Thursday, June 2, 2011

నూరు యోజనాలకు...నేనిలా బ్లాగులు రాస్తాన్నట్లు మా అవ్వ చిన్నప్పుడు తన కతలు చెబుతా ఉండేది. మా అవ్వ అంటే మా అమ్మ నాయనకు చెల్లెలు. ఆయమ్మకు చిన్నతనంలోనే పెండ్లి చేస్తే, మొగుడు చనిపోయి విధవయింది. అప్పట్నుండి ఆయమ్మను సాకే పని మా తాతదయ్యింది. ఆచారం, ఆచారం అని నీల్గినందుకు గానూ ఆయనకొచ్చిన బహుమానం ఇది. బిడ్డా, గొడ్డూ లేదు కాబట్టి ఆయమ్మకు నా మీద ప్రత్యేకమైన ప్రీతి కాబట్టీ, నాకు ముచ్చట్లు చెబుతా ఉండేది.

మా తాత గోదావరి ధవళేశ్వరం కాడ బారేజీ కట్టేప్పుడు పీడబ్ల్యూడీలో గుమాస్తాగా చేసేటోడంట. ఆయనా, ఆయన భార్యా, తల్లీ, చెల్లెలు, చిన్న పిల్లకాయొకడూ. (అప్పటికి మాయమ్మ పుట్టలే) ఇదీ సంసారం. గోదారోళ్ళ మాటలు వీళ్ళకర్థమయేవి గాదంట. ఆ మాటకొస్తే వాళ్ళు ఎక్కడో తంజావూరు దగ్గర్నుంచీ వలస వచ్చినోళ్ళు కాబట్టి తెలుగే అంతంత మాత్రం. ప్రతి రోజు హాశ్చెర్యమే. 

సపోటాలమ్ముతా ఉంటే చూసి, వీళ్ళు ఉర్లగడ్డను కూడా పండు గా మార్చి తింటున్నారని అనుకొన్నారంట, మరో రోజు వీధిలో ఎవతో మరమరాలు అమ్ముతా ఉంటే ఆమెను ఏమ్మో వియ్యపురాలూ అని పిలిస్తే, ఆవిడొచ్చి ఎవరికి వియ్యపురాలు? అని ఒకటే గలాట పెట్టుకొనిందంట. మా ఊళ్ళో (సీమలో) మరమరాలకు బొరుగులు అని, వియ్యపురాలిని సంబంధి అని వాడుక. (మరమరాలకు, వియ్యపురాలకు మధ్య కన్ఫ్యూజన్ ఆమెకు) ఇట్లాంటి కబుర్లు చెప్పేది. ఆయమ్మవన్నీ డౌలు మాటలని అనుకునేటోళ్ళం నేనూ మాయన్నా. ఒకరోజు ఇదే గోదావరి కబుర్లు చెబుతా,మనకిక్కడ సీతాఫలమున్నట్ల అక్కడ రామాపండు ఉంటుందిరా అనింది. అది నేను నమ్మలే. ఇన్ని యేళ్ళ తర్వాత ఆ మధ్యనెప్పుడో ఒక ఫోటోబ్లాగాయన ఫోటోపెట్టి చూయిస్తే నమ్మాల్సొచ్చింది!

చిన్నప్పుడివి తెలీకపోయినా నా కాలేజీ రోజుల నుంచీ ఈ రోజు వరకూ ఇట్లాంటి ఆశ్చర్యాలు కనిపిస్తూనే ఉన్నై. వారం రోజుల క్రితం హైదరాబాదొచ్చి ఇక్కడ ఇల్లు చూసుకున్నప్పుడు గంటయ్య పరిచయమయ్యాడు. గంటయ్య నేనున్న అపార్టుమెంటు వాచ్ మెన్. అతనిది పాలకొల్లట. గోదావరి యాస. మొదట్రోజు ఒక్క ముక్క అర్థం కాలేదు. తర్వాత్తర్వాత డీకోడ్ చేసి అర్థం చేసుకుంటున్నా. మొన్నో రోజు పొద్దున అతను పలకరించాడు.

"సారూ, మీ జోళ్ళొదిలీశారేటండి?"

"?...కళ్ళజోడా?" (అడిగిన తర్వాత తెలిసింది వెధవప్రశ్నని)

"కాదండి, కాల్జోళ్ళండి"

కాసేపటికి బల్బు వెలిగింది. నా చెప్పులు బయట మర్చిపోయాను. అదీ సంగతి. మా ప్రాంతంలో కొన్ని చోట్ల చెప్పులకు మెట్లు అంటారు (మెట్టుతో కొడతా అని ఒక పాపులర్ తిట్టనమాట).

బల్బంటే గుర్తొచ్చింది. ఇంటికి బల్బు తెచ్చుకోవాలి.బయట అంగడికెళ్ళాను.

షాపతనకి చెప్పాను. బల్బొకటివ్వమని.

"అర్ పయ్యా? నల్ పయ్యా?"

"?!"

నా అయోమయం చూసి మళ్ళీ అడిగాడు. అర్థం కాకుండా తిరిగి వచ్చేస్తూంటే సిక్స్టీ వాట్ బల్బు, సిక్స్టీని అర్పై అంటున్నాడు కాబోలని స్ఫురణ(యాద్)కొచ్చింది. అదీ సంగతి.

ఇంటికొస్తే మా పాప మొదలెట్టింది.

"నానా, మామిడి పండు తింటా నానా, పండు నేను తింటా పొట్టు నువ్వు తిను.." (మామిడిపండు తోలు నాకు ఇష్టం.
అందుకని పండు కోసి దానికి పెట్టి తోలు నేను తినడం అలవాటు)

పొట్టు - ఫక్కున నవ్వొచ్చింది.

నవ్వుతూంటే అంది. "నానా నువ్వు నవ్వొద్దు". -

(తప్పుతుందా) "!...సరే"

కాలేజీ రోజుల్లో నెల్లూరతను మా మాటలు చూసి నవ్వే వాడు. ఓ రోజు కొన్ని పదాలు రాసుకొచ్చినాడు. వాడు రాసుకొచ్చిన మాటల్లో కొన్ని జ్ఞప్తికున్నవి.

"తీరుమానం"
"పాలేగాడు"
"రెట్టమతం"
"కొల్లబడిబోయింది"
"ఉర్లగడ్డ"
"బీగంచెవి" (బీగం - అంటే ఓ మారు మా కొలీగు ముసల్మాను భార్య అనుకుని తికమకపడినాడంట. ఆ తర్వాత అర్థయింది,వేరే ఏదో అని)
"తట్ట" (కంచం)
..
..

వాడిని అప్పట్లో బాగా తన్నాలనిపించింది, కానీ ఆ పరిస్థితి నాకూ చాలాసార్లు ఎదురయ్యింది. భారతదేశంలో ప్రతి నూరు యోజనాలకు భాష మారుతుందని పెద్దలమాటట. భాష ఒకటయినా మాటలర్థం కాక, అలాంటిది అనుభవంలోకొస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.