Thursday, February 7, 2013

పాండిత్యం = జ్ఞానాభాస


ఆధ్యాత్మికప్రపంచంలో - ఎంచేతనో తెలియదు కానీ కొన్ని శబ్దాలను నిర్వచించి, వాటి గురించి నిర్దుష్టమైన అర్థంలో ఉపయోగించి మనవాళ్ళు తప్పు చేశారా అనిపిస్తుందొక్కొక్కసారి. అటువంటివాటిలో రెండు శబ్దాలు - జ్ఞానం, ఆత్మ.

జ్ఞానం - అని దేన్నయితో ఆధ్యాత్మికవాదులు అంటున్నారో అది నిజానికి తెలియదగింది కాదు. అంటే బుద్ధితో , మెదడు అనే పరికరంతో అంచనా వేయవలసినది కాదు. బుద్ధి చేత తెలియదగింది సమాచారం. ద్వంద్వాలకు లోబడినది మాత్రమే సమాచారం వల్ల తెలియదగింది. భావనాత్మక ప్రపంచం సంగతి వేరు. ఉదాహరణకు దుఃఖం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం - ఒక సమాచారం వల్ల తెలిసేది కాదు. ఒకవేళ అది సమాచారమే అయితే ఆ సమాచారాన్ని , అది ఎంత పెద్దదయినా సరే తెలుసుకుని దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. అలా జరగడం లేదే. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని తీసిస్ లు చదివినా మనిషికి దుఃఖం అన్నది పోవట్లేదు. ఏదో కొద్దో గొప్పో కొంతకాలం పోతుంది, మళ్ళీ వచ్చి తగులుకుంటూ ఉంది. ఆ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం కావాలంటే - కనుక్కోగలిగే  జవాబు ప్రశ్నకు బాహ్యమైనది అవకూడదు. అంటే ఆ ప్రశ్నకు సమాధానం - దుఃఖం అంటే ఎమిటి? ఆ ప్రశ్న అంతరించడంలోనే ఉంది తప్ప మరొక విధమైన ప్రక్రియలో లేదు.

ప్రశ్న అంతరించడమంటే ఏమిటి? బుద్ధి లేదా మెదడు జవాబు కోసం వెంపర్లాడకండా మూలమట్టంగా తనలో తానే annihilate కావడం. అంటే మెదడు తను నిర్వర్తించే వ్యాపారాలను తనే ఏ విధమైన choice లేకుండా గమనించే ఒక స్థితి. ఆ స్థితిలో దుఃఖం అన్నది ఉండకపోవచ్చు.

ఈ స్థితి ఒక మనిషిలో స్వతఃసిద్ధంగా ఏర్పడగలిగితే అది నిర్వాణం అని బుద్ధుడి నిర్వచనం. ఆ స్థితిలో మనిషికి , ప్రపంచానికి భేదభావం కనిపించదట. చూచేవాడు, చూడబడేది, చూచుట అన్నీ నశించి, జగత్తు అణువణువునా తనూ, తనలో జగత్తూ స్పష్టంగా కనిపిస్తూ, ఏ విధమైన ద్వంద్వమూ ఏర్పడని దశ. ఆ వాక్యంలో - స్వతఃసిద్ధంగా - అన్నది ఎందుకంటే - ప్రయత్నపూర్వకంగా మెదడు వ్యాపారాలను గమనించడం అసంబద్ధం. ఎందుకంటే - ఆ ప్రయత్నం అన్నది బుద్ధిలో అంతర్భాగం కాబట్టి.  కానీ ధ్యానం మొదలు పెట్టాలంటే ఎక్కడో ప్రయత్నం తప్పనిసరి. అదే ఆ ప్రయత్నమే ఆ తర్వాత ప్రయత్నరహితమైన ’అలవాటు’ గా మారవచ్చు. బుద్ధిని ఏ మాత్రం వికల్పాలకు తావివ్వనీయకుండా అలా శాంతంగా కూర్చుని దాని తాలూకు వ్యవహారాలను గమనించడం చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పని పేరు విపశ్యన. (విశేషంగా చూచుట). ఇలా గమనిస్తూ ఉంటే కొంతకాలానికి ఆలోచనలు స్థంభించి, ఆ పని తనంతట తానే జరగడం మొదలు అవుతుంది. దాన్నే ధ్యానం అన్నారు. ఈ ఆలోచనలు స్థంభించి, ఆలోచనల మధ్య ఖాళీలు ఏర్పడే దశను ’సతోరి’ అని జెన్ బౌద్ధులు అన్నారు. అ సతోరి ముదిరితే సమాధి అవుతుందని వాళ్ళంటారు.

ఈ వ్యవహారాన్ని అట్నుంచి నరుక్కొస్తే - దుఃఖం ఎందుకు వస్తుంది? అంటే కోరిక వల్ల అని బుద్ధుడు. (అష్టావక్రుడు కూడా) కోరిక తీరితే - ఓస్ ఇంతేనా అని దుఃఖం, తీరకపోతే తీరి ఛావలేదని దుఃఖం. కోరిక అన్నది ఎలా కలుగుతూంది? ఎంపిక (choice) వల్ల. నాకు సంతోషమే కావాలి. సుఖమే కావాలి, సెక్యూరిటీయే కావాలి, బాధలొద్దు, తనకలాట వద్దు అన్న బుద్ధి తాలూకు ప్రేరణ వల్ల. అలాగని కోరికలను చంపేసుకునో, వైరాగ్యపు పాటలు వినో వైరాగ్యం కొని తెచ్చుకుంటే - అది భారం అవుతుందే తప్ప అందువల్ల root cause సమిసిపోదు. ఈ choice - బుద్ధి వల్ల కలుగుతా ఉంది. బుద్ధికి ఇలా జీవితంలో ప్రతీక్షణం ఒక choice కోసం వెంపర్లాడే ప్రవృత్తి ఎలా వచ్చింది అంటే దాని లక్షణమే అంత. దాని స్వభావమే అలాంటిది. ఆ స్వభావాన్ని దాటి ఆవల ఏముందో తెలుసుకోవాలంటే - choice-less awareness కావాలి. అదే ఇందాకటి విపశ్యన. ఆ విపశ్యనకు అంతిమప్రస్థానమే బుద్ధాదులు పొందిన సమాధి. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి అన్న ఆధునిక బుద్ధుడు Mutation of brain cells అన్నాడు.

సరే మనం మామూలు మనుషులం. అలాంటి స్థితి పొందలేం. ఊరికే మాట్లాడుకుని అలాటిదొకటుందని ఫిక్స్ అవచ్చు. అయితే ఇక్కడ చర్చ ఆ స్థితి ఎలా కొనితెచ్చుకోవడం అని కాదు. ’జ్ఞానం’ అనే ఒక పదం గురించి.

ఇందాకటి స్థితి - అనుభవానికి మాత్రమే లోబడగలిగినది. అది సమాచారం కాదు - అంటే సమాచారం ద్వారా తెలిసే వాస్తవం కాదు. That is not a knowable entity. అంటే - Unknowable cannot be known. It will be only realized as - unknowable, after mind annihilates itself by getting out from the realms of known and unknown. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి ’సత్యం’ గా ప్రవచించాడు. ఇందాక అన్నట్లు ఇది స్పష్టంగా ఇతమిత్థమని చెప్పలేనిది, కానీ సూచించగలిగేది మాత్రమే. అది ఒక ఆలోచనలకు ’అభావ’ మైన స్థితి. అంటే శూన్యస్థితి.

పరిస్థితి ఇలా ఉంటే జ్ఞానం అన్నదాన్ని - సమాచారం అన్న అర్థంలో చెప్పడం వల్ల - పండితులు జ్ఞానులై కూర్చునే ఒక పరిస్థితి ఏర్పడింది. జ్ఞానం అంటే తెలియదగింది అని నిర్వచనం చెప్పారు కాబట్టి తెలియదగిందంటే ఏదో ఒకటుండాలి కాబట్టి భగవంతుడు అన్న object వచ్చి చేరింది. భగవంతుడంటే? - ఇల్లా తెల్లబట్టలు చుట్టుకుంటాడు, ఇలా నడుస్తాడు, అలా ఆలోచిస్తాడు. ఎక్కడో ఉంటాడు, వాడికి కోపం వస్తుంది. వాడు పిల్లవాడిలా ప్రవర్తిస్తాడు. వాడికి లడ్డూ ఇష్టం వగైరా వగైరా వగైరా. ఇందువల్ల జ్ఞానం అనేది ఎందుకు కావాలో అన్న ప్రశ్న నశించింది. మొత్తం వ్యవహారం పక్కదారి పట్టింది. పండితులు బయలు దేరారు. వారికి అనుసరణీయులు తయారయ్యారు.

ఈ జ్ఞానం మెల్లగా చాప కింద నీరులా ’మతం’ క్రిందికి చేరింది. ఏదో చాలా నిగూఢమైనది, కష్టపడి అర్థం చేసుకోగలిగినది, ’సంస్కృత’ భాషలో ఉన్నది అయిన ’సమాచారం’ మన మహర్షులు మనకు ఇచ్చి పోయారు. అది తెలుసుకుంటే మనం జ్ఞానులు అవుతాం. అది తెలియని వాడు అజ్ఞాని. అది ఒక ముక్క తెలిసి, అంతా తెలిసినట్టు మాట్లాడే వాడు కూడా జ్ఞానమార్గంలో ఉన్నాడు కాబట్టి ఏ మాత్రం తక్కువ తినలేదు. వాడి గురించి మాట్లాడ్డమా? అమ్మో? - తప్పు కదూ? ఈ భావాలు మనలో రక్తంలో, అణువణువునా ఇంకి పోయాయి.

ఇక్కడ ఒక విషయం. ఈ మాట్లాడుతున్నదంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో అని గుర్తు చేస్తున్నాను. లౌకికం వేరు, ఆధ్యాత్మికం వేరు. లౌకికంగా ఆలోచిస్తే - వైద్య విద్య (లేదా జ్యోతిషం/నిరుక్తం, వ్యాకరణం ఏదైనా) అని ఒకటుందనుకుందాం. లౌకికంగా ఆ విద్యను ఎవరో అందించిపోయారు కనుక వారి మార్గాన ప్రయాణించడం అవసరం. ఆ విద్యకు రూపకర్తలను గుర్తించడం ఒక విధి. ఆ విద్య బుద్ధి పరిధికి చెందినది కాబట్టి బుద్ధితో సమగ్రంగా తెలియదగింది కాబట్టి అక్కడ విద్యను, కర్తలను ఆరాధించడం మానసిక అవసరం. అలాగే దైవభక్తి. దేవుడున్నాడా అన్న శంక ఒకపక్క పీడిస్తున్నా, దైవభక్తి మాత్రం - మనిషికి మానసిక అవసరం. దేవుణ్ణి నమ్మడం మనిషికి బలహీన క్షణాలలో మానసిక బలాన్ని, సాంత్వననూ, చిత్తశాంతిని ప్రసాదిస్తుంది. పైగా ఈ విశ్వాసమే బలమయిన ఉపకరణంగా లౌకికంగా, ఆధ్యాత్మికంగానూ ఉపకరించగలదు. ఆధ్యాత్మికమంటే - నాస్తికత్వం కానవసరం లేదు.ఆధ్యాత్మికమంటే బౌద్ధిక దృష్టికి అందని నమ్మకానికి చెందినదనీ పొఱబాటు పడనక్కర లేదు. ఇది రెంటికీ మధ్యసంగతి. పూర్తిగా వ్యక్తిగతమైనది, వ్యవస్థాగతానికి భిన్నమైనదీనూ.

కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో, existential dilemmas ఎందుకొస్తున్నాయి అన్న విషయానికి సంబంధించి ఒక ఆలంబన - ’crutch’ ఎందుకు కావాలి? ఆసియా నుండి యూరోపుకు వెళ్ళడానికి భౌతికంగా విమానం కావాలి. దుఃఖం అన్నది తెలియడానికి ఎక్కడికి వెళ్ళాలి? దుఃఖాన్ని noun గా కాక, verb గా realize అవగలగాలి. అంతే. అంటే గతం, భవిష్యత్తు నశించి, శుద్ధమైన వర్తమానంలో జీవించడం తెలియాలి. అదే అసలైన జ్ఞానం. ఇది సమాచారం కాదు, ఎఱుక మాత్రమే అని మళ్ళీ మరోమారు జిడ్డుకృష్ణమూర్తి ఉవాచ. (మనకు ఆ దృశ్యం లేదు. ఇలా సొల్లు మాట్లాడుకుంటే ఒక ఊరట)

ఇప్పుడు మన కర్తవ్యం ఏమంటే - జ్ఞానం అన్నవెంటనే అది పండితుల గుత్తసొమ్ము అన్న మాటను అంగీకరించకపోవడం. ఒకడెవడైనా జ్ఞానాగ్నిదగ్ధకర్ముణ్ణి, బ్రాహ్మీమయమూర్తిని అంటే అతడికి అనుభవజ్ఞానం ఉందని పొఱబాటు పడనవసరం లేదు. అతనికి గౌరవం ఇయ్యవచ్చు, తప్పులేదు. అయితే అతడు ఆధ్యాత్మికమార్గంలో అనుసరణీయుడు కానవసరం లేదు. అతడు చెప్పేదంతా ’జ్ఞానం’ అని సర్దిపుచ్చుకుని ’మహత్త్వం’ ఆపాదించెయ్యడం పొఱబాటని గుర్తెరగాలి. ఇది ఒక అవసరం.

మనం జ్ఞానం ఏదో తెలుసుకోకపోయినా పర్వాలేదు. ఏది జ్ఞానం కాదో దానిని తెలుసుకుంటే అదే ఏదో ఒక రోజు మనకు మార్గం చూపించవచ్చు. అంతే కాక, ఒక పొరబాటు విషయానికి మహత్వం ఆపాదిస్తే ఆ మహత్వం చేసే కీడు బయటికి కనిపించనిది. పండితులను ఆరాధించడం కూడా అటువంటిదే.

అదీ సంగతి.

మరొకటి ’ఆత్మ’. దీన్ని కూడా మనవాళ్ళు పాజిటివ్ టెర్మ్స్ లో నిర్వచించి కష్టపెడుతున్నారు. సాంఖ్యయోగంలో గీతాకారుడంటాడు - ఆత్మ నాశనము లేనిది, ఆత్మ అన్నదానికి ఉత్పత్తి, వ్యయము, ,వృద్ధి, విపరిణామం, క్షయం ఇలాంటివి లేవు. దీన్ని అగ్ని కాల్చదు, నీరు తాకదు, దీన్నెవరు చీల్చలేరు, అసలు దీన్ని గురించి బుద్ధితో కూడా తెలుసుకోలేరు, దీనికి పుట్టుక లేదు, మరణం లేదు......ఈ తీరుగా కొండవీటి చేంతాడంత లిస్టు లక్షణాలు వెతికి పట్టుకొచ్చి వాటిల్లో ఒక్క లక్షణమూ ఆత్మకు లేదు అని ’ఆత్మ’ కు అనిర్వచనీయమైన నిర్వచనం చెప్పేశారు మనవాళ్ళు. ’ఫలానాది ఏదీ లేదు’ - ఈ వాక్యం ఎంత అసమంజసంగా ఉందో, అలానే ఏదీ లేని, అసలు ’తెలుసు’కోలేని ఆత్మ గురించి ’తెలియ’ జేసే ప్రయత్నం ఎందుకు? (అర్జునుడు మహాభక్తుడు కాబట్టి అనుకోవచ్చా?).

మరొకటి - ’అచ్చేద్యోయమచింత్యోయమవ్యక్తోయం’ అయినది ఆత్మ. అది శరీరం బట్టలు విప్పి కొత్త బట్టలు కట్టుకున్నట్టుగా దేహాన్ని విడిచి మరో దేహాన్ని పొందుతూ ఉంటుంది అన్నారు. అంటే ఒక్కో మనిషికి ఒక్కో ఆత్మ representative గా ఉంటుందా? లేక మానవులందరికీ కలిపి ఒకే ఆత్మ నా? ఆ శ్లోకం ప్రకారం అయితే ఒక్కోమనిషికి ఒక్కో ఆత్మ అనుకోవలసి వస్తున్నది. అంటే ఆత్మల జనాభా - ప్రపంచజనాభాతో సరిసాటి. ఇంకా జంతువులకూ ఆత్మలు ఉంటే వాటి ఆత్మలూ పరిగణనలోకి వస్తాయి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో జీవరాశులు. (ఇన్ని ఆత్మలను maintain చేసి మరణానంతరం appraisals చేయడం సామాన్యమైన పని గాదు.)

లేదు ఒకటే ఆత్మ అంటే - ఆ ఆత్మకు లక్షణాలు లేవు కాబట్టి అదొక pure witness కు ప్రతీక అనుకోవచ్చు.

ఈ వికృత వాఖ్యానం ఎవరినో బాధపెట్టడానికి చేయటం లేదు. క్షమించాలి. అమంగళం ప్రతిహతమగుగాక. ఆధ్యాత్మిక విషయాలలో ’బుద్ధి’ అన్న దాని గురించిన పరిధిని గురించి ప్రతీకాత్మకంగా ఊహించడానికి ఈ తపన. భగవంతుడయినా సరే, అల్పులయిన మన బోటి మానవులకు విషయాలు చెప్పాలంటే - దానిని ఏదో భాషలో చెప్పవలసిందే. భాష - అనగానే దానికున్న పరిధి దానిది. అది జ్ఞానాన్ని పూర్తిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేదు. అందుకనే కొందరు గొప్ప జ్ఞానులు, కవులు కూడా అయిన వారు - భగవంతుడి భాష మౌనం అన్నారు.

సరే మళ్ళీ మొదటికి వస్తే - మహాత్ముడు బుద్ధుడు ఆ witnessing ను అలానే ఉంచేశాడు. ఆయన ’ఆత్మ’ అనే ఒక entity ఉనికిని చెప్పలేదు. ’అనాత్మ’ అంటాడాయన. మరి శాశ్వతంగా ఏదీ ఉండదా? మరి శాశ్వతంగా ఏదీ లేకపోతే ఇక ఆనందాన్ని అనుభవించేది యేది?

ఆనందాన్ని అనుభవించేది, ఆనందానుభవం, ఆనందమూ ఇవేవీ లేదు. నిర్వాణం అంటే - Total annihilation. అదే వ్యక్తమూ, అవ్యక్తమూ అయిన జగత్తు తాలూకు యథాతథ స్థితి. భౌతికంగా అన్ని వస్తువులూ నాశనం కావలసిందే. ఆధ్యాత్మికంగా కూడా ఏదీ మిగలదు. ఆ స్థితిని ’తథాథ’ అని ఆయన సూచించాడు. అష్టావక్రగీత దాదాపుగా బుద్ధబోధ లాగానే ఉంటుంది.

ఇంతకూ నా బాధ యేమంటే - ’ఆత్మ’ ఫలానా అని చెప్పడం వల్ల - మళ్ళీ పండితులు బయలు దేరారు. వివరణలు మొదలయ్యాయి. కొన్ని లౌకిక వ్యవహారాలకు - ఆధ్యాత్మిక రంగంలో ఆలోచించవలసిన ’ఆత్మ’ ను వాడుకున్నారు. ఆ ’ఆత్మ’ను - వర్ణవ్యవస్థ తాలూకు వ్యాఖ్యానాలకు ఉపయోగించి కలుషితం చేశారు. పాండిత్యంతో మభ్యపెట్టారు. పాండిత్యాన్ని ’జ్ఞానం’ గా వ్యాపింపజేశారు. నిజానికి ’ఆత్మ’ - అచింత్యం అన్నా కూడా దానిని ’చింత్యం’ గా మార్చారు.

కనుక మన కర్తవ్యం ఏమిటంటే - తెలియని విషయాల గురించి మనకు తెలియదని ఒప్పుకోవడంతో బాటు - ఎవరైనా తెలియజెప్పబోతే వారి ఉద్దేశ్యం ఏమిటో జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు తెలియనిది తెలియనిది గానే ఉండడంలో తప్పేమీ లేదని గుర్తెరగాలి. ఏ విషయమూ తొందరపడి జ్ఞానంగా ఎంచడం తప్పని మనకు అర్థమవాలి. జ్ఞానం - సమాచారం కాదు. వంద పుస్తకాలు రాశాడనో, అనేక సంగతులు తెలుసుననో ఒక ’పండితుణ్ణి’ - జ్ఞానిగా చెయ్యటం మహాప్రమాదం. పండితుడంటే వందల కొలదీ విషయాలు తెలిసిన వాడు కాదు. అది కెపాసిటీకి చెందిన విషయం. అన్ని విషయాలకు మూలకందమైన దాని స్ఫూర్తిని ఎఱిగినవాడు పండితుడు.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శునిచైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః ||

పండితుడంటే - వినయసంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి, శునకమాంసం తినే వాడిని సమంగా చూడగలిగినవాడు. ఈ స్ఫూర్తి లేకుండా ’జ్ఞానం’ ’గురించి’ పేజీల కొద్దీ వివరణలు చేసిన వాణ్ణి పండితుడుగా గుర్తించటం చాలా పెద్ద పొఱబాటు.

కాబట్టి పండితుడికి, టన్నుల కొద్దీ సమాచారం సేకరించిన లేదా మాట్లాడగలిగిన మేధావికీ పొంతన లేదు.

అదీ సంగతి.

(ఈ టపా నా సొల్లు మాత్రమే. దీనికి ఎవరైనా బాధపడితే - నా పూచీకత్తు లేదు.)