఓ వాక్యం వచ్చి, అంతటితో ఆగిపోయింది.

మిణుకు మనుచు కనులు మిణుగుర్ల రీతిని....
...
...
...

రామకృష్ణా రావు గారు, మీ బ్లాగులో మీరు అంత వేగంగా సమస్యలు పూరించమంటే, నా మృణ్మయ మస్తకం భరించలేదు. నిదానంగా ప్రయత్నిస్తాను. ఏమనుకోకండి.

16 comments:

 1. చందురుని మించు అందమొలికించు పాప ముద్దు మోము చూస్తుంటే మీరు తక్కువే చెప్పారనిపిస్తోంది.

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. పాపను చూసి చెబుతున్నాను - రెండోపాదం:

  మిణుకు మనుచు కనులు మిణుగుర్ల రీతిని

  పసిడికాంతులీను పసిమినగవు
  ...
  ...


  నా తరువాత ఈ టపా చూసినవారు మూడోపాదాన్ని మాత్రమే పూరించి మిగతావారికి అవకాశమివ్వాలని కోరుకుంటూ ...

  అభినందనలతో,
  రానారె.

  అంత్యనిష్టూరం: రవిగారూ, పొద్దుపాఠాలకు లంకెపెడితేనేమి? అందరూ నేర్చేసుకుంటారనా?!

  ReplyDelete
 6. మొదటి ప్రయత్నం లోనే చక్కటి పద్యాన్ని మీ పాప మీద వ్రాసారు.
  3వ పాదము:
  " చెన్ను చిందు చిన్ని చెక్కిలి వెలుగులు"

  ReplyDelete
 7. ఆటవెలది:-
  రవికి శుభములగుత! రచనలో రాణించు
  ఆట వెలదితోడ తేటగీతి
  అందమొప్పునట్లు కందమ్మువ్రాయుత.
  చంపకోత్పలములు సొంపులమరు.

  మీఆటవెలది:-
  పాప బోసి నవ్వు పాప ముద్దు మొగము
  నాదు మదిని ఎపుడు నలుగుచుండు
  నాదు నోము ఫలమొ నాక లోక వరమొ
  మరువజాల పాప ననవరతము

  నా చిన్న మార్పుతో:-
  పాప బోసి నవ్వు పాప ముద్దు మొగము
  నాది మదిని యెపుడు నయత నుండు.
  నాదు నోము ఫలమొ నాక లోక వరమొ
  మరువ జాల పాప మౌన భాష.

  ఆటవెలది:-
  మిణుకు మనుచు కనులు మిణుగుర్ల రీతిని {ఆటవెలది:-రవి పలికిన మొదటి రమణీయ పాదము}
  పసిడికాంతులీను పసిమి నగవు - - - - - - - - - - - - { రా. న. రే. వచించె రమ్యముగను.}.
  చెన్ను చిందు చిన్ని చెక్కిలి వెలుగులు" - - - - - - - { జిగురుసత్యనార్య చెప్పె నిద్ది.} ...
  చిన్ని పాప సొగసు చెప్పనౌనె? - - - - - - - - - - - { నేను వ్రాసినాను. దీని నిపుడు.} ...

  ReplyDelete
 8. ఆటవెలది:-
  రవి పలికిన మొదటి రమణీయ పాదము
  రా. న. రే. వచించె రమ్యముగను.
  జిగురుసత్యనార్య చెప్పె నిద్ది
  నేను వ్రాసినాను. దీని నిపుడు.

  ReplyDelete
 9. ఆటవెలది:-
  రవి పలికిన మొదటి రమణీయ పాదము
  రా. న. రే. వచించె రమ్యముగను.
  జిగురుసత్యనార్య చెప్పెను దీనిని.
  నేను వ్రాసినాను. దీని నిపుడు.

  ReplyDelete
 10. ౧.
  పాప బోసి నవ్వు పాప ముద్దు మొగము
  నాది మదిని యెపుడు నయత నుండు.
  నాదు నోము ఫలమొ నాక లోక వరమొ
  మరువ జాల పాప మౌన భాష.

  ౨.
  మిణుకు మనుచు కనులు మిణుగుర్ల రీతిని పసిడికాంతులీను పసిమి నగవు
  చెన్ను చిందు చిన్ని చెక్కిలి వెలుగులు
  చిన్ని పాప సొగసు చెప్పనౌనె?

  వావ్. మా పాపకు ఈ రోజు అద్భుతమైన ఆశీస్సులు లభించాయి. నాకు రెండు బెత్తం దెబ్బలతో పాటు. :-)

  @సుజాత గారు, @రానారె, @సత్యనారాయణ గారు, @రామకృష్ణారావు మాస్టారు, ధన్యవాదాలు. (పద్య రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను, కాస్త వీలుచిక్కినప్పుడు. ప్రస్తుతానికివి)

  @రానారె అంత్య నిష్టూరం : లంకిస్తాను.

  ReplyDelete
 11. రవిగారికి
  మీ పాపాయికోసం.

  రవీంద్రుని క్రిసెంట్ మూన్ నుంచి when and why అనువాదం- (నా ప్రస్తుత ప్రోజెక్ట్ :-).
  దానికి వీరాభిమాని అయిన మీముందే ధైర్యం చేస్తూ -pl. excuse me as it is not the final version)


  నా బుజ్జాయీ,
  నీకు నేను రంగుల బొమ్మలు తెచ్చినపుడు అర్ధమయింది
  మేఘాలు, జలాలపై అట్టి రంగుల నాట్యం ఎందుకుందో
  పూవులు భిన్న వర్ణాలను ఎందుకు అద్దుకొన్నాయో!
  నీకు రంగుల బొమ్మలు ఇచ్చినపుడు నాకర్ధమయింది.

  నిన్ను ఆడించేందుకు నేపాడినపుడు నేను తెలుసుకొన్నాను.
  ఆకులలో సంగీతం ఎందుకుందో! ఆలకించే పుడమి హృదయానికి
  అలలు తమ బృందగానాన్ని ఎందుకు వినిపిస్తాయో!
  నిన్ను ఆడించేందుకు నేపాడినపుడు నాకు అర్ధమయింది.

  మధురపదార్ధాలను నీ చేతికి అందించినపుడు తెలిసింది.
  సుమపాత్రికలో మధువు ఎందుకుందో!
  రహస్యంగా ఫలాలు అమృతంతో ఎందుకు నింపబడతాయో!
  మధురపదార్ధాలను నీ చేతికి అందించినపుడు నాకు తెలిసింది.

  నా ప్రియమైన బుజ్జాయీ
  నిన్ను నవ్వించటానికి నీ మోమును ముద్దిడినపుడు
  నాకు నిశ్చయముగా అర్ధమయింది.
  ఎంతటి సంతసం ఆకాశం నుండి ఉదయకాంతిలో ప్రవహిస్తున్నదో!
  నా దేహానికి వేసవి తెమ్మెర ఎంతటి హాయినిస్తుందో!
  నిన్ను నవ్వించటానికి నీ మోమును ముద్దిడినపుడు తెలిసింది.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 12. @బాబా గారు : పాపాయి గురించి చెప్పడానికి మన రవీంద్రునికన్నా ఎవరున్నారు? (జాషువా చెప్పారనుకోండి)
  నిజానికి అది చెప్పినట్లు ఉండదు. పాపాయిని ఎత్తుకున్నప్పుడెలా ఉంటుందో, అలాంటి ఫీలింగ్.

  మళ్ళీ ఓ మధుర గాయాన్ని రేపారు. నెలవంకను మళ్ళీ (మళ్ళీ మళ్ళీ) చూడాలి. ధన్యవాదాలండీ.

  ReplyDelete
 13. సత్యనారాయణగారూ, బాగా చెప్పారు. మాట మన్నించినందుకు కృతజ్ఞతలు. రెండోపాదంలో నేను చెక్కిలి మాటే చెబుదామనుకున్నాను. కానీ ఆ నవ్వు లాగేసింది. రామకృష్ణారావుగారూ చివరిపాదం చక్కగావుంది. మిమ్మల్నిచూస్తే ఏవిషయాన్నయినా చక్కని పద్యరూపంలో చెప్పవచ్చనిపిస్తుంది. చెన్ను, నయత - ఈ రెండు పదాలనూ విన్నానుగానీ నేనెప్పుడూ వాడలేదు. ఒకటి తెలుగు మరోటి సంస్కృతం అనుకుంటాను?!

  ReplyDelete
 14. ఓర్పు తోడ మీరు ఒజ్జలంతా చేరి
  చిన్ని పాప మీద చక్కగాను
  మనసు తీర ముద్దు మాటలాడిరి గాన
  నెనరు సేత మీకు నయము గాను

  ReplyDelete
 15. Ravi..
  I donno whether I understood rightly or not.. but I think u r saying " naa nomula falam".. Nuvvu Nomulenti cheyyatam yenti ravi...

  Can't comment on ur telugu as I know nothing except talking.. but.. I was thinking how our ravi doing Nomulu!!!

  ReplyDelete
 16. Dear Ganesh,

  "Nomu" - Doesn't necessarily indicate a ritual, but some times it can be understood as a prayer. Prayer may not be a ritual. It's a symbol of gratitude to unknown beauty.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.