Friday, September 3, 2010

వర్ణాల నుండి ధ్వని దిశగా..

(క్రితం టపా తరువాయి)

వర్ణాలు ముఖావయవాలల్లో పుడతాయనిన్నీ, వాటిని పుట్టించడానికి - ప్రయత్నం అవసరమనిన్నీ, స్థానమూ ప్రయత్నమూ రెండూ ఒకేలా ఉంటే సవర్ణాలనిన్నీ అర్థం చేసుకున్నాం.

అభ్యంతర ప్రయత్నం గురించి మరో సారి చెప్పుకుని, సందులనుండి రహదారికొద్దాం.

ఉదాహరణకు "త" వర్గం తీసుకుందాం. త వర్గం అంటే త,థ,ద,ధ మరియు న - వీటికన్నిటికీకి స్థానం దంతము. నాలుక కొస దంతాల వెనుక భాగాన్ని స్పృశించడమనే అభ్యంతర ప్రయత్నం ద్వారా ఈ వర్ణాలను పుట్టించవచ్చు.ఇవి సవర్ణాలు.

ఇప్పుడో అనాలజీ.

ఓ తబలా ఉందనుకుందాం. ఆ తబలా మధ్య స్థానంలో (వృత్తం గీసి ఉన్నచోట), ఒకే బలం (ప్రయత్నం) తో ఎన్ని సార్లు కొట్టినా ఒకే ధ్వని వినిపిస్తుంది.

సైకిలు బెల్లును ఎన్ని సార్లు మోగించినా ఒకేరకంగానే మోగుతుంది.

నాలుక కొసతో దంతాల వెనుక భాగాన్ని స్పృష్టము అనే అభ్యంతర ప్రయత్నంతో ప్రేరేపించినపుడు ఒకే ధ్వని రావాలి కానీ "త", "థ", "ద", "ధ", "న" అన్న ఐదు భిన్న ధ్వనులెలా వస్తున్నాయి? ఈ ఐదింటికీ స్థానం, అభ్యంతర ప్రయత్నం ఒకటే అయితే, భిన్నంగా ఎందుకు ధ్వనిస్తున్నాయి?

దీనికి కారణం మొదట సైకిలు బెల్లు అనాలజీతోనే సాధిద్దాం. బెల్లు కొట్టేప్పుడు మరోచేతితో బెల్లు పట్టుకున్నారనుకోండి, అప్పుడు "ట్రింగ్", "ట్రింగ్" బదులు "ట్రిక్", "ట్రిక్" మంటుంది కదా. అలాగే బెల్లుపై ఓ పల్చటి తడిగుడ్డ కట్టినప్పుడు, లేదా బాగా ఎదురుగాలి వీస్తున్నప్పుడు, తబలా లోపల గాలి బదులు నీళ్ళతో నింపినపుడు.....ఇలా రకరకాల బాహ్య కారణాల వల్ల ధ్వని భేదం కలుగుతుంది.

ఇక్కడ వర్ణాల పుట్టుకలో ధ్వని భేదానికి కూడా అదే కారణం. దానిని బాహ్యప్రయత్నం అన్నారు పాణిని మహర్షి. (అయితే వర్ణాల విషయంలో తేడా కాస్త సూక్ష్మంగా ఉంటుంది, తబలా ఉదాహరణలోలా కాకుండా)

బాహ్యప్రయత్నం అచ్చులకు  3 రకాలు, వ్యంజనాలకు 8 రకాలని (4 జంటలు) సూత్రీకరించారు. అచ్చులని కాసేపు పక్కనెట్టి, హల్లుల బాహ్యప్రయత్నాలను చూద్దాం.

నివారము (బాహ్య అవయవం తెరుచుకొనుట) - సంవారము (మూసుకొనుట)
శ్వాసము - నాదము
అఘోషము - ఘోషము (గంభీరతను బట్టి)
అల్పప్రాణము - మహాప్రాణము (ప్రాణవాయువు వినిమయం బట్టి)

ఈ నాలుగు జంటల్లో ఒక్కో జంటనుండి ఒక్కో అంశము - అనగా ఓ వర్ణానికి నాలుగు బాహ్యప్రయత్నాలు ఉంటాయి. అంటే

"త" కు నివారము, శ్వాసము, అఘోషము, అల్పప్రాణము - అన్న నాలుగు బాహ్యప్రయత్నాలు, స్పృష్టము అనే అభ్యంతర ప్రయత్నము, దంతము అనే స్థానం వద్ద జరుగడం వల్ల సదరు వర్ణం అలా ధ్వనిస్తోంది.

ఇంకా వివరంగా చెప్పాలంటే -

దంతము వెనుక నాలుక కొస తాకుట వల్లనూ, మరియూ, ఆ తాకు సమయమున ముఖభాగము విడివడి యుండుటయు, శ్వాసమును అధికముగ ప్రయోగించుటచే, గంభీరధ్వని వెలువడకుండుటయు, ప్రాణవాయువు వినిమయము తక్కువగ జరుగుటయు అను చర్యలు ఒకేకాలమున సంభవించుట వలన "త" వర్ణము పుట్టి అవ్విధమున ధ్వనించుచున్నది.

త వర్గంలో మిగిలిన వర్ణాలకు చూద్దామా?

"థ" - సంవారము, నాదము, ఘోషము, మహాప్రాణము
"ద" - సం, నా, ఘో, అ.ప్రా.
"ధ" - సం, నా, ఘో, మ.ప్రా,
"న" - సం, నా, ఘో, అ.ప్రా..

ఇదండీ వర్ణాల నుండి ధ్వని వైపుకి వెళ్ళే దిశ.

బాహ్యప్రయత్నం తెలుసుకోవడం ఎందుకంటే, వీటి ద్వారా, కొన్ని సంధులకు సూత్రాలు ప్రతిపాదిస్తున్నారు పాణిని. (వాటిని వివరించేంత సీను నాకు లేదు.)

చివరగా అచ్చులకు సంబంధించిన బాహ్య ప్రయత్నాల పేర్లు తెలుసుకుందాం. అవి - ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. - వీటిని గురుముఖతః నేర్వాలి. వేరే మార్గం లేదు.

వేల సంవత్సరాలకు పూర్వం - ఇంత శాస్త్రీయమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడి, వాటి మూలకంగా భాషాశాస్త్రం బ్రహ్మాండమైన రీతిలో అభివృద్ధి చెందటం అనేది ప్రపంచభాషలలో సంస్కృతభాషలో మాత్రమే జరిగి ఉంటుంది.

అందుకేగా అన్నారు, "జనని సంస్కృతంబు సకలభాషలకును" అని.

(ఈ టపా చదివిన తర్వాత ఆసక్తి కలిగితే పొద్దులో వ్యాసం రెండవభాగం కూడా చదవగలరు.)

Disclaimer: ఈ టపా  ఉద్దేశ్యం ఆసక్తి కలిగించటం, నాకు తెలిసిన పరిధిలో విషయాలను పంచుకోవడం మాత్రమే. ఈ విషయాలపై పూర్తిస్థాయి అవగాహన నాకూ లేదు. ఇంకా ఎక్కువ వివరాలకు లఘుసిద్ధాంతకౌముది చూడగలరు.