Monday, October 20, 2014

అన్నబెల్లె యను దయ్యపు కథ


అది యొక బొమ్మ. బొమ్మ యనగానేమి? ఆటవస్తువు. భౌతికముగ నా యాటవస్తువునకు ప్రయోజనము శూన్యము. మరి మానవులెందుకు యాటవస్తువులను కొనుచుందురు? అది యొక మానసికావసరము. లోకమున ప్రతివస్తువునకూ భౌతికముగనూ, మానసికముగనూ ప్రయోజనముండును. ఆ ప్రయోజనమును గుర్తింపక, భౌతికావసరముననో, లేక కేవలమానసికావసరమాత్రవిశేషముగనో ప్రాధాన్యతను నిర్ణయించుట మానవుని స్వభావదోషము. దీపావళి పండుగ గలదు. ఆనాడు మాతాబాలు కాల్చుట యొక సాంప్రదాయము. మాతాబాలు వెలిగించుట వ్యర్థమగు ఖర్చని కొందరందురు. ఇవతలి వాడు "అది సత్యభామ నరకుని సంహరించిన తరుణమును గుర్తించుకొనుటకై యేర్పడిన యేర్పాట"ని జెప్పబోవును. అవతలివాడందులకంగీకరింపడు. ఈతని సాంస్కృతికావసరమును యాతడు గమనింపడు. లోకపు తీరిట్లుండును.

అతడామె ప్రణయసామ్రాజ్యమునకు సమ్రాట్టు. ఆమె యాతని ప్రణయిని. వారువురి వివాహబంధము యొక అందమైన కావ్యము. ప్రకృతమాయమ గర్భము దాల్చినది. ఒకదినము జాన్ ఆమెతో నిట్లనెను.
"ఏమోయీ! నీకేమైననూ కోరికలున్నవా? చెప్పినచో తీర్తును."
"నాకేమియునూ వద్దు."
"అట్లు కాదు. నీకు కాకపోయిననూ, నీ యందున్న ప్రాణికి ఏమైన కోరికలుండవచ్చును."
"ఆ ప్రాణికి బాహ్యప్రపంచము తెలియదు. ఆ యవసరముండదు లెండు."
"అట్లనకోయి. గర్భస్థశిశువు ప్రపంచమును గమనించునని, అందులకొక తీరు గలదని వైద్యులు పరిశోధించుచున్నారు."
మియా ఫక్కున నవ్వి యిట్లనెను." మీరలు కోట్లరూపాయల ధనము వెచ్చించి జేయు పరిశోధనాఫలితము నన్నడిగిన ధనమవసరము లేకనే జెప్పియుందును గదా!"

జాన్ కూడా నామె నవ్వుతో శ్రుతి గలిపెను.

మరుసటి రోజు జాన్ ఒక పెద్ద మంజూషికను దెచ్చెను. మియా కనులను మూసి, ఆ పేటికను తెరచెను. ఆ పెట్టెలోనొక బొమ్మ యున్నది. మియా, జాన్ ను విస్మయానందముల గాంచెను. "ఏమండీ! నేనెన్నడో యడిగిన బొమ్మ గదా యిది". "అవునోయి, నిన్న యే కోరిక లేదంటివి" యని మేలమాడెను. పాండురములైన యామె గండద్వయమున రాగోదయమాయెను. ఆమె యా బొమ్మను మిగిలిన బొమ్మలతో గలిపి ముఖ్యమైన గదిలో నుంచెను.

********************

అదే ఆమె చేసిన తప్పు.

ఆ బొమ్మ భవిష్యత్తులో ఒక దుష్టశక్తికి నెలవవుతుందని ఆ క్షణంలో ఆమెకు తెలీదు. చాలా మామూలుగా ఆ బొమ్మను సర్దుతూ, "ఇప్పటికి మొత్తం సెట్టు పూర్తయ్యింది కదండీ" అంది.

దూరంగా ఒక తీతువు పిట్ట వికృతంగా అరుస్తూ వెళుతోంది.

********************

గడియారం తాలూకు రేడియం డయల్ పన్నెండు గంటలని చూపిస్తోంది. దంపతులిద్దరూ నిద్రపోతున్నారు. ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచింది మియా. పక్కనే పడుకున్న జాన్ ను తట్టి లేపింది.

"పక్క యింట్లో ఏదో చప్పుడవుతోంది" చెప్పింది మియా.
"ఉండు చూసొస్తాను" చెప్పాడు జాన్.

మియా బయటకు వచ్చింది. చలిగాలి రివ్వున ఒడుతోంది.

పక్కింట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఆ గొడవను బయటనుండి చూసాడు జాన్."నీవిప్పుడే అంబులెన్స్ కు ఫోన్ చేయి. నేనిప్పుడే వస్తాను" చెప్పి బయటకు పరిగెత్తాడు.

ఆమె ఫోన్ చేస్తుండగా జరిగిందిది.పక్కింటి జంట వేగంగా పరిగెత్తి మియా ఇంట జొరబడ్డారు.

భార్యను కత్తితో పొడవబోయాడతడు. ఆమె అతని గుండెలపై గుప్పిళ్ళతో గుద్దుతూ గింజుకోసాగింది. ఆ ఘటనలో దుండగుడు మియాను గాయపర్చాడు. ఆపైన అతడామెను కత్తితో పొడిచాడు.

పోలీసులు సమయానికి రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే హంతకుడు తన భార్యను పొడిచినప్పుడు ఆ రక్తపు చుక్క పక్కన బొమ్మపై పడింది. ఆ చుక్క బొమ్మ కంటిలో పడి తెల్లటి ఆ బొమ్మ కళ్ళ చివర సన్నటి రక్తపు చారిక నిండడం ఎవరూ గమనించలేదు.

********************

యిది ఇట్లుండ, ఒకనాడు వఱువాత మియా తన నిజగేహమున ఊహావశంబై, వసనమునొక్కదానికి సాధింపనెంచి కుట్టుయంత్రము నవశముగ నాక్రమించి సమయమతిక్రమించుట యెంచక కర్మావశిష్టయై ఉపవిష్టయైనది. అంతట యరమనె (వంటగది) యందు పొయ్యి తనంతట తనే వెలుంగుటం జేసి, యా మంట యంతంతన్ మిక్కుటమై, యగ్ని ప్రమాదమునకు దారితీసెను. మియా యా తెరంగునెఱింగి మంటలనార్పునంత ఆ నిప్పు యందు మరుగుననున్న ప్రేతాత్మ యామెనాక్లిష్టంబొనర్చి కబళింపసొచ్చెను. సమయమునకు యెవరో వచ్చి కాపాడిరి.

మియాకు నెలలు నిండి పనసపండువంటి పసిబిడ్డను ప్రసవించెను. అటపై యా దంపతులు ప్రేతనిలయమైన యా గేహమును వీడి మరియొక నూత్నగేహమున వసింపనిచ్చగించిరి.

రామేశ్వరము పోయిననూ శనేశ్వరము వీడనట్టుల కొత్త ఇంటనూ ఆ యింతికి కంట నిద్ర కరువాయెను. ప్రేతావశిష్టమైనక్రీడాఖండమఖండముగ నీ నూత్నగేహమున యాహ్వానము లేని యతిథి వోలె నరుదెంచెను. ఒకదినంబున మియా సరుకుల కొనుటకవసరంబై, వీధిని యిచ్చంబోవుచుండనామెకు యొక యంగడి కానంబడియెను. ఆ పుస్తకములయంగడి ఎవెలిన్ యను నామెది.

**********************

జ్ఞాపకాల దాహంతో అనుక్షణం తపిస్తూ, జీవితమెందుకో తెలియక, మరణాన్ని వెతుక్కోలేక, జీవిస్తూ మరణిస్తున్న నాకెందుకమ్మా నేస్తం, ఒయాసిస్సులా కనిపించావు? మళ్ళీ ఆ ఒయాసిస్సును చేరబోతే, ఎక్కడ దాహాన్ని తీర్చవలసి వస్తుందోనని నేనొక ఎండమావినని కల్లలెందుకు నేస్తం? ఏదీ ఆశించకపోయినా, స్నేహానికి వెలకడుతున్నానని నా హృదయాన్ని ఎలా అంచనా కట్టావమ్మా? ఎవ్వరూ లేని నాకు అమూల్యమైనది నీ స్నేహమేనని తెలుసుకోలేవా పిచ్చితల్లీ?

ఎవెలిన్ మియాను పలుకరించింది. అది మొదటి పలుకరింపు. ఆ క్షణంలో ఎవెలిన్ కు గుర్తొచ్చినది తన కూతురు. సరిగ్గా కొన్నేళ్ళ ముందు ఒక ఏక్సిడెంట్లో మరణించిన తన కూతురు. బ్రతికి ఉంటే సరిగ్గా మియా వయసు ఉండి ఉండేది.

ఎవెలిన్ ఆపైన మెల్లగా అయినా స్ఫుటంగా మియాతో స్నేహం చేసింది. భర్త లేని వేళల్లో ఆమెకు చేదోడువాదోడయ్యింది. అంతే కాక, మియా ఇంటనున్న ప్రేతాన్ని వదిలించడానికి తనవంతు ప్రయత్నం చేసింది.

**********************

జాన్ మియా దంపతులకు నొక చర్చి మతగురువు తెలిసియుండెను. యాతడు వారి యింటనున్న బొమ్మనూ, బొమ్మనావహించిన ప్రేతాత్మను వదిలింపనెంచి, యా బొమ్మను తీసికొని చర్చ్ కు వచ్చెను.

ఫాదర్ చర్చి తలుపు వద్దకు వచ్చేడు. ఏదో అనుమానం వచ్చి వెనక్కు చూసేడు. అక్కడ - ఒక నల్లని నిశ్చలమైన ఆకారం. పై నుండీ క్రిందివరకూ వ్రేలాడుతున్న అంగీ, చింపిరి జుత్తూ...

అది కాదు అతడు చూస్తున్నది. ఆ ఆకారం కన్నుల్లో నిర్లిప్తత, ఆ నిర్లిప్తత వెనకున్న క్రౌర్యం. ఛప్పున తలతిప్పి చర్చి లోపలికి అడుగుపెట్టబోయేడు.

ఒక్క క్షణం అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏదో రాక్షసహస్తం విసిరేసినట్టు రోడ్డుపైన పడ్డేడు. నోరు తెరిచి యేదో చెప్పబోయాడు. మాట రాలేదు. 

నా ప్రస్థానం ఇందుకా నేస్తం? నా స్నేహం నీతో మాట్లాడటానికే కాదమ్మా, నీకోసం ప్రాణాలివ్వటానికి కూడా. 

**********************

అన్నబెల్లె దయ్యం చివర్న ఏమయ్యింది అన్న ముక్క మాత్రం సినిమాలో చూడండి. :)