Wednesday, June 30, 2010

చరిత్రా? చట్టుబండలా?

చరిత్ర అంటే ఏమిటి?
ఊహాగానమా?
కొందరు పరిశోధకుల పొంతన లేని అభిప్రాయాలకు ఊతం ఇచ్చే సబ్జెక్టా?
కోర్టులోలా circumstantial evidence ఉంటే తప్ప పరిగణనలోకి తీసుకోజాలని ఓ వ్యాజ్యమా?
తమతమ అభిజాత్యాలకు ఆటపట్టుగా మార్చుకోవడానికి తేరగా దొరికిన ఓ అవకాశమా?
వ్యక్తి వ్యక్తికీ, కాలకాలానికి మారిపోతూ ఉండేదా?

ఓ దేశపు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మొదట అక్కడి సంస్కృతినీ, సాంప్రదాయాల్ని, సాహిత్యాన్ని వినమ్రతతో పరిశీలించాలి. అందులో సొంత అభిప్రాయాలకు, అభిజాత్యాలకు తావు ఉండరాదు. అధ్యయనం వ్యక్తిగత పేరు ప్రతిష్టల సమరం కారాదు. అది జాతికి చేస్తున్న సహాయం కానేరదు.

విమర్శ అనే ప్రక్రియకర్థం తెగడటం కాదు, పరిశీలించటం, నిష్పాక్షికంగా ఆధారాలను సేకరించటం, ఆధారాలను బట్టి సమన్వయం సాధించటం విమర్శ. సమన్వయం కుదరని పక్షంలో ఊహాగానాలకు చోటివ్వక, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఉంచి, తరువాతి తరానికి ఆ విషయాలను పరిశీలించడానికి సహాయం కల్పించటం కూడా సద్విమర్శలో భాగమే. చరిత్ర అన్నది ఒక శాస్త్రం కాదు. శాస్త్రానికి అధారం విశ్లేషణ. కళకు ఆధారం సంశ్లేషణ. శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం అంటే, కంటికి కనిపించే ప్రత్యక్ష ఋజువులకోసం పాకులాట అనేది సంకుచితమైన అర్థం. 

చరిత్రాధ్యయనం ఒక కళ. ప్రాంతీయ సాహిత్యానికి, వారి దైనందిన జీవితంలో అంతర్భాగమైన అలవాట్లకు, వారి సంస్కృతి మూలాలకు, సాంప్రదాయ విషయాలకు సమన్వయం సాధించగలిగడం ఈ ప్రక్రియలో భాగం.ఇందులో పొఱబాట్లకు తావులేదు. సహానుభూతి అభిప్రాయాలకు పరిమితం కావాలి, ప్రమాణాలకు కాదు. అభిప్రాయాలకు అందరికీ అవకాశం ఉంది. అయితే అభిప్రాయం ప్రమాణం చేసే ప్రయత్నం నిర్ద్వంద్వంగా ఖండించదగింది. దురదృష్టవశాత్తూ, ఆంగ్లేయులచేత ఈ రోజు పాఠ్యాంశాలలో చేర్చబడి విద్యార్థులు చదువుతున్న భారతదేశ చరిత్ర చాలావరకు ఊహాజనితం. ఒక ఊహ నిజంగా మలచబడి, దానిపై మరొక కల్పన సృష్టింపబడి, మరిన్ని ఊహాగానాల అల్లిక,వాటికి ఋజువుల వెతుకులాట.. ఇలా చెల్లాచెదరై ఉంది.మనం చదువుకునే మన దేశచరిత్ర మొత్తం అస్తవ్యస్తం, అకటావికటం.

ఉదాహరణ: హిందువులు సాధారణంగా వాడే పంచాంగంలో ఉటంకింపబడే శాలివాహన శకం ప్రకారం ఈ యేడు 1932 వ వర్షం. యే శకమైనా ఎలా మొదలవుతుంది? ఓ మహాత్ముడితోనో, మహానుభావుడి పేరు మీదో, ఏదైనా గొప్ప సంఘటన వలనో మొదలవాలి. కలిశకం, యుధిష్టిర శకం, విక్రమ శకం, క్రీస్తు శకం ఇవన్నీ దానికి ఉదాహరణాలు. అలా శాలివాహన శకం క్రీ.శ. 78 నుండి మొదలయింది. వేల యేళ్ళుగా ఆనవాయితీగా, పంచాంగ రూపకర్తలు దీనిని ఉటంకిస్తూ వస్తున్నారు. శాలివాహన మహారాజు గురించి భారతీయ లౌకిక సాహిత్యంలో కథలున్నవి. ఎంతో ఎందుకు? ప్రాకృతభాషలో గాథాసప్తశతి - శాలివాహన సంకలితం ఉన్నది.  కాగా, శాలివాహనుడనే రాజు లేనే లేడని, ఎక్కడినుండో వచ్చిన కుషాణ వంశపు కనిష్కుడనే రాజు పుట్టుక ఆధారంగా ఈ శకం మొదలయ్యిందని కొందరు ఆంగ్లపండితుల ఊహ. పురాణాలన్నీ పుక్కిటివయ్యాయి. ఊహాగానాలు నిజమయి కూర్చున్నాయి. ఊహ చరిత్ర గా మారింది. మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కింది. ఎవరో చేసిన ఊహాగానం చరిత్ర పేరిట మనం చదువుకుంటున్నాము. అగ్ని వంశపు రాజుల గురించి చెప్పిన మత్స్య, అగ్నిపురాణాది అనేక పురాణాలు, వేలయేళ్ళుగా వచ్చే సంప్రదాయం, లౌకిక సాహిత్యం, ప్రతీ రోజు చేసే సంధ్యావందనంలోనూ, హిందువనే ప్రతివాడు ఏదో ఒక సందర్భంలో పూజలో సంకల్పం చెప్పుకునే వరుసలో వచ్చే "శాలివాహకే..హరిహర గురుసన్నిధౌ, అస్మిన్ వర్తమానే..." వరుసా, ఇవన్నీ ప్రమాణాలుగా తోసివేయబడ్డాయి!

ఇక మహాభారతం విషయానికి వద్దాం.

కలియుగం ఫిబ్రవరి 20, 3102 B.C, 2-27'-30''గంటలకు,మొదలయ్యిందని ప్రపంచ వ్యాప్తంగా, ఇండాలజిస్టులు ఒప్పుకున్న విషయం. మహాభారతంలో స్త్రీపర్వం, అనుశాసనిక పర్వం,మహాప్రస్థానిక పర్వాది కొన్ని పర్వాలలో శ్రీకృష్ణుని మరణం, పరీక్షిత్తు జననం, కలియుగాగమనం ఒకేసారి జరుగుతాయని ఉటంకించబడి ఉన్నది. గాంధారి కృష్ణునికి శాపం ఇస్తూ, సరిగ్గా 36 యేళ్ళకు యాదవకులంలో ముసలంపుట్టి వంశనాశనం జరుగుతుందని చెబుతుంది.అంటే, భారతయుద్ధకాలం క్రీ.పూ. 3138. అంటే భారత కాలం అంతకుముందే కావాలి. దేవీభాగవతం, ఇంకా కొన్ని పురాణాలలోనూ ఒకేవిధమైన సమయం ఉటంకింపబడి మహాభారత కాలానికి సమన్వయం కుదురుతున్నది. కాగా, మహాభారత సమయం క్రీ.పూ. 1200 కు మించదని, ఎందువల్లనంటే iron age అప్పుడే మొదలయ్యిందని కొందరి ఊహ అయితే, జాకోబీ, వెబర్,మాక్డోవెల్ పండితుల ప్రకారం మహాభారతం క్రీ.పూ.మూడవ శతాబ్దానికి చెందినది. వీరి ఊహకు కల్పించిన ఆధారం అలెక్జాండరు దండయాత్ర క్రీ.పూ.మూడవ శతాబ్దంలో జరిగింది. భారతంలో యవన శబ్దం ఉంది కాబట్టి, భారతం ఆ సమయంలోనే జరిగిందన్న వాదన! మరి రామాయణంలోనూ యవన శబ్దం ఉంది కదా అంటే, అది ప్రక్షిప్తం అనేశారు. సరే, అలెక్జాండర్ కంటే ముందే డేరియస్ అనే గ్రీకు రాజు ఉత్తరభారతానికి వచ్చినట్టు ఓ చరిత్రకారుడు వ్రాశాడు కదా, క్రీ.పూ.ఏడవ శతాబ్దంలో శకటాయనుడు కూడా ఆ శబ్దం ఉపయోగించాడు కదా అన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు. భారత కాలం స్పష్టంగా నిర్ణయించడానికి, ఋజువులు దొరకలేదని ఘోషణ! అంతర్గత ఋజువులు (internal evidences) దొరికినప్పుడు వాటిని వీలయినంత పక్కన పెట్టటం, లేదా వక్రీకరించటం జరిగింది.

శంకరాచార్యుల కాలం గురించి కూడా, ఆయనచేత స్థాపించబడ్డ పీఠాలలో దృష్టాంతాలు వెతక్కుండా, ఏదో తలాతోకా లేని శ్లోకం ద్వారా ఊహించి,దాన్నే ప్రమాణం చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నాలు జరిగాయి.చేశారు కూడాను. ఇప్పుడు జనశ్రుతి ప్రకారం, క్రీ.పూ. జన్మించిన శంకరుడు క్రీ.శ. పదకొండవ శతాబ్దపు వ్యక్తి!!

మహాభారత కాలం గురించి, బుద్ధుడి కాలం గురించి, ఇంకా అగ్నివంశపు రాజుల గురించి, జంబూద్వీపం అంటే ఏమిటి? భరతవర్షం, భరతఖండం, తెలుగువారెవ్వరు, ఆర్యులెవ్వరు తదితర విషయాలపై కీ.శే.కోట వెంకటాచలం గారు కొన్ని గ్రంథాలు వ్రాశారు. మహాభారతంలోని సమయ సంబంధిత శ్లోకాలను అర్థసహితం తెలుపటమే కాక, ప్రత్యక్ష జ్యోతిష్య ప్రమాణాలను, సప్తర్షిమండలం ఏ రాశిలో ఉన్నది వంటి అనేక విషయాలను కూలంకషంగా ఆయన చర్చించారు. ఇంకా ఆంగ్ల చారిత్రకులు గ్రీకు గ్రంథాలలో ఉటంకింపబడ్డ జాండ్రేమ్సు,శాండ్రొకొట్టసు,శాండ్రోసిప్టసు ఎవరు? మౌర్యులకాలం ఎప్పటిది? వాటి ఆధారంగా నిర్ణయింపబడ్డ పొఱబాట్లను, ఆంగ్లచారిత్రకుల ఉటంకింపుల ద్వారనే ఆయన వెలికి తీసి ఋజువులు చూపించారు.

ఆర్య, ద్రవిడ సిద్ధాంతాలు వంటివి colonial consciousness కు ప్రతీకలుగా ఋజువులు దొరుకుతున్న ఈ రోజుల్లో ఓ సాధారణ పండితుడు వ్రాసిన గ్రంథాలు ఆయా ఋజువులకు దగ్గరగా ఉండటం పరిశీలించదగింది. ఇవి కొన్ని తెలుగులో ఉన్నవి. మహాభారతం, బుద్ధుడి కాలం గురించిన గ్రంథాలు ఆంగ్లంలోనూ DLI లో దొరుకుతున్నవి.భారతదేశ చరిత్ర మీద ఆసక్తి, ఇష్టం ఉన్నవారు తప్పక చదవవలసిన విషయాలివి.నిజమైన చరిత్ర బయటపడుతూ, అర్థం లేని సిద్ధాంతాలు ఊహాజనితమని ఋజువవుతున్న ఈ రోజుల్లో భారతదేశంలోని మారుమూల ఓ పండితుడు వ్రాసిన గ్రంథాలు నిజమైన చరిత్రకు దగ్గరగా ఉండటం గమనార్హం.

- అగ్నివంశపు రాజులు
- ఆంధ్రులెవరు?
- కలిశకవిజ్ఞానం
- Time of mahabhaarata
- Buddha's time
కోట వెంకటాచలం 
- సంస్కృత సారస్వత చరిత్ర

Tuesday, June 29, 2010

ఆత్మస్తుతి

కొరియా గాళ్ళకు, జపానోళ్ళకు మాయరోగమొకటుందట. కొంతకాలం (ఓ పాతికేళ్ళు వేసుకోండి) కోకాకోలా లాంటిదేదైనా వాళ్ళ దేశంలో స్థిరపడిపోతే, కోకాకోలా మాదనేస్తారట వాళ్ళు. అఫ్కోర్సు, మన పెద్దలూ, "అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష" అంటుంటారు. అయితే ఒక తేడా ఏటంటే, మన వాళ్ళు మన ప్రాచీనత్వాన్ని చూసుకుని మురిసి పోతే, ఆళ్ళు ఎవడిదాన్నో తమ సొంతం చేసుకుని మిడిసిపడుతుంటారు.

పై విషయం నాకు ఈ మధ్య కొన్ని సార్లు కొట్టొచ్చినట్టు కనిపించింది. మా కచేరీ ప్రధాన కార్యాలయం నుండీ ఓ అతిపెద్ద తలగాడొచ్చాడు మొన్నామధ్య. వాడు కఛేరీలో కొంతమందిని సభికులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ అవకాశం దక్కిన అరుదైన దురదృష్టవంతుల్లో నేనొకణ్ణి. మాటల మధ్యలో వాడు మేనేజిమెంటు గురించి మాట్లాడుతూ, స్వోత్కర్ష మొదలెట్టాడు. అదేదో కర్మ మేనేజిమెంటుట. అది నేర్చుకొమ్మని తను అందరికీ సలహాయిస్తుంటాడట. దాని గురించి అర్ధనిమీలిత నేత్రాలతో చెబుతూ అన్నాడు.

"మనం చేసిన పని ఫలితం గురించి ఆలోచించరాదు. అలాగని నిస్పృహ కూడా చెందరాదు. చేసే పని చేస్తూనే ఉండాలి...." వగైరా వగైరా. మధ్యలో చెప్పడం ఆపి రియాక్షన్ ఎలా ఉందో చూశాడు. ముత్యాలముగ్గులోలా కనబడేట్టు భజంత్రీలు మోగకపోయినా, సభికుల కళ్ళలో భక్తి, ఆసక్తి కనిపెట్టాడు. ఇంకాస్త ముందుకెళ్ళి, "కర్మ" అంటే ఏమిటో తెలుసా? అడిగాడు. I think it is Indian word..అన్నాడు ఏదో ఊహిస్తూ...ఇలా ఆ సెషను ముగిసింది. కర్మ గురించి భారతీయులకు నేర్పడం!! ఆహా!!! అనిపించింది నాకు.

జపానోళ్ళ ’చాయ్’ కథ కూడా అలాంటిదే. తేయాకు అరబ్బు దేశాల నుండీ వచ్చిందని చాలమందికి ఎఱుకే. అయితే అది మాదేనంటారు వీళ్ళు. అందుకో కథ కూడా. వేల యేళ్ళ క్రితం భారద్దేశం నుండీ బోధిధర్ముడనే బౌద్ధ భిక్కువొకతను చైనా, అక్కడ నుండి జపాను వెళ్ళాడట. అతను తన కనురెప్పలు రెండూ కత్తిరించేసుకుని ’చ’అనే ఓ కొండ మీద తపస్సు చేశాడుట. ఆ కత్తిరించిన కనురెప్పలు తేయాకులుగా మారినై. వాటితో ’చాయ్’కాచుకుని తాగేరట. అందుకే చాయ్ తాగితే నిద్దర రాదట. జపానులో టీ ఫెస్టివలు కూడా ఉంది. టీ ఎలా ఒంపాలో దానికి పద్ధతులున్నాయి. (చూడుడు: మెమోయిర్స్ ఆఫ్ గీషా)
 
కథ బావుంది కదూ!

బ్లూ ఓషన్ స్ట్రాటెజీ గురించి ఓ మారు ఓ సభకు కెళ్ళవలసి వచ్చింది నాకు. బ్లూ ఓషన్ అంటే, ఉన్న మార్కెట్ లో స్పర్ధలతో కొట్టుచు ఛావడం కాకుండా (అలా కొట్టుకు ఛావడం రెడ్ ఓషను కిందికి వస్తుంది) కొత్త మార్కెట్ సృష్టించుకోవడం. ఏపిల్ ఐఫోను, అదేదో బీరు కంపెనీ, భారతదేశంలో నీళ్ళు అమ్మడం ఇవన్నీ దానికి ఉదాహరణలు. ఈ స్ట్రాటెజీ గురించి పరిశోధించి సిద్ధాంతీకరించిన వాడు ఓ కొరియన్ అట. వాడి అనుంగు శిష్యులే వచ్చినవారు. అందులో ఒకడు చెబుతూ, ఈ స్ట్రాటెజీ భారతదేశంలోనే మొదలయ్యిందన్నాడు. డీటయిల్సు వాడికి తెలియదట, కానీ రఫ్ గా మౌర్య సామ్రాజ్యం అందుకు ఉదాహరణ అన్నట్టు ఓ క్లూ ఇచ్చాడు. నాకు తర్వాత ఊహిస్తే అనిపించింది. చాణక్యుడు దేశాన్ని సంఘటిత పరచి, భేదోపాయంతో నందులను నాశనం చేసి, యవనులనరికట్టడానికి మహాసమ్రాజ్యం స్థాపించడం ఓ బ్లూ ఓషన్ స్ట్రాటెజీ అని. ఏమో ఈ ఊహ కరెక్టో కాదో.

మరోసారి కొరియాలో ఓ బౌద్ధ మందిరమెళ్ళాను మిత్రులతో కలిసి. అక్కడ ఫుటోలు తీసుకుంటున్నాం మిత్రులం. కాసేపటికి అక్కడికి ఓ మధ్యవయసు యువతి దాదాపు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఫుటోలు తీయొద్దంది. మందిరం బయట తీసుకుంటామన్నా వద్దంది. (అప్పటికే ఫుటోలు తీశేశామనుకోండి) నేను కాస్త చొరవచేసి, మేము మీకు బుద్ధుణ్ణే ఇచ్చాం కదా, మాకు ఆయన ఫుటోలు కూడా మీరు తిరిగివ్వరా అని నవ్వుతూ అడిగేను. ఆవిడ కాస్త కోపంగా (అనుకుంటాను) వచ్చీ రాని భాషలో అంది. బుద్ధ - గాడ్, బుద్ధ - చైనా, నో ఇందో సరమ్....నో ఫోటో...రాంగ్...

అంతా మాదే అనే ఈ రోగం తెల్లదొరలకూ ఉంది కాబోలు. దీన్ని ముద్దుగా కొలోనియల్ కాన్షియస్ నెస్స్ అంటారని యేడాది క్రితం మలక్ పేట రౌడీ బ్లాగులో వచ్చిన సిరీస్ చదివితే తెలిసింది. వాళ్ళు వక్రీకరించిన చరిత్ర గురించి ఈ మధ్యే కొన్ని పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. వాటి గురించి మరెప్పుడైనా మాట్లాడుకుందాం.

Saturday, June 19, 2010

నా పద్య బ్లాగు

ఇంద్ర ధనుస్సు అనే నా పద్య బ్లాగు ఆరంభించి మూలన పెట్టాను చాలా రోజులుగా. దానిని పునరుద్ధరించాలని అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది. ప్రోత్సాహాన్ని బట్టి అందులో రాతలను కంటిన్యూ చేస్తాను.

లంకె ఇక్కడ.

Wednesday, June 16, 2010

బన్ జాయ్ (షాడో స్పై అడ్వెంచర్)

"వేళకు వస్తానన్న పెద్దమనిషి గంటైనా సిస్టం దగ్గర నుండీ లేవకపోతే కోపం వస్తుందా రాదా నువ్వే చెప్పు" కాకా అంగడి యజమానిని అడిగేడు గంగారాం. టూ టవును లో ఓ సినిమాహాలు వద్ద ఉన్న కాకా టిఫిన్ సెంటర్లో గంటన్నర నుండీ వెయిట్ చేస్తున్నాడతను. ఓ వారం రోజులుగా తల హూనమయేట్టు ప్రాజెక్టుపని చేసి, శుక్రవారం సాయంత్రం డెలివరీ చేసివస్తున్నాడు. డేమేజరుకు రిపోర్ట్ ఇచ్చేసి ఇదుగో ఇప్పుడే వచ్చేస్తానని, ఈవెనింగ్ షో కు తనకూ టికెట్లు తీసుంచమని చెప్పాడు ప్రాజెక్టు లీడరు షాడో తనకు.

ఏమీ సమాధానం చెప్పలేదు కాకా. అప్పటికే రెండు ప్లేట్ల పూరీకూర్మా, ఓ మూడు చాయ్ లు లాగించిన కస్టమరునెలా వదులుకుంటాడు?

"మరో చాయ్ తెప్పించమంటారా?" రాగయుక్తంగా అడిగాడు టీబంకు యజమాని.అడగడమే కాదు, పొగలు వెలువరిస్తున్న స్పెషల్ అల్లం టీని తనే స్వయంగా తీసుకొచ్చి గంగారాంకందించాడు.

ఆ టీతో బాటు బరో బన్నును లాగించి, త్రేనుస్తూ లేచాడు గంగారాం. బిల్లుకు మరో రెండునోట్లను కలిపి టీ బంకు యజమానికి అందించాడు. ముఖమంతా నవ్వులమయం అయిపోతుండగా, భక్తితో అందుకున్నాడు టీబంకు కాకా.

అలా చల్లగాలికి మరికాసేపు తిరిగి చీకట్లో ఓ మూల సందులో లఘుశంక తీర్చుకోవడం కోసం వెళ్ళాడు.

"అగ్గిపెట్టుందా బ్రదర్?" రెండు గొలుసులు ఒకదాన్నొకటి రాచుకుంటున్నట్టున ఓ గొంతు పక్కన వినబడింది గంగారాంకు. ఉలికిపాటును నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ పక్కకు చూశాడు. ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టు నిలబడి ఉన్నాడో ధృఢకాయుడు అక్కడ.

"లేదు" అంటూ పక్కకు జరిగి మెయిన్ రోడ్డుకు వెళ్ళబోయాడు.

"ఎక్కడికి బే?" అంటూ రఫ్ గా భుజం చరుస్తూ ముందుకు వచ్చారు మరో ఇద్దరు ధృఢకాయులు పక్కనుంచి.

లాగిపెట్టి వాళ్ళ ముఖం మీద చరిచి రోడ్డువైపు పరిగెత్తాడు గంగారాం. ఓ నాలుగడుగులు వేయగానే అతణ్ణి మరో నలుగురు ధృఢకాయులు కమ్ముకున్నారు. లాగిపెట్టి భుజం మీద తన్నాడు అందులో ఒకడు, గంగారాం ను.


అంతటితో సహనం నశించింది గంగారాంకు.

"ఈ గంగారాం మీదే చెయ్యి వేస్తార్రా, అమ్మా కలకత్తా కాళీ వీళ్ళందరినీ ఐదు నిముషాల్లో పడగొడితే నీకో వేటపుంజు బలి గ్యారంటీ" అంటూ వాళ్ళ మధ్య తిరుగుతూ, దొరికిన వాణ్ణి దొరికినట్టు విరగదీయడం ఆరంభించాడు. "ఫట్ ఫట్" మంటూ వినవస్తున్నాయి ధ్వనులు. సరిగ్గా ఐదు నిముషాల్లో గుంపును విరగదీసి పక్కకు వచ్చాడు. అప్పుడు సరిగ్గా, తల మీద బాణాకర్రతో దెబ్బ పడింది. వెనక్కి తిరిగి చూసే లోపల మరో దెబ్బపడింది. వెచ్చటి రక్తం బుగ్గలమీదుగా జాలువారింది. కళ్ళముందు నల్లటి పరదాలు క్రియేట్ అవుతుండగా, అలాగే వెనక్కి విరుచుకుపడిపోయేడు.

********

పిశాచం లాంటి ఆకారమొకటి తన గొంతు నులుముతున్నట్టు దారుణమైన కలగన్నాడు షాడో. శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు డెలివరీ ఇవ్వగానే, డేమేజరుకు చెప్పి తనూ బయల్దేరాలనుకున్నాడు. అంత తొందరగా ఇంటికి పంపుతే డామేజరెలా అవుతాడు?

"క్లయింటు వద్ద నుండీ సేనిటీ రిపోర్టు అందగానే వెళ్ళు" అంటూ వెకిలినవ్వులు చిందిస్తూ తనను అక్కడే నిలిపేశాడు డేమేజరు. దాంతో రాత్రంతా అక్కడే కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడ్డాడు తను. మాగన్నుగా నిద్రపట్టగానే కలగన్నాడు.

వాచీ శనివారం పొద్దున తొమ్మిది అని చూపిస్తోంది. విసుగ్గా లేచికూర్చుని బాత్ రూం వైపు అడుగులేశాడు. ముఖం కడుక్కుని, చాయ్ కలుపుకుని తన సీటు వద్దకు వచ్చి డేమేజరు కోసం ఎదురుచూడనారంభించాడు. ఓ గంటకు షాడో ఎదురుచూపులు ఫలించాయి.

డేమేజరు రాగానే, "ఇంతవరకూ ఏ సమస్యా లేదని", ఇక ఇంటికి వెళతానని అడిగాడు షాడో.

"ఇంకా పని ఉంది బే. రిపోర్టు పూర్తిగా వచ్చే వరకు ఇక్కడే ఉండు" క్రూరంగా నవ్వుతూ చెప్పాడు డేమేజరు.

"ఒక్క మూడు గంటలు సమయమివ్వండి. డెవలపర్ గంగారాం ఏమయ్యాడో, ఎక్కడున్నాడో చూసొస్తాను" వదలకుండా ప్రాధేయపడ్డాడు షాడో.

షాడో మాటలు వినబడనట్టు నటిస్తూ తన కేబిన్ వైపు అడుగు వేయబోతున్నాడు డేమేజరు. అంతటితో షాడో సహనం నశించింది. కంఠం నుండీ దారుణమైన కుంగ్ ఫూ షౌట్ వెలువరిస్తూ, ఫెడీ మని తన్నాడు డేమేజరు గుండెల మీద.

మామూలు వ్యక్తి అయితే ఓ పదడుగులు వెనక్కి విరుచుకు పడి ఉండేవాడు ఆ దెబ్బకు. డేమేజరు మాత్రం ఓ రెండడుగులు వెనక్కి వేసి నిలద్రొక్కుకున్నాడు. విచిత్రంగా నవ్వుతూ "నీ పై అధికారిని గౌరవించమని హెచ్చార్ వారు చెప్పిన నీతి సందేశాన్ని పెడచెవిన బెట్టావు. సాఫ్ట్ వేర్ పీఠం నియమాలను ఉల్లంఘించినందుకు నీకు తగిన శాస్తి చేస్తాను" అంటూ కంటికి కనిపించనంతవేగంతో చేయిని విసిరాడు షాడోమీదకు. రెండు చేతులూ అడ్డు పెట్టి ఆ దెబ్బ కాచుకున్నాడు షాడో. అయినప్పటికీ భుజానికి తగలనే తగిలింది. భుజం విరిగిపోయినట్టుగా ఫీలవుతూ పక్కకు జంప్ చేశాడు.

అవధులు మించిన ఆగ్రహంతో ముందుకు వచ్చాడు డేమేజర్. ముందుకు జరిగి ఫ్రంట్ కిక్ వెలువరించ బోయాడు. అక్కడే పాదం మెలికపడింది. డెస్క్ టాప్ ఎల్ సీడీమీద పడి తల బద్దలు కొట్టుకోకముందే పక్కకు లాగేశాడతణ్ణి షాడో. అతి ప్రయత్నం మీద భుజం మీద ఎత్తుకుని సోఫాలో కుదేశాడు.

డేమేజరు తిరిగి లేవకముందే వెనక్కి తిరిగి జంప్ చేసి మూడే మూడంగల్లో అక్కడ నుండీ అదృశ్యమయాడు.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


చటుక్కున మెలకువ వచ్చింది. పక్కనే బంజాయ్ - షాడో నవల సగం చదివినట్టి సగానికి మూసి ఉంది. పన్నెండింటికి ఆఫీసునుండీ వచ్చి పడుకుంటే రెండుకు నిద్రపట్టింది. ఇప్పుడు నాలుగ్గంటలయ్యింది. కాసిన్ని మంచినీళ్ళు తాగి మళ్ళీ ముసుగుతన్నాను.

Sunday, June 13, 2010

ఇంకొంచెం జపాను

హలో
నమస్తే

నమస్కార

వణక్కం

రాం రాం

కోన్నిచివా

పలుకరింపులెన్నైనా హృదయమొక్కటే. కోన్నిచివా అనేది జపనీసు భాషలో పలుకరింపు.


********************************************
*******************

బెంగళూరు వచ్చిన మొదటి రోజులు. పెన్ గర్ల్ ఫ్రెండు (ఇదివరకటి టపాలో ఆవిడ కాదు) ఓ రోజిలా అంది. "మీ బెంగళూరులో ---- బుద్ధ ట్రస్ట్ అని ఒక జపాను వారి మందిరం ఉంది. మీరక్కడికి నా మిత్రుడని చెప్పి వెళ్ళండి. మీకో జెన్ గురువు పరిచయం కాగలడు. అక్కడ ఉన్న వారి ద్వారా జపాను సంస్కృతి, సంప్రదాయాలు మీక్కాస్త తెలియవచ్చు".

సరే, అప్పుడు బ్రహ్మచారిని కాబట్టి ఓ శనివారం ఎగేసుకుంటూ బీటీఎమ్ లే అవుట్, విప్రో ఆఫీసు వెనుకవైపు అడ్రసు వెతుక్కుంటూ జపాను మందిరం చేరుకున్నాను.


అదో అపార్టుమెంటు!

తలుపు బజ్జర్ నొక్కగానే ఓ జపాను ఆంటీ వచ్చి తలుపు తీసింది. "?" ఇలా నా వైపు చూసింది. నేను ఫలానా అమ్మాయి ఫ్రెండునని ప్రవర చెప్పుకున్నాను. ఆమె "?", "!" గా మారింది. లోనికి ఆహ్వానించింది. అక్కడ సూటు బూటు వేసుకుని ఒకాయన సోఫాలో కూర్చుని ఉన్నాడు. ఆయన, ఈ ఆంటీ ఏదో మాట్లాడుకున్నారు. సూటుబూటాయన కూడా "!" తో, "దోజో, సువత్తే కుదాసాయ్ నే" (తిట్లు కాదండి- ఇంద, రండి కూర్చోండి- అని అర్థం) అంటూ నాకు స్వాగతం పలికేడు. ఆ సూటుబూటాయన్ను"ఈయనే గురూజి మకెయ్ సాన్" అంటూ ఆంటీ నాకు పరిచయం చేసింది. ఈ సారి "?+!" నా వంతైంది.

నిడుపాటి గడ్డం, జడలు కట్టిన జుత్తూ, దండకమండలాలూ - ఇవి లేకపోయినా మానె. ఓ కిమోనో తగలెట్టుకుని ఉండవచ్చు కదా జపనీసు గురువు అని నాకు అనిపించింది. అయితే ఆయన మాట, మంతీ మహా సున్నితంగా ఉన్నాయి. (Unlike the traditional zen masters!) పైపెచ్చు ఆయన అమాయకుడిలా కనబడ్డాడు నాకు. (ఎందుకో మీకు తెలుస్తుంది)


కాసేపు తర్వాత అందరూ నార్మల్ స్టేట్ కొచ్చాము. ఆ గది పరికించి చూస్తే - ఎదురుగా ఓ పెద్ద బల్లపై బుద్ధుడి ప్రతిమ, దానికింద అగరొత్తులూ, బిస్కెట్లు, కుకీస్ వంటి ప్రసాదాలు, పూలు -ఏదో పూజ జరిగినట్టు సూచిస్తున్నాయి. ఓ మూల నిలువెత్తు గుఱ్ఱం బొమ్మ, మరో మూల పిల్లి బొమ్మ, కుండీలలో చెట్లు (బోన్సాయ్) అనుకుంటాను.అలా ఉంది. ఇంతలో ఆ జపాన్ ఆంటీ టీ, బిస్కట్లు తెచ్చి పెట్టింది. ఆ టీ - కషాయానికి చెల్లి మన టీ కి అక్క. టీ తో బాటు బిస్కట్లు ఎందుకు పెడతారో నాకు తెలిచి వచ్చిన క్షణమది. కాసేపు మాట్లాడిన తర్వాత ఆవిడ ఇదుగో ప్రసాదం అంటూ దాదాపు పావుకిలో పరిమాణంలో రెండు తగరపు పాకేజీలిచ్చింది. బయటపడి హాస్టలుకొచ్చి, ఆ పాకేజీలిప్పాను. అందులో - కమ్మటి పులిహోర, చక్కెరపొంగలి! అవి వారికెలా దొరికాయి, అదీ అని వచ్చిన ఆలోచనను, వాటి పరిమళాలు మింగేసినయ్. రూము గడివేసి, ఒక్కణ్ణె ఆ రెండు డబ్బాలూ లాగించేను. (ఇలాంటివి దొరికినప్పుడు హాస్టల్లో గడి వేసుకుని తినడం స్ట్రిక్టుగా నేను పాటించే ఓ నియమం).


తర్వాతి వారం.

జపనీసు ’సంప్రదాయాన్ని’ ఇంకా తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాను. ఈ సారి తలుపు ఓ అమ్మాయి తీసింది. ఆ అమ్మాయి అచ్చం ఇలా ఉంది.


ఈ సారి, "?", "!", ఇవేవీ నన్ను బాధించలేదు. లాస్ట్ సమురాయ్ సినిమాలో ఓ పిల్లవాడు టామ్ క్రూయిస్ తో "నువ్వు బుద్ధి ఉపయోగించి యుద్ధం చేస్తున్నావు. ఏవీ ఆలోచించక యుద్ధం చెయ్" అంటాడు. (అశొచ్యానన్వశోచస్త్వం ..టైపు). జెన్ ప్రిన్సిపుల్ అది. నేనూ ఆ అమ్మాయిని చూసి నేను ఓ క్షణం ఏవీ ఆలోచించలేదు.

తేరుకున్నాక అమ్మాయికి నేను ఇందాకటి ప్రవర చెప్పుకున్నాను. ఆమె చిన్నికళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయాయి. నన్ను ఆమె నవ్వుతూ ఆహ్వానించింది.ఆమెకు నేను ఇదివరకే నా పెన్ ఫ్రెండు ద్వారా తెలుసట. ఎంచేతో ఆ అమ్మాయి తెగ ఆశ్చర్యపడిపోతున్నట్టు అనిపించింది నాకు. మాటిమాటికి జపాను పద్ధతిలో దణ్ణం పెడుతూ ఉందామె. అలా ఎందుకు దణ్ణం పెడుతున్నావని అడిగేశానామెను. అది దణ్ణం కాదని, వినయమని, కుడి చేయి పిడికిలి, ఎడమ అరచేతిలో బిగించే ముద్ర, కడుపులో పాపాయిని సూచిస్తుందనీ - ఇలా ఏవో చెప్పిందా అమ్మాయి. ఈ సారి ఆంటీని, గురూజీని నేనెక్కువగా మాట్లాడించలేదు. వారు ఏదో పనుల్లో ఉండి అంతగా పట్టించుకోలేదు. టీ, బిస్కట్లు మామూలే. ఈ సారి జపాను ’సంప్రదాయం’ దొరకలేదు.


******************************************** **********************

నా రూములో ఏదో గూడుపుఠానీ జరుగుతున్నట్టు హాస్టల్లో ఒకరిద్దరు కనిబెట్టారు. దాంతో విషయం కొంత బయటకు పొక్కింది. తర్వాతి వారం నేను, పక్క రూమువాడు వాడి బండిలో బయల్దేరాము. అక్కడికెళ్ళిన తర్వాత మరో ముగ్గురు చేరారు. నేను సైన్యాధ్యక్షుడిలా కోటవైపు అడుగుపెట్టాను.

ఈ సారి మళ్ళీ ఆంటీ. నా ఫేసు ( @_@ ) లా అయ్యింది. cherry blossoms కోసం నా కళ్ళు గాలించేయ్. దొరకలేదు. ఊరెళ్ళిందట ఆ అమ్మాయి, నాతో మాటవరసకైనా చెప్పకుండా. ఇంతలో ఓ బృందం వచ్చిందక్కడికి. అందరూ హడావుడిగా ఓ ఫంక్షన్ కోసం ప్రిపేరు అవసాగారు.
ఆ రోజో జపాను పండుగట.

ఆంటీ అక్కడ చేరిన వారితో ఒక్కొక్కరితో నూరు రూపాయలు (నాతో ఐదొందలు, నా మిత్రులందరివీ కలిపి) ఇప్పించుకుంది. మకెయ్ సాన్ వచ్చారు. మమ్మల్నందరిని వరుసలలో నిలబెట్టారు. ఏవో మంత్రాలు చదువసాగారు మకెయ్ సాన్. ఆయన పక్క ఓ ఇండియన్ అమ్మాయి, ఆయన ఆజ్ఞల ప్రకారం మమ్మల్ను అప్పుడప్పుడూ నేలపై సాగిలపడమని, పంచప్రతిష్టితం (kneel down) చేయమని అంటూంది. మా ఫ్రెండ్సందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ ప్రహసనం ముగియగానే ఆవిడ - "మీరందరు ఇక నిర్వాణానికి (enlightenment) అర్హులు. అభినందనలు" అంటూ విశాలంగా నవ్వింది. ఇంకో ముక్క చెప్పింది. జీవితంలో ఏదైనా కొట్టుకుపోయే సమస్య వచ్చినప్పుడు, "మితాయ్ బుత్సు మొరొకొ" అనుకోవాలిట. అప్పుడా సమస్య సమిసిపోతుందట. అయితే ఈ ఆఫర్ ను జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవాలిట.

(నేను ఓ పదిహేను సార్లు ఆ మంత్రం వాడుకున్నానని లీలగా గుర్తు. ఓ సీక్రెట్ కూడా తెలిసింది. ఆ మంత్రం ఒక్కసారికంటే ఎక్కువసార్లు కూడా పనిచేస్తుంది!)


అయితే ఆ జపనీసు ’సంస్కృతి’,’సంప్రదాయాల’ వల్ల మా హాస్టల్లో నాకు ఏదీ ఒరగకపోగా, నన్ను చూసి కొన్ని రోజులు నవ్వుకున్నారు.
ఆ తర్వాత నాకు ఆ విషయాలపై ఆసక్తి తగ్గిపోయింది.

Wednesday, June 9, 2010

కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ

మొన్నామధ్య బీహారీ బాసురుడు కంపెనీకెవడో హెడ్డాపీసు నుండి వస్తే, వాడితో నానాబాధలు పడి "యే క్యా హరాకిరీ హై" అంటూ వాపోయాడు. హరాకిరీ - ఆ మాట వినగానే ఒకప్పుడు నేను వెలగబెట్టిన జపనీసు గుర్తొచ్చింది.

"హరాకిరీ" అనేది జపనీసు మాట. హరా అంటే బొడ్డు (navel), ఇంకో అర్థం పువ్వు. కిరిమాసు అంటే కత్తిరించటం, కోయటం లేదా పొడవటం. జపనీసు క్రియాపదాలన్నీ విడిగా అయితే మాసుగా ’మాసు’తో ముగుస్తాయి. మనకు ’ట’ తో ముగుస్తాయిగా అలాగన్నమాట. (ఉదా: లేయుట, మింగుట, పరుండుట ) జపనీసులో అయితే, ’ఇకిమాసు, కిమాసు, హజిమెమాసు ఇలా. నామవాచకంతో కలిసినప్పుడు మాసు లుప్తమవుతుంది.

ఈ హరాకిరీ అన్నమాట ఎలా వచ్చిందంటే సమురాయ్ ల గురించి తెలియాలి. సమురాయిలు జపాను యోధులని మనకు తెలుసు. ఈ రాలుగాయిలు యుద్ధంలో ఓడిపోతే, ఏదో ఓడాంలే అని ఊరుకోక, ఫీలయిపోయి, తమ షోగన్నులతో (షోగన్ను అంటే షో గన్ను కాదు, పొడుగాటి కత్తి. సుజుకి షోగన్ అనేదదే) తమే పొడుచుకు ఛస్తారు. అదియొక చమత్కారము! బతికుంటే బలుసాకు తినచ్చులే అనుకోక ఇలా ఛావడమేమిటో మరి. వెధవ ఫిలాసఫీలు, వెధవ పీడ!

పై విషయం మనం ’లాస్ట్ సమురాయ్’ సినిమాలో చూస్తాం(శాం). ఆ చచ్చే ప్రాసెస్ పేరు ఈ హరాకిరీ. ఈ పదం ఇంత దూరం వచ్చి, మన దేశంలో ఎలా తిష్టవేసుక్కూచుందో తెలిసి ఛావట్లేదు. ఇలాంటిదే మరొక మాట, కిరికిరి. దీనర్థమేంటో, దీని వెనక యే కథుందో ఏమో నాకు తెలీదు.

వాళ్ళమాట మనకు వచ్చి చేరినట్టు, మన మాటొకటి అక్కడ చేరుకుంది. అది ’సేవ’. అవును సేవ అనేపదం, జపాను భాష (నిహోంగొ) లో అదే అర్థంలో ఉన్నది. ఇప్పుడు ఆ పదాన్ని వాక్యంలో ప్రయోగించి మీ సహనాన్ని కొద్దిగా పరీక్షిస్తాను, ఏమనుకోకండి.

"ఇరోఇరోయిన ఓ-సేవాని నరిమాషిత. అరిగతో గొజైమాసు" (రకరకాల సేవలను పొందాను.కృతజ్ఞతలు).

మీరు కాస్త పట్టిచూస్తే ఇరోఇరోయి=రకరకాల ఒకేరకంగా ఉన్నాయని గ్రహిస్తారు. చెప్పొచ్చేదేమంటే, వాళ్ళభాష structure తెలుగుకు కాస్త దగ్గర.

లాస్ట్ సమురాయ్ సినిమా గురించి కాస్త మాట్లాడుకుందాం. అందులో టామ్ క్రూయిసు గాడు యుద్ధంలో గాయపడి జపానోళ్ళ ఇంట్లో వచ్చి పడతాడు, తంతే బూరెలగంపలో పడ్డట్టు. వాడికి తను పూర్వాశ్రమంలో రెడ్ ఇండియన్ పిల్లవాణ్ణొకణ్ణి చంపినట్టు గుర్తొస్తూ ఉంటుంది. ఆ చచ్చిన పిల్లాడి పేరు సాకే. టామ్ క్రూయిస్ సాకే, సాకే అని పలవరిస్తుంటాడు. సాకే అంటే జపనీసులో వరితో చేసిన సారాయం. వీడి కలవరింతను అక్కడవాళ్ళు అలా ఇంటర్ ప్రెట్ చేసుకుని వాడికి సారా తెచ్చి పోస్తుంటారు.

ఆ సాకేను కొరియాలో సోజు గా పిలుస్తారు. నేను దాన్ని ఓ గుటక వేశాను. బాగా వేడిచేసిన ఓ చిన్న నిప్పుగోళాన్ని మింగినట్టు అనిపించింది. కంపు వాసన దాని అడిషనల్ క్వాలిటీ.

ఆ సాకే తయారు చేసే వారు పురాతన జపానులో ఓ పల్లె వద్ద నివసించేవారు. ఆ పల్లె ఇప్పుడో పెద్ద పట్టణం. దానిపేరు ఒసాకా. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒకాయన, 1947 లో ఓ సంస్థ నెలకొల్పాడు. అదే ఇప్పటి సోనీ.

జపాను వారి పేర్లన్నీ ప్రకృతికి సంబంధించినవై ఉంటాయి. నాకో పెన్ గర్ల్ ఫ్రెండు ఉండేది. ఆ అమ్మాయి పేరు చిహారు అని ఏదో వస్తుంది. దానర్థం - వేయి వసంతాలు అనట. ఆమే చెప్పింది.

ఇంతకూ టైటిలు సంగతేమంటారా? అదేమంటే - జపాను వారి ఓ క్యాండీ ఉంది. చాక్పీసులా ఉంటుంది. దాన్ని ఏ భాగంలో అడ్డుగా కోసినా, కనబడే గుండ్రటి తలంలో, మనిషి ముఖం ఉంటుంది. కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ అంటే, ఎక్కడ కోసినా, ఒకే ముఖం అని. (కెవొ - ముఖం, కిత్తెమొ - కోసినా). ఈ మధ్య ఓ జపానెళ్ళిన ఫ్రెండొకడు ఆ క్యాండీ తెచ్చాడు. అది చూడగానే దానికి సంబంధించిన కథ, ఏదో చదివినట్టు లీలగా అనిపించింది. ఇదుగో ఇప్పుడు గుర్తొచ్చిందది.

ఇప్పుడో మణిప్రవాళ కందం. (బొత్తిగా సంకరం అంటే బావుండదు, అందుకని ఆ పేరు)

లత్తుక జపాను భాషను
’కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ’ అని అంటే
కత్తెర వేసిన చోటుల
తిత్తెరి! కనబడిన ముఖమె తిరిగి కనపడే.

లత్తుక జపాను ఎందుకంటే ఎర్రని సూర్యుడి చిహ్నం కాబట్టి.

అన్నట్టు జపనీసులో అమ్మానాన్నలను ’చిచి’, ’హహ’ అంటారు. తల్లిగారు, తండ్రిగార్లను ’ఒకాసాన్’, ’ఒతోసాన్’ అంటారు.

జపాను వార్తలు ఇప్పటికి సమాప్తం. ఇంకొన్ని మళ్ళీ ఎప్పుడైనా.
ఒ యాసుమి నాసాయ్. (ఇదేదో నాశనమైపో అన్న తిట్టు కాదండి. ప్యూర్ ట్రాన్సిలేషన్- సుఖ నిద్రాప్రాప్తిరస్తు)
సయోనర.