Sunday, August 25, 2013

The conjuring అను పిశాచప్రకరణము


భయము అనగానేమి? భయమనగా ఉద్వేగకారకచిత్తవికల్పము. కొందరికి నల్లి యన్న భయము. మరికొందరికి బల్లియన్న భయము. ఇంకొందరికి బొద్దింకను జూచిన యొడలు గంపించును. మా ఊరియందు నొకఁడు గలడు. వానికి నీరనిన భయము. మానవుల చిత్తములు బలు విధములు. ఒక కవి "బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను" అని నుడివెను.(ఈ రోజే బహుళపంచమి) వెన్నెలకు భయపడువాడు కవి యేనా? కావచ్చును, కాకపోవచ్చును. అదియొక చమత్కారము.

భయములు సాధారణములు, విపరీతములు అని రెండు తెరఁగులు. దయ్యములన్న సాధారణముగ నందరికీ భయము. మన కావ్యములలో భయానక రసమున్నది. ఈ భయానక రసమును తెరపై జూపించుచూ అనేకులు చలన చిత్రములు నిర్మించిరి. ఈ మధ్యకాలమున అట్టి యొకానొక చలనచిత్రము "The Conjuring" అనునది.

ఈ చలనచిత్రమున దెయ్యములు గలవు. కొందరు దయ్యములు లేవందురు. దైవమున్నదని నమ్మిన దయ్యమున్నదని యేల నమ్మరాదు? ఇది మానవుని స్వభావదోషము. ఈ చిత్రమునందు దయ్యముల స్వభావములనూ జక్కగా జూపించిరి. మొదట భయపెట్టును. పిమ్మట లోబర్చుకొనును, అటపై ఆవేశించును. ఇట్లు దయ్యము మూడు వంతులుగా మానవుని స్వాధీనపరచుకొనును. దీనినే ఈ చలన చిత్రమున ఎడ్ అనువాడు జెప్పెను. ఈ చలన చిత్ర ఇతివృత్తమిట్లున్నది.

అమెరికాలో ఫ్లోరిడా అను నొకచోట నొకఁడు నొకానొక బెద్ద భవంతిని కొనును. అచ్చటికి సంసారమును తరలించును. మన సాంప్రదాయమున యిల్లు జేరునపుడు శాంతి హోమము నెరపుట యాచారము. మ్లేచ్ఛులకట్టి యాచారములు లేవు.  ఆచారములన్నియునూ వ్యర్థములని కొందరందురు. అదియే మ్లేచ్ఛనాగరకత. అన్నియునూ తెలియవలనన్న దురాశ ఈ భావమునకు మూలము. కొన్ని విషయములుండును. వాని సారములెరుగవలసిన బని అందరకునూ లేదు. సమాజమున నందరి బుద్ధి స్థాయీభావములొక్క తెరగున నుండదు. అది సృష్టి. కర్మగత భావసారము ఆచరణతో ముడివడియున్నది. ఆచరించుచూ పోయిన యెడల ఒకనాటికి ఆతని సంస్కారశుద్ధిజనితబుద్ధ్యధికృతమై ఆ సాధనాఫలముగా యాచారముల యాంతర్యమవగతము గావచ్చును.

(సొల్లుతో శాఖాచంక్రమణము గావించితిని, ఇక మిమ్ములను బాధపెట్టక కథకు పోవుదును.)

యాతనికి భార్య, ఐదుగురు ఆడపిల్లలు. ఆ భవనమున అంతకు పూర్వము పెక్కు దుర్ఘటనలు జరిగి యుండును. ఆ దుర్ఘటనలలో గతించిన వారలందరు దయ్యములై తిరుగుచుందురు. ఆ భవనమున జేరిన నాట నుండి ఆ కుటుంబమునకు ఈతి బాధలు మొదలగును.

అంతియగాక ఆ భవనమునందు కరవునందు యధికమాసమన్నట్టు అనేకగదులకు తోడుగా  అనేక నేలమాళిగలుండును. దయ్యములా నేలమాళిగలందు నివసించుచూ రాత్రులయందు తలుపులను తాడించుచు యుండును. మరియొకటున్నది. ఆ ఇంట గడియారములన్నియునూ 3:07 గంటలకు నిలిచిపోవుచుండును. అందులో మర్మమేమి? మూడు అనగా నది తండ్రి, యేసువు, పవిత్రభూతము (holy ghost)నకు సంకేతములు. మన సాంప్రదాయమున త్రిమూర్తులు గలరు. ముజ్జగములున్నవి. మరి మ్లేచ్ఛులకు పొంతనలేని మూడిఁటి విషయసంగమమున్నది. యదియే సత్సాంప్రదాయమునకూ, మ్లేచ్ఛ సాంప్రదాయమునకూ భేదము. అది యట్లుండె. 07 సంగతి దర్శకుడు జెప్పలేదు. మరచెనేమో?

ఈ దయ్యపుకొంపలో ఆ దంపతులన్యోన్యముగా కష్టసుఖములనే గాక భయమునూ "సమానము"గా పంచుకుని గాపురము సాగించుచుండిరి. (సమానత్వము?!? ......వద్దు. ఈ విషయముపై ప్రస్తుతము మౌనము వహించెద)

క్రమముగా ఆ ఇల్లాలికి దేహముపై గాయములు కలుగును. పిల్లలకు యెడనెడ భయోత్పన్నమైన దృశ్యములగుపించుచుండును. దరిద్రమునకు యాకలి తోడన్నట్టుగా వారు క్రైస్తవులైననూ మతాచారములను బాటింపరు. చర్చికి వెళ్ళుట వారి యింటి సాంప్రదాయము గాదు. ఇంకేమున్నది. పిశాచరాజములకు కళ్ళెములు విడచినట్లైనది. అవి విశృంఖలముగా తమ కార్యకలాపములు సాగించును. ఈ కార్యకలాపములు ముందు జెప్పినట్టు మూడు తెరగులు.

అన్ని దెయ్యపు సినిమాల వలెనే ఈ సినిమాయందు దెయ్యములను పారద్రోలు వారలున్నారు. వారలు కూడా దంపతులే. ఆ దంపతులలో నిల్లాలికి దయ్యములను జూచు, తత్సంబంధిత శబ్దములను గ్రహింపగల, తదధికృత దుర్గంధములను మూర్కొనగల అతీంద్రియశక్తులుండును. ఆ దంపతులొకమారు దయ్యముల గురించి ప్రసంగించుచుండగా, మన దయ్యపు కుటుంబపు యిల్లాలు వారిని గలసి తమ యింటికి యాహ్వానించును. వారలందులకంగీకరించి ఈ ఇంటియందడుగు పెట్టుదురు.

వారికినీ దెయ్యములకునూ జరిగిన యాధిపత్యపు బోరున నెవరు గెల్చిరి అనునది వెండి తెరపై జూడవచ్చును.

ఈ చలనచిత్రమునందు భయానకరసము అంగి. గుణీభూతముగా గొంత హాస్యమున్నది. దెయ్యములకు యాటలపై ఆసక్తి యుండును. "వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?" అను కళ్ళకు గంతలు కట్టుకొను యాట మనకు అనూచానముగా గలదు. ఆంగ్లేయులకు "hide and claps" అను యాట గలదు. ఆశ్చర్యమేమి? భారతీయమైన సాంప్రదాయములు జగద్విస్తృతములు గదా! అప్పుడప్పుడూ దెయ్యములూ ఆ యాట యాడును.

తెలుగు చలన చిత్రములలో చివరి దృశ్యమున పోలీసులు యరుదెంచుట గలదు. ఈ చిత్రముననూ, చివరన వాటికన్ అధికారులు ఆ యింటిని దెయ్యముల బారినుండి వదలించుటకు అనుమతి నొసగుట గలదు. ఆంగ్లేయుల హాస్యరసపోషణములట్లుండును.

దెయ్యములన్న భయమున్న వారికి, అనగా భయానకరసార్ద్రైకచిత్తులకు, పిశాచవిషయసంగ్రహపరివిష్టులకూ ఈ చలనచిత్రమునందు గావలసినయంత సరుకున్నది. మ్లేచ్ఛ దెయ్యములగురించిన సాంకేతిక సమాచారమిందు సరిపడినంత యున్నది. ఈ చిత్రకథ నిజముగా జరిగినదట.

యేది యేమైననూ, ప్రస్తుతము తెలుగునాట వచ్చు పేలవమైన చిత్రములను బోల్చినచో, ఈ చిత్రమున దెయ్యములే మేలనిపించును. తొడలు చరిచెడు నాయకులకన్న తలుపులు బాదు దెయ్యములెంతియో మేలు. తక్కిన సాంకేతికవిషయములన్నియునూ అద్భుతముగ సమకూరినవి. ఈ చలనచిత్రరాజమును యభిరుచిగల ప్రేక్షకులు జూచి యానందిం....క్షమించుము, మిక్కుటముగ భయమందుదురు గాక.